ఇంద్రసేన

by Sudharshan Chintapatla

                   మూలం: కలైగ్నర్ ఎం.కరుణానిధి                   అనువాదం : చింతపట్ల సుదర్శన్

అద్భుతమైన అందం ఆమెది. ఆమె ముఖంలో కాంతి ఆమె సౌందర్యాన్ని ప్రతిబింబిస్తున్నది. ఆమె ధరించిన ధవళ వ్రస్తం ఆమె నడకలోని హొయల్ని ప్రదర్శిస్తున్నది. తెల్లని ఆమె కంఠాన్ని నలుపురంగు పూసల కంఠాభరణం అలంకరించి వుంది. ఆమె తన అందమైన కేశాలను చుట్టగా చుట్టింది. ఆమె తలమీద ఒక బుట్ట ఉన్నది. తల మీద బుట్టటను మోస్తూ వీధి వెంట ఆమె నడుస్తుంటే ఒక అసమానమైన సౌందర్యరాశి కదిలిపోతున్నట్టుంది. చీకటిగా ఉన్న ఆ వీధిలో ఆమెను చూసిన వారెవరైనా ఆమె దివి నుండి భుమికి దిగివచ్చిన నక్షత్రమా అనుకుంటారు.

బంగారు వర్ణంలో ఉన్న ఆ సౌందర్య రాశి తలమీద ఉన్న బుట్టలో నుంచి భయంకరమైన దుర్వాసన వస్తున్నది. ఆ బుట్టలో ఒక కుళ్ళిన ఆకారం వుంది. బుట్టను మోయడం భారంగా ఉన్నందున ఆమె చేతులు కొంచెం వణుకుతున్నవి. అయినా ఆ అందగత్తె విశ్రమించకుండా నడుస్తూనే ఉంది. ఆమె అద్భుతమైన అవయవ సౌష్ఠవం కవులకు విషాదంలో కూడా అందం సహజత్వం కోల్పోదని ఋజువు చేస్తుంది.  బుట్టలో ఉన్న కుళ్ళిన దేహం ఉన్న ఆకారం తను అనుభవించబోతున్న ఆనందాన్ని ఊహించుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నది. ఆ ఆకారం ఒక పురుషుడిది!

వికారంగా ఉన్న ఈ మనిషి తన దేహంలోని పావుభాగాన్ని ఇదివరకే పోగొట్టుకున్నాడు. ఆయన మామూలు మనిషేం కాదు. గొప్ప మహర్షి. విద్య, సంపద, బలం మనిషిని మార్చేసినట్టుగానే అనారోగ్యం కూడా మనిషిని పూర్తిగా మార్చేస్తుంది. ఈ మనిషి కుష్టురోగి. ఈయన తన భార్య తల మీద ఉన్న బుట్టలో ప్రయాణిస్తున్నాడు.

“ఏయ్! ఏమిటానడక! తొందరగా నడవలేవా?” అన్నాడు పతి.

‘స్వామీ నా జీవన సహచరుడా నేను వేగంగానే నడుస్తున్నాను’ అంది సతి.

‘త్వరగా త్వరత్వరగా పద ఇంద్రసేనా నువ్వు కింద పడాల్సి వచ్చినా నన్ను మాత్రం క్రిందపడవేయకు సుమా!’

‘అలా అనకండి స్వామీ!’ నా కంఠం నుంచి ప్రాణం పోయినా సరే మిమ్ములను క్రింద పడనీయను. నా తలమీద బుట్టలో ఉన్నది అమ్మకానికి సరుకు కాదు. మీరు నాకు అమూల్యమైన రత్నం. మిమ్మల్ని ఎలా కింద పడేస్తాను?’

కుష్టురోగి అయిన భర్తను తలపై బుట్టలో మోస్తున దేవసేన అందమైన ముఖాన్ని దుఃఖం కమ్మసేంది. ఆమె తన భర్తను ఎక్కడికి తీసుకువెళ్తున్నది? ఆమె భర్త ఏదైనా పవిత్ర తీర్థంలో స్నానమాడి దైవదర్శనం చేసుకోవాలనుకుంటున్నాడా? కాదు… కాదు, ఆ మనిషి తన భార్యను వాహనంగా ఉపయోగిస్తూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ ప్రయాణం ఏ దేవాలయానికీ కాదు, ఏ దేవుని సేవకూ కాదు.

ఈ ప్రయాణం ఒక వైశ్య గృహానికి. దేని కోసం? ఆమెను తన వృత్తి మాని భగవధ్యానంవైపు దృష్టి మళ్లించమని చెప్పడానికా? ఆ కుష్టురోగి ఉద్దేశ్యం ఆ వేశ్యా గృహాన్ని ఒక పవిత్రస్థలంగా మార్చేయడమా? కాదు.

ఆ ఋషి ప్రయాణం వేశ్య దగ్గరికి ఆ ఋషి ఉద్దేశ్యం ఆ వేశ్యంలో సుఖించడమే. ముక్కంటి అయిన శివుడ్ని ఆయన చూడాలనుకోవడం లేదు. తన రెండు కళ్ళను వేశ్య జతకళ్ళతో కలిపి ఆమెను కౌగలించుకోవాలనుకుంటున్నాడు.

తన భర్తకు ధనంతో సుఖాన్ని అందించడానికి ఆయనను తలమీద మోసుకుపోతున్న స్త్రీ పూర్తిగా వికసించిన గులాబీ పువ్వులా వుంది. ఈ గులాబీనే కుళ్ళిపోయిన తేనెటీగను ఒక ఎండిపోయిన పుష్పం దగ్గరికి మోసుకుపోతున్నది.

వాళ్ళిద్దరూ సుఖాన్ని అందించే వనిత ఇంటిని సమీపించారు. ఇంద్రసేన కష్టం తీరబోతున్నది. గమ్యం చేరడంతో బుట్టలో ఉన్న భర్త ఆందోళన తగ్గింది. ఇంద్రసేన బుట్టను దించి నేలమీద పెట్టింది. ఆమె అలసిపోయిన శరీరాన్ని నొప్పిగా ఉన్న ఎముకలను సరిచేసుకోవడానికి ఒళ్ళు విరుచుకుంటూ అన్ని వైపులకూ తిరిగింది.

అక్కడ కవి ఎవరైనా ఉండి ఉంటే ఆమెను ఇంద్రధనుస్సుతో పోల్చి ఉండేవాడు. చిత్రకారుడు ఎవరైనా ఉండి ఉంటే ఆమె చిత్రాన్ని గీసి ఉండేవాడు. ఇంతటి సౌందర్యవతి భర్త సుఖం కోసం సమాజం అంగీకరించని స్త్రీ ఇంటికి ఆయనను తలమీద బుట్టలో మోస్తూ తీసుకువచ్చింది.

ఇంద్రసేన సున్నితమైన చేతిలో ఆ ఇంటి తలుపు తట్టింది. తలుపు పూర్తిగా తెరవడానికి ముందు ఒక ముఖం బయటకు తొంగి చూసింది. ముడతలు పడ్డ ముఖంలో రక్తం స్రవిస్తున్న చెంపలతో ఉన్న ఆ ఋషి తీవ్రమైన కామవాంఛతో సుఖం… నిజమైన సుఖం అని అరవసాగాడు. నొప్పిగా ఉన్న ఎముకలను సరిచేసుకోవడానికి ఒళ్ళు విరుచుకుంటూ అన్ని వైపులకూ తిరిగింది.

అక్కడ కవి ఎవరైనా ఉండి ఉంటే ఆమెను ఇంద్రధనుస్సుతో పోల్చి ఉండేవాడు. చిత్రకారుడు ఎవరైనా ఉండి ఉంటే ఆమె చిత్రాన్ని గీసి ఉండవాడు. ఇంతటి సౌందర్యవతి భర్త సుఖం కోసం సమాజం అంగీకరించని స్త్రీ ఇంటికి ఆయనను తలమీద బుట్టలో మోస్తూ తీసుకు వచ్చింది.

ఇంద్రసేన సున్నితమైన చేతితో ఆ ఇంటి తలుపు తట్టింది. తలుపు పూర్తిగా తెరవడానికి ముందు ఒక ముఖం బయటకు తొంగి చూసింది. ముడతలు పడ్డ ముఖంలో రక్తం స్రవిస్తున్న చెంపలతో ఉన్న ఆ ఋషి తీవ్రమైన కామవాంఛతో సుఖం.. నిజమైన సుఖం అని అరవసాగాడు.

బయటకు వచ్చిన వేశ్య తల మీద చేయి ఉంచి ఆశీర్వదించాడు. ఆ చేతికి వేళ్ళు లేవు.

ఇంద్రసేన అంది, ‘ఓ స్త్రీ నేను చెప్పేది విను. ఈయన నా భర్త. నువ్వు కావాలని కోరుకుంటే తీసుకువచ్చాను. ఆయనను సంతోషపెట్టు.

వేశ్యకు ఆశ్చర్యంతో మాట పెగలలేదు. ఒక భార్య తన భర్తను వేశ్య ఇంటికి తీసుకురావడం జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నాను అని అనుకుంటూ బుట్టలో ఉన్న కుష్టురోగివైపు ఈసడింపుగా చూసింది. ఆయన  బుట్టలో నుంచి బయటకు రావడానికి ముందు ఇంద్రసేన వేశ్యకు బంగారు నాణాల సంచీ అందించింది. వేశ్య కళ్లు మెరిశాయి. ఆమె కుష్టురోగిని కావలించుకుని స్వర్గసుఖాలు అందించడానికి తన పడకగదికి తీసుకుపోయింది.

ఇంద్రసేన భారంగా నిట్టూర్చింది. ఇంటి తలుపుముందు బుట్టను ఉంచి కాపలా వాడితో ‘నేను ఉదయాన్నే తిరిగి వస్తాను’ అని చెప్పి వెళ్ళిపోయింది.

ధూళి కప్పిన పుష్పగుచ్ఛంలా ఉన్న ఇంద్రసేన ఎవరో వెనుక నుంచి ‘ప్రియమైన ఇంద్రసేనా క్షణం ఆగు’ అనడంతో నడక ఆపింది. తమ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉండే మరో ఆశ్రమపు స్త్రీ పరుగెత్తుకు వచ్చింది.

‘నువ్వా! ఉలగా! నువ్వు ఈ వీధికి ఎందుకు వచ్చావు’ అని అడిగింది. బుగ్గలమీది నుంచి కారుతున్న కన్నీటిని తుడిచేస్తూ ‘ఉద్యానవనానికి వెళ్తున్న నేను నిన్నూ చూసి వచ్చాను. ఏమీ అనుకోనంటే ఒక విషయం అడగనా’ అంది ఉలగ. ‘ఏమిటో అడుగు’ అంది ఇంద్రసేన నవ్వడానికి ప్రయత్నిస్తూ,

‘నీకు నీ భర్త అంటే ఎంతో ప్రేమ అని నాకు తెలుసు. కానీ ఆయనను నువ్వొక వేశ్య ఇంటికి తీసుకురావడాన్ని నా మనస్సు అంగీకరించడం లేదు.’

‘మాట్లాడకు ఉలగా! స్త్రీకి భర్తే దైవం. భర్త కోరికలు తీర్చడమే భార్య కర్తవ్యం. అనారోగ్యం కారణంగా నా భర్త ఆకారం ఇతరులకు నచ్చకపోవచ్చు. కానీ నా కంటికి మాత్రం ఆయన అందగాడే. నా భర్తతో ఎలా ప్రవర్తించాలో నాకు సలహా ఇవ్వకు.’

‘క్షమించు ఇంద్రసేనా. నేను నీ ప్రేమను భక్తిని అపార్థం చేసుకున్నాను. నీలా భర్తను అర్థం చేసుకునే స్త్రీ పధ్నాలు లోకాల్లో ఎక్కడా ఉండదు.’

‘నన్ను అర్థం చేసుకుంటే చాలు ఉలగా నేను నిన్ను క్షమించాల్సిన పనిలేదు. నువ్వు కూడా నాలా పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించు. నా లాంటి పతివ్రత అడుగుజాడల్ని అనుసరించు’ అంటూ ఇంద్రసేన తమ ఆశ్రమంవైపు నడిచింది. ఉలగకు తన తప్పు తెల్సి వచ్చింది. మహా పతివ్రత అయిన ఇంద్రసేన మాటలను పునశ్చరణ చేసుకుంటూ వెళ్తుంటే ఒక యువకుడు వచ్చి తన చేతులతో ఆమె కళ్ళు మూశాడు. తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ ఉద్యానవనానికి వెళ్ళారు.

దారి పొడవునా దుఃఖపడుతూ ఇంద్రసేన ఆశ్రమం చేరుకుంది. కిందపడి పెద్ద పెట్టున శోకించింది. ఆమె నీలికళ్ళ నుంచి కన్నీరు కాలువ కట్టింది. పున్నమి చంద్రుడ్ని మబ్బులు దాచేసినట్టు చిందరవందరగా ఉన్న నల్లని జుట్టు ఆమె ముఖాన్ని కప్పేసింది.

తోటలో నుంచి ఒక పాట గాలిలో తేలుతూ వచ్చింది. ఇంద్రసేన నీళ్ళు నిండిన కళ్ళతో ఆ పాట విన్నది. ఇది ఉలగ కంఠమే అనుకుంది. ఒక పురుష కంఠం కూడా వినిపించింది. ఇంద్రసేనను పవిత్రమైన స్త్రీగా అంగీకరించిన ఉలగ తన ప్రియుడితో యుగళగీతం ఆలపిస్తున్నది. ఉలగ వయస్సు నా వయస్సు ఒకటే. నేను ఆమె కంటే అందగత్తెను కానీ నన్ను ప్రేమించే వాడు లేని దాన్ని. ఆమె ప్రియుడు ఆమె చెవిలో గుసగుసలాడుతుండి ఉంటాడు అనుకుంది ఇంద్రసేన.

ఇంద్రసేన తమ ఇదివరకు ఎన్నడూ ఊహించనిది ఊహించసాగింది. ఆమె ముఖం మళ్ళీ కన్నీటితో తడిసింది కాని ఆమె కన్నీటిని తుడవలేదు. ఇంద్రసేన లాగానే ఉన్న మరో యువతి గదిలో ప్రవేశించింది. ఇద్దరూ పక్కపక్కనే ఉంటే ఎవరు ఎవరో కనుక్కోవడం కష్టమే. ఆ స్త్రీ వచ్చి ఇంద్రసేన పక్కనే కూచుంది. ఇంద్రసేన ‘రా! రా! నా హృదయమా! నా అంతరాత్మా’ అంటూ ఏడుస్తూనే స్వాగతం పలికింది.

‘ఇంద్రసేనా! ఎందుకు దుఃఖిస్తున్నావు? అంది అంతరాత్మ.

‘నీకు తెలియదా నా హృదయమా? నేను ఎడారి ఇసుకలో క్రిమిగా మారానని, తోటలో నుంచి ప్రేమపక్షులపాట వినిపిస్తున్నది కదా. కోరికకు సంబంధించిన అలాంటిపాట వింటే నా వంటి వయసులో ఉన్న స్త్రీకి ఎలాంటి భావాలు కలుగుతాయో నీకు తెలుసని నాకు తెల్సుకానీ నువ్వు నన్ను శాంతపరచడానికి మౌనంగా ఉంటావు.’

‘నువ్వన్నది అక్షరాలా నిజం ఇంద్రసేనా. ఉలగ కూడా నువ్వు పతివ్రతావని అన్నది. ఆ కీర్తికాంతిలో నువ్వు తృప్తిగా ఉండవచ్చు కదా!’

‘నువ్వు చెప్పు నా హృదయమా! నిజం చెప్పు నేను పతివ్రతనా ఎలా? ఎలా?’

‘నువ్వు కుష్ఠురోగి అయిన నీ భర్తను ఒక వేశ్య దగ్గర దించి వచ్చావు. ఖచ్చితంగా నువ్వు పతివ్రతవే.’

‘వేళాకోళం ఆడకు హృదయమా. నేను ఒక కుష్టురోగితో కోరికలు తీర్చుకోలేను. కానీ ఆయన నన్ను సుఖం యివ్వమని కోరుతాడు. ఆయనను కనీసం కౌగలించుకోవడానికి నా చేతులు వణుకుతాయి. అందుకే వేశ్య ఇంటికి పంపివచ్చాను. తన కామదాహాన్ని తీర్చుకుంటడని. నా అందానికి హాని కలగదని. అర్థం అయిందా నా హృదయం’

‘ఉలగ మాత్రం నీకు నీ భర్త పట్ల ఉన్న ప్రేమను నమ్ముతున్నది. తన తల మీద కుష్టురోగి భర్తను తలమీద మోసుకుని వేశ్య దగ్గరికి తీసుకెళ్లిన పతివ్రత అనుకుంటున్నది.’

‘నేను నా భర్తను తలమీద మోసుకు వెళ్ళిన మాట నిజం. నేను నా తలమీద బుట్టను మాత్రమే మోసుకువెళ్తాను. ఆయన గంపలో ఉన్నాడు. ఒక కుష్టు రోగిని చేతులతో ముట్టుకోవడానికి తలమీద మోయడానికి నేనేం పిచ్చిదాన్నా!’

‘నిన్ను కూడా ఉలగ ఉన్నది. నీ భర్త నిన్ను కఠినంగా దూషించినా నువ్వు ఒక్కమాట కూడా మారు మాట్లాడవని?

‘కుష్టురోగి అయిన భర్త మాటలు నేను పట్టించుకోను. నేను తిరిగి మాట్లాడాలంటే ఆయన పక్కనే నిలబడి మాట్లాడాల్సి వస్తుంది. అది నాకు అసహ్యం. అందుకే నేను ఆ కుష్టురోగిని అలా మొరగనిస్తాను.’

‘అలాగా! ఏదయితే యేంలే. ఇప్పుడు నువ్వు భర్తకు అంకితమయిన భార్యగా పేరు తెచ్చుకున్నావు. పాతివ్రత్యానికి నువ్వు ప్రతిరూపం అని ప్రపంచం మెచ్చుకుంటుంది’.

‘నాలో సజీవంగా ఉన్న అగ్నిపర్వతం గురించి ఎవరికి తెలుసు? ఈ కీర్తివల్ల యవ్వనాన్ని వృధా చేస్తున్న నాకు ఏమి లాభం? నాకు కావల్సింది దాంపత్య సుఖం. దాంపత్య సుఖాన్ని అనుభవించే మార్గం చెప్పు అంతరాత్మా!’

‘ఇంద్రసేనా నీ అంతరాత్మగా నిన్ను ఆశీర్వదిస్తాను. వీలయినంత త్వరగా ఈ జన్మను ముగించు. మరుజన్మలో నువ్వు ద్రౌపదిగా జన్మిస్తావు. భర్త ఉండీ నువ్వు ఏ ఆనందాన్ని పొందలేకపోయావు. నీ జీవితం నిరుత్సాహంగా నిరాశాజనకంగా గడిచిపోయింది నీ మనస్సుకు ప్రశాంతత అన్నది ఎప్పుడూ లేదు. మరు జన్మలో నువ్వు ఐదుగురు భర్తలతో జీవిస్తావని నేను గట్టిగా నమ్మతున్నాను.’

‘ఐదుగురు పతులా? నువ్వు చెప్పేది నిజమేనా?’

‘నిజమే. నీ కోసం కొత్త జీవితం రెండూ ఒకటే అర్థం చేసుకో నా ప్రియసఖీ’.

ఇంద్రసేన ఆనందానికి అవధుల్లేవిప్పుడు. అంతరాత్మను గాఢంగా ఆలింగనం చేసుకుంది. ఆమె దుఃఖాశ్రువులు ఆనందాశ్రువులుగా మారాయి. ఆ రోజు ఆశ్రమమంతా ఒక మధురమైన గానం ప్రతిధ్వనించింది.

కలైగ్నర్ కరుణానిధి ప్రసిద్ధ భారతీయ రచయిత, రాజకీయ నాయకుడు. రెండు దశాబా్దల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన కరుణానిధి 1924లో జన్మించి 2018లో అస్తమించారు. ్రదవిడ మున్నేట్ర కజగమ్ పార్టీ నాయకుడైన కరుణానిధి కుమారుడు స్టాలిన్ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి. కరుణానిధి తమిళభాషలో కథలు, నాటకాలు, నవలలు రాశారు. సంస్కరణ, వ్యంగ్యం, అధిక్షేపం ఆయనకు కథలో ప్రత్యేకత. పురాణకథల ఆధునిక రూపం కల్పించిన కరుణానిధి కథల్లో ‘ఇంద్రసేన’ ఒకటి.

ఇంద్రసేన నలదమయంతుల కుమార్తె. ఆమె భర్త మౌదల్యుడు స్త్రీ మనస్తత్వాన్ని ఈ కథలో ఆధునికంగా చిత్రించాడు కరుణానిధి. హిందూ పురాణాల ప్రకారం ఇంద్రసేన మరుజన్మలో ద్రౌపదిగా జన్మించింది.

You may also like

2 comments

MAA SATYAM April 18, 2022 - 4:32 pm

మా సత్యం
చింతపట్ల సుదర్శన్ గారి
అనువాదం వచన కవిత్వం చదువుతున్నట్టుగా ఉంది.
అనువాద రచనల పట్ల ప్రఖ్యాత రచయిత వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి మాటలు గుర్తుకొస్తున్నాయి.
“రచన కత్తిమీద సమైతే, అనువాదం రెండు కత్తుల మీదసాము”.
కథ లోని పాత్రల మన ప్రవృత్తి కళ్ళముందు కదలాడుతోంది. కళాత్మక రీతిలో ప్రవేశపెట్టారు. మూలకథ కన్నా మీ అనువాదం అద్భుతంగా ఉంది. చదివే పాఠకుల్ని మూలకథ వైపు దృష్టి మళ్లిస్తుంది.

Reply
Vishnucharan Sribhashyam April 19, 2022 - 6:13 am

ఇది అనువాద సాహిత్యం అని చెప్పినప్పటికీ సృజనాత్మక సృష్టి అనిపిస్తుంది
సుదర్శన్ గారికి అభినందనలు, అభివాదములు

Reply

Leave a Comment