Home వ్యాసాలు అస‌లు సిస‌లు ప్ర‌జాక‌వి కీ.శే. శ్రీ రావికంటి రామ‌య్య గుప్త‌

అస‌లు సిస‌లు ప్ర‌జాక‌వి కీ.శే. శ్రీ రావికంటి రామ‌య్య గుప్త‌

by Ravikanti Srinivas

(జూన్ 17న ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా)

ఆయ‌న
అక్ష‌రంతో అల‌రిస్తాడు
అభినందిస్తాడు
అభిశంసిస్తాడు
ఆగ్ర‌హిస్తాడు
ఆలోచింపజేస్తాడు
అక్ర‌మార్కుల నిల‌దీస్తాడు
న్యాయానికి అండ‌గా నిలుస్తాడు
క‌విత్వ‌మే ఊపిరిగా జీవించాడు
శిష్యులే ప్రాణంగా భావించాడు
విలువ‌ల‌తో విద్య‌ను బోధించాడు
ఆ విలువ‌ల‌నే ఆ జ‌న్మాంతం ఆచ‌రించాడు.
స‌మాజాన్ని ప్రేమించాడు  
సంఘసేవలో తరించాడు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత
ఆయన రచనలు వెలుగులోకి వచ్చాయి.
పాఠ్య‌పుస్త‌కంలోనూ భాగమయ్యాయి.
ఈ గౌరవంతో  క‌న్న‌ఊరు పొంగిపోయింది.
ఆయన కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని
మననం చేసుకుంది.
ఆయ‌నే కీ.శే. శ్రీ రావికంటి రామ‌య్య గుప్త‌
****
హిందు క్రైస్త‌వీయ ఇస్లాము మ‌త‌ములు
గ‌తులు వేరు గాని గ‌మ్య‌మొక‌టె
వేరు వేరు న‌దులు చేర‌వా సంద్ర‌మ్ము
క‌ల్ల గాదు రావికంటి మాట‌

ముడుపు లేక వచ్చు మొక్కుబ‌ళ్లెవ్వియూ
శ్రీ‌నివాసుడ‌త‌డె చేత‌గొన‌డు
దైవ‌మైన నేడు డ‌బ్బుకు దాసుడే
క‌ల్ల గాదు రావికంటి మాట

క‌ల్తి లేని స‌ర‌కు కాన‌రాదెక్క‌డ‌
అంత క‌ల్తిమ‌య‌మె య‌స‌లు సున్న‌
క‌ల్తి ర‌హిత జ‌గ‌ము కాన్పించుటెన్న‌డో
క‌ల్ల గాదు రావికంటి మాట‌

త‌ల్లి భాష‌ను మ‌ర‌చిన పిల్ల‌లంత‌
ఎన్ని భాష‌లు నేర్చిన యేమి ఫ‌ల‌ము
గాలిలోప‌ల మేడ‌లు క‌ట్టిన‌ట్లు
క‌రుణ జూపించు మంథెన్న క‌న్య‌కాంబ‌

ఇలా సామాజిక స‌మ‌స్య‌ల‌పై  అక్ష‌ర ఖ‌డ్గం దూసిన ప్ర‌జాక‌వి కీ.శే. శ్రీ రావికంటి రామ‌య్య గుప్త‌.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన వారు.  1936 జూన్ 17న జ‌న్మించారు.  ఉత్త‌మ ఉపాధ్యాయునిగా న‌ల‌భై ఏళ్ల పాటు సేవ‌లందించారు. క‌విత్వాన్ని శ్వాస‌గా చేసుకుని జీవ‌నం గ‌డిపారు. ఆయ‌న ర‌చ‌న‌లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆయ‌న శిష్యులు ఇప్ప‌టికీ వాటిని ఆల‌పిస్తూ ఉంటారు.   అవినీతి, బంధుప్రీతి, లంచ‌గొండిత‌నం,, వ‌ర‌క‌ట్న దురాచారం, రాజ‌కీయాల్లో ఏకప‌క్ష ధోర‌ణులు ఇలాఎన్నింటిపైనో ఆయ‌న అక్ష‌ర శ‌రాలు సంధించారు.  క‌వి నిరంకుశుడు అన్న‌ట్లు ఆయ‌న ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌లేదు.  ప్ర‌తి స‌మ‌స్య‌ను అక్ష‌ర‌బ‌ద్ధం చేయ‌డ‌మే కాకుండా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, అధికారుల‌ను , ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డంలో ఆయ‌న ఏనాడూ వెన‌కాడ‌లేదు. ముఖ‌స్తుతుల‌కు, భుజ‌కీర్తుల‌కు ఆయ‌న ఆమ‌డ దూరం. య‌దార్థ‌వాది లోక విరోధి అనే నానుడి ఉన్నా ఆయ‌న మాత్రం అన్నీ య‌దార్థాలే చెప్పి లోక‌ప్రియుడిగా పేరొందారు.  ప్ర‌తిఅక్ష‌రం ప్ర‌జా ప‌క్ష‌మే. అల‌తి అల‌తి ప‌దాల‌తో…. నిరక్ష‌రాస్యుల‌కు సైతం సుల‌భంగా అర్థ‌మ‌య్యే శైలిలో సాగిన ఆయ‌న క‌విత్వం ప్ర‌జ‌ల‌పై బ‌ల‌మైన ముద్ర‌వేసింది.

రావికంటి రామ‌య్య గుప్త‌

ప్ర‌తి ప‌ద్యం ఒక అక్ష‌రాయుధం
ఆయ‌న క‌విత్వంలో స‌ర‌ళ‌త్వం ఉంది. వాస్త‌వం ఉంది. నీతి, నిర్భీతి, నిజాయితీ ఆయ‌న క‌విత్వంలో ప్ర‌తిధ్వ‌నించేవి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వారి భాష‌లోనే చెప్పేవారు. జ‌న‌రంజ‌కం అన్న మాట ఆయ‌న సాహిత్యానికి అతికిన‌ట్లు స‌రిపోతుంది. ఆయ‌న ఎంత స‌ర‌దాగా ఉంటారో క‌వితంలో అంత క‌ఠినంగా విమ‌ర్శించ‌నూ గ‌ల‌రు. నిర్మొహ‌మాటం ఆయ‌న నైజం. తాను న‌మ్మిందే రాస్తారు. రాసిందే ఆచ‌రిస్తారు. ఆదే ఆయ‌న బ‌లం. ఉన్న‌దున్న‌ట్లు చెప్పిన న‌గ్న‌స‌త్యాలు శ‌త‌కంలో క‌ల్ల‌గాదు రావికంటి మాట అన్న‌ది మ‌కుటం. ఇలా చెప్ప‌గ‌ల‌గ‌డానికి ఎంత నిజాయితీ కావాలి? ఎంత ధైర్యం కావాలి. ఈ శ‌త‌కం లోని ప్ర‌తి ప‌ద్యం ఒక అక్ష‌రాయుధం. అందుకే ఇది ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నేటికీ చిర‌స్థాయిగా నిల‌చిపోయింది. ఆయ‌న క‌విత్వంలో స‌ర‌ళ‌త్వం, నిండైన మాన‌వ‌త్వం ఉంటాయి. ప్ర‌జ‌ల మ‌నిషి కాళోజీలా క‌విత్వ‌మై ఆక్రోశిస్తాడు. ప్రేమ తత్వ‌మై ఆనందం గుప్పిస్తాడు. ఆచ‌ర‌ణ శాలువా క‌ప్పుకొన్నాడు.
మంత్ర‌కూట వేమ‌న‌
కాళోజీ లోని ధిక్కార స్వ‌రం…వేమ‌న ప‌ద్యాల్లోని స‌ర‌ళ‌త్వం క‌ల‌గ‌లిసి ఉండ‌టం రావికంటి క‌విత్వం లోని గొప్ప‌త‌నం. మాట‌లాడినంత తేలిక‌గా, స‌హ‌జంగా ఆట‌వెల‌ది ప‌ద్యాల‌ను చెప్ప‌డం వ‌ల్ల‌నేమో ఆయ‌న‌ను మంత్ర‌కూట వేమ‌న అని అంటారు. వేమ‌న ప‌ద్యాల్లోని తీయ‌ద‌నం,

సూటిద‌నం ఆయ‌న‌ ప‌ద్యాల్లో గ‌మ‌నించ‌వ‌చ్చు. క‌ల్ల‌గాదు రావికంటి మాట అన్న ప‌ద్య పాదం మంథ‌ని ప్రాంతంలో విశ్వ‌దాభిరామ వినుర‌వేమ అన్న రీతిలో ప్ర‌తిధ్వ‌నిస్తూ ఉంటుంది. ఆయ‌న చుర‌క‌లు అంట‌ని రంగం లేదంటే అతిశ‌యోక్తి కాదు. అప్ప‌టిక‌ప్పుడు క‌విత్వం వినిపించ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు రెడీమేడ్ పోయెట్ (ఆర్‌.ఎం.పి) అన్న పేరు వ‌చ్చింది. సంద‌ర్భం ఏద‌యినా..స‌ద‌స్సు, స‌మావేశం ఏద‌యినా అక్క‌డ ఆయ‌న క‌వితాగానం ఉండాల్సిందే.  పండగైనా ..ప‌బ్బ‌మైనా,బంధువుల ఇళ్లలో ఏ వేడుకైనా రావికంటి గేయ‌మే అక్క‌డ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.  ఎంతో మందికి ఆయ‌న అక్ష‌రాశీస్సులు అందాయి. వివాహ వేళ ఆయ‌న అందించిన అక్ష‌రాభినంద‌న‌ల‌ను ఎన్నో జంట‌లు ప్రాణ‌ప్ర‌దంగా దాచుకున్నాయి.  ఆయ‌న ప్ర‌శంస‌లు పొందిన ప్ర‌తి నాయకుడూ ఆయ‌న‌పై ఆపార భ‌క్తి ప్ర‌ప‌త్తులు చాటుతుంటారు.

మ‌న‌సు నిండా మంథ‌ని
మంథ‌ని అంటే రావికంటి అంతులేని అభిమానం. మ‌న‌వారు అంటే ఎల్ల‌లెరుగ‌ని ప్రేమ‌. స‌హ‌చరులంటే ప్రాణం. శిష్యులు క‌నిపిస్తే పండుగ‌. ప‌ల‌క‌రిస్తే ప‌ర‌శ‌వ‌శం. క‌ల్లా క‌ప‌టం ఎరుగ‌ని నిష్క‌ల్మ‌ష మ‌న‌స్త‌త్వం. స్నేహ‌పూరిత ధోర‌ణి అయ‌న వ్య‌క్తిత్వానికి  వ‌న్నెల‌ద్దాయి. క‌విత్వంలోనూ మంథ‌ని ఉనికిని చాటారు.మంథ‌ని గోదావ‌రి తీరంలో వెల‌సిన గౌత‌మేశ్వ‌రుని స్తుతిస్తూ ‘గ‌ర‌ళ కంఠేశ మంథెన్న గౌత‌మేశ ‘ మ‌కుటంతో శ‌త‌కం రాశారు. అలాగే ‘క‌రుణ జూపించు మంథెన్న క‌న్య‌కాంబ’ మ‌కుటంతో మ‌రో శ‌త‌కంరాశారు. త‌న కుల దైవాన్ని కీర్తిస్తూ ఎన్నో భ‌జ‌న పాట‌లు కూడా రాశారు.  వాస‌వీ మాత జీవిత చ‌రిత్ర‌ను గేయ‌కావ్యంగా వెలువ‌రించారు. భ‌గ‌వ‌ద్గీత సారాంశం సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా గీతామృతం గేయ కావ్యాన్ని ర‌చించారు.   వ‌ర‌ద‌గోదావ‌రి (ఉయ్యాల పాట‌),  ఇందిరా విజ‌య‌గీతి, క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి శ‌త‌క‌ము , న‌గ్న‌స‌త్యాలు మొద‌లైన శ‌త‌కాలు ఇంకా ఎన్నో గేయాలు, ప‌ద్యాలు, భ‌జ‌న‌పాట‌లు, గొల్ల సుద్దులు, నాటిక‌లు, ఏకాంకిక‌లు ర‌చించారు.  మంథ‌నికి చెందిన విద్యావేత్త  వ‌ర‌గాల భీమ‌న్న జీవిత చ‌రిత్రను బుర్ర‌క‌థ‌గా వెలువ‌రించారు.  ప‌ద్యాలు, శ‌త‌కాల‌తో పాటు శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా అనేక స్థానిక‌, సామాజిక స‌మ‌స్యల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు గేయాలు ర‌చించేవారు. వాటిలో నల్లాల బాగోతం,రామ‌గుండం రాత్రి గండం చాలా ప్ర‌సిద్ధి పొందాయి. వీటిని ఇప్ప‌టికీ  చాలా మంది ఉదాహ‌రిస్తుంటారు.

రామయ్య గుప్తా రచించిన శ్రీ గౌతమేశ్వర శతకం

ఉపాధ్యాయుడిగా చెర‌గ‌ని ముద్ర‌
శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా ఉపాధ్యాయుడిగా చెర‌గ‌ని ముద్ర వేశారు. వృత్తిని ప్రాణ‌ప్ర‌దంగా భావించి న‌ల‌భై ఏళ్ల పాటు సేవ‌లందించారు.  పిల్ల‌ల‌ను అమితంగా ప్రేమించేవారు.వేలాదిమందిని ఉన్న‌తులుగా తీర్చిదిద్దారు. పిట్ట క‌థ‌ల‌తో… ప‌ద్యాల‌తో.. గేయాల‌తో..హాస్య గుళిక‌ల‌తో సాగే ఆయ‌న బోధ‌న పిల్ల‌ల‌ను ఎంతో ఆక‌ట్టుకునేది. ఆయ‌నంటే వారికి భ‌యం ఉండేది కాదు.  ఉండేదల్లా ఇష్ట‌మే. ఆయ‌న క్లాస్ అంటే ఎంజ‌య్‌మెంట్‌. ఓ ఆట విడుపు. అమిత‌మైన స్వేచ్ఛ‌.  అందువ‌ల్లే ఆయ‌న పాఠాల‌ను విన‌డానికి ఎంతో ఆస‌క్తి చూపేవారు. అలా స‌ర‌దాగా ఉంటూనే విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చెప్పేవారు. తెలుగుతో పాటు గ‌ణితం కూడా బోధించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. మ‌రో ముఖ్య‌విష‌యం ఏమిటంటే.. ప‌నిచేసేది ఎంత చిన్న‌గ్రామ‌మైనా..ఉండ‌టం ఎంత క‌ష్ట‌మైనా అక్క‌డే స్థిర నివాసం ఉండేవారు.  వృత్తి ప‌ట్ల ఆయ‌న నిబ‌ద్ధ‌త‌కు ఇది నిద‌ర్శ‌నం.భాష ప‌ట్ల అనుర‌క్తి, క‌ళ‌ల ప‌ట్ల ఆస‌క్తి క‌ల్పించేందుకు అనేక కార్య‌క్ర‌మాలు రూపొందించేవారు. ప‌ద్యాలు, పాట‌ల పోటీలు నిర్వ‌హించేవారు. ఏక‌పాత్రాభిన‌యాలు, నాటిక‌లు ప్ర‌ద‌ర్శింప‌జేసే వారు. స్వ‌యంగా నాట‌కాలు రాసి విద్యార్థుల‌ను సంసిద్ధం చేసేవారు. వీట‌న్నింటి కార‌ణంగానే ఆయ‌న శిష్యులు బ‌హుముఖీనంగా ఎదిగారు. నేటికీ నేను రామ‌య్య సార్ శిష్యుడిని అని గ‌ర్వంగా చెప్పుకొనే వారు ఎంతో మంది క‌నిపిస్తారు.  

రామయ్య గుప్తా రచించిన నగ్న సత్యాలు శతకం

“నేటి ఆధునిక కాలంలో విద్యావేత్త‌లు చెప్పే సిద్ధాంతాల‌లో ముఖ్య‌మైన‌వి …పిల్ల‌ల‌ను అర్థం చేసుకోవ‌డం…వారి నేప‌థ్యం తెలుసుకుని వారితో ప్ర‌వ‌ర్తించ‌డం, వారితో ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, వారితో ముచ్చ‌టించ‌డం, వారితో త‌దానుభూతితో వ్య‌వ‌హ‌రించం మొద‌లైన‌వి. 80వ ద‌శ‌కంలోనే ఈ అన్నిఅంశాల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టి విద్యార్థుల మ‌న‌సు దోచుకున్న మ‌హోపాధ్యాయుడు రామ‌య్య సార్‌. ఇలా వృత్తి ధ‌ర్మాన్ని నిర్వర్తించిన ఉపాధ్యాయుడు గిజూభాయ్‌.  మ‌న రామ‌య్య సార్ కూడా మంథ‌ని గిజూభాయ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు” అని అంటారు ప్ర‌ముఖ విద్యావేత్త‌, తెలంగాణ పాఠ్య‌పుస్త‌కాల క‌మిటీ కో ఆర్డినేట‌ర్ , తెలుగు అమ‌లు క‌మిటీ స‌భ్యుడు వినాయ‌క్‌. ఆయ‌న కూడా రావికంటి రామ‌య్య శిష్యుడే. “ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ అన్న‌ట్లు  గురుశిష్యుల మ‌ధ్య అభేదం ఉండి, భ‌ద్ర‌త ఉన్న‌ప్పుడే పిల్ల‌లు నేర్చుకుంటారు. దీనికి సాక్షాత్ నిలువెత్తు రూపం మా రామ‌య్య సార్ “అని కూడా ఆయ‌న అభివ‌ర్ణించారంటే వారి గొప్ప‌త‌నాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. అల్లం రాజ‌య్య‌, అల్లం వీర‌య్య లాంటి సాహితీ వేత్త‌ల‌ను, అల్లం నారాయ‌ణ‌, న‌గునూరి శేఖ‌ర్‌, కామోఝ‌ల చంద్ర‌మోహ‌న్ లాంటి పాత్రికేయుల‌ను, కొల్లారపు ప్ర‌కాశ‌రావు శ‌ర్మ‌, ముద్దు రాజ‌య్య, జ‌క్కం వెంక‌ట ర‌మ‌ణ‌ లాంటి క‌వుల‌ను, ఎంతో మంది  ఇంజినీర్ల‌ను, మేధావుల‌ను తీర్చి దిద్దిన ఘ‌న‌త శ్రీ రావికంటి రామయ్య‌ది. దేశ విదేశాల్లో ఆయ‌న శిష్యులు ఉన్న‌త స్థానాల్లో ఉన్నారు.

రామ‌య్య‌…తెలంగాణ వేమ‌య్య‌
జీవించి ఉన్న కాలంలో మంథ‌ని ప్రాంతానికే ప‌రిమిత‌మైన ఆయ‌న ప్ర‌తిభ తెలంగాణ ఏర్పాటు అనంత‌రం వెలుగులోకి వ‌చ్చింది. తెలంగాణ ప్ర‌భుత్వం రావికంటి రామ‌య్య గుప్తా రాసిన ఒక ప‌ద్యానికి ఏడో త‌ర‌గ‌తి తెలుగు పాఠ్య‌పుస్త‌కంలో  చోటు క‌ల్పించ‌డంతో ఆయ‌న ర‌చ‌న‌లు రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వ‌చ్చాయి. ప్ర‌పంచ తెలుగుమ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా వెలువ‌రించిన ప్ర‌త్యేక‌సంచిక‌ల్లోనూ వారిపై వ్యాసాలు వెలువ‌డ్డాయి. నేటి నిజం ప్ర‌త్యేక సంచిక‌లో  రామ‌య్య‌ను తెలంగాణ వేమయ్య‌గా అభివ‌ర్ణించారు.  అదే స‌మయంలో శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా ర‌చించిన న‌గ్న‌స‌త్యాలు, శ్రీ గౌత‌మేశ్వ‌ర శ‌త‌కం పుస్త‌కాలు, ఆడియో సీడీల ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ర‌వీంద్ర‌భార‌తిలో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. తెలంగాణ సాహితీ ప్ర‌ముఖులు శ్రీ నందిని సిధారెడ్డి, శ్రీ అల్లం నారాయ‌ణ‌, శ్రీ దేశిప‌తి శ్రీ‌నివాస్‌, శ్రీ మామిడి హ‌రికృష్ణ, శ్రీ మాడిశెట్టి గోపాల్‌, శ్రీ కేఎస్ అనంతాచార్య‌లతో పాటు అప్ప‌టి మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని రావికంటి క‌విత్వం, వ్య‌క్తిత్వాల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల ప్రాంగ‌ణంలో రావికంటి ప‌ద్యాలు వినిపించాల‌ని శ్రీ స్వామిగౌడ్ సూచించారు.

క‌వికి కాంస్య విగ్ర‌హం
ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ప్ర‌జాక‌విని ప్ర‌భుత్వం గుర్తించి గౌర‌వించ‌డంతో మంథ‌ని స‌మాజం ఉప్పొంగిపోయింది. ఆ మ‌హానుభావుడు, మ‌హా క‌విని గౌర‌వించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని భావించి ప‌ట్టణం న‌డిబొడ్డున ఆయ‌న కాంస్య విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించుకుంది.  ప్ర‌తి ఏటా ఆయ‌న జయంతి, వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తూ అభిమానాన్ని చాటుకుంటోంది. ఒక ఉపాధ్యాయుడికి, క‌వికి ఇంత‌టి గౌర‌వం ద‌క్క‌డం చాలా అరుదైన విష‌యం. కాళోజీ, సినారె, అలిశెట్టి ప్ర‌భాక‌ర్‌ల‌ త‌ర్వాత తెలంగాణ‌లో ఈ ఘ‌న‌త ద‌క్కింది కేవ‌లం  రావికంటి రామ‌య్య గుప్తాకే కావ‌డం గ‌మ‌నార్హం. విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా మంత్ర‌కూట వేమ‌న పేరుతో ప్ర‌త్యేక సంచిక వెలువ‌డింది. 50మందికి పైగా ప్ర‌ముఖులు ఆయ‌న క‌విత్వం, వ్య‌క్తిత్వాల‌పై రాసిన వ్యాసాల‌ను ఇందులో ప్ర‌చురించారు. రామ‌య్య‌కు క‌విగా మ‌రో అరుదైన గౌర‌వం కూడా ద‌క్కింది. మంథ‌ని పుర‌పాల‌క సంఘం వారు ప్ర‌తి రోజూ ఉద‌యం జాతీయ గీతాన్ని ఊరంతా వినిపించే ఏర్పాటు చేశారు. ఆ వెనువెంట‌నే రామ‌య్య గుప్తా ప‌ద్యాల‌ను కూడా రోజూ మైకుల ద్వారా వినిపించేవారు.  జాతీయ గీతంతో పాటు ఆయ‌న ప‌ద్యాలు వినిపించాల‌ని పుర‌పాల‌క సంఘం నిర్ణ‌యం తీసుకుందంటే ఆయ‌న‌ను మంథ‌ని ప్రాంతం ఎంత‌గా గౌర‌వించిందో అర్థం చేసుకోవ‌చ్చు. కొన్ని నెల‌ల  పాటు ఈ ప్ర‌క్రియ కొన‌సాగింది.  

మంథనిలో ప్రతిష్ఠించిన శ్రీ రావికంటి రామయ్య గుప్తా గారి కాంస్య విగ్రహం

ఎన్నెన్నో  పుర‌స్కారాలు
శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా ఉపాధ్యాయునిగా, క‌విగా ఎన్నో పుర‌స్కారాలు, బిరుదులు పొందారు. క‌విర‌త్న‌, మంత్ర‌కూట వేమ‌న‌, రెడీమేడే పోయెట్ (ఆర్ ఎం పీ) అన్న‌వి ఆయ‌న బిరుదులు. ఉత్త‌మ ఉపాధ్యాయునిగా రెండుసార్లు ప్ర‌భుత్వం పుర‌స్కారం పొందారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా ఆవోపా (ఆర్య‌వైశ్య అఫీషియ‌ల్స్ అండ్ ప్రొఫెష‌న‌ల్స్ అసోసియేష‌న్‌), క‌రీంన‌గ‌ర్ జిల్లా అన్న‌మ‌య్య అకాడ‌మీ, జ‌గిత్యాల జైశెట్టి ర‌మ‌ణ‌య్య ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు. మంథ‌ని ఆర్య‌వైశ్య సంఘం లాంటి ఎన్నో సంస్థ‌లు ఆయ‌న‌ను ఎంతో ఘ‌నంగా స‌త్క‌రించాయి. మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ కొణిజేటి రోశ‌య్య గారి చేతుల మీదుగా ఆ స‌న్మానాన్ని పొందారు. ఆమెరికాలోనూ క‌వితాగానం చేశారు. శ్రీ మాడుగుల నాగ‌ఫ‌ణి శ‌ర్మ నిర్వ‌హించిన అవ‌ధానంలో పృచ్ఛ‌కునిగా పాల్గొన్నారు.

శ్రీ రావికంటి రామయ్య గుప్తా విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న వారి కుమారుడు రావికంటి శ్రీనివాస్, కోడలు చంద్రరూప

 రావికంటి రామ‌య్య పేరిట ఏటా సాహితీ పుర‌స్కారం

 క‌రీంన‌గ‌ర్ స‌మైక్య సాహితీ ఆధ్వ‌ర్యంలో శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా స్మార‌కంగా మేము ఏటా సాహితీ పుర‌స్కారాన్ని అందిస్తున్నాము.   శ్రీ మాడుగుల ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, శ్రీ అల్లం వీర‌య్య‌, శ్రీ ఎం. నారాయ‌ణ శ‌ర్మ‌, శ్రీ అవుసుల భానుప్ర‌కాశ్‌, శ్రీ కొల్లార‌పు ప్ర‌కాశ‌రావు శ‌ర్మ‌లు గ‌తంలో ఈ పుర‌స్కారాలు పొందారు. ఈ సంవ‌త్స‌రం ప్ర‌ముఖ క‌వి, అవ‌ధాని శ్రీ ముద్దు రాజ‌య్య గారికి పుర‌స్కారం ప్ర‌క‌టించాం. జూన్ చివ‌రి వారంలో ఈ పుర‌స్కార ప్ర‌దాన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. రావికంటీ రామయ్య గుప్తా చిన్న కుమారుడు, అమెరికాలో ఉంటున్న శ్రీ రావికంటి శ్రీకాంత్ ఈ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. మంథనిలో విగ్రహావిష్కరణ, పుస్తకాల ప్రచురణ, సీడీల రూపకల్పన, కార్యక్రమాల నిర్వహణకు కూడా ఆయన ఆర్థికంగా, హార్దికంగా తోడ్పడుతున్నారు..

సాహితీ ప్ర‌ముఖుల మాట‌ల్లో  రావికంటి
మ‌నుషుల్లో మాన‌వీయ విలువ‌లు మృగ్య‌మై పోతున్నాయ‌ని, వ‌స్తువుల్లోనూ, మ‌న‌సుల్లోనూ క‌ల్తీ పెరిగిపోతున్న‌ద‌ని, చివ‌రికి దేవుడు కూడా డ‌బ్బుకు దాసోహ‌మై పోతున్నాడ‌ని రామయ్య గారు నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయాల్ని క‌విత‌ల్లో రాశారు. ఆయ‌న రాసిన అనేక చ‌ర‌ణాలు సూటిగా ఎక్కుపెట్టిన ఆయుధాల్లా మ‌న‌ముందు నిల‌బ‌డ‌తాయి.
– కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు గ్ర‌హీత‌, ప్ర‌ముఖ క‌వి వారాల ఆనంద్‌

రావికంటి రామ‌య్య సారు మా పిల్ల‌ల‌కు మొద‌టిక‌వి. సారు స‌ర‌దాగ ఉండెటోడు. పిల్ల‌ల‌తోటి మ‌జాక్‌లు చేసెటోడు. ప‌దాల‌తో మ్యాజిక్ చేసెటోడు. మంథ‌ని ప్రాంతంలో ఒక విద్వ‌త్తు ఉన్న‌ది. విద్య ఉన్న‌ది. ఈ ప్రాంతం విద్య‌తో బ‌తికింది. ఇక్క‌డి నుంచి గొప్ప గొప్ప ఇంజినీర్లు అయిన‌వాళ్లు, డాక్ట‌ర్లు అయిన‌వాళ్లు, అమెరికాకు వెళ్లిన వాళ్లు, ఆయా వృత్తుల్లో , వ్యాసంగాల్లో ఉన్న‌త స్థానాల‌కు ఎదిగిన వాళ్లు ఎంతో మంది. విద్య‌, విప్ల‌వం..ఇవ్వాళ ఇట్లాంటి ఎదుగుద‌ల‌తో పాటు అక్ష‌రంతో అనుభంధం ఉన్న రంగాల్లో, ప‌త్రిక‌ల్లో, సాహిత్యంలో ఎన్ని పేర్ల‌ని….మంథ‌ని నుంచి ఎదిగి వ‌చ్చిన క‌లం వీరుల మూలాలు ఇదిగో ఇట్లాంటి రావికంటి రామయ్య సారులో ఉంటాయి. ఇప్ప‌డు తెలంగాణ క‌ల సాకార‌మైంది. రామ‌య్య సారు మ‌న పాఠ్య‌పుస్త‌కంలోకి, మ‌న చ‌రిత్ర‌లోకి ఎక్కిండు. మంథ‌ని న‌డిబొడ్డున విగ్ర‌హమై నిలిచిండు.
– తెలంగాణ మీడియా అకాడ‌మీ మాజీ ఛైర్మ‌న్ శ్రీ అల్లం నారాయ‌ణ‌

శ్రీ రావికంటి రామ‌య్య అనేక సామాజిక రుగ్మ‌త‌ల‌పై అక్ష‌రాల్ని ఆయుధంగా చేసుకొని ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపారు.16వ శ‌తాబ్ధంలో జ‌న్మించిన వేమ‌న త‌న అక్ష‌రాల‌తో అభ్యుదయాన్ని సృష్టించి అప్ప‌టివ‌ర‌కు ఉన్న చీక‌టి తెర‌ల‌ను తొల‌గించాడు..18వ శ‌తాబ్దంలో జ‌న్మించిన‌ కందుకూరి విరేశ‌లింగం పంతులు, గుర‌జాడ అప్పారావులు త‌మ అక్ష‌రాల‌తో సాంఘిక సంస్క‌ర‌ణ బాట ప‌ట్టించారు.19వ శ‌తాబ్ధంలో జ‌న్మించిన రావికంటి రామ‌య్య గుప్త అభ్యుద‌యం.. సాంఘిక సంస్క‌ర‌ణ‌..  రాజ‌కీయం.. మ‌ద్య‌పానం.. నిర‌క్ష‌రాస్య‌త‌.. ఒక్క‌టేమిటి స‌మాజాన్ని ప‌ట్టిపీడించే ప్ర‌తీ సామాజిక రుగ్మ‌తని ప్ర‌శ్నించ‌డంలో వేమ‌న‌, కందుకూరి, గుర‌జాడ‌ల పోరాట వార‌స‌త్వాన్నికొన‌సాగించిన‌ మ‌హనీయుడు. ”క‌ల్ల గాదు రావికంటి మాట” అంటూ నిజాల్ని నిర్భ‌యంగా చెప్పారు. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే చెడుపై అక్ష‌ర ఖడ్గం దూశారు. మ‌హోన్న‌త‌మైన ల‌క్ష్యాలు కోసం త‌పించిన  మ‌హనీయుడాయ‌న‌.  
 – శ్రీ మల్లుల సురేష్, విశ్వమానవవేదిక అధ్యక్షుడు, పాల‌కొల్లు

రావికంటి వారి మాట క‌ల్ల‌గాదు. క‌ల కాదు. క‌ళ క‌ళ‌లాడుతూ క‌ల‌కాలం ఉండే క‌లియుగ భేష‌జ‌ము. రావికంటి వారి మాట ర‌త్నాల మూట‌.
– మ‌హ‌ర్షి శ్రీ గ‌ట్టు నారాయ‌ణ గురూజీ

బ‌హు గ్రంథ క‌ర్త‌, వివిధ పారిశ్రామిక సంస్థ‌ల‌కు, మేనేజిమెంట్ అసోసియేష‌న్ల‌కు మార్గ‌ద‌ర్శ‌కులు
రావికంటి రామ‌య్య రుషితుల్యుడు. స‌మాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ర‌చ‌న‌లు చేసిన‌వాడు. ప్ర‌జ‌ల మ‌ధ్య జీవించిన ఈయ‌న త‌న ర‌చ‌న‌ల‌ను ఊరివారికి వినిపించి మంత్ర‌ముగ్ధుల‌ను చేసిన సంద‌ర్భాలు లెక్క‌కు అంద‌నివి. ప‌ది కాలాల పాటు ఈయ‌న కృతులు నిలుస్తాయని ఏ సాహితీ ప్రియుడైనా చెప్ప‌గ‌ల‌డు.
– బ‌హు భాషాకోవిదుడు, ప్రముఖ క‌వి శ్రీ గ‌జాన‌న్ థామ‌న్‌

రామ‌య్య పండించిన భావాల్లో న‌గ్న స‌త్యాల‌తో పాటు చేదు నిజాలు, చుర‌క‌లు, చ‌క్క‌ని నీతి అడుగ‌డుగునా కాన‌వ‌స్తాయి. సామాజిక చైత‌న్యం కోసం ఆయ‌న ప‌డే ఆరాటం, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించాల‌న్న తాప‌త్రయం, పాల‌కుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌న్న సంకల్పం వంటివి సుగుణాల‌తో రూపుదిద్దుకున్న ప‌ద్యాలు హృద్యంగా , గానం చేసుకోవడానికి యోగ్యంగా ఉన్నాయి.  రామ‌య్య ప‌ద్య ర‌చ‌నా శైలి, నిర్మాణ క్ర‌మం, ఎంపిక చేసుకున్న క‌వితా వ‌స్తువ‌లు వేమ‌న‌ను త‌ల‌పిస్తాయి. అందుకే ఆయ‌న మంత్ర‌కూట వేమ‌న‌గా అభిమానాన్ని చూర‌గొన్నారు.
-ప్ర‌ముఖ క‌వి, విమ‌ర్శ‌కులు శ్రీ దాస్యం సేనాధిప‌తి

సుక‌వి జీవించె ప్ర‌జ‌ల నాలుక‌ల‌యందు అన్న నానుడికి నిజమైన తార్కాణం స‌హ‌జ‌క‌వి రావికంటి రామ‌య్య గుప్తా గారు. పామ‌రుల‌కు సైతం అర్థ‌మ‌య్యే భాష‌లో ఆశువుగా క‌విత్వం చెప్ప‌గ‌ల‌గ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. అక్ష‌ర రూపం దాల్చిన సిరాచుక్క ల‌క్ష‌ల మెద‌ళ్ల‌కు క‌ద‌లిక అన్న‌ట్లుగా ఆయ‌న త‌న మ‌న‌స్సులో క‌లిగిన అనేక భావాల‌కు అక్ష‌ర‌రూపం ఇచ్చి ఆలోచ‌నాత్మ‌క‌మైన కవిత్వాన్ని వెలువ‌రించారు.
-ప్ర‌ముఖ వ్యాఖ్యాత‌, తెలుగు యూనివ‌ర్స‌టీ కీర్తి పుర‌స్కార గ్ర‌హీత శ్రీ మాడిశెట్టి గోపాల్‌

ప్ర‌జాహితాన్ని కోరేది సాహిత్యం కాబట్టి క‌విత్వంలో స‌మాజ హితాన్ని కోరి త‌న అభిమతాన్ని నెర‌వేర్చుకుని, అల‌తిఅల‌తి ప‌దాల‌తోడ ప‌ద్యాలన‌ల్లి పామ‌ర‌జ‌న రంజ‌కంగా పాకాన్ని వండి వ‌డ్డించిన క‌వి..మంత్ర‌కూట వేమ‌న‌గా ప్రసిద్ధి పొందిన సిద్ధ క‌వితా వ‌తంసులు శ్రీ రావికంటి రామ‌య్య గుప్తా గారు.
క‌వి కేవ‌లం సౌంద‌ర్యం, భాష‌, ప్ర‌యోగాలు, శబ్దాడంబ‌ర‌త లాంటి వాటికి సుదూరంగా గౌత‌మేశ్వ‌ర శ‌త‌కాన్ని  అద్భుతంగా రాసి గౌత‌మేశ్వ‌రుడిని ఆరాధించిన ఈశ్వ‌రేచ్ఛ‌ను ప్ర‌క‌టించినారు. గ‌ర‌ళ‌కంఠేశ మంథెన్న‌గౌత‌మేశ అంటూ చ‌క్క‌టి మ‌కుట‌మే కాదు..ఈశ్వ‌ర త‌త్వాన్ని , ల‌య‌త్వాన్ని గుణ‌గ‌ణ విశేష‌ల‌న్నీ తెలిపినారు.
– ప్ర‌ముఖ క‌వి, ప్ర‌ధానోపాధ్యాయుడు కేఎస్ అనంతాచార్య‌,


అల‌తి అల‌తి ప‌దాల‌తో, దేశ‌చ్ఛంద‌స్సుతో సందేశాత్మ‌క‌, ఆధ్యాత్మిక వ‌స్తు నిర్దేశంతో ఎన్నోశ‌త‌కాలు వెలువ‌డ్డాయి. వేలాది మంది శ‌త‌క క‌వులు ఈ ప్ర‌క్రియ‌ను సుసంప‌న్నం చేశారు. ఒక్కొక్క‌రిది ఒక్కో శైలి. వారివారి అనుభ‌వాల్ని స్వ‌చ్ఛ‌మైన‌, అచ్చ‌మైన తెలుగు నుడికారంతో భావ‌నా ప‌టిమ‌తో శ‌త‌క ప‌ద్యంలో కూర్చి పాఠ‌కుల హృద‌యాల్లో కొలువుదీరారు. అలాంటి వారిలో మంథ‌ని వాస్త‌వ్యులైన రావికంటి రామయ్య గుప్త గారు ఒక‌రు. పండు ఒల‌చి చెప్పిన‌ట్లు ప‌ద్యాన్ని మ‌ల‌చి రాసే వీరి శైలి మ‌న‌సుకు హ‌త్తుకుంటుంది.  నీతి నియ‌మాలు, భ‌క్తి త‌త్ప‌ర‌త క‌లిగిన జీవితాచ‌ర‌ణ వీరి ర‌చ‌న‌ల‌కు పునాది.
-ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత బీ వీ ఎన్ స్వామి

భాష మీద ప‌ట్టున్న ర‌చ‌యిత క‌నుక సామాన్య పాఠ‌కుడికి అర్థ‌మ‌య్యే విధంగా ర‌చ‌నలు చేశారు. దోపిడీ దారుల‌ను, లంచ‌గొండుల‌ను, చివ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులైనా క‌లం ఝ‌ళిపించారు. క‌వి స‌మ్మేళ‌నాల్లో ఆయ‌న క‌విత‌లు చ‌దువుతున్న‌ప్పుడు చ‌మ‌త్కార‌ము, అధిక్షేప‌ము, నిర‌స‌న‌, విమ‌ర్శ సుస్ప‌ష్టంగా వినిపించేవి. ఆయ‌న ర‌చ‌న‌లు కూడా క‌వి నిరంకుశుడ‌నే భావ‌న క‌లిగిస్తాయి.

You may also like

1 comment

T. V. Ramnarsaiah June 25, 2024 - 1:09 pm

పాండిత్య ప్రకర్షను మాత్రమే ప్రదర్శించే వారు ప్రజాకవులు కాదు. ప్రజలందరికీ అర్థమయ్యేలా చక్కటి తెలుగు నుడికారంతో శతక పద్యాలు రాసిన రామయ్య గుప్తా గారు ధన్యజీవి. తన కవితామృతాన్ని శిష్యులకు పంచిన నిజమైన ప్రజాస్వామిక గురువు ఆయన. మీరు కూడా పాత్రికేయ వృత్తిలో ఆ (నా )యన బాటలోనే నడిచారు. వ్యవహారిక భాషలోనే కథనాలు రాసారు. నాన్న గొప్పతనాన్ని ఆయన పేరిట పురస్కారాలతో ప్రపంచానికి చాటిచెబుతున్న మీరు అభినందనీయులు. మీ వ్యాసం ఆగకుండా చివరిదాకా చదివించింది 🙏

Reply

Leave a Comment