Home ఇంట‌ర్వ్యూలు శబ్దసంపదను పెంచుకోవాలి- అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి – డా.గండ్ర లక్ష్మణ రావు

శబ్దసంపదను పెంచుకోవాలి- అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి – డా.గండ్ర లక్ష్మణ రావు

by Ananthaacharaya K.S.

డా.గండ్ర లక్ష్మణ రావు గారితో ముఖాముఖి

కే.ఎస్‌ : నమస్కారం సర్

గండ్ర : నమస్కారం అనంతాచార్యా

కే.ఎస్‌. .మీది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం.పంటలు, పశువులు ఆ నేపథ్యం లోంచి పద్యం పట్ల సాహిత్యం పట్ల అభిరుచి ఎట్లా మొదలయింది. ? బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఎవరి ప్రభావం వల్ల మొదలయింది.?
గండ్ర : మాది పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. మా బాపు చదువుకున్నవారు. ఆరోజుల్లో మూడవ తరగతి అనుకుంటా. కాని భారత, భాగవత , రామాయణాలుచదివేవారు, వాటిలోని అనేక కథలు రాత్రులు కల్లాల దగ్గర చెపుతుండేవారు. సాయంకాలాలు ఇంటి ముందర కూచొని వచ్చినవాళ్ళతో అవీ ఇవీ మాట్లాడుతూ ఏదో ఒక కథ వాటిల్లోంచి చెపుతుండేవారు. వేసవికాలం రాత్రులు ఆరుబయట మంచంలో పడుకొని పద్యాలు వల్లెవేయించేవారు. హరియను రెండక్షరములు వంటి భాగవత పద్యాలు నోటికి చదివించేవారు.
మా ఇంటి వెనుక తోటలుండేవి. వాటికి మోటలు కొట్టి నీరు పారించేవారు. అప్పుడు పాలేర్లు పోటీలు పడి పాటలు పాడేవారు. ఇంటికి వచ్చిన రకరకాల బిచ్చగాళ్ళు పదాలో పాటలో పాడేవారు. ఇవన్నీ చిన్నప్పుడు నన్నాకర్షించాయి. ఊరిలో కొందరు పద్యాలు, పాటలు కీర్తనలు చదివేవారుండేవారు. ఆయా సందర్భాలలో వారిని చూశాను. విన్నాను. హరికథలు , బుడిగ జంగమవారి కథలు, చిరుతల రామాయణం నాటకాలు, భాగవత నాటకాలు మొదలైనవి మా ఊరి వారే ప్రదర్శించేవారు. ఇంట్లో మా అమ్మ దగ్గరనుంచి ఇంటి చుట్టు ఉన్నవారు ఇతరులు అనేక సందర్భాలలో మాట్లాడే మాటాల్లో దొర్లే సామెతలు బాగా ఆకర్షించేవి.  ఇట్లా అనేకానేక గ్రామీణ సాంస్కృతిక వాతావరణం నాకు తెలియకుండా నన్ను సాహిత్యం వైపు మళ్ళించింది. నా చిన్నతనంలో మూడవ తరగతి, నాలుగ తరగతిలో నా చేత వారు రాసిఇచ్చిన ఉపన్యాసాలు ఇప్పించేవారు. నేను బాగా చదివి నిర్భయంగా నోటికి చెప్పేవాడిని అదే నన్ను ఇప్పుడు వేదికలమీద నిలబెట్టింది.

కే.ఎస్‌, అకాడెమిక్‌ గా బి.ఎస్‌.సి గణితం చదివిన మారు సాహిత్యం వైపు ఎట్లా మరలారు? అట్లా సాహిత్యం వైపునకు రావడానికి దిక్సూచి ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? ..
గండ్ర :  నేను చిన్నప్పటి నుండి గణితంలో చురుకుగా ఉండేవాడిని. మా ఊరులో చదువుకునేటప్పుడు వేమన పద్యాలు, సుమతి పద్యాలు చెట్ల కింద కూర్చోబెట్ట వల్లింప జేసేవారు. బాల ప్రసాద్‌ అనే టీచరు మా ఇంట్లోనే ఉండేవారు. ఆయన సాహిత్యం పట్ల అభినివేశం గలవారు. మాచేత మాటలు, పాటలు, పద్యాలు చదివించేవారు. నాటకాలు వేయించేవారు. హైస్కూలులో తెలుగు అధ్యాపకులు పలుగులు భూమారెడ్డి పద్యాలు చాలా అందంగా చదివేవారు. డిగ్రీ చదివేటప్పటికే గణితంతో పాటు సాహిత్యం మీద రుచి పెరిగింది. పి.యు.సి.చదివేటప్పుడు మా కాలేజికి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు, డా. సి.నారాయణ రెడ్డ గారు వచ్చారు,  గొల్లపూడి మారుతీరావు వచ్చారు, ఇట్లా నాలో అంకుర రూపంగా ఉన్న సాహిత్యాభిలాషకు ఈ అన్ని సన్నివేశాలు నీరుపోసి పెంచాయి. డిగ్రీలో ఉండగా 1969లో సెకండ్‌ ఇయర్‌. తెలంగాణ నాన్‌ ముల్కీ ఉద్యమం వచ్చింది. ఒక సంవత్సరం కళాశాలలు మూతపడ్డాయి. ఆ సంవత్సరమంతా నేను విపరీతంగా సాహిత్యం చదివాను. అందుకు దోహదం చేసింది, ప్రోత్సహించింది, ఏవి చదవాలో చెప్పిన వారు కోవెల సంపత్కుమారాచార్యులు. అప్పుడు వారు మాకు తెలుగు ఉపన్యాసకులు. వట్టి గాలి చదువునుండి అచ్యమైన సాహిత్యం వైపు మళ్ళించిన వారు సంపత్కుమారగారు. అప్పుడే విశ్వనాథ, అడవిబాపిరాజు,కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ,ఆరుద్ర, దాశరథి, కాళోజి( జీవనగీత), బాపురెడ్డి  మొదలైన వారిని అత్యంత ఆసక్తితో అభిమానంతో చదివాను. అంతేకాదు సింహాసన ద్వాత్రింశిక, హరవిలాసం, ప్రభావతీ ప్రద్యుమ్నము, కళాపూర్ణోదయము మొదలైన ప్రబంధాలు చదివాను. ఆరుట్ల భాష్యాచార్యులుగారు మాకు మరో తెలుగు ఉపన్యాసకులు వారి వద్ద చనువుతో అనేక విషయాలు అడిగి తెలుసుకునే వాడిని. అప్పుడు మా ప్రిప్పిపాల్‌ కొండలరావుగారు. అయన ప్రతి సబ్జుక్టులో  వారం వారం సెమినార్లు నిర్వహించే వారు. శ్రీశ్రీ పై జరిగిన సెమినార్‌ లో నేను ప్రసంగం చేశాను. నాకు హైస్కూలునుండి సహవిద్యార్థి మిత్రులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య నేను కలిసి ఆముక్త మాల్యద, మనుచరిత్ర ,వసుచరిత్ర వంటివి వేదం వారి టీకాతో ఉన్నవి కలిసి చదివాం. అట్లా గణితం మీదనుండి తెలుగుకు ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది.

కే.ఎస్‌…సీరియస్‌ గా సాహిత్యం చదువుకున్న మీరు అధ్యయనం,అధ్యాపనం, సృజన మూడింటిని ఎట్లా సంయమనం చేశారు? మూడింటిని ఎట్లా సమాంతరం చేశారు?
గండ్ర : అధ్యయనం నా నిత్యజీవితంలో భాగమయింది. ఇప్పటికీ రోజూ ఏదో ఒక పుస్తకం చదువకుండా ఉండలేను. అధ్యాపనం కోసం కూడా పుస్తకాలు చదివేవాడిని. పాఠం చెప్పడం కోసం ఆయా పాఠాలు ఉన్న కావ్యాలు, కవుల గురించి అధ్యయనం చేసేవాడిని. ఎం.ఏ లో ఆచార్య దివాకర్ల వేంకటావధాని, డా. సి.నారాయణ రెడ్డి, జి.వి. సుబ్రహ్మణ్యం వంటి వారు ఎన్నెన్ని పుస్తకాలు ఉటంకించేవారో చూసి ఆశ్చర్యమనిపించి అట్లా అనేక రచనలు చదవాలని అధ్యయనం పట్ల మరింత ఆసక్తి కలిగింది. ఎన్నిసార్లు చెప్పిన పాఠమయినా క్లాసుకు పోయే ముందు తప్పక మరోసారి ఇంటి దగ్గరైనా చదివేవాణ్ణి. ప్రతిసారి కొత్త విషయాలు స్ఫురించేవి. అవి అధ్యయనం వల్ల కలిగిన మేలు. అధ్యాపనం నాకు చాలా ఇష్టమైన వృత్తి. పాఠం చెపుతున్న ప్రతి గంటా నా ఆయుస్సును పెంచుతుంది,,,,, అని నేను ఒక కవితలో రాసుకున్నాను. నా ఆరోగ్య రహస్యం ఏమిటని చాలామంది అడుగుతారు. ఒకటి అధ్యయనం, రెండవది అధ్యాపనం. వీటిలో మురిసపోయిన నేను సృజన వైపు చాలాకాలంగా దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడు మాత్రమే రాసేవాడిని. మూడింటిలో రెండింటికే ఎక్కువ ప్రాధాన్యత. తరువాత అధ్యాపకుడి మలిథలో సృజనవైపు ఎక్కువ దృష్టి పెట్టాను.

కే.ఎస్‌……సాహిత్య సంస్థల నిర్వహణలో మీ పాత్ర గొప్పది. అధిక సమయం వెచ్చించారు. అది మీ సృజనాత్మక పైన ఎంత వరకు ప్రభావం చూపించింది? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు?
గండ్ర :  కరీంనగర్‌ లో 1978లో పనిచేస్తున్నప్పుడు మా సహచర ఉపన్యాసకుడు డా. గోపు లింగారెడ్డి జానపద సాహిత్య పరిషత్‌ రాష్ట్ర కార్యదర్విగా కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పుడు నాయని కృష్ణకుమారిగారు అధ్యక్షులు. కరీంనగర్‌లో ఆయన నిర్వహించే కార్యక్రమాలన్నిటిలో నన్ను భాగస్వామిని చేయడమే కాక జిల్లా కార్యదర్శిగా పెట్టారు. వాటితో పాటు ఆయా కవులు జయంతుల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సమయానికి రావలసిన ప్రసంగం చేయాల్సిన వారు రాకపోతే నా చేత మాట్లాడించేవారు. తరువాత నూకలమర్రి గంగయాచారి కరెంటు ఆఫీసుల పనిచేసే అతను సమతా సాహితి అని ఏర్పాటు చేపి నన్ను, డా.బి. దామోదర్‌ రావును, డా.డింగరి నరహరి ఆచార్యను, త్రిపురారి సోమేశ్వర శర్మను, పర్శరామారావును, గజేందర్‌ రెడ్డిని కార్యవర్గ సభ్యులుగా నియమించి ఆయన స్వయం సౌజన్యంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఒక విధంగా మా సమయమంతా ( కాలేజి అయినాక) వాటికే గడిచిపోయింది, .. సాహితీ గౌతమి ఏర్పాటు, సినారె పురస్కారం ఏర్పాటు ఆయా కార్యక్రమాలు , అప్పుడే సమైక్య సాహితి , మాడిశెట్టి గోపాల్‌, కె.ఎస్‌అనంతాచార్య  ప్రారంభించడం ఇట్లా కరీంనగరం సాహిత్య వాతావరణాన్ని పెంచాయి. ప్రతి సాహిత్య కార్యక్రమంలో నేను నిర్వాహకుడిగానో, వక్తగానో, ఆయా పనులు చేసేవాడిగానో పాల్గొనని సందర్భం లేదు. ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం తప్పనిసరి అయింది. నెహ్రూ యువకేంద్ర విద్యాసాగర్‌ రావుగారు కో ఆర్డినేటర్‌ గా అనేక కార్యక్రమాలలో మమ్ములను భాగస్వాములను చేశారు. మా సహోపన్యాసకులు పార్వెళ్ళ గోపాల కృష్టగారు అవధానాలు చేశారు.సమతాసాహితి, సాహితీ గౌతమి సంస్థలకు అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పనిచేశాను, ఈ కార్యక్రమాల, సంస్లల నిర్వహణ నా సృజనాత్మక దృష్టికి ఆటంకమే అయినాయి. మిత్రులు కూడా మీరు ఈ పనులు మానేస్తే చాలామంచి కవిత్వం, రచనలు చేస్తారు అని అంటుండేవారు. అయితే నా రచనలే కాదు ఎంతో సాహిత్యం ఉంది, అది అధ్యయనం చేసే ఒక ప్రేరణ కలగాలని, కొత్త వారికి సాహిత్యం పట్ల ఉత్సాహం కలిగించాలని ఎక్కువ ఆరాటపడ్డాను.

కే.ఎస్‌…..కవిత్వంలో నీవు అనే ఆది మకుటంతో శతకం రాశారు. ప్రయోగాత్మక మయిన ఆ శతకం గురించి వివరించండి. తెలుగు సాహిత్య ప్రపంచంలో దానికి లభించిన స్థాన ఏమిటి?
గండ్ర : పద్యం చదవడం, అంటే ఇష్టపడే నేను పద్యాలు రాస్తుండే వాడిని. డిగ్రీలో ఉన్నప్పుడే నేను అనుమాండ్ల పద్యాలు రాశాం. ఎం.ఏ లో జి.రామశేషయ్య నేను ఒకే గదిలో అద్దెకు ఉండి కలిసి చదువుకునేవాళ్ళం. అప్పుడు మేం పద్యాలురాశాం. కృష్ణాపత్రికలో అచ్చయినాయి. మళ్ళీ చాలాకాలానికి పద్యాలు రాశాను. అయితే అప్పటికే ఉపనిషత్తులు అధ్యయనం చేయడం వాటి గురించి వ్యాఖ్యానాలు, భాష్యాలు వినడం చదువడం నన్ను బాగా ప్రభావితుడ్ని చేశాయి. అట్లా తత్వమసి అనే భావనను తెలుగులో నీవు అనే పేరుతో సంబోధించి కొన్ని పద్యాలు తాత్విక భావనతో రాశాను. అందులో మిగతా శతకాల వలె ఏ దేవుని సంబోధన గాని, పేరుగాని ఉండదు.తత్వం మాత్రమే ఉంటుంది. ఆ విషయం కొంత కష్టమే, దాంతో పాటు నీవు అనేది నొక్కి చెప్పాలని ప్రతి పద్యం అట్లే మొదలయితే బాగుంటుందని అనుకొని అట్లారాశాను. అప్పుడు ఛందోపరమైన ఇబ్బందులున్నాయి. కాని వాటిని అదిగమించ గలిగాను. అది కూడా వీలయినంత వరకు తెలుగులోనే, సంస్కృత సమాస ప్రయోగాలు లేకుండా చేశాను.
                ఈ శతకానికి చాలా ప్రశంస వచ్చింది. మా రామశేషయ్య బాగా ప్రోత్సహించాడు. తరువాత మాదిరాజు బ్రహ్మానందం, గిరిజామనోహరబాబు, సంగనభట్ల నరసయ్య వంటి వారు అమితంగా ఆదరించారు. కపిలవాయి లింగమూర్తిగారు, సముద్రాల లక్ష్మణయ్యగారు, కోవెల సుప్రసన్నగారు అభినందించి ఆశీర్వదించారు. తెలుగులో ఏకప్రాస శతకాలు గతంలో ఒకటి రెండు వచ్చాయిగాని ఆది మకుటంతో రాలేదు. ఇదే తొలి ప్రయోగం. మహామహోపాధ్యాయ, పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారథిగారు ఈ శతకాన్ని చదివి పాతిక పైగా ప్రశంసా శ్లోకాలు రాశారు.అంత బాగున్నాయి పద్యాలు అని మెచ్చుకున్నారు. మహామహోపాధ్యాయులు అవధాని శ్రీ తిగుళ్ళ శ్రీ హరిశర్మగారు సంస్కృతంలోకి అనువాదం చేస్తున్నారు.

కే.ఎస్‌…. పద్యంతో పాటు ముగ్గు, వర్తమాన సంధ్య, శతద్రు లాంటి వచన కవిత్వం కూడా రాశారు. ఆధునిక ప్రాచీన సాహిత్యాలలో మీరు దేనిని ఎక్కువ ఇష్ట పడతారు? ఏది రాయడం మీకు సులువు, అభిమానం?
గండ్ర : కవిత్వం పద్యమైనా, గేయమైనా, వచన కవిత్వమైనా ఇష్టమే. వచన కవిత్వం ఈనాడు ప్రాచుర్యంలో ఉన్న రూపం. నేను కూడా అట్లా వచన కవిత్వం రాశాను. సంపత్కుమార వంటి వారితోపాటు సినారె, శేషేంద్ర, కాళోజి  మొదలైన వారి అధ్యయనం ప్రభావం ఎక్కువ.
ఏది సులభం అని ఏమీ లేదు. నిజం చెప్పాలంటే కవికి ఒక భావన వచ్చినపుడు అది తన రూపాన్ని తానే ఏర్పరుచుకొని బయటికి వస్తుంది.  ఆ రావడం ఒకసారి గేయంగా కావచ్చు, పద్యం గా కావచ్చు, వచనంగా కావచ్చు. తనంతగా వచ్చిందే సరిగ్గా ఆ భావానికి తగిన రూపమవుతుంది. ఈ భావాన్ని నేను పద్యంలో చెపుతాను, వచనంలో చెపుతాను అని అనుకొని రాయడం కృత్రిమమే అవుతుంఇ.  నీవు కవీంద్రులన్‌ కవివి…. అని ఉత్పలమాల ఛందస్సులో ఆరంభం వచ్చిందంటే మిగతాది అందులో కుదిరిపోతుంది. నేను పనిని ప్రేమిస్తాను…. అని వచ్చింది వచనకవిత్వమే అది అందులోనో సరిపోతుంది…. భావానికీ రూపానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. నేను పద్యాలు, వచన కవిత్వం రెండూ విరివిగా చదివిన అనుభవం ఉండటం వల్ల ఏది ఎట్లా వస్తుందో అట్లా రాశాను. శతద్రులో వట్టి వచనంలాంటి వాక్యాలు అట్లే ఉంచాను. వాటిని విరగ్గొడితే కవిత్వం కాదు. వాటిలో కవితా లక్షణముంటే అది కవిత్వమవుతుంది.అది వచనమైనా పరవాలేదు.

కే.ఎస్‌…..కవి సమ్రాట్‌ విశ్వనాథ నవలపై మీరు పరిశోధన చేశారు, దాంతో మీరు విశ్వనాథ అభిమానులు, ఆయన శిష్యులకు ప్రతిరూపం అంటారు మిమ్మల్ని, మీరెట్లా భావిస్తారు?
గండ్ర : విశ్వనాథను నేను చదువుకునే రోజుల్లో బాగా చదివాను. ముఖ్యంగా నవలలు  వేయిపడగలు, సముద్రపుదిబ్బ, శార్వరి నుండి శార్వరిదాక, కుణాలుని శాపము, దమయంతీ స్వయం వరం, చెలియలి కట్ట , ఏక వీర ఇట్లా ఎన్నో , పైకి చదివితే మా తో పాటు రూంలలో ఉన్న విద్యార్థులు, మా ఇంటి ఓనర్లు చదువురాని వారు కూడా విని రోజూ చదువుమనే వారు. ఆవిధంగా విశ్వనాథ పై అభిమానం కలిగింది. కాకతీయలో ఏ అంశం పై చేస్తావన్నప్పుడు ఏ ఆలోచించకుండా వేయిపడగలు అన్నాను. అప్పటికి దానిగురించి ఇది చేయాలని అనుకోలేదు. అంతగా మనసులో పడింది.
                జువ్వాడి గౌతమరావుగారు రామాయణ కల్పవృక్షం చదువుతుంటే ఎంతో మంది వచ్చి వినేవారు. లక్ష్మణ యతీంద్రులు,ఏలూరి పాటి అనంతరామయ్య,శ్రీలక్ష్మణ మూర్తి, బేతవోలు రామబ్రహ్మం, చేకూరి రామారావు, కోవెల సుప్రసన్న, సంపత్కుమార, విశ్వనాథ పావని శాస్త్రి , వాకాటి పాండురంగారావు, అనుమాండ్ల భూమయ్య  స్థానికంగా పార్వెళ్ళ గోపాల కృష్ణ …. వారి ఇంటిలో ఉంటూ రోజులకొద్తీ వినేవారు. వారిలో నేను కూడా ఒకడిని. అట్లా విశ్వనాథ పద్యకవిత్వం పట్ల కూడా అభిమానం కలిగింది. తరువాత విశ్వనాథ పద్యకావ్యాలు చదివాను ,సదస్సులలో వాటిపై పత్రసమర్పణలు చేశాను. కరోనా కాలంలో అంతర్జాలం మాధ్యమంగా మిత్రుల కోరికపై రెండున్నర సంవత్సరాలు రామాయణ కల్పవృక్షం లోని పన్నెండు వేల పద్యాలకు వ్యాఖ్యానం చెప్పాను. విశ్వనాథ సాహిత్యం పట్ల నాకు గల పరిచయాన్ని బట్టి నన్ను విశ్వనాథ అనుయాయి అని పిలుస్తుంటారు.

కే.ఎస్‌….. విశ్వనాథలో ప్రధానంగా మీకు నచ్చిందేమిటి? భాషనా? ఆధ్యాత్మికతనా? భావ వ్యక్తీకరణనా వివరించండి?
గండ్ర : విశ్వనాథ సాహిత్య క్షేత్రంలో పండించని పంటతేదు. అని వాడుక.ఒక్క వచన కవిత్వం జోలికి పోయినట్లు లేదు. కవిత్వం, నవల, నాటకం, కథ, విమర్శ వంటివాటిని సమర్థవంతంగా సాధికారికంగా అనితర సాధ్యంగా రాశారు. మధ్యాక్కరల వంటి ప్రయోగాలు కూడా నాకు ఇష్టంగా అనిపించేవి. నేను 6, 7 తరగతులలో ఉండగా మా బాపు విశ్వనాథ మధ్యాక్కరలు చదువడం చూశాను. అందులో ఒకచోట నాబిడ్డ ఈ కైత, దీని శోభాన గూడ వత్తురు …. అనే పదాలు పాదాలుచూసిన గుర్తు. అప్పుడప్పుడు మా బాపు ఎవరితోనైనా చెపుతున్నప్డుడు విశ్వనాథ సత్యనారాయణ కవిసమ్రాట్‌ కరీంనగర్‌ కాలేజి ప్రిన్సిపాల్‌… అనేవారు. ఆ మాటలు నాకు జ్ఞాపకం. ఆయన రచనలలో విశేషమేమిటంటే ఒకటి నచ్చితే అన్నీ నచ్చుతాయి. లేకపోతే ఏదీ నచ్చదు. గౌతమరావుగారు చెపుతుండే వారు ఆ రుచి తెలిసిన తరువాత మరేదీ అంతగా రుచించదు అని .
ఆయన ప్రతి రచనలోను ఒక వేదన ఉండేది. పైకి మాత్రం అవి కథలుగా నవలలుగా కావ్యాలుగా కనపడతాయి. కాని సమాజం పట్ల, దేశం పట్ల సంస్కృతి పట్ల అమితమైన అభిమానం అది క్రమంగా నశిస్తున్నదన్న వేదన అంతటా కనపడుతుంది. అది ఆయనను సంప్రదాయ వాదిగా ప్రచారం చేశాయి. కాని ఆధునికమైన దేనికీ వ్యతిరేకి కాదు. నవీనమైన ప్రతిదాన్ని స్వాగతిస్తాను. ఎంతవరకైతే మూలం చెడకుండా ఉంటుందో అంతవరకు అనేది ఆయన నిశ్చయం. భాష పాషాణ పాకం అనేది కూడా ప్రచారమే. రామాయణం చెపుతున్నప్పుడు చాలామంది ఇంత బాగా తేలికగా ఉందికదా? ఎంత గ్రామీణ జీవితం ఎన్ని జాతీయాలు, ఎంత వ్యవహార లక్షణం, ఎంత లోకం రీతి …అన విన్న మీవంటి ఆధునికులు, తెలుగు పండితులు, ఆనందించారు. అయితే ఆయన వ్యక్తీకరణ , శైలి ఆయనదే. లక్షపుటలు రాసినా ఒకరి ఎంగిలి లేదు, అని ఆయనే చెప్పుకున్నాడు.

కే.ఎస్‌….. మీరు విమర్శనా రంగంలో కూడా కృషి చేశారు. వర్తమాన తెలుగు విమర్శ ఎట్లా ఉంది? మీకు నచ్చిన విమర్శకులు ఎవరు? ప్రస్తుతం వస్తున్న సమీక్షలు, విమర్శలు, అర్థవంతంగా ఉంటున్నాయా? నిర్మాణాత్మక సూచనలు ఏమయినా చేయండి.
గండ్ర : కొందరు కవుల కవిత్వాన్ని గురించి, పుస్తకాల గురించి సాహితీ వనమాలి అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురించాను,నిజానికి అంతకు కొన్ని రెట్ల వ్యాసాలు, ప్రసంగాలుఆయా పత్రికలలో సంచికలలో ముద్రితాలున్నాయి. విమర్శను కవి అంతరంగాన్ని బట్టి ,కావ్యంలో కవి చెప్పినదాన్ని బట్టి ఎక్కువగా విమర్శించాను.
ఈ రోజుల్లో సమీక్షల విమర్శలు అనే అభిప్రాయం పెరిగిపోయింది. విమర్వలో ప్రాచ్య పాశ్చాత్య విమర్శాధోరణులు, ప్రమాణాలు, సిద్ధాంతాలు ఎన్నో వచ్చాయి. వాటి అవగాహనతో విమర్శ చేస్తున్న వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆచార్య కోవెల సుప్రసన్న, ఆచార్య బేతవోలు , డా. సంగనభట్ల నరసయ్య, ఆచార్య అనుమాండ్ల, , నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, కే.పి.అశోక్‌ కుమార్‌, యం. నారాయణ శర్మ, లక్ష్మణ చక్రవర్తి, జి.లక్ష్మీ నరసయ్య వారాల ఆనంద్‌ లవంటి వారు కొంతమంది విమర్శను గురించి తెలిసి విమర్శలు చేస్తున్నవారు.

కే.ఎస్‌… ఖలీల్‌ జిబ్రాన్‌ ది మ్యాడ్‌ మ్యాన్‌ పుస్తకాన్ని తెలుగులో వెర్రి మానవుము  పేరుతో తెలుగులో అనువదించారు. ఇప్పుడు అనువాద అవసరాన్ని వివరించండి.
గండ్ర : అది అనుకోకుండా జరిగింది. ఒకరోజు ఐ పాడ్‌ లో ఏదైనా పుస్తకం చదువుదామని రైటర్‌ ఆప్షన్‌లో ఖలీల్‌ జిబ్రాన్‌ నొక్కాను. చాలా పుస్తకాలు వచ్చాయి. ఎందుకో మాడ్‌ మాన్‌ చదువాలనిపించి చదివాను. వెంటనే తెలుగులో రాస్తే బాగుంటుందని మూడు రోజుల్లో అనువాదం చేశాను.
                ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో అనేక గొప్ప రచనలున్నాయి. వాటిని అనువాదం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎందరో చేశారు. ఇప్పటికీ ఆ పని చేయాలి. వారాల ఆనంద్‌ ఇరుగుపొరుగు పేరుతో దేశంలోని విదేశాలలోని కవులను తెలుగులో అనువాదం చేస్తూ పరిచయం చేస్తున్నారు. అనువాదం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న కవితా ధోరణులు తెలియడంతో పాటు మానవుని ఆలోచనా విధానం, జీవన సంస్కృతి, దేశవిదేశాల పరిస్థితులు ఎన్నో వ్యక్తమై పాఠకుడిని విశాలం చేస్తాయి.

కే.ఎస్‌. ఏడు పదుల వయసులో మీరు అవధాన రంగంలో ప్రవేశించారు. అవధాన అవసరాన్ని మీ అనుభవాల్ని గురించి చెప్పండి.
గండ్ర :…. పద్యాలు కావ్యాలనుండి అలవోకగా సభలలో చదువడం, అప్పుడప్పుడు పద్యాలు ఆశువుగా చెప్పడం చూసిన మిత్రులు వేణుశ్రీ మీరు అవధానం చేస్తారు అని కరోనా కాలంలో నాకు రొజూ సమస్యలూ, దత్తపదులూ, వర్ణనలూ ఇచ్చి రాయమన్నారు. నేను వెంటనే పూరణలు పంపాను. తరువాత మిత్రులు రాజారామమోహన శర్మ ఒకరోజు నిర్ణయించి అవధానం చేయుమన్నారు. పృచ్ఛకులను నిర్ణయించారు. అట్లా ప్రారంభైన అవధానం నాకు కూడా ఉత్సాహంగానే అపినించింది. ఈ అవధాన ప్రక్రియ తెలుగులో అపురూపమైనది. కరీంనగర్‌లో ప్రస్తుతం ఎవరూ లేరు. నన్ను చూసి ఎవరైనా యువ కవులు పండితులు ముందుకు వస్తారని , అందుకు ప్రేరణగా స్ఫూర్తిగా నిలువాలని అవధానాలు చేస్తున్నాను. ఇంత వరకు జరిగిన అవధానాలు ప్రేక్షకులను సంతృప్తిపరచాయి. అదే నాకు ప్రోత్సాహకంగా ఉన్నాయి.

కే.ఎస్‌…. గత యాభైఏళ్ళలో తెలుగు సాహిత్యంలో పలు వాదాలు వచ్చాయి. వాటిలో మీరు ఎటు వైపు?
గండ్ర :     సామాజికమైన స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదం, ఇట్లాంటివి వచ్చాయి. వీటి ప్రభావంత తెలుగులో కవిత్వం, కథలు, వెలువడ్డాయి.ఈ వాదాలు కవిత్వంలో భాగమే కాని వాదాలే కవిత్వం కాదు. సాహిత్య వాదాలలో సంప్రదాయం, అభ్యుదయం వంటి వాదాలు వచ్చాయి. మా గురువుగారు సినారె గారి వలె సంప్రదాయం జీర్ణించుకున్న ప్రయోగాన్ని, ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని, నేను ఇష్ట పడతాను.

కే.ఎస్‌…భువన విజయం నాటకం రాశారు. దాని వివరాలు చెప్పండి?
గండ్ర :…. ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయల పంచశతి ఉత్సవాలు జరుగుతున్నాయని నంది శ్రీనివాస్‌ , గాజుల రవీందర్‌,   మీరు నన్ను కలిసి భువనవిజయం నాటకం వేద్దామనుకుంటున్నాం మీరు సహాయం చేయండి అని అడిగారు. సరే నన్నాను. తీరా దానికి తగిన రచన (స్క్రిప్టు) లేదన్నారు. రెండుమూడు రోజులలో కావాలన్నారు. ఆ రాత్రి కూర్చొని అష్టదిగ్గజ కవులు, రాయలు, మంత్రి, నరసరాజు వంటి పాత్రలతో పద్యాలు మాటలు కలిపి నాటకం రూపొందించాను. రెండు రోజులు ఆయా పాత్రలు అభ్యాసం చేసి ప్రదర్శన ఇచ్చాం. అందులో నేను తెనాలి రామకృష్ణుని పాత్ర ధరించాను. ఒకవైపు హాస్యం పండిస్తూ మరో వైపు ఆయా పాత్రధారుల లోపాలు సరిచేస్తూ నాటకం రక్తి కట్టించాం. ప్రముఖ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ నాటకాన్ని చూసి అభినందించారు.

కే.ఎస్‌. : మీ అధ్యాపకత్వంలో ఎందరో శిష్యులను తయారు చేశారు? అధ్యాపకానుభవం గురించి , నేటి విద్యావ్యవస్థ గురించి చెప్పండి? సాహితీ సాంస్కృతిక రంగం వైపు పిల్లల్ని ఎట్లా ప్రోత్సహించాలి?
గండ్ర : అందరూ కోట్లు సంపాదించి ఆనందిస్తే నేను శిష్యకోటిని సంపాదించాను అని గర్వంగా చెప్పుకుంటాను. ఎందరో శిష్యులు ఏ రంగంలో స్థిరపడిన వారైనా నా పాఠాలను గుర్తు చేస్తుంటారు. ఇక మీ వంటి వారు తెలుగు పండితులు కాకపోయినా తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తూ అద్భుతమైన సేవలందిస్తున్నారు. ఎందరో శిష్యులు తెలుగుపండితులుగా, ఉపన్యాసకులుగా, కవులు రచయితలుగా ఎదిగారు. తరువాతి తరాన్ని తయారు చేశాననే సంతృప్తి ఉంది. ఈ కాలం విద్యావిధానంలో సాంస్కృతిక రంగానికి కొంత ప్రాధాన్యత ఉన్నా ఎక్కువగా సినిమా పాటలు, జానపద గీతాలు నృత్యాలు వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భాష, వక్తృత్వము, కవిత్వము, సాహిత్యము వంటి వాటికి తక్కువ. ఆంగ్ల మాధ్యమం వచ్చిన తరువాత పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. భాష పట్ల అభిరుచిని కలిగించాలి. మంచి  సంభాషణా చాతురిని, వాఙ్నైపుణ్యాన్ని కలిగించాలి. ఈ నాటికీ మాట్లాడడం, సరిగా సమాధానం చెప్పటం రాక ( తెలిసి) పోవడం భాషాలోపం. వ్యక్తిత్వ వికాసంలో భాగంగానైనా భాషను నేర్పించాలి.

కే.ఎస్‌…. నూతన కవులకు రచయితలకు మీరేమి చెపుతారు? ఏ సందేశం ఇస్తారు?
గండ్ర :   ఎవరు చదివినా చదవక పోయినా ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. పుస్తకాలు వేస్తున్నారు. కొందరు సరికొత్త పద్ధతుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. కొందరు కవిత్వం కాని దాన్ని కూడా కవిత్వం అని మురిసి పోతున్నారు. కవులుగా దలచిన వారంతా అధ్యయనం చేయాలి. ప్రాచీనాధునిక కవులను బాగా చదువాలి. పదానికి అర్థాలు తెలియక ఏదో అనుకొని ఏవో పదాలు ప్రయోగిస్తున్న యువ నవ కవులు కూడా ఉన్నారు. శబ్దసంపదను పెంచుకోవాలి, అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి. ఎవరినీ అనుసరించకపోయినా ఆ అధ్యయనానుభవం తోడవుతుంది. ఒక పుస్తకం రాయగానే పురస్కారం రావాలని ఆశించడం వంటిది కూడా సాహిత్య రంగంలో అంత ఆశించదగినది కాదు.

ఎక్కువ మంది కవిత్వం రాయడం వల్ల తెలుగు భాష ఆయుర్దాయం పెరుగుతుందనే ఆశ మాత్రం కలుగుతుంది.

కే.ఎస్‌. ధన్యవాదాలు సర్‌.

You may also like

Leave a Comment