Home వ్యాసాలు ఇంద్ర ధనస్సు ఏడో రంగు

ఇంద్ర ధనస్సు ఏడో రంగు

by Devanapalli Veenavani

‘స్వేచ్ఛ ‘అన్న పదం ‘   స్వాతంత్య్రం ‘  కన్నా విశాలమైన అర్థం కలదని భావిస్తాను.  స్వాతంత్య్రం భౌతికమైనది ,అది అధీనతను సూచిస్తే, స్వేచ్ఛ ఆంతరంగికమైనది వ్యక్తుల ఆలోచనలను సూచిస్తుంది  .  ‘స్వాతంత్య్రం ‘లేని స్వేచ్ఛ విప్లవానికి పునాది అవుతుంది. స్వేచ్ఛ లేని  ‘ స్వాతంత్య్రం’లో  జాతి ఉనికినే  కోల్పోతుంది.  ఆది నుంచి జాతుల మధ్య  ఆధిపత్య పోరాటాలే చరిత్రను సృష్టించాయి.ప్రపంచ వ్యాప్తంగా మానవతా వాదం ముందుకు రావడం తో ఆధిపత్య ధోరణి   తగ్గినా పూర్తిగా తొలిగిపోయిందని చెప్పలేము.  అయితే ఈ మానవతా వాదం అంత సులువుగా అంగీకరించబడలేదు.ముందు దేశాల స్వాతంత్య్రం,  స్వేచ్చ , సమానత్వం, ఆయా  దేశాలు తమ సార్వభౌమాదికారాన్ని సాధించుకోవడం, విప్లవాలు మేల్కొలిపిన నైతిక భావనలు ఇవన్నీ దాని వెనుక ఉన్న నేపథ్యం.

           సార్వ భౌమాధికరం  నెలకొల్పుకొని స్వేచ్ఛాయుత  జీవనం కొనసాగించడంలో ఒక్కో దేశం ఒక్కో పంథా పాటించినా భారతదేశం సాగించిన పోరాటం మాత్రం అద్వితీయమైంది. అహింసా, సత్యాగ్రహం అనే పదునైన నైతిక ఆయుధాలతో భారతదేశం సాగించిన పోరాటం ప్రపంచ స్వతంత్ర పోరాటలలోనే  విలక్షణమైనది. అది 19 శతాబ్దపు నయా యుద్ద రీతిగా  ప్రపంచ దేశాలకు చుక్కాని అయింది.  

               భారత  స్వాతత్య్రోద్యమం పరిశీలించినట్లయితే గాంధీకి ముందు గాంధీ తర్వాత గా విభజించడం తెలుస్తుంది. గాంధీ అంతగా మన స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేయడం వెనుక ఉన్న నేపధ్యం ఏమిటి ?  దక్షిణాఫ్రికా లో గాంధీ సాధించిన విజయాలు ఏమిటి ?దక్షిణాఫ్రికాలో సాధారణ  వకీలు నుంచి ఏ పరిస్థితులు అతని ఇంతటి మహోన్నత కార్యంలో పాలుపంచుకునేలా చేశాయి ? అసలు దక్షిణాఫ్రికా కి భారతదేశానికి ఉన్న సంబంధం ఏమిటి? గాంధీ అక్కడ అంటే దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టిన ఉద్యమం ఎటువంటిది? అన్న విషయాలు నన్ను చరిత్ర చదువుకునే రోజుల్లో  ఆలోచింపజేసిన ప్రశ్నలు .  

                   వీటికి  సమాధానంగా నాకు   దొరికిన  సిద్ధాంత గ్రంధానికి సరిసమానమైన పుస్తకం  ఇంద్రధనస్సు ఏడో రంగు. నేనిప్పుడు పరిచయం చేయబోయే ఈ పుస్తకం నూటాయాభయ్యే ల్ల  ఆఫ్రికన్ జాతులు ఇంకా అక్కడ బతక వచ్చిన వివిధ దేశీయుల సంఘర్షణను సంగ్రహంగా 200 పేజీలలో  విశ్లేషణాత్మకంగా అందించిన ఈ పుస్తకం  2003లో వచ్చింది. నేను దాన్ని  ఒక చిన్న వ్యాసంలో కుదించడం  ఇప్పుడు నా ముందున్న సవాలు.   పుస్తక రచయిత పెన్నేపల్లి గోపాలకృష్ణ.1937 లో జన్మించిన పెన్నేపల్లి గారు  జామీన్ పత్రికలోనూ, ఉదయం, వార్త పత్రికలోనూ పనిచేసి 2001 నుంచి పూర్తిగా సాహిత్య వ్యాపకంలో ఉన్నారు.పెన్నేపల్లి వారి రచనల్లో ముఖ్యమైనవి ‘ఇంద్రధనస్సు ఏడో రంగు’ , ‘మధురవాణి ఊహాత్మక ఆత్మకథ’ , ‘గురజాడ డైరీస్ ‘,    ‘గురజాడ కంప్లీట్ వర్క్స్ ‘  . ఇంద్ర ధనుస్సు ఏడో రంగు పుస్తకం రాయడానికి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు కి చెందిన ఈ ఎస్ రెడ్డి ( ఏనుగు శ్రీనివాసులు రెడ్డి ) ఐక్యరాజ్య సమితి తరపున దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష విమోచన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని   సేకరించిన సమాచారంతో పాటు రచయిత మరి కొంత సమాచారాన్ని సేకరించి దీన్ని సమగ్రంగా తీర్చిదిద్దారు. ప్రతి వాక్యానికి విశ్లేషణకి ఆధారంగా ప్రతి అధ్యాయం చివర దాని తాలూకు ప్రతుల వివరాలు పొందుపరిచారు.రచయిత  2011లో వారి 73వ వయసులో మరణించారు  .ఈ వ్యాసం ద్వారా ఇంతటి సమగ్ర సమాచారాన్ని అందించిన పెన్నేపల్లి గోపాలకృష్ణ గారికి  సవినయంగా నివాళులు అర్పిస్తూ పుస్తకంలోకి వెళ్దాం.

                      దక్షిణాఫ్రికాని ఇంద్రధనస్సు దేశం అంటారు ఎందుకంటే అక్కడ స్వతహా గా  ఉండే నల్లజాతి ప్రజలు , వలస రాజ్యాలు స్థాపించిన  పోర్చుగీస్ వారు ,బ్రిటిష్ వారు , ఫ్రెంచి వారు ఇంకా బతకడానికి వచ్చిన భారతీయులు ,చైనీయులు వీరందరి సంతతి జాతులు ఇలా అనేక రకాల జాతుల సంగమంగా ఉంది గనుక దీనికా పేరు వచ్చింది. స్వతహాగా ఉన్న జాతులు ఎప్పుడూ గుర్తింపుకు నోచుకోలేదు .వారి స్థితిగతులు అత్యంత దయనీయంగా ఉండేవి.  భారత దేశం లో వలనే పోర్చుగీసు వారు దక్షిణాఫ్రికాలో మొదట  స్థావరం ఏర్పరచుకున్నారు . వారి స్థావరాలలో పని చేయడం కోసం భారతదేశం నుంచి మహిళలను బానిసలుగా  రవాణా చేశారు భారతదేశంలోని డచ్ ఈస్టిండియా కంపెనీ ఈ వ్యవహారాన్ని చూసుకునేది .బెంగాల్, బీహార్ ,ఒరిస్సా,పులికాట్ ,మచిలీపట్నం ,గోవా , బాంబే,  సూరత్ నుంచి ఎక్కువగా ఇలాంటి వలసలు జరిగాయి .కొంతమంది మహిళలు వివాహమాడి అక్కడే స్థిరపడ్డారు.ఇలా మహిళల, కూలీల రవాణా 1650 నుంచి బ్రిటిష్ సామ్రాజ్యంలో  1834లో  బానిస వ్యవస్థ రద్దు చేసే వరకు అంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగింది. అప్పటికీ దక్షిణాఫ్రికాలో డచ్ ఆధిపత్యం లో వలస పాలన ఉండేది.

 భారత్ లో   బ్రిటిష్ ప్రభుత్వం 1860 నుంచి కొత్త చట్టం  Indentured Labour Act ద్వారా వలస దేశాలకు కూలీలను రవాణా చేసింది .ఈ చట్టంలో,  కూలీగా వెళ్లిన వ్యక్తి ఐదు సంవత్సరాలు కాంట్రాక్టు  కూలిగా మరొక ఐదు సంవత్సరాలు స్వతంత్ర కూలీగా పని చేయవలసి ఉంటుంది . కూలీ యజమానికి ఎదురు తిరిగిన పక్షంలో  కొరడా దెబ్బలు తినవలసి ఉంటుంది. అయినప్పటికీ 1860 లలో భారత దేశంలోని తీవ్ర క్షామ పరిస్థితులలో పేద ప్రజానీకం దేశం విడిచి వెళ్లారు. ఆచరణలో ఈ చట్టం ప్రకారం వలస కూలీల జీవనం దుర్భరం కావడంతో ఇది బ్రిటీష్ సామ్రాజ్యానికి చెడ్డపేరు తేవడంతో కూలీల రవాణా ప్రోత్సహించడం  కోసం 1874లో  కొరడా శిక్షను   రద్దు చేేశారు. కూలీల కనీస సౌకర్యాలు లేకపోవడం ,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రి 9 గంటల తర్వాత భారతీయులు వీధులలో తిరగకుండా నిషేధం చిన్న చిన్న తప్పులకు జైలు శిక్షలు, యజమానులు  పెట్టే బాధలు ,చాలీచాలని జీతాలు ,అనారోగ్యం భారతీయ కూలీలు తిరిగి వెళ్ళలేక అక్కడ ఉండలేక ఇబ్బందుల పాలయ్యారు.

          ఇక  వ్యాపార నిమిత్తం దక్షిణాఫ్రికా కి వలస వచ్చిన రెండో వర్గం” ఫ్రీ పాసెంజర్ “ల పేరుతో వ్యవహారించబడ్డ వీరు  ఎక్కువగా గుజరాత్ నుంచి వచ్చారు . అయితే ఈ రకమైన వ్యాపార వర్గం ఉండడం ఇష్టం లేని ప్రభుత్వం భారతీయుల వల్లనే అనేక రకాల కష్టనష్టాలు వస్తున్నాయని ,అవినీతి అక్రమాలు పెరుగుతున్నాయని ,రకరకాల జబ్బులు వస్తున్నాయని ఆరోపించి ఈ వలసలు తగ్గించడానికి  జస్టిస్ రాక్ విచారణ కమిషన్ 1857లో ఏర్పాటు చేసి నియంత్రణ విధించింది.అయినా వలసలు తగ్గక పోవడంతో 1895లో ఇమిగ్రేషన్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం భారతదేశం స్థిర నివాసం ఏర్పర్చుకునే భారతీయులు తలకు మూడు పౌన్లు  చెల్లించాలి కాంట్రాక్టు కూలీలు ఉండవచ్చు కానీ స్వతంత్ర కూలీలు పన్ను  చెల్లించి లైసెన్స్ పొందాలి.

పంతొమ్మిది వందల 1897లో మరింత కఠినంగా డీలర్స్ లైసెన్సింగ్ యాక్టర్ ప్రకారం అకౌంట్ లన్ని ఇంగ్లీష్ లోనే ఉండాలి లైసెన్స్ అధికారం ప్రభుత్వానిదే దానిమీద అప్పీల్ చేసుకునే అధికారం వ్యాపారికి ఉండదు.1885లో ఉన్న మరో చట్టం  ప్రకారం 25 పౌండ్లు రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించిన భారతీయులకు మాత్రమే ట్రాన్స్వాల్ లో నివసించే హక్కు ఉంటుంది. డచ్ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లి భారతీయుల కొరకు బజార్లు అనబడే వెలి వాడలు కేటాయించాలని అవి దాటి రాకూడదని వ్యాపారులు కూడా వ్యాపారాలు సాధించుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని చట్టం చేశారు .ఆ విధంగా భారతీయులు కూలీలు మాత్రమే అంతకుమించి అంటరానివారు కూడా. అలాంటి పరిస్థితిలో గుజరాత్ వ్యాపారుల తరఫున న్యాయవాదిగా దక్షిణాఫ్రికా చేరిన గాంధీ 1894లో తిరిగి భారత్ రావాలని అనుకున్నప్పటికీ అక్కడ ఉన్న ప్రజల కోరిక మేరకు అక్కడే ఉండి భారతీయుల సమస్యలని పరిష్కారం దిశగా నడిపించాలని తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు .

మొదట మహర్జీల ( మహా ఆర్జీ) పోరాటం. భారతీయుల సమస్యలన్నీ ఆర్జీ రూపంలోప్రభుత్వానికి సమర్పించారుఅయితే వాటికి ప్రభుత్వం నుంచి ఏమాత్రం పరిష్కారం దొరకలేదు   ఆ  కాలంలోనే  జరిగిన  బోయర్ యుద్ధంతో  (అంటే డచ్ తో ఆధిపత్యం కోసం బ్రిటిష్ వారు  చేసిన యుద్ధాలలో ) బ్రిటిష్ వారి అధికారం 1904లో స్థిరపడింది.అప్పటికి గోపాల కృష్ణ గోఖలే గాంధీ మరికొంతమంది మితవాదులు భారతదేశంలోని దక్షిణాఫ్రికాలో ఓకే సామ్రాజ్యవాదం భారతీయుల సమస్యలు పరిష్కరించబడని అందుకు తగిన అహింసాయుత పోరాటం సరిపోతుందని భావించారు. భారత్ లోనూ దక్షిణాఫ్రికాలోనూ  ఒకే వలస ప్రభుత్వం ఉన్నది కనుక సామరస్యంగా సమస్యలు పరిష్కరించాలని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బ్రిటిష్ వారు రూపొందించిన భారతీయుల తప్పని సరి  రిజిస్ట్రేషన్ చట్టం( 1906) నల్ల  చట్టం గా పేర్కొంటూ మొదటి సత్యాగ్రహ  ఉద్యమం చేశారు.గాంధీకి సంకెళ్లు వేసారు. సత్యాగ్రహం ఒక పదునైన ప్రజా ఉద్యమంగా రూపు దిద్దుకున్న సంఘటన ఇదే.ఉద్యమం ఎంత తీవ్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాలేదు.కాకపోతే 1911లో అప్పటి భారత ప్రభుత్వం వలస కూలీ చట్టం రద్దు చేసింది.

                ఇక దక్షిణాఫ్రికా లో 1910 నుంచి నాలుగు వలస ప్రభుత్వాల స్థానంలో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పడింది.  ఇప్పుడు మరో మెలిక.. కేవలం క్రైస్తవ పద్దతిలో జరిగిన వివాహాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని. అలా 1913 లో మరింత విశాల భూమికగా మరో సారి సత్యాగ్రహం మొదలైంది.దీన్ని మహాయత్ర గా పేర్కొంటారు. ఉద్యమంలో శ్రామిక వర్గం ప్రవేశించడం ఒక మలుపు.దీని ఫలితంగా ఇండియన్ రిలీఫ్ ఆక్ట్ ఏర్పడింది. గాంధీ ఈ చట్టాన్ని భారతీయుల మాగ్నాకార్టా గా వర్ణించాడు ఆధునిక కాలంలో ఏ ఉద్యమమూ సాధించని ఫలితాలను సత్యాగ్రహం సాధించగలదని గుర్తించాడు.

 ఆ తర్వాత  1914లో  దాదాపు 24 ఏళ్ల ప్రవసాన్ని వదిలి   గాంధీ భారత్ కి వచ్చేశారు. హెర్మన్ కాలాంబక్  అనే గాంధీ అనుచరుడు ఇచ్చిన 1100 ఎకరాల భూమిని గాంధీ ‘టాల్ స్టాయ్ ఫామ్ ‘ పేరుతో  సత్యాగ్రహుల స్థావరం నెలకొల్పారు . ఏమిదేళ్ల పాటు  ఇక్కడినుంచే గాంధీ కార్యకలాపాలు చేసేవారు.గాంధీ వచ్చేసాక భారతదేశంలో ఏం జరిగిందో మనకు తెలుసు. మరి దక్షిణాఫ్రికా భారతీయుల పోరాటం ఏమయ్యివుంటుంది ?

భారతీయులను  వలస ప్రభుత్వం రూపొందించిన క్లాస్ ఏరియాస్ చట్టం, పెగ్గింగ్ చట్టం వంటి చట్టాలతో వేధించినా భారతీయ సంతతి నాయకులు యూసఫ్ దాదూ, తంబి నాయుడు , ఆఫ్రికన్ నాయకులు ముఖ్యంగా మండేలా ఈ పోరాటం ఒక సమూహం తోనూ జరిగేది కాదని అందరూ కలిసి వలస ప్రభుత్వాన్ని ఎదిరించాలని నిర్ణయించుకుంటారు .పోరాటం శాంతియుతమా సాయుధమా… ఇలా అనేక రకాల సంఘర్షణలు దాటి 1961లో అంటే భారతీయులు దక్షిణాఫ్రికా వచ్చి నూ రేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో గణతంత్ర దేశంగా మారింది. అదే  సంవత్సరం  మండేలా నాయకత్వంలో దక్షిణాఫ్రికా విమోచనోద్యమం లో సాయుధ పోరాట దశను ముగిస్తూ స్పియర్ ఆఫ్ ద నేషన్  అనే సంస్థ ఏర్పాటు చేయబడింది. అనేక పోరాటాల తర్వాత 1994 లో మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకొని  నిజమైన గణతంత్ర రాజ్యం గా నిలదొక్కుకుంది ఈ వివరాలన్నీ మండేలా జీవిత చరిత్ర లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లో చదవ వచ్చు.

ఇక పుస్తకం రెండవ భాగంలో  ఇచ్చిన దక్షిణాఫ్రికా విమోచనద్యమ భారతీయుల వివరాలు పొందుపరచడం వారి త్యాగానికి నివాళిగా భావించవచ్చు.వారిలో వల్లియమ్మ.17 ఏళ్ల వళ్ళీయమ్మ మాతృ భూమి కోసం ప్రాణత్యాగం చేసిన తొలి దక్షిణఆఫ్రికా భారతీయ మహిళగా గుర్తించబడుతుంది. ఈమె స్మారకంగానే తమిళనాడు ప్రభుత్వం 1982 లో మద్రాసులోని చేనేత కార్మిక సహకార సంఘానికి ‘తిల్లైయాడి వళ్ళియమ్మ మాలిగై ‘అన్న పేరు పెట్టిందిట. గాంధీ చేతి కర్ర అనబడే తంబి నాయుడు, నానా సీత , యూసఫ్ దాదూ, నారాన్ ముఖ్యులు.

తంబి నాయుడు తన నలుగురు పిల్లలు  బాల, బాల భారతి, నారాయణ్ స్వామి, ఫక్రీ లను గాంధీ దంపతులకు శాస్త్రోక్తంగా దత్తత నిచ్చారట.  వీరికి గాంధీ పట్ల ఉన్న అనుబంధంతో వీరిని గాంధీ ముత్యాలు( FOUR PEARLS OF GANDHI )అని పిలిచేవారట. వీరు గాంధీ ఇండియాకు వచ్చిన తర్వాత రవీంద్రుని శాంతినికేతన్ లో 1933 వరకు ఉండి తిరిగి దక్షిణాఫ్రికాకు వచ్చి దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో మహిళలు కూడా పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు శాంతి, ఇలా గాంధీ , ఫిల్లిస్ నాయుడు, అమీనా, ఫతిమా మీర్.ఫతిమా మీర్ రచయిత.  ఇండియన్ వ్యూస్ అనే వార పత్రిక నడిపేవారు. ఆమె 40 పుస్తకాలు రాశారట . దక్షిణాఫ్రికాను కుదిపేసిన వందమంది మహిళల్లో ఒకరిగా ఈమెకు గుర్తింపు ఉన్నది. “Higher than hope : Rolihlahla We love you ” –  నెల్సన్ మండేలా జీవిత చరిత్ర  ఈమె రాసిందే. ఇండియా లో శ్యామ్ బెనెగల్ నిర్మించిన మహాత్మా  ఇన్ మేకింగ్ అన్న సినిమాకి ఈమె రచనలే ప్రామాణికంగా తీసుకున్నారట.ఇలా నేను అనేక విషయాలను కొత్తగా ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. చివరగా   ఇంద్ర ధనుస్సు ఏడో రంగు అంటే ఎరుపు రంగు, ఎరుపు చైతన్యానికి చిహ్నం. దక్షిణాఫ్రికా ఉనికిని, విమోచనోద్య మాన్ని సంయుక్తంగా ధ్వనించే పేరుతో ఈ పుస్తకం.భారతీయుల సాధికార పోరాటానికి సంగ్రహ రూపం.

You may also like

Leave a Comment