ఉపోద్ఘాతం
శ్రీకాకుళం నుండి ఓ సాహితీ మిత్రుడు శుక్రవారం, జూన్ 4, 2021 ఉదయం పదకొండు గంటలకి నాకో సంక్షిప్త సందేశాన్ని సెల్ ఫోన్లో పంపించాడు. అక్షరాలే కొన్నే అయినా బాధాకరమైన బరువైన అక్షరాలవి. “శ్రీ కాళీపట్నం రామరావు గారు ఈ ఉదయం ఎనిమిది గంటలకు స్వర్గస్తులయ్యారు”. ఐదు నిమిషాలు అలాగే కూచుండిపోయాను. ఎన్నో విషయాలు ఒక్కసారే గుర్తుకొచ్చాయి. నేను మొదటిసారి కారా గారిని దిల్లీలో కలవడం, ముచ్చటించడం, తరువాత సాహితీ సమావేశాల్లో మళ్ళీ దిల్లీలోనే కలవడంతో కొంత పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పటికి నాకు పరిచయంలేని కారా గారి కథల్ని చదవడం మొదలుపెట్టాను. కథా నిలయం ఆలోచనల గురించి దిల్లీలో నివశిస్తున్న సాహితిప్రియుల చెవుల్లో పడింది.
నా మొదటి కథా సంకలనం “లియో సా” కి విశాఖపట్నంలో ఉన్న జ్యేష్ట లిటరరీ ట్రస్ట్ వారు 2001 లో పురస్కారాన్ని ప్రకటించారు. తీసుకోడానికి వైజాగ్ వెళ్ళినప్పుడు నేనూ నా జీవిత బాగస్వామి శ్రీకాకుళం వెళ్ళి మాష్టారిగారితో కథానిలయం కప్పుకిందే ఓ దినం గడపడం మాకు తియ్యటి అనుభూతి. వందల లభ్దప్రతిష్థులైన రచయితల వేలకథల్ని చదవకుంటేనేం. ఆ కథలని, పాత సంచికలని, సంకలనాలని స్పృశిస్తూ మా చుట్టూ ఆవరించే ఉన్న గాలిని పీలుస్తూ కారా గారి ఆత్మీయత జల్లుల్లో తడిసిపోతు గడిపిన ఆ ఘడియలు ఇంకా మాకు తాజాగానే ఉన్నాయి.
దిల్లీ చేరుకొన్నాక కథా నిలయం అనుభవాన్ని మాకే పరిమితం చేసుకోకుండా నలుగురితో పంచుకోవాలని ఆంధ్రా అసోసియేషన్ అప్పట్లో ప్రచురించే తెలుగు వాణి అనే త్రైమాస పత్రికకి వ్యాసం రాసాను. సరిగ్గా ఇరవై ఏళ్ల తరువాత, కారాగారి మరణాంతరం ఆ వ్యాసాన్ని (తెలుగు వాణి, ఆగష్ఠు – అక్టోబర్ 2001) మయూఖా అంతర్జాల పత్రికవారు పునర్ముద్రించడానికి ఒప్పుకోవడంతో ఈ వ్యాసం పాఠకులకి కథా నిలయానికి ఒక బేస్ లైన్ (2001) గా తోడ్పడి, (కింది ETV లింక్ క్లిక్ చేస్తే కథా నిలయం ప్రస్తుతం ఎంత ముందుకెళ్లిపోయిందో తెలుస్తుంది.) గత ఇరవై ఏళ్లల్లో నిలయం ఎంత పురోగతి సాధించిందో బాగా అర్ధమవుతుంది. కారాగారి ఉచ్చ్వాస-నిశ్వాస గాలి తరంగాలని అక్షరీకరిస్తే కథా..కథా…కథా… అని కనబడతాయేమో? అంతిమ శ్వాసలో కూడా కథా… కథా… అనే చిరుద్వనులే వచ్చిఉంటాయి!
వయస్సు 77 సంవత్సరాలు. పిల్లలంతా చీకూ చింతా లేకుండా చక్కగా సెటిలయ్యారు. ఆడుకోడానికి మనవలు ` మనవరాండ్రూ ఉన్నారు. పెన్షన్ వస్తుంది. రాయడానికి కాగితము`కలమూ ఉన్నాయి. కథావస్తువులు కూడా ఉండి ఉంటాయి. ఆయన కథలు రాస్తే పత్రికలు కళ్ళు మూసుకొని వేసుకుంటాయి. అయినా ఆ మనిషి అలాంటివేమీ చేయడు. నిరంతరం ‘మనసున్న మషీన్’లా మరో పని చేస్తుంటాడు. అదో యజ్ఞం. తొందరలో పూర్తికాని యజ్ఞం. అనారోగ్యం అపుడపుడు తానున్నానంటూ అతనిలో మకాం చేస్తూ పోతూంటుంది. అయినా ఖాతరు చేయడు. ఆయనెవరో కాదు. ‘యజ్ఞం’ రచయిత శ్రీ కాళీపట్నం రామారావు. మరో యజ్ఞంలో మునిగిపోయిన కా.రా.గారు. తెలుగు కథలన్నింటికి పుట్టిల్లను తయారు చేస్తున్న మాస్టారుగారు.
కారా గారు స్థాపించిన కథానిలయం (శ్రీకాకుళం) గురించి మిత్రుల ద్వారా విన్నాను. పత్రికల్లో చదివాను. చూడాలన్న కోరిక చివరకు గత జూలైలో తీరింది. ఓ ఐదు గంటలు కథా నిలయంలో కారా గారితో గడిపే అవకాశం కలిగింది. సాహితీ ప్రియునిగా నాకు మరచిపోని రోజది.
కథా నిలయం వెనకున్న కథతో మొదలైంది మా దీర్ఘ సంభాషణ.
‘‘కథా నిలయం ఆవిష్కరణ 22 ఫిబ్రవరి 1997న జరిగింది. ఇది అనేక ఇతర గ్రంథాలయాల్లాంటి మరో గ్రంథాలయం కాదు. తెలుగు కథకి ఇది రిఫరెన్స్ లైబ్రరీ. 1910కి ముందూ వెనకా ఉండిన పెక్కు కథలూ, కథానికలూ పాత పత్రికల్లోనూ కథల పుస్తకాలతోనూ అంతరిస్తూ వస్తున్నాయి. పోయినవి పోగా మిగిలిన వాటినన్నింటిని సేకరిస్తూ ఇక ముందు రాగల ప్రతీ కథతో పాటు పై వాటిని పదిల పరచడం ఒక కర్తవ్యంగా తోచి కొందరు కథాభిమానులు ఈ కథానిలయాన్ని సంకల్పించారు’’ అని కథానిలయం కరపత్రం చెబుతుంది. ఆవిర్భవించిన నాలుగు సంవత్సరాలే అయినా గణనీయమైన ప్రగతిని సాధించింది. మచ్చుకు కొన్ని :
- రెండంతస్తుల స్వంత భవనం.
- ముప్పైమంది రచయితా ` రచయిత్రుల పూర్తి రచనలు (564 పుస్తకాలు) చేరాయి. మరో ఇరవై రచయిత / రచయిత్రుల పూర్తి రచనలు త్వరలో చేరబోతున్నాయి.
- 108 సాహితీ సంస్థలు వెలువరించిన 216 సంకలనాలున్నాయి.
- 623 రచయిత / రచయిత్రుల 1,235 కథా సంపుటాలున్నాయి.
- 75 సిద్ధాంత గ్రంథాలు, పుస్తకాలు, విమర్శలు చేరాయి.
- అనువాదాలు, అలనాటి కథలు 310 పుస్తకాలు ఉన్నాయి.
- 74 రచయిత / రచయిత్రుల ఫోటోలు చేరాయి.
- ఇప్పటి వరకు 70 మంది పోస్టు ద్వారా, కథానిలయం నుంచి సేవలను కోరారు.
- రచయితలు, పాఠకులు, సాహిత్యాభిమానులు, కథాప్రియులు, ప్రభుత్వాధికార్లు, మంత్రులు సందర్శించి కథానిలయాన్ని, దాని రూపకల్పనని మెచ్చుకొన్నారు.
- శాశ్వత నిధి కోసం ప్రయాస మొదలైంది.
ఈ ప్రగతిని చూస్తే కథానిలయం, ఆంధ్ర రాజధానికి ఏడువందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొన్నది. నాలుగు సంవత్సరాల ప్రగతిని చూస్తే ముందు ముందు మరింత వేగంతో అభివృద్ధి చెందుతూ కథానిలయం పేరు ఆంధ్రానుంచి ఆలిండియాకే కాకుండా తెలుగు సాహిత్యాభిమానులున్న ఇతర దేశాలకి కూడా చేరుతుందనడంలో అతిశయోక్తి లేదు.
అయితే కారా గారికి ఈ ప్రగతి సంతృప్తిని కలిగించడం లేదు. ‘‘ఇంకా ఎంతో జరగాలి, అదీ వేగంగా జరగాలి’’ అంటారు. భవిష్యత్తు ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అనుకున్న సమయానికి జరగాలి. అందులో ఒక భాగంగా 1998లో ట్రస్టును ఏర్పరచి రిజిస్ట్రేషన్ చేసి ‘‘కథానిలయం ట్రస్టు బోర్డు’’ ఏర్పడిరది. వ్యవస్థాపకులైన కారా కథానిలయం తాలూకు చర`స్థిర ఆస్తులన్నింటిని రిజిస్టరీ వీలునామా ద్వారా ట్రస్టు బోర్డుకు దఖలు పరచారు. అప్పటినుంచి కథానిలయం నిర్వహణ బాధ్యతలను ట్రస్టు బోర్డు నిర్వహిస్తోంది. కారాగారం ఫౌండర్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
గతంలో కొందరు సుప్రసిద్ధ రచయితలకు ఇలాంటి ఆలోచనలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదని మా సంభాషణల్లో తెలిసింది. అయితే ఇలాంటి సంస్థలు తమ ఆశయాలను నెరవేర్చాలంటే, సాఫీగా పని చేయాలంటే రచయితల సహాయ సహకారాలు చాలా అవసరం అని వారు చెప్పారు. కొందరు లబ్దప్రతిష్టులైన రచయితలు ఉత్తరాలు, రిమైండర్లు పంపినా తమ తమ రచనల్ని, సంకలనాలని, ఫోటోలని పంపడం లేదని వాపోయారు. ‘‘తెలుగు రచయితలకు కథానిలయం తమదన్న భావన కలగాలి. దాని పురోగమనానికి తమకు తోచిన రీతిలో చేయూత అందించాలి. ఇందులో ప్రజల డబ్బు ఉంది. కొందరు రచయితలు, శ్రేయోభిలాషులు విలువైన పుస్తకాలను, పాత పత్రికల్ని పంపించారు. ఇంకా ఎన్నో పాత పుస్తకాలని, పత్రికల్ని సంపాదించాలి. అవి ఎవరి దగ్గర, ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. ఇలాంటి విషయాల్లో రచయితలు, పాఠకులు సహకారం అందించాలి. అది లేకపోతే కథానిలయాన్ని పెంచలేం. ప్రతి తెలుగు కథ కథానిలయంలో ఉండాలి’’ అని తమ సాధక బాధకాల్ని వివరించారు. కథలను సెలక్టు చేస్తారా అన్న ప్రశ్నకి ‘‘అన్ని కథల్ని ఉంచుతాం. ఈ రోజు పేలవంగా అనిపించిన కథ, దాని రచయిత ముందు ముందు గొప్ప కథకుడు కావచ్చు కదా! అందువల్ల అన్ని తెలుగు కథల్ని ఉంచుతున్నాం’’ అని వివరించారు.
ఇక చివరన మా సంభాషణంతా ఆర్థిక వనరులపై సాగింది. ఆశయాలు ఎంత బలమైనవైనా, ఎందరో శ్రేయోభిలాషులున్నా, మరెందరివో ఆశీర్వచనాలు వెనకున్నా, ఒక సంస్థ సాఫీగా నడవాలంటే కనీస ఆర్థిక వనరులు తప్పనిసరి. కారాగారు చెప్పినట్టుగా కథా నిలయ రూపకల్పనలో ప్రజాధనం ఉంది. అది ఎన్నో రూపాల్లో ఉంది. ఐదు రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు విరాళాలిచ్చిన సాహిత్యాభిమానులున్నారు. జిల్లా కలెక్టరు భవన నిర్మాణానికి (మొదటి అంతస్తు) అందించిన రొక్కముంది. స్థానికులతోపాటు శ్రీకాకుళం సాహితీ సమితి జోడిరచిన డబ్బు ఉంది. తన (కారా) రచనలపై వచ్చిన రాయల్టీ ఉంది. అవార్డుల రూపాల్లో వచ్చిన అమౌంటూ ఉంది. తోటి రచయితలు, మాస్టారుగారి శిష్యులు, అభిమానులు పోగు చేసిన కాసులున్నాయి, ఇలా సుమారుగా ఆరున్నర లక్షల రూపాయల వరకు పోగయిన డబ్బు కథా నిలయం నిలబడడానికి తోడ్పడిరది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రోజువారీ ఖర్చులకు, సంస్థ ఉద్దేశించిన కార్యక్రమాల నిర్వహణకు (సాహితీ సమావేశాలు, సభలు, వర్క్‌షాప్‌లు, రెఫరెన్స్ సేవలు, కార్యాలయాన్ని నడిపే ఖర్చులు మొదలగునవి) డబ్బు కావాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని కథా నిలయ నిర్వహణ ఒడిదుడుకులకు గురి కాకూడదని కార్పస్ (శాశ్వత నిధి) నెలకొల్పారు. ఈ నిధిని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉంచారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతోనే కథానిలయాన్ని నడపాలన్న ఆలోచన. వడ్డీ రెట్లు తగ్గుతున్న ఈ రోజుల్లో శాశ్వతనిధి మొదట అనుకున్న దానికంటే ఎక్కువ పెంచాల్సి వస్తుందని, ఇది వారికి ముందు ముందు ఒక పెద్ద ఛాలెంజ్‌గా ఉంటుందని వారి మాటల్లో గ్రహించాను. కార్పస్ పుష్కలంగా పెరిగిన రోజు కథానిలయం ఆర్థిక వనరుల గురించి ఆలోచించడం మాని సాహిత్య దృష్టిని కేంద్రీకరించి కథానిలయం ఆశయాలను సంపూర్ణంగా పది కాలాల పాటు కొనసాగించవచ్చు. ఉడతాభక్తిగా మనం చేయాల్సిన పనులు :
- కథానిలయం గురించి నలుగురికీ సగర్వంగా తెలపడం.
- ఎక్కడైనా పాత కథలు, సంకలనాలు, పత్రికలు మొదలగు విలువైన రెఫరెన్సు సామాగ్రి ఉన్నట్టుగా తెలిస్తే వివరాలతో కథా నిలయానికి తెలియజేయడం.
- తగిన రీతిలో ముఖ్యంగా శాశ్వతనిధిని పెంపొందించడానికి, విరాళాలు ఇవ్వడం, మీతో నలుగురూ ఇచ్చేట్టుగా ప్రయత్నించడం.