సంపాదకులు:
డా॥ కొండపల్లి నీహారిణి
mayuukhathemagazine@gmail.com
సలహా మండలి:
డా॥ కె.వి . రమణ, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు.
కొండపల్లి వేణుగోపాల్ రావు , రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్, నీటిపారుదల శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
డా॥ వెలుదండ నిత్యానందరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం.
డా॥ సంగనభట్ల నర్సయ్య, విశ్రాంత ప్రధానాచార్యులు, శ్రీ లక్ష్మీ నరసింహ
సంస్కృతాంధ్ర కళాశాల, ధర్మపురి,జగిత్యాల.
గురిజాల రామశేషయ్య, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్,తెలుగు, హైదరాబాద్ -44
భాష – సభ్యత
( 2024 మయూఖ పత్రిక సెప్టెంబర్ సంపాదకీయం)
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, సంపాదకులు
ఈ భూమి మీద ఆవరించి ఉన్న అనంతమైన శక్తి ని అందిపుచ్చుకున్న ఏకైక జీవి మనిషి. సర్వ ప్రాణి కోటిలో ఉత్కృష్టమైన జీవి మనిషి అని పేరు వచ్చిన కారణం ఏమిటి అని యోచిస్తే, భావవ్యక్తీకరణ కు భాషను సాధనం చేసుకున్నందుకే, బుద్ధి ని వికసింపచేసుకొని విజ్ఞానానికి మళ్ళించినందుకే, మనసు మాట విని చెప్పగలిగే యుక్తి ఉన్నందుకే అంటూ ఇలా కొన్ని విశేషాలు విశేషణాలు ఉదాహరించవచ్చు.ఈ గొప్పతనాన్ని మరింత గొప్ప చేసుకోవాలి. దీనికి మంచి చెడు అనేవి రెండు పార్శ్వాలు గా ఉంటాయి. సరళసౌమ్యంగా మాట్లాడే మనుషులు ఉంటారు.దుర్భాషలాడేవాళ్ళూ ఉంటారు. మాట కు భాష ప్రధానమైనది కాబట్టి భాష రావాలి. భాషలెన్నో ఉన్నాయి. ఎవరి మాతృభాష వాళ్ళకుంటుంది. ఎవరికి నచ్చిన భాష వాళ్ళకుంటుంది.ప్రభావితం చేసే భాష , లేదు… రుద్దబడే భాష లేదూ…మనసుపడే భాష , ఇవన్నీ భాష గొప్పతనాన్ని చూపేవే!
మనసు నిండా మాలిన్యం ఉన్న వాళ్ళ మాట ఎప్పుడూ వంకరగానే ఉంటుంది. ఈర్ష్య, వ్యతిరిక్తత, వ్యంగ్యం వంటి భావాలు వాక్యాలు వాక్యాలు గా వాళ్ళ నోటివెంట వస్తూనే ఉంటాయి.మాట రాలేని పక్షంలో నోటితో నవ్వుతూ నుదిటి తో వెక్కిరిస్తారు.
ప్రస్తుతం ఈ విషయంలో తెలుగు భాష ప్రయోగం చేసే క్రమాన్ని చర్చించుకోవడం లో ద్రావిడ కుటుంబ భాష నేనా కాదా అనే, ద్రావిడ భాష 500 సంవత్సరాల క్రితం భాషేనా కాదా అనే , అది సింధులోయ నాగరికత ప్రాంతంలో మాట్లాడిన భాష కాదా అనో ఈ చర్చ కాదు.
ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలేవి? ఏది ముందు ఏది వెనక,? ఓల్గా నుండి గంగ వరకు నడుచుకుంటూ వచ్చిన భాషనా? గంగనుండి ఓల్గాకు నడుచుకుంటూ వెళ్లిన భాషనా అనే చర్చకాదు. కొన్ని నిరూపించబడతాయి కొన్ని నిరూపించబడవు. సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాలు ఉండవు. తాళపత్ర గ్రంథాలలో ఉన్నవే ముఖ్యమైన వనో , శిలా శాసనాల మీద ఉన్న భాషనే ముఖ్యమైన ది అని కాదు.
లేదు ….పల్లె ప్రాంతాల్లో ప్రజల నాలుక పైన మాట్యమాడే భాష ప్రధానం అనో కాదు! భాషా శాస్త్రజ్ఞులు చెప్పే లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ విషయ చర్చ కూడా కాదు.
ఎవరి భాష అయినా వాళ్లకు ప్రీతికరమైన భాష నే!
అయితే ఇతరులకు నచ్చేలా మన భాష ను మనం ప్రయోగిస్తున్నామా లేదా అనే విషయాన్ని చర్చించుకోవడం.
మంచి మాటలు మాట్లాడడం రాకుంటే చెడు మాట్లాడకుండా ఉంటే చాలు మేలు చేసిన వాళ్ళు అవుతారు.
పెద్దలు ఏది మాట్లాడితే పిల్లలు అదే నేర్చుకుంటారు అంటే చాలామంది ఒప్పుకోరు కానీ ఇది సత్యం. ఏ పనులు చేస్తున్న ఎక్కడ ఉన్నా పిల్లలు పెద్దవాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా చక్కని సంభాషణ చేయడం అలవర్చుకోవాలి.
బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఒక ఆఫీసర్లు, దేశ నాయకులు, సంఘ నాయకులు ఎలాంటి పదాలను ప్రయోగిస్తుంటే ఉచ్ఛరిస్తుంటే అవే మాటలను సబార్డినేట్స్, వాళ్ళ కింద స్థాయి వాళ్ళు అలవర్చుకుంటారు.
నలుగురికి పని చెబుతున్నాము అంటే నాలుగు ప్రపంచాలు మనని గమనిస్తున్నట్టే లెఖ్ఖ!
రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే నడుచుకుంటారు అంటూ” యధా రాజా తథా ప్రజా ” అని చెప్పిన మన పూర్వీకుల మాటను స్మరించుకుంటే, ఇంట్లో పెద్దవాళ్లు ఏది మాట్లాడితే పిల్లలు వాటినే అనుసరిస్తారు. అసలే చుట్టుపక్కల సమాజం చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనికి తోడు ఇంట్లో వాళ్ళు కూడా దుర్భాషలాడము, చెడ్డ మాటలను ఉపయోగించడం చేస్తూ ఉంటే ఆ ఇళ్లల్లో పెరిగే పిల్లలు ఏం నేర్చుకుంటారు?
రాజకీయ నాయకులు ముఖ్యంగా సభ వేదికలపై ఉపయోగించే పదజాలం అసభ్యకరంగా ఉన్నప్పుడు సభ్య సమాజం ఏమి స్పందించకుండా ఉండడం విచారకరం.వ్యక్తిగతంగా
ఏవైనా కోపాలుంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కానీ నలుగురి ముందు మాట్లాడే హక్కు వాళ్లకు ఉండకూడదు .ఈ నియంత్రణ అనేది పాలనలో తప్పకుండా రావాల్సి ఉంది. ఒకళ్ళు మాట్లాడారు కదా అని ఇంకొకళ్ళు మాట్లాడడం ,వాళ్ళతో పోలుస్తూ చెప్పడం వాళ్ళు చెప్పిందే మేము చెబుతున్నా అనే ఉదాహరిస్తూ చెప్పడం ఒక అలవాటుగా మారిన కాలంలో మనం ఉన్నాం .ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రసంగాలలో గమనిస్తున్నాం. ఇది ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయవలసిందే! దీనికి దేశంలోనే అత్యున్నత స్థానమైన న్యాయస్థానం ముందుకు రావాలి. అసభ్య పదాలను ఉపన్యాసాలలో ఉపయోగిస్తూ మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకొని చూపించాలి. అప్పుడే తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడరు .లేకుంటే భావితరాలకు ఏ సమాజాన్ని అందించిన వాళ్ళం అవుతాం?
ఒక ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన క్రింద పనిచేసే ఇతర హోదాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడతారు, మర్యాదపూర్వకమైనటువంటి భాషతో భావంతో మెలుగుతూ తాము తీసుకున్న నిర్ణయాలు అందరికీ అందజేస్తారు. నాయకులైన అంతే.ఉదాహరణకు వివిధ రకాల సంఘాలు ఉంటాయి ఆ సంఘాలకు నాయకులు ఉంటారు వాళ్ళ మనసులో ఎలాంటి కోపతాపాలున్నా కూడా సంఘానికి సంబంధించిన మీటింగ్ సభను పెట్టుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. పిల్లలు తల్లి తండ్రి తమకు నచ్చని అంశాలు కనిపించిన పిల్లలతో సభ్యత ఉట్టిపడే స్వరంతోనే భాషతోనే మాట్లాడుతారు. ఇది ఎందుకు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలని తాము ఆశించినటువంటి సంస్కరణలే కాని, అభివృద్ధి పథకాలే కానీ మంచి విషయాలే కానీ చెప్పేందుకు ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతిలోనే మాట్లాడుతారు , వాళ్లకు చేరవేయగలుగుతారు,అప్పుడే అనుకున్నది సాధిస్తారు. కుటుంబంలో కాకుండా కార్యాలయాలలోనూ లేదా సంస్థ లాభనష్టాల విషయం చర్చించేప్పుడైనా ఒద్దికైనా మాటలతోనే తమ నిర్ణయాలను వెలిగిచ్చుతారు. అంతేకానీ కోపం వచ్చిందని ఇష్టమున్నట్టు మాట్లాడితే తమ అనుకున్నవి సాధించలేరు.
రాజకీయ నాయకుల వరకు వచ్చేసరికి ఇది క్రింద మీద అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రత్యర్థులను తిడితే కానీ దుర్భాషలాడితే కానీ ఒక హల్ చల్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది రాజకీయాలనేవి ఈనాటివి కావు వందల సంవత్సరాలుగా నడుస్తున్నాయి ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇది గర్హనీయం. ఈ పరిస్థితులు మారాలి.
ప్రత్యేకంగా మన తెలుగు భాషకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇతర భాషల కన్నా మిన్న అయిన భాష మనది. సరళంగా సౌమ్యంగా మాట్లాడడం చేతకాకుంటే శిక్షణ తీసుకోవాలి కోపోద్రి క్తులను చేసేలా పదజాలం
వాడితో మాట్లాడితే ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది. ఉపన్యాసాలలో చెడు
ఉంటే కలిగే నష్టం ఎవరికి ? కింది వర్గాల వారికి ! మా సారు ఇలాగే మాట్లాడాడు కాబట్టి మేము ఇలాగే మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎవరికి మంచిది కాదు. ఈ పద్ధతి పోగొట్టాలంటే,రాజకీయ పాఠశాలలను ఏర్పాటు చేసి శిక్షణనిచ్చి రాజకీయాల్లోకి వచ్చేలా నిబంధనలను తీసుకువస్తే గాని మార్పు వస్తుంది. భాష సభ్యత ను ఇస్తుంది. భాష భవితను ఇస్తుంది. ఇది గ్రహించి మెసలుకోవడం ఓ బాధ్యత!
__***__
సూచనలు:
- • మయూఖ అంతర్జాల పత్రికకు తమ రచనలు పంపించేవారు యూనికోడ్ (UNICODE) లో టైప్ చేసి mayuukhathemagazine@gmail.com కు మాత్రమే పంపించగలరు అని మనవి.
- • రచయితలు తమ ఫోటోను, విద్య, ఉద్యోగ వివరాలను, చిరునామా, ఫోన్ నెంబర్ తో సహా పంపగలరు.
- •తమ తమ రచనలకు హామీపత్రం జత చేయగలరు. మా మ్యాగజైన్ లో వచ్చిన తరువాతనే బ్లాగ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ మా మ్యాగజైన్ కి రెఫెర్ చేస్తూ పెట్టగలరు.
- •ఎటు వంటి వివాదాస్పదమైన విషయాలకు చోటులేదు.
- •ఎవరిని కించపరిచే విధంగా వ్రాయకూడదు.
- •సభ్యతా సంస్కారాలు గల రచనలు మాత్రమే పంపించగలరు.
- •రచనలలోని విషయాలకు, భావాలకు రచయిత(త్రులు)లే బాధ్యులు. సంపాదకుల బాధ్యత కాదు.
- •ప్రచురణ విషయములో సంపాదకులదే తుది నిర్ణయం.