Home వ్యాసాలు చాచా నెహ్రూ

చాచా నెహ్రూ

by Nellutla Sandhya

చాచా నెహ్రూ (రూపకం)

నానమ్మ :         ఏమర్రా ! ఏమిటీ హడావుడి. ఈ రోజు ఇంత తొందరగా తయారవుతున్నారు. ఎక్కడికి?

బాబు :  స్కూలుకి నానమ్మా! ఈ రోజు బాలల దినోత్సవం కదా! అందుకే త్వరగా వెళ్తున్నాము.

పాప :   అవును నానమ్మా ! ఈరోజు నెహ్రూ పుట్టినరోజు కదా! నాలుగు రోజులుగా మా పాఠశాలలో ఇదే హడావిడి. మాకు అన్ని రంగాలలో పోటీలు జరిపారు. మరి నాకు పాటల పోటీలో, తమ్ముడికేమో పరుగు పందెంలో బహుమతులు వచ్చాయి. అవి ఈ రోజు ముఖ్య అతిథి చేతుల మీదుగా మాకు అందజేస్తారు. అందుకే తొందరగా వెళ్ళాలి.

నానమ్మ :         ఓహో అలాగా ! అయితే వెళ్ళి రండి.

xxxxxxxxxxxxxxxxxxxxxxxx

నానమ్మ :         వచ్చేసారా పిల్లలు ! మీ బళ్ళో కార్యక్రమాలు ఎలా జరిగాయి ?

బాబు :              స్కూల్లో ప్రోగ్రాం ఎంత బాగా జరిగిందనుకున్నావు? డాన్సులు, ఆటలు, పాటలు. అందరు చాచా నెహ్రూ గురించిన పాటలే పాడారు.

పాప :   మా హెడ్‌ మాస్టర్‌ నెహ్రూజీ గురించి క్లుప్తంగా చెప్పారు. నానమ్మ! మాకు ఇంకా నెహ్రూ గురించి తెలుసుకోవాలని వుంది. చెప్పవూ !

నానమ్మ :         ఆకలిగా వుంది కదర్రా ! ప్రొద్దున హడావిడిలో ఏమి తినకుండానే వెళ్ళారు. అన్నం తిన్న తర్వాత నిదానంగా అన్ని చెపుతాను రండి. మీకు ఆకలిగా లేదా?

బాబు : ఎందుకు లేదు? ఆకలి దంచేస్తుంది. పద పద….

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

పాప :   అన్నం తిన్నాం కదా! ఇప్పుడు చెప్పు నానమ్మా ! చాచాజీ గురించి తెలుసుకోవాలని వుంది.

నానమ్మ : చూడండి పిల్లలు ! నిశ్శబ్దంగా కూర్చుని శ్రద్ధగా వినండి.

            మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూ. ఈయన పూర్తి పేరు జవహర్‌ లాల్‌ నెహ్రూ. జవహర్‌ అంటే రత్నం అని అర్థం.

బాబు :  నెహ్రూ పుట్టిన ఊరేది నానమ్మా ?

నానమ్మ :         ఉత్తర ప్రదేశ్‌ లోని అలహాబాదు పట్టణంలో మన చాచాజీ పుట్టాడు. అలహాబాదు త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదుల కలయిక అలహాబాదును ఒకప్పుడు ప్రయాగ అనే వారు. అలాంటి పవిత్ర స్థలంలో పుట్టిన పవిత్రమూర్తి నెహ్రూ.

పాప :   నవంబర్‌ 14న (అంటే ఈ రోజే) కదా ఆయన పుటా

నానమ్మ :         అవునర్రా! 1889 సం|| నవంబర్‌ 14న చాలా ధనవంతులైన మోతీలాల్‌ నెహ్రూ, స్వరూప రాణి దంపతులకు ముద్దుబిడ్డగా జవహర్‌ పుట్టాడు. నెహ్రూకి ఇద్దరు చెల్లెళ్ళు. ఒకరు విజయలక్ష్మి పండిట్‌, చిన్న చెల్లెలు కృష్ణ (హతీసింగ్‌)

పాప :   మరి నెహ్రూ ఎక్కడ చదువుకున్నారు నానమ్మా ?

నానమ్మ :         ముందు అలహాబాదులో చదువుకున్నారు. ఆ తరువాత ఇంగ్లాండ్‌ వెళ్ళా అక్కడ చదువుకొన్నారు. నెహ్రూ ఇంగ్లాండులో చదువుకుంటున్న రోజుల్లో ఒకసారి ఏమయిందంటే!

బాబు :  ఆఁ ఏమయింది?

నానమ్మ :         నెహ్రూ చదివే పాఠశాలకు అనేక గేట్లుండేవట. పాఠశాల వదిలాక ఇంటికి వెళుదామని నెహ్రూ తన స్నేహితులతో కలిసి మాట్లాడుతూ గేటు వరకు వచ్చాడు. తండ్రి తనకోసం ఏర్పాటు చేసిన కారు అక్కడ లేదు. పాఠశాల కున్న అన్ని గేట్లలో ఏ గేటు దగ్గర తన కారు వుందో తెలుసుకోవడం కష్టమైంది నెహ్రూకి. ఈ విషయాన్ని గురించి తన తండ్రి మోతిలాల్‌ నెహ్రూకీ ఒక చిన్న జాబు వ్రాశారు చాచాజీ. అంతే ఆ తరువాత ఆ పాఠశాలకు వున్న అన్ని గ్లే ముందు ఒక్కొక్క కారు నెహ్రూ కోసం వేచి వుండేదట. అటువంటి ఏర్పాటు చేయగలిగిన మోతీలాల్‌ సంపద గురించి జనం ఆ రోజుల్లో కథలుగా చెప్పుకునేవారట.

పాప :   అవును నానమ్మా ! చాచాజీ పేరు జవహర్‌ లాల్‌ కదా! మరి నెహ్రూ అన అంటారెందుకు?

నానమ్మ :         నెహ్రూ అనేది జవహర్‌ లాల్‌ ఇంటిపేరు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, నెహ్రూ పూర్వికులు కాశ్మీరులో ఓ కాలువ ఒడ్డున వున్న ఇంట్లో ఉండేవారుట. కాశ్మీరు భాషలో నహర్‌ అంటే కాలువ అని అర్థం. కాలక్రమేణ నహర్‌ నెహ్రూగా మారింది. ఆ తరువాత వారు అక్కడినుండి అలహాబాదు వచ్చి స్థిరపడ్డారు. ఆ విధంగా నెహ్రూ అనేది వారికి ఇంటిపేరుగా మారింది.

బాబు :  నెహ్రూ ఎంతవరకు చదువుకున్నాడు నానమ్మ ?

నానమ్మ :         నెహ్రూ బారిష్టర్‌  అంటే న్యాయవాద విద్య పూర్తి చేసుకుని 1912 సం||లో భారతదేశానికి తిరిగి వచ్చారు. లాయరుగా (న్యాయవాది) జీవితం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సమయంలోనే 1914 సం||లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది.

బాబు :  నువ్వు నెహ్రూజీని చూసావా నానమ్మ ?

నానమ్మ :         లేదురా! అప్పుడు మేము మీ అంటే వున్నాము. మా తాత చెప్పితే మాకు తెలిసింది. పుస్తకాల్లో చదివా. ఫోటోలోనే నెహ్రూని చూసాం. అంతే.

నానమ్మ :         ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపారం కొఱకు వచ్చి మన దేశాన్ని చిన్య రాజ్యాల్ని మోసంతో గెలిచి క్రమంగా మనల్ని బానిసలుగా చేసారు.

            1857వ సం||రం లో సిపాయిల తిరుగుబాటుతో మన స్వాతంత్య్ర పోరాటం మొదలయింది. అలా తిరుగుబాటు చేసినవారు చాలామంది వున్నారు. ఝాన్సీ లక్ష్మిబాయి, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్‌ చంద్రబోసు, చంథ్రేఖర్‌ ఆజాద్‌, తాంతియా తోపే, నానా సాహెబ్‌ ఇలా చాలా మంది వున్నారు. 80 సం||రాలకు పైగా హింసాయుత మార్గంలో పోరాటం జరిపినప్పటికి మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదు. ఇలా ఎందరో నాయకులు స్వాతంత్య్ర పోరాటం జరుపుతూనే వున్నారు. (ఆ సమయంలోనే జాతీయ నాయకుడైన బాలగంగాధర తిలక్‌ 1914 సం|| జైలు నుండి విడుదలై వచ్చారు.)

            1915 సం|| గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చి స్వాతంత్య్రం కోసం అప్పటికే పోరాటం సాగిస్తున్న నాయకులను కలుసుకున్నారు. అహింసాయుత స్వాతంత్య్ర పోరాటానికి నాంది పలికారు.

పాప :   అవునవును గాంధీజీ యుద్ధం లేకుండా (ఎవరిని చంపకుండా) అహింసాయుతంగా పోరాడి మనకు స్వాతంత్య్రం తెచ్చారని మా టీచర్‌ చెప్పారు. నెహ్రూజీకి గాంధీ తాతతో పరిచయం ఎలా అయింది? చెప్పు నానమ్మ!

నానమ్మ :         అదే కదా చెపుతున్నా ! చాచాజీ మొదటి నుండి మొహమాటస్థుడు, బిడియస్తుడు. అందుకని స్వాతంత్య్ర పోరాటం పట్ల ఆసక్తి ఉన్నప్పటికి చాలారోజుల వరకు రాజకీయ రంగంలో (ప్రత్యక్షంగా) పాల్గొనలేదు.

పిల్లలు :            అలాగా !

నానమ్మ :         1916 సం||రం డిసెంబర్‌ నెలలో లక్నోలో భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో పత్రికా స్వాతంత్య్రాన్ని భంగ పరచడానికి ఉద్దేశించిన కొత్త చట్టం వస్తె దాన్ని తీవ్రంగా విమర్షిస్తు మొట్టమొదటి సారిగా ఆ సభలో ఉపన్యసించారు. ఆ సమావేశంలో గాంధీజీని మొదటిసారిగా కలుసుకున్నారు నెహ్రూజీ.       

            సహజంగా మృదు స్వభావి, మితభాషి అయిన నెహ్రూ గాంధీజీ సిద్ధాంతాల పట్ల అహింసా యుత విధానాల పట్ల ఆకర్షితుడైనాడు. రానురాను గాంధీజీకి కూడా తన మితవాద సిద్ధాంతాలను గౌరవించి, అహింసాయుత పోరాటానికి తగిన అత్యంత సన్నిహితమైన అనుచరుడు నెహ్రూయే అని నమ్మకం కలిగింది. తరువాత బార్దోలి సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్‌ ఇండియా వంటి అనేక స్వాతంత్య్ర ఉద్యమాల్లో సత్యాగ్రహాల్లో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్ళాడు. దాదాపు 30 సం||రాలు అగ్రశ్రేణి నాయకుడుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న నెహ్రూ నాయకత్వం జనాకర్షణకి, దేశభక్తికి నిలయం కావడం వల్ల ఇంకా అనేక కారణాల వల్ల తన వారసుడు నెహ్రూయేనని గాంధీజీ ప్రకటించాడు. భారతదేశ భవిష్యత్తు నెహ్రూ చేతుల్లో భద్రంగా వుంటుందని కూడా గాంధీజీ పేర్కొన్నారు. అందుకే 1946 వ సం|| సెప్టెంబర్‌ 2వ తేదీన 12 మంది సభ్యులతో మధ్యంతర ప్రభుత్వం నిర్వహణ కొఱకు ఉపాధ్యకక్షుడుగా నెహ్రూని ఎన్నుకున్నారు.

            ఆ తరువాత 1947 ఆగస్టు 15 తేదీన స్వాతంత్య్రం రాగానే జవహర్‌ లాల్‌ నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.

బాబు :  అబ్బా ! దానమ్మ నువ్వు ఈ విషయాలన్ని చెపుతుంటే టైమే తెలియలేదు. హాయ్‌ అదిగో అన్న కూడా కాలేజీ నుండి వచ్చేసాడు.

అన్న :  ఏరా బబ్లూ ! నానమ్మని కాసేపైనా రెస్ట్‌ తీసుకోకుండా కథలు చెప్పుమని వేధిస్తున్నారా ఏమిటి?

నానమ్మ :         అన్న వచ్చాడుగా అన్న చెపుతాడులే. ఇంతలో నేను అక్కకి తింటానికి ఏమయినా ఇచ్చి కాసేపు నడుం వాలుస్తానర్రా !

అన్న :  నువ్వు రెస్ట్‌ తీసుకో నానమ్మ ! నాకిప్పుడేమి వద్దు.

బాబు :  అన్నా! అన్నా ! నెహ్రూ గురించి ఇంకా చెప్పన్నా !

పాప :   అవుననాన ! నెహ్రూ ప్రధాని అయ్యాక మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేశాడో చెప్పు.

అన్న :  ఓకే, ఓకే చెపుతాను. 200 సం|| పరాయి పీడన తరువాత అన్ని విషయాలలో మన దేశం వెనుకబడి వుండేది. అంటే, అనారోగ్యం, అవిద్య, నిరుద్యోగం, బీదరికం ఇలా అన్ని రంగాలలో చితికిపోయిన మన స్వతంత్ర భారతదేశాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత నెహ్రూపై పడింది. స్వాతంత్య్రం రావడానికి 19 సం||రాల ముందే భావి స్వాతంత్య్ర నవ భారతానికి పటిష్ఠమైన పునాదులు వేసిన ద్రష్ఠ నెహ్రూజీ. లాహోర్‌ కాంగ్రెస్‌ లో ప్రజాస్వామ్యం, మిశ్రమ ఆర్థిక విధానం, ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, మతాతీత రాజ్యాంగం మన ధ్యేయం కావాలని ప్రకటించిన మనిషి నెహ్రూజీ. ఈ విధానాలను స్వాతంత్య్రం వచ్చాక కార్య రూపంలోకి తీసుకువచ్చారు. పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు.

బాబు :  పంచవర్ష ప్రణాళికలు అంటే ఏమిటన్నా ?

అన్న :  ఒక్కొక్క రంగంలో దేశం అభివృద్ధి చెందడం కోసం 5 సం|| పాటు అమలులో ఉండే విధానం. అన్ని రంగాల్లో ఒకేసారి అభివృద్ధి సాధించడం కష్టం కదా! అందుకని ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికలో ఒక్కో రంగానికి ప్రాముఖ్యతనిచ్చి అభివృద్ధి సాధించడం. ఉదాహరణకు మొదటి పంచవర్ష ప్రణాళిక గ్రామీణాభివృద్ధి అయితే, రెండవ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలు, మూడవ పంచవర్ష ప్రణాళిక బీదరిక నిర్మూలనం, ఉత్పత్తులు పెంచడం ఇలా ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క విషయానికి ప్రాముఖ్యానిస్తూ దేశాన్ని అభివృద్ధి చేయడం.

పాప :   ఎంత మంచి ప్లాన్‌ కదా అన్నయ్య !

అన్నయ్య:         అవును నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో మూడు పంచవర్ష ప్రణాళికలు అమలు జరిగాయి. వీటి ద్వారా చక్కటి పథకాలు అమలుపరచి, వ్యవసాయ పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చేసి దేశాభివృద్ధికి ఎంత కృషి చేసారు నెహ్రూజీ. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పెద్ద ప్రాజెక్టులైన బాక్రానంగల్‌, నాగార్జున సాగర్‌, హిరాకుడ్‌ మొదలైన ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేసింది నెహ్రూజీయే. అంటే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలుగా పేర్కొన్నది నెహ్రూయే. రోజులో 4 గంటలు విశ్రాంతి తీసుకుని 20 గంటలు దేశాభివృద్ధికి పాటు పడిన వ్యక్తి చాచాజీ. అందుకే నెహ్రూజీని ”నవభారత నిర్మాత” అన్నారు.

పాప :   మరి భారత్‌ నుండి పాకిస్తాన్‌ ఎందుకు విడిపోయిందన్నా?

అన్నయ్య:         కలిసివుండి అలజడులు, అరాచకాలు సృష్టించుకొని బాధపడటం కన్న విడిపోవడమే మేలు కదా! అలా మత ప్రాతిపదిక మీద ఏర్పడిన పాకిస్తాన్‌, భారత్‌ నుండి వేరయింది. అప్పుడు కూడా మన దేశం విషమ పరిస్థితులను ఎదుర్కొంది. లక్షలాది మంది కాందిశీకులుగా పాకిస్థాన్‌ నుండి భారతదేశానికి కాందిశీకులుగా తరలి వస్తే వారికి జీవనోపాధి, గృహ వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రధానిగా నెహ్రూ పైనే పడింది. దాదాపు 55 లక్షల మంది పాకిస్తాను నుండి తరలి వచ్చిన వారికి పునరావాసము కల్పించడంలో నెహ్రూ ప్రభుత్వం సఫలీకృతమైంది.

            స్వాతంత్య్రం వచ్చాక అస్తవ్యస్థంగా వున్న మన పరిపాలనా విధానాన్ని దేశాన్ని ఒక క్రమ పద్ధతిలోకి మార్చుకోవడానికి రాజ్యాంగాన్ని రూపొందించుకొని 1950 జనవరి 26 నుండి నూతన రాజ్యాంగాన్ని అమలు పరచుకోవడంతో భారతదేశం సర్వ స్వతంత్ర ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.

            మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగంలో లేవు.

బాబు :  మన రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు ఏమిటి అన్నా ?

అన్న :  14 సం|| వరకు బాల బాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించడం, 2) అంతర్జాతీయ ఖ్యాతికి కృషి చేయడం, 3) గ్రామ పంచాయితీలను నెలకొల్పి స్థానిక స్వపరిపాలనను పెంపొందించడం, 4) అడవులను వన్యప్రాణులను రక్షించడం, 5) స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఇలా ఇంకా చాలా వున్నాయిలే.

పాప :   నెహ్రూజీని ”శాంతిదూత” అని ఎందుకంటారన్నా?

అన్న :  శాంతి కాముకుడైన నెహ్రూ దేశ ఆర్థిక ప్రగతికి, విశ్వ కళ్యాణానికి, శాంతి ఎంతో అవసరం అన్న విశ్వాసంతో ప్రపంచ శాంతికి కృషి చేసాడు. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు నెలకొల్పడానికి ప్రపంచంలో అన్ని దేశాలలోనూ అనేక పర్యాయములు పర్యటించి భారత దేశానికి గొప్ప స్థానం కల్పించడానికి నిరంతరం పాటుపడ్డాడు. అగ్రరాజ్యాల మధ్య సమభావాన్ని, సమతౌల్యాన్ని సాధించేందుకు ఎప్పటికప్పుడు ప్రతి సమస్యను పరిశీలిస్తూ ముఖ్యంగా అమెరికా, రష్యా దేశాల పట్ల ఖచ్చితమైన తన అభిప్రాయాన్ని నిస్పక్షపాతంగా ధైర్యంగా సౌమ్యంగా హేతుబద్ధంగా ప్రకటించేవాడు. ఆ విధంగా రష్యా, అమెరికాలతో సత్సంబంధాలను కొనసాగించేవాడు. అలీన విధానానికి అంకురార్పణ చేసి ఒక కొత్త విదేశాంగ విధానాన్ని రూపొందించాడు. బ్రిటన్‌ తో స్నేహ సంబంధాలు కొనసాగించడానికి కామన్‌ వెల్త్‌ లో మన దేశానికి సభ్యత్వం కల్పించాడు. ప్రపంచంలో చాలాసార్లు విషమ పరిస్థితులు ఎదురైనపుడు, విషమ పరిస్థితుల్లో వున్నప్పుడు ప్రపంచంలో చాలాసార్లు ఉద్రిక్తతను తగ్గించడానికి, ఆఫ్రికా, ఆసియా దేశాల శాంతికి తద్వార ప్రపంచ శాంతికి కృషి చేసి ”శాంతి దూత” గా ప్రఖ్యాతి గాంచాడు.

పాప :   నెహ్రూజీకి విదేశాలలో కూడా మంచి నేతగా పేరుందంటారు కదన్నా !

అన్న :  అవును స్నిగ్ధ ! నెహ్రూ భారతదేశ ప్రగతికి ఎంత కృషి చేశారో ప్రపంచ శాంతికి, భారత్‌ తో అన్ని దేశాల మధ్య సత్సంబంధాలకు అంతే కృషి చేశారు. 1954లో చైనా ప్రధాని చౌ-ఎన్‌-లై తో కలిసి ప్రకటించిన ఐదు సూత్రాల ”పంచశీల” అను పేరుతో ప్రపంచ రాజ్యాల మన్ననలను అందుకున్నాయి. ఈ నాటికి వాటి విలువ తగ్గలేదు. దేశ ఆర్థిక ప్రగతికి స్వతంత్ర అలీన విధానం ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఆయన స్వతంత్ర భారత విదేశ విధానాన్ని రూపొందించాడు. ఆ విధానము ఇప్పటికి భారత విదేశాంగ విధానాలలో ముఖ్య సూత్రంగా వుంది.

పాప :   నెహ్రూ ఏం పుస్తకాలు రచించారన్నా ?

అన్న :  రచయితగా నెహ్రూ ఆంగ్ల రచనా విధానంలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన రచించిన డిస్కవరి ఆఫ్‌ ఇండియా, ఆటో బయోగ్రఫి, గ్లిమెన్స్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ గ్రంథాలు అందుకు నిదర్శనాలు. స్వాతంత్య్ర పోరాట సమయంలో జైల్లో ఉన్నప్పుడు తన కూతురు ఇందిరకు వ్రాసిన లేఖలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఆ తరువాత కాలంలో అవి లెటర్స్‌ టు హిజ్‌ డాటర్‌ అన్న పేరుతో పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. అవి నాటి మన భారత స్వాతంత్య్ర ఆర్థిక చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. ఆ లేఖల ద్వారానే తన కూతురును ఒక గొప్ప రాజకీయ వేత్తగా తీర్చిదిద్దిన ఘనత నెహ్రూదే.

పాప :   ఆయన ఎన్ని సం||రాలు ప్రధానిగా వున్నారు?

అన్న :  1947 ఆగస్టు 15 నుండి 1964 మే 27 వరకు దాదాపు 17 సం||రాలు. భారత భవిష్యత్తును అభివృద్ధి పథంలోకి నడిపించిన మహనీయుడు కూడా ఆయన. 1964 మే నెల 27వ తేదీన అశేష భారత ప్రజానీకాన్ని శోక సముద్రంలో ముంచి తీవ్రమైన గుండెపోటులో మరణించారు. నెహ్రూ మరణించినప్పటికి ఆయన సిద్ధాంతాలు, రాజనీతి, విధానాలు, శాంతిమార్గం ప్రజల గుండెల్లో పదిలంగా వున్నాయి. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ స్వాప్నికుడు, దార్శనికుడు, 20వ శతాబ్దపు ఉత్తమ రాజకీయవేత్త ప్రపంచ నేతల చరిత్ర గమనాన్ని అంచనా వేయగల దూరదృష్టి గల ప్రపంచ నేతల్లో అగ్రగణ్యుడు. అతని జీవితం ఎందరికో ఆదర్శనీయం. అందరికి మార్గదర్శకం.

బాబు :  బాలల పండుగ నెహ్రూ పుట్టిన రోజు నాడే ఎందుకు చేస్తారన్నా ?

అన్న :  నెహ్రూజీకి బాలలన్నా పువ్వులన్నా ఎంతో ఇష్టం. ఆయన పుట్టినరోజున బాలల దినోత్సవంగా ప్రకటించారు. పెదవులపై చిరునవ్వు తెల్లని కోటుపై ఎర్రని గులాబీ చేతిలో శాంతి పావురం ఇవన్ని ఆయనను శాంతి దూతగా తలపిస్తాయి.

బాబు :  అన్నా ! అన్నా ! గాంధీ తాత గురించి చెప్పన్నా ?

అన్న :  ఇప్పుడు కాదు! మరోసారి ఎప్పుడైనా చెపుతాను. నీకు రేపు పరీక్ష వుంది. చదువుకోవాలి. మీరు కూడా వెళ్ళి కాసేపు చదువుకోండి. బాగా చదువుకొని పెద్దయ్యాక గాంధీజీలా చాచాజీలా గొప్పపేరు తెచ్చుకోవాలి తెల్సిందా?

పిల్లలు :            అలాగే అన్నా బాగా చదువుకుంటాం …!

నెహ్రూ ఉన్నత ధనిక కుటుంబంలో పుట్టినా ఎంతో నిరాడంబరమైన జీవితం గడిపాడు. స్వాతంత్య్రం తేవడంలో గాంధీజీకి కుడి భుజంగా ఉంటూ ఆయన నేతృత్వంలోని ఎన్నో ఉద్యమాలలో పాల్గొని అనేకసార్లు జైలుకి వెళ్ళారు. స్వాతంత్య్ర భారతానికి 18 సం|| ప్రధానిగా వుండి విశిష్ట సేవలు అందించారు. దేశాభివృద్ధి కోసం వీరు ప్రవేశపెట్టిన పంచశీల సూత్రాలు, పంచవర్ష ప్రణాళికలు, అలీన విధానం మన దేశ కీర్తిని నలుమూలలా చాటినది. శాంతిదూతగా నెహ్రూ ప్రపంచ ప్రసిద్ధులు.

నెహ్రూ పిల్లలను రేపటి పౌరులుగా మాత్రమే కాదు, దేశ భవిష్యత్తుకు వారు వెన్నెముకగా, మూల స్థంభాలుగా భావించారు. ఏ చిన్నారికైనా తన తల్లిని మించిన ఉత్తమ స్నేహితురాలు మరొకరుండరు. ఆమెను ప్రేమించడం, గౌరవించడం మన బాధ్యత అని బోధించారు. 

సరే చాలా పొద్దుపోయింది రాజ్యాంగం గురించి దాని పుట్టుపూర్వోత్తరాల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం పడుకోండి.

You may also like

Leave a Comment