ఎన్ని ఏళ్ళు గడిచినా, ఎన్ని తరాలు మారినా సమాజంలో ఇంకా మార్పు రావాల్సి ఉంది అని చెప్పవచ్చు. మారుతున్న విద్యా,వైజ్ఞానిక, సాంకేతిక విషయాల్లో ఎంతో పరిణతి చెందినప్పటికీ కొన్ని విభాగాలలో మనిషి దృక్పథం ఇంకా మారటం లేదు. ప్రాశ్చాత్య దేశాల పోకడల ప్రభావమో…! లేకమనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో చేస్తున్న తప్పు కావచ్చు….! ఏదిఏమైనాప్పటికీ తప్పిదాలు మాత్రం జరుగుతున్నావనుకోవచ్చు..!! సామాజిక మాధ్యమాలు ఒకవైపు మనిషిని వెంటాడి నిజాన్ని, అబద్ధాన్ని ఒకే విధమైన అనుకరణలతో మనిషిని నేటి కాలంలో సందిగ్ధంలో పడవేస్తుంటే మరోవైపు ఏది సరి అయినదో తెలుసుకోక అయోమయంలో పడడం, బంధాలు అనుబంధాలు మధ్యలో ఆత్మీయతను ఎంతవరకు కాపాడుతున్నారో తెరచి చూస్తే చాలా అనుమానం కలుగుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ తరతరాలుగా అణిచివేయబడుతున్న స్త్రీ ల జీవితాలే కనిపిస్తున్నవి. ఇలా ఒకటేమిటి అనేక! ఎన్నో వైవిధ్యమైనటువంటి సంఘటనలను నేటి కాలం రచయితలు తమ కలాలను కదిలిస్తూ అనేక రచనలు చేశారు, చేస్తున్నారు. వారంతా కోరుకునే అభిప్రాయం, కాంక్ష ఒక్కటే మరి అదే ‘మార్పు’ ఆ మార్పు కోసం పరితపిస్తున్న నేటి రచయితలలోని కొందరి కావ్యాలను, వారి వారి రచనలను పరిశీలిస్తే…
ఎన్ని ఏళ్ళు గడిచినా, ఎన్ని తరాలు మారినా సమాజంలో ఇంకా మార్పు రావాల్సి ఉంది అని చెప్పవచ్చు. మారుతున్న విద్యా,వైజ్ఞానిక, సాంకేతిక విషయాల్లో ఎంతో పరిణతి చెందినప్పటికీ కొన్ని విభాగాలలో మనిషి దృక్పథం ఇంకా మారటం లేదు. ప్రాశ్చాత్య దేశాల పోకడల ప్రభావమో…! లేకమనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో చేస్తున్న తప్పు కావచ్చు….! ఏదిఏమైనాప్పటికీ తప్పిదాలు మాత్రం జరుగుతున్నావనుకోవచ్చు..!! సామాజిక మాధ్యమాలు ఒకవైపు మనిషిని వెంటాడి నిజాన్ని, అబద్ధాన్ని ఒకే విధమైన అనుకరణలతో మనిషిని నేటి కాలంలో సందిగ్ధంలో పడవేస్తుంటే మరోవైపు ఏది సరి అయినదో తెలుసుకోక అయోమయంలో పడడం, బంధాలు అనుబంధాలు మధ్యలో ఆత్మీయతను ఎంతవరకు కాపాడుతున్నారో తెరచి చూస్తే చాలా అనుమానం కలుగుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ తరతరాలుగా అణిచివేయబడుతున్న స్త్రీ ల జీవితాలే కనిపిస్తున్నవి. ఇలా ఒకటేమిటి అనేక! ఎన్నో వైవిధ్యమైనటువంటి సంఘటనలను నేటి కాలం రచయితలు తమ కలాలను కదిలిస్తూ అనేక రచనలు చేశారు, చేస్తున్నారు. వారంతా కోరుకునే అభిప్రాయం, కాంక్ష ఒక్కటే మరి అదే ‘మార్పు’ ఆ మార్పు కోసం పరితపిస్తున్న నేటి రచయితలలోని కొందరి కావ్యాలను, వారి వారి రచనలను పరిశీలిస్తే…
” అనుభూతుల అక్షరమాల ఆగిపోకు ..కష్టాలు ఎన్ని వచ్చినా వెనుదిరగక సాగిపో” అంటూ కవన ప్రత్యేకతను ‘ఆగిపోకు’ కవితా సంపుటి ద్వారా పాఠకులను ప్రభావితం చేస్తున్న కవయిత్రి అయిత అనిత. స్త్రీ సృష్టిలో అందమైన దేవుడి వరం. స్త్రీ అంటేనే ప్రేమ అనురాగం, పుట్టిన దగ్గర నుండి తన ప్రతి పాత్ర ఎంతో చక్కగా నిర్వర్తిస్తుది, నాలుగు గోడల ఇంటిని స్వర్గం చేస్తుంది. ఏ పనిలోనైన రాణించగలిగే ధైర్యం సత్తా ఉన్నది స్త్రీ కి అని పదే పదే చెప్తోంది !
“స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం” కానీ సమాజంలో కొన్ని అరాచకాలు, చిన్నారులపై స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు పాల్పడుతున్న దుండగులను శిక్షించాలంటూ కవయిత్రి అనిత ఆవేదనగా వ్యక్తం చేశారు. ‘నేను నేనే’ …! కవితలో…. పరుల అందానికై నాలుగు ప్రియమైన మాటలు
నా జహ్వా పై ఊరుతూనే ఉంటాయి ఎల్లప్పుడు!
నా మీద వస్తే నాకు దిక్సూచి నా వ్యక్తిత్వమే నాకు రక్ష….. అంటున్నది.
నేటి తరానికి, రాబోయే తరానికి అర్థమయ్యే రీతిలో భావానికి ఎలాంటి నష్టం కలగకుండా పాఠకులకు అందించాలనే ముందుకు వచ్చిన హుస్నాబాద్ వాస్తవ్యురాలు అయిన కవయిత్రి,
ఇంజపురి వసంత తన కవనం ఒక ప్రత్యేకత తో రచించిన ” వసంత సుమాలు ” పుస్తకం తెలిచిచూస్తే చివరి పేజీ వరకు అన్ని విషయాలను స్పృశించి ” అక్షర భావ సుమాలు “గా ఆకట్టుకుంది.
‘ ఉప్పు కర్పూరం వేరు
రంగులు మాత్రం తెలుపు
ఒకటి రుచిని తెలుపు
మరొటి పవిత్రత గొలుపు “
ఉప్పు కర్పూరం రెండు కూడా కళ్ళకు సమానంగా కనిపించినా గానీ దేని లక్షణం అది అంటూ ఆనాటి ఉప్పు కప్పురంబు చూడు ఒక్క పోలికనుండును మళ్లీ తలపించింది .
హృదయాంతరాలను కదిలించే “కృష్ణా తరంగాలు ” … అలసిన మనసుకు ఓదార్పులు …. అంటూ సాహితీ లోకానికి నా అంతరంగాలు కృష్ణా తరంగాలు * తొలి కవితా సంపుటితో పరిచయమైన (పొందూరు) ఒంగోలు వాస్తవ్యురాలు కవయిత్రి కృష్ణవేణి పరాంకుశం తన కవనం ఒక ప్రత్యేకం…. *తన కవితల భావాలలో తడారిన భూమి గుండెలో కొత్త ఆశలు మొలకెత్తినట్లుగా గాయపడిన మనసుకు ఓదార్పు, యువతకు ప్రేరణ, ఆత్మవిశ్వాసాన్ని అందించే కవయిత్రి కృష్ణవేణి కవనం
సంక్రాతి కవితలో….
పాలముంతల నురుగుపొంగులతో చెరుకుగడల తీపిమధురిమలతో పిండివంటల విందులతో గంగిరెద్దుల విన్యాసాలతో కోడిపందాల కోలాహలాలతో నింగికెగిరే పతంగుల విహారాలతో రంగవల్లిలో గొబ్బెమ్మలు పెట్టి చేసే కొత్త అల్లుళ్ళ , కొంటె మరదళ్ళ సరదా రైతు ఇంటికి చేరిన ధాన్యరాసులు సంక్రాంతి లక్ష్మి పరవశిస్తుంది
తెలుగు ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకొనే సంక్రాంతి…ఆ పండుగ గురించి విశిష్టంగా తన కవితలో చెపుతూ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచింది అనేలా చిత్రించారు.
ఆధ్యాత్మిక భావాల ద్వారా పాఠకులను చైతన్యం చేసే దిశగా కలం కదుపుతూ సాహితీ ప్రపంచానికి పరిచయం అవుతున్న హైదరాబాద్ వాస్తవ్యురాలు ఎమ్. అరుణ కుమారి గారి కవనం ఒక ప్రత్యేకం. శ్రీ కృష్ణ భగవానుడి భక్తురాలిగా, ఆధ్యాత్మిక భావాల ద్వారా తనలోని అంతరంగాలను అద్భుతంగా ఆవిష్కరించి అందమైన కవిత్వాన్ని అందించారు. ఈ అక్షర దీపిక లోని కవితల్లో
“కళ్ళు మూసినా, తెరిచినా
నీ రూపమే
ఎంత చూసినా తనివితీరదేమి
ఇంత అందం ఎక్కడ దాచావు
ఆ చిలిపి కవ్వించే కళ్ళ లోనా
ఆ కొంటె నవ్వు దాచిన అధరం లోనా
ఏవో లోకాలకు తీసి కెళ్లే ఆ వేణు గానం లోనా”
సృష్టికి మూలమైన ఆ పరమాత్ముడిని స్మరించుకుంటూ, తనలోని భావాలను జతచేస్తూ అందించిన కవనం.
మమతల కోవెల రాధా కవిత్వం
కవితలోని గాంభీర్యం , అక్షర సేద్యం , వ్యవస్థలోని ప్రతి అవస్థలను స్పృశించే నేర్పు , ప్రతి అంశాన్ని పరిశీలించి తనదైన శైలిలో అక్షరీకరించాలన్న తపన రాధా కుసుమ కవిత్వం ప్రత్యేకత. వందేళ్ల క్రితం వివక్షతకు వ్యతిరేకంగా గళం విప్పి పోరాటం చేసిన కుసుమ ధర్మన్న కుటుంబానికి చెందిన -డా.రాధా కుసుమ హైదరాబాద్ వాస్తవ్యురాలు.
రాధా కుసుమాలు – కవితా సంపుటితో సాహితీ లోకంలో అక్షర సుమాలను అందించింది.
మనుష్యులంతా ఒక్కటే…
అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే గీతాలాపన చేసాను చిన్నవాడు .. కానీ నేడు కూడా నాభాష నా మతం నాకులం నా ప్రాంతం ఇదే కదా కుమ్ములాటలకు ప్రధాన సూత్రం … ! రవికిరణానికి పవన పయనానికి పారే సెలయేటికి కురిసే చినుకులకు ఈ కలదా ఈ జాడ్యం ఇంకా నయం ప్రకృతి కూడా చూపిస్తే ఈ తేడాల తతంగం మానవుల మనుగడలో మిగిలేది శూన్యం …. ! అని తెలిపారు.
అనుబంధపు లోగిలి వెలుగులే “దగ్ధ హృదయం’
సమాజంలోని ప్రతి అంశాన్ని తనదైన కోణంలో పరిశీలించి ఒక మార్పు కోసం పరితపించే కవిగా కవిత్వం అంటే నిత్య సంఘర్షణ గా భావించి కలాన్ని కదిలిస్తూ సాహితీ లోకంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన నేరోజు రమేష్ రచించిన ” దగ్ధ హృదయం ” కవిత సంపుటిని పరిశీలిస్తే… సమాజంలో పాతుకుపోయిన సమస్యలు లంచగొండితనం, యువతలో మసకబారుతున్న బాధ్యతలు, సమాజపరంగా రేపటి భావితరాలకు పరిరక్షణ కోసం కాలుష్య నియంత్రణ ఇలా పలు అంశాలపై తన కవితా సంపుటిలో ప్రధానంగా ప్రస్ఫుటించినాడు.
సమాజ హితం కోరే….
వెలుగు పూలు కవితల్లోని ఘాడత ఏ కోణంలో ఉన్నది అనే విషయంలో కవి ఎంచుకున్న వస్తువు నుండి మొదలుకొని, పదప్రయోగంలో సఫలీకృతుడై సమాజానికి వెలుగునివ్వాలనే దృఢ సంకల్పంతో చేసిన అద్భుత ప్రయత్నమే “వెలుగుపూలు కవితా సంపుటి” ప్రజల పక్షం వహిస్తూ ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ తనదైన కోణంలో సాహిత్య రంగంలో రాణిస్తున్న కవి తాటిపాముల రమేష్ రచించిన ఈ కవితా సంపుటి సాహితీ ప్రపంచంలోనే కాకుండా, సమాజపరంగా ఆరోగ్యవంతమైన కవిత్వాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి బాధ్యతలు ఒకవైపు నిర్వహిస్తూ మరోవైపు సాహిత్య ప్రయాణం చేయడం అభినందనీయం…. సామాజిక సాంఘిక అంశాలను ప్రత్యేకంగా తన కవితల్లో వస్తువులుగా తీసుకొని తనదైన కోణంలో ఒక కొత్త నిర్మాణాత్మక ఫలితాలను సమాజంలో చూడాలని ఆశిస్తూ కవి చేసిన ప్రయత్నం సఫలీకృతమవుతుందని చెప్పవచ్చు.
కనిపించే ప్రకృతి అందాలను వర్ణించడం కవి సహజ లక్షణం… అదేవిదంగా సాక్షాత్కరంగా కనిపించని సమస్యలకు పరిష్కారాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ప్రత్యేక హృదయం ఏర్పర్చుకొని తన కలం తో కృషి చేస్తున్న కవయిత్రి కరీంనగర్ వాసి ఉత్తమ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలుగా పురస్కారం అందుకున్న కాసనగొట్టు స్వప్న కృష్ణ. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గా కొనసాగుతున్నది. తను వెలువరించిన కవితా సంపుటి ” ఎందుకో ఈ వేళ” ను పరిశీలించగా విభిన్న అంశాలపై దూర దృష్టి తో, ముందస్తు సూచనలతో కవితా వస్తువులను కవయిత్రి ఎంచుకోవటంలో ప్రత్యేకతగా
మేము మనుషులమే ( హిజ్రాలు ) కవితలో…
విరించి పరధ్యానంలో పద్ధతి మరిచి సృష్టించాడో..
ఆ విధి వికటాట్టహాసంతో విరుచుకు పడిందో…
తనువులో నియమం …
మనసుదో చిత్తం …
ఆమోదయోగ్యమవని రూపం ..
ఆచరణయోగ్యమవని జీవనం ..
ఏమిటి మా పాపం ..
ఎందుకీ శాపం ..
మానవ జీవితంలో ఆడ మగ తో పాటు ఏ తప్పు ఎవరిలో లేకుండా మరో ఒక ప్రాణంగా నిలిచిన ట్రాన్సిజండర్ల విషయాలు వారు పడుకున్న కష్టాలను, వారి పక్షాన కవయిత్రి తన కవనాలను బలంగా వినిపించింది.
నిస్వార్థపు జాడ చెప్పిన కవిత్వం అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే అక్షరమే ప్రధాన ఆయుధమని భావించి అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యం పట్ల అభిలాష సహజ కవయిత్రి పోతురాజు దుర్గాదేవి.గుంటూరు వాస్తవ్యులు అయిన పోతురాజు దుర్గాదేవి తన కవనం యొక్క ప్రత్యేకతను తన మాటల్లో పరిశీలించినట్లయితే……
సాహిత్యాభిమానులకు, పాఠకులకు తొలకరి జల్లుల వంటి ఆహ్లాదాన్ని తను రచించిన మొదటి కవితా సంపుటి ” కాలం సాక్షిగా…. ” అందిస్తుందని తన భావాన్ని వ్యక్తం చేసినది. కానీ తన గురించి తనకు తెలియని మరో కోణం ఏమిటి అంటే సాహిత్యంలో తన కవనం ప్రత్యేకతతో అందవేసిన చెయ్యి తనది అని తనకు తెలియని ఒక నిగూడ మైన నిజం అని ఈరోజు తన రచనలు సాక్షం చెబుతున్నాయి. తెలుగు భాషను అమ్మ భాషగా భావించి ఎమ్..ఎ తెలుగు సాహిత్యం చదివి ఆ తదుపరి ఎం.పిల్ ఉత్తీర్ణురాలై ప్రస్తుతం కే వరలక్ష్మి కథా సాహిత్యం పై ప్రామాణిక పరిశోధన చేస్తున్నారు.
అమెరికన్ నవలా కారుడు స్కాట్ ఫిట్జ్ రాల్డ్ అంటాడు…
For what it’s worth, it’s never too late to be who ever you want to be. I hope you live a life you’re proud of and if you find that you’re not, I hope you have the strength to start over .
చేసే మంచి పని ఎప్పటికీ చిరస్థాయిలోనే నిలుస్తుంది, మంచి పని చేసేటప్పుడు ఒడిదుడుకులతో ప్రయాణం మొదలైనప్పటికీ శాశ్వత మార్పుకు నాంది పలికినట్టే లెక్క.
అందరాని చందమామ కవితలో….
అందరాని చందమామ
అందరికి మేనమామ
అందనంత దూరాన
ఆకాశం ఆటకెక్కి
నీలాల నింగి అంచున
నిలిచి గోరుముద్దలు తింటున్న
పాపాయి బోసినవ్వులు చూస్తూ
ఆరుబయట ఆడ పిల్లల
చందమామ! చందమామ!
అనే కేరింతలు వింటూ “చందమామరావే జాబిల్లి రావే” అని. .
అమ్మలు పాడే లాలి పాటలు.
తరతరాలుగా వింటున్నా..
విసుగు చెందక అందరి
ఊసులు వింటూ….
సహజంగా ప్రకృతి అందాలను వర్ణించడం కవి సహజ లక్షణం అని తెలుపుటకు ఈ కవిత నిదర్శనం, సూర్యుడు,చంద్రుడు,ఆకాశం,భూమి, పచ్చిక బయల్లు, ఇలా ప్రకృతిలోని ప్రతి అందాన్ని వర్ణించటంలో కవి యొక్క పాత్ర విభిన్న కోణంలో ఉంటుందని దుర్గాదేవి కవణంలో సూచిస్తుంది.
అంతర్జాల మానవ యాంత్రిక యుగంలో మనిషి ఊహలు, ఆలోచన విధానం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలం లో నిర్మాణాత్మక విజయతీరం కోసం మనిషి కృషి చేయకుండా తన జీవన చదరంగంలో చేస్తున్న తప్పిదాలైన…. మసకబారుతున్న మానవీయ విలువలు, యువతలో ఆత్మవిశ్వాసం లోపించటం లాంటి విషయాలకు పరిష్కార దిశగా డాక్టర్ .బుర్ర మధుసూదన్ రెడ్డి కవనం ప్రత్యేకంగా కొనసాగుతుందని చెప్పవచ్చు.
“మధుపాళీ” కలం పేరుతో రచనలు కొనసాగిస్తున్న మధుసూదన్ సాహితీ ప్రపంచానికి, పాఠక లోకానికి పత్రికా ముఖంగా తన రచనలతో సేవలు అందిస్తున్నారు..కరీంనగర్ వాస్తవ్యులైన లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డిరసాయన శాస్త్ర ఆచార్యుడుగా మూడున్నర దశాబ్దాలు, ఎన్సిసి అధికారిగా రెండు దశాబ్దాలు, పాఠ్యపుస్తక రచయితగా మూడు దశాబ్దాలు, ప్రధానాచారిగా ఐదు సంవత్సరాలు ఇలా సుదీర్ఘ అనుభవాలతో మరెన్నో కావ్యాలను రచించి సాహితీ లోకంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
పెకిలిన కలం గళం కవితలో….
అక్షరాభ్యాసంతో ఆరంభమై
అంతిమ ఘడియల దాకా
విజ్ఞాన వికాస సిరా ఊట బాయి
అంగి జేబుకే అంగమైన కలం!
కలం విలువ అందరికంటే ఎక్కువగా ముందుగా ఒక అధ్యాపకుడీకే తెలుస్తుంది. అనీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ అధ్యాపకుడే కవి అయితే విజ్ఞానం అంటే ఏమిటో చెప్పాకమానడు.అని నిరూపించాడు.
మానవ జీవన వికాసముల సమాహారంగా…
. కొంగొత్త అనుభూతులు,కొత్త కొత్త భావాల వ్యక్తీకరణతో ఎప్పటికప్పుడు సుసంపన్నం చేస్తూ మన చుట్టూ శోబిల్లుతున్న ప్రకృతిని వర్ణిస్తూనే కాకుండా సమాజ సమస్యల పరిస్థితులను పరిశీలిస్తూ పరిష్కార దిశగా… ” అమృతధారలు” కవితా సంపుటితో పాటు సాహితీ లోకాన తన రచనలతో ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తున్న హైదరాబాద్ వాస్తవ్యులు కవయిత్రి పి పద్మావతి తను వెలువరించిన కవితా సంపుటిని పరిశీలించగా
నేటి యువత… కవిత లో
‘నేటి యువత అంటే..
కన్నవారి ఆశల కుసుమాలు.
శక్తి యుక్తుల నిలయాలు
సమాజానికి మేలు కూర్చి ఆలోచనలు. నవయుగ భారత నిర్మాణానికి పునాదులు.!’..
‘విజ్ఞాన వివేకములకు దీక్షితులు
సమతా మమతలకు సారథులు
ప్రాధనా లక్ష్యాల సర్విచారములు
పరుగులు తీసే ప్రగతికి రథచక్రాలు ! ‘
యువత దేశ ప్రగతికి సోపానంగా నిలవాల్సిన బాధ్యత ఉన్నదని స్వామి వివేకానందుడు చెప్పిన సూక్తులను ఆధారితంగా ఈ కవనం విధానాన్ని పరిశీలిస్తే నేటి సమాజంలో పాతుకుపోయిన, సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని కాలానికి అపూర్వమైన అమూల్యమైన సంపద కలమే నన్నది పద్మావతి రచనల్లో పరిమళించే కవిత్వమే నిదర్శనం.
జీవితానికి,మనసు భావాలకు మధ్య ఒక అంతరం ఏర్పడినప్పుడు జరిగే సంఘర్షణాపూరితమైన లేక ఆలోచనాత్మక మైన పలు రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.అలాంటి సందర్భం నుండి కవి తన అక్షరాన్ని సహజంగా ప్రారంభిస్తాడు. ఆ అక్షరాలు పాఠకున్ని ఆలోచింపజేస్థాయి. అలాంటి ఆలోచనాత్మకమైన, ఉత్తమమైన రచనలతో గోదావరిఖని పట్టణానికి చెందిన గౌరోజు కృపారాణి ( అనుశ్రీ కలం పేరు ) తో సాహితీ లోకం లో తను రచించిన “గగనం” కవితా సంపుటి ద్వారా ముందుకు వచ్చింది. సాహిత్యంలో కథలు కవితలు, ధారావాహికలతో పాటు (శ్రీ పదాలు లఘురూపక కవితా ప్రక్రియ రూపకల్పన ) రచనలు చేస్తూ సాహిత్యం పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంది.
చిన్నప్పటి నుండి తెలుగు భాషంటే మమకారంతో, అందరికీ అమ్మే తొలి గురువు అని తనకు కూడా అమ్మే తన తొలి గురువు.అంటూ మొదటిసారిగ అమ్మ నేర్పిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో తన సాహిత్యాభిమానాన్ని పెంచుకొన్న గుంటూరు వాస్తవ్యురాలు రచయిత్రి, గజల్ కవయిత్రి గోలి విజయ తను రచించిన “నా కల – నా స్వర్గం” విభిన్న అంశాలతో పొందుపరచబడినది. అలాగే కవయిత్రి విజయ చిన్నప్పటినుండే అమ్మ చెప్పిన కధలు వినడం, చందమామ కధలు చదవటం మొదలుగా మంచి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకొని . కాలేజి కొచ్చిన తర్వాత ప్రముఖ కవుల పుస్తకాలు చదవడం, లలిత సంగీతం వినటం చాలా ఇష్టంగా మారింది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పాటలంటే చాలా అభిమానాన్ని పెంచుకున్నది.
తను రచించిన నవ్వు కవితలో…
‘నవ్వు కు ప్రతి నవ్వు
పువ్వు లాంటి కానుక
మనసు తీర మల్లెలా
నవ్వ గలగటమే మహిలో
మనిషికి మహా యోగం’
‘ఎన్నో సమస్యలకు
అసలైన పరిష్కారం
మౌనాన్ని మైనంలా
కరిగించేది చిద్విలాసం’
నవ్వు చెప్పిన వివిధ అర్థాలను వాటిలోని మధుర భావాలను అందులో నుంచి వ్యక్తం అయ్యే అనుబంధాలను తెలియజేస్తూ ఒక ఊహ ప్రపంచాన్ని నవ్వు ప్రతి జీవి నుండి వ్యక్తం అవుతుందని తెలియ చేయటంలో సఫలీకృతం అయ్యింది.
కవిగా రచయితగా సాహిత్యకారులు చేస్తున్న కృషి కత్తి మీద సాము లాంటిది. పాఠకుడికి కవి అంతరంగంలోని భావాలను తెలియజేయాలనే సందర్భంలో ఎన్ని ఉరుములు ఉరుమినా మెరుపులు మెరిసినా తన రచనల్లో అక్షరాలతో బంధించి అందర్నీ చదివించే గొప్ప ప్రయత్నం. మానవీయ వాస్తవిక సంఘటనలను ప్రస్ఫుటిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమంలో నేటి సాహిత్యకారులు భాగస్వామ్యం అవుతున్న సందర్భాన్ని అభినందిస్తూ మరిన్ని కావ్యాలు సాహితీ లోకానికి పాఠక లోకానికి అందించి సరికొత్త నూతన అధ్యాయనానికి నాంది పలకాలని ఆశిద్దాం.