తెలుగుజాతిని ఓ కుదుపు కుదిపి పేరుకున్న తరతరాల జడత్వాన్నుంచి వెన్నుతట్టి మేల్కొల్పిన అసాధారణ వ్యక్తి చలం.
20 శతాబ్దిలో తెలుగువారిలో ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన చలం ఎవరితోనూ పోల్చడానికి వీల్లేని వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు.రమణాశ్రమం వెళ్లకముందు చలం ఆలోచనలు,జీవితం ఒక విధంగా ఉన్నాయి.రమణాశ్రమం వెళ్ళాక ఆయన అభిప్రాయాల్లో ఎంతో మార్పు కనిస్తుంది.
వ్యక్తిగతాభిప్రాయాలు,జీవన విధానం,తత్కాలీన సాంఘిక సమస్యలు,ఉద్యమాలు, రచనా వివరాలు, అనుభవాలు,సాహిత్య విమర్శలు,ఆధ్యాత్మిక సాధనలు మొదలైనవెన్నో విషయాలు చలం ఉత్తరాల్లో దర్శనమిస్తాయి.చలం సాంఘిక,వైవాహిక వ్యవస్థలో చిచ్చు రగిల్చి సంప్రదాయగుండెల్లో జ్వాలలురేపిన కాలమది.ఆస్తిక నాస్తికుల విచికిత్సతతో దేవునికోసం దేవుళ్లాడిన కాలం కూడా అదే. చలం ఆలోచనలకు,ఆశయాలకు రూపకల్పనే చలం మిత్రులకు రాసిన ఉత్తరాలు.
” ఉత్తరాలు వ్రాయడం,వ్రాయించుకోవడం ఒక గొప్ప సృజనాత్మక కళ. ఈ కళ తెలుగు రచయితల్లో చలం గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అని సాహసం చేయలేము గానీ,ఈ కళ కళాత్మకంగా తెలిసిన వారిలో చలం గారు ప్రముఖులు అని మాత్రం అనొచ్చు.” అని సంజీవదేవ్ పేర్కొన్నాడు.
చలం జీవిత పరిణామక్రమం లేఖల్లో స్పష్టంగా గోచరిస్తుంది.దీక్షితులకు రాసిన లేఖలో చలం ఇలా చెప్పుకుంటాడు.” నేను చాలా Sensitive. ముఖ్యంగా స్నేహితుల విషయమై కొన్ని సమయాల్లో వాళ్ళని సరిగా అర్థం చేసుకోను.మిమ్మల్ని ఎప్పుడూ ఘనంగా ఎంచుకున్నాను— నా ఉపయోగం కోసం కాదు.నేను చూసిన వాళ్లలో Generally as one of the Thoroughly nice gurllness persons ( Few they are) కానీ యీ మధ్య మీకు తెలీకుండా నేనేమో,మీరు మీ ఉత్తరాల్లో నన్ను దెప్పుతున్నట్లు కనపడ్డది.నేనేమన్నా చేశానా?” చలంది సున్నితహృదయం.తన మనస్తత్వం తెలిసిన వారితోనే పరిచయాలు పెంచుకుని మనసులోని విషయాలు పంచుకున్నాడు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
చలం దీక్షితులు గారికి వ్రాసిన ఉత్తరాలు చాలా విలువగలవి. “ఈ ఉత్తరాలు చదివితే వేంకట చలం గారి హృదయానికి సమీపముగా పోవచ్చు.దానిలోతు, వైశాల్యము తెలుసుకోవచ్చు.వారి సారస్వత కృషిని,పురిగొల్పిన భావోద్వేగం ఇందు గమనింపవచ్చు.
అరమరిక లేకుండా నిర్భయంగా మనుష్యుల్ని గురించీ సంస్థల్ని గురించీ చర్చించుకునేందుకు ఉత్తరాల్లోనే సావకాశముంది అట్టి చర్చలూ– అభిప్రాయాలూ– ఈ ఉత్తరాల్లో ఉన్నవి.కొన్ని ఘాటుగా కూడా ఉన్నవి.” అన్నాడు దీక్షితులు.
” జీవితమంటే ప్రేమ నాకు,దేవుళ్ళో కానీ,బతుకు తరువాత బతుకులో గానీ,దేశంలో గానీ నాకు విశ్వాసం లేదు.” అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాడు చలం.
అరుణాచలం వెళ్ళాక వీరేశలింగంకు రాసిన లేఖలో కూడా ఇలా తెల్పాడు.” ఇదివరకైనా నేనేదో అందరితో కలిసే వాణ్ణనుకున్నారా? ఏ నలుగురు మిత్రులో తప్ప( వాళ్ళు నా అభిప్రాయాలు ఒప్పుకునేవాళ్లే) ఎవరితోనూ నాకెప్పుడూ సంబంధం లేదు.బతికిపోయినాను.అట్లాంటి వాళ్ళు నా కిప్పుడూ వున్నారు.” ఆయనకు పరిమిత సంఖ్యలోనే మిత్రులుండేవారని,ఈయన అభిప్రాయాలనర్థం జేసికొనే వారితోనే సాన్నిహిత్యం పెంచుకునేవారని తెలుస్తుంది.
చలం దీక్షితులకు రాసిన ఉత్తరాల్లో మనసువిప్పి తన కుటుంబ విషయాలు,వైయక్తిక విషయాలను వెల్లడించాడు. ప్రజలు తన జోలికెప్పుడు రారని అంటూ ” లోకాన్ని తన్నేవాణ్ణి చూచి లోకం అవసరమైన దూరానికి తానే జరుగుతుంది”. అంటూ తను స్థాపించిన బడిలో పిల్లల్ని పంపించనందుకు ప్రజల మీద కోపంగా ఉందని తెలిపాడు. తనను హెడ్మాస్టరుగా బెజవాడలో వేశారని,మీతో ఎంతో చెప్పాలని ఉందని తన మనసులోని మాట దాపరికం లేకుండా దీక్షితులకు తెలియచేసే ఉద్దేశ్యం గల చలం ఆనాడు ప్రభుత్వ ఉద్యోగం చేసే చలం ఇలా రాశాడు.” మీ స్నేహితుడు మన ఆఫీసులో నా మీద చాలా విషం పోశాడు. నేను నడవడిలో, డ్రెస్ లో,మాటల్లో ,నడకలో చాలా కేర్ లెస్ గా వుంటానని వెళ్లి స్వయంగా పనిపట్టి చెప్పాడు.అతను నేనడిగినప్పుడు, ఈశ్వరుని ఎదుట తానేమీ యెరుగనన్నాడు.
పొద్దస్తమానం మానవ జంతుసేవ మాట్లాడతాడు మళ్లీ” అని మాలతీబాయికి తప్ప తన మంచితనం ఎవరికీ తెలియదని రాశాడు. ఇలా ఆనాటి సమాజ పరిస్థితి, చలంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చాటుగా చలం గురించి
నీచమైన అభిప్రాయాలు కలవారని,చలం ఎదుట కనిపిస్తే భయపడి అబద్ధాలాడేవారని,చలం గురించి ప్రజలు రకరకాల వ్యాఖ్యానాలు చేసికొనేవారని దాన్ని బట్టి అప్పట్లో సంఘంలో చలంకు గల విలువ తెలుస్తుంది.ఆనాటి విద్యా విధానానికి తిరగబడి,విద్యావిధానం నచ్చక తన పిల్లలు చదువు మానేసినట్లు చలం దీక్షితులకు రాసిన ఉత్తరంలో తెలిపాడు.తన జీవిత యత్నాన్ని,తన స్ట్రగుల్ ను అర్థం చేసుకో గలిగిన వాళ్ళు లేరని,కొత్తవాళ్ళు స్నేహం చేయడం లేదని,తన జీవన పోరాటంలో,జీవన యత్నంలో చివరికి తనొక్కడే మిగిలి పోతాడని తెలిపాడు.చలంలో తిరుగుబాటు ధోరణి కన్పిస్తుంది.సంఘాన్ని ఎదిరించైనా సరే పోరాటంలో ఒక్కడే మిగిలిపోయి తుదివరకు జీవిత లక్ష్యాన్ని సాధించేవరకు పోరాడుతూనే వుంటానని స్పష్టంగా తెలియచేశాడు. పట్టుదల కలిగిన వాడుగా,ఎవరికి భయపడని వాడుగా తన నిర్ణయం పట్ల శ్రద్ధ కలవాడుగా,ఈశ్వరుని పట్ల విశ్వాసం కలవాడుగా కనిపిస్తాడు.
చలం భవిష్యద్దర్శనం కలవాడుగా కనిపిస్తాడు.తను రచించిన సెక్స్ పుస్తకం పేరు ‘ స్త్రీ’ ని ఒక్క నిమిషం నాకు విశ్రాంతినివ్వక — అగాధ వియోగభారం కిందనో చీల్చి,నలిపి ఊపిరాడక నా జీవితాన్ని పాలించే స్త్రీ లోకానికి నివేదతము చేస్తున్నానని రాస్తూ ” ఇది స్త్రీ లోకానికి నా Farewell ఏమో ,చివరికి నేనూ మారబోతున్నానేమో! ఎవరికి తెలుసు? ” అని దీక్షితులకు రాశాడు.గొప్పవాళ్ళు,
మహాత్ముల మాటలు అనాలోచితంగా,ఆయాచితంగా వెలువడుతాయి. భవిష్యత్తులో ఆ మాటలకర్థం ఎంతో ఉంటుంది.నేను మారబోతున్నానేమో అని చెప్పిన చలం దార్శనికుడు,మహాత్ముడు,ఋషితుల్యుడు,మనీషి, భవిష్యత్తును దర్శించిన కాలజ్ఞానవేత్త అని ఘంటాపథంగా చెప్పవచ్చును.ఆయన మారిన విషయం ఆయన చెప్పినట్లుగానే అరుణాచలం జీవితంలో స్పష్టమవుతుంది.చలం ఆలోచనా వైఖరి,జీవన విధానం దీక్షితులకు రాసిన ఉత్తరాల్లో వ్యక్తమౌతుంది.
తన కాలం మధురంగా గడిపేందుకు ‘ ఒక యూరేషియన్ అమ్మాయి’ ఉన్నట్లు తెలుపుతూ ” జరగడానికి వీలు దివ్య సన్నివేశాలు నా జీవితంలో జరుగుతాయని ఇంకా కలలు కంటున్నాను.” అని చెప్పిన ఆశాజీవి.తన సూక్ష్మ శరీరంలో ఆధ్యాత్మిక జ్ఞానత్వం పొందుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశాడు దీక్షితులకు రాసిన లేఖలో.చలం ఆలోచనల్లో మధ్యమధ్య మార్పును గమనించవచ్చు.దేవునిపట్ల విశ్వాసం లేదని గట్టిగా చెప్పాడు ఒకసారి.వెంటనే మరోసారి ఈశ్వరునిపట్ల విశ్వాసముంది అంటాడు.ఆస్తినాస్తిక విచికిత్స,ద్వైధీ భావన చలంలో కనిపిస్తుంది.చలంకు స్నేహితురాండ్రు వున్నట్లుగా లేఖల ద్వారా తెలుస్తుంది.
” యూరేషియన్ స్నేహితురాలు” ఒక మోటారు కారు తీసుకొని రమ్మంటుందని తెలిపాడు ఒక లేఖలో. లీల పరిచయం మొదలైనవి లేఖల్లో రాశాడు. దీక్షితులకు రాసిన ఇంకో లేఖలో కిటికీ కింద ఓ అమ్మాయి వెడుతుందని, ఆ అమ్మాయిని తనూ, తనను ఆ అమ్మాయి పరస్పరం ఇష్టపడుతున్నారని,కానీ వారి మధ్య పది గజాల దూరముండేదని తెలిపాడు.
ఆ మాత్రం దూరం కూడా సహించలేని మనస్తత్వం చలందని స్పష్టంగా వ్యక్తమవుతుంది.
తన ఉద్దేశ్యాన్ని ఒక లేఖలో ఇలా తెల్పాడు.” యవ్వనంలో ఉన్న భార్యలకు పిల్లలు లేకపోతే సంతానమివ్వడం,బాల వితంతువులకు కూడా” అనడం వల్ల స్త్రీలపై చలంకున్న వ్యామోహం తెలుస్తుంది.ఇదే సందర్భంలో ఇంకో మాట అంటాడు.అన్ని ఆశయాలను వదులుకొని ” గొప్ప యోగినౌతాను.నా అద్భుతమదిమల కీర్తి దిగంతంగా వ్యాప్తిస్తుంది.స్త్రీ పురుషులు నా పాదాలముందు నమస్కరిస్తారు”.అని గొప్ప యోగి అవుతున్నట్లుగా తను కొన్ని మహిమలు చూపించేవాడుగా తెలియజేశాడు.వ్యతిరేక భావ ధోరణి స్పష్టంగా గోచరిస్తున్నది. ఎన్నో చేయాలనుకుంటున్నట్లు కలలు కన్నాడు.
చలం తన జీవితంపై ఖచ్చితమైన అభిప్రాయాన్ని దీక్షితులకు రాసిన లేఖలో ఇలా తెల్పాడు.” నాకు జీవితమంటే ప్రేమ,కన్నీళ్లలో,నవ్వులతో,నీచత్వంతో,త్యాగాలతో, స్వార్థంతో,ఔదార్యంతో,విషాదంతో,ఆనందంతో ఈ జీవితమే మంచిది.మళ్లీ మళ్లీ అనంతంగా పుడుతో పెళ్లి చేసుకుని సంపాయించి,పిల్లల్ని కని, పాపాలు చేసి,ప్రేమించి,ద్వేషించి,నవ్వి,మూలిగి కాని ఏ మోక్షం అక్కర్లేదంటాను నిశ్చయంగా” అని సూటిగా చెప్పాడు.లోకంలో తనను గృహచ్చేదకుడంటారని తెల్పడం వల్ల సమాజంలో చలంపై ఎటువంటి నీచాభిప్రాయముండేదో తెలుస్తుంది.అందుకనే ఆ కాలంలో చలంకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి భయపడేవారు.
రామజోగారావుకు రాసిన ఉత్తరంలో ” మూడు నెలల నుంచి స్త్రీ స్నేహమయింది కానీ సంపర్కం కాదు.ముందు కూడా తటస్థించదు” అని వాస్తవాన్ని చెప్పాడు.దీక్షితులకు రాసిన ఉత్తరంలో చలం గారికి ఒక తమాషా అనుభవం జరిగిందని రాశాడు. కనిగిరిలో తనకపరిచితురాలైన ఒక హైస్కూల్ అమ్మాయి అర్ధరాత్రి చలం ఇంటికి వచ్చి చలాన్ని లేపి తనను మోహించమని,ప్రేమించమని అర్థించిందట.తాగుతున్నట్లు ( మద్యం)గా కూడా లేఖల్లో తెలియపరిచాడు.చలం ఆలోచనలు స్త్రీ చుట్టే తిరుగుతుండేవి అనడానికి చలం రాసిన ఉత్తరాలే ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిపోతాయి.
” స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు” అని కుండబద్ధలు కొట్టినట్లు పచ్చినిజాన్ని నిర్మొహమాటంగా వ్రాస్తూనే దీక్షితులకు రాసిన ఉత్తరంలో ” స్త్రీ కొరకు జీవితాన్ని ధ్వంసం చేసుకున్నవాళ్ళని,అంటే కీర్తి,డబ్బూ కాదు- అంతకన్నా శ్రేష్ఠమయినవి- జీవితం మీద ఆసక్తిని-శక్తిని- బతకడంలో ఆనందాన్ని పోగొట్టుకున్న వాళ్ళని చూస్తే- నేను చాలా వివేకవంతుణ్ణిగా తోస్తాను.” అని లోకంలో తనకంటే కూడా బలహీన మనస్తత్వాలు కలవారున్నారని వారికంటే కూడా తను తెలివిగలవాడుగా చెప్పుకొన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు.స్త్రీ మూర్తి పట్ల ప్రేమను చూపించాడు కానీ దిగజారుడుతనం లేదని తెలుస్తోంది.స్త్రీలే తనను ఆప్యాయతతో చూశారని అనుకోవచ్చు.
తన ఉద్దేశ్యాన్ని ఇంకా ఇలా తెల్పాడు.” నా పిల్లల్ని చదివించాలని, వాళ్ళకి పెళ్లిళ్లు చెయ్యాలని ఏమీ వ్యామోహం లేదు.మా అబ్బాయి రౌడీ అయినా,అమ్మాయిలు వేశ్యలైనా నాకు సంతోషం,నమ్మకం- నేను స్వతంత్రుణ్ణి.నా ఆత్మ నాది.” అని అంటూ స్వేచ్ఛా ప్రియత్వాన్ని చాటాడు. సమాజాన్ని,సంసారాన్ని పట్టించుకోని స్వేచ్ఛాజీవిగా కనిపిస్తాడు చలం.మూఢాచారాన్ని నిరసిస్తూ, దీక్షితులకు రాసిన ఇంకో లేఖలో “ఏమి నమ్మినా నాకు వచ్చే నష్టాలేవీ లేవు.ఆ విధంగానే నాకే విశ్వాసం కుదిరితే అదే నిజమని తోస్తే రేపు సంపూర్ణమైన నిరీశ్వరవాదిని గానీ లేక మూఢాచారవంతుణ్ణి సనాతనుణ్ణి కానీ- కావడానికి నాకేమీ అభ్యంతరం లేదు.
ఏ పల్టీ కొట్టడానికో నేను సిగ్గుపడను.నాకు వాస్తవమని నిశ్చయంగా తోచాలి.మీరు- నా జీవితంలో కొన్ని పల్టీలకు కారణం మీరు” అంటూ తను నమ్మిన సిద్ధాంతంలో చర్చించే వాడుగా( శృంగారి కానీ,ఆధ్యాత్మిక మార్గంలో కానీ) తన మనసుకు నచ్చినపుడే,సత్యమని నిశ్చయంగా తెలిసినప్పుడు ఏ మార్గంలోనైనా వాస్తవానికి దగ్గరగా నడుస్తూ తృప్తిగా చరించే మనస్తత్వం చలందని తెలుస్తుంది.చలం పరిపూర్ణ విశ్వాసానికి పట్టం కట్టాడు.
అంత స్వేచ్ఛను కోరి,సంఘాన్ని ఎదిరించి ఇష్టానుసారం చరించి శృంగారంలో మునిగితేలిన చలం స్త్రీ స్వేచ్ఛను కాంక్షించిన చలం ” పశ్చిమ భౌతిక శాస్త్రమూ, ఠాగూరు గారి బ్రహ్మసమాజపు వేదాంతప్రభావం వల్ల చలంలో మత విజ్ఞానం ఏర్పడి ఆధ్యాత్మికతవైపు దారి తీశాయి.” స్త్రీ కాముకుడు,కథకుడు చలం చచ్చిపోబోతున్నాడు.ఈశ్వర సందేహంలో శృంగార తత్వంలో మునిగి బీరుతాగే, మాంసం తినే,ఆడవాళ్ళని ముద్దు పెట్టుకునే జి.వి.జీవిలో ఆత్మవుందని గుర్తించకలిగింది– మీరు,అవును మీరు” అని దీక్షితులకు రాసిన ఉత్తరంలో వివరించాడు.చలంలో పరివర్తన వచ్చిన విషయం లేఖల్లో స్పష్టమవుతుంది.నిరీశ్వరవాది ఈశ్వర వాదిగా మారాడు.భగవాన్ పై విశ్వాసం కుదిరింది.వాస్తవాన్ని నమ్మేవరకు విశ్వసించని చలం ఆత్మానుభవం వాస్తవమని తాను నమ్మిన వాస్తవ ప్రపంచం నుండి మానసిక మార్పుకులోనై వాస్తవమనే నమ్మిన ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించాడు. తనను చీదరించుకున్న ఆంధ్ర దేశాన్ని,ప్రజలను వదలి సత్యాన్వేషణలో అరుణాచలానికి దారితీశాడు. శృంగారంలో ఆనందాన్ని అనుభవించి వైరాగ్యంతో ఆధ్యాత్మిక చింతనతో ఆనందాన్ని అనుభవించడానికి పయనమయ్యాడు.
” సంఘసంస్కార విషయంలో,స్త్రీల బాధల విషయంలో బాధననుభవించి ” నా ఆత్మ ఏ కొంచెం,సాక్షాత్కారమైనా నాకు ఆడపిల్లల అవసరం లేదు అంటాను” అంటూ దీక్షితులకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు. స్త్రీ సౌందర్యం కోసం కలలు కనే చలం ఈశ్వర సౌందర్యం కోసం పరితపించడం మొదలు పెట్టాడు.
చలం లేఖల్లో సాహిత్య విషయాలు చోటుచేసుకున్నాయి.
చిత్తశాంతి లేదు.ఎప్పుడూ మానసిక ఒంటరితనం,బాధతోనే ఎక్కువ కాలం గడిపాడు చలం.తను రచన చేయడానికి కారణాన్ని వివరిస్తూ చలం జోగారావుకు రాసిన లేఖలో ” బాధ అనేది ప్రపంచంలో ఉన్నన్నాళ్లు పుట్టడమనేది విషాదం నాలుగు మణుగుల ఆనందం వున్నాసరే రెండు తులాల బాధ దాన్నంతా చెరుపుతుంది.” అని రచనా హేతువును వివరించాడు.చలం బాధాతప్తజీవి.బాధలోంచే కవిత్వముద్భవించిదని తేల్చి చెప్పాడు నిజమే ప్రథమ కావ్యం రామాయణం శోకంతోనే శ్లోకం ఉద్భవించిన వాల్మీకి మహర్షి నోటిద్వారానే వెలువడింది.
పత్రికలలో తననెవరేం తిట్టినా పట్టించుకోలేదని ” నా వైపు కొందరున్నారనే ఇట్లాంటివి సహించరనే తెలిసి వొస్తే కొంత భయపడతారు విమర్శకులు” అని జోగారావుకు రాసిన లేఖలో తెలిపాడు.సినిమా స్టార్ల ఆరాధకులైన పత్రికలవాళ్ళు ( స్వతంత్ర) చలాన్ని వ్రాయమని,అచ్చువేసుకుంటామని బతిమాలి,బలవంతం చేసి వ్రాయించుకుని అచ్చువేయకుండా తనపై ఆవిధంగా కసిని తీర్చుకున్నారని,మోసం చేశారని, ‘ లోకం తీరే అంత- మోసం,దొంగతనం ఉంటేనే గాని మనిషిని ఏ ఫీల్డ్ లోనైనా సరే సక్సెస్ వరించదు” అంటూ జోగారావుకు రాసిన లేఖలో విశదం చేశాడు. లోకంలో అంతా మోసం,దగాయే అని నిక్కచ్చిగా చెప్పాడు.అవును ఇప్పటికైనా పత్రికలవాళ్ళు పేరున్న వాళ్లవి,తెలిసిన వాళ్లవే అచ్చువేస్తారు.బాగా రాసినాసరే వాళ్లకు పరిచయం లేకుంటే,సిఫార్సు లేకుంటే అచ్చు వేసుకోరు ప్రముఖ పత్రికల వాళ్ళు.
బెజవాడ ప్రజలు తనను తరిమేసినట్లుగా, సామాన్లు అన్నిటిని అమ్మేసి,బతికివున్నామనే సంతోషం కూడా లేదని,దేశం ఒదిలితేనే బాగు పడ్తామని జోగారావుకు రాసిన లేఖలో తన మానసికవ్యధను వ్యక్తం చేశాడు.
చలం రచనల్లో వాస్తవికత ఉంటుందని తను నమ్మిన సిద్ధాంతమే రచనలో ప్రతిబింబిస్తుందని చలం దీక్షితులకు రాసిన ఉత్తరం వల్ల తెలుస్తుంది.చలం నిండా ‘సెక్స్’ ఉంటుందని అంటారు.’సెక్స్’ నేరం కింద ఒప్పుకుంటున్నానని కాదు. ఏ విషయంలోనైనా పూర్తిగా మునిగి కాని తార్కిక,మానసిక పర్యవసానాల దాకా తరచిచూచే వాడు త్వరలో సత్యమార్గం అందుకుంటాడని నా నమ్మకం.” సెక్స్ నా ముక్తి మార్గం” అని రాస్తూ దేశంలో ఇంతవరకు లేని కొత్తదనం నాలో ఏమీ లేదని,ఏది ఫీల్ అవుతామో అదే రాస్తామని చెప్తాడు.అయితే తన రచనలో ఫోర్స్ లేదని తానే ఒప్పుకుంటాడు.మంచి సారస్వతం రెండు రకాలని, ఒకటి గోడమీది పటంలాగా మనసుని అందాలతో నింపేదని,రెండవది ఉరిమి ఉరిమి చించి చెండాడి మంచికో చెడ్డకో జీవితాన్ని ఇన్ఫ్లుఎన్స్ చేసేదని చెప్తూ మొదటి రకం సాహిత్యం బళ్ల కొద్ది వస్తుందని,రెండో రకం సారస్వతాన్ని దేశానికి అందించేది నేను ఒక్కణ్ణేనని దీక్షితులకు రాసిన లేఖలో చెప్పుకున్నాడు. అంటే చలం రచనలు జీవితాలపై ప్రభావాన్ని చూపించేవిగా వుంటాయని తెలుస్తుంది.
ఆ విషయం చలమే ఒప్పుకున్నాడు.చలంకు తన రచనల పట్ల అమిత విశ్వాసం,ప్రజలను మార్చగలననే నమ్మకం బలంగా ఉండేదని తెలుస్తుంది. ఉత్తరాలు ఆయన మనసును అద్దం పడుతున్నాయి.
దీక్షితులకు రాసిన ఉత్తరంలో చలం అభిప్రాయం స్పష్టంగా గోచరిస్తుంది.1900వ సంవత్సరం తర్వాత ప్రచురించిన పుస్తకాలలో ఒకటి కూడా కొంతకాలం నిలవదని,” మన సారస్వతంలో, అభిప్రాయాలలో కొత్త కాలువలూ,కళలో కొత్తమార్గాలూ ప్రారంభించిన వాళ్ళు కొద్దిమంది వున్నారు.వాళ్ళల్లో నేనొకణ్ణి”. అని తన టెక్నిక్,ఆలోచనలు పాశ్చాత్య వాతావరణానికి సంబంధించేట్లుగా వుంటాయి కాబట్టే ఈ దేశంలో అట్లాంటి సాహిత్యం అభివృద్ధి చెందిందని ఘంటాపథంగా చెప్పాడు. దీన్నిబట్టి చలం ఎంత ఆత్మవిశ్వాసం గలవాడో తెలుస్తుంది.
రాజకీయంగా,సాంఘికంగా ముందు ఏ దేశం మారబోతుందో దాన్నిబట్టే తన పుస్తకాలకు విలువుంటుందని ” ఈనాడు వాస్తవజీవితంలో,మాటల్లో చాలామంది చూపుతున్న పోకడలనే నేను కళారూపంలో వ్యక్తం చేశాను” కానీ భాష నాకు ఆటంకమని,ఉద్రేకానికి తగ్గ శైలి లేదని చెప్పాడు.
ఆధునిక రచయితలు వారి కావ్యాలపై స్థాలీపులాక న్యాయంగా విమర్శించాడు. దీక్షితుల రచనపై ( వరూధినీ,చెంచురాణి) పై నిష్పాక్షికంగా విమర్శ చేశాడు.” మీ రచనల్లో ఉప్పు కారం తక్కువగా తోస్తుంది. ఈ అభిప్రాయం నా స్వంతం.కానీ మీ సూనృతమూ, మెత్తని హాస్యం చాలా మంది ఎంత ఇష్టపడతారో ఊహించుకోగలను.కొంచెం కట్లు వొదిలించుకుని,ప్రయత్నిస్తుంటేబహు గొప్పవి రాస్తారని నా నమ్మకం.” అని సూచనలతో కూడిన విమర్శ,,తియ్యని చురకలు వేశాడు.
“మునిమాణిక్యం”వి కులాసాగా చదువుకోవడానికే పనికి వస్తాయని,” విశ్వనాథ” కవిత్వం అర్థం కాదని,” కృష్ణశాస్త్రి” తను నిజంగా ఏమి ఎట్లా అనుభవించాడో అదే రాస్తే అద్భుతమైన గీతాలు వ్రాయగలడని అభిప్రాయాన్ని తెలుపుతూనే హృదయం మీద అతనిచ్చే నాజూకు నొక్కులు అని మెచ్చుకుంటాడు.” వేదం” కలంలో శక్తి వున్నా కవిత్వం కోసమే బతుకుతాడని,” నోరి” కవికింద నాకు తెలీదు అనీ,” నాయని” కవిత్వం నచ్చదు.” బసవరాజు అప్పారావు” ఒక గొప్ప కవిత్వపు పంక్తికోసం నూరుడబ్బాల చత్త రాస్తాడనీ,” రాయప్రోలు” శైలి బాగునప్పటికీ కొత్త అభిప్రాయాలు సున్న అని నిర్మొహమాటంగాను,కుండ బద్దలు కొట్టినట్లుగానూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
ఈ విధంగా చలం మిత్రులకు రాసిన లేఖలను పరిశీలించి నట్లయితే చలం హృదయం విప్పి తను అనుభవించిన ప్రతి విషయాన్ని మిత్రులతో దాపరికం లేకుండా వ్యక్తీకరించినట్లు గమనించవచ్చు.సాంఘిక,
వేదాంత,సాహిత్య విషయాలు,ఆరోగ్య విషయాలు,కుటుంబ విషయాలు ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో విషయాలు చలం లేఖల్లో చోటు చేసుకున్నాయి.చలం అనుభూతులు,అనుభవాలు,
కష్టసుఖాలు మిత్రులతో లేఖలద్వారా పంచుకున్నాడు.చలం ఔద్యోగిక జీవితంలో తటస్థపడిన వ్యక్తుల మనస్తత్వాలు, జీవిత సిద్ధాంతం, జీవన విధానం మొదలగునవి ఎన్నో విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.
రమణాశ్రమ జీవితంలో చలం భావనా దృక్పథం
(ఉత్తరారుణాచలం)
అరుణాచలం వెళ్ళాక చలం మనస్తత్వంలో మార్పు వచ్చినట్లుగా లేఖలవల్ల స్పష్టంగా తెలుస్తుంది.
బంకుపల్లి రామజోగారావుకు, వీరేశలింగంకు రాసిన లేఖల్లో ఇన్నేళ్లు ప్రపంచానికి సృష్టికి సరైన అర్థం కనబడక,ఏమీ తెలీకపోవడం చేతనే,ఎవ్వరు చెప్పినా నమ్మక అరుణాచలానికి రాక జీవితాన్ని వృధా చేసుకున్నాననే బాధను వ్యక్తం చేశాడు.జీవితంలో ఎంత పోగొట్టుకున్నాడో వెనక్కి తిరిగి చూస్తే తన చేసిన తప్పేంటో తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు.
” ఎక్కడి చలం ఎక్కడి అరుణాచలం దేవుణ్ణికాదు,ఋషిని కాదు,ఓ సమాధిని సేవించుకుని నమ్ముకొనిపడి వున్నాను.” అంటూనే మోక్షం కావాలని లేదు.వస్తుందన్న ఆశలేదు అని చెప్తూనే అంతలోనే అయోమయావస్థలో పడిపోతాడు చలం. పేరుకున్న ఈ సంస్కారాన్ని కాల్చే శక్తి భగవాన్ కి ఉంది.ఎవరు చెప్పినా అర్థం కాదు.ఏదో బాధ చలంను కలచివేసేది.బాధను భగవాన్ కు వదిలేసి బాధపడకుండా ఉండడం నేర్చుకున్నాడు.అప్పటికి భక్తిపై నమ్మకం కుదరలేదు”.అని దీక్షితులుకు రాసిన లేఖలో అంటాడు.
చలం రామజోగారావుకు రాసిన లేఖలో ” పాత జీవితమంతా ఓ కల లాగా అయిపోయింది. ఇట్లా కాలం గడచిపోవడమే ఆశయం.ఇంకా చలం అనే పేరు కూడా మనసులోంచి గుర్తులేకుండా పోవాలని ప్రయత్నం.ఏదో ఎవరో ఆకాశం నించి ఎప్పుడు దిగివస్తారో అన్నట్లు వుంది మనసు.చివరికి అన్ని బాధలూ పడి స్వర్గధామము చేరుకున్నాను.” అనే సంతృప్తిని మానసిక మార్పును వ్యక్తం చేశాడు.
వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో చలం తన ఆవేదనను,ఆంధ్రలో తనను ఎంత నీచంగా చూశారో,ఆంధ్ర జనులపై విరక్తి భావం,రమణాశ్రమంలో చలం పొందుతున్న అనుభూతిని కళ్ళకు కట్టినట్లు వివరించాడు. నేను కష్టాల్లో వున్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? కుక్కల్లాగు నన్నన్నివిధాలా క్షోభిల్లచేస్తూవుంటే ఎవరు సహాయానికి వొచ్చారు.ఈ ముప్ఫయి ఏళ్ళు డబ్బు తీసుకోకుండా ఇన్నేళ్లు రాసిన నాకు, డబ్బు లేని రోజున ఎవరిచ్చారు ఒక్క రూపాయి? తీరా నేనొచ్చిన తర్వాత అందరూ అడిగేవాళ్లే ఎందుకు వెళ్ళావని? ఎందుకు? నా బాధ ఇంక వుండదని రూఢి గనుక” అంటూ తన మానసిక వేదనను వెళ్లబోసుకున్నాడు.ఆనాడు ఆంధ్రదేశంలో తనపట్ల ప్రజలకున్న అభిప్రాయాన్ని కూడా చెప్పుకున్నాడు.తాను అరుణాచలం రావడానికి కారణం చెప్తూ ” యువతీ యువకులు దొంగ మొహాలు చూసి” వచ్చేశానన్నాడు. చలం మానసిక చిత్రీకరణ ఈ లేఖలో కనిపిస్తుంది బెజవాడ ప్రజలు తనను ఏ విధంగా,ఎంత నీచంగా చూసేవారో వివరించాడు. వీరేశలింగంకు రాసిన లేఖలో ” ఇదివరకు పురుషులు భయపడేవారు,నేను నా పుస్తకాలూ వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళ అధీనంలోంచి యెక్కడ తిరుగుబాటు చేయిస్తానేమోనని. ఇప్పుడు స్త్రీలు భయపడుతున్నారు,( ఇంకా భయపడతారు కూడా ఎక్కువగా ముందు ముందు) తమ పురుషుల్ని ఎక్కడ సన్యాసుల్ని చేస్తానోనని—- నాతో స్నేహమన్నా,మా ఇంటికి రావడమన్నా అంత ఘోరం క్రింద ప్రచారం చేస్తారు బెజవాడ ప్రజలు” అని వాపోయాడు చలం.
అరుణాచలం వచ్చాక చలం మానసికంగా ఎంతో ఎదిగాడు.గత జీవితాన్ని మరచిపోయి తర్వాత జీవితాన్ని,మనసును రమణాశ్రమంలో భగవాన్ కే అర్పించడానికి ప్రయత్నం చేశాడు ఇదే సందర్బంలో చలం మాటలు ” ప్రస్తుతం నా మనసులోకి అట్లాంటివి తీసుకోవడం బాధ సాధనలో వున్నాను ” అన్నాడు.
” నా కోసమే కాదు,నా నుండి ఏదో తెలుసుకోగలమనే వారందరికోసమూ చేస్తున్నాను ఈ తపస్సు ,ఇది కష్టతరమైనమార్గం ,కానీ నన్ను నడిపేది ఈశ్వరుడైన భగవాన్ రమణ ” అంటూ ధైర్యంగా చెప్పుకుని ఎంతో విశాల హృదయాన్ని ప్రకటించి తన మిత్రులకు ఆధ్యాత్మిక సందేశాలను,సత్యాలను,
జ్ఞానాన్ని లేఖలద్వారా పంచి ప్రచారం చేశాడు వేమన వలె చలం భోగిగా వుండి తర్వాత యోగిగా మారాడు.
చలంలో వచ్చిన మార్పు,జీవితంలో రెండు పార్శ్వాలను లేఖల ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చును.
జీవితంలో శృంగారమే గొప్పదని భావించిన చలం మెల్లమెల్లగా సత్యమేమిటో తెలుసుకొని, అన్ని బాధలూ పడి చివరికి స్వర్గధామం చేరుకొని,హృదయపరిపక్వత చెంది ఇలా అంటాడు రామజోగారావుకు రాసిన లేఖలో. “శృంగారానికి,ఆధ్యాత్మికానికీ చాలా సన్నిహితమని,జీవితంలో ఎన్ని నిరాశలున్నా లొంగిపోక,నిరాశ పడక బలంతో జయించి ముందుకు సాగాలని హితబోధ చేస్తూ ” క్రమంగా మన చేతులకి విధి నిరాకరించిన సౌందర్యం మన హృదయంలో ప్రజ్వలిస్తుంది వొదలకండి అన్వేషణ. శృంగారాన్ని అన్వేషిస్తో ప్రయాణమై, పోయి పోయి చివరికి ఆ శృంగారం కాంతిగా మారిన సంకేతస్థలానికి చేరుకుంటాము.భగవాన్ ఆనందమయం సర్వశక్తి ” అని తాను తెలుసుకున్న నగ్న సత్యాన్ని ఎంతో చక్కగా వక్కాణించాడు.తాను భగవానుని పూర్తిగా విశ్వసించినట్లు తెలిపాడు మండువ జగ్గారావుకి రాసిన లేఖలో ” శృంగారంలో కన్న మరి దేంట్లోనూ ఎక్కువ ఆనందాన్ని అనుభవించలేదు.మనసుని మించిన ఆనందం ఆధ్యాత్మికం, కామి కాక మోక్షగామి కాడు ఒకటి అసహ్యం,రెండోది మూర్ఖం ” అని వ్రాస్తూనే సాధనమంటే జీవితాన్ని ఈశ్వరునికి అర్పణ చేయడమంటాడు.
ఒక సినిమాకు కథ రాయడానికి మద్రాసుకు వెళ్లినా కూడా చలం ఆలోచనలు భగవాన్ చుట్టూనే తిరుగుతుండేవి.దీక్షితులకు రాసిన లేఖలో ‘ అరుణాచలం పోవాలని ఒకటే పీకుతోంది మనసు. భగవాన్ నాకిట్లా శిక్ష వేశాడు. ఇక్కడ ఈ వాతావరణంలో ఎక్కడా వినపడరు. ఆయన నవ్వుతున్నారు నా బాధల్ని చూసి.ఈ సినిమా కోసం బతకడం కన్నా చచ్చిపోవడం నయం.ఎంతెంత మోసాలు!అసహ్యాలు, డబ్బు…..ఇట్లాంటి మురుగునించి తప్పించారు మీరు నన్ను భగవాన్ని నాకు చూపించి”.అనడం వల్ల చలంలో వచ్చిన మార్పు ,స్త్రీ వ్యామోహం నుండి మనసు భగవాన్ వైపుకు మళ్ళి ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవడం ,ఇంతకాలం ఎంతో మురుగులో కొట్టుకుపోతున్న చలం తనను రక్షించినందుకు దీక్షితులకు కృతజ్ఞతలు తెలిపాడు.
రమణ మహర్షి దగ్గర చేరడానికి కావాల్సింది మనలో పట్లు పోయి ” బంధువుల్నీ,మర్యాదల్నీ వొదిలేయడానికి ఓ గొప్ప అర్హత ” అని వీరేశలింగం గారికి సలహా ఇస్తాడు.
చలం దీక్షితులను,వీరేశలింగం గారిని రమణ మహర్షి ఆశ్రమానికి రమ్మని పదేపదే కోరుతూ ఎన్నో ఉత్తరాలు రాశాడు.
చలం మండువ జగ్గారావుకు రాసిన లేఖలో నిత్య సత్యాలను, ఆధ్యాత్మిక భావాలను,తన రచనా వైఖరిని ఎంతో చక్కగా వెల్లడించాడు.” ఆధ్యాత్మిక సాధన అంతా ఏకాగ్రతను కుదుర్చడానికే అంటూ” కాలాన్ని,దేశాన్ని బట్టి మారడమేమిటి? మనిషి మనిషికీ మారుతుంది.నీతి మారదు. నీతికి సంబంధించిన పాపపుణ్యాలనే ఆ ఆచారాలు మారతాయి.
ఆ సంగతి అంగీకరించదు సంఘం.అందరికీ ఒకటే నీతిని రుద్దుతుంది.అదే చలం తగాయిదా సంఘంతో.” అని సంఘానికి చలం ఎందుకు వ్యతిరేకమో,చలం భావాలను ప్రజలు ఎందుకు అసహ్యించుకుంటారో వివరిస్తాడు.
చలం ప్రత్యేకత అతను నమ్మినదాన్ని ఆచరించడం,ఇతరుల కోసం త్యాగం చెయ్యడం,కష్టాలలోకి పోవడం కనుక అతనికి ప్రతిష్ట రాలేదు.
ఒక స్త్రీ విషయమో కాదు వీళ్ళ బతుకుల్లోని నీచత్వాన్ని,దొంగతనాన్ని,
బూతుని,మోసాల్ని బైటపెట్టడానికి ప్రజలకి చాలా కసి,ఎన్నడూ అతన్ని క్షమించలేదు.
అందుకే చలం రాతలకి అంత బలం” .అంటూ ఉన్న వాస్తవాన్ని తెలుతుపుతూనే చలాన్ని పట్టిన రొష్టు ఠాగూరుకు పట్టలేదని జగ్గరావుకు రాసిన ఉత్తరంలో పేర్కొంటాడు.
చలం తన కవిత్వంలో గల ప్రత్యేక లక్షణాన్ని ఇంకా ఇలా వివరించాడు జగ్గారావుకు రాసిన ఇంకో లేఖలో.” మన అనుభవానికి మారిన సంగతుల్ని మనం ఒప్పుకోకపోవడం పొరపాటు.ముఖ్యంగా స్త్రీ మనస్తత్వ విషయంలో కానీ,మన అనుభవాల్ని అటుంచి కథలో ఇది అసంభవం అనిపిస్తే చదువరికి, అది రచనలో లోటు.మామూలు తెలుగువాళ్లు అసంభవమనుకునేవి సంభవమనిపించేట్లు రచించడం చలం ప్రత్యేకత” అని తన రచనా వైఖరిని తెల్పాడు.నిజాన్ని నిర్భయంగా చెప్పే చలంను వాస్తవికతవాది అనవచ్చు.
” ఏమైనా ఈశ్వరుడిలో భక్తి విశ్వాసాలు వుంటే ఎటువంటి ఆపదల్లోంచీ బైటికి రాగలడు.” అంటూ భక్తిపట్ల తనకు గల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు చలం జగ్గారావుకు రాసిన లేఖలో.ఆ విశ్వాసమనేది హృదయంలోంచి రావాలి .మనం ఏ పని చేసినా సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో చేస్తేనే సఫలమవుతుంది అనేది వాస్తవం.
అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? సాధనెందుకు చేయాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో కనిపిస్తాయి.” అనుభవానికి అతీతమైన అనుభవానికి పోతారు.అదే ఆధ్యాత్మికం ఇంద్రియాల నుంచి తప్పించి దృష్టిని ఏ ఆధారమూలేని ఆనందంలో లయం చేయడానికేగా” సాధన అని అంటారు.మనసు ఏకాగ్రతను ఎలా సాధించాలి అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా వివరించాడు.
” ప్రపంచంలో నలిగి,కాగి,దిక్కులేని వాళ్ళకే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం” అంటూ చక్కని నిర్వచనాన్ని వీరేశలింగం గారికి రాస్తూ శాంతి,కాంతి ఇచ్చేవాడు ఒక్క ఈశ్వరుడే అని కుండబద్దలు కొట్టినట్లు తను నమ్మిన సత్యాన్ని ధైర్యంగా చెప్పాడు.” ఎవరి కర్మకి వారే కారణం.ఈ కర్మ పరంపర అనే ఎడతెగని వలనుంచి బైటపడడానికి ఈశ్వరుడొక్కడే సాధ్యం.” అని పచ్చి నిజాన్ని చెప్తూ తన అనుభవాన్ని తేల్చి చెప్పాడు. ఎంత శత్రువునైనా ప్రేమ వల్ల జయించవచ్చునన్న ఆత్మవిశ్వాసం కలవాడు చలం.
ఒకప్పుడు భావోద్రేకంతో ఉండడం వల్ల జీవితంలో ఉపద్రవాలు వచ్చాయన్న సత్యాన్ని తెలుసుకుని వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో చలం ఇలా వివరించాడు. ” మనకి అందమైన స్త్రీని చూడగానే కలిగే భావోద్రేకం వల్ల మన జీవితాన్ని ఆమె జీవితాన్ని నడపలేము. బాధనే వాంఛాగ్ని మీలో ఇముడ్చుకోగల లోతును సంపాయించండి… ఆ లోతును ఎంత ప్రయత్నించీ సంపాయించుకోలేకే చాలా ఉపద్రవాలు తెచ్చుకున్నాను…అంత కన్న విషాదం నన్ను నమ్మిన వారికి తెచ్చాను.ఇట్లాంటివి మనలో చాలా వరకు సమసిపోతేనేగాని అరుణాచలానికి పిలుచుకోరు ఈశ్వరుడు.” అంటూ అనుభవాన్ని వివరిస్తూ పశ్చాత్తాపాన్ని తెలుపుతూ వీరేశలింగానికి మార్గాన్ని సూచించాడు.అనుభవంలో చేదును చవిచూసి నలుగురికి ఆ చేదు నిజాన్ని తెలిపి సత్యాన్ని ప్రచారం చేశాడు చలం.ముందు మానసికంగా మార్పు రావాలని సలహా ఇచ్చాడు.
జీవన్ముక్తిని కోరి తన ఆశయం జీవించాను,జీవిస్తున్నాను అనే మరుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటమేనంటాడు చలం.
శివంకు రాసిన లేఖలో అరుణాచలం వచ్చాక ఇదివరకు లేని హాయి ఇప్పుడున్నదంటాడు.
” శాంతి,ఆనందం ఇట్లాంటి పదాలకి అర్థం అనుభవిస్తేనే గాని తెలీదు” అంటూ బంకుపల్లి రామజోగారావుకు రాసిన ఉత్తరంలో రాస్తూ సంతోషం,ఉత్సాహం ఏమీ లేకుండా పూర్తిగా అంధకారంలో పడితేనేగాని కాంతి దొరకదంటాడు చలం.
ఎంతో మందికి తన జ్ఞానామృతాన్ని పంచిపెట్టిన చలం ఆధ్యాత్మికతలోను తీవ్రవాదే. ఉన్నతమైన స్వేచ్చకోసం కలలుకని, తపించి,బాధపడి,ఆధ్యాత్మికంలోకి దిగి ఎదిగాక తను నమ్మిన సత్యాన్ని నలుగురికీ లేఖలద్వారా ప్రచారం చేసి అందరూ అసహ్యించుకున్న చలం, ఎవరికి ఏమీ కాని చలం తన జీవితంలోనూ,సాహిత్యం తోనూ అందరికీ తానే అయి ఎంతో గొప్పవాడుగా గోచరిస్తాడు. ఆనాటి సమాజ పరిస్థితుల్లో చలం ఎదుర్కొన్న సమస్యలు,చలం సాధించిన విజయాలు,మానసిక విశ్లేషణ,ఆయన అనుభవాలు ఒకటేమిటి ఎన్నో విషయాలు లేఖల ద్వారా వెల్లడించాడు.చలం మానసిక మార్పుకు అద్దం పడతాయి ఈ లేఖలు.అరమరికలేకుండా చేదు నిజాల్ని అందరికి పంచిపెట్టిన ధీశాలి చలం.
సమకాలికులకు మిత్రులకు రాసిన లేఖల్లో ఈయన ఆలోచనా సరళి,సాహిత్య విమర్శ,సునిశిత పరిశీలన,కష్టసుఖాలు మొదలగునవి తెలుసుకోవచ్చు.ఆవకాయ పచ్చడి మొదలు బుజ్జిగాడి కబుర్లు అన్ని విషయాలు లేఖల్లో చోటు చేసుకున్నాయి.
గురజాడపై చలం అభిప్రాయాన్ని జగ్గారావు తన లేఖల ద్వారా ఇలా తెలియచేశాడు. ” గురజాడ తిరుగుబాటంతా రచనల్లోనే కానీ జీవితంలో ఏమీ కనబడదు.ఆనాడు ఎవరూ చేయని సాహసం చేసి ఇరుకున పెట్టి సంకెళ్ళ నుండి భాషా, భావాల్ని ఒక్క దెబ్బతో ముక్కలు చేశాడంటాడు చలం”.
శరత్ రచనలను గూర్చి చెపుతూ చలం ” శరత్ నాయికా నాయకులకు వెన్నెముక లేదు.వాళ్ళ వొళ్ళంతా మెత్తని హృదయమే. ఎముకలు లేవు విధికి వెన్నవలె లొంగిపోతారు” అని విమర్శించాడు.
శ్రీ శ్రీ కోరింది ఆర్థిక విధానాన్నే గాక సామాజికంగా మార్పు కోరితే చలం హృదయంలో మార్పు కోరాడు అని జగ్గారావుకు రాసిన లేఖలో అంటాడు.శ్రీ శ్రీ” కవిత్వానికి గొప్పతనం పట్టింది.చలం లోకవిరోధిగానే వుండిపోతాడు” అని రాశాడు.
చలం మనసును అర్థం చేసుకోవడానికి లేఖలెంతో పనికివస్తాయి.సాహిత్యంలో చలం లేఖలకు చాలా ప్రాధాన్యముంది.ఆయన జీవన విధానానికి అక్షర సత్యాలైన లేఖలు అందించిన
చలం జీవన పరిణామక్రమం,ఆలోచనా వైవిధ్యం,ఆలోచనావిధానం,
సమకాలీనాధునిక కవులపై దృక్పథం,ఆధ్యాత్మిక భావసంపద ఎన్నో విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.
లేఖలన్నింటిని పరిశీలించినట్లయితే చలం రమణాశ్రమానికి వెళ్లక ముందు,వెళ్లిన తర్వాత రెండు జీవితాలను,రెండు ఆలోచనా రీతుల్లో మార్పులను రెండు కోణాల్లో గమనించవచ్చు.జీవితంలో నన్ను కదిలించే శక్తి ఒక స్త్రీకి తప్ప ఎవ్వరికి లేదన్న చలం తర్వాత జీవితాన్ని,మనసును రమణ భగవాన్ కే అంకితం చేసి సాధన చేయడమే కాక జీవితంలో ఇప్పుడు ఎంతో హాయిని పొందుతున్నానని తాను నమ్మిన నగ్న సత్యాన్ని,సిద్ధాంతాన్ని ఎంతో ఘాటుగా,ఉన్నదున్నట్లు తన మిత్రులకు రాసిన ఉత్తరాలే నిదర్శనం.
సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గుడిపాటి వెంకటచలం మే నెల 19 వ తేదీ 1894 వ సంవత్సరంలో మద్రాసులో కొమ్మూరి సాంబశివరావు కొమ్మూరి వెంకట సుబ్బమ్మలకు జన్మించాడు.తాత గుడిపాటి వెంకట రామయ్య తనను దత్తత తీసుకున్నందుకు గాను ఇంటిపేరు గుడిపాటిగా మారింది.చిన్నప్పటి నుండే అభ్యుదయ భావాలు కలిగి స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలని ఆశించి స్త్రీ వాదిగా ఎన్నో రచనలు చేసి తెలుగు సాహిత్యంలో తనదంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న చలం మే నెల 4 వ తేదీ 1979వ సంవత్సరం అరుణాచలంలో కన్నుమూశాడు.
చిన్నప్పుడే తండ్రి తన తల్లిని వేధించే తీరును చూసి చలించిన బాల చలం హృదయం మీద తీవ్ర ముద్రపడి స్త్రీ ఔన్నత్యం,స్త్రీ స్వాతంత్య్రం కోసం రచనలు చేసి స్త్రీ పక్షపాతిగా పేరు పొంది జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించి తాను నమ్మిన సిద్ధాంతం కోసం పరితపించిన ఆదర్శవంతుడు చలం తెలుగు సాహిత్యంలో ఉత్తమోత్తముడు,ఉన్నత మహాకవి.