Home ఇంద్రధనుస్సు ఆర్ద్ర చిత్తుడు సాగర్ సర్హదీ

ఆర్ద్ర చిత్తుడు సాగర్ సర్హదీ

హైదరాబాద్ అమ్మాయిల ‘బాజార్’ ను ఆవిష్కరించిన సాగర్ సర్హదీ

 

File picture: Sagar Sarhadi

తెలంగాణా సినిమా అనగానే మనకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణాకు హైదరాబాద్ కు పేరు తెచ్చిన పలు సినిమాలు, ఆ సినిమాల దర్శకులూ గుర్తొస్తారు. వారిలో గౌతం ఘోష్ ‘మా భూమి’, శ్యాం బెనెగల్ ‘అంకూర్’, ‘నిశాంత్’, ‘మండి’, బి.నరసింగ్ రావు’ దాసీ’ , బి ఎస్. నారాయణ ’నిమజ్జనం’, ‘ఊరుమ్మడి బతుకులు’ ఇట్లా అనేకం గుర్తొస్తాయి. వాటిలోని కళాత్మకతతో కూడిన వాస్తవికత మనల్ని అబ్బురపరుస్తుంది. అవి విశేష ప్రశంసల్నీ అవార్డుల్నీ గెలుచుకుని తెలంగాణా ఉనికిని ప్రపంచానికి చాటాయి. అలాంటి ఇంకో ప్రయత్నం చేసి విజయమ సాధించినవాడు సాగర్ సార్హది. ఆయన తీసిన ‘బాజార్’ కళాత్మకంగానూ వ్యాపారాత్మకంగానూ గొప్ప విజయాన్ని అందుకుంది. ఆ దర్శకుడు సాగర్ సర్హది ఈ నెల 22న తన 87సంవత్సరాల వయసులో ముంబైలో మరణించాడు. హైదరాబాద్ లోని పేద ముస్లిం తల్లిదండ్రులు పదహారేళ్ళ వయసున్న తమ కూతుళ్ళని కేవలం డబ్బు కోసం ముసలి అరబ్ షేఖ్ లకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారని ఇది ఒక రకంగా అమ్మాయిల్ని అమ్మేయడమే నని ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వ్యాసం చూసి సాగర్ సర్హదీ ఆవేదనచెందాడు ప్రభావితుడయ్యాడు. ఆ అంశం పై తాను రూపొందించిన సినిమా ‘బాజార్’. ఆ వార్త చూసిన సాగర్ సర్హది స్వయంగా హైదరాబాద్ కు వచ్చి అనేక మంది రచయితల్నీ, జర్నలిస్టులనీ కలిసి వాస్తవ వివరాలు సేకరించడంతో పాటు అలాంటి ఒక ముస్లిం కుటుంబం వారి పెళ్లిలో కూడా పాల్గొన్నాడు కూడా. అట్లా రిసర్చ్ చేసి రూపొందించిన స్క్రీన్ ప్లే చూసిన సాగర్ మిత్రులు అది వర్క్ అవుట్ కాదు వదిలేయమని చెప్పినా మొండిగా ‘బాజార్’ సినిమాను నిర్మించాడు. నిర్మాణం పూర్తి అయిం తర్వాత విడుదల చేసేందుకు పంపణీదారులెవరు ముందుకు రాలేదు. కానీ ఒక సారి విడుదలయ్యాక 25 వారాలు ఆడి జుబ్లీ చిత్రంగా నిలబడింది. బజార్ సినిమా మొత్తం హైదరాబాద్ సంస్కృతి, ముఖ్యంగా పేద ముస్లిం కుటుంబాల జీవితాలని అత్యంత వాస్తవికంగా ఆవిష్కరిస్తుంది. నటీ నటులు నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్, ఫరూఖ్ షేఖ్, సుప్రియా పాథక్ లు ఆయా పాత్రలకు జీవం పోశారు. ఇక ఖయ్యాం సంగీతం బాజార్ సినిమాకు పెద్ద అలంకారంగా చెప్పాలి.

ఇట్లా హైదరాబాద్ నగరాన్ని ఈ నగరపు పెదజీవితాల్ని వారి నడుమవున్న అనుబంధాల్ని ఆవిష్కరించిన దర్శకుడు సాగర్ సర్హది గొప్ప విజయ వంతమయిన స్క్రీన్ ప్లే రచయిత. హిందీ సినిమాల్లో దశాబ్దాల క్రితం ఒక నూతన ఒరవడినే సృష్టించిన ‘కభీ కభీ’, ’సిల్ సిలా’ లాంటి సినిమాలకు ఆయన రచన చేసారు. అలాంటి సినిమాల్లో నటించిన అమితాబ్ బచ్చన్ ఏ స్థాయికి ఎదిగాడో మనకు తెలుసు. తర్వాత నూరీ, చాందిని, కహో నా ప్యార్ హాయ్ లాంటి సినిమాలకు కూడా సాగర్ సర్హదీ రచన చేసారు. తన ప్రతిభతో అద్భుతమయిన విజయాల్ని సాధిస్తున్న కాలంలో కూడా వ్యాపార సినిమారంగంలో అంతగా ఇమడలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు సాగర్.

వాస్తవానికి సాగర్ సర్హదీ 1933లో అవిభాజ్య భారత దేశంలో అబ్బోతాబాద్ కు దగ్గరలో వున్న బాఫా నగరంలో జన్మించాడు. గంగా సాగర్ తల్వార్ అతని మొదటి పేరు. దేశ విభజన వారి కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. స్వంత వూరు నుంచి వలస వెళ్ళాల్సిన స్థితి. ఆరేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయిన సాగర్ తర్వాత తాను దేశ సరిహద్దుకు చెందిన వాడిని అని సూచించేందుకు తన పేరును సాగర్ సర్హదీ గా మార్చుకున్నాడు, తొలుత ఉర్దూ కవిగా తన సృజన జీవితాన్ని ఆరంభించిన సాగర్ ఆనాటి ప్రగతిశీల రచయితలయిన కైఫీ అజ్మీ, సజ్జద్ జహీర్ ల ప్రేరణతో ప్రగతిశీల భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. కాలేజీ రోజుల్లో గుల్జార్ తనకు సీనియర్. ఉర్దూలో ప్రావీణ్యం సాధించి కథలు నాటకాలు రాయడం ఆరంభించాడు. ఒక రోజు తన నాటకం మీర్జా సహేబాన్ ప్రదర్శిస్తూ వుండగా ప్రేక్షకుల్లో వున్న యాష్ చోప్రా తన సినిమాలకు రాయమని అడిగాడు అట్లా రూపొందిందే ‘కభీ కభీ’ అట్లా పెద్ద సినిమాలకు రచన చేసినా సాగర్ మనసంతా వాస్తవిక సినిమా ప్రపంచం వైపే ఉండింది.

అనంతర కాలంలో 1992లో సాగర్ సర్హదీ ‘దీవానా’ సినిమాతో షారుఖ్ ఖాన్ కారీర్ ని, 2000లో ‘కహోనా ప్యార్ హై’ సినిమాతో హ్రితిక్ రోషన్ కారీర్ ని విజయాల బాట పట్టించిన సాగర్ సర్హదీ ఒక పంపిణీ దారుడుచేసిన మోసంతో ఆర్థికంగా నష్టపోయి మౌనంగా ఉండిపోయాడు. ఇవ్వాళ మంచి కథ కథానాలతో కాకుండా కేవలం సాంకేతిక హోరుతో సినిమాలు రావడమే బాధగా వుంది అన్న సాగర్ సర్హదీ చివరంటా కథలూ కవిత్వమూ చదువుతూ కాలం గడిపాడు. తాను అవివాహితుడిగానే జీవితాన్ని ముగించాడు. హైదరాబాద్ జన జీవిత కథను ‘బజార్’ సినిమా గా రూపొందించిన సాగర్ సర్హదీ ని సీరియస్ తెలంగాణా సినిమా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. తమ హృదయ పూర్వక నివాళి సమర్పించుకుంటున్నారు.

(దర్శకుడు సాగర్ సర్హదీ 22 మార్చ్ 2021 న ముంబైలో మరణించారు)

-వారాల ఆనంద్
కవి, సినీ విమర్షకులు, జాతీయ ఫిల్మ్ సొసైటీల సమాఖ్య కౌన్సిల్ సభ్యులు

8-4-641,
Hanuman Nagar,
KARIMNAGAR -505001 TELANGANA
+91-9440501281

You may also like

1 comment

Dasari Syamala June 23, 2021 - 9:52 am

సాగర్ సర్హది కభి కభి సినిమా బాజార్ సినిమా మళ్ళీ చూడని వారు దరదృష్టవంతులు ..
సా హిత్యము నైతిక. వాటికవే సాటి.. కభి కభి పాట గత 43 ఏళ్ల నుండి వినని రోజు లేదు.. అంత మంచి సినిమాల సృష్టి కర్త సాగర్ గారికి నా మనః పూర్వక నివాళులే కాదు.. దుఖః భాజనమైన మనసుతో రెండు కన్నీటి బొట్లు రాలటం …నన్నాశ్చర్య పరుస్తూ…
ఇంత మంచి విశ్లేషణ సాగరగరి గురించి రాసిన మీకు ప్రచురణ కర్తలకు ధన్యవాదాలు

Reply

Leave a Comment