నిర్వహణ:
– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి
ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు
పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.
ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి
ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.
ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.
మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .
వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్ధమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.
పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.
కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.
ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .
కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .
తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.
ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471
సిహెచ్. లక్ష్మణచక్రవర్తి: పరిచయం
డా|| సిహెచ్. లక్ష్మణచక్రవర్తి గారు తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని సాహిత్య విమర్శక వ్యాస రచయితలలో వీరికి కాలక్రమానుశీలన ప్రక్రియా విమర్శకులుగా మంచి స్థానమున్నది. ఇందుకు వీరు తెలంగాణ నుండి తెలుగు సాహిత్య రంగంలో మహావిమర్శకులుగా లబ్ధప్రతిష్ఠులైన కోవెల సంపత్కుమార, కోవెల సుప్రసన్న గారల విమర్శన మార్గదర్శనంలో చేసిన కృషి ఎంతో దోహదకారి యైనదని చెప్పవచ్చును.
లక్ష్మణ చక్రవర్తి గారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉద్యోగంలో ప్రవేశించే కంటే ముందు హైదరాబాదు దోమలగూడలోని సుప్రసిద్ధమైన ఏ.వి.కళాశాలలో 14 సంవత్సరాల కాలం డిగ్రీ, పి.జి. తరగతులకు తెలుగు సాహిత్య పాఠాలు బోధించినారు. ఆ కాలంలో వీరు ఎంతో శ్రమకోర్చి “ఆధునిక సాహిత్య విమర్శరీతులు” (2005) గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ఈ గ్రంథం విశ్వవిద్యాలయ స్థాయి విమర్శ గ్రంథాలలో మంచి సంప్రదింపు గ్రంథంగా పేరుపొందింది. ఇదే వరుసలో “ఆధునిక సాహిత్య విమర్శకులు – ప్రస్థానాలు, గ్రంథానికి (2008) కూడా సంపాదకులుగా వ్యవహరించారు. ఈ గమనంలో ప్రత్యేకంగా సంపాదకవర్గంలోని సభ్యులుగా చెప్పుకోదగిన కృషి చేశారు. “తెలుగు సాహిత్య విమర్శ దర్శనం” (2016) విజ్ఞాన సర్వస్వ గ్రంథం తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రచురణగా వెలువడింది.
ఇక వ్యక్తిగతంగా లక్ష్మణరేఖ (2009), కవిత్వానుసంధానం (2012), ప్రతిబింబం (2014), నవ్య సంప్రదాయ సాహిత్యం (2012) వీరి ప్రత్యేక విమర్శ వ్యాసాల సంపుటాలు. తన గురువులు కోవెల సంపత్కుమారాచార్య (2016) గురించి మంచి మోనోగ్రాఫ్ ను రచించారు. ఉన్నత విద్యలో భాగంగా ఎం.ఫిల్ పట్టా కొరకు “పరమ యోగి విలాసం” (2008) పై పిహెచ్.డి. పట్టా కోసం “ప్రాచీన తెలుగు సంకలనాలు” (2018) పై పరిశోధన చేసినారు.
తెలంగాణలోని ప్రసిద్ధ వైష్ణవ కుటుంబానికి చెందిన లక్ష్మణ చక్రవర్తి చిన్నతనంలోనే సంప్రదాయ విద్యలైన ద్రావిడ ఆగమాలను మద్రాలో చదువుకున్నారు. తన తండ్రిగారి వద్ద పాంచరాత్రాగమం అభ్యసించారు. తమిళంలో విశేష ప్రవేశం ఉన్న డా॥ లక్ష్మణ చక్రవర్తి గారు కేంద్ర సాహిత్య అకాడమీ వారి కోరికపై కావలికోట పేరుతో తమిళ నవల కావల్ కోట్టెను తెలుగులోనికి అనువదించారు.
తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య విమర్శ పురస్కారం (2010), కొలకలూరి భాగీరథమ్మ పంచ సాహిత్య విమర్శ పురస్కారం, వరంగల్ “సహృదయ” సాహిత్య విమర్శ పురస్కారం స్వీకరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా 2019 ఏప్రిల్ లో మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ (2016)లో అందుకున్నారు.
శీర్షికను అనుసరించి నిర్దిష్ట క్రమంలో సోపపత్తిక అంశాలతో సాహిత్య వ్యాసాన్ని రూపొందించటంలో లక్ష్మణ చక్రవర్తి శ్రద్ధ మెచ్చుకోదగ్గది. వీరి వ్యాస సారాంశ క్రోడీకరణం ఎన్నదగింది.
తెలంగాణ ప్రబంధాలు : పరిచయ మాలికలో భాగంగా నేను సంకల్పించిన తెలంగాణ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలలో “యయాతి చరిత్రము” అచ్చ తెలుగు ప్రబంధాలలో తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చతెలుగు కావ్యము. తెలుగు భాష నన్నయ కాలం నుండి సంస్కృతంతో జతపడి నడుస్తూ మహాకవిత్వ శిల్పాన్ని కైవసం చేసుకున్నా అచ్చ తెలుగుగా అచ్చతెలుగు పలుకుబడి బాసగా తన ఉనికిని ఏమాత్రము కోల్పోలేదు. ప్రొథికి సంస్కృతం-పలుకు నుడికారమునకు తెలుగుదనం తెలుగు భాషకు మెప్పుకొప్పుల నయగారం.
“ప్రబంధం” తెలుగు సాహిత్య ప్రక్రియలలో సుప్రతిష్ఠమైన ఒక ప్రత్యేక ప్రక్రియ. కవితా రామణీయకమునకు వర్ణన, సౌందర్యమునకు పేరెన్నిక పొందిన రమణీయ కమనీయ పద్య శిల్ప రచన తెలుగు ప్రబంధము.
అచ్చతెలుగు భాషలో సైతం వర్ణనా వైదగ్యము పాత్ర చిత్రణ, రస సమున్మీలనాదులెట్లు సమగ్రముగా పరిపోషించబడినవో “యయాతి చరిత్రము”న పొన్నిగంటి తెలగన్న నిరూపించినారు. కనుకనే అచ్చతెలుగు కావ్య ప్రబంధ ప్రక్రియ తదనంతర కాలములో బలముగా నిలదొక్కుకున్నది.
కూచిమంచి తిమ్మకవి వంటి ప్రసిద్ధ కవులు అందిపుచ్చుకున్న ప్రక్రియకు ఆద్యుడైన పొన్నిగంటి తెలుగన్న ధన్యుడు.
నేను కోరిన వెంటనే వ్యాసాన్ని రచించి అందించిన డా|| సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి గారి సహృదయతకు ముగ్ధుణ్ణయ్యాను. తొలి ప్రబంధమేది చర్చను “పాలపిట్ట – జూన్”లో సుదీర్ఘవ్యాసంగా ప్రచురించిన లక్ష్మణ చక్రవర్తి విమర్శన పద్ధతి సమకాలీన పండితుల ఆదరాన్ని పొందిన విషయం సాహిత్యవేత్తలకు విదితమే. డా|| లక్ష్మణ చక్రవర్తికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
– గురిజాల రామశేషయ్య
అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)
అచ్చ తెలుగు ప్రబంధంయయాతి చరిత్ర
తెలుగు సాహిత్యంలో ప్రాచీన వాఙ్మయం అంతా పరిణామ దృష్టిని ప్రయోగాత్మక దృష్టిని కలిగి ఉంది. ఇది ప్రాచీన సాహిత్యాన్ని గమనించినప్పుడు తెలుస్తుంది . తెలంగాణలో ఈ దృష్టి ఎక్కువ ఉన్నట్లు ఇక్కడ వచ్చిన కావ్య ప్రబంధాలు నిరూపించాయి. ఆ క్రమంలో ప్రబంధ వాఙ్మయంలో అచ్చతెలుగు ప్రయోగాన్ని చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు పొన్నగంటి తెలగన. అటువంటి యయాతి చరిత్రను పరిచయం చేయడం ఈ వ్యాస లక్ష్యం.
కవి విశేషాలు.
పొన్నగంటి తెలగన్న యయాతి చరిత్ర లో అక్బర్ బాద్షా, మల్కీబ్రాహీం శ్రీరంగ రాయలను పేర్కొన్నాడు. వీళ్లంతా క్రీ.శ. 1550 మొదలు క్రీ.శ. 1605 మధ్య పరిపాలనను చేసినవారు అందువల్ల యయాతి చరిత్ర ప్రబంధం 1574- 1581 మధ్య రచించినట్లు సాహిత్య చరిత్రకారులు నిర్ణయించారు. పొన్నగంటి తెలగన మిగతా కవుల కంటే ఎక్కువగా అవతారికలో కృతిపతి వంశ వర్ణన చేశాడు కానీ తన కుల, గోత్రాల విషయాలను చెప్పుకోలేదు. ఆశ్వాసాంత గద్యలో మాత్రం ‘ శ్రీ మదనగోపాల మంత్ర వర ప్రసాద లబ్ధ సారస్వత సుకవి జనహిత వచోవైభవ భావనా మాత్య తనూభవ సౌజన్య వినయ ధుర్య పొనికంటి వంశ్య తెలగనార్య ప్రణీతంబైన ‘ అని చెప్పుకున్న వాక్యాలను బట్టి బ్రాహ్మణులలో నియోగి వర్గానికి అందులోనూ ఆర్వేల నియోగులకు సంబంధించిన వాడని, వైష్ణవ మతానుయాయి అని పరిశోధకులు భావిస్తున్నారు.
క్రీ.శ. 1574- 81లో మధ్య యయాతి చరిత్ర రచించిన తెలగన జీవించిన కాలాన్ని ఇదమిత్థంగా సాహిత్య చరిత్రకారులు స్పష్టం చేయలేదు. కానీ క్రీ.శ. 1550- 1600 మధ్య జీవించాడని వివరించారు. ఆయన ఎంతకాలం కచ్చితంగా జీవించి ఉన్నాడన్న అంశం స్పష్టంగా నిర్ణయించినట్లు కనిపించదు. పరిశోధకులు వైష్ణవ మత అనుయాయిగా ఆయనను చెప్పటానికి మరింగంటి అప్పన్న తో తెలగనకు ఉన్న సంబంధం కారణంగా భావించవచ్చు.
ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1550 – 1580 కు మంత్రిగా ఉన్న అమీనుఖాను పొట్లచెరువు( నేటి పటాన్ చెరువు) రాజధానిగా అనేక మంచి పనులు చేసాడు. కృతిపతి అయిన అమీనుఖాను వంశం కుతుబ్ షాహీ వంశస్థులను మూడు తరాల నుండి కొలుస్తున్నది. ఆయన పొట్లచెరువును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు పటాన్ చెరువు సమీపంలో అమీన్ పుర అన్న ప్రాంతం ఉంది. అమీనుఖానుకు అంకితం ఇవ్వడం వల్ల తెలగన ఈ ప్రాంతపు వాడేనని రూఢి అవుతున్నది. యయాతి చరిత్ర లో ‘కూర్మిబ్రోవసత్యచింతామణి పొట్ల చెరువునందు’(1-16 ) అని పేర్కొనడం కూడా కారణమే.
తెలుగు సాహిత్యంలో 15వ శతాబ్దంలోని తెలుగు కవులురచనారీతిలో కొత్త పద్ధతిని అనుసరించారు. తెలంగాణేతర ప్రాంత కవులను పక్కకు పెడితే కొంచెం ప్రయోగ దృష్టి ఈ ప్రాంతంలోనూ ఉన్నదని భావించేందుకు యయాతి చరిత్ర వంటి రచనలు ఉదాహరణలుగా నిలుస్తాయి. “ఇబ్రహీం కులీ కుతుబ్ షా విజయనగరంలో తలదాచుకున్నప్పుడు తెలుగు రాజుల ఆదరాన్ని, తెలుగు వారి వంటకాలను చవిచూసిన వాడు. తెలుగు కవితా గాన మాధుర్యాన్ని గ్రోలిన వాడు. అంకితాల సంప్రదాయాన్ని తెలుసుకున్నవాడు. సంస్కృత పదబంధాల మిశ్రాంధ్రం కొంత కటువుగా తోచి తేటతెనుగున కవిత చెప్తే ఎలా ఉంటుందో వినాలని ఉవ్విళ్ళూరినవాడు” అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. అందుకే అచ్చ తెలుగు కావ్యాలు రచనకు ప్రోత్సాహం ఇచ్చి ఉంటాడు తెలుగుదేశపు సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్షా ప్రోత్సహించారు. అయితే ఇది భాషా చైతన్య దృష్టితో జరిగిందా లేక ప్రయోగ చైతన్యంతో జరిగిందా అన్నది పరిశీలనాంశమే.
ఛంద: పరంగా ద్విపద కావ్యం, భాషాపరంగా అచ్చతెలుగు కావ్యం కావ్య ప్రక్రియ భేదం కిందికి వస్తాయి. భాష పరంగా తెలుగు సాహిత్యంలో తెలగనకు ముందే పోతన వంటి వారు సంస్కృతము తెలుగు రెండూ ఇష్టమైన వారికి అనుకూలంగా రచన చేస్తున్నారు. భాష పరంగా అటు తద్భవము ఇటు దేశ్యము మధ్య నలుగుతూ మిశ్రాంధ్ర భాషలలో కావ్యాలను రచిస్తున్నారు. పద్యం అభివ్యక్తిలో ప్రౌఢతను పొందింది. అయితే భాషాభిమాన దృష్టితో కాక ప్రయోగ దృష్టితోనే అచ్చ తెలుగు కావ్యాలు వెలువడ్డాయని చెప్పవచ్చు. కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నాలని పురాణ కథలను పుట్టురత్నాలని, పుట్టు రత్నాలను కల్పనతో సానబెట్టినవి జాతి రత్నాలని కథా వస్తువు విషయంలో రామరాజభూషణుడు చెప్పిన మాట. కళాపూర్ణోదయం, రాఘవపాండవీయం, ప్రభావతీ ప్రద్యుమ్నము, చరిగొండ ధర్మన్న చిత్ర భారతం, నూతన కవి సూరన ధనాభిరామము వంటివన్నీ ప్రయోగదృష్టితో వెలువడ్డాయి. రాజుల పోషణలో మిగతా కవుల కంటే భిన్నంగా వ్రాయాలన్న పట్టుదల ప్రయోగ బాహుళ్యానికి కారణం అయింది. అచ్చ తెలుగులో అటువంటి ప్రయోగం చేయాలనుకోవటం లో స్వీయ ప్రతిభా పాండిత్య ప్రదర్శన కీర్తి కాంక్ష కారణాలుగా అచ్చ తెలుగు కావ్యాల పై పరిశోధన చేసిన కె.వి. సుందరా చార్యులు భావిస్తున్నారు. అయితే మరింగంటి అప్పన ప్రోత్సాహం కూడా అచ్చతెలుగు కావ్యం ప్రయోగానికి కారణం అయింది.
మున్నెవ్వరు నొడువని యీ
తెన్నిడి కడుమీఱి యచ్చతెనుగుంగబ్బం
బెన్నిక మీఱగ జెప్పిన
నిన్నుం బొగడంగ గలదె నెలతాల్పయినన్ (1- 11).
అచ్చతెనుంగుబద్దె మొక్కటైనను గబ్బములోననుండినన్
హెచ్చనియాడుచుండురదియెన్నుచునేర్పున బొత్తమెల్ల ని
ట్లచ్చతెనుంగునన్నుడువనందుల చందమెఱుంగు వారునిన్
మెచ్చరొ యబ్బురంబనరొ మేలనరో కొనియాడరో నినున్ (1- 12). ఒక అచ్చతెలుగు పద్యం కావ్యం లో ఉన్నా మెచ్చుకుంటారు. గొప్ప అంటూ ఉంటారు సాహిత్య సౌందర్యం తెలిసిన వారు ఆశ్చర్య పడతారని మరింగంటి అప్పన చెప్పటం ఈ కావ్య ప్రక్రియ గౌరవాన్ని చెప్పటంతోబాటు, ప్రక్రియ ప్రయోగాని కారణమయ్యింది.
ఇక్కడ అచ్చతెనుంగుబద్దె మొక్కటైనను గబ్బములోననుండినన్ హెచ్చనియాడుచుండడం అన్నది
జాగ్రత్తగా గమనించవలసిన వాక్యం. సంస్కృతం ప్రౌఢ నిర్మిత పద్యంతో, శ్లేష, ద్వర్థి ప్రబంధాలలో అక్కడక్కడ దేశ్య పదాలు కనిపించడాన్ని సహృదయులు ఆదరిస్తున్నారని తెలుస్తుంది. ఈ ఆదరణకు తగిన ఉదాహరణలు స్పష్టంగా ఏమీ దొరకవు. కానీ ప్రౌఢ కావ్యాలలో అచ్చతెలుగు పద ప్రయోగాలు పద్యాలు కనిపిస్తాయి.
అచ్చతెలుగు ప్రబంధాన్ని రచించడానికి నాటి కవుల ప్రయోగ దృష్టి, ప్రత్యేకత నిలుపుకోవాలన్న కోరిక కారణాలుగా కనిపిస్తే యయాతి చరిత్ర నే ఎన్నుకొవడానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచించవలసిన అవసరం ఉన్నది. శ్రీనాథుడు నలదమయంతుల కథ ను శృంగారనైషధం గా, పిల్లలమర్రి పినవీరన శకుంతల కథను శృంగార శాకుంతలంగా అప్పటికే రచించి వాటికి కావ్య ప్రబంధ రూపాలను ఆ కథలకు కల్పించారు. తపతి సంవరణుల కథను అద్దంకి గంగాధరుడు అందించాడు శకుంతల, దమయంతి, తపతి కథలలో ఒక ఇల్లాలికథే ఉంది. శకుంతల దమయంతులు తన పాతివ్రత్య ధర్మం ద్వారా తమ వివాహం చేసుకున్న భర్తలను పొందారు. సంవరణుడు తపస్సు చేసి సూర్యపుత్రిక తపతిని పొందాడు. యయాతి చరిత్రను కావ్యంగానో, ప్రబంధంగానో మలచిన రచన యయాతి చరిత్ర పూర్వం ఒక్కటి కూడా కనిపించదు (ఎక్కడైనా ఉన్నా అది సాహిత్య చరిత్రలో ప్రసిద్ధంగా లేదు). తెలుగు ప్రబంధాలన్నీ గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రధానంగా చర్చించేవి. ప్రతిపాదించేవి. ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురితో సంబంధం కలిగి ఉన్నా, వివాహం చేసుకుని ఉన్నా ఇద్దరి పరస్పర అనురాగం వలన కలిగిన సంతానం వల్లనే వారు (అంటే ఆయా పాత్రలు) చతుర్విధ పురుషార్ధాలు పొందినట్లు గమనించవచ్చు. యయాతి కథలో ఈ సూత్రం ఇమిడి ఉంది. బహుశా తాను ప్రబంధంగా మలచదలచిన ఈ అంశం ఈ కథలో పొన్నగంటి తెలగన గుర్తించి దీనిని ఎన్నుకున్నాడని భావించవచ్చు.
గార్హస్థ్య ధర్మం సతీ పతుల. అద్వైత ప్రణయ సిద్ధికి ఫలరూపం కావాలి. కానీ అహంకారాల అనంత సంఘర్షణలకు రణరంగం కారాదు. ఒకరి లో ఒకరు కరిగి జాలువారుతున్నట్టు ఉండాలి కానీ ఒకరికై ఒకరు జాగరణ చేస్తున్నట్లు ఉండకూడదు. దేవయాని గార్హస్థ్య ధర్మం ఉండకూడని విధంగా ఉంది. అందువల్ల కొడుకులు పుట్టినా ధర్మం క్రమంగా కొడిగట్టడం మొదలయ్యింది. యయాతికి ఆత్మ తృప్తి లేదు. సంసారం వల్ల ఏ అమృతత్వాన్ని కోరుకున్నాడో అది అతనికి లభించలేదు. అతని గార్హస్థ్య ధర్మంలో దేవయాని బడబాగ్నిలా ప్రజ్వలించింది. క్రమంగా వృద్ధి చెందుతున్న మానసిక గార్హస్థ్య ధర్మం యయాతి లో పునరుజ్జీవింప చేసిన శక్తి శర్మిష్ఠ . (ఆంధ్ర మహాభారతం అమృతత్వ సాధనం 141.)
బహుభార్యత్వం ఉన్న నాటి రాజులను దృష్టిలో పెట్టుకొని సమాజం, వ్యవస్థా ధర్మాలు అంగీకరిస్తున్నా గార్హస్థ్య ధర్మ ప్రాధాన్యాన్ని చెప్పడానికి నల దమయంతులు, శకుంతలా దుష్యంతుల కథలు అనుకూలమైనవే అయినా అవి అప్పటికే వ్రాయబడినవి. అప్పటికి రాయబడని ఉపాఖ్యానాన్ని ఎన్నుకోవాలన్న లక్ష్యంతో యయాతి చరిత్రను అచ్చతెలుగు ప్రబంధంగా మలచడానికి పొన్నగంటి తెలగన ప్రయత్నం చేశాడనిపిస్తుంది. మహాభారతంలోని యయాతి కథకు ధార్మికత ధర్మం ప్రధానమైన అంశాలు. తెలగన ఎన్నుకున్న కథకు శృంగార రసాత్మకమైన కల్పన ప్రధానం. అందుకే దేవయాని శర్మిష్ఠలు యయాతిని పెండ్లి చేసుకునేంత వరకే కథను చెప్పి ముగించాడు. శర్మిష్ఠ కు సంతానం కలగటం తో కావ్యాన్ని మంగళాంతంగా ముగించాడు. నాటి కాలంలోని శృంగారరస ప్రాధాన్యం ఈ ముగింపుకు కారణమని చెప్పవచ్చు అదిగాక తనకంటే ముందు రచించబడిన ప్రబంధాలు ఇటువంటి నిర్ణయానికి కారణమై ఉంటాయి.
కథా సంగ్రహం.
ప్రథమాశ్వాసం లో ప్రతిష్ఠానపురం వర్ణన , యయాతి వంశావతరణ, రాజ్యపాలన, ఆటవికులరాక మహారాజు వేటకు వెడలి అరణ్యానికి చేరడం అన్నవి ప్రధానాంశాలు. కృతిపతి వంశ వర్ణనలు పక్కనపెడితే ఇందులో యయాతి వేటకై బయలుదేరి అడవి దగ్గరి పల్లెలో విడిది చేస్తాడు.
ద్వితీయాశ్వాసం లో వేటలో లేడిని వెంబడిస్తూ మంచుమల ప్రాంతంలోని జాబాలి ఆశ్రమానికి ప్రవేశించడం, జాబాలి యయాతికి రామాయణ కథను శ్రీరాముడు జననం వరకు చెబుతాడు. ఈ కథ ఇక్కడ చెప్పడానికి కారణం యయాతిని అట్లా ఒంటరిగా రాకూడదనడానికి చెప్పడం కొర కనిపిస్తుంది. రామజననం ఆ మధ్యలో రావణుడు స్వర్గంపై దండెత్తడం వర్ణించాడు. రావణుడు తన పురాల పై దండయాత్ర చేయడం వలన దేవతలు విష్ణువును దర్శించడానికి వెళ్ళడం ఈ ఆశ్వాసంలో వర్ణించాడు.
తృతీయాశ్వాసంలో శ్రీరాముడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళినది మొదలుకొని రావణుడిని చంపి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకునేంత వరకు చెప్పాడు. యయాతి జాబాలి దగ్గర సెలవు తీసుకుని దప్పికతో ఒక బావి దగ్గరికి వెళ్లి బావిలో పడి ఉన్న దేవయానిని చూసి ఆమెను పైకి తీసుకుని వస్తాడు. బావిలో ఎలా పడ్డావని దేవయానిని అడుగుతాడు. దేవయానిని వెతుకుతూ అక్కడికి వచ్చిన ఘూర్ణిక యయాతి కి శర్మిష్ఠ కథ చెబుతుంది. అక్కడ చెలులంతా జల క్రీడలు ఆడుతుండగా పారు నీటిలో బట్టలు నగలు కలిసిపోతాయి. శర్మిష్ట అది గుర్తించలేక దేవయాని చీర కట్టుకుంటుంది. వారి మధ్య జరిగిన ఘర్షణలో దేవయానిపై కోపం తెచ్చుకొని ఆమెను బావిలోకి తోసి వెళ్ళిపోతుంది శర్మిష్ఠ. అప్పుడే అక్కడికి వచ్చిన శుక్రుడు తన బిడ్డ దేవయానిని ఓదార్చి శాంతించమని చెబుతాడు. ఇంతలో వృషపర్వుడు వచ్చి శుక్రుడిని బతిమాలి శర్మిష్ఠ ను దేవయాని కోరికమేరకు దాసిగా ఇస్తాడు. ఇక్కడ వృషపర్వుడికి శుక్రుడు కచుని కథను చెబుతాడు. ఈ ఆశ్వాసంలో తెలగన ఘూర్ణికతో శర్మిష్ఠ కథను, శుక్రుడితో కచుని కథను చెప్పించడం ప్రబంధ ఇతివృత్తంలో పఠనాసక్తిని పెంచింది.
వసంత ఋతువు చెలుల వన విహారంతో ప్రారంభమైన చతుర్ధాశ్వాసం లో యయాతి శర్మిష్ఠను చూడటం దేవయానిని పెళ్లి చేసుకోవటం ప్రధానమైన అంశాలు. వన విహారం చేస్తూ వచ్చి శర్మిష్ఠను చూసిన యయాతి ఆమె సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. దేవయానిని వివాహమాడతాడు వివాహ వర్ణన విపులంగా చేసి ఈ ఆశ్వాసాల ముగించాడు తెలగన.
చెలికత్తెలు దేవయానిని సింగారించడంతో ప్రారంభమయ్యే పంచమాశ్వాసంలో యయాతి దేవయానుల సంభోగ శృంగారం, దేవయానికి సంతానం కలగడం వర్ణించాడు. ప్రమదవనంలో యయాతి శర్మిష్ఠను చూసి అక్కడ ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని అంతఃపురానికి తీసుకుని వస్తాడు. ఆమెకు ద్రుహ్యుడు, అనువు పూరుడు అనే ముగ్గురు, దేవయానికి యదువు తుర్వసుడు అనే ఇద్దరు సంతానంగా కలుగుతారు. వారిని పొంది దేశ పాలన చేస్తున్నాడని ప్రబంధాన్ని ముగించాడు తెలగన.
మహాకావ్యం సర్గ బంధ లక్షణాలు తెలుగు ప్రబంధాలకు అన్వయించే ప్రయత్నం కొందరు చేసినా ‘ ప్రబంధ లక్షణాలు సంస్కృత గ్రంథాలతో అన్వయించేవి కావు. ఆంధ్ర విమర్శకులు రూపొందించినవే’ (అనుశీలన ప్రబంధ ప్రస్థానంలో వక్రోక్తి జీవితం వ్యాసం పుట 173.) అంటూ తెలుగు ప్రబంధ లక్షణాలు 10 వరకు ఉన్నట్లు తెలుగు విమర్శకులు గుర్తించారని జి.వి. సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.
- అష్టాదశ వర్ణనలకు ప్రాధాన్యం
- కథలో వస్త్వైక్యము కానీ ఏకవాక్యత కానీ పాటించ బడాలి.
- ప్రబంధ వస్తువు ఏక నాయకశ్రయమై ఉండాలి. అపూర్వ పాత్రలను పోషించే దిశగా రాణించాలి.
- శృంగారరస ప్రాధాన్యం
- ప్రబంధాలు అనువాదాలు కారాదు
- ప్రబంధాలలో దృశ్యకావ్య మర్యాదలు పాటించాలి
- జాతి వార్తా చమత్కారాలు
- ప్రబంధ వస్తువులో ప్రతీకాత్మకత
- ఆలంకారికమైన శైలి.
- ప్రబంధ ప్రస్థానంలో వక్రోక్తి జీవితం.
యయాతి చరిత్ర లో వర్ణనలు దేశీయతను ప్రౌఢతను రెండిటినీ సంతరించుకున్నాయి. పురాణ వర్ణనలో అట్ట, వప్ర, తోరణ, ప్రసాద, ధ్వజ, పరిఖ, వేశ్యలను వర్ణించాడు. పుర, ఋతు ప్రయాణ, శైల, సాగర, ఆశ్రమ, మంత్ర, రణ, విజయ, వనవిహార, వారికేళి. కన్యాంగ సౌందర్య, చంద్ర సూర్యోదయాలు, పరిణయ, సురత, దౌహృద, సుతజన, వేట, ప్రకృతి వర్ణనలను తెలగన చేశాడు.
ప్రఖ్యాత, ఉత్పాద్య, మిశ్రమాలుగా ఇతివృత్తాన్ని ఆలంకారికులు విభజించారు. ప్రఖ్యాత కథను ఎన్నుకుని అందంగా తీర్చిదిద్దిన ఈ యయాతి కథ వస్త్వైక్యంతో కూడింది. యయాతి కథను పూర్తిగా కాక శర్మిష్ఠకు కలిగిన పుత్రోదయంతో ముగించాడు తెలగన. అలా మంగళాతంగా ముగించాడు. కథ పురవర్ణన తో ప్రారంభించి వేట వర్ణనలతో నడచి యయాతి జాబాలి ఆశ్రమానికి చేరుతాడు. తర్వాత దేవయానిని కాపాడటం, తర్వాత వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ, శుక్రుడి కూతురు దేవయాని కథలు తెలుసుకోవటం, శర్మిష్ఠను ఇష్టపడటం, దేవయానితో వివాహం సంతానం కలగడం, శర్మిష్ఠతో వివాహం సంతానం కలగడం వంటి అంశాలను ఒక వరుసలో చెప్పడంవలన వస్త్వైక్యం, ఏకవాక్యత పాటించినట్లు గుర్తించవచ్చు. అందులోనూ ప్రబంధ కథను కథలకు పరమార్థం అయినా గృహస్థాశ్రమ ధర్మాన్ని కేంద్రీకరించికొని వస్తువును ఏకవాక్యతతో నిర్వహించాడు. యయాతి, దేవయాని, శర్మిష్ఠ పాత్రలను కథానుగుణంగా చిత్రించాడు.
అపూర్వ పాత్ర చిత్రణ అనలేము కానీ పాత్ర స్వభావం చిత్రించడంలో సమకాలీనత కనిపిస్తుంది. పాత్రలను కథాసూత్రానికనుగుణంగా పాత్రల స్వభావాన్ని చిత్రించాడు తెలగన.
శృంగారరస ప్రాధాన్యం ప్రబంధాలలో ఉండే ఒక ప్రధాన లక్షణం . శృంగారరసాభాసమూ, శృంగార రస ప్రాధాన్యంతో కూడినదే. యయాతి కథను శృంగార రస ప్రాధాన్యంతోనే నిర్వహించాడు. యయాతి దేవయానుల మధ్య శృంగారంతో పాటు శృంగారాభాసమూ కనిపిస్తుంది.
ప్రబంధాలలోని కథలు సాధారణంగా ఇతిహాస పురాణాల నుండి గ్రహించేవిగా ఉంటాయి. పురాణాలు ప్రబంధాలు కథలకు బ్లూప్రింట్ వంటివి వాటిని స్వతంత్ర రచనలు నిర్వహించినట్లు నిర్వహించాలి. యయాతి చరిత్రలో వర్ణనలలో కథానిర్వహణ పాత్రల చిత్రణ దేశీయతలను పాటించి స్వతంత్ర రచనగా నిర్వహించాడు.
నాటకీయతను పాటించడం ప్రబంధాలలో కనిపించే మరో లక్షణం. పంచ సంధులను పాటిస్తూ రసానునుగుణంగా కథను నిర్వహించడంలో, కొన్ని సన్నివేశాలను రంగాలుగా నిర్వహించడంలో పాత్రల ఆంగిక వాచిక సాత్త్విక అభినయాలలో ముఖ్యంగా పంచమాశ్వాసంలో నాటకీయతను పాటిస్తూ యయాతి చరిత్ర రచన కొనసాగింది. మూడవ ఆశ్వాసంలో యయాతి దేవయానిని కాపాడడం కచ దేవయాని కథలు, శర్మిష్ఠ కథ తెలియడం గర్భసంధి గా కనిపిస్తుంది.
జాతి వార్తా చమత్కారాలు ప్రబంధ కవులు తమ కంటే ముందున్న ఉద్యోగం నుంచి తెచ్చుకున్న గుణమని జి.వి. సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. జాతి వార్తా చమత్కారం అంటే తాము జీవిస్తున్న కాలంనాటి వాస్తవికతను స్వీకరించడం తమ నేటివిటీని చిత్రించటం. వాస్తవ ప్రతిబింబము జాతి అయితే వార్త దాని వివరణ. అది చమత్కృతితో వ్యక్తీకరించటం జాతి వార్తా చమత్కారం. ఈ. లక్షణం యయాతి చరిత్ర లోని వర్ణనలలో వివాహ ఆచారాలలో అడుగడుగునా కనిపిస్తుంది ఇందులోని కోట వర్ణన గోల్కొండ కోటను స్పురింప చేస్తే , అమీనుపురము గోల్కొండకు, ప్రతిష్ఠాన పురానికి రూపాంతరముగా కనిపిస్తుంది. అమీనుఖాన్ పాలన యయాతి పాలన వర్ణనలలో చూడవచ్చు. వివాహ ఆచరణలో ఈ జాతి వార్తా చమత్కారాన్ని స్పష్టంగా యయాతి చరిత్ర లో గమనించవచ్చు.
ప్రతీకాత్మకత ప్రబంధాలలో మరో లక్షణంగా తెలుగు విమర్శకులు భావించారు. యయాతి మూలభారత కథలో రెండు యవ్వనాలను అనుభవించిన వాడు. దేవయానం పితృయానం రెండింటిలోనూ సంచరించిన వాడు. తెలగన యయాతి లో ఒక యవ్వనాన్ని అది కూడా పరస్పర అనురాగ రూపమైన ధర్మబద్ధ శృంగారాన్ని వర్ణించాడు. ప్రతీకాత్మకంగా ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రతిపాదించాడు. దేవయాని అహంకారానికి శర్మిష్ట గార్హస్థ్య ధర్మానికి ప్రతీకగా ఈ ప్రబంధంలో కనిపిస్తుంది.
ఆలంకారిక మైన శైలి ప్రబంధ పద్యానికి వన్నె తెచ్చిందని చాలామంది అభిప్రాయం. రాయప్రోలు సుబ్బారావు ప్రబంధ పద్యాన్ని మొగ్గలు నవ్వి పువ్వులగు పోల్కి అని అభివర్ణించాడు. సంస్కృత సమాస భూయిష్టమైనదే ఆలంకారిక శైలికి అనుకూలము అన్న భావనను దూరం చేసింది యయాతి చరిత్ర.
సీ. బలుమించు తలచించు నలిమించు సిరిబొల్చు , మేచాయ విరుల సంపెంగల జేయ
నెలతీరు బలుమారు లలిగేరు నెమ్మోము, చెలగి తమ్ములనుదమ్ములను జేయ
జగడాల బగడాలనగుడాలు గలమోవి, చెందమ్మి రేకుల జివుడుసేయు
గరముచీకటి గప్పు కప్పు వేనలియొప్పు, తేటుల కొకవింత నీటుసేయ
గీ. నలువజగముల గలిగిన పొలుపుగరచి, యొంచి వెన్నెల కరువులో నించి యలివ
గా దలంచగ బోలు నీకలికి నవుర యనగనటవచ్చునద్ధేవయానిగని 4-53,
సీ. నలచివైచిన జాలనలరు కప్రపుదావి, పొలుపొందు నెమ్మేన బుగులు కొనగ
వేనలి దుఱిమిన విరిసరంబుల సొంపు, లలమి తేటుల నెల్ల నామతింప
దెలివి కట్టాణి ముత్తెముల పేరుల రంగు, కలిమి పాలిండ్ల వెన్నెలలు గాయ
వలపుల చిఱునవ్వు కలయబూజాలుగా, ముద్దుజెక్కుల మీద మొలకలెత్త
గీ. మోముదామరయింపైన మురువుతోడ, జెలువమగు తియ్యదేనియ చేతనమరు
మరునియాఱవ తూపునాబరగు నట్టి, దేవయాని, గనుంగొని ఠీవి మెఱసి 5-3. ఆలంకారిక శైలికి మంచి ఉదాహరణలు.
కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం ప్రబంధ ప్రస్థానంలో ప్రధానమైనదిగా భావిస్తారు విమర్శకులు. పొన్నగంటి తెలగన వ్యక్తీకరణలో అచ్చతెలుగు నిలుపుకున్నాడు. వైదగ్ధ్య భంగీ ఫణితిని భాషాపరంగా ముందు ఎన్నుకున్నాడు. తెలగన ప్రబంధ వక్రతను. యయాతి చరిత్ర లో అనుసరించాడు. ఒక రసంలో ఉన్న ఉపాఖ్యానాన్ని దాన్ని మరో రసం లోకి మార్చి నిర్వహించటం ప్రబంధ వక్రతలోని ఒక అంశం. ఇందులో ఏడు రకాలైన భేదాలను వక్రోక్తికారుడైన కుంతకుడు ప్రతిపాదించాడు. ఒక కావ్యంలో ఎన్నో సన్నివేశాలను కవి రూపొందించవచ్చు కానీ వాటిలో దానికి ప్రాణ భూతంగా చిత్రించి మొత్తం కావ్యానికి అది ప్రాణప్రదంగా ఉండేట్లు చేయటం ప్రకరణ వక్రత. కచ దేవయాని వృత్తాంతం తెలగన యయాతి చరిత్రలో తరువాత వస్తుంది. ఇది ప్రబంధ పఠనాసక్తిని పెంచటానికి అనుసరించిన వ్యూహం. దేవయానికి వివాహం చేస్తే కట్టు తప్పిన తనం మొండితనం తొలగిపోతాయని చెప్పే సందర్భంలో ఈ కథను చెప్పాడు. ఇది తెలగన నిర్వహించిన యయాతి కథకు ఆయువు పట్టు. ఇది ప్రకరణ వక్రత. యయాతి కథను శృంగార రసాత్మకంగా నిర్వహించడం లోనూ ప్రబంధ వక్రత కనిపిస్తుంది. ప్రబంధ లక్షణాలుగా భావింపబడుతున్నవాటితో సమన్వితమైన అంశాలు యయాతిచరిత్రలో స్పష్టంగా కనిపిస్తాయి.
అచ్చ తెలుగు పద ప్రయోగ వైచిత్రి.
వివిధ రకాల వైచిత్రులలో భాషాపరమైన వైచిత్రి కూడా ఒకటి. నియమ కవిత్వం పేరుతో ఇందులో రసాస్వాదనకు తగిన వైచిత్రి ఉండదనే ఉద్దేశంతో ఈ చిత్ర గర్భ బంధ అచ్చ తెలుగు కావ్యాలకు తగినంత ఆదరణ లభించలేదు.
తెనుగునకు మారు పేళ్ళిడి
పెంచిన వినకూడదనుచు బిరుదులు బేళ్ళున్
మును వేల్పు భాస వెంబడి
నునిచెద గాదనకు డయ్య యుల్లము లందున్ ( 1-14) అన్న పద్యం అచ్చతెలుగు ప్రయోగంలో ప్రబంధ నిర్మాణం చేస్తున్న కవికి ఉండవలసిన జాగరూకతను తెలుపుతుంది. అంతేకాకుండా తత్సమ కావ్యాన్ని అచ్చతెలుగు ప్రబంధంగా అనురణిస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతుంది. ఇది ఒకరకంగా అనువాద సూత్రం, నియమం కూడా. కావ్యం రసాత్మకం గా నిర్వహించవలసినది అందువల్ల ఎక్కువ మంది కవులు ప్రఖ్యాత వస్తువునే ఎన్నుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలిసిన పాత్ర పాఠకుడిని కొంతవరకు కావ్యోన్ముఖుడిని చేస్తుంది. కావ్య గర్భం లోకి ప్రవేశించడానికి అనుకూలమైన స్థితిని నిర్మిస్తుంది. విభావం ఏర్పడి ఉంటుంది. అందువల్ల పాత్రలను అచ్చ తెలుగులోకి మార్చి పేర్కొనడం అనుకూలమైనది కాదని భావించి ఈ నియమాన్ని ఏర్పరచుకున్నాడు. కథలో వచ్చే పాత్రలకు మాత్రమే ఈ నియమం పెట్టుకోవటం ఇక్కడ జాగ్రత్తగా గుర్తించవలసిన విషయం. అందుకు తగిన భాష, జాతీయాలు, సామెతలు, నానుడులు ప్రయోగాల ద్వారా నిర్మించుకున్నాడు.
కావ్యంలో పురాణ ఇతిహాస పాత్రలకు( యయాతి కథకు ప్రత్యక్ష సంబంధం లేనివి) ప్రయోగించిన పేర్లు అచ్చ తెలుగు భాషకు పదజాలానికి చేర్పు వంటిది. శబ్దరత్నాకర కర్త బహుజనపల్లి సీతారామాచార్యులు ఈయనను నాలుగో స్థానంలో కూర్చోబెట్టినా ఇతని రచన ఎన్నో తెలుగు పదాలు నిఘంటువులకు ఆకరంగా నిలిచింది.
లక్ష్మీదేవి – కలిమి పొలతి, పైడినెలత, తమ్మిపూవింటనెలకొన్నదంట.
కృష్ణుడు – కఱిదేవర, కణివేల్పు
బ్రహ్మ – నాలుగుమొగములతడు
పంచముఖ – ఏనుమోముల మోట
తారాధిపతి – చుక్కలరాయుడు
సహస్రాక్షుడు – వేయికన్నుల వేల్పు
విష్ణువు – నుడుగుల చెలిమామ, కలిమితొయ్యలి గేస్తు
రాక్షసగురు – తొలి వేల్పుటయగారు
అగ్నిదేవుని భార్య – సెగఱేనిచాన
యముని భార్య – జముగేస్తురాలు
వరుణుని భార్య – నీటిరాయనిచిల్క
వాయువు భార్య- తెమ్మెర కొమ్మ
కుబేరుని భార్య – ముక్కంటి చెలిలేమ
చంద్రుడు – తొగలరేడు
ఆదిశేషుడు – చిలువల గమికాడు వంటివి యయాతిచరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. ఇందులో కొన్ని పూర్వపు కవులలో కనిపిస్తే, కొన్ని పొన్నగంటి తెలగన ప్రయోగాల ద్వారానే వెలుగులోకి వచ్చాయి.
కొడుకులకోట (తల్లి), రక్తసంబంధం నెత్తురు పొత్తు (రక్తసంబంధం), అద్దమరేయి (అర్ధరాత్రి) బయటికెత్తిన దివ్వె (మనసును బయటపెట్టిన దీపం అనడం) వంటి అచ్చతెలుగు పదబంధాలు తెలగన ప్రయోగ వైచిత్రికి ఉదాహరణగా నిలుస్తుంది.
సి.హెచ్.లక్ష్మణ చక్రవర్తి.