Home వ్యాసాలు చిరస్మరణీయుడు……

చిరస్మరణీయుడు……

by Shuktimati Vemuganti

రచయిత, జర్నలిస్ట్, కాలమిస్ట్, తెలంగాణ మొదటి అధికార భాషాసంఘ అధ్యక్షుడు, శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావుగారి నిష్క్రమణ తెలంగాణకు, తెలుగు భాషకు, సాహితీలోకానికి తీరని లోటు.
వీరి స్వస్థలం వరంగల్ జిల్లాలోని బొల్లి కుంట గ్రామం.1938లో వెంకట చలపతి రావు గారు, ఆండాళమ్మ గార్ల నలుగురు కుమారులలో కడపటి వాడు. ఈ నలుగురిలో పెద్దవాడు దేవులపల్లి రామానుజరావు గారు. రెండవవాడు విద్యాసాగర్రావుగారు.తర్వాత మదన్మోహన్రావుగారు. చివరివాడు ప్రభాకర్ రావు గారు.
వీరి తల్లిదండ్రులకిద్దరికీ సాహిత్యంలో సారస్వతంలో అభిరుచి, ఆసక్తి, అభినివేశం విశేషంగా ఉండేది. వీరి తండ్రి హన్మకొండ కోర్టులో వకీలు గా పనిచేశారు. వృత్తిరీత్యా లాయర్ అయినా ప్రవృత్తి పరంగా వీరికి సాహిత్యంపట్ల మక్కువ తో పాటు స్వయంగా పండితులు.
ప్రతిరోజు రామాయణాది పురాణములను పఠించేవారు. దేవులపల్లి రామానుజ రావు గారు గొప్ప కవి .పండితులు.మదన్మోహన్ రావు గారు ఉర్దూకవి.
చరిత్ర మీద పరిశోధన చేసిన ప్రముఖులు శేషాద్రి రమణ కవులు, తెలుగు పత్రిక  సంపాదకత్వం వహించి ప్రచురించిన మహా పండితులు వద్దిరాజు సోదరులు, కాళోజి, దాశరథి, పి.వి నరసింహారావు వంటి ప్రముఖులు వీరి ఇంటికి వస్తూ పోతున్నటువంటి పాండిత్య వాతావరణంలో ప్రభాకర్ రావు గారు పుట్టి పెరిగారు. ఆ విధంగా వీరికి చిన్నప్పటినుండి సాహిత్యంతో అనుబంధం ఏర్పడింది. సారస్వత దృష్టిగల వీరి కుటుంబ సభ్యులకు ఎవరికీ డబ్బు సంపాదన మీద దృష్టి పోలేదు.
మీరు హైస్కూల్లో చదువుతున్నప్పుడే విజయవాడ నుండి వెలువడే ప్రముఖ తెలుగు పత్రిక విశాలాంధ్ర సంపాదకత్వం వహించిన వారు. నార్ల చిరంజీవి గారు ,మద్దుకూరి చంద్రశేఖరరావు గారి ప్రోత్సాహంతో వీరు అనేక ఆర్టికల్స్ రాయటమే కాక మన మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుని మీద చాలా పెద్ద వ్యాసం రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు శోభ అనే కాలేజీ పత్రికకు  ముందు వ్యాసరచన పోటీ పెట్టి అందులో ప్రథముడిగా ఉన్నవాడిని సంపాదకుడిగా నిర్ణయించారు. ఆ ప్రథముడు వీరే. అప్పట్లో హైదరాబాదులో అన్ని కాలేజీలు కలిపి సాంస్కృతిక ఉత్సవాలను జరిపేవారట. ఆ సందర్భంలో దీపిక అను పేరు గల ఒక సంచికను ప్రచురించారు. దానికి కూడా వీరే ఎడిటర్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే మహాకవి గురజాడ గురించి వ్రాసిన వ్యాసానికి అఖిల భారత స్థాయిలో భారత ప్రభుత్వం వాళ్ళు యునెస్కో పక్షాన నిర్వహించిన పోటీలో ఆ వ్యాసానికి ప్రథమ బహుమతి వచ్చింది. ఆ విధంగా యునెస్కో అవార్డు లభించింది. ఒక విధంగా చెప్పాలంటే వీరు రాయని పత్రిక అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. కాళోజీ వలెనే వీరుకూడా ఎంత నిరాడంబరుడో అంతకన్నా కొన్నిరెట్ల నిరాడంబరత వీరి రచనలలో ఉంటుంది. ఎటువంటి ఉత్ప్రేక్ష లు, అతిశయోక్తులు వీరి రచనలలో కనపడవు.
గాంధీ శకం, మన మహనీయులు, చెప్పుకోతగ్గ మనుషులు, తెలంగాణ తేజోమూర్తులు, సమరం నుంచి స్వాతంత్రం, మహాకవి గురజాడ, సంపాదకీయాల సంకలనం, పారిజాతాలు కవితా సంకలనాలు, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం (110 సంవత్సరాల) చైతన్య చరిత్ర. ఇవి వీరి రచనలలో కొన్ని.
వీరి సతీమణి పేరు విమలాదేవి. వీరికి ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె.
కాళోజీ గారు తెలంగాణ కోసం వారి అమూల్యమైన జీవితాన్ని అంకితంచేసినట్టు వీరు తెలుగు భాషా వికాసం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
2009 నుండి 2014 వరకు  తెలంగాణా స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ కోసం ‘పెన్షనర్స్ మూమెంట్” అను పేరుతో నడపబడి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అదే మాసపత్రిక ‘పెన్షనర్స్ వాయిస్’ అను పేరు గా మార్చబడిన పత్రికకు నిజామ్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనం కోసం పోరాడిన వీరులైన, అమర వీరులైన దేశభక్తుల, స్వాతంత్ర సమరయోధుల గూర్చి దాదాపు వందల మంది గురించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ పత్రికలో రచించిన ఘనత వీరికి తప్పమ‌రెవరికీ సాద్యం కాదనడంలో అతిశయోక్తి లేదు.
వీరి తాత్విక దృష్టి ఎంత ప్రాచీనమైనదో అంత ఆధునికమైనది. అంత హేతుబద్ధమైనది. వీరి రచనలలో దుర్బలతకు, నిరాశకు, మూఢ విశ్వాసాలకు, సంకుచితత్వాన్నికి చోటు లేదు. వీరు హిందూ మతాన్ని గుడ్డిగా ఆరాధించ లేదు. అందులో మానసిక దౌర్భల్యానికి దారితీసే దుర్లక్షణాలను నిరసించాడు. హిందూ సంఘ పతనానికి కారణమైన వాటిని తిరస్కరిస్తూ ఏది సజీవమైనదో, చైతన్యవంతమైనదో దాన్నే స్వీకరించాడు.
వీరు ఎంత నిరాడంబరుడో రచనలలో అంత సాహసి. గాంధీజీ తత్వాన్ని జీర్ణించుకున్న బహుకొద్ది మందిలో మీరు ప్రముఖులు. తెలుగు భాషను పునరుద్ధరించటానికి విశేష కృషి చేసిన వాడు.
వివిధ రంగాలలో సుప్రసిద్ధులైన వ్యక్తులు మరణించినప్పుడు వారి స్మృతి కి శ్రద్ధాంజలి ఘటిస్తాము. మరపురాని, చరిత్రలో చిరకాలం నిలిచిపోయే యశశ్శరీరులపై జోహార్లర్పిస్తాము.
ఇంతటి మహానుభావుని కోల్పోయినందుకు చింతిస్తూ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

You may also like

Leave a Comment