Home వ్యాసాలు కమ్మని కవితల మేస్త్రీ కృష్ణశాస్త్రి

కమ్మని కవితల మేస్త్రీ కృష్ణశాస్త్రి

by vanaparti padma

తెలుగు భాషలో భావకవితా ప్రపంచానికి అదినేత బావ కవిగా పుట్టి భావగీతాలాలపించి, భావ కవిత్వాన్ని ఉధ్యమంగా స్వీకరించి విశేషప్రచారం చేసి రెండు దశాబ్దాల కాలం ఎదురు లేని తనహొ కవితా లహరిలో తెలుగు పాఠకులను ముంచి తేల్చి అచ్చమైన భావకవిగా గంధర్వలోకాల కేగిన గాన మూర్తి, పద్య కవిత్వాన్ని పండిచారు. పాటల కవిగాను, నాటకాలు, యక్షగానాలు చేశారు. ఎన్నో వ్యాసాలు రాసినప్పటికి వచనంలో కూడ సాహిత్య సౌరభాలు విరజిమ్మారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పాతకొత్తల మేలుకలయిక.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు క్రీ॥శ 1897 సంవత్సరంలో జన్మించారు. తల్లి దండ్రులు శ్రీమతి. శ్రీ సీతమ్మ వెంకటకృష్ణశాస్త్రి గార్లు కృష్ణశాస్త్రి చిన్నతనంలోనే పద్య, మరియు కవితా రచన చేసి కన్న వారి దీవెనలు పొందారు. 1918వ సంవత్సరంలో పిఠాపురం, కాకినాడల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. పెద్దబావగారి కూతురినే వివాహం చేసుకున్నారు. 1919వ సం॥లో తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి స్థాపించిన “సాహితి సమితి” లో సభ్యులైనారు. ఓ సందర్భంలో కృష్ణశాస్త్రి బి.ఎ అనిపించుకోవడం కంటే “సాహితి సమితి సభ్యుడను” అపిపించుకోవడమే తనకిష్టమని చెప్పారు. కాకినాడ పెద్దాపురం హైస్కూల్లో ఉపాధ్యాయులుగా రెండు సంవత్సరాలు పనిచేశారు. కాలం పిలుపులోని కల్మషాన్ని కడిగి వేయడానికి రాసిన ఈయన పాటలు సంప్రదాయవాదులకు గిట్టనందుకు రాజా వారికి చెప్పి సంఘబహిష్కరణచేయించారు. పిఠాపురం రాజావారికి వ్యతిరేకంగా ‘ధర్మసాదన’ అనే పత్రికలో కొన్ని వ్యాసాలు రాయడంతో రాజావారు ఉద్యోగం నుంచి తొలగించటమే కాకుండ తండ్రులకాలం నుండి వచ్చె ‘వార్షికం’ నిలుపు చేశారు. ఇలాంటి క్లిష్టసమయంలోనే శాస్త్రిగారి భార్య మరణించారు. భార్య వియోగం తో శోకతప్త హృదయంతో ‘కన్నీరు’ అనే ఖండకావ్యం రాశారు. గాడేపల్లి సూర్యనారాయణ గారి పెద్దమ్మాయి ‘ రాజహంస’ను వివాహము చేసుకొని మామగారి ప్రోత్సాహంతో సహయం నిరాకరణోద్యమ కార్యక్రమాలలో భాగస్వామి అవడంతో స్కూలుమాష్టారి ఉద్యోగం పోగొట్టుకున్నారు అయిన అదితన అదృష్టంగానే భావించారు ఎందుకంటే దేశ సేవనే గొప్పది అనుకున్నారు.

కృష్ణశాస్త్రిగారు రచించిన ఖండకావ్యాలు చేర్చి 1925లో ‘కృష్ణపక్షము’ అనే పేరుతో సాహితి సమితి తరుపున ప్రచురించారు. తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి గారి’సింహవలోకనం’ అనే పరిచయ వాక్యాలతో ఈ కావ్యం పాఠకుల ముందు కొచ్చింది. ఈ కావ్యాన్ని సూర్యరాయ బహద్దూర్ గార్కి అంకితమిచ్చారు. ఇందులో 59 శీర్షికలున్న ఈ గ్రంధం పద్యగేయంమిశ్రమం కాని కృష్ణపక్షమనే మకుటంతో ఏ శీర్షికలేదు. కాని “నాకు మరణమ్ము” అనే శీర్షిక తేటగీతి పద్యాల్లో ఒక చోట ఆపదం కనిపిస్తుంది. 14 చీకటి రాత్రులన్న కృష్ణ పక్షాన్ని తనలో సగమైన, చేయి కలిపి కష్ట సుఖాలు పంచుకున్న అర్ధాంగి తనను అందకారంలో ముంచి వెళ్లిపోయిన విషాద సన్నివేశానికి, సింబాలిక్ గా ఈ పదం వాడారని చెప్పవచ్చును.

కృష్ణశాస్ర్తీ గారు భావగీతలను కూడ రాశారు.

” ఆకులో ఆకునై పువ్వులలో పూవ్వునై / కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై / ఈయడవిదాగిపోనా ఎట్లైనా/ నిచటనే దాగి పోనా అంటుసాగిపోతాయి.

కృష్ణ పక్షం కావ్యంలో గొప్ప కవితా ఖండిక ‘అన్వేషణ’ తనకుతానే గోపికయై వంశీ మోహనుడైన గోపాల దేవున్ని కవి వెతకడం అన్వేషణలోని ప్రధాన ఇతి వృత్తం సెల యేటి కెరటాలలో తేలిపోతున్న విరికన్నె వలపు గాను, తొలి ప్రొద్దు తెమ్మర త్రోవలో పయనమై పరిగెత్తు కోయిల పాటగాను తెల్లని వెన్నెలలో కలసి కరిగి పోతున్న మబ్బు తునక లాగాను తీయదనమైన గోపికా హృదయాంతరాన్ని తన్మయత్వంలో ముంచి తట్టిలేపింది. అనంత సంగీత మకరంద మాధుర్యాన్ని చవి చూసిన గోపికా నాథుని వెదుకుచు ఆయన పల్లె వదిలి ప్రాణ నాథుని పట్టువొదలి యమునా సైకత భూవిలో వెరిగ్రా తిరగసాగింది ఇలా “శారద శర్వరే మధుర చంద్రిక / సూర్యమంతా స్రవంతిగా చారు వినీల వీచిక ప్రశాంత నిశా | పవనోర్మి మాలికా ” అంటు సాగింది. కృష్ణ శాస్త్రి జీవితమే అన్వేషణగా జీవించి మురళీ మోహమనే ద్యాన భజనలో మధుర భక్తిని పండించిన ఆపరజయదేవుడు. లోక నీతికి, సంప్రదాయ రీతికి భిన్నంగా శ్రీకృష్ణునికి తనకు తాను అర్పించుకున్న రాధగా జయదేవ కవి ఆలపించిన భావ సౌందర్యాన్ని పూతగా స్వీకరించ కృష్ణ శాస్త్రి అన్వేషణలో రాశారు. దేశ మాతను బంధించిన కఠిన దాస్య శృంఖలాలు చెదరి పోయినట్లు గగనతలం మారు మ్రోగెటట్లు కంఠమెత్తి స్వేచ్ఛాగానం చేశారు. ఏల ప్రేమింతును, నా ప్రేమ, ప్రాణకాంత వంటి గీతా మాలికలు రాశారు. భార్య వియోగంతో తపించిపోయిన శాస్త్రిగారు దుఃఖంలో విషాదకావ్యాలు రాశారు. ‘ఆశ్రువులను మాయం చేసె మరణం కన్నా జీవించి ఆమె కోసం దుఃఖించటమే తనకు ఆనందం అంటారు.

1929వ సం||లో జ్వాల పత్రికను నడుపుతున్న ముద్దు కృష్ణగారు ప్రవాసము ఊర్వశి అనే సంపుటిని ముద్రించారు. ‘కృష్ణపక్షము’ లోని వియోగం నుండి ప్రవాసములోని దుఃఖం ఆ దుఃఖం నుండి గమనించిన నాయిక “ఊర్వశి” అని చెప్పవచ్చు. దుఃఖాన్నే సౌఖ్యంగా అనుభవిస్తూ ప్రవాస గీతాలల్లడం, ప్రవాస గీత మాధుర్యాన్ని భావనకు అనునయించి ఆ భావనలో దివి నుండి దివ్యమూర్తి ‘ఊర్వశి’ ని భూమికి దించారు కృష్ణ శాస్త్రి గారు. ఉషస్సులు రావని తన జీవితం వలె కాలం కూడ చీకటి మయం గా కనిపిస్తుందని వాపోయారు. ఆయన బాధనుఏ గంధర్వలు అలకించారో ఏ వసంతుడు విశ్వ ప్రేయసి ఊర్వశికి తెలియచేశారో కాని ఆమె నిశీధిలో వెల్లు రేఖలా కవి హృదయకవాటాన్ని తట్టి లేపింది. ఆ విధఃగా కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ మాత్రమే కాదు సర్వలోకాలను కదిపి వేసిన గాధ కూడ ఆమె కోసం నిశీథిలో అన్వేషించారు. తపించారు కళ్ళలో వత్తులువేసుకొని నిరీక్షించారుఎద లోపలి ఎదలో దాచుకున్నారు. ఊర్వశిని “తొలిపొద్దున కురిసిన మంచు’ లా, విశ్వ వేదన మాల్యంగాను, విషంతో, అమృతంతో, చీకటితో, వెన్నెలతో కలసిన ప్రేయసిగా ఊహించుకున్నారు. శాస్త్రాగారి మాటల్లో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా అమ్మ సీతమ్మ, ప్రేయసి ఊర్వశి’అని అంటారు.

రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి శిష్యరికంలో బ్రహ్మ సమాజంలోని విశాల మానవ దృష్టి సంకల్ప శక్తి ఆయనకునైతిక బలాన్నిచ్చాయి. వైష్ణవి గీతాల్లోని వర్ణన మాధుర్యాన్ని ఆకళింపు చేసుకున్నారు. వీరి భావనలోని అణువణువు లయతో ఉంటుంది. శాస్త్రిగారి లేఖిని నుంచి జాలువారె ప్రతి గేయంలోను శబ్ధార్ధాలు పొందికలో నాట్యం చేస్తుంది. ఇంకా భక్తి గీతాలు అమృత వీణా ‘మంగళ కాహళి అనే సంపుటాలుగా వెలువరించారు. కృష్ణ రజని కన్నీరు, మహతి, మధు మురళి, గుడి గంటలు, ఋతుభేల, విరితూపు అనేవి సప్తస్వర సమ్మిళితం అయతే నిరాశ, కరుణ, ఆర్తి, భక్తి, ప్రణయం, ప్రకృతి ఆరాధన, పుణ్యయ ప్రేమ అనేవి సప్త స్వరాఅంత నాదాలు ఉంటాయి.

ఋతుశోభను ప్రకృతి కాంతలీలా మాధుర్యాన్ని కళ్ళారా చూచి, మనసారా అనుభవించిన కృష్ణశాస్త్రి వైష్ణవ భావ పరిపక్వతతో అండాళ్ళు ‘తిరుప్పావై’ ని ఆంధ్రీకరించారు శబ్దమాధుర్యంతో పాటు రూపమాధుర్యాన్ని అంతర్నేత్రంతో దర్శించి ఆనందించగల కృష్ణశాస్త్రికి దేవుడికి ఏ పూవ్వులు కావాలో, తెలుగులో ఏ అలంకారాలు, ఏ దేవుడికిష్టమో తెలుసు. ఏ అక్షరాలలో ఏ దేవుని పూజిస్తే అతడు సంతృప్తుడౌతాడో తెలుసు. అందుకే పుష్పాక్షరాలతో పూజించిన పుణ్య మూర్తి కాబట్టి వందలాది భక్తి కీర్తనలను రచించారు. కృష్ణశాస్త్రి గారి గొంతు పోయాక రాసిన గేయ సంకలనం కృష్ణ రజని’ లో ఆర్తిగీతాలు అద్భుతంగా పలికించారు.

కృష్ణశాస్త్రి పద్యాన్ని పాటను ఎంత రమణీయ శిల్పరంజితంగా తీర్చిదిద్దారో అంతటి నైపుణ్యాన్ని వచన రచనల్లో కూడ చూపించారు మంచి గంధంతో మల్లెపూలు అత్తరులో కలిపిచినుకు చినుకు చిలకరించినట్లుంది. వారి వచన శైలి, పచ్చకర్పూరపు గుభాళింపుతో వున్న పాయస పాత్రను నోటికందించినట్టుగా వుంటుంది. శాస్త్రిగారి విషయ విన్యాసం. కృష్ణశాస్త్రి పుట్టుకతో కవిగా అవతరించిన నిరంతర కవితా ధ్యానంతో పరిణతి చెందారు. వచనంలో కూడ తనదైన ఒక శైలిని సృష్టించుకున్నారు. ఆధునిక అవసరాలను ఊటకింస్తూ రాసిన చిన్న చిన్న వ్యాసాలల్లో కవిత్వం హృదయాన్ని ఎంత రంజిప చేస్తుందో వారి వచనం కూడా అంతగానే ఆలోచనలను తట్టి లేపుతుంది. వీరి కవిత్వంలో ప్రధాన గుణం భావమైతే మరో గుణం సంగీతం అంతర్వాహినిలా సాగుతుంది. అందుకే 1960 సం||లో హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేశారు అనతి కాలంలోనే చలన చిత్ర పరిశ్రమ కూడా కృష్ణశాస్త్రి గార్ని ఆహ్వానించింది. సినిమా మరుగైనా పాట నిలిచే ఉండే మంచి పాటలు రాసిన కవుల్లో దేవులపల్లి అద్వీతీయులు.

1939వ సం|| నాటికే ప్రతినాగరికుడి నోటికి కూని రాగాలయ్యాయి. ఆనాడు రాసిన గీతాల్లో “మవదూదయంలో మంచి ముహుర్తం/ మాధవి లతకు పెండ్లి/ మాదవి పెండ్లికి మల్లెమాలలు /మంధారాలు పేరంటాళ్లు” అనే పాట బహ్మండమైన ప్రచారంలో ఉండేది. ఇలాంటి పదచిత్రాలు చూసిన సినిమా రంగం 1951లో వారిచే పాటలు రాయించింది. దేవులపల్లిగారు పాటలు రాసిన మొదటి సినిమా ” మల్లీశ్వరి’ రాణి వాసపు పంజరంలో బంధీయైన మల్లీశ్వరి రాత్రిపూట రహస్యంగా ప్రియునిన కలుసుకున్నపుడు ఆమె మనస్సు మల్లెలు ఊగిపోయాయి హాయి నిండిన ఆ రేయిలో ఆమె బతుకే పండింది అంటూ ఈ పాట ‘మనసున మల్లెల మాల లూగెనే / కన్నుల వెన్నెలడోల లూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో / ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో అంటు సందేశాన్ని పంపినా ప్రతి పాటా ఒక మధుర కావ్యం. కాళిదాసు మేఘ సందేశాన్ని దృష్టిలో ఉంచుకొని మల్లీశ్వరిలో మంచి పాటలు రాశారు. జావళీలు రాయడంలో కూడా ఆయనకు తిరుగు లేదు. పిలిచిన బిగువటరా / పిలిచినా బిగువరా / ఔరౌర అంటు సాగే జావళీ పాట నేటికి నిత్య నూతనంగా అందరి హృదయాలను అలరిస్తూనే ఉంది. పాటలో జీవిత చిత్రాన్ని చిత్రించడంలో ‘వారికి వారె సాటి. జీవితంలో అన్ని విధాల ఓడిపోయిన మారిపోయిన ఉక్కు మనిషిలోపరివర్తనకు కారణమైంది ఒక పసిపాప. అతడు పాప కోసమే జీవిస్తాడు కారణాంతరాన చెరసాలకు వెళ్లి తిరిగి వచ్చాక పాప పెద్దదవుతుంది. అతన్ని మర్చిపోతుంది. బరువెక్కిన గుండెలతో ఒక పాప బొమ్మను లాలిస్తూ. తథిమి తకథిమిల్ బొమ్మ /దీని తమాస చూడవే కీల్ బొమ్మ / దీని తమాస చూడవే మాయ బొమ్మ అంటు పాడతాడు తలచుకుంటేనే గుండె కరిగిపోయే ఈ సన్నివేశంలో తత్త్వాన్ని చాలా గొప్పగా పలికించారు. కృష్ణశాస్త్రి గారు. మల్లెల్లో పూలల్లో కూడ సృష్టి విలాసాన్ని పొదిగి చెప్పిన పాటలు లెక్కకందవు. అందులో ఒక్కటి ” ఇది మల్లెల వేళయని / ఇది వెన్నెల మాసమని / తొందర పడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది అంటు మల్లెలు, వెన్నెల, కోయిలతో మహత్తరమైన జీవిత సత్యాన్ని పాడారు. అందులోనే “మరిగిపోయెకి మానవ హృదయం / కరుణ కలిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురైవచ్చు, వాడని వసంత మాసం వసివాడని కుసుమ విలాసం అంటు సాగే ఈ పాటలో విషాదం వెనుక వసంతాన్ని సృష్టించి ఊపిరిపోస్తారు. సినిమాల్లో కూడ ఎన్నో భక్తి గీతలు రాశారు “సంపూర్ణ రామాయణం” లో శబరి రాముని కోసం ఎదురు చూస్తుంది రాముడు సమీపానికి వస్తున్నాడు ఈ సన్నివేశంలో శబరికి, శాస్త్రిగార్కి బేధం లేదు. ఆ సందర్భంలో ఇలా… ముందు తెలిసెనా ప్రభూ / ఈ మందిర మిటులుండేనా, మంద మతిని, నీవు వచ్చు మధుర క్షణమేదో, కాస్త ముందు తెలిసినా……. అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే సుందర మందార కుందసును దళములు పరవనా…. అంటు షాగే ఈ పాట గళం మూగబోయాక రాసిన గగన తలాన్ని సృశిస్తుంది భగవంతుని పిలుస్తుంది. భాగ్య రేఖ సినిమాలో “నే వుండేదాకొండపై రాజమకుంలో ‘సడిసేయకేగాలి” భక్త శబరి చిత్రంలో “ఏమి రామ కథ” మంచి రోజులొచ్చాయి చిత్రంలో “నేలతో నీడ అన్నది నను తాకరాదని” ఆమెరికా అమ్మాయిలో పాడనా తెలుగుపాటా”, బంగారు పంజరంలో ‘గట్టుకాడ ఎవరో ” మొదలైనవి శాస్త్రి గారి పాటల్లో ఆణిముత్యాలుగా చెప్పవచ్చును. వందల సినిమాల్లో దాదాపు 500పైగా పాటలు రాశారు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కల్పించిన ఘనత కృష్ణశాస్త్రి గార్కె దక్కింది.

కృష్ణశాస్త్రి గారు స్వాతంత్య్ర కాంక్షతో జాతీయ గీతాలు పాడారు. “జయ జయ జయ ప్రియభారతి జనయిత్రీ దివ్వ దాత్రి ” అంటూ నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో ప్రజలను కదిలిస్తూ రాసిన గీతం ” ప్రజారథం తరలింది / ప్రపంచ పధం పొరలింది/ కనుక పదవోయి పద” అంటూ హెచ్చరిస్తూ ఉత్తేజతుల్ని చేసింది. 1939 ప్రాంతంలో దేశంలో క్షామ దేవత తాండవిస్తున్న తరుణంలో ఆకలిగేయం రాశారు. 1941లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి మహ సభకు ఉద్యమానికి ప్రేరణగా అవేశం అంతర్భూతంగా ఒక స్వభోధ గీతాన్ని రచించారు. శాస్త్రిగారు అభ్యుదయ కవుల హృదయాల్లో చెలరేగిన ఉద్వేగ భావాలు గుర్తించారు. ఆశీర్వదించి వారికి పద నిర్దేశం చేసి ముందుకుసాగనించారు. తృతీయ అభ్యుదయ రచయితల మమాసభకు అధ్యక్షత వహించడం ఆయన అభ్యుదయ ప్రియత్వానికి నిదర్శనం శాస్త్రిగారు భావ కవితా ప్రతినిధే కాదు కవితా వైతాళికుడు కూడా. వారు పాడితే పక్షులు వంతపాడుతాయి. మబ్బులు శృతి కలుపుతాయి, నదులు పర్వతాలు లయలు చూపుతాయి. అందుకే ఆయన అచ్చమైన ప్రకృతికవి. ఆయన పాటల్లో ఆకుల నాడించే కొత్తగాలి, మాటల్లో విశ్వ ప్రేమ ను చూపించే కొత్త ఊపు, ఆలోచనల్లో సామాజిక హృదయ స్పందనలపై కొత్త చూపు కలంలో కరుణ, జాలు వార్చెడి కొత్త రసస్పందన కవితలలో సర్వహృదయాలను కదిలి కదిలిపోయె నూతన భాష్పీభవన పరిస్పందన. దేవులపల్లి కవిత ఆత్మీయుడైన మిత్రుడు సంస్కారాన్ని తట్టి మేలు కొల్పినట్లుంటుంది. సంప్రదాయం నుంచి చైతన్య పూరితమైన సన్నివేశాలు తెలసుకోగలరు. అవి రెండు కలిపి కవిత్వంగా ఆవిష్కరించగలరు. ఆ కవిత్వాన్ని పాడి ఎదుటి వాడి గుండెలో గూడు కట్టి కాపురం చేయగలరు. అందుకే ” కవి కృష్ణ శాస్త్రి కమ్మని కవితల కతడు మేస్త్రి అంటారు. 1942లో నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1964లో శాస్త్రి గారి స్వరపేటికలో కాన్సర్ సోకింది. ఆపరేషన్ చేశారు. గళం మూగబోయింది. మధుమాస కోయిలకు గొంతు మూగ బోయదంటే ప్రకృతిలో ఎంత విచిత్ర మైన లీలలు సాగుతున్నాయో గదా !

గొంతు మూగబోయిన చివరి వరకు ఆయన మానసికంగా ఎంతో ఉత్సాహంగా జీవించారు. కవితా వ్యాసం సగం విడువలేదు ఆ సమయంలో రాసినదే “కృష్ణరజని” అని పేరు పెట్టారు. తన అభిమానులకు కొండంత సాహిత్యంతోపాటు రవంత కన్నీరు మిగిల్చి 24-02-1980 వ సంవత్సరములో గంధర్వ లోకం వెళ్ళిపోయారు.

“నన్ను గొపోవరాదా నాదా / నా హృదయం నాదా ” అంటూ భగవంతుని సన్నిధానం చేరుకున్నారు. కృష్ణ శాస్త్రి కవిత్వం రాయడానికి కొన్న హంగులు కావాలి నిరంతరం సాహితి గోష్ఠికావాలి మంచి సంగీతం వింటూ ఉండాలి. ఊసులు చెప్పుకోడానికి ఊహ తెలిసిన మిత్రులు కావాలి. ఈ హంగులుంటేకాని ఎక్కడో గున్నమావి కొమ్మల్లో ఉన్న గువ్వ కలంతో కలిసి పాడదు. కదిలి పోయే గుండె ఉండాలే కాని కృష్ణ కోయిల ప్రతి వసంతానికి తట్టి లేపుతునే ఉంటుంది.

” గూడు నిద్రపోయిన గువ్వ మేలుకుంది.
గొంతు మూగ పోయిన గుండె మేలుకుంది “


వనపర్తి పద్మావతి
ప్రముఖ కవి, రచయిత
ఉపన్యాస సిరోమణి


You may also like

Leave a Comment