Home వ్యాసాలు కన్నెపిల్లల పండుగ : బొడ్డెమ్మ

కన్నెపిల్లల పండుగ : బొడ్డెమ్మ

బతుకమ్మ పండుగ కన్నా ముందు బొడ్డెమ్మల పండుగ వస్తుంది.తొమ్మిదిరోజుల పాటు కన్నెపిల్లలు మాత్రమే చేసేపండుగ ఇది బొడ్డెమ్మ అంటే “చిన్నది” అని అర్థం. అలాగే, ‘బొడ్డు’ అంటే ‘అత్తి చెట్టు’ అనే అర్థం ఉంది. దీన్నే మేడి చెట్టు, ఉదంబర చెట్టు అని కూడా పిలుస్తారు. తెలంగాణ ప్రాంతంలో అడపిల్లల్ని చిన్నప్పుడు బొడ్డెమ్మ అని పిలుస్తుంటారు. మేడిపండ్లని శ్రీమంతం రోజున తప్పనిసరిగా గర్భిణి ఒడిలో నింపుతారు. అందువల్ల, మేడిచెట్టును, మేడిపండును పూజించే క్రమంలో ఈ పదం పుట్టి ఉండవచ్చని కూడా కొందరి అభిప్రాయం. జానపదులకు తెలిసిందల్లా వారి మాటల ప్రకారం బొడ్డు, ‘అమ్మ కలిసి ‘బొడ్డెమ్మ’ అయింది. ‘బొడ్డు’ అంటే ఆధార భూతమైంది. తల్లికి, బిడ్డకి అనుసంధానమైంది. రేపటి బతుకుకు మూలమైంది కన్నెపిల్ల. కన్నెపిల్లనే బొడ్డెమ్మ. అందుకే సల్లుడు బొడ్డెమ్మల ఐదు పూలకుప్పలలో ఐదో పూలకుప్పని ఇంటి కన్నె పిల్లని కూర్చోబెట్టి చల్లుతారు. కన్నెపిల్లకి ముత్తయిదువులంతా పసుపు, కుంకుమ లిస్తారు. బొడ్డెమ్మను చెక్కపీటపై పుట్టమన్నుతో చతురస్రాకారంగా ఐదు దొంతరలు చేసి ఒకదానిపై ఒకటి త్రిభుజాకారంగా పేరుస్తారు. తంగేడు, బంతి వంటి పూలతో అలంకరించి శిఖరాన బియ్యంతో నిండిన కలశాన్ని ఉంచి, దానిపైన కొత్త రవికె బట్టనుంచి దానిపై తమలపాకు, పసుపుముద్ద ఉంచి ఆ ముద్దను గౌరమ్మగా భావించి పసుపు, కుంకుమలతో పూజిస్తారు. చెక్కతో కూడా ఈ బొడ్డెమ్మను చేసి, దానిపై నాలుగు వైపులా నాలుగు మట్టిముద్దలు పెట్టి పూలతో, అలంకరిస్తారు. బొడ్డెమ్మ పండుగ అంటే కన్నెపిల్లల ఆట, పాట మాత్రమేకాదు. ఆడపిల్లల్ని పూజించే పండుగ, గౌరవించే పండుగ. ఆడపిల్ల ప్రాముఖ్యాన్ని జగతికి చాటే పండుగ. తెలంగాణ అడపిల్లని ‘ఆడిపిల్ల’ అంటారు, అడిపిల్ల పుట్టిందంటేనే ప్రాంతమంతా ‘లక్ష్మీదేవి పుట్టింది’ అంటారు, ఎంతో ముద్దు ముచ్చట, కానీ అన్నింటికీ మించి కట్టడి, క్రమశిక్షణ, ఆడపిల్లంటే అణిగి, మణిగి ఉండాలి. నలుగురిలో నవ్వొద్దు, ఎగరడం, దూకడం చేయకూడదు. ఇలా అనే ఆంక్షలు నేర్చిన మన తెలంగాణ సంస్కృతే బొడ్డెమ్మ పండుగ ద్వారా పెద్దల సమక్షంలో నలుగురిలో ఆటపాట నేర్పింది. సిగ్గును పక్కకు పెట్టి నలుగురిలో మెలగడం నేర్పింది. ఎదుటివారితో మాటామంతీ కలుపుకోవడం నేర్చింది. కుటుంబం చక్కబెట్టుకోవడమే కాదు, సమాజ భావన అవసరమనీ చెప్పింది. బొడ్డెమ్మ తయారీ మొదలు చివరి వరకు ఇంటి పెద్ద నాయనమ్మ సమక్షంలోనో, ఆప్రాంతంలో ఎవరైనా పెద్దలు సమక్షంలోనే జరుగుతుంది. పెద్దలు చెప్పిన పాటల్ని అంటూ పిల్లలంతా ఆడతారు, పాడతారు. చప్పట్లు ఎలా కొట్టాలి, చేతులు ఎలా కలపాలి అనేది పెద్దలు నేర్పుతారు. ఎన్నో పాటలు, పిల్లల్ని ఆకర్షింపజేసి బతుకమ్మ ఆటను నేర్పుతాయి. ఈ పండుగరోజుల్లో కన్నెపిల్లలు ప్రతిరోజు ఇంటి నుంచి బియ్యం తీసుకుని వచ్చి కలశంలో పోస్తారు. బొడ్డెమ్మును సాయంత్రం మొదలుకొని చీకటిపడేవరకు పిల్లలు, పిల్లలతోపాటుగా ఆసక్తి ఉన్న పెద్దలు పాటలు పాడుతూ ఆమెను పూజించి, పప్పుబెల్లాలతో కూడిన పలహారాలను పెంచి పెట్టి బొడ్డెమ్మను పూజాగృహంలో దాచిపెడతారు. ఆ విధంగా తొమ్మిది రోజులు వివిధ రకాలైన ప్రసాదాలు చేసి బొడ్డెమ్మను కొలిచి ఆఖరిరోజున దగ్గరలో ఉన్న బావిలో జారవిడుస్తారు. ఈవిధంగా చేయటాన్ని నిద్రపుచ్చుట అంటారు. తొమ్మిదవ రోజున బొడ్డెమ్మపై కలశంతో నిండిన బియ్యాన్ని పరమాన్నంగా వండి బాలికలు, కలిసికట్టుగా ఆరగిస్తారు.

You may also like

Leave a Comment