Home ఇంద్రధనుస్సు అనర్ఘ రత్నాలు

ఉ.       వాడిమయూఖములం గలుగువాడ పరాంబుధి గ్రుంకె, ధేనువుల్

          నేడిట వచ్చే నేకతము, నిష్ఠమెయిన్ భవదగ్ని హోత్రముల్

          పోడిమి వేల్వగా బడియె, బ్రొద్దును బోయె, గచుండు నేనియున్

          రాడు, వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో (ఆది ప. 3-112)

ఈ పద్యం నన్నయ రాసిన గొప్ప పద్యాల్లో ఒకటి. ఆంధ్రమహాభారతంలో కచదేవయానిగాథ లోనిది. మృత సంజీవని విద్య కోసం శ్రతు శిబిరం నుండి అంటే దేవలోకం నుండి వచ్చిన కచుడు గురువు శుక్రునివద్ద శుశ్రూష చేసి విద్య పొందడమే లక్ష్యంగా ఉన్నాడే తప్ప మరో ఆలోచనలేదు. దేవయాని కచుని ఇష్టపడి, రాక్షసుల బారి నుండి రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండగా కచుడు గోవులను తీసికని మేపడానికి అడవికి వెళ్లినాడు. అతణ్ణి రాక్షసులు చంపివేసినారు. తిరిగిరాని కచుని కోసం ఎదురు చూసి, తండ్రితో పై విధంగా అన్నది.

సూర్యుడు అస్తమించినాడు. గోవులు కచుడు లేకుండా ఒంటరిగా తిరిగి వచ్చాయి. మీరు శిష్యులతో కలిసి సాయం కాలపు అగ్నిహోత్రాన్ని పూజించారు. బాగా పొద్దుపోయింది. కచుడింకా రాలేదు. అడవిలో క్రూరమృగాలు, సర్పాలు, రాక్షసుల నుండి ఏమైనా అపకారం జరిగిందేమో అని బాధపడిందని పై పద్యం తాత్పర్యం.

ఈ పద్యం వెనుక అనేక అర్థాలు నన్నయ నిక్షేపించాడు. అవన్నీ “లో నారసి” చూడాలి.

వాడి మయూఖములు (కిరణములు) కలవాడని ప్రారంభించబడిన పద్యంలో నిజానికి సూర్యుడస్తమించడని చెప్పుతోంది. మరి మధ్యాహ్న సూర్యుని ప్రచండత్వ ప్రస్తావన ఎందుకు? అదీ పద్య ప్రారంభంలోనే.

తండ్రి (శుక్రుని)కి సంబంధించిన సేవలు, ఆహారాదులు సమకూర్చి, మధ్యాహ్నం విశ్రాంతి లభించాక, తన ప్రియుణ్ణి గురించి ఆలోచనలు మొదలయ్యాయి. మధ్యాహ్న సూర్యుని నుండి అస్తమయ సూర్యునివరకు ఎదురు చూస్తున్నదని, క్షణక్షణం లెక్క పెట్టుకని కచుని రాకకై తపన పడుతుందనే అర్థం. మరింకా రాలేదంటే ఆర్తి మొదలైంది.

గతంలో సూర్యుడస్తమించినపుడోసారి, మరోసారి ఆవులను మేపుకని కొంచెం ఆలస్యంగా , మరోసారి అగ్ని హోత్రాదుల పూజలు ముగించేసరికి, మరోసారి ఇంకొంచెం పొద్దుపోయి, చీకటి అలుముకున్నాక కొంచెం ముందు వెనుకలుగా వచ్చినాడు. ఈసారి అన్ని రకాలుగా అన్ని దశలు దాటి నా కచుని జూడలేదని, ఆ దశలననినటిని వరుసగా ఎదురుచూస్తూ, ఐనా రాలేదని, దుఃఖంలో అన్ని సంఘటనలను ఏకరువు పెట్టింది.

ఈ సంఘటనల పరంపర గూర్చి ఇంకా చెప్పాలంటే సూర్యుడూ కచుణ్ణి పట్టించుకోకుండా అస్తమించాడు, ధేనువులూ కాపరిని (కచుణ్ణి) పట్టించుకోకుండా ఒంటరిగా తిరిగి వచ్చాయి, మీరూ ఆయనకు పట్టించుకోకుండా, మీమీ సాయం సంధ్యాగ్ని విధుల్ని నిర్వర్తించుకొన్నారని అర్థం. ఓ రకంగా తండ్రితో నిష్ఠూరాలాడిందని భావం.

క్రుంకె అంటే తనదారిన తాను (మునిగి) పోయాడని, ధేనువులు తమ దారిన తాము వచ్చాయని, మీ దారిన మీరు మీ పూజాదికములు నిర్వర్తించుకున్నారని, ఎవరూ ఆతని గూర్చి ఆలోచించలేరని వాపోయింది.

సూర్యుడస్తమించాడని మొదటిపాదం నిండా మహాకవి పరచినా, తిరిగి “పొద్దును పోయె” అన్న నుడికారంతో వచ్చే సమయం ఐపోయిందని స్పష్టపరచినాడు. లేకుంటే పునరుక్తి కాదా? అంతేకాదు అస్తమయాన్ని పునరుక్తి చేయడంలో దేవయాని ఆర్తి అధికమైందని నిష్కర్ష.

సూర్యుడు పోయాడంటే చిరువెలుగుల్లో మృగబాధలు, ధేనువుల రాకతో సంధ్య పూర్తి ఐందంటే రాక్షస బాధలు, అగ్నిపూజలైనా యంటే చిక్కటి చీకటిలో పాముల బాధలు మూడు దశలకు మూడు బాధలు క్రమాలంకారంగా భాసించాయి.

సూర్యునిలా కచుడు ఈమెను పట్టించుకోకుండా అస్తమించాడు. అంటే రాక్షసులు సంహరించారు. కోర్కెలు ధేనువులు. అవి కచుడు లేకుండా వచ్చినట్టే, కచుడు లేక – తీరని వైనాయి.  ఏకతమ శబ్ద ప్రయోగంలో ఒంటరితనపు దేవయాని మానసిక స్థితిని వ్యంజించినాడని గమనించాలి. కచుడు నిర్లక్ష్యపు ప్రియుడు. కచుని అభాంలో ధేనువుల్లా కోర్కెలు, విరహజ్వాలల్లో అగ్నిజ్వాలలు. కచుడు (చని)పోయాడని, ధేనువులు కోర్కెలా దేహం (ఇల్లు) చేరాయని, అగ్ని విరహంలా ప్రజ్వరిల్లిందని సూచించబడిన క్రియలు. అగ్నిజ్వాలలు విరహజ్వాలలకు సంకేతాలు. అవీ ప్రజ్వరిల్లాయి. అణగిపొయ్యాయి. ఇంటిలోనే కాదు దేవయాని వంటిలో జరుగుతున్న సంఘర్షణలకు గుర్తులు.

ఈ దశ ఇపుడే కాదు, కచుడు స్వర్గానికివెళ్ళి పోయాక కూడా జరిగింది. దేవయాని (దేవలోకానికి ప్రయాణించవలసినది అని శబ్దార్థం) దేవతలవలె సుఖలాలస హెచ్చింది. కచుడు మృతితో అమృతత్వం సాధిస్తే దేవయాన చేయవలసింది, దేవ గురువు పుత్రుని వెంబడి వెళ్ళలేక, తీరని కోర్కెలతో భూమ్మీదే ఉండిపోయింది. స్వధర్మాన్ని (మానవ ధర్మాలను) తిరస్కరించి, పరధర్మాన్ని (దేవతల ధర్మాలను, ఆ లోకాలను) ఆశ్రయించ బోయి తిరస్కృతయై విఫలమైంది.

అబిధార్థం తండ్రికి గోచరమైంది. వ్యంజన పాఠకులకు అందించాడు మహాకవి. ఆనంద వర్ధనుడు అలఁకార శాస్త్ర వాఙ్మయంలో ప్రతిష్ఠించిన వెనక అతనికి శత సంవత్సరం పిదప నన్నయ ఆవిర్భవించాడు. ధ్వనిని ఈ సందర్భంలో అనంగమించాడు. “గతోస్తమర్కః” అన్న వ్యంగ్యార్థ వాక్యం అలంకారశాస్త్రంలో ప్రసిద్ధం. “అస్తంగతః అర్కః” అనగా సూర్యుడస్తమించాడని దానికి ప్రకరణవశాత్తు అనేకార్థాలు ఉన్నాయని ఆ శాస్త్రవేత్తలు ఉదాహరిస్తారు. అది మనసులో సుప్రతిష్ఠం ఐన నన్నయ అర్కుని అస్తమయాన్నే వర్ణించి, తన పద్యంలో ధ్వని ఉందని నిశ్చయపరిచాడు.

ఈ పద్యం శిల్పంలో వైవిధ్యం కలది. ఏకవాక్య తాత్పర్యంతో ఉండే పద్యాలకు భిన్నంగా బహువాక్యభరితం. వాక్య పంచకం ఉంది దీంట్లో. నాలుగు క్రియలు భూతార్థకాలు. ఐదవ క్రియ ‘రాడు’, దేవయానికి సంభాషించేనాటికి భవిష్యదర్థకమే కాక, నిశ్చయార్థకమైనా “వాచమర్థోనుధావతి” ఐంది. ఆరవ క్రియ సందేహాన్ని, ప్రమాదాన్ని సూచించింది.

కచుడు అరణ్యానికి గోవులను మేపడానికి వెళ్లినంతసేపూ కుడు లేని గృహ సీమ ఆమెను విరహంతో బాధించింది. అందుకే పగలొనర్చిన పగటిరేడు బాధకుడై వాడి మయూఖముల వాడయ్యాడు. అస్తమించినపుడు కూడా సూర్యుడామెకు వాడి మయూఖములవాడే. అదే తొలి పాదం అర్థం.

కచుడు రాకున్నా ఎవరూ పట్టించుకోలేదని, ఇంకా ఆలస్యం చేస్తే రాత్రి గడిస్తే ప్రమాదమని, తాను పట్టించుకున్నట్టు బయటపడింది. జరిగిన క్రియలతో జరుగని పని తెలుపుటచే వస్తుధ్వని. మృగరాక్షస పన్నగ బాధలు ఆతడు పొంది ఉంటాడనే ఊహ నిజమే ఐంది. సహజ సాయంకాలవర్ణనలో అసహజమైన కచుని మృత్యువు అలంకార ధ్వని చెప్పక చెప్పిన తన విరహబాధ రసధ్వని. ఈ పద్యం లోనారసి చూస్తే అర్థ రత్నాలగని.

You may also like

Leave a Comment