యాదగిరిగుట్టకు ఒకరోజు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. కార్యక్రమం రచ్చ యాదగిరి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటైంది.
సభలో ఎంతోమంది పాల్గొన్నారు. కవి కాబట్టి రచ్చ యాదగిరి కూడా పాల్గొన్నాడు. కార్యక్రమం బాగా జరిగింది. భోజనాలు కూడా చేశాం మధ్యాహ్నం కాబట్టి.
రచ్చ యాదగిరి గారు నాదగ్గరకి వచ్చి ”మీ ప్రసంగం బాగుంది. మీరెక్కడుంటారు హైదరాబాద్లో” అని అడిగాడు. ”బోడుప్పల్” అని సమాధానమిచ్చాను. వెంటనే నాకు నా అర్ధాంగి ప్రమీల పేరు స్ఫురించింది. కారణమేమంటే ఆమె తల్లిగారి ఇంటిపేరు ‘రచ్చ’ కావడమే.
”నా భార్య రచ్చవాళ్ల ఇంటి ఆడపిల్ల. మీరు రచ్చ వాళ్లు కావడం ఆనందంగా ఉంద”న్నాను.
యాదగిరి గారికి నాతో కొంతసేపు మాట్లాడాలనిపించింది. ”మీ అత్తగారి ఊరేది? మీ మామ ఏ పని చేసేవారు. మీ అర్ధాంగి గృహిణియేనా?” వినయంగా ప్రశ్నించాడు. ”మా మామగారు హైదరాబాదు వాస్తవ్యులు. మెడికల్ డిపార్టుమెంటులో పని చేశారు. ఇప్పుడు నా భార్య లేదు” అన్నాను కళ్లు తుడుచుకుంటూ. యాదగిరి గారు నా స్థితిని అర్థం చేసుకున్నారు. ”మీరు మా ఇంటికి వస్తారా? దగ్గరనే” అని కోరారు. నేను కాదనలేకపోయాను. మా ప్రమీల పుట్టినింటికి వెళ్లినంత ఆనందమైంది నాకు. యాదగిరి ఇంటి వాళ్లంతా పరిచయమయ్యారు. మా ప్రమీల ఏ లోకంలో ఉందోగాని, ఆమె పుట్టిన ఇంటిపేరు ఎంత మహిమగలదో తెలిసింది.
నేను హైదరాబాదుకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాను. ”మీరు రావడంవల్ల మా ఇల్లు పావనమైంది” అంటూ ఇంట్లోంచి ఒక శాలువా తెచ్చి కప్పినారు.
యాదగిరి గారి సౌజన్యానికి ఎంతో మురిసిపోయాను. వారిని చూచినప్పుడు మా మామగారే గుర్తుకు వచ్చారు. మా మామ కూడా నన్నెంతో ఆదరించేవారు. ప్రేమతో పలకరించేవారు.
పుస్తకావిష్కరణ తర్వాత నేను యాదగిరిగుట్టకు ఎన్నిసార్లు వెళ్లానో నాకే తెలియదు. వెళ్లినప్పుడల్లా యాదగిరి గారింటిలో ఆతిథ్యం తీసుకోకుండా రాను. యాదగిరి గారి కుటుంబ సభ్యుల్లో నేనొకడినయ్యాను. యాదగిరి గారు ఆర్.ఎమ్.పి. డాక్టర్ కనుక అప్పుడప్పుడు ఆరోగ్య సంబంధమైన సూచనలు కూడా ఇచ్చినారు. నాకే చిన్న బాధ కల్గినా యాదగిరి గారితో చెప్పుకోవడం పరిపాటి అయ్యింది. వారు నా రచనలు కూడా చదివినారు. అప్పుడప్పుడు పద్యాలు రాసి నా చేత దిద్దించుకున్నారు.
ఒకమాటలో చెప్పాలంటే యాదగిరి గారు ఆత్మబంధువు లయ్యారు. హైదరాబాదుకు వచ్చినప్పుడల్లా నన్ను చూసి వెళ్తారు. ప్రతిరోజు ఫోన్లో తప్పక మాట్లాడుతారు.
యాదగిరి గారికి నాకు ఏమిటో విడదీయరాని సంబంధం కల్గింది. బహుశా మా ప్రమీల ఇంటిపేరు, వారి ఇంటి పేరు ఒకటి కావడమేనా? ఇంటి పేర్లొకటైనంత మాత్రాన ఇంత అనుబంధం ఏర్పడుతుందా?
ఇదంత ప్రమీల ప్రభావమేనని నా మనస్సు పదేపదే గుర్తు చేస్తుంది.