Home ఇంద్రధనుస్సు అనర్ఘ రత్నాల

లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు మం

జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరో

జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై

వెలయున్ భాగవతాఖ్య కల్పతర్వురిన్ సద్ద్విజశ్రేయమైభాగవతంలో పోతన

బమ్మెర పోతనామాత్యుని శ్రీ మదాంధ్ర మహాభాగవతంలోని అవతారికాపద్యమిది. మూలంలో గల సంస్కృత భాగవత వైశిష్ట్యాన్ని తెలిపే ఈ పద్యం తెలుగులోకి మహాకవి పోతనచే అనూదితం. భాగవతాఖ్య కల్పతరువనే మాటతో భాగవతం కల్పతరువు (వృక్షం)తో పోల్చబడి ద్వ్యర్థిలో రచించబడింది.

భాగవతార్థంలో పరిశీలిస్తే లలితాదేవి కాండంగా, శ్రీకృష్ణుడు తల్లివేరుగా, శుకమహర్షి ప్రవచించగా మనోహరత్వంతో శోభిస్తూ, దేవతలను తృప్తిపరుస్తూ, మిక్కిలి అందమైన కథతో, గొప్ప భక్తి ఫలాన్ని ఇస్తూ, స్వచ్ఛమైన కథకుడు వ్యాసమహర్షికి ఆలంబనై మంచివారికి (పుణ్యాత్ములకు) ఆశ్రయమిస్తున్నది. భాగవతమనే వృక్షార్థంలో పరిశీలిస్తే చిన్న చిన్న కొమ్మలతో, నల్లని మూలంతో కొమ్మపై వాలిన చిలుకుల పలుకులతో, చక్కని లతలు తనకాధారమై పైకి పాకగా, మంచి ఆకులు, పుష్పాలతో, గుండ్రని కాండంతో, చక్కటి పండ్లనిస్తూ, విశాలమైన మొదలుతో, అనేక పక్షుల కాశ్రయమైన చెట్టు భాగవతంలా శోభిస్తున్నది.

ఈ పద్యం శ్లేషసొబగుల్లో లలితాదేవి కాండంగా ఉండటమేగాక లలితమైన (కోమలమైన) అనే అర్థం వచ్చింది. “మూగురమ్మల మూలపుటమ్మ”ను పోతన విశేషంగా స్మరించినాడు. కృష్ణ శబ్దానికి శ్రీ కృష్ణపరమాత్మ, నల్లనైన కాండం అనే అర్థంతోబాటు “నల్లనివాడు పద్మనయనంబులవాడన్న మహాకవి వాక్యం స్మరణీయం. కృష్ణుడు నల్లనయ్య కదా! శుకమహర్షి భాగవతం పరీక్షిత్తుకు చెప్పినట్టుగా విశదమైన ఈ పురాణం చిలుక పలుకులవంటి మధురవాక్య శోభితమని అర్థం. “మంజులత” మంజులత్వమనే అర్థంలోనూ, మంజు – లత అనగా మనోహరమైన తీగలతో అల్లుకొన్నదని ద్వ్యర్థి జోడించబడింది. సువర్ణు లంటే దేవతలని, సుమనః అంటే మంచివారని, సుజ్ఞేయమంటే చక్కగా తెలుసుకొనబడవలసినదని భాగవత శోభను, తత్త్వాన్ని తెలిపి, మంచి ఆకులు, పువ్వులతో చక్కని వృక్షంగా తెలుసుకోవాలని సూచించబడింది.

వ్యాసమనే మాటకు వృక్షవ్యాసమనీ, జోడించబడి భాగవతంలో సంబంధం గల లలిత, కృష్ణ, శుక, వ్యాసులను, స్మరించి వృక్షార్థంలో శ్లేష సాధించడంలోనే ఈ పద్యం రాబడింది.

వృత్త శబ్దానికి కావ్యేతివృత్తం అనగా భాగవత కథ అని, చెట్టు చుట్టూ గల గుండ్రని తనం, ఫల శబ్దానికి పురాణశ్రవణ జనిత మోక్ష ఫలం, చెట్టు పండు అని, ద్విజ శబ్దానికి పండితుల శ్రేయస్సును, పక్షులకు ఆశ్రయమని ఇలా పది అంశాలు భాగవత వృక్షార్థాల్లో రెండర్థాల్లో శోభించడం ఈ పద్య విశిష్టత.

భాగవతం ఎంత లోతుగా తెలిస్తే ఈ పద్యం అంత అందంగా అర్థమవుతుంది. వృక్షం లక్షణం అందరికీ తెల్సిందే గదా!ఉత్తమ వృక్షంలా భాగవతం, భాగవతం వలె ఉత్తమ వృక్షం ఈ భూమిపై ప్రకాశిస్తోంది.

You may also like

Leave a Comment