Home వ్యాసాలు ఇల్లు.. మనిషికి చిరునామా!

ఇల్లు.. మనిషికి చిరునామా!

by Acharya Veerareddy

మనిషికి ఇల్లే ప్రపంచం. ఎవరి ఇల్లు వారికి ఇష్టం. ఇల్లు ఇంద్రభవనం కాకపోవచ్చు. అది ఒక ప్రేమ సౌధం.. సేదతీర్చి ఊరట కలిగించే ఒయాసిస్సు. అందులోని ప్రతి నివాసికి ఇది అచ్చంమైన హృదయ లోగిలి. మనసు ఊసులకు కోవెల… మనిషికి భౌతిక చిరునామా. స్మృతుల భాండాగారం. ‘మన’ అనే ‘కణాలను’ పేర్చి కూర్చిన గూడు. చీమకు పుట్టలా, పిట్టకు గూడులా.. జీవి జీవికో తీరైన నివాసం. అలాగే పుట్టిన ప్రతి మనిషీ తనకంటూ సృష్టించుకున్న ఓ ‘సొంత నివాసం’. అదే మనిషి పేరుకు ముందు ‘ఇంటి పేరు’ లాగా ఒక ప్రత్యేక గుర్తింపును ఆపాదించేది. ఎంతటి కష్టాన్నైనా, దిగులునైనా, అలసటనైనా అవలీలగా మరిపించి అవసరమైన ప్రశాంతతనొనగూర్చే మందిరం. ఇల్లు ఇల్లే… దానికదే ప్రత్యేకం. ఇల్లుకు లేదు ప్రత్యామ్నాయం! ముందర వాకిలి ఇంటికి ముఖ వర్చస్సు. మమతలు పొదిగిన తోరణాలతో కళకళలాడుతూ పన్నీరు పరిమళించే పచ్చదనాల లోగిలి. సదా నూతనత్వంతో విరాజిల్లే వేవేల దృశ్యాదృశ్యాల ఆప్యాయతల నివాసం.   

ఇల్లు ఒక సంస్కృతి!

పెళ్లైన పిదప ఆడపిల్లలు తమ పుట్టింట్లో అతిథిగా మారినా, సనాతన సంస్కృతి అనుసారం, క్రమేణ తమ అత్తవారి ఇంటినే సొంత ఇల్లుగా తీర్చి దిద్దుకుంటారు. అలా కాని పక్షంలో, వారికి ఏ ఇల్లు ఉన్నట్టు? ఎప్పటికీ పుట్టింటిపై మమకారం వదలుకోలేని స్త్రీకి, తనలా తను ఉండడానికి, తనకు నచ్చినట్లు నడుచుకోవడానికి, స్వేచ్ఛగా బ్రతకడానికి చేసే ప్రయత్నంలో కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాని అది జీవన్మరణ సమస్య కాకపోవచ్చు. వారు కోరుకునే చిన్న చిన్న ఆనందాలు దక్కడం లేదనో, ఇతరులు రెచ్చగొట్టడం వలననో, తమకంటూ ప్రత్యేకంగా ఒక ఇల్లు ఉండాలనే ఆశతో బయటకు వచ్చి వేరే కుంపటి ఆలోచన చేయవచ్చు. అలా విడిపోవాల్సి వచ్చిన ఆడ వారే ‘ఇల్లు’ అనే సంస్కృతికి ఊపిరి పోయగలరు. తమకంటూ ఒక ‘ఇంటిని’ తయారు చేసుకోగల సమర్థులు. గురజాడ వారు అన్నట్లు, ‘స్త్రీలు తమను తామే సంస్కరించుకోవాలి’ అన్నది పరమ సత్యం. ఆ సంస్కరణలో ప్రథమ భాగమే మరో ‘ఇల్లు’కు రూపకల్పన. ఎవరి జీవితం వారి చేతిలోనే ఉంటుంది తప్ప తక్కిన సమాజం అంతా ప్రేక్షకులే కదా!     

మనిషి ఎక్కడెక్కడ వెళ్లినా..

ప్రపంచ నలుమూలల్లో మనిషి ఏ పని మీదైనా ఎక్కడెక్కడ వెళ్లినా, ఎంత కాలం వెళ్లినా, ఐదు నక్షత్రాల అధునాతన వసతి గృహంలో బస చేసినా.. తిరిగి మళ్లీ మళ్లీ చేరుకోవాలనుకునే ఏకైక ప్రియ నివాసం ఇల్లు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి చేరుకోవాలనే తపన దాదాపు ప్రతి మనిషికి ఉంటుంది. ‘హమ్మయ్య! ఎలాగైతేనేం.. చివరికి ఇల్లు చేరుకున్నాం!’… ఒక గొప్ప ‘స్వంత గూటి’ భావన. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్, హోమ్ ఈజ్ బెస్ట్!’ అని అందుకే అంటారేమో. ఎంత చిన్నదైనా ప్రతి మనిషికి ఆ ఇల్లే తొలి స్మృతుల ప్రపంచం. అదొక జ్ఞాపకాల ఖజానా! సంస్కృతుల నమూనా! బాల్య బంధాల ఒడి. ఎవరి ఇల్లు వారికి అందమైన ప్రపంచం. ఇంటింటికో ప్రత్యేకత. ప్రతి ఇల్లు ఓ అనిర్వచనీయ అనుభూతుల ఆలయం. రాళ్లు, మట్టి, ఇటుకలు, కట్టెలతో కట్టినదే కాదు, ప్రేమ బంధాలతో నిర్మించినది.. అనురాగపు నగిషీలు చెక్కుకొని, మమతల మాలికలతో అల్లుకొని పెనవేసుకొన్న కుటుంబానికి కేంద్రం ఇల్లు. శరీరానికి ఆత్మలా, ప్రతి కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపుగా మనగలిగేది ఇల్లు. మనిషికి అదొక మానసిక సౌధం! మనకు ‘మనం’గా, ‘మనమే’గా ఉండగల్గే మహా ఆవాసం. మన ఇంట్లో మనం నటించం. కృత్రిమ మెరుపులను తోసిరాజని నిత్యం నిజ స్వరూప ప్రదర్శనమే! రెండవ వ్యక్తి ప్రవేశంతో ప్రారంభమైన నటన, మూడవ వ్యక్తి సమక్షంలో కాస్త విజృంభించి పాకాన పడుతుంది. ఇంటి గడప దాటితే చాలు మనసులో ఏమున్నా బహిర్గతం కానివ్వం. మనిషికి నటించడం ఒక కళ. బయట ప్రపంచంలో బ్రతకడానికి అవసరమేమో ఈ కళ! సాధారణంగా ఎదుటి వ్యక్తిని బట్టి, ప్రతి మనిషి గుణానికి కొలతలు మారుతూ ఉంటాయి. కొత్త రంగులు పులుముకుంటాయి. ఎక్కువ కాకున్నా, తనను తాను తక్కువ చేసుకోకుండా ఉండే ప్రయత్నంలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. మెరిసేదంతా బంగారం కానట్లు, బయట ప్రపంచానికి మనం అగుపించే తీరు అంతా నిజానికి బహుదూరం!     

జీవితంలో స్థిరపడాల్సిన ప్రతి మనిషికి ఇల్లు ఒక ప్రాథమిక అవసరం. అందుకే దీనికి హృదయంలో ఒక ప్రత్యేక స్థానం. ఎక్కడున్నా, ఇల్లు ప్రస్తావన రాగానే హృదయంలో ఒక వెచ్చదనంతో కూడిన ఆప్యాయత అలుముకుంటుంది. సానుకూల శక్తులను పులుముకుంటుంది. చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది. ఇంటిలోని ప్రతి ఇంచుతో మనిషికి కొన్ని జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. అవి హృదయ కవాటాలపై అంతర్లీనంగా చిత్రించబడిన చిత్రలేఖనాలై చెక్కు చెదరకుండా నిక్షిప్తమై ఉంటాయి. మనిషి మనసులో ఇంటికి ఎప్పుడూ ఉన్నత స్థానమే!

ఇల్లు అనేది…

ఇల్లంటే నాలుగు గోడలపై పరిచిన ‘కప్పు’ కాదు.. అది మనిషి జీవితం. ఒక ప్రదేశం కాదు.. ఒక భావన. కేవలం ఆకలి తీర్చే భోజన శాల కాదు. సుఖాల్ని మాత్రమే ఇచ్చే వసతి కాదు. అది జీవిత ధర్మాన్ని ఓనమాలతో నేర్పించే పాఠశాల. సంసార యజ్ఞాన్ని సజావుగా చేయించే యాగశాల. అంతఃశక్తినిచ్చే ధ్యాన మందిరం. జ్ఞానోదయాన్ని ప్రసాదించే బోధి వృక్షం. రక్షణలో అమ్మ ఒడికి సమాంతరం, మోక్షానికి ముఖద్వారం. గర్భగుడికి పర్యాయం. అందుకే అంటారు.. ఆదర్శ గృహస్థుడే మహా ఋషికి మారు పేరని!

వెల కట్టడానికి ఇల్లు అనేది ఒక ఆస్తి కాదు, మనిషి జీవితంలో నెరవేర్చుకోవాల్సిన విలువలతో కూడిన బాధ్యత. అది మనిషిని కదలకుండా ఒక చోట కట్టి పడేసే ‘గుంజ’ కాదు, స్థిరత్వాన్ని ఆపాదించే దివ్యమైన ‘లంగరు’. అభివృద్ధికి అడ్డంగా నిలిచే ‘గుదిబండ’ కాదు.. అంతిమ ఘడియ దాకా అండగా ఉండే చైతన్య దీపిక.

ఇల్లు ఎంత చిన్నది, పెద్దదని కాదు, ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే పరమ విషయం. సంతోషంగా జీవించడమే కాదు, తోటివారికి ఎంత సంతోషాన్ని పంచుతూ జీవిస్తున్నామనేది ప్రథమం. ప్రతి మనిషికి తన ఇల్లే దేవాలయం.. అందులో కొలువుండే దేవతలు అమ్మానాన్నలు. అప్పుడు గృహమే కదా స్వర్గసీమ!

ఇంటితో అనుబంధం.. అందమైన బలహీనత!

మనిషికుండే అన్ని బలహీనతలకు ప్రధాన కారణం ‘బంధం’. సాధారణంగా అది ఏర్పడేది మనిషితోనో, వస్తువుతోనో లేక వ్యవస్థతోనో కావచ్చు. అలాంటి బంధం తన ఇల్లుతో ఏర్పడితే, అది బలహీనతైనా అందమైనదే! ఇది జీవితాంతం వదులుకోలేని అందమైన బంధం. అప్పుడప్పుడు కొన్ని బలహీనతలు అందంగానూ, అద్భుతంగానూ ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి. ఇల్లును అంటిపెట్టుకుని ఉన్నవారు కన్నవారిని గౌరవించడంతో పాటు కట్టుకున్న ఇల్లాలిని గుండెల్లో పెట్టుకున్నట్లే! అందుకే ప్రతి ఇల్లు ఒక అనురాగ నిలయానికి ప్రతీక.. మనిషి జీవన వృత్తానికి కేంద్ర బిందువు. ఇల్లంటే.. భౌతికంగా ఒక నిర్మాణమే కాదు, ఆశలు, కలలు, జ్ఞాపకాలతో నిత్యం నినదిస్తూ ఉండే నిండైన స్థలం. అందుకే మనిషికి ఇంటితో పటిష్టమైన అనుబంధం. మనిషి ఎదుగుదలకు అదే పిల్ల వేరు, తల్లి వేరు!

పాతుకున్న చోటే చెట్టుకు మట్టితో అనుబంధం. అదే నాభి బంధం. వేళ్ళతో సహా కదిలించి మరో చోటికి తరలించి ఎంత మంచి మట్టిలో పాతినా ఆ చెట్టు అంతగా ఎదగడంలో రాణించదు. అమ్మను మార్చడం ప్రాకృతం కాదు వికృతం! అలాంటిదే ఇంటికీ మనిషికీ ఉన్న అనుబంధం. ఏ మనిషీ భావోద్వేగాలకు అతీతం కాదు. అవి సర్వసాధారణం. శారీరకంగా హార్మోన్లలో కొన్ని మార్పులు సంభవించినా మానసికంగా ప్రతిబింబించే అనుభవం ప్రస్ఫుటం. అదొక మానసిక వైఖరి, రుగ్మత కాదు. ఒకానొక పరిస్థితిపై ప్రతిబింబించే అంతర స్పందన.. అనుభూతి చెందే విధానం!  

ఇంటితో అనుబంధం ఎవరైనా పెంచుకుంటారు. ఇంటితోనే గాక చుట్టూ పరిసరాల్లో ఉన్న ఇరుగు పొరుగుతో ముడి వేసుకున్న భావోద్వేగానుబంధాలు మన భావి జీవితంతోనూ లోతుగా పెనవేసుకొని ఉంటాయి. మన ఆలోచనలు ఎప్పుడూ ఆ ఇంటి గోడల లోపల ఏదో తెలియని భద్రత, వెచ్చదనం మరియు సుపరిచిత విషయాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయనేది నగ్న సత్యం. స్వేచ్ఛ కోసం వెతుకుతున్నప్పుడు ఇల్లు తప్ప మనిషికి మరేదీ స్ఫురణకు రాదు. సర్టెన్లీ హోమ్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ యునీక్ అటాచ్మెంట్! అందులోనే మనిషికి సుఖం, సంతోషం మరియు సురక్షితం!    

ఇంటికున్న విలువను బేరీజు వెయ్యలేం! ఇల్లుకు వీడ్కోలూ చెప్పలేం!! ఎందుకంటే అది భావోద్వేగాలకు పెట్టుబడి (ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్), హృదయాలాపనలకు అనువైన ఒడి, వ్యక్తిగత విలువలకు కవచ కుండలం. అక్కడి పరిస్థితులన్నీ చిర పరిచితాలు, సౌకర్యాలన్నీ ప్రియ నేస్తాలు.  మనిషి ఇంటికి భౌతికంగా దూరం కావచ్చు, కాని ఇల్లు మనిషి నుండి మానసికంగా కాదు. ఇంటితో అనుబంధం.. జన్మతో బంధం. అది అంత సులభం కాదు తెంచు కోవడం. అది బలమో, బలహీనతో.. అంత ఇదమిత్థంగా చెప్పడం కష్టం.

మనిషి మనిషికి ఒక ఇల్లు!

ఇల్లంటే గోడలు, తలుపులు ఉన్న భౌతిక ఆవరణ కాదు. మన తలపుల్లో అనుక్షణం ఆవరించే ఓ భావన… ఒక మానసిక సౌధం. మనశ్శాంతికి మరో భౌతిక రూపం ఇల్లు. అమ్మ కడుపులో ఉన్నంత సౌకర్యాన్ని తలపించే ఏకైక నివాసం. పురిటిల్లుకు ప్రతిరూపం. మన గురించి సంపూర్ణంగా విప్పి చెప్పేది  ఇల్లు. మేడల్ని, మిద్దెల్ని తలదన్నక పోయినా, మనిషిగా మన ఉనికికి  అర్థాన్ని, పరమార్థాన్ని కల్పించేది ఇల్లు.

ఎక్కడ ప్రేమ ఉంటుందో, అక్కడే అసలైన ఇల్లు ఉంటుంది. ఎక్కడ హృదయం ఉంటుందో అక్కడే ప్రేమ ఉంటుంది. అందుకే అంటారు.. హృదయమే ఇల్లు, ఇల్లే హృదయమని! మనల్ని ప్రేమించే వారు మన ఇంటినీ ప్రేమిస్తారు. ప్రేమించే చోటనే ఇల్లు ఉంటే, మన పాదాలు విడిచి వెళ్లినా, ఆ ఇంటిని మన హృదయాలు విడిచి వెళ్లవు. ఎందుకంటే ఒక ఇల్లు లాంటిది మరొకటి ఉండదు కనుక. అది ఒక స్థలం కాదు.. ఒక అనుభూతి. మనిషి ప్రపంచం అంతా తిరిగి ఎక్కడ గాలించినా దొరకనిది ఇంట్లో మాత్రమే దొరుకుతుంది. జీవించినంత కాలం ప్రతి జీవికి ప్రకృతి నిర్దేశించిన అతి ప్రియమైన గమ్యం ఒక్కటే.. ‘ఇల్లు’.

మీ ఇల్లంటే మీకు ఇష్టమేనా?

ఎంతో ఇష్టంతో, శ్రమతో, శ్రద్ధతో కష్టార్జితాన్నంతా వెచ్చించి నిర్మించుకున్న ఇల్లు, పిల్లలు పురుడు బోసుకున్న నాటి నుండి వారితో పాటు కలిసి ఆటలు, చదువులు, పండుగలు, శుభకార్యాలు జరుపుకున్న ఇల్లు, ఎన్నో కష్టసుఖాలు, తీపి చేదులు  పంచుకున్న ఇల్లు, ఏళ్ల తరబడి బంధువులకు, స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు. ఎన్నో సందర్భాల్లో పెద్దలు దర్శించి దీవెనలు అందించిన ఇల్లు, ఇంటిల్లిపాదికీ  ఎంతో తృప్తినీ, ఆనందాన్నీ కలిగించి, ఎన్నో తీయని అనుభూతుల్ని ఇచ్చిన ఇల్లు… ‘అలాంటి మీ ఇల్లంటే మీకు ఇష్టమేనా?’ ఈ ప్రశ్నను జాతి, కుల, మత, భాష, దేశాల తేడా లేకుండా ప్రపంచం మొత్తం జనాభాలో ఎవరిని ఎప్పుడు అడిగినా ‘అవును, ఇష్టమే!’ అనే సమాధానమే నమ్మకంగా వస్తుంది.

‘రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే!’ రోమ్ పట్టణ నిర్మాణానికి శతాబ్దాల కాలం పట్టిందని చరిత్ర చెబుతోంది. అలాగే ఇల్లు అనేది ఒక్క రోజులో నిర్మించుకునేది కాదు. దాని నిర్మాణం ఒక మనిషి జీవిత కాలం! ప్రపంచంలోని మనుషులందరికి రోమ్ ఒక్కటే.. ఇల్లు మాత్రం మనిషికి ఒక్కటి! ప్రాణం పోయాక ఎక్కడికి వెళతాడో తెలియదు కానీ మరణం దాకా మాత్రం ఆ మనిషికి చిరునామా ఈ ఇల్లే.      

You may also like

Leave a Comment