Home వ్యాసాలు ఎఱ్ఱాప్రెగడ రచనా సౌందర్యాన్నందించిన యశోదారెడ్డి

ఎఱ్ఱాప్రెగడ రచనా సౌందర్యాన్నందించిన యశోదారెడ్డి

by Dr. Karimindla Lavanya

విషయ ప్రధానమైన భావగతి, నిండైన వర్ణనలు సంపూర్ణ రస నిర్వాహణ ఎర్రన కవితా లక్షణాలు. పురాణ మార్గం నుండి దేశిమార్గం వైపు, జాను తెనుగువైపు పాఠకులను మళ్లించి నూతన సాహిత్య నిర్మాణాన్ని చేసినవాడు నాచనసోమన. ఈ ఇద్దరి కవిత్వాలను, సాహిత్య పరిణామాలను లోతుగా అధ్యయనం చేసిన డా॥ పాకాల యశోదారెడ్డి ఆధునిక సాహిత్య నిర్మాణానికి సాహితీ బాటను నిర్మించింది. “తెలుగులో హరివంశాలు” అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పరిశోధన చేసి ప్రాశ్చ్య, ఆధునిక రచయిత్రిగా, విమర్శకురాలుగా తెలుగు సాహితీ రంగంలో సుస్థిర స్థానాన్ని పొందింది.

తెలుగు సాహిత్య వికాసంలో ఎర్రన ప్రబంధ నిర్మాణానికి బలమైన భూమికను, పునాదిని నిర్మించి “ఋషిగా” కన్పిస్తే నాచనసోమన పాత్రల మూర్తి కల్పనా, సంభాషణా చాతుర్యంతో పద్యాల విరుపులతో, జాతీయాలు, సామెతలతో కవిత్వాన్ని వ్రాసి నవీనగుణసనాథుడైన “కవి”గా కన్పించాడు. ఈ ఇద్దరి కవిత్వగుణాలను తనలో ఆకళింపు చేసుకొని యశోదారెడ్డి “సాహితీ తపస్వి”గా తనదంటూ ప్రత్యేక ముద్రను సాహితీ ప్రస్థానంలో స్థిరీకరించింది. తాను చెప్పదలచుకుంది, వ్రాయదలచుకుందీ సూటిగా చెప్పి, వ్రాసి భావి పరిశోధకులకు కావల్సినంత సాహిత్య సరుకును అందించింది.

ఇంగ్లీష్‌లో “English Men of Letters” అనే పేరు మీద ఆ వాఙ్మయంలోని మహాకవుల, రచయితల జీవిత విశేషాలకు, రచనా సౌందర్య విశేషాలను విశదీకరించే విమర్శ గ్రంథ పరంపర ఒకటున్నది. దాని మాదిరిగానే ఆంధ్రవాఙ్మయంలో ప్రముఖ కవుల జీవిత రచనా విశేషాలను వెలువరించాలనే ఉద్దేశంతో ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్నపుడు UGC వారి సహాయంతో “ఆంధ్రకవి నక్షత్రమాల” అనే పేరుతో 27 గ్రంథాలను ప్రచురించాలని సంకల్పించాడు. అందులో రెండవది “ఎఱ్ఱాప్రెగడ” గ్రంథం. 1972, డిసెంబరులో ప్రచురితమైన ఈ గ్రంథం డా॥ పాకాల యశోదారెడ్డి వ్రాసింది. ఎఱ్ఱాప్రెగడ తాత, తండ్రుల వివరాలను మొదలుకొని, ఎర్రన వ్యక్తిత్వంతో పాటు, ఆయన రచనల సారాన్నంతా కూలంకషంగా యశోదారెడ్డి ఈ గ్రంథంలో వివరించింది.

తెలంగాణ ప్రాంత యాసతో ఈ ప్రాంత భాషా నిర్మాణానికి పునాది వేసిన యశోదారెడ్డి కథలు ఎంత ప్రాచుర్యం పొందినా, తెలంగాణా సమాజాన్ని కదిలించినా ముందుగా ఆమె విమర్శకురాలని నా అభిప్రాయం. ప్రాచీన కవిత్వాన్నంతా అధ్యయనం చేసి దానిపై పూర్తి పట్టును సాధించింది. ఆధునిక సాహిత్యంలో అతి తక్కువ మంది మొదటి తరం విమర్శకుల్లో ప్రముఖ స్థానం యశోదారెడ్డిది. మూల గ్రంథాలనే అధ్యయనం చేసింది. అందుకుగాను సంస్కృతం, ప్రాకృతం, జర్మన్‌ వంటి భాషలను నేర్చుకొని మూలాల సారాంశాల కోసం వెతుకులాడింది. ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన కృషి, వెలువరించిన ప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. మహిళలు చదువుకునే పరిస్థితులు సమాజంలోలేని కాలంలో చదువుకొని, ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచింది. అందరికీ జ్ఞానోదయం కలిగించింది.

ఇక “ఎఱ్ఱాప్రెగడ” కవిత్వానుశీలనలో ఎర్రనది ప్రబంధ లక్షణాలున్న సహజ కవిత్వమని యశోదారెడ్డి అభిప్రాయం. కావ్య ప్రయోజనాన్ని ఆశించి, కావ్య రచన చేయడం ఎర్రన కవిత్వ లక్షణాల్లో ప్రధానమైంది. అందుకే రామాయణంలోనూ, మహాభారత అరణ్యపర్వశేషభాగ రచనలోనూ, నృసింహపురాణంలోనూ, హరివంశంలోనూ కావ్య ప్రయోజన సాధనకోసం ప్రబంధరచనా ప్రావీణ్యం, చమత్కారంగా వ్రాసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారనే అభిప్రాయాన్ని యశోదారెడ్డి వెలిబుచ్చారు.

ఎర్రాప్రగడ జీవించిన కాలాన్ని వీరేశలింగం పంతులు పరిశోధన ఆధారంగా, చరిత్ర గ్రంథాల ఆధారంగా క్రీ॥శ॥ 1280-85 మధ్యకాలంలో పుట్టి, 1355 వరకు జీవించివున్నాడని తెలిపారు. విష్ణు పారమ్య ప్రతిబోధకాలైన రామాయణం, హరివంశం, అరణ్యపర్వశేషభాగం, నృసింహపురాణం ఎర్రన రచనలు. ఇవన్నీ విష్ణుభక్తి ప్రతిబోధకాలే. నేడు రామాయణం ఆధారంగా కందుకూరి వీరేశలింగం పంతులు, శేషాద్రి రమణ కవులు, పింగళి లక్ష్మీకాంతం, వేదాల తిరువేంగళాచారి, దివాకర్ల వేంకటావధాని, చాగంటి శేషయ్య, వేలూరి శివరామశాస్త్రి వేదాల తిరువేంగాళాచార్యులు, నోరి నరసింహశాస్త్రి పరిశోధనలను అనుసరించి, ఎర్రన మొదట రామాయణ హరివంశాలను తరువాత అరణ్య పర్వశేషం, నృసింహపురాణాలను వ్రాసినట్లుగా యశోదారెడ్డి అభిప్రాయపడింది.

నోరి నరసింహశాస్త్రి “ఈశ్వర ప్రణిపాతములో గూడిన విజ్ఞాన యోగమునందభినివేశము కలిగిన సమాధిని నిమీలితేక్షణుండనై క్షణంబున్న” అని చెప్పుకున్న వాక్యం అప్రయత్నంగా వచ్చిన సత్యవాక్యమని కవి ఆధ్యాత్మికోన్నతిని పొగిడినాడు. దీన్ని బట్టి నృసింహపురాణమే మొదటిదని చెప్పినా యశోదారెడ్డి అందుకు అంగీకరించలేదు. ఆత్మోన్నతి కలిగిన మహాకవికి నృసింహపురాణం బాల్య రచన కాదనేది యశోదారెడ్డి అభిప్రాయం.

ఎర్రన నృసింహ పురాణంలో “ఎన్నికమై బ్రబంధ పరమేశుడనంగ నరణ్య పర్వశేషోన్నయమంధ్ర భాష సుజనోచ్చ మెప్పగ నిర్వహించితి”నని చెప్పినాడు. చదులవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో “ప్రతిభతో నారణ్యపర్వశేషము జెప్పె కవులకు జెవుల పండువులుగాగ” అని ఎర్రన అరణ్యపర్వశేషమును చెప్పినట్టు ధృవపరిచాడు. జక్కన విక్రమార్క చరిత్రలోనూ “ఈత్రయిదా బ్రబంధ పరమేశ్వరుడై విరచించె శబ్దవైచిత్రి నరణ్య పర్వమున శేషము” అని శబ్దవైచిత్రితో ఎర్రన అరణ్య పర్వశేషం వ్రాసెనని చెప్పాడు. ఈ ఆధారాలను తీసుకొని యశోదారెడ్డి అరణ్య పర్వశేష భాగం ఎర్రనే వ్రాసినాడనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

భారతమూలరచనను పరిశీలించి నన్నయ కన్నా ఎక్కువగా మూలాన్ని అనుసరించాడన్నది. నన్నయ తిక్కనల కన్నా ఎర్రనే ఆంధ్రమహాభారతలక్ష్మిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడని, వారిద్దరూ సంపూర్ణ భారతాన్ని అందించలేదూ – ఎర్రన పూర్తి చేసిన తరువాతే భారత రచన ఫలవంతమైందని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

సంస్కృత భారతంలో శరదృతువు వర్ణన ఏడు (7) శ్లోకాల్లో ఉంటే, నన్నయ శ్లోక సారాంశాన్ని కలుపుకొని “(1) భూసతికిం దివంబునకు బొల్పె సగంగ శరత్సమాగమం…”, (2). శారద రాత్రు లుజ్వలలస్తతర తారక హార పంక్తులం…”, అనే రెండు పద్యాల్లో శరదృతువు యొక్క ప్రధాన లక్షణాలను చెప్పినాడు. ఈ పద్యాల తరువాతే ఉన్న “స్ఫురదరుణాంశు రాగ రుచి బొంపిరివోయి” పద్యాన్ని పరిశీలించినపుడు పూర్తిగా మూల భారత అనువాదంగానే కనిపించింది. దీంతో భారత రచనా విధాన భేదాన్ని గుర్తించవచ్చు. శ్రీకృష్ణుడు సత్యభామతో పాండవుల దగ్గరకు వచ్చిన సందర్భంలో మూలగ్రంథంలో ఉన్న ఋతు వర్ణనను పరిశీలించినపుడు మూల శ్లోకాలకు మెరుగులు దిద్దినట్లుగా కనబడింది. మూలగ్రంథంలో శ్రీకృష్ణుడు ధర్మరాజును ప్రశంసించిన సందర్భంలో, ద్రౌపదిని ఆమె కుమారుల క్షేమాన్ని గురించి అడిగిన సందర్భంలోనూ మూలంలోని శ్లోకాలు భావ వైవిధ్యం లేక చెప్పిన విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పినట్లుగా ఉన్నదని, మూలశ్లోక భావాన్నంతటిని సమీకరించినట్లున్నదని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

సంస్కృత భారతంలోని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినట్లున్న రామాయణ కథాభాగం అనువదించిన విధానాన్ని పోల్చి చూసినపుడు మూలశ్లోక భావాన్ని తప్పక యతి సమర్థుడై  వర్ణించాడు ఎర్రన. మూలభారతంలోని రావణ సంహారములో రాముడు బ్రహ్మాస్త్ర సంధానం చేసాడని అది రావణుని నీరుగావించిందని ఉంది. బ్రహ్మాస్త్ర సంధానం తరువాత దేవదావన కిన్నెరాదులు రావణున కాయురల్వావశేషమై ఉన్నదని తలచినట్లున్నదన్న విషయాన్ని వదిలిపెట్టాడు. అశోకవనంలో ఉన్న సీతతో రావణ సంవాదం తరువాత వాల్మీకీ రామాయణంలో త్రిజటా స్వప్న వృత్తాంతం ఉన్నది. మూలభారతంలో త్రిజటా స్వప్న వృత్తాంతం తరువాతే సీతారావణ సంవాదం ఉంది. ఎర్రన భారత కథనం ప్రకారమే అనువాదము చేసినాడు. 30 శ్లోకాల సంభాషణను 7 గద్య పద్యాలల్లోనే వర్ణించాడు ఎర్రన. అంటే భారతంలో రామాయణం ఇతివృత్త ప్రాధాన్యం కొంతవరకే అవసరమని గుర్తించాడని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

హరివంశంలోని “నా తమ్ముండు ఘనుండు అనే పద్యంలో రామకథమున్‌ జెప్పించి యత్యుత్తమ ఖ్యాతింబొందితి నింకనేను” అనే పద్యాల్లోనూ, కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సారసంగ్రహంలోని అనేక సందర్భాల్లో ఎర్రన పద్యాలను ప్రస్తావించడంలోనూ, గణపవరపు వేంకటకవి ప్రయోగ రత్నాకరమనే లక్షణ గ్రంథంలోనూ, చెదలువాడ మల్లన విప్రనారాయణ చరిత్రలోనూ, ఆనందరంగకవి ఆనందరంగరాట్భందములోనూ, ఎర్రన రామాయణ ప్రస్తావనలున్నాయి. ఎర్రన కాలంలోనే భాస్కర రామాయణం వ్రాయబడింది. అయినా ఎర్రన వ్రాసివున్నట్లుగా అనేక ఆధారాలున్నందున మనోజ్ఞంగా రామాయణం కూడ వ్రాసే ఉంటాడని యశోదారెడ్డి బలంగా వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

మహాభారతం పంచమ వేదమైతే, హరివంశం వేదశిఖ అని యశోదారెడ్డి అభిప్రాయం. భారతంలో శ్రీ కృష్ణుని గురించి సూక్ష్మంగా, వ్యంగ్యంగా చెప్పబడితే, హరివంశంలో విపులంగా, వాచ్యంగా శ్రీహరి చరిత్ర వర్ణింపబడింది. మహాభారత యుద్ధం, క్షత్రియ సంహారంతో పాఠకుని మనస్సు బాధతో నిండి ఉంటుంది. పాఠకునిలో తొలగించే నిర్వేదవైరాగ్యాలను తొలగించడానికి హరివంశం వ్రాయబడింది. ప్రోలయ వేమారెడ్డి ఎర్రనను హరివంశరచన చేయమని కోరగా, ఇదివరకే నన్నయ తిక్కనలు భారత రచన చేసినారు. వారి త్రోవలో నడుచుటకు సంతోషంగా ఉంది. హరివంశం, భారతం రెండూ కూడ వ్యాసమహర్షి వ్రాసినవే అని హరివంశ పీఠికలో అనడంతో హరివంశ రచనాకాలం నాటికే భారత అరణ్యపర్వశేషం వ్రాయలేదని స్పష్టంగా తెలుస్తున్నదనే అభిప్రాయాన్ని యశోదారెడ్డి వ్యక్తపరిచింది.

సంస్కృతంలో హరివంశపర్వము, విష్ణుపర్వము, భవిష్యపర్వములుంటే, ఎర్రన మూల గ్రంథాన్ని అనుసరించలేదని తెలుస్తున్నది. పూర్వభాగంలో తొమ్మిది ఆశ్వాసాలు, ఉత్తరభాగంలో పది ఆశ్వాసాలుగా ఎర్రన విభజించి అనువదించాడు. అయితే ఇక్కడ నాచనసోముని ఉత్తర హరివంశాన్ని గురించి కొంత చెప్పుకోవాలి. నాచనసోమన ఉత్తర హరివంశాన్ని ఆరు ఆశ్వాసాల గ్రంథంగా వ్రాసినాడు. అయితే ఎర్రనను అనుకరించాడని చెప్పే వీలు లేదు. ఎర్రన హరివంశానికి పీఠిక ఉంటే, ఉత్తర హరివంశానికి లేదు. ఎర్రనకు విషయ ప్రధానమైన భావగతి మీద, వర్ణనల మీద, రస నిర్వహణ మీద ప్రధాన దృష్టి ఉంటే, సోమన తెలుగు కవితను పురాణ మార్గం నుండి మళ్లించాలని ప్రయత్నించాడు. సఫలీకృతుడైనాడు. ఎర్రన “ఋషిగా కావ్యం వ్రాస్తే సోమన “కవి”గానే కావ్యం వ్రాశాడు. ఎర్రన హరివంశ అనుకరణలు ఉత్తర హరివంశంలో కానరావు.

సంస్కృతంలోని పద్దెనిమిది పురాణాల్లో నృసింహపురాణం లేదు. ఎర్రన వ్రాసిన నృసింహపురాణం “పురాణం” కాదని స్పష్టమవుతున్నది. ఎర్రన తాత ఎఱపోతసూరి శ్రీమహోబలీశ నరసింహుని భక్తుడు. తన దైవంపై తీర్ధ మహాత్మ్యాన్ని అవతార వైశిష్ట్యాన్ని వ్రాయమని కోరగా ఎర్రన నృసింహపురాణం వ్రాశాడని యశోదారెడ్డి అభిప్రాయపడింది. కథా ప్రారంభంలో “ఏను విన్నవంబు సేయంగల లక్ష్మీ నరసింహావతారంబను పురాణకథకు బ్రారంభం బెట్టిదనిన” అని పేర్కొన్నాడు. అసలీ గ్రంథం పేరు “లక్ష్మీ నరసింహావతార కథ”. చదలవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో “నారసింహుని పురాణ మొనర్చె హరి మెచ్చి నన్నునెన్నడు చూచినాడు వనగ” అని వ్రాసిన వాక్యాలను బట్టి “నృసింహపురాణం” అనే తెలుస్తున్నది. ఇది అనువాదం కాదు. క్షేత్రమాహాత్మ్యం గురించి చెప్పబడిన స్వతంత్ర కావ్యం. పురాణానికి ఉండవలసిన సర్గ ప్రతి సర్గాది పంచలక్షణాలు ఇందులో లేవు. కొంతవరకు బ్రహ్మాండ పురాణంతో సంబంధం ఉన్నది. విష్ణుపురాణంలో కనిపించే కథాసరళి తనకు అనుగుణంగా మలచుకొని ఉపయోగించుకున్నాడు. భాగవతంలోని నృసింహావతార కథాభాగాన్ని కాక, వామన ప్రాదుర్భావానికి తరువాత చెప్పిన కథా భాగాన్ని స్వీకరించినాడు. నృసింహ పురాణంలో ఎర్రన హిరణ్యకశిపుని దిగ్విజయాన్ని వర్ణించిన విధానం హరివంశంలోని కాలనేమ్యాదుల దిగ్విజయ వర్ణనా విధానాన్ని తలపింపజేస్తున్నదని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

ఎర్రన శ్రీమద్భాగవత తృతీయాస్కంధంలోని వైకుంఠపురవర్ణనను నృసింహపురాణంలో అనువదించాడు. “నారాయణుని దివ్య నామ సంకీర్తనంబని శంబు జేయు మహాత్ములకును బద్మాక్షు శ్రీపాద పద్మంబులత్యంత భక్తిమై బూజించు ప్రాజ్ఞులకును” అన్ని రకాల సుఖాలను నారాయణుడు ప్రసాదిస్తాడని వైకుంఠపురవర్దనను జేస్తూ వివరిస్తాడు ఎర్రన. కొన్నిచోట్ల విష్ణుపురాణంలోని హిరణ్యకశిపు ప్రహ్లాదుల సంవాదాన్ని యధాతథంగా వర్ణించాడు.

ఎర్రన రచనలన్నింటిలోను జాతీయాలు, అలంకారాలు సహజ సుందరంగా సందర్భోచితంగా వ్రాశాడు. ఎర్రన నృసింహపురాణంలో భాగవత శ్లోకాలను సంక్షేపించినట్లు, విష్ణుపురాణ శ్లోకాలను యధాతథంగా అనువదించినట్ట్లు, కావ్యకళావైభవాన్ని ప్రదర్శించినాడు. కొన్నిచోట్ల హరివంశ పద్యాలను విపులీకరించాడు. మూలంలోని సూచన ఆధారంగా విస్తృతంగా వ్రాస్తూనే నాచనసోముని అనుకరించినట్లుగా యశోదారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎర్రన కాలం నాటికే అనువాదాలు అనేకం వచ్చాయి. కాబట్టి ఎర్రన రెండు భాషల్లోనూ ప్రావీణ్యం పొంది అనువాదం చేయడం సులభమైంది. దానికి తోడు రాజపోషణ వల్ల కూడ తెలుగు భాష స్థిరరూపాన్ని పొందింది. నన్నయ, తిక్కన అనువాదంలో మూలానికి విపులీకరణ, సంక్షేపము, విషయ పరిహరణం, వ్యత్యయం ఈ నాలుగు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎర్రన అనువాదంలో యధామూలకథ ఉన్నాకూడ ఆయా సందర్భాలను బట్టి వివిధ కావ్యాల్లోని సారాంశాలను ఒక సందర్భోచిత కావ్యంగా మలచడం హరివంశ, నృసింహ పురాణంలో కనిపించిందదే. సందర్భోచితంగా కథాపాత్రల పేర్లను కూడ ఎర్రన మార్చినాడు. అనేక సందర్భాల్లో ఇతర గ్రంధాల నుండి సేకరించిన శ్లోకభావాలను తన గ్రంథంలో చేర్చుకోవడమనే విశేష రచనా విధానానికి శ్రీనాథునకు ఎర్రనయే మార్గదర్శకుడై యుండవచ్చని యశోదారెడ్డి అభిప్రాయం.

వ్యక్తి, వస్తు, క్షేత్రాది బాహ్యవర్జనతో తృప్తి పొందక మనోవృత్తులను, భావవైఖరులను విపులీకరించి పాఠకులకు ఆసక్తి కలిగించుటకు మధ్యలో సంభాషణలను పెట్టాడు. భారతారణ్య పర్వశేషంలో అనువాదంలోని “మూలాసరణమును, హరివంశంలో కొంత “స్వేచ్ఛను పాటించి ఇతర గ్రంధాలనుండి ఆయా కథావృత్తాంతాలను తీసుకున్నాడు. నృసింహపురాణంలో కథాక్రమమును పాటించక ఇష్టంవచ్చినట్లు కథాసూత్రంను తనే ఏర్పాటు చేసుకున్నాడు. సోమన రచన స్వతంత్ర రచన. అందుకే సోమన అనువాదం “మూలాతిరిక్తమైన స్వేచ్ఛానువాదమనీ” చెప్పవచ్చని తన పరిశోధన ద్వారా ధృవీకరించింది యశోదారెడ్డి. ఎర్రన అనువాదం అట్లకాదు. మూలాధారం లేక ఏ విషయాన్ని వ్రాయలేదు. “ఒక ఆలంబనమును పురస్కరించుకొని దానిని మెరుగులు దిద్ది తనది కావించుకొనుట ఎర్రన అనువాద విధానం”. ఇతని దృష్టి ఎపుడూ ఒకరిని అనుకరించి, అనుసరించి వాళ్ళను మించి రచన చేయగల దక్షత తనకు కలదని లోకానికి చాటడమే ఎర్రన అనువాద విధానమని యశోదారెడ్డి యొక్క స్థిరమైన అభిప్రాయం. అందుకే ఎర్రన అనువాద పద్ధతి “మూలాతిరిక్తమయ్యు మూలానుసారి” అని చెప్పవచ్చును.

సకల భాషాకవిత్వవేది, బహుపురాణ కథాసకల సంవేదియైన ఇతనిని లోకం కవిత్రయం అన్నందున ఎర్రన అదృష్టవంతుడని అంటుంది యశోదారెడ్డి. రాజపోషణ వల్ల, లిఖిత గ్రంథప్రాచుర్యం వల్ల తెలుగు భాష విస్తరించింది. దానికి ఇంపులు సొంపులు కూర్చినవాడు ఎర్రన. “Personality is what is the Unique in Man” అని పాశ్చాత్య సాహిత్యవేత్తలన్నారు. అదే వ్యక్తిని వ్యక్తి నుండి వేరు చేసి ప్రత్యేకించేది. ఇది ఎర్రనలో సహజ సుందరంగా కనిపించింది.

కథాసంవిధానములో విచిత్ర పద ప్రయోగ వైచిత్య్రములో, శబ్దార్ధాల మేలుకలయికలో నాచనసోమన అనుకరించాడు. నన్నయ, తిక్కన, నాచనసోమనలను ఎర్రన ఆదర్శంగా తీసుకుంటే ఆ తరువాతి శ్రీనాథుని మొదలు కవులంతా ఎర్రననే అనుకరించారు. శ్రీనాథుడు “పరిఢ వింతం బ్రబంధ పరమేశ్వరునిఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్కమాట” అని ఎర్రనను అతిగా సంభావించినాడు. ఎర్రన స్వభావోక్తి అలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించాడు. సూక్తి వైచిత్రాన్ని ప్రదర్శించాడు.

ఎర్రన సకలకళారహస్యాలను తెలిసిన కవి మాత్రమే కాదు. సంగీత సాహిత్య పోషకుడైన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండడం వల్ల, ఆయా సందర్భాన్ని బట్టి తాను చూసిన ఆ కళల్లో ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. అందుకే ఎర్రన కావ్యాల్లో గానకళా ప్రసంగాలు కన్పిస్తాయి. ఉదాహరణకు నృసింహపురాణంలో అప్సరసల విభ్రమవ్యాపారాలను చెప్పు సందర్భం. హరివంశంలో వాద్యసంగీతము, నాట్యం గురించి చెప్పాడు. ఎర్రన ఎక్కువగా “విజ్ఞానము” అనే శబ్దాన్ని వాడినాడు. విజ్ఞానమంటే పరతత్త్వవిద్య, బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము. వీటిని ఉపయోగించే కవిత్వం వ్రాశాడు. గోపికల విరహం, పరమ పవిత్రమైన భక్తి పరిణమింపజేసి మధుర భక్తి విధానానికి దారితీసినవాడు ఎర్రనయే అని యశోదారెడ్డి అభిప్రాయపడింది. ఎర్రనకు “యోగం” అంటే అభిమానం ఎక్కువ. శృంగారిని కూడా మహాయోగిగా అభివర్ణించిన యోగి ఎర్రన. నమ్మకములు, ఆచారాలు కూడా ఎర్రన కావ్యాల్లో ఉన్నాయి. శివములు, పూనికలు, ఆనాటి సహజ సాంఘిక పరిస్థితులను తెలుపుచున్నాయి. నేటి Democracy కన్న ఉత్తమలక్షణం నాటి రాజులకుందని, ప్రజారంజనమే ప్రభువు ప్రథమ ధర్మమన్నట్లు నాటి రాజు చూసినారని ఎర్రన కవిత్వంలో రాజనీతికి సంబంధించిన పద్యాలు కూడా ఉన్నాయని యశోదారెడ్డి నిరూపించినారు.

ఎర్రన ఉత్పల, చంపకమాలలే కాక, మత్తకోకిల, క్రౌంచపదము, మందాక్రాంత, మాలిని, స్రగృణి, తోదకము, కంద తదితర వృతాలను ఉపయోగించాడని యశోదారెడ్డి అభిప్రాయం. ల-ళ, శ-స, ద-ధ, ఖండాఖండ బిందు ప్రాసలు ఎక్కువగా వాడినాడు. టకార-డకారల ప్రయోగం, బహువచనంపై బహువచన ప్రయోగాలు, ఇకార సంధులు, ప్రత్యయాలు, సందర్భోచిత పద ప్రయోగాలు, చమత్కారాలు ఎర్రన కవిత్వంలో ఉన్నాయని శబ్ధరత్నాకరములోనూ ఈ పద ప్రయోగాలకు అర్ధాలు లేవని యశోదారెడ్డి పరిశోధనలో తేలింది.

పద్నాలుగవ శతాబ్దంలో ఉన్న కవుల కవిత్వమే ఆ తరువాతి కవుల కవిత్వానికి ఆదర్శప్రాయమైంది. ప్రాచీన సమ్మతమైన వేదవ్యాసముని ప్రతిపాదితమైన, హరిహరభేద తత్వమును తిక్కన, ఎర్రన, నాచనసోమన ప్రభోదించగా, పోతన ప్రధాన తత్త్వంగా స్వీకరించి భాగవతంలో పరిపూర్ణత సాధించాడు.

అనువాద సందర్భాల్లో నన్నయ, తిక్కన, నాచనసోమనాధుల కన్న కొంత భిన్నంగా, విశిష్టమైన ఎర్రన అనువాద విధానంతో ప్రభావితుడైనవాడు శ్రీనాథుడు. ఎర్రన సూక్తివైచిత్రియే శ్రీనాథునికి ప్రశంసలను తెచ్చిపెట్టింది. నన్నయ ధారాశుద్ధి, తిక్కన తెలుగు తీయదనము, తన సహజ పరిశీలనాదృష్టితో మేళవించి ఒక కొత్త వికాసంతో పద్యాలను అల్లినవాడు ఎర్రన అని స్థిరమైన అభిప్రాయాన్ని యశోదారెడ్డి వెలువరించింది.

You may also like

Leave a Comment