– ఒద్దిరాజు మురళీధరరావు
ప్రపంచ విజ్ఞాన జిజ్ఞాసులై, స్వీయ ప్రతిభతో వివిధరంగాల్లో నైపుణ్యాలను సాధించి, సాహితీ రంగంలో తమ ముద్ర నిలిపిన బహుభాషా కోవిదులు, పట్టుదలతో తమ జీవితాలకు సాఫల్యత సాధించుకున్న అపురూప ఒద్దిరాజు సోదరుల వంశీయులు, అనువాద సాహితీ ప్రముఖులు, రచయిత ఒద్దిరాజు మురళీధరరావు గారితో మయూఖ ముఖాముఖి…..
1. మొదటగా మీరు పుట్టిన ఊరు, బాల్యం గురించి చెప్పండి.
జ: నా పేరు ఒద్దిరాజు మురళీధరరావు. మా అమ్మ, నాయన గార్లు శ్రీమతి వెంకట రామనర్సమ్మ. సీతారాం రావు గారు. వారి సంతానంలో నేను తొమ్మిదవ వాడిని. మొదట అక్కగారు తరువాత ఐదుగురు అన్నయ్యలు, తరువాత ఇద్దరు అక్కయ్యలు చివరగా నేను. నేను పుట్టినది అక్టోబర్ 23, 1933 ( శ్రీముఖ నామ సంవత్సరం, నాగపంచమి ). మావూరు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి. ఇప్పుడది మండలం అయింది. మాగ్రామం జనాభాలో రెండవది. మహబూబాబాద్ తాలూకాలో మొదటిది పెద్ద ముప్పారం. కానీ రెవిన్యూలో మా గ్రామమే పెద్దది. మాకు దగ్గరలో అంటే 11 కిలోమీటర్ల దూరంలో కేసముద్రం రైల్వేస్టేషన్, 22 కిలో మీటర్ల దూరంలో రోడ్డు మార్గంగా తొర్రూరు గ్రామం, 14 కిలోమీటర్ల దూరాన నెక్కొండ స్టేషన్. మొదట మాది వరంగల్ జిల్లా, మహబూబాబాద్ తాలూకా. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణాలో 33 జిల్లాలు ఏర్పాటు చేసినపుడు మాది జిల్లా అయింది. నా బాల్యంలో ఇనుగుర్తి పాఠశాలలోనే రెండవతరగతి, మాఅమ్మమ్మగారి వద్ద నర్సింహుల పేటలో మూడవతరగతి చదవడం జరిగింది. అప్పుడు ఇనుగుర్తి పాఠశాలకు శ్రీమాన్ వెలగలేటి కృష్ణమాచార్యుల గారు ట్రాన్స్ ఫర్ మీద వచ్చారని నన్ను ఇనుగుర్తికి తీసుకొచ్చారు. వారు నాకు ఇంగ్లీష్, ఉర్దూ ప్రైమరు బోధించి నాల్గవ తరగతిలో మంచి పునాది వేశారు. అందువలన పదవతరగతి వరకు ఎక్కడా ఫెయిల్ కాలేదు. రెండవక్లాస్ లో ఉతీర్ణుడనయినాను. హన్మకొండ జదీబ్ వస్తానియా, మల్టీపర్పస్ హైస్కూలులో చదవడం జరిగింది. మాకు పదవతరగతిలో కాలేజీ ప్రిన్సిపాల్ అహ్మద్ హుసేన్ గారు చాలా మంచి ఇంగ్లీష్ టీచరు. దాదాపు అందరూ మంచి ఉపాధ్యాయులే.
2. మీ ఉన్నత విద్యాభ్యాసం ఎలా జరిగింది? ఆ అనుభవాలు ఎటువంటివి?
జ: ఇంటర్ లో నేను బైపీసీ తీసుకున్నాను. ఇంగ్లీష్, సైన్సులలో పాసయ్యి రెండవ భాష ( సెకండ్ లాంగ్వేజ్ ) ఉర్దూలో 28/100 మార్కులతో ఫెయిల్ అయ్యాను. సప్లిమెంటరీలో 56/100 మార్కులతో పాస్ అయినాను ( ఒక్కొక్కసారి మార్కులు సరిగా వేయడం జరగదని నేను టాబులేషన్, స్క్రుటినీ చేస్తున్నప్పుడు అర్థమయింది. అప్పుడు రీకౌంటింగ్ ఎట్లు చేయించాలో తెలియదు. ఒక అబ్బాయికి 66 మార్కులు వస్తే 6 మార్కులు వేసి మెమో ఇచ్చారు. అతను రీకౌంటింగ్ చేయించుకుని ఉతీర్ణుడయినాడు. నేను ఖాళీగా ఉన్నందున ఖమ్మం జిల్లా కార్యాలయంలో క్లర్క్ గా చేరాను. మే చివరలో రిజైన్ చేసినప్పుడు జార్జు భట్ కలెక్టర్ భగవంతుడు ఇచ్చిన చిన్న ప్లేటును నిర్లక్ష్యం చేయవద్దని గిర్దావరుగా ప్రమోషన్స్ వస్తుంటాయని ప్రేమగా చెప్పారు. అయినా ఆ జాబు ఇష్టం లేకుండెను. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బి ఎస్ సి జాయిన్ అయినాను. అప్పుడు ఇంటర్ రెండు సంవత్సరాలు, డిగ్రీ రెండు సంవత్సరాలు బిఎస్ సి రెండు సంవత్సరాలు. డిగ్రీ సెకండ్ క్లాస్ లో పాసయ్యాను. ఎమ్మెస్సీ చేస్తే జాబులు సరిగా లేవని, ఇంటివద్దనే వ్యవసాయం చేస్తూ ఉండిపోయాను.
3. వ్యవసాయం చేస్తూ ఇంటివద్ద వున్న మీకు ఉద్యోగంవైపు దృష్టి ఎలా మళ్ళింది?
జ: ఆ సమయంలో మా మూడవ అన్నగారు గోపాలరావు గారు సర్పంచ్. పాలకుర్తి యాదగిరి అని ఒక సర్పంచ్ మా అన్నగారిని కలవడానికి వచ్చాడు. నన్ను చూసి మీవంటి వారు చదువుకున్నా గ్రామానికి ఏం లాభం చేయరు అని నాతో అన్నాడు. ఏం చేయాలో చెప్పామన్నాను. గ్రామ బాగోగులకు కొన్నిరకాల పనులు చేపట్టి గ్రామ ఆదాయం పెంచుకునేటందుకు జిల్లా పంచాయితీ ఆఫీసునుండి కొన్ని సూచనల కాగితాలు తెచ్చి ఇచ్చారు. కాణిచిట్టీ, అంగడి. అందులో నాకు అంగడి మంచిదనిపించి జిల్లా ఆఫీసునుండి అనుమతి తీసుకొని 1957 ఏప్రియల్ లో అప్పటి నిజాయితీ కాంగ్రెస్ నల్లపు పిచ్చయ్య గారితో, గ్రామ శాస్తుర్లు సీతారామయ్య గారిచేత పూజ చేయించి అంగడి ప్రారంభించాము. నన్ను దానికి సెక్రటరీగా నియమించారు. చాలా శ్రద్ధతో పశువుల మరియు ఇతర వస్తువుల క్రయ విక్రయాలు ఏర్పాటుచేశాము. ఇప్పటికీ పశువులు తక్కువే గానీ బట్టలు, ఇతర వస్తువుల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. అది గ్రామానికి మంచి ఆదాయం. అప్పుడు అక్కడి మాధ్యమిక పాఠశాల హెడ్మాస్టర్ వి. జనార్దన రావుగారు నాకు మంచి స్నేహితుడైనాడు. ఆయనగారి ఇంటికి ఒకరోజు మధ్యాహ్నం వెళ్లి ఉంటిని. అప్పుడు వారి ఇంటికి ఆయనగారి మిత్రుడు వరంగల్ నుండి వచ్చి ఉండెను. నన్ను అతనికి పరిచయం చేస్తూ బిఎస్ సి చేశాడని చెప్పాడు. ఆ మిత్రుడు వెంటనే నాకు ఇష్టమైతే వారి చిన్నాయన గారు బాజారు హనుమంతరావు గారి మహబూబియా స్కూల్లో సైన్సు టీచరు కొరకు అప్లికేషన్ ఇవ్వమన్నారు. పశువులకు ఆ సంవత్సరం నాగటి దున్నల రోగం వచ్చినందువలన బాగా నష్టం వచ్చింది. దాంతో వెంటనే జాబు చేయడం మంచిదనుకొని అప్లికేషన్ ఇచ్చాను. ఒక వారం రోజుల్లోనే అపాయింట్ మెంట్ లెటర్ వచ్చింది. వెంటనే వెళ్లి జాయిన్ అయినాను. నాకు ఎందుకో ప్రయివేట్ స్కూల్ కన్నా ప్రభుత్వ పాఠశాల బాగనిపించేది. ఏప్రియల్ చివర్లో వారే డిస్ కంటిన్యూ చేశారు. తర్వాత మీనం మేషం లెక్కిస్తూ మరల జూన్ లో జాయిన్ అవడానికి మే చివర్లో అప్లికేషన్ పంపాను. నేను రాననుకొని వేరే అతనికి అపాయింట్ మెంట్ లెటర్ పోస్టు చేసి, స్కూలుకు చేరగానే నా అప్లికేషన్ చేరి, హనుమంతరావు గారు కొంత విచారపడినారు. ఆ తర్వాత వెంటనే తొర్రూరు హైస్కూల్ కు సైన్స్ టీచరు కావాలని ఆ గ్రామస్తుడు A.V.B. హైస్కూలు టీచరు నన్ను కలిశాడు. మా గ్రామానికి 14 మైళ్ళు మాత్రమే ఉంటుంది తొర్రూరు. బాగానే ఉందని వెళ్లి జాయిన్ అయినాను. రెండు సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశాను.
4. టీచరు దశనుండి బయాలజీ లెక్చరర్ గా మీ ఉద్యోగ ప్రస్థానం కొనసాగిన క్రమాన్ని వివరించండి.
జ: నేను తొర్రూరులో టీచరుగా చేస్తున్నప్పుడు మహబూబాబాద్ హైస్కూలులో బయాలజీ టీచరు లేక చాలా ఇబ్బంది ఉండింది. అక్కడ నా స్నేహితుడు కె. ఇంద్రారెడ్డి టీచరు నాజాడ అక్కడి హెచ్. ఎమ్ కు చెప్పాడు. వారు వెంటనే నా అప్లికేషన్ తెప్పించుకొని జిల్లా అధికారి అనుమతితో నన్ను అక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. అప్పటి 12వ తరగతి పిల్లలకు బయాలజీలో 10,11,12 సంవత్సరాల కోర్సు బోధించాను. ఆ సంవత్సరం MBBS కు ముగ్గురు సెలెక్ట్ అయినారు. రెండవ సంవత్సరం 5,6 గురం టీచర్లం బెనారస్ లో ఇంగ్లీష్ ఎమ్.ఏ కొరకు స్టడీస్ మొదలు పెట్టాము. ఏవో కారణాల వల్ల రాఘవరావు గారు విరమించుకున్నారు. నేను, ఫిజిక్స్ టీచరు జి. రమణమూర్తిగారు మాత్రం బెనారస్ బయలుదేరాము. మా చదువు రైల్లోనే జరిగింది. ఇద్దరం నాల్గు పేపర్లలో మూడిట్లో పాస్ అయినాము. అతను ఇక లాభం లేదని డిపార్ట్మెంట్ కాండిడేట్ గా ఉస్మానియా యూనివర్సిటీకి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా పంపాడు. అతను చాలా సీనియర్, బిఎడ్ కూడా. నేను కూడా అప్లై చేశాను. నాకు సీనియారిటీ లేదని డైరెక్టర్ రిజెక్ట్ చేశారు. నాకు బీఎస్సీ బాటనీలో 55% ఉన్నందున వెంటనే యూనివర్సిటీ వెళ్ళి నా అప్లికేషన్ జనరల్ లిస్ట్ లో చూడవలసినదని లెటర్ యూనివర్సిటీకి రాశాను. నాకు సీటు వచ్చింది. 1964 లో ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ లోపాస్ అయినాను. ప్రాక్టీకల్స్ లో నా పర్ఫామెన్స్ మంచిగ ఉండి డా. ఎన్. రామయ్య లెక్చరర్ గారు నాకు లెటర్ రాసి న్యూ సైన్స్ కాలేజీలో వెకెన్సీ ఉందని తెలిపారు. నేను వెంటనే న్యూ సైన్స్ కాలేజీలో మోడల్ లెక్చర్ ఇచ్చాను. నన్ను జాయిన్ చేసుకున్నారు. నేను టీచరు సర్వీసుకు రిజైన్ చేయలేదు. ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ తరువాత వేసవిలో స్కూల్లో జాయిన్ అయినాను. దానివలన నాకు ఆ సర్వీసంతా కలిసి వచ్చింది. 1964 లో న్యూ సైన్స్ కాలేజ్, 1965 లో ఎన్. బి. కాలేజ్, సాయంత్రం అగర్వాల్ సైన్స్ కాలేజ్ లో మొదట లెక్చరర్ గా జాయిన్ అయ్యి 1992 వరకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా సేవలు చేశాను. అందరు స్టాఫ్ మెంబర్లతో, విద్యార్థులతో మంచిపేరు తెచ్చుకున్నాను. నాది 6 సంవత్సరాల స్కూల్ సర్వీసు, 28 సంవత్సరాల కాలేజీ సర్వీసు మొత్తం 34 సంవత్సరాల సర్వీసు కౌంట్ అయింది. చివరి సాలరీ పదివేలు ( నవ్వుతూ ) నెలకు. తరువాత 2 సంవత్సరాలు ప్రగతి కాలేజీ ఎల్బీనగర్ లో చేశాను. 1994 ఏప్రిల్ లో అమెరికా వెళ్ళి 9నెలలు ఉండి మా మొదటి మనుమడు శ్రీముఖ్ 21వ రోజు నామకరణోత్సవం చేసి ఇండియాకు తిరిగి వచ్చాము.
5. మీ కుటుంబం గురించి విశేషాలు చెప్పండి.
జ: మా అమ్మ, నాయనగారి సంతానం ఆరుగురు మగవారం, ముగ్గురు ఆడవాళ్ళు. నేను 9వ సంతానం. నేనే చివరివాడిని. నాకన్నా రెండున్నర సంవత్సరాలు పెద్ద అయిన సోదరి శ్రీమతమ్మ వరంగల్ వృద్ధాశ్రమంలో వున్నది. ఆమెకు భారత, భాగవతాలు క్షుణ్ణం. ఆశ్రమంలో ఉన్నవారికి చదివి వినిపిస్తుంటుంది. ఆమె ఒక్క దాని మటుకు సంతానం కలుగలేదు. 90% అందరి పిల్లలు సుఖ సంతోషాలతో వున్నారు. ఇక నాకుటుంబం దగ్గరకు వస్తే నాకు ముందు ముగ్గురు అమ్మాయిలు. తర్వాత ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయిలు ముగ్గురూ బాటనీ లెక్చరర్లుగా ఉద్యోగం చేసి రిటైర్ అయినారు. పెద్దమ్మాయి లక్ష్మీకుమారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు అమెరికాలో సెటిల్ అయినారు. రెండో అమ్మాయి రుక్మిణి. ఆమెకు ఇద్దరు కుమారులు. వారు కూడా అమెరికాలో వున్నారు. మూడో అమ్మాయి సీతాకుమారికి ఒక కుమారుడు డెంటిస్ట్. ఒక అమ్మాయి అమెరికాలో ఉంది. మా పెద్ద కుమారుడు విజయ్ కుమార్ వొలాంటే సాఫ్ట్ వేర్ కంపెనీ CEO. అతనికి ఒక కుమారుడు శ్రీముఖ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించాడు. కుమార్తె సారణి ‘పద్మ భూషణ్’ రుక్మిణీ అరండేల్ కళాక్షేత్ర ఫౌండేషన్ లో మూడు సంవత్సరాలు నాట్య శిక్షణ పూర్తి చేసింది. నా రెండవ కుమారుడు వేణు గోపాల్ పిహెచ్ డి ఫారెస్ట్రీలో. కానీ సాఫ్ట్ వేర్ జాబ్ అమెరికాలో. అతని భార్య డాక్టరు. వాళ్లకు ఇద్దరు కుమారులు పెద్దవాడు వినయ్. మంచి జాబ్ చేస్తున్నాడు. రెండవవాడు డిగ్రీ రెండవసంవత్సరం.
6. మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు సైన్సు కు సంబంధించిన రచనలు చేశారు..ఆ రేడియో ప్రసంగాల అనుభవాలు చెప్పండి
జ: నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ మరియు హిందూ పత్రికల్లో వచ్చిన పర్యావరణ వ్యాసాలు చదివి తెలుగు లోకి అనువదించేవాడిని. నా మిత్రుడు డా. పి.ఎల్.కె. ఎమ్.రావు నన్ను ఆల్ ఇండియా రేడియోకు పరిచయం చేశారు. దాదాపు 60 ప్రసంగాలు చిన్నవి, పెద్దవి కలిసి చేశాను రేడియోలో. ఉర్దూలో కూడా అడవుల ప్రాముఖ్యత గురించి ప్రసంగాలు ఇవ్వడం, వ్యాసాలు కూడా రాయడం చేశాను. ప్రసంగాలు ఇచ్చేటప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమయ్యేరీతిలో సామాన్య తెలుగులో ఇచ్చేవాడిని. మావూరి వారు నాతో ఆ ప్రసంగాలలోని విశేషాలను చెప్తుండేవారు. ఆ ప్రసంగాలనే విశాలాంధ్ర వారు పుస్తకం ప్రచురించారు. “పరిసరాలు, విజ్ఞానం” అదే నా మొదటి పుస్తకం.
7. మీరు హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
జ: 1946 లో హైదరాబాద్ కు నేను మొదటిసారి వచ్చినప్పుడు నాకొక వింత కనిపించింది. అదేంటంటే రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ గారు ప్రతీరోజు సాయంత్రం 5 గంటలకు కింగ్ కోఠీ నుండి చార్మినార్ అవతల మక్కా మసీదుకు నమాజు కొరకు వెళ్ళేవారు. ఆ సమయంలో పోలీసుల సీటీ మోతలు. రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ ను నిలిపివేసేవారు. అందరూ ఆ ప్రయాణాన్ని గొప్పగా చూసేవారు. ఆ పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి కీ. శే. బూర్గుల రామకృష్ణారావు గారు నిలిపివేశారు. మొదటిసారిగా మనుషులు గుంజే రిక్షాలను చూశాను. నిజాం ప్రభుత్వ ప్రభావం వలన ఉర్దూ ఎక్కువగా మాట్లాడేవారు. క్రమ క్రమంగా పరిస్థితులు మనకనుకూలంగా మారుతూ తెలుగు మాట్లాడడం మొదలైంది. రద్దీ తక్కువగా ఉండేది. చాలావరకు కాలినడకే. మరీ దూరం అనుకుంటే లాగే రిక్షాలపై వెళ్లడం. వారిని అలా చూడడం చాలా బాధగా ఉండేది. రాను రాను మాములు రిక్షాలు, ఆ తరువాత ఆటోలు ఇలా వాహన సదుపాయం పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ అన్ని వైపులా బాగా విస్తరించింది. అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు ముఖ్యంగా గచ్చిబౌలి వైపు ఆకాశహర్మ్యాలు వెలిశాయి. 24 అంతస్తులు ఎత్తులో, అడ్డంగా, 24 పోర్షన్లతో..అప్పుడు ఇవన్నీ ఊహకందని విషయాలు.
8. ఒద్దిరాజు అనే పేరు వింటేనే ఒక సాహితీ వాతావరణం దృగ్గోచరమవుతుంది. మీ పూర్వీకులు, తెలంగాణాలో సుప్రసిద్ధ కవులు, రచయితలు అయిన ఒద్దిరాజు సోదరుల గురించి వివరించండి..
జ. ఒద్దిరాజు సోదరులు ప్రతిభావంతులు. వారు బహుభాషాకోవిదులు. అన్ని భాషలు స్వయంకృషితో నేర్చినవే. ఆంగ్ల ఓవర్సియరు వద్ద ఇంగ్లీష్ ప్రైమరు, ఆయన ట్రాన్స్ఫర్ తరువాత మానుకోట డాక్టరు సలహాతో ఆంగ్లపత్రికలు చదవడం, అట్లు నేర్చుకొని రవీంద్రుని ‘wreck’ ఆంగ్ల నవలని తెలుగులోకి అనువదించారు. ఇది చాలా గొప్ప విషయం. రాత్రిళ్ళు గస్తీ చేసే గుఱ్ఱపు సవార్ల వద్ద ఉర్దూ మొదలు పెట్టారు. వారి ట్రాన్స్ఫర్ తో “లొగాత్ కిశ్వరీ “డిక్షనరీ తెప్పించుకొని ఉర్దూ నేర్చారు. మేక చర్మాల వ్యాపారి తమిళుని వద్ద ఆయనకు తెలుగు నేర్పుతామనే వాగ్దానంతో తమిళం నేర్చారు. ఆ వ్యాపారి మాత్రం పనుల మూలంగా తెలుగు నేర్చుకోలేకపోయాడు అది వేరే సంగతి (నవ్వుతూనే). సోదరులిద్దరూ డాక్టర్లు, ఇంజనీర్లు, పండితులు, కవులు, అనువాదకులు జర్నలిస్టులు. 1922 నుండి 1927 వరకు తెనుగు పత్రికను పల్లెటూరు నుండే నడిపించారు. అది వారపత్రిక. గ్రామానికి పోస్ట్ ఆఫీస్ తెప్పించారు. వడ్లగిర్నీ, వేరుశనగ తీసే మరలు ఏర్పాటు చేశారు. ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి పరీక్షలు ఉతీర్ణులైనారు. గ్రామఫోన్, హార్మోనియం, ఫిడేలు, వయోలిన్, సైకిల్, టార్చ్ లైట్ తెచ్చి అందరికీ పరిచయం చేయించారు. వారి బంగ్లాకు బ్యాటరీల సహాయంతో ఎలక్ట్రిక్ లైట్లు, నల్లాలు ఏర్పాటుచేసి బంధువులను ఆశ్చర్యపరిచారు. గృహప్రవేశ సమయంలో వచ్చిన అతిథులకు ఇడ్లీలు అల్పాహారంగా పెట్టడం ఆనాటి జనులు ఊహించలేని విషయం. సోదరులలో పెద్దవారు కట్టించిన బిల్డింగులో ఒక వైపు పసుపు పచ్చ కాగితంపై పైనుండి క్రిందికి ఒద్దిరాజు సీతారామచంద్రరావు అని రాయడం నేను స్వయంగా చూశాను. దాని ప్రకారం సిమెంటుతో ఆ అక్షరాలు కట్టించారు. అప్పుడు నేను నాల్గవ తరగతిలో ఉంటిని. వారి గొప్పతనమంతా డా. కొండపల్లి నీహారిణి తన పిహెచ్ డి లో వివరించింది. ముఖ్యంగా అటువంటివారు అరుదే. ఆచార్య రామరాజు గారు అన్నట్లు వారు 64 కళల్లో ఒక చౌర్యం తప్ప అన్నింటిలో నిష్ణాతులు.
9. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను, లియో టాల్ స్టాయ్ కథలను అనువదించారు. వాటిపై దృష్టి సారించడానికి కారణం ఏమిటి? అనువాద సాహిత్యంలో మీ పాత్ర ఎటువంటిది?
జ : కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. వాటిని చదివినప్పుడు ఆ కథలు తెలుగు వారు చదవాలనే ఉద్దేశ్యంతో అనువదించాను. రవీంద్రుని కథల పుస్తకం ఆంగ్లంలో ఉన్నది దొరికింది. దానిని తెలుగువారికి అందుబాటులోకి తేవాలని అనువదించి పుస్తకం ముద్రింపచేశాను. ‘కాబూలీవాలా’ చాలా గొప్ప కథ. లియో టాల్ స్టాయ్ కథలు “అందరి దేవుడు ఒకడే” అనే పేరుతో పుస్తకం ముద్రింపచేశాను. దానిలో ముఖ్యంగా “మనిషికి ఎంత భూమి కావాలి” “మానవజీవితం-దైవ నిర్ణయం” మొదలగు ఎన్నో కథలు నీతివంతమైనవి. అలాగే నాకు ‘సంత్ దర్శన్’ అనే ఆంగ్ల పుస్తకం దొరికింది. దాంట్లోని గొప్పవాండ్ర చరిత్రను “భక్తాగ్రేసరులు” అని తెలుగులోకి అనువదించి ముద్రింపచేశాను. అదే మాదిరి పన్నిద్దరాళ్వాల దివ్య సంగ్రహచరిత్ర పుస్తకం ముద్రింప చేశాను. ఒకసారి మా మనవడి పుస్తకాల రాక్ లో “Bed time stories” బుక్ కనబడింది. దానిలోని కథలన్నీ చదివి, ఆ రైటర్ అనుమతి తీసుకొని ‘పాడేపక్షులు’ పుస్తకంగా అనువదించి ముద్రింపచేశాను. వాటి సేల్స్ కొరకు ‘పాలపిట్ట’ పత్రిక సంపాదకుడు గుడిపాటి వెంకటేశ్వర్లు గారికి అప్పగించాను. ముఖ్యంగా నా పుస్తకాలన్నీ ఆంగ్లం నుండి అనువదించినవే. ఇలా నచ్చిన పుస్తకం ఏదైనా ఉంటే అనువాదం చేస్తుంటాను.
10. ఠాగూర్ ‘ది రెక్’ నవల ‘నౌకాభంగం’ అనే పేరిట ఒద్దిరాజు సోదరుల చేత అనువదించబడింది. చాలాకాలం తర్వాత గానీ అది ముద్రణకు నోచుకోలేదు. దాన్ని అచ్చులో చూడాలని మీరు ఎంతగానో తపించారు. అది పుస్తకరూపంలోకి రావడానికి ఎలాంటి పరిస్థితులు దోహదం చేశాయి?
జ: కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. వాటిని చదివినప్పుడు ఆ కథలు తెలుగు వారు చదవాలనే ఉద్దేశ్యంతో అనువదించాను. రవీంద్రుని కథల పుస్తకం ఆంగ్లంలో ఉన్నది దొరికింది. దానిని తెలుగువారికి అందుబాటులోకి తేవాలని అనువదించి పుస్తకం ముద్రింపచేశాను. ‘కాబూలీవాలా’ చాలా గొప్ప కథ. లియో టాల్ స్టాయ్ కథలు “అందరి దేవుడు ఒకడే” అనే పేరుతో పుస్తకం ముద్రింపచేశాను. దానిలో ముఖ్యంగా “మనిషికి ఎంత భూమి కావాలి” “మానవజీవితం-దైవ నిర్ణయం” మొదలగు ఎన్నో కథలు నీతివంతమైనవి. అలాగే నాకు ‘సంత్ దర్శన్’ అనే ఆంగ్ల పుస్తకం దొరికింది. దాంట్లోని గొప్పవాండ్ర చరిత్రను “భక్తాగ్రేసరులు” అని తెలుగులోకి అనువదించి ముద్రింపచేశాను. అదే మాదిరి పన్నిద్దరాళ్వాల దివ్య సంగ్రహచరిత్ర పుస్తకం ముద్రింప చేశాను. ఒకసారి మా మనవడి పుస్తకాల రాక్ లో “Bed time stories” బుక్ కనబడింది. దానిలోని కథలన్నీ చదివి, ఆ రైటర్ అనుమతి తీసుకొని ‘పాడేపక్షులు’ పుస్తకంగా అనువదించి ముద్రింపచేశాను. వాటి సేల్స్ కొరకు ‘పాలపిట్ట’ పత్రిక సంపాదకుడు గుడిపాటి వెంకటేశ్వర్లు గారికి అప్పగించాను.ముఖ్యంగా నా పుస్తకాలన్నీ ఆంగ్లం నుండి అనువదించినవే. ఇలా నచ్చిన పుస్తకం ఏదైనా ఉంటే అనువాదం చేస్తుంటాను.
11. ఒద్దిరాజు సోదరుల పుస్తకాల ఆవిష్కరణ సభల్లోమీ కృషి చాలా ఉందని అంటుంటారు… ఆ అనుభవాలను కొన్నింటిని మాకోసం…
జ: ఒద్దిరాజు సోదరులు నాకు చిన్నాన్నలు అవుతారు. ఇంతకుముందే చెప్పుకున్నట్లు ‘రెక్’ నవల మా అక్క కోరిక మేరకు ఆవిష్కారానికి నేను ప్రయత్నం చేసి సాధ్యం చేసుకున్నాము. అదేవిధంగా చిన్నవారైన రాఘవ రంగారావు కూతురు రంగరాజు పద్మజ (నాకు చెల్లెలు) వాళ్ళ నాన్నగారి శతజయంతి వేడుకలు జరపాలని తన కోరిక తెలిపింది. దాని కొరకు కోదాటి నారాయణ రావు గారిని కలిశాను. ఆయన “వారు అన్ని పనులు కలిసి చేశారు కాబట్టి ఇద్దరికీ కలిపి శతజయంతి వేడుకలు జరపాలని” ఆన్నారు. ఆయన సలహా మేరకు రామరాజు గారిని కలవడం, ఆయన రచించిన “తెలుగు సాహిత్యోద్ధారకుల” గ్రంథంలో ప్రస్తావించిన ఒద్దిరాజు సోదరులకు సంబంధించిన వ్యాసాన్ని చూపడం జరిగింది. దర్భా శేషాచార్యులతో విషయం చెప్పగానే కోవెల సంపత్కుమారాచార్యులు గారు, కోవెల సుప్రసన్నాచార్యులు గార్లతో సంప్రదించి ప్రణాళిక ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆ సందర్భంగా ఇనుగుర్తి, హైదరాబాద్, వరంగల్ లో మూడు సమావేశాలు నిర్వహించాము. అయితే ఒద్దిరాజు వారు రచించిన పుస్తకాలు దాదాపు వందకు పైగా ఉంటాయి. అముద్రితాలైన వ్రాత ప్రతులు జీర్ణస్థితికి వచ్చాయి. వారి కుమారులు డా.వేంకట నరసింహారావు గారు బైండింగ్ చేయించారు. ఆయన కుమారుడు సుభాష్ చంద్రరావు ( సీతారామ చంద్ర రావు గారి మనుమడు) వాటి ముద్రణ కోసం వాటన్నింటినీ నాకు అందించాడు. క్రమంగా వాటిని ముద్రించాలనుకున్నాం. ఇట్లా అనేక పుస్తకాలను ఆవిష్కరించాము. అయితే ఇదంతా జరగడానికి కారణం వారి కుటుంబీకులే. వారు ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టి ఈ రోజు మనకు ఒద్దిరాజు సోదరుల సాహిత్యాన్ని మనకు అందించారు. అంత గొప్ప సేవ చేసిన సోదరుల గురించి చాలామందికి తెలియక పోవడం దురదృష్టకరం.
12. సుధామూర్తి గారి అమ్మమ్మ కథలు అనువాదం చేశారు కదా..మయూఖ పత్రిక బాల సాహిత్యంలో చదివాను.. వాటి గురించి వివరిస్తారా?
జ: సుధామూర్తి గారి అమ్మమ్మ సంచీలోని 22 కథలను అనువదించాను. వారి ఇంతకు ముందే అలకానంద, విజయవాడ పబ్లిషర్సుకు అనుమతించారు. కాబట్టి నాకు పర్మిషన్ రాలేదు. అవే కథలు డా. కొండపల్లి నీహారిణి తన మయూఖ ఆన్ లైన్ పత్రికలో ప్రచురిస్తున్నది..
13. ఇతర పత్రికలలో మీ రచనలు ఏవైనా వచ్చాయా? ఇంకా కూడా ఏమైనా రచనలు చేస్తున్నారా?
జ: నా వ్యాసాలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఉర్దూ సియాసత్, సైన్స్ కీ దునియాలో ప్రచురించబడినాయి. నేను ఒకసారి అడవుల ప్రాముఖ్యత ( జంగల్ కి మహ ఫూజ్ కిస్ లియే ) రేడియో టాక్ ఇచ్చినాను. మా గ్రామానికి దగ్గరలో సీతారాంపురంలో ఒక ఈతచెట్టు వంగడం, లేవడం దినచర్య గురించి నేను స్వయంగా వెళ్ళి 24 గంటలు అక్కడనే ఉండి చూసి ఆ సమాచారం ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,సియాసత్ లో ప్రచురింపచేశాను. నేను రిఫర్ చేసిన పత్రికలు హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాత్రమే. మరో విషయం. మా సహాధ్యాయి, పండితులు శ్రీమాన్ వెలగలేటి నర్సింహాచార్యుల వారి జ్ఞాపకార్థం ఒక పుస్తకం ప్రచురించాలనే ఉద్దేశ్యంతో పూర్వ విద్యార్థులు, శిష్యులు, అభిమానులు “స్మృతి కదంబం” అనే పేరుతో పుస్తకాన్ని ముద్రింప చేశారు. నర్సింహాచార్యులు గారు గొప్ప పండితులు. ఉపన్యాసకులు. శిష్యులు, అభిమానులు, వారి కుమారులు రచించిన వ్యాసాలు ఇందులో పొందు పరచబడ్డాయి. జ్ఞాపకం ఉంచుకోదగిన వ్యక్తి. ఆ ప్రచురణకు నేను ఒక సంపాదకుడిని. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నవంబర్ 2016లో ముద్రించబడింది. నా ఆర్టికల్ కూడా దాంట్లో ఉంది. వారి ముగ్గురు అబ్బాయిలు డాక్టర్లు. వారి పెద్దబ్బాయి డా. రాఘవాచారి మానుకోట పాఠశాలలో నా శిష్యుడు. అతను మొత్తం కుటుంబాన్ని పైకి తీసుకువచ్చాడు. చాలా ఉత్తముడు. ఇంకో గొప్ప అనుభూతి చెప్తాను. రామరాజు గారు ఏడుగురు పండితుల గొప్పదనాలను తెలుపుతూ ” తెలుగుసాహిత్యోద్ధరకులు” అనే పుస్తకం వేశారు. అందులో ఒద్దిరాజు సోదరుల విషయాన్ని ప్రత్యేకంగా ముద్రిస్తే బాగుంటుంది అని ఆయన నాతో అన్నారు. అది ఆవిష్కరణ త్యాగరాయ గాన సభలో జరిగింది. అక్కడికి ద్వానా శాస్త్రి వచ్చారు. ఆయన అప్పటికి నాకు తెలియదు. ఆయనకు అప్పుడు 62 ఏళ్ళు. ఆ సందర్భంగా ఆయన 62మంది తెలుగు పండితులను ఒక్కచోట చేర్చి పుస్తకం వేయాలని సంకల్పించారు. “మీ చిన్నాన్నల గురించి 8 పేజీలు రాసి వారం రోజుల్లో ఇవ్వగలరా” అని అడిగారు. నేను సరేనని 4 రోజుల్లో ఇచ్చాను. ( పెద్దగా నవ్వుతూ ‘బికారీ కీ భూక్ కీ ఫికర్’ అన్నట్లు…బిచ్చగాడు ఎప్పుడూ ఆకలికి అలమటిస్తున్నట్లు నాకు రాయడం ఇష్టం కాబట్టి ఎవరు అడిగినా ఆలస్యం లేకుండా రాయడం ). ద్వానా శాస్త్రిగారు కాలక్రమాన్ని అనుసరించి వరుసగా పండితులను పరిచయం చేస్తూ ‘మా నాన్నగారు’ అనే పేరుతో ప్రచురించారు.
నేను పత్రికలు, ఇతర పుస్తకాలు చదువడం, వ్యాసాలు రాయడం చేస్తూ ఉంటాను. ఇప్పటికి ఎనిమిది పుస్తకాలు రాశాను. ఒక్క మా అమెరికా యాత్ర తప్ప మిగిలిన ఏడు పుస్తకాలు ఆంగ్లం నుండి అనువదించినవే. ఇక ప్రస్తుతం నా ఆత్మకథ రాయాలని సంకల్పించి మొదలు పెట్టాను. అదీగాక షేక్ స్పియర్ రచనల్ని అనువాదం చేయాలని ఉంది. చదవడం, రాయడమే కదా నా పని..( నవ్వుతూ ).
14. అమెరికాలో ఉన్నప్పుడు ఆ విశేషాలతో పుస్తకం రాసారని విన్నాం..దానికి ప్రేరణ ఏమైనా ఉందా?
జ: 1994లో నేను, నా సతీమణితో యుఎస్ ఏకు మా పెద్దబ్బాయి 6 నెలల కొరకు వద్దకు వెళ్ళి, మనవడు కలగపోతున్నందుకు ఇంకో 3 నెలలు పొడిగించుకొని నామకరణోత్సవం చేసి తిరిగి వచ్చాము. అయితే మేము వెళ్లేముందు మిత్రుడు దర్భా శేషాచార్యులు గారు మేము బేగంపేటలో అడుగు పెట్టినప్పటినుండి తిరిగి బేగంపేటలో అడుగు పెట్టేవరకు మా అన్ని అనుభవాలు పూస గుచ్చినట్లు తెలపాలని కోరారు. ఆ ప్రకారం మేము లెటర్స్ రాశాము. అవి ఆ దేశాన్ని చూసేవారికి గైడుగా ఉన్నాయని, ప్రింటు చేస్తే బాగుంటుందని మిత్రులు సలహా ఇవ్వడంతో “మా అమెరికా యాత్ర” అనే పేరుతో ప్రింటు చేయించాము. ఈ మధ్యనే రెండవ ప్రింటు కూడా చేయించాము. అది చదివినవారికి దాదాపు ఆ ప్రదేశాలు చూస్తున్న తృప్తి కలిగిందనేవారు. నేను, నా సతీమణి ఇప్పటికి ఐదుసార్లు అమెరికా వెళ్ళి వచ్చాము. మొదటి ట్రిప్ వలె మిగతా నాలుగు ట్రిప్పుల సమాచారం పుస్తకరూపంలో చేయాలని ఉంది.
ఇక్కడ ఒక విషయం తెల్పాలి. నేను మానుకోట హైస్కూల్ లో పనిచేస్తున్నప్పుడు శ్రీమాన్ వెలగలేటి నర్సింహాచార్యుల గారు గొప్ప తెలుగు మాస్టరు గారు. వారి పెద్ద కుమారుడు కుమారుడు రాఘవాచారి. తెలివైన వాడు. 11th, 12th లో అతనికి టీచరును. ఆ తర్వాత ఆయన పి.పి.సి హైదరాబాద్ లో చేరాక కూడా నా వద్దకు వస్తుండేది. అతను ఎమ్ బిబిఎస్ చేశాక రెండు సమస్యలు. ఒకటి అమెరికా డాక్టరుగా వెళ్ళడం, రెండవది మిలిటరీ జాబు. నా వద్దకు వచ్చి ఏది బాగని అడిగాడు. “మిలీటరీలో చేరితే నీ కుటుంబం బాగానే ఉంటుంది కానీ తమ్ములకు, కుటుంబానికి మాట తప్ప సహాయం చేయలేవు. అదే అమెరికాకు వెళ్ళితే మొత్తం కుటుంబాన్ని పైకి తీసుకురాగలవని” భగవంతుడు నాతో చెప్పించాడు. అందుకు వారి తండ్రిగారు నామీద కొద్దిగా అసంతృప్తి చెందినాడు. కారణం రాముడు అడవికి పోతుంటే దశరథునికి మనస్తాపం కలిగినట్లు. ఏదైతే ఏం? చాలా బుద్ధిమంతుడు. మొత్తం కుటుంబాన్ని ఆదుకున్నాడు. అందరు తమ్ముల అభివృద్ధికి తోడుపడినాడు. అతను వెళ్ళాడు కాబట్టి మా పెద్దన్నయ్యగారి రెండవకుమారుడు లక్ష్మణ్ రావును ధైర్యంగా అమెరికా పంపించాము. అతను అక్కడ ఉన్న ధైర్యం మీద నా పెద్ద కుమారుడు విజయ్ కుమార్ ను, అతను ఉన్నాడని మా రెండవ అబ్బాయి వేణు గోపాల్ ను పంపించాను. ఇప్పుడు దాదాపుగా ప్రతీ కుటుంబం నుండి ఒకరో, ఇద్దరో వెళ్తున్నారు. ఆర్థికంగా, మంచిగా సెటిల్ అవుతున్నారు.
15. ‘భక్తామృతం’ ఆధ్యాత్మిక పత్రికలో మీ రచనలు చాలా వచ్చాయి. వాటిలో మీరు భావావేశం పొందినవి ఏమైనా ఉంటే చెప్పండి.
జ: ‘భక్తామృతం’ మాసపత్రికకు 2021 నుండి నాకు నచ్చిన వ్యాసాలు రాస్తున్నాను. స్వామివారు ఇష్టపడుతున్నారని ఒద్దిరాజు వారి వ్యాసాలు ఎక్కడ అని అడుగుతుంటారని ఎడిటర్ డా.జి. మోహనా చార్యుల వారు అంటుంటారు. ఒకరోజు సుల్తాన్ బజార్ లోని గ్రంథాలయంలో పుస్తకాల ఆవిష్కరణ గురించి వెళ్ళినపుడు స్వామి వారు మే 25వ తేదీన నన్ను దీవించుటకు విజయవాడ నుంచి వేంచేశారు. నా గురించి నాల్గు మంచి మాటలతో పొగుడుతుంటే నేను అంత అర్హుడినా యని తలవంచుకున్నాను. అది వారు నాపై చూపిన కరుణ. ఆ సందర్భంలో నేను పొందిన ఆనందం, అనుభూతి అంతా ఇంతా కాదు
16. మీరు చేసిన ఉత్తర భారతదేశ యాత్ర గురించిన అనుభవాలు ఎటువంటివి?
జ: మా స్నేహితుడు కళకుంట్ల అళహ సింగరాచార్యులు ప్రతీ సంవత్సరం ఉత్తర భారదేశ యాత్రకు బస్సు ఏర్పాటు చేసి తన భార్యతో సహా బయలుదేరేవారు. 1993 లో నేను, నా సతీమణి, ఇంకా నాకు తెలిసిన 3 జతల మిత్రులు, మిగతావారిలో పర్కాల తాలూకా శనిగరం గ్రామ ఆచార్యుల రెండు కుటుంబాలు కలిసి 35 రోజుల ప్రయాణం ఏర్పాట్లతో 55 మంది ప్రయాణీకులం ఉన్నాం బస్సులో. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా మా ఇంటి అల్లుడు డా.సి. ఎల్. నర్సింహారావు గారు జ్వరం, వాంతులు, విరేచనాలకు, నొప్పులకు మందులు రాసి ఇచ్చారు. హన్మకొండ నుండి గమ్యం బద్రీనాథ్, కేదారినాథ్. మొదటిరోజు గడిచింది. రెండవరోజు నుండీ ప్రయాణీకులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. నేను వెంటనే బాధితులకు నా వద్ద నున్న మందులు, నిమ్మకాయనీళ్ళు, పంచదార కలిపి ఇస్తూ ఆరోగ్యం నిమ్మళపడేట్లు చేశాను. ఒకరి తర్వాత ఒకరు దాదాపు 20 మంది వరకు అవస్థపడి నెమ్మదిగా కోలుకున్నారు. మందులు అయిపోయిన కొద్దీ ఏ సిటీ వస్తే ఆ సీటులో మందులు మరల కొని భర్తీ చేసుకునేవాణ్ణి. ఒక్కోసారి మందులు బ్యాగునుండి తీయడం ఆలస్యం అవుతుందన్న భయంతో సీటులో పక్కనే పెట్టుకునేవాడిని. నా భార్య కూడా నాకు ఓపికగా సహాయపడింది. ఇక మధ్యప్రదేశ్ లో ప్రయాణం జరుగుతున్నప్పుడు వయసులో పెద్దవారైన ఒక ఆచార్యులు సంస్కృతంలో వారి బాధ చెప్పడం, నాకు అర్థం కాకపోవడం. తీరా ఏంటంటే ఆయనకు కలిగిన బాధకు తనను అక్కడే వదిలేసి పొమ్మంటున్నారు ఆయన. కానీ వారికి ధైర్యం చెప్పి తగిన మందులు ఇచ్చి ఊరట కలిగించాను. ఇటువంటిదే మరొక కేసు. మా పరమ మిత్రుడు వెలగలేటి శ్రీనివాసాచార్యుల వారు బద్రీనాథ్ లో వేరొక గది తీసుకుని పడుకున్నారు. ఆ అర్ధరాత్రి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతూ నన్ను లేపడానికి మోహమాటపడి చివరకు తప్పక లేపారు. మందులు ఇచ్చాను. కానీ బాగా నీరసపడినారు. తెల్లవారే మా తిరుగుప్రయాణం. ఆయన నడవలేకపోతుంటే బుట్టలో కూర్చుండ బెట్టుకొని మనిషి మోతతో బస్సువద్దకు చేర్చాము. ఆయన బస్సు తీసినాయనకు బావమరిది. భోనగిరి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్. మొత్తానికి అందరం క్షేమంగా హన్మకొండ చేరారు. మేము మాత్రం భద్రాచలంలో దిగి దైవ దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చాం. ఎవ్వరి దగ్గరా మందులకు డబ్బులు తీసుకోలేదు. ఆ రోజుల్లో నాకు 600 రూ. ఖర్చు అయ్యాయి. వాటికంటే కూడా సమయానికి వారికి నాకు తోచినంతలో సహాయపడ గలిగానని తృప్తి కలిగింది. అంతా భగవంతుని దయ. ఒకనాడు బద్రీనాథ్ లో నది పక్కన శనిగరం ఆచార్యులు తిరుమణి కాపు చేసుకుంటున్న వారి ఫోటో తీసి పోస్టులో పంపాను. వారు ఎంతో సంతోషించారు. ఆ కాలంలో అది ఒక ప్రత్యేకం. ఇవన్నీ మరపురాని గుర్తులు. ఇక గయ, బద్రీనాథ్ లలో సంప్రదాయబద్ధంగా పితరులకు పిండ ప్రదానాలు కూడా చేసాం.
17. మీ ఉద్యోగ జీవితంలో విద్యార్థులను ప్రోత్సాహపరచినట్లు మీకు తెలిసినవారి విషయంలో కూడా చదువు గురించి ప్రోత్సాహపరచిన మరచిపోలేని అనుభూతి ఏమైనా ఉంటే చెప్పండి..
జ: డాక్టర్ సి.ఎల్. నరసింహారావు చాలా సహృదయులు. సాహితీప్రియులు కూడా. ఆయన ఎన్నో పద్యాలు, శ్లోకాలు అనర్గళంగా చదువుతారు. ఆయన నాకు వరుసకు అల్లుడు అవుతారు (ఒద్దిరాజు సీతారామచంద్రరావు మనవరాలుకు భర్త).నాకంటే సంవత్సరమే పెద్ద. కాబట్టి ఎంతో సన్నిహితంగా మెలిగేవాళ్ళం. ఒకళ్ళనొకళ్ళం మామూసాబ్ అని పిలుచుకునేవాళ్ళం. వాళ్ళు హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారింటికి తరచూ వెళ్తుండడం వల్ల పిల్లలతో కూడా చనువు ఏర్పడింది. వారి రెండవ కుమారుడు వేణు అతడు వరంగల్ కాలేజీలో ఫిషరీస్ కోర్స్ పూర్తి చేశాడు. ఎమ్ ఎస్ సి గురించిన విచారం మొదలైంది. అతనికి సౌరాష్ట్రలో సీటు దొరికింది కానీ చాలా దూరం. ఏమీ చేయడానికి పాలు పోని పరిస్థితి. అయితే నేను ఎమ్ ఎస్ సి చేస్తున్నప్పుడు బి.హాస్టల్ సీనియర్ హౌస్ మానిటర్ గా ఉంటిని. అప్పుడు ప్రొఫెసర్ అనంతం గారు హాస్టల్ వార్డెన్. వారితో నాకు చనువు ఏర్పడింది. భగవంతుని ప్రేరణగా ఒకసారి వారు బొంబాయి యూనివర్సిటీలో పని చేస్తున్న వారి మిత్రుడు ప్రొఫెసర్ దేవరాజ్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ వున్నాను. వారి వద్ద ఎమ్ ఎస్ సి చేస్తే ఎవరికైనా మంచి భవిష్యత్తు ఉంటుందని అనంతం గారు నాతో అన్నారు. నాకు వెంటనే వేణు గురించిన ఆలోచన వచ్చింది. కానీ బొంబాయిలో మాకు తెలిసిన ఆచార్యుల అబ్బాయి రొట్టెలు పడక రక్తవిరేచనాలతో మరణించాడు. ఆ భయం వున్నప్పటికీ వేణు రొట్టెలు తిని ఉండగలుగుతాడు అన్న నమ్మకంతో నరసింహారావు గారి అంగీకారంతో వేణును బొంబాయి పంపించడం జరిగింది. దేవరాజు గారు గట్టి క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ ఇచ్చారు. అందువల్ల వేణు కూడా బుద్ధిగా చదువుకొని ఆయనకు ప్రియశిష్యుడైనాడు. అక్కడే కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన వేణు అమెరికా వెళ్లి మంచిగా స్థిరపడినాడు. అది నాకు ఎంతో సంతోషదాయకం. అంతేకాక వేణు కూడా సాహిత్యాభిలాష కలిగివుండడం గొప్ప విషయం. డిగ్రీలో ఫిషరీస్ కోర్సు చేసి, సముద్రాలు దాటి ఫిష్ వలె అమెరికా చేరాడు కాబట్టి నేను వేణును ముద్దుగా ఫిష్ అని పిలిచేవాడిని. ఇప్పటికీ అలాగే పిలుస్తాను. ఆ విధంగా ఆ పిల్లవాడు వేణు జీవితంలో స్థిరపడడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం. అయితే ఇందులో భగవంతుని అనుగ్రహం తప్ప నా గొప్పతనం ఏమీలేదు. సమయానికి భగవంతుడు నా చేత అలా చేయించాడు అంతే.
ఈ మధ్యనే వేణు అమెరికానుండి ఇండియాకు వచ్చాడు. డాక్టరు గారు నాతో మాట్లాడుతూ “మామూసాబ్, మీ ఫిష్ వచ్చాడు” అని నవ్వుతూ చెప్పారు. డాక్టరు గారి పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు నాతో ఎంతో చనువుగా వుంటారు. వారి మూడవ కుమారుడు డాక్టర్ శ్యామ్. శ్యామ్ పెద్దకూతురు శ్రియ తన చిన్నతనంలో నేను వాళ్ళింటికి వెళ్లి మెట్లు ఎక్కుతున్నప్పుడు మురళి తాతయ్య వస్తున్నాడు అనేది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇప్పటికీ చిన్నతనపు ఆ గుర్తులు ఆ అమ్మాయి మర్చిపోలేదు. ఈ విషయాలన్నీ నేను స్వీయచరిత్రలో రాసుకున్నాను.
18. మీరు పుట్టిన ఇనుగుర్తితో ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయా? ఎలా?
జ: ఇనుగుర్తిలో పూర్వం 22 బ్రాహ్మల ఇండ్లు ఉండేవి. ఇప్పుడు మా ఇంట్లో మా అన్నగారి కుమారుడు వసంత్ ఉంటున్నాడు. గుడి పూజారి, ఒక స్థానాచారి, వెంకటాచార్యులనే రిటైర్డు టీచరు, ఇంకొక ఇల్లు ఆచార్యులది ఉంది అంతే. అక్కడ ప్రస్తుతం బ్రాహ్మణ సావాసమే లేదు. నాకు ఆ గ్రామంలో మూడు ఎకరాల తరిభూమి ఆరు ఎకరాల చెలుక భూమి వుంది. మా నాల్గవ అన్నగారి కుమారుడే చూస్తుంటాడు. నేను వెళ్లడం సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నది. ఆలయం గురించి మా కుటుంబాల వారంతా వెళ్ళి వస్తుంటారు. ఇక్కడ ఉండి కూడా నేను మనసులో దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ ఉడియవర్లను, ఆంజనేయుని, తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తీర్థం, శఠారి తీసుకుంటున్నట్లు భావిస్తుంటాను. ఆ తరువాతనే ముకుందమాల శ్లోకాలు చదువుతాను.
అంతా దేవుని దయ.
ఇక్కడ మరో విషయం చెప్పాలి. మేము జూన్ 2021 లో కరోనా వ్యాధికి గురైనందున మా పెద్దకుమారుడు విజయ్ కుమార్ మమ్మల్ని ‘కాంటినెంటల్ ‘ ఆసుపత్రిలో చేర్పించారు. ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినాక అధిక శుభ్రత కలిగిన తన బావమరిది ఇంట్లో పదిరోజులు ఉంచి, తన ఇంటికి అంటే ఇప్పుడు మేమున్న ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటి నుండి ఇక్కడే వుంటున్నాము. అప్పుడప్పుడు నల్లకుంటలోని మా స్వగృహానికి పోయి రావడం జరుగుతున్నది. మా చిన్న కుమారుడు వేణుగోపాల్ అమెరికాలో కుటుంబంతో ఉంటున్నాడు. ప్రతి రెండు రోజులకొకసారి ఫోన్ చేస్తుంటాడు. అవసరమైనప్పుడు కొద్దిరోజులు ఉండిపోతాడు. ఇక్కడ మాకు అన్ని వసతులు బాగున్నాయి. మా శ్రీమతి ప్రతిరోజు ఒక పేజీ రామకోటి రాస్తుంటుంది. ఇప్పటికి అవి ముప్ఫయి లక్షల యాభై వేలు అయింది.
శతకోటి వందనాలు గురువుగారు. తొమ్మిది దశాబ్దాల వయస్సులో మేము అడిగిన వాటికి ఎంతో ఓపికగా మీరు సమాధానాలు ఇచ్చినందుకు మా పాఠకుల పక్షాన, మా పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు. మీకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.