శ్రావణమాసాన్ని ఎంతో శుభప్రదమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు.కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లలుశ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని నోచుకుంటారు. అత్తవారు తమ కొత్త కోడలికి “శ్రావణపట్టి”ని తెస్తారు. సాధా రణంగా శ్రావణ పట్టీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం రోజున తెస్తారు. శ్రావణపట్టీలో కోడలికి నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలను కానుకగా తెస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజున పురోహితునికిచ్చే సంభావన, పూజ ఖర్చు, పేరంటం ఖర్చును అత్తవారే భరిస్తారు. వియ్యాలవారికి విందు భోజనం పెడతారు అమ్మాయిని కన్నవారు. శ్రావణ మంగళవారం నోములు, శుక్రవారం వరలక్ష్మీవ్రతం లాంటి పూజలతో ఆ నెలంతా అతి త్వరగా గడచి పోయినట్లనిపిస్తుంది.
శ్రావణంలో నాగపంచమిని జరుపుకుంటారు. మహిళలు పుట్ట వద్దకు వెళ్ళి పుట్టను పసుపు కుంకుమ, పూలతో పూజించి అగరు వత్తులను వెలిగించి ఆవుపాలను పుట్టలో పోస్తారు. పచ్చి చలిమిడి, పచ్చి చిమ్మిరి, అరటి పళ్ళను నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగ పంచమికి అధిదేవత నాగమాత. నాగమాతకు ఇష్టమైన తిథి పంచమి, పౌర్ణమికి ముందు వచ్చే పంచమినాడు. “నాగపంచమి”ని జరుపుకుంటారు.
ఆ మాత అనుగ్రహించి, వారికి ఫలాన్ని ప్రసాదిస్తుంది. సంతానం లేని వారు నాగపంచమి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తారు. ఆ మాత కరుణతో ఆ దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. తమకు నాగదేవత దయతో పుట్టిన సంతానానికి నాగ అనే రెండక్షరాలను చేర్చి పేర్లు పెడతారు, “నాగమణి, నాగ వర్ధిని, నాగరత్నం, నాగలక్ష్మి, నాగసాయి, నాగరాజు, నాగభూషణం, నాగకుమార్, నాగసూర్య, నాగశౌర్య, నాగప్రతాప్” లాంటి ఎన్నెన్నో పేర్లు పెడతారు. పిల్లలను ఆ నాగమాత బాలారిష్టాల నుంచి కాపాడుతుంది.
శ్రావణ మంగళవారంనాడు పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి శ్రావణమంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు. శ్రావణమాసంలోని ప్రతి మంగళవారంనాడు గౌరీదేవిని పూజించి కథ చెప్పుకుని కాటుకను పెట్టి తోరణాలను కుడి చేతికి కట్టుకుంటారు. ముత్తయిదువులకు శనగలు, పళ్ళు, పసుపుకుంకుమ, పూలు వాయనంగా ఇచ్చి తాము పట్టిన కాటుకను వారికి ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి తల మీద అక్షింతలు వేయించుకుని వారి దీవెనలు పొందుతారు. వరలక్ష్మీవ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారంనాడు స్త్రీలంతా చేసుకుంటారు. మంగళగౌరీ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు చేస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేస్తారు. తొమ్మిది రకాల పిండి వంటలతో, బ్రాహ్మణునికి, దక్షిణతాంబూలాలతో వాయన మిస్తారు. లేదా ఒక ముత్తయిదువుకు ఆ వాయనమిస్తారు. సాయంత్రం ముత్తయిదువులందరినీ ఆహ్వానించి పేరంటం చేస్తారు. వరలక్ష్మీదేవి అలంకారాన్ని ఎంతో అద్భుతంగా చేస్తారు. చిరుజల్లులు పడుతూంటే కొత్త చీరలను ధరించి నుదుటిన కుంకుమతో, పాదాలకు పసుపు, మెడకు రాసిన గంధంతో, తలలో పూలతో, చేతిలో శనగల మూటతో రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా, పవిత్రంగా, భక్తికి మన సంప్రదాయాలకు నిదర్శనంగా కనిపిస్తుంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్ర వారం వాడు వరలక్ష్మీవ్రతం చేయటానికి వీలు కాని సందర్భం ఏర్పడితే. ఆ మాసంలోనే మరో శుక్రవారంనాడు వరలక్ష్మీవ్రతాన్ని జరుపుకోవచ్చు.
శ్రావణ పౌర్ణమి కూడా ఎంతో విశిష్టమైన దినం,శ్రావణ పౌర్ణమినాడు రాఖీ పున్నమిగా అక్కాచెల్లెళ్ళు. జరుపుకుంటారు. అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల అను బంధానికి ప్రతీక ఈ రాఖీ పండుగ, అన్నదమ్ముల చేతికి రాఖీని కట్టి, హారతి ఇచ్చి, తీపిని తినిపిస్తారు అక్కా చెల్లెళ్లు. అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళకు కానుకలను ఇస్తారు. శ్రావణపౌర్ణమిని “జంధ్యాల పౌర్ణమి”గా చెప్తారు. ఉప నయనం అయిన బ్రహ్మచారులు, గృహస్తులు ఆరోజు తమ పాత జంధ్యాన్ని తీసేసి కొత్త యజ్ఞోపవీతాన్ని మంత్ర సహితంగా ధరిస్తారు. శ్రావణ పౌర్ణమిని “శరత్ పౌర్ణమి”గా చెప్తారు. శ్రావణపౌర్ణమి లేదా ఏకాదశినాడు సత్య నారాయణ వ్రతాన్ని చేస్తారు. శ్రావణపౌర్ణమినాడు షిరిడీ వాసుడైన బాబా పాదుకలకు నమస్కరించి బాబా వారి ఆశీర్వాదాన్ని పొందుతారు భక్తులు.
ఈ మాసంలో పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం వస్తుంది. కృష్ణపక్షమి మొదలయ్యాక వచ్చే అష్టమినాడు. అర్ధరాత్రి సమయంలో రోహిణీ నక్షత్ర సమయాన శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుని అవతారంగా భువిలో ఉద్భవించాడని భక్తులందరూ నమ్ముతూ ఎంతో వైభవంగా “శ్రీకృష్ణాష్టమి”ని జరుపు కుంటారు. కృష్ణాష్టమిని పర్వదినంగా భావిస్తూ శ్రీకృష్ణుని పూజ తొమ్మిది లేక పదకొండు రకాలైన పిండి వంటలతో నైవేద్యాన్ని ఆ దైవానికి సమర్పిస్తారు. బాల కృష్ణుడు తమ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా భావిస్తూ చిన్న చిన్న పాదాలను బయట నుంచి లోపల వరకూ తీర్చి దిద్దుతారు. సాయంత్రం శ్రీకృష్ణుని పూజించి బాలకృష్ణుని ఊయలలో పవళింపచేసి పాటలు పాడుతూ ఊయలను ఊపుతారు. బాలబాలికలను శ్రీకృష్ణుడు, గోపికల వేషాలతో అందంగా అలంకరిస్తారు. వారి చేత నాట్యం చేయిస్తారు. రాసకేళి రంగులు చల్లుకోవటం జరిపిస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉట్టి కొట్టే వేడుకలో పాల్గొం టారు. ఈ విధంగా శ్రావణ మాసమంతా ఎన్నెన్నో పండుగలు, వ్రతాలు, పూజలు, విందు భోజనాలతో. ఆనందంగా, ఉత్సాహంగా గడచిపోతుంది.