ఏం కొంచెం యాత్రా స్థలాల దర్శనానికి అవకాశం ఉన్నా ముందుండేది మేమే. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ప్రభలడంతో టూరిజం మొత్తంగా కుప్పకూలడం యాత్రా ప్రదేశాలపై కోవిడ్ ఆంక్షల వల్ల ఎక్కడకైనా వెళ్ళాలన్నా అవకాశాలు తగ్గిపోవడంతో రెండు సంవత్సరాల పాటు అన్ని ఆలోచనలకి, కోరికలకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది.
కొంచెం కొంచెంగా కోవిడ్ తగ్గుముఖం పడ్తున్న ఈ సందర్భంలో లడక్ యాత్ర గురించి మిత్రుల ద్వారా తెల్సుకొని ఎలా అయినా ఈసారి టూర్ మిస్ కావద్దు అనుకొని ముందుగానే వెళ్ళాల్సిన ప్రాంతం వివరాలు ఎక్కువగా తెలువకున్నా ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం.
ప్యాకేజి అయితే బుక్ చేసుకున్నాం కాని, సహచర మిత్రులను ఆహ్వానిస్తే వారు మా ఆహ్వానం తిరస్కరించడమే కాకుండా ఒకరకంగా మమ్మల్ని టూర్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని వత్తిడి తేవడం ప్రారంభించారు. వాళ్ళు చెప్పిన విషయం సూక్ష్మంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన కర్ దుంగ్లా పాస్ 18000 అడుగుల ఎత్తులో ఉంటుందని, ఆ శిఖరాలు అన్ని మంచుతో కప్పబడి ఉంటాయని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి హై ఆల్ టిట్యూడ్ సిక్ నెస్ తో వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ ప్రాంతంలో అక్కడక్కడ మిలటరీ క్యాంప్స్ తప్ప పెద్దగా జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంటాయని వైద్య సౌకర్యాలు కూడా చాల తక్కువగా ఉంటాయని, ప్రయాణించే ప్రతి వెహికిల్ లో ఆక్సిజన్ సిలిండర్లు తప్పనిసరిగా క్యారీ చేస్తారని, ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్ ద్వారా ధృవపత్రం అందజేస్తేనే ప్రయాణానికి అనుమతి ఉంటుందని వివిధ కారణాలతో మాతో లదాక్ రావడానికి ఉత్సాహం చూపలేదు. మేము మాత్రం ఈ టూర్ ఎలా అయినా వెళ్ళాలనే దృఢ నిశ్చయంతో ప్రయాణానికి సన్నాహాలు మొదలు పెట్టాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఒకసారి ఈ
ప్రాంత విశేషాలను, ఈ ప్రాంతాలు దర్శించిన యాత్రికుల అనుభవాలు కొంత ఉపయోగపడతాయని
వివరాలు సేకరించడం మొదలు పెట్టాం.
మొట్టమొదటగా ఈ ప్రాంతంలో కొంతకాలం పనిచేసిన ఒక డాక్టర్ మిత్రున్ని సంప్రదించి మేం లడక్ వెళ్తున్న విషయం చెప్పగానే చాలా పెద్ద సాహసయాత్ర చేయబోతున్నావ్ అంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ప్రోత్సహించి, అక్కడ పరిస్థితులను, అసౌకర్యంగా ఉన్నప్పుడు ఏ సమయాల్లో ఏం మందులు అవసరమో వివరంగా చెప్పడంతో నేను నా డైరీలో వాటికి సంబంధించిన వివరాలను నోట్ చేసుకుని భద్రపరచుకున్నా. దీనితో పాటు యాత్రలో సందర్శించబోయే ప్రాంతాలు, వాటికి సంభంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంతో మునిగిపోయా.
ఇక లడాక్ వివరాల్లోకి వెళ్తే, వరల్డ్ రూఫ్ టాప్ గా పరిగణించే లడక్ ఒక సుందరమైన ప్రదేశం. పర్యాటకులకు స్వర్గధామం. ముఖ్యంగా జూన్, జులై మాసాల్లో అయితే లడక్ లోని వివిధ ప్రాంతాలు సందర్శించుకోవడానికి చాలా మంది యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా యువతీ యువకులు వారి సైకిల్ మోటార్లపై సాహసోపేతంగా ప్రయాణించడానికి ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతం ఐన కార్డుంగ్ లాపాస్ ప్రాంతానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
ఈ ప్రాంతంలో విహరించిన వారం రోజులు ప్రకృతిలో లీనమయినట్టుగా జీవితం సాగిపోయింది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అన్నట్టు ఉండే కరెంటు. ఎప్పుడో ఒక సారికాని కనెక్ట్ కాని ఫోన్, స్వచ్ఛంగా తెల్లగా మెర్సిపోతున్న మంచు కొండలు, గడ్డకట్టి చలిగాలులు, ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు, కిలోమీటర్ల కొద్ది కానరాని మనుషులు, కుడివైపు అంతా కారకోరం పాస్ పర్వత శిఖరాలు, పర్వతాలపై పడి కర్గి పోతున్న మంచు తాలుకు నీటితో లోయలోకి ప్రవాహంలా దూసుకపోతున్న సయోక్ నది ఎడమవైపు ఎంతో ఇరుకైన రహదారి మనని ఎంతో ఆహ్లాదంలో, ఆనందంలో ముంచెత్తుతాయి.
లడక్ ప్రాంతంలో గల లెహ్ ప్రాంతం సముద్రమట్టానికి 11562 అడుగుల ఎత్తున ఉండే అందమైన ప్రదేశం ఇది. పురాతన చరిత్ర పరిశీలిస్తే మొదటి శతాబ్దంలో కుషాన్ చక్రవర్తి కాలంలోనే లడక్ నుండి ఇండియాకు చైనా ద్వారా వ్యాపార సంబంధాలు ఉండేవని దీన్ని సిల్క్ రోడ్ గా వ్యవహరించారని ఇండియాలోని చివరి గ్రామమైన తు తు అనే గ్రామ ప్రాంతం ద్వారా సిల్క్ రూట్ గా ప్రాముఖ్యత వహించిన ప్రాంతం ఇప్పటికి దర్శనీయ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది.
పర్యావరణ మార్పులు, మామూలు వర్షపాతం కంటే అత్యధిక వర్షం పడ్తున్న ప్రాంతాల్లోని 100 ప్రాంతాల్లో ఈ పాతనగరమైన లేహ్ కూడ ఉంది. యాత్రా ప్రదేశమవడం చేతను, జనాభా అధికంగా పెరగడం వల్ల నగర విస్తరణ లేకపోవడం మూలాన, అత్యధిక వర్షపాతం వల్ల వచ్చే ఆకస్మిక వరదలూ ఈ ప్రాంత సురక్షితాన్ని ప్రశ్నిస్తున్నాయి.
లడక్ అంటేనే ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ గా పరిగణిస్తారు. ఈ మౌంటేన్ రేంజెస్ సముద్రమట్టానికి 16400 అడుగుల నుండి 22000 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇవి దాదాపు 45 మిలియన్ సంవత్సరాల క్రితం తయారు అయినట్టుగా పరిగణిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని కారకోరం పాస్ శిఖరాలు సముద్రమట్టానికి 18875 అడుగుల ఎత్తు నుండి 25171 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.
ప్రపంచంలోనే అతి ఎత్తైన మోటరబుల్ రోడ్ ఈ ప్రాంతంలోనే ఉంది. మౌంటేన్ బైకింగ్ కు ఎంతో ప్రాముఖ్యంగా ఉండే ఈ రోడ్డు సముద్ర మట్టానికి 17893 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాన్ని కర్ దుంగ్ లా పాస్ గా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం బ్రిడ్జిల నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ ప్రాంతంలోనే జాన్ స్కర్ నది మరియు ఇండస్ నది రెండు కల్సి ఇండస్ నదిగా మారి పాకిస్తాన్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.
దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద పార్కైన హెర్నీస్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంది.
వారం రోజుల లడక్ యాత్ర ఆ రోజు ఉదయం నాలుగు గంటలలో ప్రారంభమయింది. ప్రొద్దున్నే 7 గం||లకు ఫ్లైట్ ద్వారా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుండి లేహ్ ఎయిర్ పోర్టుకి మద్యాహ్నం వరకు వెళ్ళడం జరిగింది. లేహ్ ఎయిర్ పోర్టులో దిగగానే అతి ఎత్తైన ప్రదేశం అవడం మూలాన హై ఆల్టిట్యూడ్ సిక్ నెస్ వచ్చేసిందా అనే మానసిక వత్తిడి ఫీల్ అవడం కూడా జర్గి పోయింది. ఏదో ఒక అనిర్వచనీయమయిన భయం ఆవహించి ఎంత తొందరగా రూంకి వెళ్ళి, చలికి తట్టుకునేలా నూతన వాతావరణానికి, హై ఆల్ ట్ట్యూడ్ కి శరీరం తట్టుకునేలా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి వెహికిల్ లో కూర్చున్నాం. థెర్మల్ తో సహా 4 లేయర్స్ తో డ్రెస్ వేసుకున్నా ఇంకా చలిగా ఉండడంతో ఒక్కసారిగా మిత్రులు లడక్ ప్రయాణమంటే ఎందుకు భయపడ్డారో అర్థం అయింది. ఈ ప్రాంతం చూడాలనే ఉత్సుకత ఎంతో ఉన్నా, ఈ ప్రాంతంలో అడుగు పెట్టాక ఒక విధమైన నిర్వేదం, భయం ఆవహించాయి. హై ఆల్ టైట్యు లో తట్టుకోవడం కోసం మా డాక్టర్ సూచించిన డయామోక్స్ 250 ఆ రోజు విమానంలో వేసుకోవడంతో దాని పనితనం కొంచెం కొంచెంగా తెలిసొచ్చింది. సహచర తోటి ప్రయాణీకుల్లో ఉన్న తలనొప్పి, అసస్వత మాలో చాలా తక్కువ
మోతాదులో ఉన్నట్లు ఫీల్ అయ్యాం . మాకు కేటాయించిన రూంకి వెళ్ళి వేడివేడిగా టీ త్రాగి, తోటి యాత్రికులతో కాసేపు కబుర్లతో గడిపాము. అప్పటికి కొంత యాంగ్లైంటీ తగ్గింది. హోటల్ లో సర్వ్ చేసిన వేడివేడి ఫుడ్ తినేప్పటికి కొంచెం కొంచెం నార్మల్ స్థితికి వచ్చినట్టుగా రిలాక్స్ అవడం జర్గి, ఆ రోజు క్రొత్త క్రొత్త అనుభూతులతో రాత్రంతా చలితోనే గడిచిపోయింది.
ఆ తర్వాత రోజు ప్రొద్దునే బ్రేక్ ఫాస్ట్ చేసి ఆ రోజు దర్శనీయ ప్రాంతాల్లో మొదటిదైన ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన శాంతిస్తూపం దర్శించడం జరిగింది. ఇక్కడ సూర్యోదయ, సూర్యాస్తమయలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇది 11841 అడుగుల ఎత్తులో చాన్స్పా అనే కొండపై, చంద్ స్పా అనే గ్రామంలో ఉన్న ఒక బౌద్ధ తెల్లని స్తూపం. 1991లో జపనీస్ బౌద్ధ బిష్ణువు గ్యామియో నకమురా చే నిర్మింపబడి 14వ దలైలామ టెస్టిన్ గ్యాట్సో ద్వారా ఆగష్టులో ప్రతిష్టించబడింది.
రెండవ ప్రపంచ యుద్ధంలో హీరోషిమా, నాగసాకి పై జర్గిన అణుబాంబుల దాడిలో దాదాపు 150000 సామాన్య ప్రజలు మరణించాక జపానీ బుద్ధిప్ట్ మాంకు నిచిదత్యుపూజి ఆధ్వర్యంలో ప్రపంచశాంతి కోసం దాదాపు 80 పీస్ పగోడాలు ప్రపంచవ్యాప్తంగా నిర్మించడం జర్గింది. ఇందులో భాగంగా నిర్మించిందే ఈ శాంతిస్తూపం.
ప్రపంచశాంతి మరియు ప్రపంచ శ్రేయస్సులను ప్రోత్సహించడానికి బౌద్ధమతం యొక్క 2500 సంవత్సరాల జ్ఞాపకార్థం దీని నిర్మాణం ఏప్రిల్ 1983లో ప్రారంభమైంది. శాంతి స్థూపం రెండు అంతస్తుల నిర్మాణంగా కల్గి ఉండి మొదటి అంతస్తులో బంగారు బుద్ధ విగ్రహ చిత్రం, రెండో అంతస్తులో బుద్ధుని పుట్టుక, ధ్యానం మరియు మహా నిర్యాణం చిత్రాలు దర్శనమిస్తాయి.
ప్రపంచ శాంతి కోసం నిర్మించిన అద్భుత కట్టడం శాంతిస్థూపం దర్శించుకున్న జ్ఞాపకాలతో ఇంకో ప్రాచుర్య పర్యాటక స్థలం అయిన లెహ్ ప్యాలెస్ దర్శించుకోవడం కోసం వెళ్ళాం. లేహ్ ప్యాలేస్ గా పిలువబడే లాచన్ ఫాల్కర్ ప్యాలెస్ 1645 సం||లో సెంగే న్యాంగన్ నిర్మించిన పూర్వపు టిబెట్ స్టైల్ లోని రాజభవనం. 19వ శతాబ్దంలో డోగ్రా సేనలు లడఖ్ ని తమ ఆధీనంలోకి తీసుకొనే వరకు ఈ రాజభవనం నివాస యోగ్యంగా ఉండేదని చెప్తారు, 9 అంతస్తులుగా ఉన్న ఈ రాజభవనంలో 9వ అంతస్తులో రాజకుటుంబ వసతిగా ఉండేది. క్రింది అంతస్తులో రాజకుటుంబ సహాయకులు, మధ్య అంతస్తులో రాజకీయ ఇతర కార్యకలాపాలకు ఉపయోగపడేలా వివిధ సమావేశ మందిరాలు ఉన్నాయి. ఆకస్మికంగా వచ్చే వరదలను, భూకంపాలను తట్టుకునేలా ఉన్న ఈ మట్టి/రాతిలో ఉన్న నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. చాలా వరకు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో అవసానదశలో ఉన్న ఈ నిర్మాణంలో 450 సం||ల వరకు పూర్వం చిత్రించిన చిత్రాలు మనం దర్శించుకోవచ్చు. మొత్తం 9 అంతస్తులు ఎక్కి చూడ్డానికి చాలా మంది యాత్రికులు ఉత్సాహంతో ప్రయత్నించారు. ఇరుకుగా ఉన్న వుడెన్ స్టెప్స్, అంతస్తు, అంతస్తు ఎక్కటంలో ఉండే అలసట, ఎక్కువగా చలిగా ఉండటమూ కొంత నిరుత్సాహం కల్గించినా, 9వ అంతస్తు పై భాగంలోకి వెళ్ళాక ఎంతో అద్భుతంగా కన్పిస్తుంది ఈ ప్యాలెస్. అక్కడ నుంచి చుట్టూ కనుచూపు మేరలో కన్పిస్తున్న నివాసాలు, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది.
లేహ్ ప్యాలేస్ నుండి ఎంతో ప్రాముఖ్యం గలది, తప్పని సరిగా చూడాల్సిన ప్రాంతం అయిన “హల్ ఆఫ్ ఫేం”కి వెళ్ళడం జర్గింది. ఇండో పాక్ యుద్ధంలో ఇండియాను రక్షించడానికి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీర భారత సైనికుల
జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మ్యూజియం లే కార్గిల్ రోడ్ ‘లేహ్‘ నగరానికి 4 కి.మీ. దూరంలో ఉంటుంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఉపయోగించిన వివిధ రకాల ఆయుధాలు, స్వాధీన పర్చుకున్న ఆయుధాలు,
సియాచిన్ ప్రాంతంలో భారత సైన్యం ఉపయోగించిన వివిధ రకాల దుస్తులు, మంచులో కర్తవ్య నిర్వహణలో ఉన్న సైనికుల చిత్రాలు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధ చిత్రాలు, దేశాన్ని కాపాడడం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికుల చిత్రాలు మనకు ఎంతో ఉత్తేజాన్ని కల్గించడమే కాకుండా సైనికులు చేస్తున్న త్యాగాలకు జోహార్లు అర్పించేలా మనసంతా దేశభక్తితో నిండిపోతుంది.
మూడవ రోజు ప్రయాణం ఎంతో ఉత్సుకత, ఉత్సాహంతో ప్రారంభమైంది. ప్రయాణం ఆద్యంతమూ హాలివుడ్ సినిమాల్లోనూ మెకనాస్ గోల్డ్ చిత్రాల్లోను చూపించిన లొకేషన్స్ మాదిరిగా ఎత్తైన కొండలు, లోతైన లోయలూ, ఆ ప్రాంతమంతా ప్రకృతి తప్ప ఎవరూ లేనట్టుగా ఎంతో అద్భుతమయిన రోడ్లపై సాగింది మాప్రయాణం.
ఇక ఈ కర్ దుంగ్ లా పాస్ వివరాల్లోకి వెళ్తే ఈ మార్గాన్ని 1976లో ఆర్మీవారు సియాచిన్ ప్రాంతంలో పహారా కాచే సైనికులకు నిత్యావసర వస్తువులు, ఆయుధాలు చేరవేయడం కోసం నిర్మించబడిందని చెప్తారు. 1988 వరకు ఆర్మీ అవసరాలకు మాత్రమే దీన్ని వాడేవారు. ఆ తర్వాత యాత్రికులను కూడా అనుమతిస్తున్నారు. సంవత్సరంలో 9 నెలలు మంచుతో కప్పబడి ఉండే ఈ రోడ్డు కేవలం మూడు నెలలు మాత్రమే రహదారిగా వాడబడుతూ ఉంటుంది. కారకోరం శిఖరాలు ఒకదానితో ఒకటి పోటీ పడున్నావా అనే విధంగా ఆకాశం తాకుతున్నట్టుగా ఎత్తైన శిఖరాలు, కుడివైపు, లోతు కన్పించనంతగా లోయ, లోయలో మంచు కర్గి నీరు పారుతున్న దృశ్యాలు, ఎడమవైపు క్షణాల్లో ఆకాశంలో మారుతున్న అందమైన దృశ్యాలు చూస్తుంటె, లడక్ యాత్రికులకు ఎందుకు స్వర్గధామంగా విలసిల్లుతోందో ఆ ప్రదేశం చూడాలనే తాపత్రయం ప్రభలంగా ఎందుకు అన్పిస్తుందో అనుభవంలోకి వచ్చింది. కొంత దూరం వెళ్ళేటప్పటికి మంచు విపరీతంగా కురవడంతో కొండలన్ని మంచుదుప్పటి కప్పుకున్నట్టుగా ఉన్న చిత్రం చూశాక మానసికంగా ఎంతో తృప్తిగా, అనిర్వచనీయమైన ఆనందం తొణికిసలాడింది.
ఎత్తైన రోడ్డు, పైకి ఎక్కలేక, మంచులో కూరుకుపోయిన కార్లు, వాటిని తోయడానికి దిగిన లోకల్ డ్రైవర్లతో మొత్తం కార్ల కాన్వాయ్ ఆగిపోయింది. అందరూ తమ తమ కార్లలోనుంచి దిగి మంచుతో ఆడుకొనే దృష్యాలు, ఫోటోలతో, సెల్ఫీలతో ఆ ప్రదేశమంతా యాత్రికులతో నిండిపోయింది.
ప్రకృతిని, శిఖరాలను, లోయలో పారుతున్న నదిని, ఆకాశంలో మారుతున్న మేఘాలను చూస్తూ రెండు గంటల ప్రయాణం కొనసాగాక ప్రపంచంలోని ఎత్తైన కదుం యో పాస్ 18000 అడుగుల మైలురాయి రానే వచ్చింది. మొత్తం అన్ని కార్లు ఆగాక అందులోని యాత్రికులు క్రిందకు దిగి ఆ మైలురాయి వద్ద ఫోటోల కోసం వరుసలో నిలబడ్డారు.
నాకైతే ఉత్సాహంతో పాటు మానసిక సంఘర్షణ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ప్రపంచంలో ఎత్తైన మోటరబుల్ రోడ్ పైన ప్రయాణం చేస్తున్న విషయం సాహసోపేతంగా ఉంటే ఆప్రాంతంలో కొంచెం సేపైనా గడపాలంటె మరి అక్కడ ఉండే ఆక్సిజన్ మనకు సరిపోతుందా, ఇలాంటి ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు వస్తే ఎదుర్కోవడం ఎలా? మా వాహనంలో అయితే ఆక్సిజన్ సిలిండర్ ఉన్నాయి. కాని పార్కింగ్ ప్లేస్ నుండి కర్ దుంగ్ లా పాస్ ఓ మూడు, నాలుగు వందల ఫీట్ల దూరంలో ఉంటుంది. ఇలా మనసులో పరిపరివిధాలుగా ఆలోచనలు సుడితిర్గుతుంటే ఎలాగు ధైర్యం చేసి ఇంత దూరం వచ్చాం. అంటూ ధైర్యం చేసి కర్ దుంగ్ లా పాస్ మైల్ స్టోన్ దగ్గర ఫోటోలకు పోజులిచ్చి మరికొంత సేపు గడిపాంజ అప్పటికి మాత్రం జీవిత ధ్యేయం నెరవేరినట్టుగా, ఒక గొప్ప అనుభూతిని స్వంతం చేసుకున్న ఆనందంతో పాటు, గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్ సంపాదించినంత ఫీల్ అయితే వచ్చింది.
దారిలో సయాక్ వార్ మెమోరియల్స్ దర్శించుకొని సియాచిన్ ప్రాంతంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు అంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తుకు తెచ్చుకున్నాం.
ఆగుతూ, ఆగుతూ వెళ్ళడం మూలాన ప్రయాణం ఆలస్యం అయి భోజనాల సమయం కూడా దాటిపోయింది. సాయంత్రం నాలుగంటల సమయంలో డిక్ సిట్ మోనాస్టీ చూడ్డానికి వెళ్ళాం.
మోనాస్టీ పరిసర ప్రాంతం వెళ్ళెవరకు విపరీతమయిన వర్షం ప్రారంభమయింది. లడక్ ప్రాంతం అంతా వాతావరణం విషయంలో ఏ నిమిషానికి ఏం జరుగునో’ అన్నట్లుగా ఉంటుంది. కొద్దిసేపు విపరీతంగా ఎండ, కొంతసేపటికి వర్షం, కొంతసేపటికి విపరీతమయిన చలి ఈ విధంగా వాతావరణ పరిస్థితులు ఎప్పుడు మారుతూ ఉంటాయి.
ఈ డిక్ సిట్ మోనాస్టీ 10315 అడుగుల ఎత్తులో 14వ శతాబ్దంలో చాంగ్ జెమ్ తెసరాజ్ జాంగో స్థాపించారు. ఈ మఠం సమీపంలో 106 అడుగుల ఎత్తైన మైత్రేయ బుద్ధ విగ్రహం సయాక్ నదికి ఎదురుగా నుబ్రావ్యాలీ వైపు ఉంటుంది. ఈ విగ్రహం నిర్మాణం ఏప్రిల్ 2006లో ప్రారంభించబడింది. దీనిని దలైలామ 25 జులై 2010న ప్రతిష్టించారు. మూడు ప్రధాన కారణాలతో దీనిని నిర్మించారని చెప్తారు. డిక్ సిట్ విలేజ్ రక్షణ, ప్రక్క దేశాలతో తదుపరి యుద్ధాన్ని నివారించడం మరియు ప్రపంచ శాంతిని ప్రోత్సహించడం. నుబ్రా వ్యాలి, పరిసర ప్రాంతాలలో చలికాలంలో మంచుతో పూర్తిగా కప్పబడ్డాయి. ఈ సమయంలో ప్రజలకు ఈ మఠంలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఈ మఠంలో మంగోలియన్ మరియు టిబెటన్ గ్రంధాలు కూడా ఉన్నాయి.
డిక్ సిట్ మోనాస్టీ నుండి అతి ఎత్తైన ప్రదేశంలో అతి చల్లని ఎడారిగా పిలవబడే హుందర్ గ్రామంలోని ఇసుక తిన్నెలకు వెళ్ళాం. మంగోలియా నుండి వచ్చి స్థిరపడిన రెండు మూపురాల ఒంటెల పై ప్రయాణించడం ఇక్కడకు వచ్చిన యాత్రికుల సరదా. మేం కూడా ఈ ఒంటెల పై కొంతసేపు ప్రయాణించి ఈ నుబ్రాలోయలోని టెంట్స్ లో బస చేయడానికి సయూక్ నదీ తీరంలో ఉన్న మాకు కేటాయించిన టెం లోకి వెళ్ళాం.
నుబ్రావ్యాలీని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. నుబ్రా నది (సియాచిన్ నది అని కూడా పిలుస్తారు) మరియు సయోక్ నది ప్రవహించే అందమైన లోయ ప్రాంతాన్ని నుబ్రా వ్యాలీగా వ్యవహరిస్తారు. సముద్రమట్టానికి 10000 అడుగుల ఎత్తును ఉన్న ఈ ప్రాంతంలో రెండు రాత్రులు టెంట్ లో ఉండటం జరిగింది. ఇది ప్యాంగాంగ్ సో లేక్ వద్ద గడపబోయే ఒక రాత్రికి ప్రిపరేటివ్ గా ఉండే విధంగా ఉపయోగపడుతుంది. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా నిర్మింపబడ్డ ఈ టెంట్ లో ఒక వరండా, ఒక బెడ్ రూం, ఒక రెస్ట్ రూంతో కల్సి బట్టతో తయారు చేయబడిన ఈ టెంట్ లో, మనం లోపలికి వెళ్ళాక జిప్ తో అన్ని రూములు మూయాల్సి ఉంటుంది. రాత్రంతా విపరీతంగా చలి వల్ల నిద్రలేమిగా ఉన్నా ఒక క్రొత్త అనుభవంతో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి పొందగల్గాం.
మరుసటి రోజు ప్రొద్దునే బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని ఇండియా పాకిస్థాన్ బార్డర్ లోని చివరి గ్రామమైన తురు అనే గ్రామాన్ని చూడ్డానికి వెళ్ళాం. రెండు గంటల ప్రయాణం తర్వాత హిమాలయా ప్రాంతంలోని కారకోరం రేంజ్ లోని తు తు గ్రామంలో ప్రవేశించాం. ఈ గ్రామం నుబ్రోవ్యాలీలోని సయోక్ నదీ తీర ప్రాంతంలో ఉంది. ఇది ఒకప్పుడు బలిస్తాన్ చక్రవర్తి రాజ్యంలో ఉండే ఈ గ్రామం 13వ శతాబ్దం వరకు బుద్ధిప్ట్ రీజియన్ గా ఉండేది. ఇది 1971 వరకు పాకిస్తాన్ ప్రాంతంలోని కాశ్మీరీ భాగంలో ఉండేది. ఇక్కడ ఉన్న మోనా’ నుండి మౌంట్ పార్క్ కె2ను చూడొచ్చు.
బల్టీ మ్యూజియంలో 400 సంవత్సరాల క్రితం వాడిన వస్తువులను మనం దర్శించవచ్చు. నేచురల్ కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో ఫ్రెష్ గా వున్న స్టాక్స్ ను మనం గమనించవచ్చు. 2.2 కి.మీ. దూరంలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమించిన గిల్ గేట్ – బల్టిస్తాన్ బార్డర్ ఫెన్ సింగ్ ని టెలిస్కోప్ ద్వారా చూసాం. అప్రికాట్, వాల్ నట్ ఇక్కడ సమృద్ధిగా లభిస్తాయి. 5000 సం||ల క్రితం నిర్మించిన బో క్రాఫోర్ట్ ని యాంగ్బో డైనాస్టీకి సంబంధించిన షయాక్ నదీ తీర ప్రాంతంలో ఉన్న కోట అవశేషాలను సమయాభావం వల్ల చూడలేకపోయాం. తిరుగు ప్రయాణం చేసి హుందర్ ప్రాంతంలోని మా అతిథి గృహమైన టెంట్ కి వెళ్ళాం. ఆరోజు ప్రత్యేక ఆకర్షణగా స్థానిక మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లడాక్ గ్రామీణ యువతులు నిర్వహించిన నృత్య కార్యక్రమాల్లో పాల్గొని భోజనం తర్వాత రిలాక్ అయ్యాం .
ఆ మరుసటి రోజు హుందర్ గ్రామం నుండి ప్యాంగాంగ్ సో సరస్సుకి దాదాపు 274 కి.మీ. 8 గం||ల ప్రయాణం చేసి, సాయంత్రం 5 గం||లకి చేరుకున్నాం.
2017 ఆగష్టులో ప్యాంగాంగ్ సో సమీపంలో చైనా | భారత దళాలు పరస్పరం రాళ్ళు విసురుకోవడం, 2020 మే 5-6 తారీఖున సుమారు 250 భారతీయ, చైనా దళాలు ముఖాముఖి తలపడడంతో ప్యాంగాంగ్ సో సరస్సు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది.
సముద్రమట్టానికి 13862 అడుగుల ఎత్తున ఉండే ఈ సరస్సు అంతర్టీనంగా త్యోనాక్, రమ్ తో – జంట సరస్సులు, న్యాక్ స్సో అనే ఐదు ఉప సరస్సులతో మిళితమై ఉంటుంది. ఈ సరస్సు 134 కి.మీ. పొడవు, 5 మీటర్ల గరిష్ట – 3.1 మీటర్ల వెడల్పు కనిష్టంగా ఉండి 50% శాంతం చైనా భూభాగంలో, 40% ఇండియా భూభాగంలో 10% రెండు దేశాల పరిధిలో ఉన్నది. ఇది చలికాలంలో పూర్తిగా గడ్డకట్టబడి ఉండి వేసవికాలంలో మాత్రం హిమాలయ శిఖరాలను
ప్రతిబింభించే విధంగా స్వచ్ఛంగా ఉన్న నీరు, ఏడు వివిధ రంగుల్లో ఉండి కొన్ని ప్రాంతాల్లో ఫోటో-6 అడుగు భాగం స్వచ్ఛంగా కన్పించేలా ఉంటుంది. ప్రకృతిలో ఉండే స్వచ్ఛదనం, రాత్రిపూట ఆకాశంలోని
నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ జీవితంలో మనం ఎప్పుడూ చూడని క్రొత్త ప్రపంచం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మేము మాత్రం విపరీతంగా చలి ఉన్నా మా రూంకి ఉన్న గ్లాస్
డోర్ సహాయంతో ఆకాశం అంతా పరుచుకొని ఉన్నట్లున్న నక్షత్రాలను తనవి తీరా చూసి ఆనందించాం. మాటలకు, రాతలకు అందని అనిర్వచనీయమైన ఆనందం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. లే లో గడిపిన రెండు రోజులు నుబ్రావ్యాలీలోని హుందర్లో గడిపిన అనుభవంతో ప్యాంగాంగ్ సోలోని ఒక రాత్రి
గడపడానికి ఎంతో ఉపయోగపడింది. హై ఆల్టిట్యూడ్ సిక్ నెస్ దాని పర్యావసనాలు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా దాని వల్ల వచ్చే సమస్యలు, అతి కష్టంగానైనా అందుబాటులో దొరకని వైద్యులు ఇవన్నీ కలసి మానసిక ధైర్యం ఈ సాహసయాత్రకు ఎంతో ఉపయోగపడతాయి. ఉదయం ప్యాంగాంగ్ సో సరస్సు మీదుగా వస్తున్న సూర్యోదయ చిత్రం ఎంతో అద్భుతంగా అనిపించింది.
ఈ లేక్ ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ ఊసరవెల్లిలా ఈ లేక్ లోని నీటి రంగు మారుతూ ఉంటుంది. నీటి అడుగుభాగం కూడా స్వచ్ఛంగా కన్పించేలా ఉంటుంది. ఇది -30 డిగ్రీల నుండి -10 డిగ్రీల వద్ద గడ్డకట్టబడి ఉండి చలికాలంలో అనేక రకమైన పక్షులను ఆకర్షిస్తుంది. గడ్డకట్టిన లేక్ లో నిర్వహించబడే ట్రెక్కింగ్ ఇక్కడ ప్రత్యేకత. మంచు చిరుతలు ఉండే ఒకే ఒక్క ప్రదేశం లడక్ ఈ లేక్ చలికాలంలో పూర్తిగా గడ్డకట్టి ఉంటుంది.
ఆ మర్నాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని యాత్ర కొనసాగింపుగా ఆ చివరి రోజు ఫోటో-7 సాహసయాత్ర మళ్ళీ కొనసాగింది. తిరుగు ప్రయాణం 150 కి.మీ దూరం ప్రపంచంలోనే రెండో
ఎత్తైన ప్రదేశమైన చాంగ్లాపాస్ 17857 అడుగుల ఎత్తున గల ఈ ప్రాంతంలో చాలా వరకు ల్యాండ్ స్టెడ్స్ జరగడం మూలాన డ్యామేజి అయిన రోడ్లతోను, విపరీతంగా మంచుపడి వాటి ప్రవాహంతో కొట్టుకుపోయిన రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణంవల్ల ప్రయాణం ఆగుతూ, సాగుతూ సాగింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఉద్యోగులు అంత చలిలోను, నిరంతరం శ్రమిస్తూ రోడ్ల నిర్మాణానికి, యాత్రికుల సౌకర్యం కోసం చేస్తున్న ఏర్పాట్లు చూస్తే వాళ్ళ త్యాగ నిరతికి మనసులోనే జోహార్లు సమర్పించుకోవడం జరిగింది.
దాదాపు 6 గం||ల సాహసయాత్ర ముగించుకొని, లేప్లో ఇంకా చూడాల్సిన షేప్యాలెస్లోకి ప్రవేశించాం. దీన్ని 10వ శతాబ్దంలో ల్యాచెన్ పాల్గగాన్ అనే బుద్ధ గురువు నిర్మించారు ఇది లేహ్ సిటికి 15 కి.మీ దూరంగా ఉన్న లేహ్ – మనాలి రోడ్డులో 11204 అడుగుల ఎత్తులో ఉంది. లడక్ కి గతంలో వేసవికాలంలో క్యాపిటల్ గా ఉన్న ఈ ప్రాంతంలో బుద్ధుని అవతారమైన షాక్యముని బుద్ధ రెండవ అతిపెద్ద స్థూపం 39 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ అత్యంత ఎత్తుపైన ఉన్న ఈ ప్యాలెస్ పై భాగం నుండి చూస్తె చుట్టు ప్రక్క సింధునది ప్రాంతాలు ఎంతో అందంగా కన్పించి టూరిస్ట్ స్పాట్ లాగా వెలుగొందుచున్నది. షాక్యముని బుద్ధస్థూపం దర్శించుకొని అక్కడి నుండి లేహ్ ప్రాంతంలోని చివరి టూరిస్ట్ ప్రాంతమైన తిక్ సె మోనా’ దర్శించుకోవడానికి వెళ్ళాం.
థిక్ సె మోనాస్తి లడక్ లోని అతి పెద్ద మానాస్టీల్లో ఒకటి. ఇది 11800 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాదాపు 12 అంతస్తులుగా ఉన్న ఈ మోనా’ పైకి ఎక్కడానికి కొంత ఆయాసపడ్డాం. ఎందుకంటే ఉదయం నుండి నిరంతరంగా ప్రయాణం చేయడం, చలీ ఇబ్బంది పెట్టాయి. ఈ 49 అడుగుల ఎత్తైన మైత్రేయ బుద్ధ విగ్రహం. 1970లో 14 దలైలామాచే ప్రారంభించబడ్డ ఈ రెండంతస్తుల విగ్రహంలో అతి ముఖ్య ఆకర్షణ.
చివరిదైన థిక్ సె మోనాస్టీ దర్శించుకొని లేహ్ లోని మా హోటల్ కి చేరుకొని మరుసటి రోజు తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యాం.
మరుసటి రోజు ఉదయం గడిచిన వారం రోజుల యాత్ర తాలూకు జ్ఞాపకాలతో అందరికీ వీడ్కోలు పల్కుతూ, ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాం. మధ్యాహ్నం వరకు నిరీక్షించినా ఆరోజు రావలసిన ఫ్లైట్ క్యాన్సిల్ అవడం మూలాన, (వాతావరణ పరిస్థితులు అని కొందరంటె, సాంకేతిక కారణాలు అని మరికొందరు చెప్పారు) మళ్ళీ తిరిగి మా హోటల్ కి వెళ్ళి ఆ మరుసటి రోజు ప్రయాణంతో మా లడయాత్ర సుసంపన్నమైంది.
జీవితంలో అత్యద్భుతమైన సాహసయాత్రగా, చిరస్మరణీయ జ్ఞాపకాలతో మాయాత్ర ముగిసింది.
1 comment
గొప్ప సాహస యాత్ర చేశారు శ్యామన్నా, మీ యాత్రా విశ్లేషణ మహా అద్భుతం. కళ్ళకు కట్టినట్టు వివరించడతో మేము మీవెంట యాత్రా భాగస్వామ్యం చేసినట్టుగా అనుభూతించాము.ఎంతోమంది యాత్రలు చేస్తుంటారు,ఏ ఒక్కళ్ళు ఇద్దరో మీలా విశ్లేషించ గలిగిన వాళ్లు.మీ దంపతులకు హృదయపూర్వక అభినందనలు. – పాలడుగు రత్నాకర్ రావు.