Ananthaacharaya K.S.
Ananthaacharaya K.S.
కె ఎస్ అనంతాచార్య
వ్యాఖ్యాన శిరోమణి, సభావ్యాఖ్యానాలు, రచనలు, సమైక్య సాహితీ ప్రధానకార్యదర్శి
స్కూల్ అసిస్టెంట్
జీవశాస్త్రం జి.ప.ఉ.పాఠశాల వెల్ది, జి.కరీంనగర్
నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
షట్ శాస్త్రాల్లో తలస్పర్శి
పాండిత్యం ఉన్నా,నిరాడంబరతతో మెదిలిన మహనీయులు డా. శ్రీ ఊ వే శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి వారు.
హర్షా మర్ష భయ క్రోధదులేవి స్పృశించని నిర్మలమైన జీవన శైలి ఆచార్యుల వారిది. నిష్కలంక చరిత్ర వారిది.
నడయాడే శ్రీ భాష్యం, కదిలే విజ్ఞాన సర్వస్వము, పుంభావ సరస్వతి. జ్ఞానానుష్టానములను భక్తి వైరాగ్యాలను కలిగిన వారు ఆచార్యులు శ్రీమాన్ రఘునాథ ఆచార్య స్వామి వారు.
సంస్కృత సాహిత్యంలో ఎంతటి మేరునగ శిఖరమో, విశిష్టాద్వైత సంప్రదాయంలో అంతటి లోతైన పరిజ్ఞానం కల అపర రామానుజ స్వరూపం వారిది. ఉపన్యాసం ద్వారా వేలాదిమంది ని తేజపరిచి నూతన ఆవిష్కరణలు చేస్తూ ప్రతి సభను అద్వితీయంగా నడిపిన ధిషణ వారిది.. అధ్యాపకులుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపక కేసరి. వేలాది పండిత సభల్లో నూతన ప్రతిపాదనలు చేసిన ప్రతిభాశీలుడు. ఎంతటి ఉన్నతులైన, శాస్త్ర విషయాలలో రచనలలో తప్పులను ఎత్తిచూపి, సరియైన మార్గదర్శనం చేసిన మహానుభావులు.
జననం
పండితోత్తములు ప్రపన్నులు అయినా
శ్రీమాన్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల తాతాచార్యులు శేషమ్మ గారలకు తేదీ 01.05 19 26న మోటూరు కృష్ణాజిల్లా (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్. )లో
జన్మించినారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరంగం రఘునాథచార్య స్వామి వారు.
విద్యాయానం!!
అమావాస్య నాడు అక్షరాభ్యాసాన్ని పొందిన వీరు
తదుపరి అసమాన్యమైన పండితులుగా రూపుదిద్దుకోవడం జరిగింది.
చిన్ననాడే ఆచార్యులవారు తమ తండ్రిగారి వద్ద సంస్కృత ప్రాథమిక జ్ఞానాన్ని పొందినారు.
ఇంగ్లీష్ భాషా పాఠశాలలో వేసిన ఎందుకో అది అబ్బకుండా పోయింది.
వేదాంతవర్ధిని
సంస్కృత పాఠశాల సీతారాం బాగ్ హైదరాబాద్
లో విద్యాభ్యాసం కోసం తీసుకెళ్లినప్పుడు
వీరి భాష విజ్ఞానం చూసి భారవి క్లాసులో చేర్చుకున్నారు. సాధారణ విద్యార్థులు సంస్కృత ఎంట్రన్స్ పరీక్ష రాయటానికి ఒక్క సబ్జెక్టు మాత్రమే ఎంచుకొని రాస్తారు. కానీ ఆచార్యులవారు నాలుగు ఎంట్రన్స్ పరీక్షలను తర్క, వ్యాకరణ ,సాహిత్య మీమాంస శాస్త్రాలను ఒకేసారి రాసి విజయం పొందిన చురుకైన విద్యార్థి. గురువుగారైన శ్రీమాన్ శఠగోప రామానుజాచార్య స్వామి వారు ఆచార్యుల వారిని అప్పటినుంచి చతుస్తంత్రి అని పిలిచేటువంటివారు.
తదుపరి ఉద్యోగం నిమిత్తం విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకొని ఉపన్యాసకులుగా కొనసాగింపబడిన విరాణమూర్తి.
శ్రీమాన్ ఆచార్యుల వారు వేదాంతవర్ధిని సంస్కృత పాఠశాలలో చదివిన విద్యార్థి జీవితాన్ని, కృతజ్ఞతావిష్కరణం అనే పేరిట సంస్కృత కావ్యాన్ని అత్యద్భుతంగా వెలువరించి గురువులకు శిష్యులకు ఒక మార్గదర్శనం చేశారు. తదుపరి కృతజ్ఞతావిష్కరణం అనే సంస్కృత కావ్యాన్ని ఆచార్య లక్ష్మణ మూర్తి గారు తెలుగులోకి అనువదించటం విశేషం.

ఉద్యోగ ప్రస్థానం
ఆచార్య రఘునాథ చార్య స్వామి వారు 1946వ సంవత్సరంలో వరంగల్‌లోని సింహాద్రి కళాశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేరి నడిపించారు.
అక్కడ నుండి శ్రీమాన్ ఆచార్యులవారు శ్రీ ఆకారం నరసింహం గారి విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో వరంగల్‌లో అధ్యాపక వృత్తిని చేపట్టి 40 సంవత్సరాల పాటు కొనసాగించిన దేశికోత్తములు. వీరి వద్ద విద్యనభ్యసించిన ఎందరో విద్యార్థులు ఉపన్యాసకులుగా, ఆచార్యులుగా, కవిపండితులుగా, రచయితలుగా, ఉన్నత పదవులలో ఉండడం విశేషం. ఆచార్యుల వారి అద్వితీయమైన బోధనకు 1972 సంవత్సరంలో జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది..
కాంచీపురం లోని శ్రీ ఉ వే శ్రీమాన్
ప్రభ అన్నంగలాచార్యుల వారి ముదిరేక్షణ శబ్దార్థ విచార పరమైన గ్రంథాలను రఘునాథ
ఆచార్యుల వారు చూసి ముదిరే క్షణార్థ పరిష్కారము అనే గ్రంథాన్ని రాసి అన్నంగలాచార్యుల వారి గ్రంథంలోని సాహిత్య పరమైన విశేషాలను ఎత్తిచూపి శతకోటి అనే గ్రంథం రాసి ప్రచురించినారు .
ఆచార్యుల వారికి అన్నంగలాచార్యుల వారికి జరిగిన వివాదం అనంతరం ముదిరే క్షణార్థ పరిష్కారః బహిష్కారఖండనం, గంబోలి, కషాకాతహ, శతకోటి అనే ఐదు పుస్తకాలు వేసి నిజ నిరూపణ చేసిన సుప్రసిద్ధ పండితులు ఆచార్యులు.
శ్రీమాన్ అద్దంకి కుమార తాతాచార్యుల వారి ఉత్తర రామ చరితం సంస్కృతం అనే నాటకానికి చక్కని వ్యాఖ్యను అందించినారు. ఇది తెలుగులో ఉంది. దీనిని తదుపరి రఘునాథాచార్య స్వామి వారు దేవనాగరలిపి లో అందించడం జరిగింది. ఆచార్య స్వామి వారు శ్రీ నమ్మాళ్వార్ తిరువాయి మోజిలోని రెండు దశకాలకు దివ్య సూరి సూక్తి సుధ
అనే సంస్కృత శ్లోకాలతో పాశురాలను అనువదించి సంస్కృతంలో వ్యాఖ్యానాన్ని రాయటం జరిగింది. వరంగల్ లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి నిర్దేశంలో జరిగిన పోతన శతజయంతి ఉత్సవాలలో రఘునాథ ఆచార్య స్వామి వారు పాల్గొని పోతన భాగవతంలోని విశిష్టాద్వైతం అనే అంశాన్ని గురించి అద్భుతమైన ప్రసంగాన్ని అందించడం జరిగింది. తదుపరి ఈ వ్యాసాలను సత్సాంప్రదాయ పరిరక్షణ సభ శ్రీ రఘునాథ సూక్తిమంజరి 2 పేరిట ప్రచురించటం జరిగింది. శ్రీమాన్ ఆచార్యులవారు ప్రసంగవ్యాసాలన్నీ సత్సాంప్రదాయ పరిరక్షణ రఘునాధ సూక్తిమంజరి పేరిట తెలుగు ,సంస్కృత విభాగాల్లో ప్రచురించి అందరికీ అందించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గుప్త పాశుపతం అనే నాటకం లోని దోషాలను ఎత్తిచూపిన ప్రతిభ శ్రీమాన్ ఆచార్యుల వారిది .
రసగంగా ప్రవాహం ఉపన్యాసం!!
శ్రీమాన్ ఆచార్యుల వారి ఉపన్యాసం లో ఆధ్యాత్మిక, సాహిత్య విషయాలతో పాటు, రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలు స్తోత్రాలు, కాళిదాసు, మాఘ, భారవి,లాంటి శ్లోకాలు దివ్య ప్రబంధ పాశురాలు ఉదాహరిస్తూ సాగుతూ ఉంటాయి. కొన్నివేల శ్లోకాలు పాశురాలు వారి జిహ్వ ఆగ్రంపై అలవోకగా నర్తిస్తుండేవి. వారి పాఠము ప్రసంగం అందరి హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయిందనుట అక్షర సత్యం. ఆచార్యులవారు ఎంత అద్భుతంగా ఉపన్యాసం బయట అందించేవారో,తరగతి గదిలో కూడా వీరి పాఠం అంత విశిష్టంగా ఉండేది.
శ్రీమాన్ రఘునాథ ఆచార్య స్వామివారిని నడయాడే ఉభయ వేదాంత విజ్ఞాన సర్వస్వమని సుప్రసిద్ధ పండితులు అని అభిమానులు శిష్యులు ప్రశంసిస్తూ ఉంటారు.
వీరికి సంస్కృతాంధ్ర సాహిత్యము ఉభయ వేదాంతలతోపాటు శాస్త్రీయ సంగీతం కూడా చాలా ఇష్టం.
ఇది వీరికి పరంపరగా పబ్బింది ఆచార్యుల వారి పిన తoడ్రులు శ్రీమాన్ న చ సింగరాచార్యులు గారు శ్రీమాన్ నచ శ్రీనివాసాచార్యులవారు సంగీత విద్వాంసులు. శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు గారు వేణువు, షహనాయి, గాత్ర సంగీత విధ్వాంసులు. అదే పరంపరగా వీరు సంగీత పై మక్కువ పెంచుకొని అనేక కార్యక్రమాల్ని నిర్వహించటం ఒక అద్భుతమైన అంశం.
పెద్దల సమాగమo!!
శ్రీ శ్రీ త్రిదండి రామానుజ పెద్ద జీయర్ స్వామి వారు, శ్రీశ్రీశ్రీ తిదండి చిన్న రామానుజ జీయర్ స్వామి గారు, న చ స్వామి వారి
సలహాలు సూచనలను స్వీకరించి సంప్రదాయ వ్యాప్తికి ఉపయోగించటం విశేషం.
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్ర జీయర్ స్వామి వారు రఘునాథ ఆచార్య స్వామి వారి వద్ద శ్రీ భాష్యాన్ని సేవించారు.
శ్రీమాన్ అష్టాక్షరి సంపత్ కుమార్ జీయర్ గారు రఘునాథ్ దీక్షకుల వారి వద్ద శ్రీ వచన భూషణం తదితర సంప్రదాయ గ్రంథాలను సేవించినారు.
పెద్దలతో విశిష్టాద్వైత సంప్రదాయ విశేషాలతో పాటు అనేక విషయాల పైన సందేహాల నివృత్తి చేస్తూ ఉండేవారు.
అనేక యజ్ఞ యాగాది క్రతువులు
దేవాలయాల జీర్ణోద్ధరణ, ఇష్టులు
వీరందరితో కలిసి నిర్వహించిన వారు.
మరొకవైపు ప్రముఖ సాహితీవేత్తలు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు, విశ్వనాథ, కోవెల సుప్రసన్నాచార్యులు కోవెల సంపత్ మారాచార్యులు ఆచార్య లక్ష్మణమూర్తి ఇలాంటి మహాను భావులతో చర్చలు ఇష్టం జరిపేవారు. వీరి ఇల్లు ఎప్పుడు ఒక విశ్వవిద్యాలయంగా ఉండేది ఎంతోమంది విచ్చేసి విశిష్టాద్వైత సంప్రదాయ సంబంధిత గ్రంథ విషయాలను ఆచార్యుల ద్వారా నేర్చుకునే వారు. మరొకవైపు సాహి సాహితీ విశేషాల కోసం మరికొందరు విచ్చేసేవారు. విరసి వీరి ఇల్లు ఒక సరస్వతి ఆలయంగా కనపడేది. మరియు కోలాహలం గా ఉండేది. ప్రతినిత్యము విచ్చేసిన వారికి సాదరంగా సాపాటుతో పాటు
ఆత్మీయ అనుబంధాన్ని పంచేవారు. మీది మిక్కిలి ఆచార్యులవారు అలాగే వారి శ్రీమతి సీతామ్మవారు ఎన్నో దానధర్మాలను చేయడం అందరూ ఎరిగిన విషయమే.
ఆచార్యుల వారి కుటుంబం!!
శ్రీమాన్ న.చ.వారికి పదహారేళ్ళ వయసులో
సింహాచలం కు చెందిన శ్రీమాన్
కొమండూరి రాఘవాచార్యులు.. ఆండాళమ్మ గారి కూతురు 12 ఏళ్ల వయసు గల సీతమ్మ గారితో వివాహం జరిగింది.
సీతా అమ్మవారి కి రామాయణ భారత, భాగవత పద్యాలు ఆచార్య సూక్తులు, నాలాయిర దివ్య ప్రబంధం వీరికి
కంఠోపాఠం. అమ్మగారి మామ గారి వద్ద మీరు కొంత సంస్కృత విద్యాభ్యాసం చేశారు. చక్కని గాత్రంతో అందరినీ అలరిస్తుండేవారు. ఆచార్యుల వారి దంపతులకు మొత్తం ఐదుగురు కుమార్తెలు. మూడో అమ్మాయి భూదేవి చిన్నతనంలోనే అనారోగ్యం పాలై చనిపోయింది. శేషమ్మ శ్రీదేవి నీలాదేవి గోదాదేవి మిగతా నలుగురు అమ్మాయిలు విలక్షణ సంపన్నులు.
ఉ వే శ్రీమాన్ ఆచార్యులవారు అధ్యాపక వృత్తి నుండి విరమణ పొందినాక రెండు మూడు సంవత్సరాల పాటు కర్ణాటక రాష్ట్రంలోని మేలుకోట సంస్కృత సంక్షోధనా సంస్థ కేంద్రంలో అమూల్యమైన సేవలందించారు శ్రీమద్ శ్రీ భగవద్రామానుల వారి వేదార్థ సంగ్రహం ఉపనిషద్ భాష్యాలు ఇంకా విశిష్టాద్వైత పదకోశం నిఘంటువులను వీరు పరిష్కరించారు తదుపరి వీటిని అకాడమీ వారు ముద్రించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టుకు కొద్దికాలం గౌరవ సలహాదారులుగా పనిచేసే వెంకటేశ్వర స్వామి సేవలు చేశారు.
బిరుదులు పురస్కారాలు!!
1964లో మహా మహోపాధ్యాయ శ్రీ కెఎస్ కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆచార్యులవారికి కవిశాబ్దిక కేసరి బిరుదునిచ్చి ఘన సత్కారాన్ని అందించారు.
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి వారు ఆచార్యుల వారిని మహా మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేసి గౌరవించారు.
జాతీయస్థాయిలో నాటి రాష్ట్రపతి శ్రీ వివిగిరి ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.
సర్వ వైదిక సంస్థానం సంస్థాపనచార్యులు శ్రీమాన్ శ్రీ భాష్యం విజయసారథి గారు కరీంనగర్లో వీరికి శాస్త్ర రత్నాకర అనే బిరుదునిచ్చి సత్కరించి ఆచార్యుల వారిపై విశేషాలు అభిమానంతో శ్రీ రఘునాథ
దేశికోదాహరణం అనే సంస్కృత కావ్యాన్ని రచించి సమర్పించారు.
అప్పా జోసుల విష్ణుభట్ల కందాళం ఫౌండేషన్ వారు ఆచార్యుల వారిని విశిష్ట వ్యక్తిగా సన్మానించారు.
మైసూరు ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఎం పి ఎల్ శాస్త్రి ప్రతిష్టాన్
వారి పురస్కారాన్ని అందుకున్నారు.
సర్వార్ధ సంక్షేమ సమితి పక్షాన పివి గారి తనయుడు మనోహర్ రావు గారు స్థితప్రజ్ఞ అవార్డును ఆచార్యుల వారికి అందించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ వారి స్నాతకోత్సవాల సందర్భంగా ఆచార్యుల వారికి
గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.
2006 సంవత్సరంలో విజయవాడలో శ్రీ శ్రీ శ్రీ అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో న.చ.స్వామివారికి
కనకాభిషేక తులాభారాన్ని, గజారోహణ సన్మానాన్ని విజయవాడలో నిర్వహించటం
అత్యంత ఆనందకరం.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాటి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ద్వారా ఉత్తమ వేదాంత పండితులు పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి వారి శిష్యులైన కవిరత్న గుదిమళ్ళ రామానుజ ఆచార్య స్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారి కుమారులు కవిరత్న పురస్కారాన్ని అందించారు.
శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి వారు రఘునాథ దీక్షకుల వారిని ఉభయ వేదాంత ఆచార్య బిరుదునిచ్చి తామరపత్రాన్ని ఇచ్చి గౌరవించారు. మద్రాసు విశ్వవిద్యాలయం ద్వారా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన రామానుజ జీయర్ స్వామి వారు తొలి గోలోపాయన పురస్కారాన్ని
శ్రీ రఘునాథ దేశికుల వారికి
సమర్పించారు.
శ్రీ శ్రీ రామచంద్ర జీయర్ స్వామి వారు మంచిర్యాలలో ఆచార్యుల వారికి బ్రహ్మరథ సత్కారం అందించినారు.
లెక్కకు మిక్కిలి పురస్కారాల స్వామి వారు పొంది ఆదర్శనీయులుగా నిలిచారు.
సత్సంప్రదాయ పరిరక్షణ సభ
శ్రీమాన్ ఆచార్యులవారు అధ్యక్షులుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారు గౌరవాధ్యక్షులుగా శ్రీమాన్ న.చ పట్టాభిరామాచార్యులు ప్రధాన కార్యదర్శిగా శ్రీ విశిష్టాద్వైత సంప్రదాయ సేవ రామానుజ సిద్ధాంత ప్రచారం కొరకు సత్సంప్రదాయ పరిరక్షణ సభను ప్రారంభించారు. ఈ సభ ద్వారా
సుమారు 50 పుస్తకాలను సినిమా ఆచార్యులవారు రచించి ప్రకటించారు. ఇందులో చాలా గొప్ప గ్రంథం శ్రీ వైష్ణవ వైజయంతి. శ్రీమాన్
ఆచార్యుల వారి శ్రీ విష్ణు సహస్రనామ ఆంధ్ర వ్యాఖ్యాన గ్రంథం ఈ సంస్థ ద్వారానే ప్రకటితం కావడం విశేషం.
ఈ సత్ సంప్రదాయ పరిరక్షణ సభ కు ప్రస్తుతం
శ్రీమాన్ సముద్రాల
శఠగోపాలా చార్యులవారు ప్రధాన కార్యదర్శిగా ఉండి సంప్రదాయ గ్రంథ ప్రచురణ పండిత సత్కారాలు, ఉభయ వేదాంత సభలు, గోదా గోష్టులను అనేకం నిర్వహిస్తూ స్వామివారి ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఆచార్య రఘునాథ దేశకుల వారి పేరిట ఇప్పటివరకు సంప్రదాయంలో శిఖరాయమానంగా వెలుగొందిన వారికి అలాగే సాహితీవేత్తలు కవి పండితులకు శ్రద్ధ శతాధిక పురస్కారాన్ని అందించటం విశేషం. వరంగల్ ఎస్సార్ కాలేజీ వ్యవస్థాపకులు శ్రీమాన్ వరదారెడ్డి గారు ఈ సభకు అధ్యక్షులుగా ప్రస్తుతం ఉండి నడిపిస్తూ ఉండటం స్వామి వారి పైన ఉన్న వాత్సల్యం మాత్రమే. స్వామివారి ఈ సంవత్సరం
శత జయంతి సందర్భంగా అనేక విశేషమైన కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఆచార్యుల వారి సంపూర్ణమైనటువంటి సాహితీ, సంప్రదాయ, కుటుంబ, రచన, ఆలయాల జీర్ణోద్ధరణ
యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ శ్రీ వైష్ణవ సంప్రదాయ విస్తరణ లాంటి విశేషాలతో ఆచార్యుల వారి కుమార్తె శ్రీమతి
కిడాంబి గోదాదేవి గారు అల్లుడు శ్రీమాన్ రఘుపతి గారు చరితం రఘునాథస్య అనే పేరుతో ఒక ప్రత్యేక గ్రంథాన్ని తీసుకురావడం. చాలా ఆనందదాయకం
శ్రీమాన్ రఘునాథ ఆచార్య స్వామి వారు తేదీన 13.10. 2018
న పరమపదం వేంచేశారు.
ఆచార్యుల వారి జ్ఞాపకాలలో
ఆచార్య స్వామి వారు తరతరాల వారు తరించటానికి అవసరమైన మార్గాన్ని దర్శింపచేసే సద్గ్రంధాలను ఎన్నింటినో రచించి మనకు అందించారు. వారి మార్గంలో మనం నడవడం తప్ప వారిని సదా జపించుతూ ముందుకు వెళ్దాం.
(మహా మహోపాధ్యాయ కవిశాబ్దికకేసరి శాస్త్ర రత్నాకర శ్రీ వే శ్రీమాన్ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథచార్య స్వామి వారి శతజయంతి సందర్భంగా)
పుట్టడం సహజం
చావడమూ అంతే
మధ్యకాలo అర్ధయ్యేసరికి
కళ్ళముందు పొద్దువాలి పోతుంది!!
ఈ మధ్యలో
ఎన్ని అక్షరాలు చెక్కాడో
అవే చరిత్రలో నిలబడే సూచీ స్తంభాలు!!
పూలదండలు
పురస్కారాలు పొగడ్తలు
కవికి కొత్త ఊపిరియే కానీ
ఊనిక కాదు కొలమానాలు కావు
దినపత్రిక మీద మురిపించే
ఒక రోజు బాక్స్ ఐటమ్ !!
కవి అంతిమయాత్ర లో
అతని పద్యాలలోని
పాదాలు గులాబీ రెక్కలై వీధుల గుండా చల్లబడుతాయి!
సిరచుక్కలు ఇకపై
గడ్డ కట్టుకుని పోతాయి
జీవితం శూన్యమా అన్నట్టు
కవి గారి డైరీ చివరి పేజీ అసంపూర్తి
గా బిగుసుకు పోతుంది!
ఆయన పుస్తకాలు పార్థివ దేహం దగ్గర
తలగడయై, కృతజ్ఞతగా ఒదిగి ఉంటాయి!
ఎవరో ఒకరు, పుటలు తెరిస్తే, బావురుమంటాయేమో ?
అంజలి ఘటిస్తూఎవరో అస్పష్టంగా చెప్పిన అమర్ రహే
పదాలు
డోలాయమానమై గాల్లో
ఊగిసలాడుతూనే ఉంటాయి !
ఒంటరిగా..
జై కొట్టే లోగొంతుకలయినా లేక!
కవీ!! బతికి ఉన్నన్ని నాళ్ళు
పుస్తకాల్లో తల ఇముడ్చుకుని
కూర్చున్నావు
ఇప్పుడు నీ గేయం మీద
జ్ఞాపకానివై నిలబడ్డావు!
ప్రజాస్వామ్యం కొరకు
శిర మెత్తి అన్యాయం మీది అరిచిన అరుపులు
నిరసన చెణుకులు క్రమంగా కవి కులం నుండి వెలివేయబడతాయి!
అయినా కవీ
నీ కలం లో పుట్టిన
పదాలు మౌన
విస్పోటనాలు!
దాని
అణుధార్మికత
మెదళ్ళలో
మెల్లిగా మొదలౌతుంది!
కవీ!
శబ్దసంపదను పెంచుకోవాలి- అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి – డా.గండ్ర లక్ష్మణ రావు
డా.గండ్ర లక్ష్మణ రావు గారితో ముఖాముఖి
కే.ఎస్ : నమస్కారం సర్
గండ్ర : నమస్కారం అనంతాచార్యా
కే.ఎస్. .మీది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం.పంటలు, పశువులు ఆ నేపథ్యం లోంచి పద్యం పట్ల సాహిత్యం పట్ల అభిరుచి ఎట్లా మొదలయింది. ? బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఎవరి ప్రభావం వల్ల మొదలయింది.?
గండ్ర : మాది పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. మా బాపు చదువుకున్నవారు. ఆరోజుల్లో మూడవ తరగతి అనుకుంటా. కాని భారత, భాగవత , రామాయణాలుచదివేవారు, వాటిలోని అనేక కథలు రాత్రులు కల్లాల దగ్గర చెపుతుండేవారు. సాయంకాలాలు ఇంటి ముందర కూచొని వచ్చినవాళ్ళతో అవీ ఇవీ మాట్లాడుతూ ఏదో ఒక కథ వాటిల్లోంచి చెపుతుండేవారు. వేసవికాలం రాత్రులు ఆరుబయట మంచంలో పడుకొని పద్యాలు వల్లెవేయించేవారు. హరియను రెండక్షరములు వంటి భాగవత పద్యాలు నోటికి చదివించేవారు.
మా ఇంటి వెనుక తోటలుండేవి. వాటికి మోటలు కొట్టి నీరు పారించేవారు. అప్పుడు పాలేర్లు పోటీలు పడి పాటలు పాడేవారు. ఇంటికి వచ్చిన రకరకాల బిచ్చగాళ్ళు పదాలో పాటలో పాడేవారు. ఇవన్నీ చిన్నప్పుడు నన్నాకర్షించాయి. ఊరిలో కొందరు పద్యాలు, పాటలు కీర్తనలు చదివేవారుండేవారు. ఆయా సందర్భాలలో వారిని చూశాను. విన్నాను. హరికథలు , బుడిగ జంగమవారి కథలు, చిరుతల రామాయణం నాటకాలు, భాగవత నాటకాలు మొదలైనవి మా ఊరి వారే ప్రదర్శించేవారు. ఇంట్లో మా అమ్మ దగ్గరనుంచి ఇంటి చుట్టు ఉన్నవారు ఇతరులు అనేక సందర్భాలలో మాట్లాడే మాటాల్లో దొర్లే సామెతలు బాగా ఆకర్షించేవి. ఇట్లా అనేకానేక గ్రామీణ సాంస్కృతిక వాతావరణం నాకు తెలియకుండా నన్ను సాహిత్యం వైపు మళ్ళించింది. నా చిన్నతనంలో మూడవ తరగతి, నాలుగ తరగతిలో నా చేత వారు రాసిఇచ్చిన ఉపన్యాసాలు ఇప్పించేవారు. నేను బాగా చదివి నిర్భయంగా నోటికి చెప్పేవాడిని అదే నన్ను ఇప్పుడు వేదికలమీద నిలబెట్టింది.
కే.ఎస్, అకాడెమిక్ గా బి.ఎస్.సి గణితం చదివిన మారు సాహిత్యం వైపు ఎట్లా మరలారు? అట్లా సాహిత్యం వైపునకు రావడానికి దిక్సూచి ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? ..
గండ్ర : నేను చిన్నప్పటి నుండి గణితంలో చురుకుగా ఉండేవాడిని. మా ఊరులో చదువుకునేటప్పుడు వేమన పద్యాలు, సుమతి పద్యాలు చెట్ల కింద కూర్చోబెట్ట వల్లింప జేసేవారు. బాల ప్రసాద్ అనే టీచరు మా ఇంట్లోనే ఉండేవారు. ఆయన సాహిత్యం పట్ల అభినివేశం గలవారు. మాచేత మాటలు, పాటలు, పద్యాలు చదివించేవారు. నాటకాలు వేయించేవారు. హైస్కూలులో తెలుగు అధ్యాపకులు పలుగులు భూమారెడ్డి పద్యాలు చాలా అందంగా చదివేవారు. డిగ్రీ చదివేటప్పటికే గణితంతో పాటు సాహిత్యం మీద రుచి పెరిగింది. పి.యు.సి.చదివేటప్పుడు మా కాలేజికి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు, డా. సి.నారాయణ రెడ్డ గారు వచ్చారు, గొల్లపూడి మారుతీరావు వచ్చారు, ఇట్లా నాలో అంకుర రూపంగా ఉన్న సాహిత్యాభిలాషకు ఈ అన్ని సన్నివేశాలు నీరుపోసి పెంచాయి. డిగ్రీలో ఉండగా 1969లో సెకండ్ ఇయర్. తెలంగాణ నాన్ ముల్కీ ఉద్యమం వచ్చింది. ఒక సంవత్సరం కళాశాలలు మూతపడ్డాయి. ఆ సంవత్సరమంతా నేను విపరీతంగా సాహిత్యం చదివాను. అందుకు దోహదం చేసింది, ప్రోత్సహించింది, ఏవి చదవాలో చెప్పిన వారు కోవెల సంపత్కుమారాచార్యులు. అప్పుడు వారు మాకు తెలుగు ఉపన్యాసకులు. వట్టి గాలి చదువునుండి అచ్యమైన సాహిత్యం వైపు మళ్ళించిన వారు సంపత్కుమారగారు. అప్పుడే విశ్వనాథ, అడవిబాపిరాజు,కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ,ఆరుద్ర, దాశరథి, కాళోజి( జీవనగీత), బాపురెడ్డి మొదలైన వారిని అత్యంత ఆసక్తితో అభిమానంతో చదివాను. అంతేకాదు సింహాసన ద్వాత్రింశిక, హరవిలాసం, ప్రభావతీ ప్రద్యుమ్నము, కళాపూర్ణోదయము మొదలైన ప్రబంధాలు చదివాను. ఆరుట్ల భాష్యాచార్యులుగారు మాకు మరో తెలుగు ఉపన్యాసకులు వారి వద్ద చనువుతో అనేక విషయాలు అడిగి తెలుసుకునే వాడిని. అప్పుడు మా ప్రిప్పిపాల్ కొండలరావుగారు. అయన ప్రతి సబ్జుక్టులో వారం వారం సెమినార్లు నిర్వహించే వారు. శ్రీశ్రీ పై జరిగిన సెమినార్ లో నేను ప్రసంగం చేశాను. నాకు హైస్కూలునుండి సహవిద్యార్థి మిత్రులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య నేను కలిసి ఆముక్త మాల్యద, మనుచరిత్ర ,వసుచరిత్ర వంటివి వేదం వారి టీకాతో ఉన్నవి కలిసి చదివాం. అట్లా గణితం మీదనుండి తెలుగుకు ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది.
కే.ఎస్…సీరియస్ గా సాహిత్యం చదువుకున్న మీరు అధ్యయనం,అధ్యాపనం, సృజన మూడింటిని ఎట్లా సంయమనం చేశారు? మూడింటిని ఎట్లా సమాంతరం చేశారు?
గండ్ర : అధ్యయనం నా నిత్యజీవితంలో భాగమయింది. ఇప్పటికీ రోజూ ఏదో ఒక పుస్తకం చదువకుండా ఉండలేను. అధ్యాపనం కోసం కూడా పుస్తకాలు చదివేవాడిని. పాఠం చెప్పడం కోసం ఆయా పాఠాలు ఉన్న కావ్యాలు, కవుల గురించి అధ్యయనం చేసేవాడిని. ఎం.ఏ లో ఆచార్య దివాకర్ల వేంకటావధాని, డా. సి.నారాయణ రెడ్డి, జి.వి. సుబ్రహ్మణ్యం వంటి వారు ఎన్నెన్ని పుస్తకాలు ఉటంకించేవారో చూసి ఆశ్చర్యమనిపించి అట్లా అనేక రచనలు చదవాలని అధ్యయనం పట్ల మరింత ఆసక్తి కలిగింది. ఎన్నిసార్లు చెప్పిన పాఠమయినా క్లాసుకు పోయే ముందు తప్పక మరోసారి ఇంటి దగ్గరైనా చదివేవాణ్ణి. ప్రతిసారి కొత్త విషయాలు స్ఫురించేవి. అవి అధ్యయనం వల్ల కలిగిన మేలు. అధ్యాపనం నాకు చాలా ఇష్టమైన వృత్తి. పాఠం చెపుతున్న ప్రతి గంటా నా ఆయుస్సును పెంచుతుంది,,,,, అని నేను ఒక కవితలో రాసుకున్నాను. నా ఆరోగ్య రహస్యం ఏమిటని చాలామంది అడుగుతారు. ఒకటి అధ్యయనం, రెండవది అధ్యాపనం. వీటిలో మురిసపోయిన నేను సృజన వైపు చాలాకాలంగా దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడు మాత్రమే రాసేవాడిని. మూడింటిలో రెండింటికే ఎక్కువ ప్రాధాన్యత. తరువాత అధ్యాపకుడి మలిథలో సృజనవైపు ఎక్కువ దృష్టి పెట్టాను.
కే.ఎస్……సాహిత్య సంస్థల నిర్వహణలో మీ పాత్ర గొప్పది. అధిక సమయం వెచ్చించారు. అది మీ సృజనాత్మక పైన ఎంత వరకు ప్రభావం చూపించింది? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు?
గండ్ర : కరీంనగర్ లో 1978లో పనిచేస్తున్నప్పుడు మా సహచర ఉపన్యాసకుడు డా. గోపు లింగారెడ్డి జానపద సాహిత్య పరిషత్ రాష్ట్ర కార్యదర్విగా కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పుడు నాయని కృష్ణకుమారిగారు అధ్యక్షులు. కరీంనగర్లో ఆయన నిర్వహించే కార్యక్రమాలన్నిటిలో నన్ను భాగస్వామిని చేయడమే కాక జిల్లా కార్యదర్శిగా పెట్టారు. వాటితో పాటు ఆయా కవులు జయంతుల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సమయానికి రావలసిన ప్రసంగం చేయాల్సిన వారు రాకపోతే నా చేత మాట్లాడించేవారు. తరువాత నూకలమర్రి గంగయాచారి కరెంటు ఆఫీసుల పనిచేసే అతను సమతా సాహితి అని ఏర్పాటు చేపి నన్ను, డా.బి. దామోదర్ రావును, డా.డింగరి నరహరి ఆచార్యను, త్రిపురారి సోమేశ్వర శర్మను, పర్శరామారావును, గజేందర్ రెడ్డిని కార్యవర్గ సభ్యులుగా నియమించి ఆయన స్వయం సౌజన్యంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఒక విధంగా మా సమయమంతా ( కాలేజి అయినాక) వాటికే గడిచిపోయింది, .. సాహితీ గౌతమి ఏర్పాటు, సినారె పురస్కారం ఏర్పాటు ఆయా కార్యక్రమాలు , అప్పుడే సమైక్య సాహితి , మాడిశెట్టి గోపాల్, కె.ఎస్‌అనంతాచార్య ప్రారంభించడం ఇట్లా కరీంనగరం సాహిత్య వాతావరణాన్ని పెంచాయి. ప్రతి సాహిత్య కార్యక్రమంలో నేను నిర్వాహకుడిగానో, వక్తగానో, ఆయా పనులు చేసేవాడిగానో పాల్గొనని సందర్భం లేదు. ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం తప్పనిసరి అయింది. నెహ్రూ యువకేంద్ర విద్యాసాగర్ రావుగారు కో ఆర్డినేటర్ గా అనేక కార్యక్రమాలలో మమ్ములను భాగస్వాములను చేశారు. మా సహోపన్యాసకులు పార్వెళ్ళ గోపాల కృష్టగారు అవధానాలు చేశారు.సమతాసాహితి, సాహితీ గౌతమి సంస్థలకు అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పనిచేశాను, ఈ కార్యక్రమాల, సంస్లల నిర్వహణ నా సృజనాత్మక దృష్టికి ఆటంకమే అయినాయి. మిత్రులు కూడా మీరు ఈ పనులు మానేస్తే చాలామంచి కవిత్వం, రచనలు చేస్తారు అని అంటుండేవారు. అయితే నా రచనలే కాదు ఎంతో సాహిత్యం ఉంది, అది అధ్యయనం చేసే ఒక ప్రేరణ కలగాలని, కొత్త వారికి సాహిత్యం పట్ల ఉత్సాహం కలిగించాలని ఎక్కువ ఆరాటపడ్డాను.
కే.ఎస్…..కవిత్వంలో నీవు అనే ఆది మకుటంతో శతకం రాశారు. ప్రయోగాత్మక మయిన ఆ శతకం గురించి వివరించండి. తెలుగు సాహిత్య ప్రపంచంలో దానికి లభించిన స్థాన ఏమిటి?
గండ్ర : పద్యం చదవడం, అంటే ఇష్టపడే నేను పద్యాలు రాస్తుండే వాడిని. డిగ్రీలో ఉన్నప్పుడే నేను అనుమాండ్ల పద్యాలు రాశాం. ఎం.ఏ లో జి.రామశేషయ్య నేను ఒకే గదిలో అద్దెకు ఉండి కలిసి చదువుకునేవాళ్ళం. అప్పుడు మేం పద్యాలురాశాం. కృష్ణాపత్రికలో అచ్చయినాయి. మళ్ళీ చాలాకాలానికి పద్యాలు రాశాను. అయితే అప్పటికే ఉపనిషత్తులు అధ్యయనం చేయడం వాటి గురించి వ్యాఖ్యానాలు, భాష్యాలు వినడం చదువడం నన్ను బాగా ప్రభావితుడ్ని చేశాయి. అట్లా తత్వమసి అనే భావనను తెలుగులో నీవు అనే పేరుతో సంబోధించి కొన్ని పద్యాలు తాత్విక భావనతో రాశాను. అందులో మిగతా శతకాల వలె ఏ దేవుని సంబోధన గాని, పేరుగాని ఉండదు.తత్వం మాత్రమే ఉంటుంది. ఆ విషయం కొంత కష్టమే, దాంతో పాటు నీవు అనేది నొక్కి చెప్పాలని ప్రతి పద్యం అట్లే మొదలయితే బాగుంటుందని అనుకొని అట్లారాశాను. అప్పుడు ఛందోపరమైన ఇబ్బందులున్నాయి. కాని వాటిని అదిగమించ గలిగాను. అది కూడా వీలయినంత వరకు తెలుగులోనే, సంస్కృత సమాస ప్రయోగాలు లేకుండా చేశాను.
ఈ శతకానికి చాలా ప్రశంస వచ్చింది. మా రామశేషయ్య బాగా ప్రోత్సహించాడు. తరువాత మాదిరాజు బ్రహ్మానందం, గిరిజామనోహరబాబు, సంగనభట్ల నరసయ్య వంటి వారు అమితంగా ఆదరించారు. కపిలవాయి లింగమూర్తిగారు, సముద్రాల లక్ష్మణయ్యగారు, కోవెల సుప్రసన్నగారు అభినందించి ఆశీర్వదించారు. తెలుగులో ఏకప్రాస శతకాలు గతంలో ఒకటి రెండు వచ్చాయిగాని ఆది మకుటంతో రాలేదు. ఇదే తొలి ప్రయోగం. మహామహోపాధ్యాయ, పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారథిగారు ఈ శతకాన్ని చదివి పాతిక పైగా ప్రశంసా శ్లోకాలు రాశారు.అంత బాగున్నాయి పద్యాలు అని మెచ్చుకున్నారు. మహామహోపాధ్యాయులు అవధాని శ్రీ తిగుళ్ళ శ్రీ హరిశర్మగారు సంస్కృతంలోకి అనువాదం చేస్తున్నారు.
కే.ఎస్…. పద్యంతో పాటు ముగ్గు, వర్తమాన సంధ్య, శతద్రు లాంటి వచన కవిత్వం కూడా రాశారు. ఆధునిక ప్రాచీన సాహిత్యాలలో మీరు దేనిని ఎక్కువ ఇష్ట పడతారు? ఏది రాయడం మీకు సులువు, అభిమానం?
గండ్ర : కవిత్వం పద్యమైనా, గేయమైనా, వచన కవిత్వమైనా ఇష్టమే. వచన కవిత్వం ఈనాడు ప్రాచుర్యంలో ఉన్న రూపం. నేను కూడా అట్లా వచన కవిత్వం రాశాను. సంపత్కుమార వంటి వారితోపాటు సినారె, శేషేంద్ర, కాళోజి మొదలైన వారి అధ్యయనం ప్రభావం ఎక్కువ.
ఏది సులభం అని ఏమీ లేదు. నిజం చెప్పాలంటే కవికి ఒక భావన వచ్చినపుడు అది తన రూపాన్ని తానే ఏర్పరుచుకొని బయటికి వస్తుంది. ఆ రావడం ఒకసారి గేయంగా కావచ్చు, పద్యం గా కావచ్చు, వచనంగా కావచ్చు. తనంతగా వచ్చిందే సరిగ్గా ఆ భావానికి తగిన రూపమవుతుంది. ఈ భావాన్ని నేను పద్యంలో చెపుతాను, వచనంలో చెపుతాను అని అనుకొని రాయడం కృత్రిమమే అవుతుంఇ. నీవు కవీంద్రులన్ కవివి…. అని ఉత్పలమాల ఛందస్సులో ఆరంభం వచ్చిందంటే మిగతాది అందులో కుదిరిపోతుంది. నేను పనిని ప్రేమిస్తాను…. అని వచ్చింది వచనకవిత్వమే అది అందులోనో సరిపోతుంది…. భావానికీ రూపానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. నేను పద్యాలు, వచన కవిత్వం రెండూ విరివిగా చదివిన అనుభవం ఉండటం వల్ల ఏది ఎట్లా వస్తుందో అట్లా రాశాను. శతద్రులో వట్టి వచనంలాంటి వాక్యాలు అట్లే ఉంచాను. వాటిని విరగ్గొడితే కవిత్వం కాదు. వాటిలో కవితా లక్షణముంటే అది కవిత్వమవుతుంది.అది వచనమైనా పరవాలేదు.
కే.ఎస్…..కవి సమ్రాట్ విశ్వనాథ నవలపై మీరు పరిశోధన చేశారు, దాంతో మీరు విశ్వనాథ అభిమానులు, ఆయన శిష్యులకు ప్రతిరూపం అంటారు మిమ్మల్ని, మీరెట్లా భావిస్తారు?
గండ్ర : విశ్వనాథను నేను చదువుకునే రోజుల్లో బాగా చదివాను. ముఖ్యంగా నవలలు వేయిపడగలు, సముద్రపుదిబ్బ, శార్వరి నుండి శార్వరిదాక, కుణాలుని శాపము, దమయంతీ స్వయం వరం, చెలియలి కట్ట , ఏక వీర ఇట్లా ఎన్నో , పైకి చదివితే మా తో పాటు రూంలలో ఉన్న విద్యార్థులు, మా ఇంటి ఓనర్లు చదువురాని వారు కూడా విని రోజూ చదువుమనే వారు. ఆవిధంగా విశ్వనాథ పై అభిమానం కలిగింది. కాకతీయలో ఏ అంశం పై చేస్తావన్నప్పుడు ఏ ఆలోచించకుండా వేయిపడగలు అన్నాను. అప్పటికి దానిగురించి ఇది చేయాలని అనుకోలేదు. అంతగా మనసులో పడింది.
జువ్వాడి గౌతమరావుగారు రామాయణ కల్పవృక్షం చదువుతుంటే ఎంతో మంది వచ్చి వినేవారు. లక్ష్మణ యతీంద్రులు,ఏలూరి పాటి అనంతరామయ్య,శ్రీలక్ష్మణ మూర్తి, బేతవోలు రామబ్రహ్మం, చేకూరి రామారావు, కోవెల సుప్రసన్న, సంపత్కుమార, విశ్వనాథ పావని శాస్త్రి , వాకాటి పాండురంగారావు, అనుమాండ్ల భూమయ్య స్థానికంగా పార్వెళ్ళ గోపాల కృష్ణ …. వారి ఇంటిలో ఉంటూ రోజులకొద్తీ వినేవారు. వారిలో నేను కూడా ఒకడిని. అట్లా విశ్వనాథ పద్యకవిత్వం పట్ల కూడా అభిమానం కలిగింది. తరువాత విశ్వనాథ పద్యకావ్యాలు చదివాను ,సదస్సులలో వాటిపై పత్రసమర్పణలు చేశాను. కరోనా కాలంలో అంతర్జాలం మాధ్యమంగా మిత్రుల కోరికపై రెండున్నర సంవత్సరాలు రామాయణ కల్పవృక్షం లోని పన్నెండు వేల పద్యాలకు వ్యాఖ్యానం చెప్పాను. విశ్వనాథ సాహిత్యం పట్ల నాకు గల పరిచయాన్ని బట్టి నన్ను విశ్వనాథ అనుయాయి అని పిలుస్తుంటారు.
కే.ఎస్….. విశ్వనాథలో ప్రధానంగా మీకు నచ్చిందేమిటి? భాషనా? ఆధ్యాత్మికతనా? భావ వ్యక్తీకరణనా వివరించండి?
గండ్ర : విశ్వనాథ సాహిత్య క్షేత్రంలో పండించని పంటతేదు. అని వాడుక.ఒక్క వచన కవిత్వం జోలికి పోయినట్లు లేదు. కవిత్వం, నవల, నాటకం, కథ, విమర్శ వంటివాటిని సమర్థవంతంగా సాధికారికంగా అనితర సాధ్యంగా రాశారు. మధ్యాక్కరల వంటి ప్రయోగాలు కూడా నాకు ఇష్టంగా అనిపించేవి. నేను 6, 7 తరగతులలో ఉండగా మా బాపు విశ్వనాథ మధ్యాక్కరలు చదువడం చూశాను. అందులో ఒకచోట నాబిడ్డ ఈ కైత, దీని శోభాన గూడ వత్తురు …. అనే పదాలు పాదాలుచూసిన గుర్తు. అప్పుడప్పుడు మా బాపు ఎవరితోనైనా చెపుతున్నప్డుడు విశ్వనాథ సత్యనారాయణ కవిసమ్రాట్ కరీంనగర్ కాలేజి ప్రిన్సిపాల్… అనేవారు. ఆ మాటలు నాకు జ్ఞాపకం. ఆయన రచనలలో విశేషమేమిటంటే ఒకటి నచ్చితే అన్నీ నచ్చుతాయి. లేకపోతే ఏదీ నచ్చదు. గౌతమరావుగారు చెపుతుండే వారు ఆ రుచి తెలిసిన తరువాత మరేదీ అంతగా రుచించదు అని .
ఆయన ప్రతి రచనలోను ఒక వేదన ఉండేది. పైకి మాత్రం అవి కథలుగా నవలలుగా కావ్యాలుగా కనపడతాయి. కాని సమాజం పట్ల, దేశం పట్ల సంస్కృతి పట్ల అమితమైన అభిమానం అది క్రమంగా నశిస్తున్నదన్న వేదన అంతటా కనపడుతుంది. అది ఆయనను సంప్రదాయ వాదిగా ప్రచారం చేశాయి. కాని ఆధునికమైన దేనికీ వ్యతిరేకి కాదు. నవీనమైన ప్రతిదాన్ని స్వాగతిస్తాను. ఎంతవరకైతే మూలం చెడకుండా ఉంటుందో అంతవరకు అనేది ఆయన నిశ్చయం. భాష పాషాణ పాకం అనేది కూడా ప్రచారమే. రామాయణం చెపుతున్నప్పుడు చాలామంది ఇంత బాగా తేలికగా ఉందికదా? ఎంత గ్రామీణ జీవితం ఎన్ని జాతీయాలు, ఎంత వ్యవహార లక్షణం, ఎంత లోకం రీతి …అన విన్న మీవంటి ఆధునికులు, తెలుగు పండితులు, ఆనందించారు. అయితే ఆయన వ్యక్తీకరణ , శైలి ఆయనదే. లక్షపుటలు రాసినా ఒకరి ఎంగిలి లేదు, అని ఆయనే చెప్పుకున్నాడు.
కే.ఎస్….. మీరు విమర్శనా రంగంలో కూడా కృషి చేశారు. వర్తమాన తెలుగు విమర్శ ఎట్లా ఉంది? మీకు నచ్చిన విమర్శకులు ఎవరు? ప్రస్తుతం వస్తున్న సమీక్షలు, విమర్శలు, అర్థవంతంగా ఉంటున్నాయా? నిర్మాణాత్మక సూచనలు ఏమయినా చేయండి.
గండ్ర : కొందరు కవుల కవిత్వాన్ని గురించి, పుస్తకాల గురించి సాహితీ వనమాలి అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురించాను,నిజానికి అంతకు కొన్ని రెట్ల వ్యాసాలు, ప్రసంగాలుఆయా పత్రికలలో సంచికలలో ముద్రితాలున్నాయి. విమర్శను కవి అంతరంగాన్ని బట్టి ,కావ్యంలో కవి చెప్పినదాన్ని బట్టి ఎక్కువగా విమర్శించాను.
ఈ రోజుల్లో సమీక్షల విమర్శలు అనే అభిప్రాయం పెరిగిపోయింది. విమర్వలో ప్రాచ్య పాశ్చాత్య విమర్శాధోరణులు, ప్రమాణాలు, సిద్ధాంతాలు ఎన్నో వచ్చాయి. వాటి అవగాహనతో విమర్శ చేస్తున్న వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆచార్య కోవెల సుప్రసన్న, ఆచార్య బేతవోలు , డా. సంగనభట్ల నరసయ్య, ఆచార్య అనుమాండ్ల, , నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, కే.పి.అశోక్ కుమార్, యం. నారాయణ శర్మ, లక్ష్మణ చక్రవర్తి, జి.లక్ష్మీ నరసయ్య వారాల ఆనంద్ లవంటి వారు కొంతమంది విమర్శను గురించి తెలిసి విమర్శలు చేస్తున్నవారు.
కే.ఎస్… ఖలీల్ జిబ్రాన్ ది మ్యాడ్ మ్యాన్ పుస్తకాన్ని తెలుగులో వెర్రి మానవుము పేరుతో తెలుగులో అనువదించారు. ఇప్పుడు అనువాద అవసరాన్ని వివరించండి.
గండ్ర : అది అనుకోకుండా జరిగింది. ఒకరోజు ఐ పాడ్ లో ఏదైనా పుస్తకం చదువుదామని రైటర్ ఆప్షన్లో ఖలీల్ జిబ్రాన్ నొక్కాను. చాలా పుస్తకాలు వచ్చాయి. ఎందుకో మాడ్ మాన్ చదువాలనిపించి చదివాను. వెంటనే తెలుగులో రాస్తే బాగుంటుందని మూడు రోజుల్లో అనువాదం చేశాను.
ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో అనేక గొప్ప రచనలున్నాయి. వాటిని అనువాదం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎందరో చేశారు. ఇప్పటికీ ఆ పని చేయాలి. వారాల ఆనంద్ ఇరుగుపొరుగు పేరుతో దేశంలోని విదేశాలలోని కవులను తెలుగులో అనువాదం చేస్తూ పరిచయం చేస్తున్నారు. అనువాదం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న కవితా ధోరణులు తెలియడంతో పాటు మానవుని ఆలోచనా విధానం, జీవన సంస్కృతి, దేశవిదేశాల పరిస్థితులు ఎన్నో వ్యక్తమై పాఠకుడిని విశాలం చేస్తాయి.
కే.ఎస్. ఏడు పదుల వయసులో మీరు అవధాన రంగంలో ప్రవేశించారు. అవధాన అవసరాన్ని మీ అనుభవాల్ని గురించి చెప్పండి.
గండ్ర :…. పద్యాలు కావ్యాలనుండి అలవోకగా సభలలో చదువడం, అప్పుడప్పుడు పద్యాలు ఆశువుగా చెప్పడం చూసిన మిత్రులు వేణుశ్రీ మీరు అవధానం చేస్తారు అని కరోనా కాలంలో నాకు రొజూ సమస్యలూ, దత్తపదులూ, వర్ణనలూ ఇచ్చి రాయమన్నారు. నేను వెంటనే పూరణలు పంపాను. తరువాత మిత్రులు రాజారామమోహన శర్మ ఒకరోజు నిర్ణయించి అవధానం చేయుమన్నారు. పృచ్ఛకులను నిర్ణయించారు. అట్లా ప్రారంభైన అవధానం నాకు కూడా ఉత్సాహంగానే అపినించింది. ఈ అవధాన ప్రక్రియ తెలుగులో అపురూపమైనది. కరీంనగర్లో ప్రస్తుతం ఎవరూ లేరు. నన్ను చూసి ఎవరైనా యువ కవులు పండితులు ముందుకు వస్తారని , అందుకు ప్రేరణగా స్ఫూర్తిగా నిలువాలని అవధానాలు చేస్తున్నాను. ఇంత వరకు జరిగిన అవధానాలు ప్రేక్షకులను సంతృప్తిపరచాయి. అదే నాకు ప్రోత్సాహకంగా ఉన్నాయి.
కే.ఎస్…. గత యాభైఏళ్ళలో తెలుగు సాహిత్యంలో పలు వాదాలు వచ్చాయి. వాటిలో మీరు ఎటు వైపు?
గండ్ర : సామాజికమైన స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదం, ఇట్లాంటివి వచ్చాయి. వీటి ప్రభావంత తెలుగులో కవిత్వం, కథలు, వెలువడ్డాయి.ఈ వాదాలు కవిత్వంలో భాగమే కాని వాదాలే కవిత్వం కాదు. సాహిత్య వాదాలలో సంప్రదాయం, అభ్యుదయం వంటి వాదాలు వచ్చాయి. మా గురువుగారు సినారె గారి వలె సంప్రదాయం జీర్ణించుకున్న ప్రయోగాన్ని, ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని, నేను ఇష్ట పడతాను.
కే.ఎస్…భువన విజయం నాటకం రాశారు. దాని వివరాలు చెప్పండి?
గండ్ర :…. ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయల పంచశతి ఉత్సవాలు జరుగుతున్నాయని నంది శ్రీనివాస్ , గాజుల రవీందర్, మీరు నన్ను కలిసి భువనవిజయం నాటకం వేద్దామనుకుంటున్నాం మీరు సహాయం చేయండి అని అడిగారు. సరే నన్నాను. తీరా దానికి తగిన రచన (స్క్రిప్టు) లేదన్నారు. రెండుమూడు రోజులలో కావాలన్నారు. ఆ రాత్రి కూర్చొని అష్టదిగ్గజ కవులు, రాయలు, మంత్రి, నరసరాజు వంటి పాత్రలతో పద్యాలు మాటలు కలిపి నాటకం రూపొందించాను. రెండు రోజులు ఆయా పాత్రలు అభ్యాసం చేసి ప్రదర్శన ఇచ్చాం. అందులో నేను తెనాలి రామకృష్ణుని పాత్ర ధరించాను. ఒకవైపు హాస్యం పండిస్తూ మరో వైపు ఆయా పాత్రధారుల లోపాలు సరిచేస్తూ నాటకం రక్తి కట్టించాం. ప్రముఖ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ నాటకాన్ని చూసి అభినందించారు.
కే.ఎస్. : మీ అధ్యాపకత్వంలో ఎందరో శిష్యులను తయారు చేశారు? అధ్యాపకానుభవం గురించి , నేటి విద్యావ్యవస్థ గురించి చెప్పండి? సాహితీ సాంస్కృతిక రంగం వైపు పిల్లల్ని ఎట్లా ప్రోత్సహించాలి?
గండ్ర : అందరూ కోట్లు సంపాదించి ఆనందిస్తే నేను శిష్యకోటిని సంపాదించాను అని గర్వంగా చెప్పుకుంటాను. ఎందరో శిష్యులు ఏ రంగంలో స్థిరపడిన వారైనా నా పాఠాలను గుర్తు చేస్తుంటారు. ఇక మీ వంటి వారు తెలుగు పండితులు కాకపోయినా తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తూ అద్భుతమైన సేవలందిస్తున్నారు. ఎందరో శిష్యులు తెలుగుపండితులుగా, ఉపన్యాసకులుగా, కవులు రచయితలుగా ఎదిగారు. తరువాతి తరాన్ని తయారు చేశాననే సంతృప్తి ఉంది. ఈ కాలం విద్యావిధానంలో సాంస్కృతిక రంగానికి కొంత ప్రాధాన్యత ఉన్నా ఎక్కువగా సినిమా పాటలు, జానపద గీతాలు నృత్యాలు వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భాష, వక్తృత్వము, కవిత్వము, సాహిత్యము వంటి వాటికి తక్కువ. ఆంగ్ల మాధ్యమం వచ్చిన తరువాత పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. భాష పట్ల అభిరుచిని కలిగించాలి. మంచి సంభాషణా చాతురిని, వాఙ్నైపుణ్యాన్ని కలిగించాలి. ఈ నాటికీ మాట్లాడడం, సరిగా సమాధానం చెప్పటం రాక ( తెలిసి) పోవడం భాషాలోపం. వ్యక్తిత్వ వికాసంలో భాగంగానైనా భాషను నేర్పించాలి.
కే.ఎస్…. నూతన కవులకు రచయితలకు మీరేమి చెపుతారు? ఏ సందేశం ఇస్తారు?
గండ్ర : ఎవరు చదివినా చదవక పోయినా ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. పుస్తకాలు వేస్తున్నారు. కొందరు సరికొత్త పద్ధతుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. కొందరు కవిత్వం కాని దాన్ని కూడా కవిత్వం అని మురిసి పోతున్నారు. కవులుగా దలచిన వారంతా అధ్యయనం చేయాలి. ప్రాచీనాధునిక కవులను బాగా చదువాలి. పదానికి అర్థాలు తెలియక ఏదో అనుకొని ఏవో పదాలు ప్రయోగిస్తున్న యువ నవ కవులు కూడా ఉన్నారు. శబ్దసంపదను పెంచుకోవాలి, అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి. ఎవరినీ అనుసరించకపోయినా ఆ అధ్యయనానుభవం తోడవుతుంది. ఒక పుస్తకం రాయగానే పురస్కారం రావాలని ఆశించడం వంటిది కూడా సాహిత్య రంగంలో అంత ఆశించదగినది కాదు.
ఎక్కువ మంది కవిత్వం రాయడం వల్ల తెలుగు భాష ఆయుర్దాయం పెరుగుతుందనే ఆశ మాత్రం కలుగుతుంది.
కే.ఎస్. ధన్యవాదాలు సర్.
వారాల ఆనంద్
వెన్నెల వెళ్ళిపోతున్నదని రోదిస్తూ కూర్చుంటే ప్రభాతాన్ని కోల్పోతావు….
కోల్పోయిన దాని గురించి కాదు,రాబోయే భవిష్యత్తు కొరకు, చైతన్య దీపం పట్టుకొని అడుగు వేయి అని చేయి పట్టుకుని నడిపించే కవిత్వం శ్రీ వారాల ఆనంద్ గారిది. ఒక కవి సాయంకాల వేళ పొంగుతున్న వెలుతురు ధారలను తీసుకొని కవితలు అల్లుతూ కూర్చుంటాడు, కవి సమయాలను ఉదయము సాయంకాలంలో, ప్రకృతిలోని పక్షుల ధ్వనులను, చెట్టు… వెతుకులాటలు తాను తిరిగి, కదిలే దృశ్యాలను తన సొంత ఊరి జ్ఞాపకాలను దారం చేసిన పల్లె రాగం వారాల ఆనంద్. మాట మైకు నుంచి రాలిపడే ఉపన్యాసపరంపర కాదు… మాట రెండు మనుషులను కలిపే ఆత్మీయ బంధంగా ఉండాలి. మానవ సంబంధాలు మరింత మెరుగుపడి ఆరోగ్య సమాజ నికి దోహదపడాలి, అని కోరుకునే ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా కవిత్వంతోనే కౌన్సిలింగ్ చేస్తారు, వారాల ఆనంద్ సర్
నేను సైతం అంటూ… మానేరు తీరాన నడిచి అందరికీ గుక్కెడు అనురాగ జలాన్ని అందించిన సున్నితత్వం ఆనంద్ సార్ ది.
గుల్జార్ ప్రముఖ సాహితీకారుడు, గీత రచయిత, కవితల్ని ఆకుపచ్చని కవితలుగా ఆనంద్ సార్ అనువదించి అనువాదకుడిగా అక్షరమక్షరం పచ్చదనంలో ముంచి, ఆత్మీయతా పూల పరిమళాలను పంచి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సొంతం చేసుకున్న కవి రచయిత. భారతీయ కవిత్వపు నాడిని పట్టుకున్న సాహితీ వైద్యులు సర్. యాదోoకి బారాత్…. పేరిట వాట్సాప్ లో వారం, వారం గా ఆదివారం పూట రాస్తూ రాస్తూ…… స్వీయ అనుభవాలు, నేర్చిన, తాను నేర్పిన పాఠాలు ప్రముఖులతో ములాఖత్, ఉద్యోగ జీవనం, విద్యార్థులతో తాను పెంచుకున్న బంధం, ఆరోగ్యం, మిత్రుల పరస్పర ఆదాన ప్రదానాలు, కాలేజీలో డిజైన్ చేసి నడిపించిన కోర్సులు, సినిమా మీద, కెమెరా, షూటింగ్, జర్నలిజం, ఒకటేమిటి పలు రకాలుగా పాఠాలు బోధించి… మార్గదర్శకత్వం చేసిన అంశాల మన ముందు ఉంచుతున్నారు.
తెలంగాణ పునర్నిర్మాణ వేళ…. మన సినిమా మన సాహిత్యం గొప్పతనాన్ని తెలుపుతూ… మానేరు గల గలలు, బంగారు తెలంగాణలో చలనచిత్రం
మనిషి లోపల, సొంతూరు, మెరుపు, నవ్య చిత్ర వైతాళికులు,
బాలల చిత్రాలు, తెలంగాణ దశ దిశ, పుస్తకాలను ప్రకటించి అచ్చుతెలంగాణ మనిషినని నిరూపించుకున్నారు వారాల ఆనంద్ సర్ అలాగే ఉద్యమానికి ఊపిరి పోసారు.
మృదుభాషీ స్మితభాషి హితైషి, సౌమ్యలు అయిన ఆనంద్ సర్, జీవితంలో ఆరోగ్యం దెబ్బతిని మూత్రపిండాలు రెండు పాడైన సందర్భంలో ఆందోళన నుండి ఉద్వేగం విచారణ నుండి కవిత్వాన్ని రాశారు. అది మనిషి లోపల… నా కలలు నీ కలలు ప్రోది చేసుకొని విశ్వంలోకి దూసుకెళ్ళు అంటూ… పునర్జన్మ పొందిన వారి కవిత్వం నిండా ఆత్మవిశ్వాసం, ఆశయే శ్వాసగా పునరుజీవనం పొందింది.
ఊహల రెక్కలు కట్టుకొని బాల్యం ఉదయం మీద వాలి చిన్నోడి ఇంగితాలను అక్షర రూపంలోపలకి మార్చి, ఆటలను భావచిత్రాలుగా రూపొందించి, చిన్నారి చిలిపితనాన్ని ముక్తకాలలో బంధించి, బాల సాహిత్యపు వెలుగులను దశ దశలా వ్యాపించేలా చేశారు వారాల సర్.
ఇరుగుపొరుగు పేరిట అనేక భాషల నుండి కవిత్వాన్ని తెలుగులోకి అనుసృజన చేసి అందిస్తూనే ఉన్నారు.
ఫిలిం సొసైటీలు యువత మూర్తిమత్వ వికసిత కేంద్రాలుగా భావించి, వాటి విస్తరణకు నడుము కట్టి విజయం సాధించినారు. దక్షిణ భారతదేశంలో బెంగుళూరు తర్వాత, కరీంనగర్లో ఫిలిం భవన్ నిర్మాణాన్ని పూర్తిచేసి జిల్లా కళారంగా అభిమానుల కలల్ని నెరవేర్చినారు. ఇప్పుడు కళా సాహిత్య కార్యక్రమాలకు అడ్డగా ఇది నిలిచింది.
సినీ విమర్శకులుగా, నంది అవార్డుల జూరి మెంబర్ గా, ఇండియన్ పనోరమా చిత్రాల ప్రదర్శనలో న్యాయ నిర్ణేతగా, కేరళ జాతీయ ఫిలిం ఫెస్టివల్ తో పాటు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు కూడా జూరీ మెంబర్ గా వ్యవహరించిన ఘనత వారిది. ఒక సాధికారికంగా సినిమాపై 24 ఫ్రేమ్స్ ను రాసిన వారాల ఆనంద్ సార్ మంచి సినీ విశ్లేషకులు.
సెన్సార్ బోర్డు మెంబరుగా, సినీసుమాలను పూజించి భారతీయ మహిళల మేధోసంపత్తి ఆలోచన ధోరణిలను ఆవిష్కరించిన సినీ సాహితీ విరించి.
వేములవాడ ఆలయ సంస్కృతి అక్కడ సాంబ కవిలాంటి వారి సాహిత్యాన్ని విని అధ్యయనం చేసి తెలంగాణ భాషకు మారుపేరైన సామల సదాశివ, సంస్కృత సాహిత్యానికి నిలువెత్తు నిదర్శనమైన శ్రీ భాష్యం విజయసారథి పై మూడు భాషల సాధికారికత కలిగిన ముద్దసాని రామిరెడ్డి లపై డాక్యుమెంటరీలను నిర్మించినారు. వేములవాడలో …. వ్యవస్థను చూపిస్తూ మరొక డాక్యుమెంటరీ, పైడి జయరాజ్, మిద్దె రాములు పైన ( మోనోగ్రాఫ్ ) నిర్మించినారు. రచయితగా దర్శకునిగా, దార్శనికతతో బాధ్యతాయుతంగా పనిచేసిన సృజన కారులు.
ఒక పాత్రికేయునిగా మొదలై టోరి రేడియో….. లో అనుసంధానకర్తగా ఎంతోమంది లబ్ద ప్రతిష్టులైన కవులు రచయితల నుండి వర్ధమానుల దాకా పరిచయం చేసి ప్రోత్సహించిన ఘనత వారికి దక్కుతుంది. గ్రంధపాలకునిగా, అభ్యుదయ భావాలతో, క్రమశిక్షణతో, అధ్యయనం నుండి రచనలు దాకా అదే కొనసాగింపు కనపడుతుంది.
ఇంకా గడపాల్సిన కాలము నడవాల్సిన దూరము చాలా ఉంది అంటారు ఆనంద్ సార్, మనము అనుకుంటున్నాం ఇంకా రాయాల్సింది, తీయాల్సింది, దర్శకత్వం వహించాల్సింది, విమర్శల్లో విప్పాల్సింది…. వారి చేతికి చాలా పని ఉంది.
కవి రచయిత సినీ విమర్శకులు డాక్యుమెంటరీల నిర్మాత పాత్రికేయులు ,సెన్సార్ బోర్డ్ మెంబర్ గా ఫిలిం సొసైటీల వ్యవస్థాపకులు గా, అనువాదకులు ఉద్యోగ నివృత్త గ్రంథపాలకులుగా, ఆత్మీయులుగా ఉన్న ఆనంద్ సార్ ని, కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్న తదుపరి శ్రీ కే.ఎస్.అనంతా చార్య చేసిన ఇంటర్వ్యూ.

నమస్తే ఆనంద్ సార్.
మయూఖ కోసం మిమ్మల్ని ఇంటర్వ్యు చేద్దామని, కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
తప్పకుండా సర్.
ప్రశ్న : కవిత్వం, కథలు, పిల్లల కథలు, సినిమా విమర్శ, డాక్యుమెంటరీల రూపకల్పన, ‘త్మ కథ’ ఇట్లా అనేక ప్రక్రియల్లో కృషి చేస్తున్నారు. ప్రభావంతమయిన రచనలు చేసారు. ఇన్ని ప్రక్రియల్లో రాయడం ఎందుకు, ఎట్లా మొదలయింది, ప్రేరణ ఏమిటి?
మీరన్న అన్నిప్రక్రియాల్లో వున్నవి రూప బేధాలే తప్ప మౌలికంగా అన్నీ కళాత్మక సృజన రూపాలే.
సృజనకారుడనేవాడు తనను తాను వ్యక్తం చేసుకోవాలనుకున్నప్పుడు ఇదిమిద్దంగా ప్రత్యేకంగా ఒక ప్రక్రియలోనే రాయాలని అనుకోడు. ఆయా సందర్భంలో పెల్లుబికిన భావ పరంపరకు అనుగుణంగా వ్యక్తీకరణ రూపాన్ని ఎంచుకుంటాడు. తాను అనుకున్న, తాను చెప్పదలుచుకున్న భావం ఏమేరకు పాఠకుడుకి అందిచగలిగానా అన్నది మాత్రమే చూస్తాడు. నిజానికి నేను కవిత్వంలో దృశ్యాన్ని, దృశ్యం లో కవిత్వాన్ని చూస్తాను. కవిత్వంలో భావ లయ, దృశ్య మాధ్యమంలో దృశ్య లయ నన్ను ప్రధానంగా ఆకర్శిస్తాయి. ఆ దిశలోనే నా రచనలూ సాగాయి. ఏదీ ప్రణాలికా బద్దంగా ఆ రూపంలో రాయాలని రాయలేదు. ఇన్ని ప్రక్రియలలో రాయాలని కూడా అనుకోలేదు. మంచి సినిమాకు మంచి కవిత్వానికి నడుమ పెద్ద తేడా వుందని నేనుకోను. పథేర్ పాంచాలి, దాసి, రాషోమాన్ లాంటి ఓ మంచి సినిమా చూసినప్పుడు మంచి కవిత్వం చదివినట్టే వుంటుంది. అట్లే మంచి కవిత చదివినప్పుడు గొప్ప దృశ్య భావన కలుగుతుంది. కేవలం సినిమా, కవిత్వాలే కాదు పెయింటింగ్ సంగీతం ఇట్లా అన్ని కళల్లో రూపాలు మాత్రమే భిన్నమయినవి. కానీ మనసున్న మనుషులపై వాటి ప్రభావం ఒకేలా వుంటుంది. నేను సమాంతర సినిమా ఉద్యమంలో ప్రధానంగా వున్నప్పుడు వివిధ భారతీయ భాషల్లో వస్తున్న సినిమాల్ని చూడడం సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్ లు ఏం తీసారు, అదూర్ , అరవిందన్ సినిమాలు ఎట్లా వున్నాయి అని చూసేవాన్ని. అంతేకాదు అకిర కురుసువా, ఇజెన్ స్టీన్ లాంటి అనేక మంది విదేశీ దర్శకుల సినిమాలూ చూశాను వాటినన్నింటినీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూస్తూ అనువదించుకుని సంభాషణల్నీ అర్థం చేసుకునే వాణ్ని. అట్లే కవిత్వం పై ప్రధానంగా దృష్టి పెట్టినప్పుడు వివిధ భారతీయ భాషల్లో వస్తున్న కవిత్వం చదవడం ఆరంభించాను. నిజానికి నా చిన్నప్పుడు నేనో పెద్ద అంతర్ముఖున్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీంనగర్ లో మా నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. ముఖ్యంగా వ్యాపార నేపధ్యంవున్న కుటుంబం. మా ఇంట్లో సాహిత్య వాతావరణం అసలు లేదు. కానీ నా చిన్నప్పుడు మా నాన్న ఉర్దూలో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి క్లాక్ టవర్ దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్ స్టాల్ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్ట్ బుక్స్ కు అదనంగా ఇతర పుస్తకాలు చదివే అలవాటయింది. తర్వాత యద్దనపూడి, అరికెపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలూ చదివాను. డిగ్రీ అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటికథ ‘చిత్రిక’ వార పత్రికలో అచ్చయింది. కవిత్వంలో మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో, పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘‘లయ”’ మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. 1981 లోనే వేములవాడ ఫిలిం సొసైటీ ప్రారంభించాను. అప్పుడే సత్యజిత్ రె మృణాల్ సేన్, శ్యాం బెనెగల్, సత్యు, చార్లీ చాప్లిన్ ఇట్లా అనేక మంది గొప్ప దర్శకులు రూపొందించిన సినిమాలని మేము చూడడంతో పాటు సభ్యులకు చూపించాము. దృశ్య శ్రవణ మాధ్యమంయిన సినిమా చాలా ప్రభావ వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. ఆట్లా అర్థవంతమయిన సమాంతర సినిమాల్ని ప్రదర్శించడమే కాకుండా వాటి పైన రాయడమూ అప్పుడే ఆరంభమయింది. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’ లాగా తిరుగుతూ వచ్చాను. ఎదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది. ప్రభావాల విషయానికి వస్తే ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రభావితం చేసారు. కవిత్వం లో శ్రీ శ్రీ, తిలక్, వీవీ, వచనంలో బుచ్చిబాబు, రావి శాస్త్రి, అంపశయ్య నవీన్ ఇట్లా ఒకరేమిటి అనేకమందిని విస్తృతంగా చదివాను. వారి రచనలతో ప్రభావితున్ని అయ్యాను. కానీ ఎవరినీ అనుకరించాలని వారిలా రాయాలని అనుకోలేదు. ఆ గొప్ప వారందిరి రచనల వాతావరణంలో నా స్వీయ గొంతుక కోసం ప్రయత్నం చేస్తూ వచ్చాను..
కవిత్వం అనువాదాలతో పాటు “ యాదొంకి బారాత్” పేర మీ ఆత్మకథ రాస్తున్నారు. ఎందుకు రాయాలనిపించింది? యాదొంకి బారాత్ కి ప్రేరణ దాని ప్రణాళిక ఏమిటి? ఎంతవరకు వచ్చింది?
మూడేళ్ళ క్రితం మా కరీంనగర్ ఇంట్లో నేను జరిపిన తవ్వకాల్లో బయట పడ్డ ఒక చిన్న ఫోటో ఓ నాలుగు వాక్యాలు రాసేందుకు కారణమయింది. చారిత్రకంగా రికార్డ్ చేయాల్సిన విషయమనిపించి ఈ జ్ఞాపకాల్ని పంచుకున్నాను. అదిచూసి నా సహచరి ఇందిర చాలా బాగున్నాయి అప్పటి విషయాల్ని రాయకూడదూ అంది అంతే కాదు. ఒక రకంగా ఒత్తిడి తెచ్చింది. చిన్నప్పటినుండీ విషయాల్ని రాస్తే అది ఆత్మకథ అవుతుంది, మనం అంత పెద్ద వాళ్ళం కాదులే అన్నాను. కాని తను ఊరుకోలేదు. అన్ని వివరాల్ని రాయండి చదివేవాళ్ళు చదువుతారు. ఏముంది అన్నది తను. ఇంకేముంది నాలో కూడా రాయాలనే కోరిక పెరిగింది. ఎప్పుడో ఇంటర్ లో వున్నప్పుడు చూసిన హిందీ సినిమా పేరు ‘యాదొంకీ బారాత్’ గుర్తొచ్చింది. ఆ పేరు మీదే వరం వారం రాయడం మొదలు పెట్టాను. సామాజిక మాధ్యమాలయిన ఫేస్బుక్,వాట్స్ అప్, నా word press పేజీల్లో రాయడం మొదలు పెట్టాను. మిత్రులు బాగుంది కొనసాగిన్చామన్నారు. అట్లా సాగుతూ వచ్చింది. ఎవరయినా డైరీ రాయడం వేరు జ్ఞాపకాల్ని రాయడం వేరు. తేదీల వారిగా రాయడం కష్టమే అయినా మొత్తానికి క్రమంగా రాయడం మొదలు పెట్టాను.
‘లోపల జ్ఞాపకాల జాతర నేనేమో వర్తమాన జెండా పట్టుకుని ముందు నడుస్తున్నా’ అనుకుంటూ రాస్తూ వచ్చాను. “ఆత్మకథలు ఎప్పుడయితే భేషజాలు లేకుండా నిజాయితీగా శ్వేత పత్రాలుగా రాస్తారో అవి గొప్ప ప్రేరణ నిస్తాయి”. అందుకే యాదొంకీ బారాత్ లో నా విజయాలే కాదు నా ఓటములు, నేను ఎదుర్కొన్న అవమానాలు అన్నీ రాసాను. చీకటి వెల్తురు అన్నింటినీ చిత్రించాను.ఇప్పటి వరకు 113 వారాలు రాసాను. 1958 లో నేను పుట్టినప్పటి నుండి 2014 లో తీవ్రమయిన అనారోగ్యానికి గురయి విజయవంతంగా పునర్జన్మ పొందిన కాలం దాకా రాసిన యాదొంకి బారాత్ ను పుస్తకంగా తెస్తున్నాను. మిగతా కాలాన్ని కూడా క్రమం తప్పకుండా రాసే ప్రయత్నం చేస్తున్నాను.
లయ’ కవితా సంకలనం నుండి నేటి వరకు గత నాలుగు దశాబ్దాలుగా సాహితీ ప్రస్థానాన్ని విడువకుండా విస్తరించుకుంటూ కొనసాగడంలో మీ అంతర్యం ఏమిటి? ఆ ప్రయాణాన్ని వివరిస్తారా?
ఇంతకు ముందే నేను చెప్పినట్టు నా చిన్నప్పుడు నేను పెద్ద అంతర్ముఖున్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక ఇబ్బందికి గురయ్యేవాన్ని. చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీమంగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో డిగ్రీ చదువు అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. రాయాలనే తపనా పెరిగింది. శ్రీశ్రీ కవిత్వంతో పాటు, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. తప్పకుండా రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో,పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ” మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. సినిమా చాలా ప్రభావ వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’ లాగా తిరుగుతూ వచ్చాను. ఎదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది.
‘మానేరు తీరం’. ‘మనిషిలోపల’, ‘అక్షరాల చెలిమే’, ‘సొంత వూరు’ తో సహా మీ మొత్తం కవిత్వంలో ప్రధానంగా మనిషి ప్రకృతి సంబంధిత అంశాలు కనిపిస్తాయి వీటి గురించి తెలపండి ?
“ నాకు కవిత్వం కేవలం కవిత్వం కాదు
సగం శబ్దం సగం నిశబ్దం
శబ్దమేమో బతుకు ఏడుపులోంచి ఎగిసిపడుతున్నఎక్కిళ్ళు
నిశబ్దమేమో బతుకు చేతగానితనం లోంచి వ్యక్తమవుతున్న మౌనం.”.
అంతే కాదు
“కవిత్వం సంక్షోభ కాల ప్రవాహంలో నన్ను ఒడ్డుకు చేర్చే తెరచాప
బతుకు సమరంలో నిలబెట్టే లంగరు” అని కూడా రాసుకున్నాను. కవిత్వాన్ని ఎప్పుడూ నేను కారీర్ గా తీసుకోలేదు. అది నా ‘లైఫ్ లైన్’.
సాహిత్య పరంగా నాపైన మొదట ప్రభావం కలిగించిన సంస్థలు వేములవాడలోని నటరాజ కళానికేతన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఉస్మానియా రైటర్స్ సర్కిల్. ఈ రెండు సంస్థలూ నా అధ్యయనాన్ని ఆలోచన రీతినీ మార్చాయి. వేములవాడలో శ్రీ చొప్పకట్ల చంద్రమౌళి సలహాదారుగా ఏర్పడ్డ సంస్థ నటరాజ కళానికేతన్ సమయంలోనే ప్రముఖ కవులు కే.శివారెడ్డి, దేవి ప్రియ, జ్వాలాముఖి, కుందుర్తి లాంటి ఎందరినో దగ్గరినుంచి చూసే అవకాశం కలిగింది. అప్పుడు వజ్జల శివకుమార్, పీ.ఎస్.రవీంద్ర, జింబో లాంటి కవి మిత్రుల సహచర్యం సాహిత్యం వైపునకు నన్ను నడిపించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నందిని సిద్దారెడ్డి, సుంకి రెడ్డి నారాయణ రెడ్డి, మర్రి విజయ రావు, నందిగం కృష్ణారావు లతో సన్నిహితంగా వున్నాను. ఈ అందరి మిత్రుల స్నేహం సాహిత్యం రచనల వైపునకు దారి తీసింది. తర్వాత జూకంటి జగన్నాదం, అలిశెట్టి ప్రభాకర్ ల కవిత్వమూ ఆకట్టుకుంది. వాళ్ళతో స్నేహాన్నీ కలిపింది.అట్లా రాయాలనే కోరికా శురూ అయి రాయడం మొదలు పెట్టాను. ఆ క్రమంలో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అది ముందుకు సాగి మొదటి పుస్తక ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో,పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ” మినీ కవితా సంకలనం తెచ్చాం.
సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ మీ యవ్వనంలో ప్రభావవంతమైన ప్రాంతాలు వాటి ప్రభావం మీ సాహిత్యం పైన ఎలా ఉండేది.
డిగ్రీ చదువులు పూర్తి అయి ఒస్మానియాలో చేరే సమయానికి సిరిసిల్లా జగిత్యాల అంటేనే ఒక గొప్ప ఉద్వేగం, ఉత్సాహం. అప్పుడు మేమే కాదు యవ్వనంలో వున్న వాళ్ళందరి పైనా ఆ ఉద్యమాల ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమితంగా వుండేది. రగులుతున్న పల్లెలు ఒక పక్క, మరోపక్క అణచివేత ఎన్కౌంటర్లు అంతా ఒక సంఘర్షనాత్మక స్థితి. ఎప్పుడే భీభత్సం జరుగుతుందో నన్న స్థితి నెలకొని వుండేది. ఆ నేపధ్యంలో ఆ ఉద్యమ ప్రభావం నాపైనా, నా మిత్రుల పైనా స్పష్టంగా వుండేది. ఆనాటి మా రచనల్లో ప్రతిభింబించేది, ప్రతిధ్వనించేది. అయితే కవితల్లో కవిత్వంతో పాటు అంతర్లయగా ఉద్యమం ధ్వనించేది. ఆ కాలంలోనే చాలా సాహిత్యం చదివాము. సామాజిక రాజకీయ దృక్పధాన్ని ఏర్పరుచుకున్నాం. సాటి మనిషిని ప్రేమించడం, వారి జీవితాల్ని మా సృజనలో ప్రతిఫలించడం అప్పుడే మొదలయింది. మధ్యతరగతి కుటుంబాల్లోంచి వచ్చాను కనుక ఆ నాటి ఉద్యమ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కాని ప్రతి సంఘటననీ సందర్భాన్నీ దగ్గరగా చూసాను వాటిని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసాను. సృజనాత్మక జీవితంతో పాటు సమాంతర సినిమాను కూడా కళా చైతన్య రంగంలో ప్రధానంగా తీసుకున్నాను. అందుకే ఫిలిం సొసైటీ ఉద్యమంలో దశాబ్దాల పాటు పనిచేసాను.
మీ స్వీయ కవిత్వం వివరాలు చెప్పండి?
‘మానేరు తీరం”, ‘మనిషి లోపల’, ‘అక్షరాల చెలిమె’,’సొంతవూరు’, ’ముక్తకాలు’, చిన్నోడి ముక్తకాలు’ వెలువడ్డాయి. ‘మనిషి లోపల’ సంకలనాన్ని అనురాధ బొడ్ల ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’ పేర ఇంగ్లీషులోకి, మనోహరన్ తమిళం లోకి, ఎస్డీ కుమార్ కన్నడంలోకి అనువదించారు. ఇక అనువాదం లో గుల్జార్ GREEN POEMS ని ‘ఆకుపచ్చ కవితలు’ పేర అనువదించాను. కే.సచ్చిదానందన్ ‘వైల్ ఐ రైట్’, జావేద్ అఖ్తర్ ‘ ఇన్ ఆదర్ వర్డ్స్’ కు అనువాదాలు చేసాను. ఇంకా 29 భారతీయ భాషల్లోంచి 90 మంది కవులు రాసిన 152 కవితల్ని తెలుగులోకి అనువదించి ‘ ఇరుగు పొరుగు’ పేరా సంకలనం తెచ్చాను. ప్రస్తుతం ఇరుగు పొరుగు రెండవ సంపుటికోసం అనువాదాలు చేస్తున్నాను.
అభ్యుదయం నుండి అనేక వాదాలు చెలరేగినా అన్నివాదాలు దాటుకుంటూ కవితా వాదాన్ని మానవతా వాదాన్ని నిలబెడుతూ సాగడం లోని మీ నిష్ఠ-నిశ్చయం?
ఆయాకాలాల్లో పెళ్ళుబికిన సామాజిక సంఘర్షణ, సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది. ప్రతిస్పందన మాత్రం ఆ సృజనకారుడి మానసిక స్థితి, స్వీకరించి ప్రతిస్పందించే లక్షణం మీద ఆధారపడి వుంటుంది. నా మట్టుకు నేను అన్నివాదాలనీ దగ్గరి నుంచి చూసాను. కలిసి నడిచాను. జీవితమూ రాజకీయమూ వేర్వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. జీవీతంలో రాజకీయం ఒక భాగమే అయినప్పటికీ ఆ భాగమే మిగతా మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మాను. అది నిజం కూడా. అయితే కళాత్మకం కాని ఏ సృజన అయినా అది సాహిత్యమయినా సినిమా అయినా పొడి పొడిగానే వుంటుంది అన్నది నా అభిప్రాయం. అందుకే సమాజంలో వున్న మనిషి వాడి మనసుతో పాటు సమాజంలో వున్న అనేక పొరల్ని నా రచనల్లో ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నాను. వివిధ భాషల కవిత్వాన్ని మనవాళ్ళకు అందించడం వివిధ సినిమాల్ని పరిచయం చేయడం అందులో భాగమే.v
నేనెప్పుడో రాసుకున్నట్టు
“ ఈ సమాజం అచ్చుతప్పులున్న గొప్ప పుస్తకం, ఇప్పుడు కావలసింది తప్పొప్పుల పట్టిక తయారు చేయడం కాదు, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలి” అన్న భావనలోనే వున్నాను.
సాహిత్య సృజన అట్లా వుంటే పలు డాక్యుమెంటరీలు రూపొందించారు ఆ వివరాలు చెప్పండి? ఏమేరకు వ్యాజ్యం సాధించారు.
నేనిందాకే చెప్పినట్టు సినిమా కవిత్వం రెండూ కళాత్మక వ్యక్తీకరణలే. కానీ కవిత్వం వ్యక్తిగత వ్యక్తీకరణ, సినిమా సమిష్టి కళల వ్యక్తీకరణ. అర్థవంతమయిన భావయుక్తమయిన ఆ రెంటినీ ఇష్టపడతాను. మనిషినీ సమాజాన్నీ పట్టించుకునే ఆ రెండూ నాకు వూపిరుల్లాంటివి. అందుకే తెలంగాణ సాహితీమూర్తుల సృజన జీవితాల పైన దృశ్య మాధ్యమంలో ఫిలిమ్స్ చేద్దామని సంకల్పించాను. వాటికోసం ‘ముద్దసాని రామిరెడ్డి’,యాది సదాశివ’ ల పైన ఫిలిమ్స్ చేసాను. తర్వాత తెలంగాణ జీవన సంస్కృతిలో భాగమయిన ‘శివ పార్వతులపైన’ ఫిలిం చేసాను. ఇంకా పలు ప్రయత్నాలు చేసాను. సాహితీ మూర్తుల డాక్యుమెంటరీలు మరిన్ని చేయలేకపోయాను. ప్రభుత్వాలూ సంస్థలూ సహకరించలేదు. చేసినకాడికి శక్తి మేరకు చేసాను అని అనుకున్నాను.
ఫిలిం సొసైటీల ఏర్పాటు నిర్వహణ లలో కృషి చేసారు. ఆ వివరాలు చెప్పండి.
వేములవాడ లాంటి మామూలు గ్రామంతో పాటు సిరిసిల్ల, జగిత్యాల,గోదావరిఖని, కోరుట్ల తాడిత ప్రాంతాల్లో సొసైటీల ఏర్పాటులో నిర్వహనల్లో పాలు పంచుకున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి, ఒంగోల్ దాకా వైజాగ్,టెక్కలి లాంటి చోట్ల కాంపస్ ఫిలిం క్లబ్స్ ఏర్పాటు చేయడంలో ప్రహాన భూమికను పోషించాను. ఇక కరీంనగర్ ఫిలిం సొసైటీ నా ప్రధాన వేదిక. కరీంనగర్ లో ‘ఫిలిం భవన్’ ఆలోచనలో నిర్మాణంలో మున్డున్నాను. అప్పటి కలెక్టర్ పాతసారధి గారి ప్రోత్సాహంతో ఫిలిం బవన్ రూపుదిద్దుకుంది. 2010 దాకా జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాము. నేను పనిచేసిన ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ పేజీ కాలేజీలో ఫిలిం క్లబ్ తో పాటు ఫిలిం మేకింగ్ కోర్సు నిర్వహించాను. పలు వార్క్షాప్స్ నిర్వహించాము.
జర్నలిస్టుగా మీ ప్రస్తానం, ‘జర్నలిజం’ కోర్సు నిర్వహణ వివరాలు చెప్పండి?
ముఖ్యంగా ఈనాడులో సాంస్కృతిక విలెఖరిగానూ, సుప్రభాతం మగజైన్ లో ఉత్తర తెలంగాణ ప్రతినిదిగాను, మాభూమిలో కూడా ప్రతినిధిగా పని చేసాను. మా కాలేజీలో జర్నలిజం లో ఆర్నెల్ల కోర్సును 13 బాచులు నిర్వహించాను. ఉత్తమ శిక్షణ నిచ్చాము.v ఇక కరీంనగర్ నుంచి కీ.శే.v.విజయకుమార్ సంపాదకత్వంలో వచ్చిన “జీవగడ్డ” లో కే.ఎన్.చారి, అల్లం నారాయణ ళ సహచర్యం తో “వారానందం” కాలం రాసాను, ఇంకా పొన్నం రవిచంద్ర సంపాదకత్వంలో వచ్చిన మానేర్ టైమ్స్ లో ‘మానేరు తీరం’రాసాను,
గ్లోబైజేషన్ నేపథ్యం లో తెలుగు భాష పరిస్థితి ఏమిటి? అనువాద ప్రభావం ఏమేరకు వుంటుంది?
ప్రపంచీకరణ మొత్తంగా ప్రపంచంలోని దేశాల మధ్య మనుషుల మధ్య హద్దుల్నీ సరిహద్దుల్నీ చెరిపేసిందనే చెప్పాలి. పెరుగుతున్న సాంకేతికత దూరాల్ని చెరిపేస్తున్నది. అనేక సంస్కృతులు వేలాది భాషలు వున్న ప్రపంచంలో సమాచారప్రసారం ముఖ్యమయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో అనేక చిన్న భాషలు ప్రభావితమవుతున్నాయి. కొన్ని భాషలు అంతరించిపోయే స్థితి ఏర్పడుతున్నది. ఈ నేపధ్యంలో తెలుగు కూడా ఎంతోకొంత ప్రభావితం అవుతుంది. తప్పదు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కాలేజీల ప్రభావం తెలుగుపై కనిపిస్తూనే వున్నది. కంప్యూటర్ నేర్చుకోవడానికి, అమెరికా వెళ్లడానికి ఇంగ్లీష్ కావాలి కనుక రానున్న తరాల్లో తెలుగు ఉపయోగం తగ్గిపోయే అవకాశం వుంది. మాతృభాషా పరిరక్షణ ఉద్యమం రావాల్సిన అవసరం కూడా వుంది. ఇక ప్రపంచీకరణ నేపధ్యంలో అనువాదం ఒక పరిశ్రమగా అభివృద్ది చెందే అవాకాశం కనిపిస్తున్నది. సాహిత్య అనువాదం మాత్రమే కాకుండా విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాలు, మీడియా, వ్యాపార రంగాల్లో అనువాద అవకాశాలు పెరిగే అవకాశం వుంది పెరుగుతున్నాయి కూడా. సాహిత్యానువాదమప్పుడూ ఇప్పుడూ అత్యంత ప్రధానమయింది అని నేననుకుంటాను.
ఈ నాటి యువతకు మీరేం చెబుతారు?
ఇవ్వాల్టి యువత చాలా ప్రతిభావంతులు. పెరిగిన శాస్త్ర సాంకేతికాభివ్రుద్ది వారిని కోత్హ పుంతలు తొక్కిస్తోంది. అయితే నేల విడిచి సాము చేయొద్దని మాత్రం నేను చెబుతాను. పుట్టిన ఇల్లు వూరు దేశాలను మరువవోద్దంటాను. సాటి మనుషులపట్ల ప్రేమతో స్నేహంతో మెలగాలని కోరుకుంటాను. యువతీ యువకులు తమకు ఇష్టమయినవి బాగా చదవండి అధ్యయనం చేయండి అని మనసారా కోరుకుంటాను.
++++
అనంతా చార్య: చాల సమయమిచ్చి వివరంగా సమాధానాలిచ్చారు. థాంక్స్ ఆనంద్ సార్.
ఆనంద్: మీక్కూడా ధన్యవాదాలు. మయూఖ సంపాదకులక్కూడా ధన్యవాదాలు.
అక్షరార్చన సమూహ పండిత సమూహానికి
సవినయ పూర్వక నమస్సుమాంజలు.
గురువుగారు డా.గండ్ర లక్ష్మణ రావు గారి ప్రేరణ తో…
వేణుశ్రీ గారు అనగానే ప్రశ్నించే గొంతుక,ఎదురు తిరిగే సాహసం, స్థిర చిత్తు లు, చైతన్య మైన నడక, అభ్యుదయం ఆయన దృక్పథం.మానవత్వం ఆయన తత్వం. కవిగా,అనేక సాహితీ సంస్థలతో అనుబంధం కలిగినవారు. సామాజిక కార్యకర్త. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు. వేణుశ్రీ గారి పూర్తి పేరు సుదర్శనం వేణుగోపాలా
చార్య. వీరు ఉమ్మడి కరీంనగర్ జల్లాలోని నందగిరి కోట్ల గ్రామానికి చెందిన కవి. వీరి తండ్రి గారు సుదర్శనం హనుమాoడ్లు
తెలుగు భాషా పండితులు.
ఆచార వ్యవహారాలు కట్టు బొట్టు అన్ని తెలిసిన వైష్ణవ సంప్రదాయo లోంచి వచ్చిన వేణుశ్రీ గారు అభ్యుదయ సంఘాలతో
అనుబంధం పెంచుకొని
ఆదర్శ వివాహం చేసుకొని
తాను నమ్మిన దానిని బోధించి, ఆచరించి సిద్ధాంతానికి కట్టుబడిన
వారు వేణు శ్రీ గారు. వరంగల్ లోని విశ్వేశ్వరాంధ్ర సంస్కృత కళాశాలలో మహా మహోపాధ్యాయ పద్మ శ్రీ శ్రీభాష్యo విజయ సారథి గారి శిష్యరికం లో సంస్కృత, తెలుగు సాహిత్య అంశాలు,వ్యాకరణ ఛందో అలంకార శాస్త్రాలు అభ్యాసం చేసిన ప్రతిభాశాలి. వీరి మొదటి రచన స్వేచ్చ వచన కవితా సంపుటి. తదుపరి ప్రజాభారతం, వరేణ్య శతకం, తెలంగాణ ఘోష
ప్రచేతసా, కైరవ శతకాలు.
తన కవితా శక్తితో సమ సమాజ కాంక్షను వెలిబుచ్చారు.కవిత్వం కవిత్వం కోసం కాకుండా రేపటి తరానికి అందించాలన్నదే ఆరాటం.
తేలికైన పదాల తో వచన కవిత్వం రాసిన వేణుశ్రీ గారు అంతే సులభంగా పద్యం రాయవచ్చునని
నిరూపించారు. ప్రస్తుతానికి వస్తే కైరవ శతకం లో మనుమడి పేరుతో తాత
బోధిస్తున్నారు కాదు ఉపదే శిస్తున్నారు.
తాత మాటలు కైరవా! తరగని నిధి! అనే మకుటంతో శతకం సాగుతుంది. మకుటం లోనే గొప్ప నిధిని ప్రోగుచేసి పంచారు.
శతకం లో పద్య రూపం పాతదే అయినా కవి తన చుట్టూ ఉన్న జీవన అల్లికలుగా శాతం ఆధునికతను కలిగి ఉంది.
కైరావ అనే పదానికి అర్థం
తెల్లకలువ అని అర్థం.స్వచ్చ మనసు పారదర్శకత నీతి నిజాయితీలను ప్రతి బింబoప జేశారు. డా.గండ్ర లక్ష్మణ రావు గారు ముందు మాట రాస్తూ ఒక్కొక్క పద్యం లో ఒక్కొక్క విషయాన్ని పలు కోణాల లో వివరించడానికి
పొడవైన సీసా పద్యాల నెన్నుకున్నారు. సీస పద్యాలు పదహారు రకాలున్నాయని ఛందో శాస్త్రం తెలుపుతుందన్నారు.
గణాల ప్రయోగాన్ని బట్టి.పాదాల విరుపులను
బట్టి వైవిద్యం గల సీస పద్యాలున్నాయన్నారు.
నన్నయ్య నుండి నేటి దాకా కావ్యాలలో శతకాల లో విరివిగా వాడిన సీసా పద్యానికి వేణు శ్రీ గారు కొత్త నడకలు నేర్పించారని అన్నారు.
వేణు శ్రీ గారు ప్రజాకవి కనుక పల్లె జనాలు,అవస్థలు వృత్తులు, తెలంగాణ తేజైన పదాలతో బలహీన మైన వారి పక్షాన నిల్చి బలమైన గొంతుతో,సూక్ష్మ దృష్టితో పద్య నివేదనం చేశారు.
సీ!! పాత విషయముల పద్యాలలో తిరిగి
వ్రాయుటేలయనుచు ప్రశ్నలేయు
వారలుకాలరింక వాదనలను చేయు
సద్విమర్శకులకు సవినయముగ
తిన్నయన్నమెరోజు తినుటలేదమనము
అట్టివేపద్యాలు అందరింక
మంచి మార్గమున మసులు కొందురనియు
మరల మరల వ్రాయ మారుదురని
తే!! ఎంచుకొన్న కవులికను ఎంచినట్టి
మనుషులందున కొందర్ని
మార్చవచ్చు
ననుచు కొత్తగజెప్పంగ జనులు చదువ
కవితా పద్యమైనను నిల్చు కాలమందు
తాటమాటలుకైరవా! తరగని నిధి.
ఈ పద్యం సులభంగా అర్థమవుతంది. పాత విషయాలే అయినా
కొత్తగాచెప్పారు. విశ్వనాథ వారి వాడుకను వాడుకొని ..తినిన అన్నము తినుటలేద మనము…అట్టివే పద్యాలు. ఎన్ని మార్లు విన్నా అవి విలక్షణంగా నిత్య నూతన తో భాసిస్తాయి అనేది వీరి భావన. అందరినీ మార్చలేం ఎంచుకొని కొందరిని మార్చ వచ్చు అని సూటిగా తెల్పారు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు…అనే శతక పద్యాన్ని గుర్తు చేసి మంచి శతకం మన ముందుంచారు. కరీంనగర్ లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన లో4.3.2023 న రచయిత ముద్దసాని రాంరెడ్డి గారి స్మారక పురస్కారం మరియు పది వేల నగదు అందుకోబోతున్న సందర్భం లో వేణు శ్రీ గారికి నమస్సులు.. అభినందనలతో..
కె ఎస్ అనంతాచార్య
కరీంనగర్
రమేశ్వర్ రాజు గారిది గొప్ప అనుశీలనం. అదిత్యుడి కిరణ శక్తి పరిపూర్ణంగా వీరిపై ఉంది. వీరు వైష్ణవ మతానుయాయులు.శ్రీమన్నారాయణ భక్తులు. అది పద్యాలను పరికిస్తే కనపడుతుంది. నేటి పద్యంలో అనుచు నారాయణా….తుంబురు నారదాదలు నంబరమున… ఆ దృశ్యాన్ని కేవలం ఉహించగలం కానీ అనుభవించలేమన్న దృగ్విషయం తేటతెల్లబరిచారు. దేవలోకం లో తుంబురు నారాదులు ఇద్దరు సంగీత విద్వాంసులు. ఇరువురు ముల్లోక సంచారులు. మహావిష్ణువును స్తుతియిస్తూ కీర్తనలు గానం చేసే వారు. నారదుడి వీణ మహతి అయితే తుంబురుని వీణ కళావతి.
అహో దేవర్షార్ధన్యోయం యత్కీర్తిం శార్ ఙ్గ ధన్వనః
గాయన్మాద్యన్నిదం తంత్ర్యా రమయత్యాతురం జగత్!
దేవర్షి నారదుడు బహుధన్యుడు. ఏల అనగా వీణ మ్రోగిoచుచూ
హరి గుణగానం చేయుచూ పారవశ్వము నందుచూ ఈ జగత్తునంతయూ ఆనందింప చేస్తూ సంచరించేవాడు ఆలాగే సూర్యుడు సంచారీ ఆ గాన మాధుర్యం అలపన అద్భుతమైన దృశ్యం వీక్షించిన వాడే సూర్య నారాయణుడు. అన్ని అవతారలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరయోగీంద్రులకు దర్శనీయుడు. సకల సృష్టి అవతారాలకు ఆయనే మూలం. ఆది మూల మితడు అని అన్నయ్య కీర్తనలో కొనియాడినాడు.
దేవ్ ఋషియైన నారాదునిగా అవతరించి శ్రీమన్నారాయణుడు సమస్త కర్మల నుండి విముక్తిని ప్రసాదించే పాంచారాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.
మహావిష్ణువు 21 అవతారాలలో మూడో అవతారం నారదుడు. మహాజ్ఞాని.బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప వక్త,రాజ నీతిజ్ఞుడు,లోకహితవాది ( భాగవత ప్రథమ స్కంధం) అన్నింటిని మించి భగవద్భక్తుడు. సర్వలోక సంచారీ.అనంత బ్రహ్మాoడములలో ఎక్కడా ఏది జరిగినా ఆయనకు ఇట్టే తెల్సిపోయేది. నారద అన్న శబ్దం లోనే జ్ఞానాన్ని అందించే వాడని అర్థం. ఈ జ్ఞాన బోధకోసమే ఆయన లోకాలు తిరిగేవాడు.అలాగే సూర్యుడూ లోకసంచారియే. ఇరువురి
మార్గాలు ఒక్కటే, స్వరూపాలు నారాయణుడివే. భాగవతాన్ని రచింపమని వేదవ్యాసునికి నారదుడు చెప్పినట్లు భాగవత ప్రథమ స్కంధంలో ఉంది.
వాల్మీకి కి రామాయణం నారదుడు రచింపమనట్లుబాలకాండలో ఉంది. అలాటి అద్భుత భక్తి భావ తత్పరుడు పరమభాగవతోత్తముడు చేసే
దివ్యగానం వినే భాగ్యశాలి సూరుడిని అభివర్ణించడం సహేతుకం. అట్లాంటి నారదుని చూడకున్నా సూర్య నారాయణుడిని సేవిస్తున్నామని రాజు గారు పద్యం లో చెప్పారు.
పరమశివుని డమరుక నాదంలోంచి జన్మించి సంగీతమును విశ్వవ్యాప్తం చేసేందుకు బయలు దేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ది పొందినాడు.గంధర్వుడు తుంబురుడు విష్ణుమూర్తి భక్తుడు..పౌరాణిక ప్రసిద్ధి హిందూ పురాణాల ప్రకారం. సూర్యగణంలో సూర్యునికి తోడుగా ప్రతీ ఋతువులో అతని రథంలో ఇద్దరు ఆదిత్యులు,ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణిస్తారు. చైత్రమాసం ( మధుమాసం)లో ధాత,హేతి,వాసుకి, రథకృతి,పులస్త్య, కృతస్థలి,అనే వారితో పాటు తుంబురుడు రథం లో తిరుగుతాడు. ఈ ఇరువురి ప్రస్తావనతో పద్యానికి నిండుదనం చేకూర్చారు. ఆది దేవా అని,అమరవంద్యుడిని చక్కగా సంబోధించి నిన్ను ఒక్కడిని చూస్తే సకల సౌభాగ్యాలు ఓన గూరుతాయని మంచి పద్యం అందించిన రమేశ్వర రాజుగారికి అభినందనలు.
స్వార్థ రహిత సేవకు నీవే అంటూ ఈ రోజు పద్యానికి శ్రీకారం చుట్టిన రమేశ్వర రాజు గారి కవనాశ్వం సూర్య తేజో విరాజమానంగా సాగుతుంది. మనిషి స్వార్థాన్ని వీడి పరమార్థం వైపుకు అడుగు వేయాలని అందుకు సూర్యుడిని ఉదాహరించారు…ఎటుల బాగుపడునో ఇజ్య దేవ అని చిక్కటి పదప్రయోగం చేశారు రాజు గారు. విష్ణువు సహస్రనామాలలో 446వ నామం ఇజ్య…ఇజ్య దేవుడు అంటే యజ్ఞముల చేత ఆరాధింపబడేవాడు. విష్ణు సహస్రనామo విశ్వం విష్ణుర్…అని మొదలవుతుంది. విశ్వo అంటే విశ్వమంతా తానే అయినవాడు ( నామ రూపాత్మకమై,చిత్రాతి చిత్రమై,వికసించి,విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చారా చర జాడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము ) సకల విషయములందు సంపూర్ణమైనవాడు. అంతా భగవంతుడే భాష్యకారుల వ్యాఖ్యానం. విష్ణుః అంతట వ్యాపించి వున్నవాడు. వషట్కారహః వేదమంత్ర స్వరూప, వషట్ క్రియకు గమ్యము ( యజ్ఞం లో ప్రతీ మంత్రం చివర మంత్ర జలమును వషట్ అనే శబ్దంతో వదులుతారు) అంతటిని నియంత్రించి పాలించేవాడు. పరమాత్మ అయిన నేను యజ్ఞ పురుషుడిని,యజ్ఞకర్తను,యజ్ఞఫల స్వరూపుడిని అనిచెప్పారు. కాబట్టి అలాటి ఇజ్య దేవుడిని యజ్ఞం తోనే ఆరాధిస్తారు. యజ్ఞం అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదం లో యజ్ఞోవై విష్ణుః అని చెప్పబడినది. అనగా యజ్ఞం విష్ణుస్వరూపంగా భావించవచ్చు.యజ్ఞం అను శబ్దం యజ దేవ పూజయామ్ అనే ధాతువు నుండి ఏర్పడింది.దైవ పూజయే యజ్ఞం.యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలను సంతృప్తి పరచడం,వారిని మెప్పించడం. యజ్ఞం అనేది అగ్ని ( హోమం) వద్ద వేద మంత్రాల సాక్షిగా హావిస్సులు స్వాహాకారాల తో సంతృప్తి పరుస్తాం హావిస్సులు అగ్నిలో పడుతున్నప్పుడు పరిపూర్ణ ఏకాగ్రతతో విష్ణవే ఇదం నామమ ఇది విష్ణువు కు సమర్పితం నాది కాదు అని సమర్పిస్తాం.తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. ఇష్ట కామ్యాలు నెరవేరుతాయి. ఈ కవిగారు అక్షర యజ్ఞం చేస్తూ స్వార్థ బుద్ధిని సమాజ పోకడలు మార్చమని సూర్య నారాయణుడి ద్వారా శ్రీమన్నారాయణుడిని వేడుకుంటున్నారు. పరస్పరo భావయన్తహః శ్రేయః పర్మవ్యాప్సధ…. పరమాత్మ తాను సృష్టించిన ప్రజలను.. ఓ ప్రజాలారా ఈ యజ్ఞం ద్వారా మీరు శ్రేయస్సును కాంక్షించి అందరూ లాభం పొందండని యజ్ఞ సూత్రాన్ని గీతలో శ్రీకృష్ణుడు తెలిపాడు. యజ్ఞం చేయడం అంటే సర్వజీవి ఆరాధన చేయడం అనే సత్యం పద్యంలో స్ఫురిస్తుంది. యజ్ఞం లో కూడా చాలా రకాలున్నాయి.మానవ జీవితంలో యజ్ఞాలు చేస్తే పరమాత్మకు ప్రీతి కలుగుతుంది. ఈ యజ్ఞాలు 5 రకాలు బ్రహ్మ యజ్ఞము,దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, భూత యజ్ఞము, నృయజ్ఞము. బ్రహ్మ యజ్ఞము అంటే వేదాధ్యయనం చేయడం. జ్ఞాన విస్తరణ చేయటం. దేవయజ్ఞం అంటే కామ్యం ..ఆజ్యాది హోమద్రవ్యాలను వినియోగించి చేసే ప్రక్రియ.పితృ యజ్ఞము అంటే పరలోకంలో ఉన్న తండ్రికి, పూర్వీకులకు శ్రాద్ధ, తర్పణాలు నిర్వహించడం. భూత యజ్ఞము అంటే సకల జీవరాసులకు ఉపయోగపడేలా నడుచుకోవాలి.
నృయజ్ఞము అంటే అతిథి స్వయం విష్ణుః అని ఆదరించి గౌరవించాలి. కనీసం దైవారాధన ,ఐక్యత దానం చేయడం ద్వారా యజ్ఞ పురుషుడిని సంతృప్తి పరుచవచ్చు. మానవ హితాన్ని కోరి రాజు గారు యజ్ఞకర్మల బోధ చేశారు. చక్కటి పద్యం అందించిన మీకు అభినందనలు .
కూసే పిట్ట వాలే చెట్టు
పొదల్లో గెంతే కుందేళ్లు
పిట్టలు కట్టిన గూళ్ళు
పారే నదిమీద వాలే
కొంగలు
ఇవన్నీ ఇప్పుడు స్క్రీన్ మీది
బొమ్మల సింగారమే
నిజ రూప దర్శనం కరవైన బంగారమే!
కౌసు పిట్టలు కాగితాల్లో మిగిలిన కారికేచర్స్
కోయిల అమెజాన్ లో అమ్మకానికి కూసే కూలి !
వెదురు గొంతులు బొంగురు పోయి కురచనయిన మాటలు
కీ బోర్డులో e రాత. !
మౌస్ రాక్షసి నోట చేతి రాత!
బయోడైవర్సిటీలో నడక తప్పిన గుడ్డి ఎద్దు !ఎడారి మీద పచ్చ గడ్డి మైదానపు మరీచిక!
స్వరం తప్పిన
పచ్చని జావళీలు…. ప్లాస్టిక్ హంగుతో
పాప్ మ్యూజిక్
గాలికీ ఓ లెక్కుంది
కరెన్సీ ని పీలుస్తుంది
ఊపిరితిత్తుల వ్యాపారానికి
ప్రాణవాయువే పెట్టుబడి
ప్లాస్టిక్ కవర్ల
గుట్టలు తవ్వకుండా దొరికే
కాలాంతర గుప్తులు!
కాలాలు మారినా వర్షాలు ముఖం చాటేసిన
విప్పుకొనే మల్లె
మనసు మాలిన్యాన్ని
కడుగుతుoది
అల్ల నేరేడుయే
ఆకలికి
నైవైద్యమవుతుంది
పచ్చని మొక్కయే
కాలుష్యం మీద
పచ్చ బొట్టయి మెరుస్తుంది !!
మౌనం వారి స్వభావం. ఒద్దికగా నిమ్మళంగా పనిచేసే తత్వం. అధ్యయనం వారికి ఇష్టం. దృష్టికోణం భిన్నంగా కలవారు డా|| మచ్చ హరిదాసు సార్. పద్యసాహిత్యం వారి వారసత్వం. తెలుగు సాహిత్య మెళకువలు గురుప్రసాదం. ఋషి తుల్యులు. విద్యార్థి దశ నుండి ఈనాటి దాకా చదువుకోటం నిత్య ఆనందంతో చేసే పని. అందరికన్నా భిన్నంగా తన కార్యనిర్వాహణ ఉంటుంది. రాసిన ప్రతి పదం, వాక్యం అన్నీ పరిశోధనాత్మక విషయాలే. ఆదియానో బహూన్ గ్రంథాన్, సేవ్య మానో బహూన్ గురూన్, లోకమానో బహూన్ దేశాన్…. అచ్చుగా ఈ శ్లోకం హరిదాసు సార్ కి బాగా అబ్బుతుంది. కొండాపూర్ నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం, తంజావూర్, వేటపాలెం గ్రంథాలయాల నుండి కరీంనగరు దాకా ప్రతీ ప్రదేశం, నేర్పిన కొత్త అంశాలు తన రచనకు సోపానాలుగా మారినాయి. హరిదాసు సార్ అంటేనే యాత్రా చరిత్ర అనే సమానార్థకంగా మారిపోయి, పరిశోధనలో దూరిపోయి, అక్షరాల మీద ప్రదేశాలను నిలిపిన కళాత్మకత. కావ్య సౌందర్య రసాత్మకత.
విస్తృత అధ్యయనం విమర్శనంగాని వైపుకు దారి తీసింది. ప్రస్తుత తెలుగు సాహిత్యంలో విమర్శ చాలా తక్కువగా వస్తుందని పెద్దల అభిప్రాయం. కాని వచ్చే విమర్శలు మాత్రం చాలా వరకు లోతైన విమర్శ వస్తున్న క్రమంలో హరిదాసు గారు మొదటి వరుసలో ఉంటారు.
డిగ్రీ కళాశాల ద్వారా జాతీయ సెమినార్లు నిర్వహించటంలో ప్రముఖ పాత్ర వహించినారు. కళాశాల ద్వారా తీసుకొని వచ్చిన సాధారణ పరిశోధకులు తాము పరిశోధన చేసిన అంశాన్ని డాక్టరేట్ పట్టా పొందాక పక్కన ఉంచుతారు. కొందరు మాత్రమే కొనసాగిస్తారు. అందులో హరిదాసు గారు ఒకరు. యాత్రాచరిత్రల సూచి ప్రకటించారు. ఇంకా ఈ వైపు పరిశోధన వీరు చేస్తూనే వున్నారు. తెలుగు సాహిత్యంలో మచ్చలేని చంద్రుడు హరిదాసు గారు.
కె.ఎస్. అనంతాచార్య, కరీంనగర్,
యాత్రా చరిత్రలపై పరిశోధన చేయాలని మీకు ఎందుకు అనిపించింది?
డా|| ఎన్.గోపి (గోపాల్) వేమన మీద పరిశోధన చేస్తున్న రోజులలో ఆయన వెంట సహాయకుడిగా 1977లో మద్రాసుకు వెళ్లాను. అది నా మొట్టమొద
టి రైలు ప్రయాణం. కుతూహలంతో ఆ రాత్రంతా మేల్కొని ఉండి దారిలో తటస్థించిన ప్రతి స్టేషన్ పేరును, రెండు స్టేషన్ల మధ్య కాలాన్ని గుర్తు పెట్టుకుంటూ (నోట్ చేసుకుంటూ) వచ్చాను. మద్రాసులో 40 రోజులు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో మా పని. అక్కడి ప్రదేశాలు, ధరపరలు, విశేషాల గురించి ఏ రోజుకారోజు రాత్రి టూకీగా దినచర్య రాసుకునేవాణ్ణి. ఈ విధంగా ప్రదేశాల గురించి దినచర్య రాయటం, రైలు ప్రయాణంలో స్టేషన్ల వివరాలు నోట్ చేసుకోవటం అనేది యాత్రా చరిత్ర రచనలో కొంతవరకు ఒక భాగమేనని నాకు అప్పటివరకు తెలియదు. తర్వాత పిహెచ్.డి. చేయాలనుకొని “కరీంనగర్ గ్రామ నామాలు”, “గ్రంథ పరిష్కరణల పద్ధతులు” – ఈ రెండు అంశాల్లో ఏదైనా ఒకదాని గురించి మీ అభిప్రాయమేమిటని గోపికి అడిగినప్పుడు, ఆయన ఈ రెండింటి పైన పరిశోధనలు జరుగుతున్నాయి. నీవు “తెలుగులో యాత్రా చరిత్రలు” అనే అంశం మీద చేయి, అది నీ స్వభావానికి బాగా నప్పుతుంది అని సలహా ఇచ్చాడు. అదే అప్లై చేసాను, సీటు వచ్చింది. నాకు తోచిన అంశం కాకున్నా, దానిపై ఇష్టం పెంచుకొని, మనసు పెట్టి రాసి, పరిశోధనాంశానికి తగిన న్యాయం చేసాననే భావిస్తున్నాను.
యాత్రలు చేయడం సహజం, ఐతే వీటివల్ల కలిగే ఉపయోగమేమిటి?
యాత్రలవల్ల మనిషికి ప్రాపంచిక జ్ఞానం అలవడుతుంది. కవి పండితులకైతే రచనోత్సాహం కలుగుతుంది. ఇక భక్తులకైతే తీర్థయాత్ర సందర్శనంలో భక్తి భావం పెంపొందంతో పాటు పాపప్రక్షాళన జరిగినట్లు భావిస్తారు. విద్యార్థులకు గ్రంథ పఠనం ద్వారా తెలుసుకొన్న విషయాలకు ప్రత్యక్షానుభూతి కలుగుతుంది. నలుగురితో కలిసి దేశాటనం చేయటం వలన సాటి మానవులతో కలిసి ప్రవర్తించే సహన సౌశీల్యం ఏర్పడుతుంది. అహంకారం తొలగిపోయి, హృదయ వైశాల్యం కలుగుతుంది. కలిసి ప్రయాణించడం వల్ల, ఆయా సందర్భాల్లో కలిసి భుజించటం వల్ల తమ భౌతిక స్థాయిని, అధికారాన్ని, సంపన్నతనూ మరచి కలిసి మెలసి జీవించగలుగుతారు. అనేమందితో నూతన పరిచయాలు ఏర్పడుతాయి.
పరిశోధన, విమర్శ – ఈ రెండింటో మీకు ఏది ఇష్టం?
విమర్శ వ్యాసాలు రాయటానికి ఇల్లు దాటి వెళ్ళాల్సిన పనిలేదు. సాహిత్యాధ్యయనం విస్తృతంగా చేసి వుంటే చాలు. తర్వాత ఏ అంశం గురించి విమర్శ చేస్తున్నామో దానిపై సాధికారికంగా చెప్పగలిగే నైపుణ్యం సపాదిస్తే చాలు. కానీ పరిశోధన అట్లా కాదు. క్షేత్ర పర్యటనతో ఇది ముడివడి ఉంటుంది. నాలుగు పుస్తకాలు ముందు వేసుకొని పనైపోయిందని ముగించటం కంటె, గ్రంథాలయాలు తిరిగి, ఊళ్లు తిరిగి విషయ సేకరణ సంపూర్ణంగా చేసిన తర్వాత కుదురుగా కూర్చొని వ్యాసరచన చేయగలిగితే చేసిన పనికి గుర్తింపు వస్తుంది, పరిశోధకునికి తృప్తి మిగులుతుంది. అందుకని నాకు సాహిత్య విమర్శ, పరిశోధన ఈ రెండూ ఇష్టమే కాని పరిశోధన అంటే మరింత మక్కువ, ఇష్టం.
మీ రచనలు చాలావరకు పరిశోధనాత్మకమైనవే. ఈ నాటి పరిశోధకులకు మీరందించే సందేశం ఏమిటి?
నా రచనల్లో ఎక్కువభాగం, నా కిష్టమైన పరిశోధన గ్రంథాలే అవి :
1) తెలుగులో యాత్రాచరిత్రలు (సిద్ధాంత గ్రంథం)
2) తెలుగులో యాత్రాచరిత్రలు (లఘు గ్రంథం)
3) తథ్యము సుమతీ! (1984), పరివర్ధిత ముద్రణము (2017)
4) యేనుగుల వీరాస్వామి (జీవిత చరిత్ర)
5) తెలుగులో యాత్రాచరిత్ర రచనల సూచి
6) గునుకుల కొండాపురం – పద్మశాలీయులు – బూట్ల వంశం – ఏడుతరాల చరిత్ర.
మొదటి మూడు రచనలు పాఠకులకు తెలిసినవే. ఒకటి పిహెచ్.డి. పట్టాకోసం, రెండు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించిన లఘు గ్రంథం. ముందు ఏ అవార్డులూ ఆశించకుండా తంజావూరులో తాళపత్ర గ్రంథాల్లో సేకరించిన సుమతి పద్యాలను వెలుగులోకి తేవడం. ఇక నాలుగవది సి.పి.బ్రౌన్ అకాడమీ వారి కోరికలో రాసినది. వీరాస్వామి జీవిత చరిత్ర విశేషాలు సేకరించడానికి మద్రాస్ ఓరియంటర్ లైబ్రరరీ, కన్నెమెరా లైబ్రరీ, వేటపాలెం లైబ్రరీలకు వ్యయప్రయాసలతో వెళ్లి సమాచారం దొరుకక, నా సిద్ధాంత వ్యాసం ఆధారంగా రాసి ఇవ్వటం. ఐదవది : పిహెచ్.డి ఇంటర్వ్యూ కాలం (1987) నాటికి యాత్రా చరిత్ర రచనలు మూడు నాలుగు కంటె ఎక్కువ లేవని తెలియగా, థీసి లో 50 పుస్తకాలు, తర్వాత 300 పుస్తకాల పేర్లు, వాటి వివరాలను సేకరించి ‘తెలుగులో యాత్రా చరిత్ర రచనల సూచి’ అనే పుస్తకాన్ని భావి పరిశోధకుల కోసం కూర్చి పెట్టాను. ఇక చివరిది : గునుకుల కొండాపురం నేను పుట్టిన గ్రామం. అక్కడ బూట్ల వంశం వాళ్లే ఎక్కువ. మా ఒక్కరిదే మచ్చ వంశం. క్రీ.శ. 1850 సం||లో బతుకుదెరువు కోసం వేరే గ్రామం నుంచి వచ్చి స్థిరపడిన బూట్ల రామయ్య మొదలుకొని ఆయన తర్వాత ఇప్పటి ఏడవతరం వ్యక్తి వరకు అందరి వివ
రాలను వెలికి తీసిన వైనం పొందుపరచబడింది.
పై ప్రతి పుస్తక రచనకు నేను క్షేత్రస్థాయిలో పడ్డ శ్రమను ఈనాటి పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంటుందనే, ఉండాలనే దృష్టితో వివరంగా తెలుపవలసి వచ్చింది. పరిశోధన చేసేవారు పై పైనా కాకుండా, చిత్తశుద్ధితో పని పైన దృష్టి పెట్టి ప్రత్యేకతను సంతరించుకునేట్టు, సాహితీలోకం గుర్తుంచుకునేటట్టు శ్రమించి, లోచూపుతో విషయ సేకరణ రచన చేయాలని సూచిస్తున్నాను. థీసిస్ అంటే సముద్రంలో మునిగి ముత్యాలు తీయటమే కావాలి. తీసి రాని, ప్రింటు చేయకుండా అలమారుల్లో పెట్టడం కాదు. ధైర్యంగా ముద్రించి, నలుగురి ముందు పెట్టి మంచి చెడ్డలను (విమర్శ) ఆస్వాదించాలి. వారిచ్చే సూచనలను మలి ముద్రణలో – సరియైనవైతే – సవరించుకోవాలి.
చాలా సుమతి పద్యాలు సేకరించి పుస్తకం వేసారు కదా! దీని నేపథ్యం వివరించండి.
వేమన పరిశోధనలో భాగంగా డా|| ఎన్. గోపి నన్ను తన వెంట తంజావూరుకు (1978) తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడి లైబ్రరీలో సుమతి శతకానికి సంబంధించిన తాళపత్ర ప్రతులు, కాగితపు ప్రతులు కనిపించాయి. గోపి వాటిని రాసుకొమ్మన్నాడు. నోట్ బుక్ లోకి యథాతథంగా ఎక్కించాను. 1856లో సర్ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తంజావూరులో పండితుల చేత రాయించిన పద్యాలే ఇవి. అంతకు ముందే 1832లో సుమతి పద్యాలను పండితులచే రాయించి అచ్చుకు సిద్ధం చేయించిన 150 పద్యాలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1973లో ముద్రింపచేసింది. శ్రీ ఆంధ్రసాహిత్య పరిషత్ పత్రిక 1938 సంచికలో బొడ్డపాటి లక్ష్మీపతి గారు సేకరించిన 50 పద్యాలు అచ్చు వేయబడ్డాయి. ఈ విధంగా పైన పేర్కొన్న ప్రతులలోని మొత్తం పద్యాలను సరిపోల్చి చూడగా –
కేవలం తంజావూరు ప్రతులలోని పద్యాలు – 36
లక్ష్మీపతి ప్రతి లోనివి – 21
ఈ రెంటిలో కామన్‌గా కనిపించే పద్యాలు – 06
పై ప్రతుల్లో వేటిలోను లేకుండా తర్వాతి కాలంలో అచ్చు ప్రతుల్లోకి
ఎక్కిన పద్యాలు – 03
వెరసి 56 కొత్త పద్యాలు తేలాయి. బ్రౌన్ సేకరించిన (అకాడమీ ప్రతి) 150 పద్యాలు. వీటిని కలుపగా (150-156) మొత్తం సుమతి పద్యాల సంఖ్య ఇప్పటికి 206 అవుతున్నాయి.
గోరుకొయ్యల నానీల ప్రత్యేకత ఏమిటి?
నేను స్వతహాగా కవిని కాను. నాకు 56 సం||ల వయసు వచ్చేదాకా కవిత్వ రచన వైపు చూపు సారించలేదు. నానీల అష్టమ వార్షికోత్సవ సభకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ ప్రభావంతో నానీల రచన మొదలు పెట్టాను. మిత్రులతో ముచ్చటిస్తున్న సందర్భంలో పదాల గారడీ, చమత్కారం
చిందించడంలో నేను నేర్పరినని నా మిత్రులు చాలా సందర్భాలలో చెప్తుండేవారు. ఐతే నేను వాటిని అక్షరబద్ధం చేయకపోవటం పెద్దలోటని కూడా అనేవారు. ఈ చమత్కారాలతోటే నానీలు రాయాలన్న తలంపు కలిగింది. రాసాను. దాని పేరే ‘గోరు కొయ్యలు’. ముఖ్యంగా దేశీయత, ప్రాంతీయత ఉట్టిపడే విధంగా ఆయా వ్యక్తుల వైశిష్ట్యాలను చాటే వాక్చిత్రాల నానీలను 16 దాకా ఈ పుస్తకంలో పొందు పరిచాను.
తెలుగులో సాహిత్య విమర్శ ప్రస్తుతం తక్కువగా వస్తున్నదని అంటున్నారు. దీనికి కారణం ఏమిటి?
తెలుగులో సాహిత్య విమర్శ మనమనుకుంటున్నంత తక్కువగా ఏమీ రావటం లేదు. ఫరవా లేదు. సమీక్షల రూపంలో పత్రికలలో, వ్యాససంపుటుల ద్వారా బాగానే రాస్తున్నారు, సాహిత్య విమర్శకులు. కథలు, కవితలు రాస్తున్నంత విరివిగా రావటం లేదన్నతి సత్యమైన విషయమే. ఐతే దీనికి ముఖ్యకారణం ఈ కాలపు రచయితలు ప్రాచీన సాహిత్యం మీద సరియైన దృష్టి పెట్టడం లేదనే. ప్రాచీన ఆధునిక సాహిత్యాల మీద పూర్తిగా పట్టు సాధించాలంటే అన్ని ప్రక్రియలను సాకల్యంగా, సవివరంగా అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనం అంతర్వీక్షణంతో చేసినప్పుడే సాహిత్య విమర్శ సుసంపన్నమవుతుంది.
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన గురువర్యులు ఎవరు?
నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీంనగర్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆ స్కూల్లో తెలుగు అధ్యాపకులుగా చింతల నారాయణ గారు ఉండేవారు. వారి విద్యాబోధన, విద్యార్థులతో వారు వ్యవహరించే తీరు బాగా ఆకట్టుకునే విధంగా ఉండేది. ముఖ్యంగా నాకు ఛందస్సు గురించి ఎరుక పరిచిన మెలకువలు నాకు బాగా నచ్చాయి. తొందరంగా పట్టువడింది. ఎంతగా అంటే నా సహాధ్యాయుల సందేహాలను తీర్చగలిగేంత. అప్పుడు నా మీద నాకు పూర్తి నమ్మకం కలిగింది. మునుముందు ఎం.ఏ. తెలుగులో పి.జి. చేయాలన్న కోరిక ఆ వయసులోనే బలంగా నాటుకొన్నది. బి.ఏ. పరీక్షల్లో కూడ ద్వితీయ భాషే ఐనా తెలుగులో నేను అందరికంటె ఎక్కువ మార్కులు సాధించాను.
అలాగే ఎం.ఏ. తెలుగులో చేరిన తర్వాత ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు, ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డిగారు, డా|| పాటిబండ మాధవశర్మ గారు – వీరు విద్యాబోధన చేసిన తీరు అనుపమానం. పిజిలో వీరు నాకు అభిమాన గురువులు. వారి బోధనలో ప్రభావితుడనైన నేను ఎం.ఏ.లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడనైనాను.
తెలుగు సాహిత్య అధ్యయనం చేయడానికి గల కారణం ఏమిటి?
నేను 8, 9 తరగతులు చదివేటప్పుడు హాస్టల్ లో ఉండేవాడిని. మా స్కూలుకు, హాస్టల్ కు మధ్య దారిలో లైబ్రరీ ఉండేది. ప్రతిరోజు బడి వదిలిన తర్వాత సాయంకాలం అక్కడికి వెళ్లి సీరియల్ కథలు చదువుతుండేవాణ్ని. ఈ అలవాటు తర్వాతి కాలంలో పద్మనగర్ కు వచ్చిన తర్వాత తెలుగు సాహిత్యం కాదు గాని నవలలు, కథల పుస్తకాలు చదివేవాణ్ని. ఇంకా మా నాయన ఆశువుగా కవిత్వమల్లడం, దాన్ని నేను కాపీ చేయడం, గురువు గారు చింతల నారాయణ గారు ఛందస్సులోని మెలకువులు నేర్పడం – ఇవన్నీ నాకు సాహిత్యంమ ఈద అభిలాష కలగడానికి కారణాలైనాయి. ఐతే ఈ ఒక్క ఛందస్సు మీద ఆధారపడి ఎం.ఏ. చదవడానికి వచ్చిన నాకు మహాసముద్రమంత సాహిత్యం ఎదుట కనిపించేసరికి ఒక్కసారిగా భయమేసింది. మిత్రుల సాంగత్యంలో, ప్రోత్సాహంతో ఆర్ట్స్ కాలేజి లైబ్రరీలో నిత్యం సాయంకాలం వెళ్ళి సాహిత్య పాఠ్యాంశాల సంబంధిత విషయాలను, ఇతరమైన వాటిని ఆధార గ్రంథాలను, వ్యాసాలను అధ్యయనం చేయడంతో నాకు సాహిత్యం మీద అభిమానం కలిగింది.
గోపి సార్, అనుమాండ్ల భూమయ్య సార్, కిషన్ రావు సార్, మీరు సహాధ్యాయులు కదా! మీ మధ్య ఉండే అనుబంధాన్ని తెల్పండి?
అనుమాండ్ల భూమయ్య, నేను శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కరీంనగర్ లో 1966-67 సం||లో పి.యు.సి.లో సహాధ్యాయులం. తర్వాత ఆయన జగిత్యాల డిగ్రీ కళాశాలలో, నేను కరీంనగర్ లో డిగ్రీ పూర్తి చేసాము. ఎం.ఏ.లో మళ్లీ కలుసుకున్నాము. తంగెడ కిషన్ రావు ‘ఇ’ హాస్టల్ లో, భూమయ్య బయట రూం తీసుకొని ఉంటుండగా, మా ‘ఏ’ హాస్టల్ లోని 45వ నెంబరు రూం ఖాళీ కాగానే, అందులోకి వాళ్ళను రమ్మని చెప్పి, ముగ్గురం ఒకే రూంలో కలిసి ఉన్నాం. ఒక సంవత్సరం తర్వాత భూమయ్య ఫైనలియర్ లో పి.జి. హాస్టల్ కు వెళ్లగా, మా రూంకు అంజరావు వచ్చాడు. కిషన్ రావు, నేను రెండు సంవత్సరాలు ఒకే రూంలో ఉన్నాము. నేను అంతర్ముఖున్ని, అతి తక్కువ మందితో కలిసేవాణ్ని, కిషన్ రావు అట్లా కాదు. అందరితో తొందరగా కలిసి పోయేవాడు. ఎక్కడెక్కడి వార్తలో తెచ్చి నాకు చెప్పేవాడు. ఈ ఇద్దరి స్నేహం నాకు బాగా సంతోషాన్నిచ్చేది. పరిచయాలు కూడా ఎక్కువే అయ్యాయి. మేం ముగ్గురమే కాకుండా హాస్టల్లో మరి ముగ్గురు మా సహాధ్యాయులుండేవారు. మా అందరినీ కలిపి మా క్లాసు వాళ్లు హాస్టల్ బ్యాచ్ అనేవారు. మెస్ కు వెళ్లినా, తరగతులకు, లైబ్రరీకి వెళ్లినా అందరం గుంపుగా కలిసే వెళ్లేవాళ్లం.
ఇక గోపితో ఉన్న అనుబంధం మరికొంత ప్రత్యేకమైనది. 45 నెంబరు రూముకు రాకముందు
మరో ఇద్దరితో కలిసి వేరే రూములో ఒక వారం రోజులున్నాను. వారు వ్యసనపరులు, జల్సారాయుళ్లు, కనుక నన్ను ఆ రూంలోంచి గెంటివేయడానికి కుట్రలు పన్నుతున్న సంగతి గోపికి తెలిసి నన్ను మరొక రూముకు మార్పించారు. అక్కడినుండి పైన తెల్పిన 45 కు వచ్చాను. అప్పటినుండి గోపితో నా స్నేహం బలపడింది. ఎక్కడికి వెళ్లినా మేమిద్దరం జంటగా వెళ్లేది. ఈ రెండేళ్లలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మా స్నేహం వికసించింది. సెలవులు వస్తే ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆయన సాంగత్యంలో అనేకమంది స్నేహితులు, కుటుంబాలు, అధ్యాపకులు పరిచయమయ్యారు. మా ఫైనలియర్ పరీక్షలు జూన్ లో ఐపోగానే అందరూ తమతమ ఇండ్లళ్లకు వెళ్ళిపోయారు. నేను ఫస్టియర్ పరీక్షలకు ఇంప్రూవ్ మెంటు కట్టి ఉన్నాను. కనుక ఒక్కడ్నే హాస్టల్ లో వేరే రూంలో సర్దుకొని ఉంటూ జూలైలో పరీక్షలు రాసాను. ఆ నెలరోజుల్లో గోపి దాదాపు నాకు రోజుకొక ఉత్తరం రాస్తూ నేను నిరుత్సాహ పడకుండా ఉత్తేజం కలిగించేవాడు. ఆ కారణంగా నేను ఎం.ఏ. మొత్తమ్మీద ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడను కాగలిగాను. మా క్లాసులో 34 మందిలో హాస్టల్ వాళ్లమే నలుగురం (7 గురు ఫస్ట్ క్లాసు) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులమయ్యామంటే మేమెంత కలిసిమెలసి చదువుకునే వాళ్లమే దీన్ని బట్టి తెలుస్తుంది.
రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నారు కదా! విద్యార్థులతో మీకున్న అనుబంధాన్ని వివరించండి?
నేను 1974-2008 సం||ల మధ్య 34 సంవత్సరాలపాటు జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ & పి.జి కళాశాలల్లో అధ్యాపకునిగా పని చేసాను. అంతకుముందు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అది నా మనస్తత్వానికి సరిపడేది కాదని గ్రహించి, అధ్యాపకునిగానే జీవనం సాగించాలని నిర్ణయించుకొని ఈ వృత్తిలోకి వచ్చాను. జగదేవ్ పూర్ (మెదక్), ములుగు (వరంగల్), హుస్నాబాద్ (కరీంనగర్) లాంటి గ్రామాల్లో అక్కడే కుటుంబంతో ఉండి పని చేస్తున్నప్పుడు విద్యార్థులతో, అలాగే వారి తల్లిదండ్రులతో పరిచయం ఏర్పడేది. మేము అద్దెకున్న ఇంటి పరిసరాల్లోనే విద్యార్థులున్నందున వారితో బాగా కల్సిపోయేవాడిని. తరగతి గదిలోనే కాకుండా విద్యార్థులు కొందరు ఇంటికి వచ్చి సందేహాలు తీర్చుకుంటూ, కుటుంబ సభ్యుల వలె మెలిగేవారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ కొంతమందితో రాకపోకల మర్యాదలు (శుభకార్యాలు) జరుగుతూనే ఉన్నాయి. డిగ్రీ కళాశాలలు టౌన్లో ఉండేవి కనుక పిల్లలు కళాశాలలో తప్ప బయట ఎక్కడా కలిసేవారు కాదు. ఐతే నేను తెలుగు అధ్యాపకుణ్ని కనుక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లోను, ఇంకా కళాశాల మేగజైన్ కు కవితలు, వ్యాసాలు అందించే సమయాల్లోను విద్యార్థులు కొందరు నాకు సన్నిహితంగా మెలిగేవారు.
ఎం.ఏ. తెలుగు ఎస్.ఆర్.ఆర్. కాలేజికి వచ్చిన తర్వాత తెలుగు అధ్యాపకునిగా డిగ్రీ విద్యార్థుల
కంటె పిజి విద్యార్థులతో సన్నిహితంగా ఉండవలసి వచ్చేది. దాదాపు 15 సం|| గడుస్తున్నా ఇప్పటికీ వారితో సంబంధం (ఫోన్ లో) కొనసాగుతూనే ఉంది. అనేకమంది విద్యార్థులు తరగతి బైట నా వద్ద సాహిత్యాధ్యయనం చేసి అధ్యాపకులుగా, కవులుగా, ప్రభుత్వోద్యోగులుగా కొనసాగుతున్నారు. ప్రతినిత్యం ఎవరో ఒకరు తమ సందేహాలను నాకు ఫోన్ చేసి తీర్చుకుంటుంటారు. దానికి కారణం! నేనేదో మిగతా అధ్యాపకుల కంటె తెలివైన వాణ్నని కాదు కాని, వారే అంటారు “మీలాగా ఎవరూ సమయమివ్వరు, ఓపికగా, నమ్మకంగా సందేహాలను నివృత్తి చేయరు- అని. నాకు తెలిసినంతవరకు ఏ ఉపాధ్యాయునికీ దక్కని అదృష్టం నాకు దక్కింది ఒక విద్యార్థి ద్వారా. అది : ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన నా పూర్వ విద్యార్థి డా|| పాతూరి రఘురామయ్య నా జీవితాన్ని గురించి మధురాక్కర పద్యాలలో ‘గురువరేణ్య శతకం’గా 120 పద్యాల్లో రాయటం. రెండు ఎండాకాలాలు నేనిచ్చిన కోచింగ్ తో నక్క శ్రీనివాస్ అనే పూర్వ విద్యార్థి ప్రస్తుతం తహసీల్దారుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మచ్చుకు ఇవి రెండు చాలు విద్యార్థులతో నాకున్న అనుబంధం తెలుపడానికి.
మీ తండ్రిగారు మచ్చ వీరయ్యగారు మంచి పద్యకవి కదా! వారి ప్రభావం మీ మీద ఎలా ఉంది?
మా నాయన మచ్చ వీరయ్యగారు కష్టజీవి. నీతి, నిజాయితీలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వాడు. ఒకవైపు వ్యవసాయం, మరోవైపు గుంట మగ్గం నేస్తూ జీవికను కొనసాగించాడు. ఒక్కరి సంపాదనపై తల్లి, భార్య, నలుగురు పిల్లలు ఆధారపడి ఉండగా కుటుంబాన్ని పోషించడానికి అనేక కష్టాలననుభవించాడు. చదవింది మూడవ తరగతే ఐనా ఆశువుగా ఆబాల్యం కవిత్వం చెప్పేవాడు. అదే ఆయనకు ఎట్లా అబ్బిందో తెలియదు. భగవత్సంకల్పం అనుకోవాలి. రామానుజం అయ్యవారి వద్ద రామాయణం చదువుకున్నాడు. శేషప్ప వరకవి నృసింహ శతకం కంఠోపాఠం కాబట్టి మా నాయన రాసిన సీసపద్యాల్లో ఆ పద్యాల మూస ఉంటుంది. నేను ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుండి నా చేతిరాత బాగుంటుంది కాబట్టి – తాను మగ్గం నేస్తూ చెప్పిన తత్వాలు, కీర్తనలు నన్ను కాపీ చేయుమనేవాడు.
తర్వాతి కాలంలో రామ శకతం, పుత్ర శకతం, భక్తి తత్త్వ ప్రకాశిక (కీర్తనలు, తత్వాలు, పద్యాలు, లోకం పోకడ, కందార్థ దరువులు) వంటి రచన చేసారు. ఆయన రచనలలో సామాజిక స్పృహతో పాటు, భక్తి సంబంధి సాహిత్యం ఎక్కువగా ఉంటుంది. బహుశా నేను హైద్రాబాద్ లో ఎం.ఏ. తెలుగులో చేస్తానన్నప్పుడు నిరుత్సాహపడకుండా ఎంత ఇబ్బందైనా సరే శక్తికి మించి నన్ను చదివించడానికి ఒప్పుకొన్నారంటే అది ఆయనకున్న సాహిత్యాభిలాషే కారణమనుకుంటున్నాను. మా నాయన పద్యకవి ఐనప్పటికీ నామీద ఆయన ప్రభావం పడలేదు. నేను పద్యకవినే కాదు. వచన కవిని కాదు.
మీ కుటుంబాన్ని గురించిన వివరాలు తెలపండి?
మాది మొదట బావుపేట (ఆసిఫ్ నగర్). ఎల్ గందల్ సమీపగ్రామం. మా నాయన ఐదేండ్ల వయస్సులో ఉండగానే మా తాతగారు కాలధర్మం చెందగా, ఏ దిక్కులేని మా నాయనమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకొని తల్లిగారిలైన గునుకుల కొండాపురం వచ్చింది. మా అమ్మమ్మకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. అందరూ మా నాయన కంటే చిన్నవారే. పెద్ద కుమార్తె (మా తల్లిగారు)ను మా నాయనకిచ్చి పెండ్లి చేసి ఇంట్లోనే ఉంచుకొని, తనకున్న 50 గుంటల భూమిని అల్లునికి, కొడుక్కు సమానం పంచి ఇచ్చాడు మా తాత. అందుకు ప్రతిగా మా నాయిన మా మేనమామకు, మా ఇద్దరు చిన్నమ్మలకు పెళ్లిళ్లు చేయించి, తర్వాత తాను విడిగా ఇల్లు కట్టుకొన్నాడు. అప్పటికి నేను జన్మించాను (1950). తర్వాత 15 సం|| అదే ఇంట్లో కాపురముండి మా ఊళ్లో 4వ తరగతి వరకే ఉంది కాబట్టి 5-9 తరగతులు చదివించినారు. తదుపరి రీంనగర్ కు మకాం మార్చారు. నేత కార్మికుల కోసం 1960లో పద్మనగర్ లో రేకుల ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, అందులో ఒకటి మా నాయనకు కేటాయించబడింది. 1964లో మేము ఇక్కడికి వచ్చాము. నా తర్వాత ముగ్గురు చెల్లెండ్ల పోషణ కొరకు మా నాయన కొన్నాళ్లు మగ్గం నేసి, మరికొంత కాలం (ఎం.ఏ. పూర్తయ్యేవరకు) బర్లనుకొని పాలు అమ్ముతూ జీవనం గడిపాడు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత 1976లో ఆయనకు అన్ని పనుల నుండి విశ్రాంతి కల్పించాను. ఐనా ఊరకే ఉండటం ఇష్టంలేక 76వ యేట వాస్తు, జ్యోతిష్యం నేర్చుకొని ప్రజాసేవ చేసేవాడు. పెండ్లికార్యం తప్ప మిగతా శుభాకార్యాలు నిర్వహించేవాడు. పద్మనగర్ లోని రెండు గుడుల నిర్మాణానికి విరాళాలు వసూలు చేయడంలో కీలకపాత్ర వహించాడు. 86వ యేట అనాయాస మరణం ఆయనను వరించింది.
ఇక నా విషయానికి వస్తే నాకు ముగ్గురు కుమారులే. ముగ్గురూ ఉన్నత విద్యనభ్యసించిన వారే. పెద్ద కొడుకు రాజశేఖర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. హైదరాబాద్ లో స్వంత ఇంట్లో ఉంటున్నాడు. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు. భార్య వసంత లక్ష్మి. ఎమ్మెస్సీ జువాలజీ హోమ్ మేకర్. రెండవ అబ్బాయి చంద్రశేఖర్. బెల్లంపల్లిలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్. మంచిర్యాలలో స్వంత ఇల్లుంది. ఇద్దరు కొడుకులు. భార్య శిరీష. బియస్సీ, బి.ఎడ్. హోమ్ మేకర్. చిన్న కొడుకు ఇందుశేఖర్ ఆల్ఫోర్స్ లో అడ్మినిస్ట్రేటర్ మాతోటే పద్మనగర్‌లో ఉంటున్నాడు. ఆయనకు ఒక కూతురు. భార్య భాగ్యలక్ష్మి, ఎం.బి.ఏ., హోమ్ మేకర్. అన్నీ స్థానికమైన సంబంధాలే. నా భార్య భారతి తల్లిగారి ఇల్లు గునుకుల కొండాపురంలో మా ఇంటి ముందే ఉండేది. 1973లో ఎం.ఏ. పరీక్షలకు కొద్దిరోజుల ముందే మా వివాహం మే, 18న జరిగింది.
సాహిత్య విమర్శకు తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి పురస్కారం’ ప్రకటించింది కదా! దీనిపై మీ అనుభూతి ఏమిటి?
నా సాహిత్య కృషిలో భాగంగా సాహిత్య విమర్శకు తెలుగు విశ్వవిద్యాలయం వారు నాకు ‘కీర్తి’ పురస్కారం ప్రకటించడం సంతోషదాయకమే. ఐతే నాకు సాహిత్య విమర్శలో కంటే పరిశోధన విషయంలో నేను చేసిన కృషికి ఈ పురస్కారం లభించి వుంటే నేను మరింత ఆనందించేవాడిని.
భవిష్యత్తులో మీరు చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి తెలపండి?
ఇప్పటికి నేను 11 రచనలు చేసాను. చేపట్టబోయే ప్రాజెక్టులేమీ లేవు కాని నాలుగు పుస్తకాలు
“హరిదాసు రచనలు వ్యక్తిత్వం, సాహిత్య విమర్శ గ్రంథం, సమగ్ర సుమతీ శతక పద్యావళి మరియు దేశ విదేశాలలో వింతలు విశేషాలు డి.టి.పి. దశలో ఉన్నాయి. త్వరలోనే వాటిని అచ్చు వేయిస్తాను. ఓపిక, శక్తి ఉంటే నా దగ్గరున్న యాత్రా చరిత్రల వివరాలతో రెండవ భాగం వేయాలని వుంది.
మహా మహోపాధ్యాయ, కవి పండితులు, నిఘంటు నిర్మాతలు, గుణ గరిష్ఠులు, ఆచార్య వరిష్ఠులు, సంస్కృతాంధ్రభాషా సాహిత్యాలలో పండితులు నిగర్వి నిరాడంబురులు ఆచార్య రవ్వా శ్రీహరిగారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి భాషామతల్లి సేవలో జీవనయానం కొనసాగించిన బహుముఖ ప్రజ్ఞాశీలి ఆచార్య రవ్వాశ్రీహరిగారు. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠం నుండి దిద్దుకున్న సంస్కృత భాషా తిలకం ఉపకులపతి పీఠమెక్కి విద్యా ప్రభలు పంచింది. ఎం.ఎ.(తెలుగు) ఎం.ఎ.సంస్కృతం, భాస్కర రామాయణం – విమర్శనాత్మక పరిశీలన అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టాను పొందిన ప్రతిభ వారిది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఒరియంటల్ కళాశాలలో ఉపన్యాసకులుగా, ఉపన్యాసక వృత్తిలోకి అడుగిడినారు. సీనియర్ తెలుగు పండితుని నుంచి ప్రొఫెసరందాకా ఆదర్శవంతమైన అద్భుతమైన బోధన చేసిన ఉత్తమ ఆచార్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ద్రావిడ యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా, హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం ఇన్ చార్జ్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన పరిపాలనా దక్షత వీరిది. రవ్వా శ్రీహరిగారు వివిధ విశ్వవిద్యాలయాలలోని విద్యా సంఘాలతో లెక్కకు మిక్కిలి పదవులు నిర్వహించిన ఘనత వీరిది.
శ్రీహరిగారు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీహరి నిఘంటువు. తెలుగు సారస్వత క్షేత్రంలో నిలిచిపోయే అనేక అంశాలను అనుశీలించారు. తెలుగు నిఘంటువులున్నంత కాలం, సూర్యరాయాంధ్ర నిఘంటువుతోపాటు ‘శ్రీహరి నిఘంటువు’ కూడా నిలిచిపోతుందని పరిశోధకుల అభిప్రాయం.
మరొక అద్భుత గ్రంథం సంకేత పదకోశం. దీనిలో మనకు కావల్సినన్నివ్యాకరణ, తర్క, మీమాంస, జ్యోతిష, అలంకారాల ఆయుర్వేద మొదలైన శాస్త్రాలకు సంబంధించిన పదాల కూర్పు జరిగింది. రెండవ ముద్రణలో మరిన్ని అంశాలను చేర్చి పాఠకులకు ఆసక్తిని కలిగించారు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య కీర్తనల్లోని అచ్చ తెలుగు పదాలను, క్లిష్టమైన భాషాంశాలను భక్తి భావ సంపన్నతను, సంగీత ప్రావీణ్యతను భాషా ప్రయోగ చతురతను ఎన్నింటినో అన్నమయ్య పదకోశంలో వివరించిన విజ్ఞానవంతులు ఆచార్యులు. తెలంగాణా భాషా ప్రాచీనతను, ప్రామాణికతను ఎత్తి చూపిన శ్రీహరిగారి రచన తెలంగాణా మాండలికాలు – కావ్య ప్రయోగాలు. తెలంగాణాలో వాడుకలో వున్న ఎన్నో పదాలకు అర్థాలను తెల్పినారు. నల్లగొండ జిల్లా ప్రజల భాష….. మాండలిక పదకోశం నిర్మించినారు. వ్యాకరణ పదకోశము, వాడుక తెలుగులో అపప్రయోగాలు, లఘుసిద్ధాంత కౌముది, పాణినీయ అష్టాధ్యాయి తెలుగు అనువాదం , కాశీకాసహితం ౨ సంపుటాలు) సంస్కృత రచనలలో సంస్కృత సూక్తి ముక్తావళి సంస్కృత న్యాయాలు, సంస్కృత నీతి రత్నాకరం, సంస్కృత న్యాయదీపిక అనువాదాలలో డా|| సి.నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా ఫిరదౌసి, గబ్బిలం వేమన శతకం శేషప్ప నరసింహ శతకం, మాతృగీతమ్, స్వీయరచనలు సంస్కృతీ వైజయంతితోపాటు అనేక రచనలకు సంపాదకత్వం వహించిన కవి పండితులు, భాషావేత్త, వీరి సాహిత్య వ్యాసాలు చాలావరకు పరిశోధనాత్మకమైనవి, ఆలోచనాత్మకమైనవి. రవ్వాగారి గ్రంథాలలో ప్రామాణికత, శాస్త్రీయ స్పష్టంగా గోచరిస్తుంది. తెలుగులో భాషా సాహిత్యానికి సంబంధించిన వీరి రచన ఉదయభారతి. ఇందులో తెలుగు, సంస్కృతం భాషా సాహిత్యాలకు వ్యాసాలు, వ్యాకరణ సంబంధితాలున్నాయి. తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, భాస్కర రామాయణు – విమర్శనాత్మక పరిశీలనము (సిద్ధాంత గ్రంథము)
శ్రీహరిగారి రచన భాషా విశేషాంశాలు, వ్యాకరణ సంబంధితాలు, సాధికారతతో చెప్పి పరిశోధకులకు, భాషా ప్రియులకు అనేక విషయాలు తెల్పి ఇంకా తెల్పవలసిని అనేకం ఉన్నాయంటూ భావి పరిశోధకులకు వదిలివేసినారు.
నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండలం వెలువర్తిలోని నిరుపేద చేనేత కుటుంబంలో 5 మే 1943న రవ్వా వేంకటటనరసమ్మ,నరసయ్య దంపతులకు జన్మించినారు. అమ్మమ్మ తాతయ్యల ప్రోత్సాహంతో భువనగిరిలో 5వ తరగతి వరకు చదివినారు. తల్లగారి మరణంతో చదువుకు అవాంతరం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి శ్రీహరి గారిని చదివించలేనని తెలియజేశారు. దినపత్రికలోని యాదగిరి దేవస్థానము సంస్కృత విద్యాపీఠం ఉచిత చదువును భోజనాల్ని కల్పిస్తారని తెల్సుకొని అక్కడ చేరిన ఆచార్యులవారి జీవితం మలుపు తిరిగింది. అక్కడ నుండి బయలుదేరి ఉన్నత చదువులు, ఉన్నతోద్యోగాలు నిర్వర్తించిన ఉభయభాషా ప్రౌఢి.
ఆచార్య శ్రీహరిగారి పంచశతి (75 సంవత్సరాలు) పురస్కరించుకొని ‘శ్రీహరి విజయం’ పుస్తకం వేయడం జరిగింది. దీనిలో అనేక వ్యాసాలు సాహితీవేత్తల అభిప్రాయాలు, రచనలు వీరి సంబంధిత సాహిత్య విశేషాంశాలు పొందుపరచబడినాయి.
అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన, నిఘంటువు నిర్మాణం వీరి ప్రతీ అక్షరం వినూత్నం. వీరీ విశేష కృషికి పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. సంస్కృతి విద్యాపీఠ్ తిరుపతి వారి మహామహోపాధ్యాయ కేంద్ర సాహిత్య అకాడమి వారి పురస్కారం (అనువాద రచనకు), తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, జాషువా సాహిత్య పురస్కారం, న్యూజెర్సి అమెరికావారి బ్రౌన్ పురస్కారం, సౌశీల్య పురస్కారం, పరవస్తు చిన్నయ సూరి జాతీయ పురస్కారం లాంటి చాలా పురస్కారాలు పొందినారు.
ఆచార్య రవ్వా శ్రీహరిగారంటే నడిచే విజ్ఞాన సరస్వం. వీరి గురించి రాయటం ఒడవని ముచ్చట. ఇలాంటి మహానుభావులపై అత్యంత ఇష్టంతో, జాగరూకతతో అల్పుడిని అంటూ అనల్పమైన శ్రీహరిగారి తెలుగు రచనలు – సమగ్ర పరిశీలనపైన డా|| సి.యాదగిరి ఆచార్య సాగి కమలాకరశర్మగారి వద్ద పరిశోధన చేసి పట్టాను పొంది తెలుగు ఉపాధ్యాయులు కాకున్నా డా || యాదగిరి గారు తమ పరిశోధనలో ఎన్నో విషయాలను తేటతెల్లం చేసినారు. ఇంకా రవ్వాగారి మీద చాలా పరిశోధనలు రావాల్సి ఉంది.
ఆచార్య రవ్వా శ్రీహరి గారి కలం నుండి ఇంకా ఎన్నోరావల్సి ఉండేది. అనారోగ్య కారణాల వలన పూర్తి కాలేకపోయినాయి. ప్రస్తతం డా||సి.యాదగిరి గారు పరిశోధనలో భాగంగా శ్రీహరి చేసిన ఇంటర్వ్యూ యదాతథంగా మీకు అందిస్తున్నాం.
-కె.ఎస్.అనంతాచార్య
వెలువర్తి వెలుగు రవ్వ!!
సార్ మీ బాల్య విశేషాలు తెలియజేయండి?
మా అమ్మమ్మగారి ఊరు రామన్నపేట తాలుకాలోని ‘మునిపంపుల’ గ్రామం. అక్కడ చదువు బాగా ఉంటుందని మా అమ్మగారు ప్రాథమిక విద్యాభ్యాసం కోసం అక్కడే ఉంచినారు. నాలుగవ త
రగతి వరకు అక్కడే చదివినాను.
పల్లెటూరి చదువుల ప్రభావం వివరించండి?
‘మునిపంపుల’ పల్లెటూరైనా అక్కడి తల్లిదంద్రుడుల తమ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని తమ పిల్లలను చక్కని విద్యావంతులుగా చేయాలని వారికి ఆసక్తి ఉండేది. అందువల్ల అక్కడి అధ్యాపకులందరు కూడా చక్కగా విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని మంచి విద్యావంతులుగా సిద్ధం చేసేవారు.
ఉన్నత పాఠశాల చదువులవరకు ఏమైనా విశేషాలు తెలియజేయండి?
మునిపంపులలో నాల్గవ తరగతి అయిపోగానే ఉన్నత పాఠశాల విద్యభ్యాసం కోసం భువనగిరిలోని ప్రాథమికోన్నత పాఠశాల లో చేరడం జరిగింది. అక్కడ ఒక సంవత్సరం మాత్రమే చదివి 5వ తరగతి పూర్తి చేసుకున్నాను.
పాఠశాల చదువులు వదిలిపెట్టి గురుకుల విద్యకు ఎలా వచ్చారు?
5వ తరగతి పూర్తి చేసిన సంవత్సరమే వేసవి సెలవులలో మా అమ్మగారు పరమపదించడంవల్ల నా చదువు కొనసాగే సూచనలు సన్నగిల్లినాయి. ఇక పై తరగతులు చదివించడం, కుటుంబ ఆర్థిక కారణాల కారణంగా సాధ్యం, కాదని మా, నాన్నగారు చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆ సమయంలోనే ఒకరోజు పత్రికలో యాదగిరి దేవస్థానంవారి సంస్కృత విద్యాపీఠం ప్రవేశానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఆ పాఠశాలలో చేరే విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యాలు ఉంటాయని, ఫీజులేవి ఉండవని సంస్కృతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఎంట్రెన్స్ పరీక్షకు బోధన ఉంటుందని తెలియచేసినారు. ఆ ప్రకటన చూసి యాదగిరి గుట్ట సంస్కృత విద్యాపీఠంలో చేరడం జరిగింది. అక్కడే నాలుగు సంవత్సరాలు సంస్కృత విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత సికింద్రాబాద్ లోని మున్నాలాల్ సంస్కృత కళశాలలో ఒక సంవత్సరం చదివి ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తీర్ణుడను కావడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో చేరి నాలుగు సంవత్సరాలు సంస్కృత వ్యాకరణాన్ని అధ్యయనం చేసి బి.ఓ.ఎల్. పట్టాను ప్రథమ శ్రేణిలో సంపాదించినాను.
సంస్కృత కళాశాలలో మీ చదువు ఎలాంటి నియమాలతో కొనసాగేది?
నేను చదువుకున్నటువంటి సంస్కృత పాఠశాలలో ఇంచుమించు అందరూ బ్రాహ్మణులే ఉండేవారు. నలు
గురైదుగురు మాత్రమే బ్రాహ్మణేతరులు ఉండేవారు. వీరు కూడా బ్రాహ్మణ విద్యార్థుల మాదిరిగా బ్రాహ్మణ ఆచారాలను పాటించాల్సి ఉండేది. విద్యార్జనే ప్రధానంగా పెట్టకున్నవాణ్ణి కనుక వారి నియాలన్నింటిని నేను కూడా తు.చ. తప్పకుండా అనుసరించేవాణ్ణి. ఆ నియమాలన్నీ కూడా తరువాతి కాలంలో నా క్రమశిక్షణ జీవితానికి మంచి పునాదులు వేసాయి.
గురువుల ప్రభావం మీ మీద ఎలా ఉండేది?
తొలిదశలో కేరళ సుబ్రహ్మణ్యశాస్త్రి గారు సంస్కృత అక్షరాభ్యాసం చేయించిన గురువులు. వారు అప్పుడే మైలాపూర్ సంస్కృత కళాశాలలో (మద్రాస్/ చెన్నై) శిరోమణి పరీక్షలో ఉత్తీర్ణులై యాదగిరి విద్యాపీఠంలో సంస్కృత అధ్యాపకులుగా చేరినారు. వారు మంచి అధ్యాపకులు, అంతేకాక విద్యార్థుల యొక్క క్రమశిక్షణపై మంచి శ్రద్ధ కలవారు. అందువల్ల వారి శిక్షణలో తొలిదశలో సంస్కృతాన్ని చక్కగా అధ్యయనం చేయడానికి పునాదులు పడ్డాయి. వారు తొలి దశలో వేసిన పునాదే నాకు తర్వాతి కాలంలో ఎంతో లాభాన్ని చేకూర్చింది. తొలి దశలో వారి ప్రభావం నాపై ఎంతగానో పడింది. ఆ తర్వాత నాకు వ్యాకరణ విద్యను ప్రసాదించినటువంటి గురువులు ముగ్గురు. ఒకరు కోయిల్ కందాడై శఠగోప రామానుజాచార్యులుగారు, శ్రీమాన్ ఖండవల్లి నరసింహశాస్త్రిగారు, శ్రీమాన్ అమరవాది కృష్ణమాచార్యులవారు. ఈ ముగ్గురూ వ్యాకరణ గురువులు. మునిత్రయం అనదగినవారు నాకు సంస్కృత వ్యాకరణాన్ని మహాభాష్యాంతం అనుగ్రహించిన గురువులు. వీరు నన్ను పుత్రునిలాగా భావించి నా విద్యాభ్యాసంతోపాటు నా యోగక్షేమాలు కూడా చూస్తూ నన్ను ప్రోత్సహించినవారు. వీరి ప్రభావం నా మీద అమితంగా పడిందని చెప్పవచ్చు.
సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుంచి వచ్చిన మీకు అధ్యయనంలో కలిగిన అనుభవాలు ఏమిటి?
సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుండి వచ్చిన నాకు సంస్కృత అధ్యయనంలో, శాస్త్ర అధ్యయనంలో కాని ఏ విధమయిన ఆటంకాలు ఏర్పడలేదు. మా అధ్యాపకులు అందరూ బ్రాహ్మణులే. అయినా నన్ను చాలా అభిమానంతో, ప్రేమతో చూచుకునేవారు. నేను బాగా చదువుతానని అందులోను బ్రాహ్మణేతర కుటుంబం నుండి వచ్చి వ్యాకరణ శాస్త్రాన్ని చక్కగా బ్రాహ్మణ విద్యార్థులతో సమానంగా అధ్యయనం చేస్తున్నందుకు వారెంతో సంతోషపడి నన్ను ప్రోత్సహించేవారు. ఒకసారి పరీక్షలో నేనెంతో బాగా రాసిన సమాధాన పత్రానికి సంతుష్టులయిన మా గురువుగారు శ్రీమాన్ శఠగోప రామానుజాచార్యుల వారు ఎంతో ఆనందించి నా పై తరగతి విద్యార్థులకు పాఠం చెబుతూ నా సమాధాన పత్రాన్ని వారికి చూపి నన్నెంతో ప్రశంసించినారట. ఈ విషయం విన్ననాడు నాకు మా గురువుగారు ఎంత విశాల హృదయులో అవగతమయింది. అంతేకాక నా మరో గురువు శ్రీ అమరవాది కృష్ణమాచార్యులవారు. నేను కళాశాల విడిచిపెట్టిన తర్వాత కూడా విద్యార్థులందరికీ కూడా నా గురించి చెబుతూ నన్ను ప్రశంసిఁచేవారని అప్పటి ఆ విద్యార్థులు వచ్చి చెప్పేవారు. వారి విశాల హృదయానికి నా జోహార్లు. కనుక విద్యాభ్యాస దశలో సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుండి వచ్చినా నన్నందరూ అభిమానించారే కాని నాకు ఏ విధమైన ఇబ్బంది కలుగలేదు.
సంస్కృతంలో డిగ్రీలు సాధించినా తెలుగు ఉపన్యాసకులుగా మీ అనుభవాలు?
నేను మౌలికంగా అధ్యయం చేసింది సంస్కృతమే కాని ఆ రోజుల్లో సంస్కృతం చదువుకున్న పండితులందరికీ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకులుగానే ఉద్యోగానికి అవకాశం ఉండేది. సంస్కృత అధ్యాపకుల ఉద్యోగాలు ఉండేవి కావు. కనుక నేను కూడా తొలి దశలో ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగానే చేరి 5,6 సంవత్సరాలు పనిచేసినాను. తెలుగులోను, సంస్కృతంలోను, ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయినాను. అయితే సంస్కృత శాఖలో నాకు అవకాశం రాకపోవడంతో తెలుగుశాఖలో ఉపన్యాసకునిగా చేరడం జరిగింది. అయితే సంస్కృతంలోలాగా తెలుగులో కూడా నేను ప్రావీణ్యం సంపాదించి తెలుగుశాఖలో కూడా ఉత్తమ అధ్యాపకుడిగా పేరు సంపాదించుకున్నాను.
భాషా పరిశోధనలకు ఎందుకు పూనుకున్నారు?
నాకు అభిమాన విషయం సంస్కృత వ్యాకరణం. అందులో మహాభాష్యాంతం చదువుకున్నాను. ఆ కారణంగా తెలుగు వ్యాకరణాలను కూడా బాగా అద్యయనం చేయడం జరిగింది. పాణినీయ వ్యాకరణంలో భాషా శాస్ర్తానికి సంబంధించిన మౌలికమైన అనేకాంశాలు ఉన్నాయని ఆధునిక భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆధునిక భాషా శాస్త్రం కూడా కొంత అధ్యయనం చేయడంవల్ల భాషా పరిశోధనపై నాకు ఎక్కువ ఆసక్తి కలిగింది.
వ్యాకరణ శాస్త్రంలో సాధించిన విజయాలు వివరించండి?
నేను అటు సంస్కృత వ్యాకరణాన్ని ఇటు తెలుగు వ్యాకరణాన్నిఇటు తెలుగు వ్యాకరణాన్ని రెండింటిని అధ్యయనం చేయడంవల్ల రెండింటిలో కొంత కృషి చేయడం జరిగింది. విశ్వవిద్యాలయంలో, కళాశాలలో అనేక సంవత్సరాలు బాల వ్యాకరణం, ప్రౌఢవ్యాకరణం, ఆంధ్రశబ్ద చింతామణి మొదలైన అనేక వ్యాకరణ గ్రంథాలను బోధించడం జరిగింది. సంస్కృతంలో లఘుసిద్ధాంత కౌముది గ్రంథంలో తెలుగు విద్యార్థులకు అవసరమయ్యే కొన్ని భాగాలను తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాగే పాణిని రచించిన అష్టాధ్యాయి గ్రంథాన్ని ఇటీవల కాశికావృత్తితో పాటుగా అనువాదం పూర్తి చేయడం జరిగింది. దీనిని తెలుగు అకాడమీ వారు రెండు సంపుటాలలో ముద్రించి వెలుగులోకి తెచ్చినారు.
నిఘంటు నిర్మాణంలో అనుభవాలు తెలియజేయండి?
మొట్టమొదటగా నేను తెలుగు అధ్యాపకుడిగా చేరి అధ్యాపన చేస్తున్నప్పుడు నాకు కలిగిన కొన్ని అనుభవాలే నా నిఘంటు నిర్మాణ కార్యక్రమానికి దోహమయినాయని చెప్పవచ్చు. నేను రచించిన నిఘంటువులన్నీ విద్యార్థులు యొక్క అవసరాలను తీర్చడం కోసమే. అయితే నిఘంటు నిర్మాణం అనేది చాలా శ్రమతో కూడిన పని. ఎంతోమంది సమష్టిగా చేయవలసిన పని, అయినా నాకా ప్ర్రకియపై ఉన్న అభిమానమే నాచే అనేక నిఘంటువులను నిర్మింపచేసింది. నిఘంటు నిర్మాణం వల్ల భాషకు సంబంధించిన అనేకాంశాలను నేను క్రొత్తగా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా “శ్రీహరి నిఘంటువు” నిర్మాణ సందర్భంలో తెలుగు సాహిత్యంలోని అనేక గ్రంథాలను పరిశీలించే అవకాశం కలిగింది. అనేక నిఘంటువులను పరామర్శించే అవకాశం కూడా కలిగింది.
సంస్కృతం నుండి తెలుగుకు, తెలుగు నుండి సంస్కృతంలోకి అనువాదాలు ఎందుకు చేయాలనుకున్నారు? వాటి నేపథ్యం, అనుభవాలు వివరించండి?
నేను విద్యార్థిగా ఉన్నప్పుడే నాకు సంస్కృత శ్లోక రచనపై ఎందుకో ఆసక్తి కలిగింది. మొట్టమొదటగా కాళహస్తీశ్వర శతకంలోని ఒక పది పద్యాలను సంస్కృతంలోకి అనువదించడం జరిగింది. ఆ శ్లోకాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృతశాఖ ప్రచురించే ‘జయంతి’ పత్రికలో ప్రచురింపబడ్డాయి కూడా. కొంతమంది అవి బాగున్నాయన్నారు. ఆ ఉత్సాహమ తెలుగులోని రచనలను సంస్కృతంలోకి అనువదించడానికి స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితోనే ప్రపంచ పదులు, ఫిరదౌసి, గబ్బిలం, నరసింహశతకం గ్రంథాలను, అన్నమయ్య సూక్తులను సంస్కృతీకరించడం జరిగింది.
‘విశ్వంభర’ లాంటి సినారె మహా కావ్యాలు ఎన్నో వుండగా, ‘ప్రపంచ పదులు’ ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
‘విశ్వంభర’లోని విషయం గహనమైంది. ‘ప్రపంచపదులు’లోని విషయం ప్రతి వ్యక్తిని స్పృశిస్తుంది. ఇదొక శతకం లాగా వుంది. ‘విశ్వంభర’లో గాఢత్వముంది. సులభ గ్రాహిత్యం తక్కువ. బాగా ఆలోచిస్తే గానీ అది అర్థం కాదు. ‘ప్రపంచపదులు’ అలా కాదు. శతకాల మాదిరిగా అందులోని భావాలు సమాజంలోని అందరికీ సంబంధించినవి. భాష కూడా సరళంగా వుంటుంది. సులభంగా అర్థం అవుతుంది. ఈ కారణాలచేత ‘ప్రపంచపదులు’ సంస్కృతంలోకి అనువదిస్తే అది అందరినీ ఆకర్షిస్తుందని భావించాను. అంతేకాకుండా ఇందులోని ఛందస్సులోనూ ఒక విశేషముంది. ముఖ్యఁగా సంస్కృతంలో ఒక కొత్త ఛందస్సును – రుబాయి ఛందస్సును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది అనువాదం చేస్తే , అందుచేత అదే ఛందస్సులో సంకలనంలోని 108 కవితలు అనువదించాను. అనువాదం అంటే సాధారణంగా భావాన్ని తీసుకుని ప్రాచీన ఛందస్సులైన చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం ఇత్యాదుల్లో పొందుపరుస్తారు. కానీ నేను, నారాయణరెడ్డిగారు ఏ ఛందస్సును, ఏ మాత్రా ఛందస్సును ఆశ్రయించి ఆ రుబాయిలను వ్రాశారో, అదే పద్ధతిలో సంస్కృతంలో వ్రాశాను. సంస్కృతంలో సంప్రదాయ పద్దతులకు భిన్నంగా వ్రాయడం సాధారణంగా ఉండదు. అయినా నేను ఆధునికంగా వ్రాశాను.
నారాయణరెడ్డిగారి కవిత్వం ఎక్కువగా శబ్దాశ్రయ చమత్కారానికి చెందింది కదా? సంస్కృతంలోకి మీరు ఎలా అనువదించారు?
చాలావరకు ఆయన చూపినటువంటి శబ్దాలకు సంబంధించిన సొగసులన్నీ సంస్కృతంలో తీసుకురావడానికి ప్రయత్నించాను. ఎక్కడో కొన్ని రాలేదు కానీ ఎనభై శాతం దాకా వారు శబ్దాలంకారాల్లో చూపిన సొగసును సంస్కృతంలో తెచ్చాను. అదే ఛందస్సులో అంత్యప్రాసలతోపాటు అనువదించాను. మూల రచనలాగే నా అనువాదం లయాత్మకంగా, సరళంగా వుంది.
లోగడ మీరేమి సంస్కృతీకరించారు?
మొట్టమొదటి నుంచీ నేను సంస్కృతంలో కృషి చేసినప్పటికీ సంస్కృతంలో ఈ అనువాద ప్ర్రకియను మాత్రం ఈ ‘ప్రపంచ పదులు’తోనే ప్రారంభించాను. దీని తర్వాత మహాకవి జాషువా ‘ఫిరదౌసి’ కావ్యాన్ని సంస్కృతంలోకి తెచ్చాను. ఆయన మహాకావ్యం ‘గబ్బిలం’ ‘తైలపాయిక’ శీర్షికన సంస్కృతీకరించాను. ఇవి కాకుండా నేరుగా సంస్కృతంలో శతక రూపంలో ‘మాతృగీతిక’ను ఎప్పుడో వ్రాశాను. మొదట పరిశోధన, నిఘంటు సంబంధ కృషి చేశాను. కవిత్వపరమైన కృషి చాలా ఆలస్యంగా ప్రారంభించాను.
సంస్కృతంలో పాఠకులు చాలా తక్కువగా ఉన్నారు కదా? అలాంటప్పుడు మీ ప్రయత్నం పాఠకులకు ఎంతవరకు చేరుతుందని భావిస్తున్నారు?
సంస్కృత పాఠకులను మనం మొత్తం దశంలో పరిగణలోకి తీసుకోవాలి. విదేశాలలో కూడా సంస్కృతం వుంది. మన దేశంలో ఎంత శ్రద్ధతో సంస్కృతం చదువుతున్నారో, అంత శ్రద్ధగా విదేశాలలోనూ సంస్కృతం చదువుతున్నారు. ఆ మధ్య కార్డోనా అనే గొప్ప సంస్కృత జ్ఞాని ఇక్కడికి వచ్చారు. ఆయన కాశీలో వుండి సంప్రదాయ పండితుల వద్ద మహాభాష్యం, వ్యాకరణం చదువుకుని గొప్ప భాషావేత్తగా ప్రసిద్ధికెక్కారు. ఇలా ఇఁకా చాలామంది వున్నారు. సంస్కృతం విశ్వవ్యాప్తమైన భాష. కాబట్టి మన దేశంలో, విదేశాలలో సంస్కృతం చదువుకునేవారు పెద్ద సంఖ్యలో వున్నారు. వారు ఈ గ్రంథాలు చదివితే చాలు.
మరి సంస్కృతం మృతభాష అని కొందరు హేతువాదులే వాదిస్తున్నారు. మీరేమంటారు?
మృతభాష అంటే వారి దృష్టి – వ్యవహారంలో లేని భాష అని. వ్యవహారానికి ఉపయోగించని భాషలు ఎన్నో ఉన్నాయి. విజ్ఞానమంతా ఈ సంస్కృత భాషలోనే వుంది. అందుచేత సంస్కృత భాష విషయంలో ఇది దురభిప్రాయం. ఇలా ఎందుకు జరిగిందంట – సఁస్కృత భాషలో అనేక సాంకేతిక రంగాలకు చెందిన శాస్ర్త గ్రంథాలు వున్నప్పటికీ కేవలం ఆయుర్వేదం, ఖగోళశాస్త్రం మాత్రమే ఇంతకాలంగా ఇతర భాషలలోకి వచ్చాయి. మిగతా శాస్త్రాలు ఇతర భాషల్లోకి రాలేదు.
ఈ తరుణంలోనైనా మిగతా సాంకేతిక శాస్త్రాలను కూడా ప్రాంతీయ భాషలలోకి తేవచ్చు కదా?
అనువాదం చేయవచ్చు. కానీ ఆ పరిభాషిక పదాలు ప్రస్తుతం అర్థం కావు. అవి వ్యవహారంలో లేవు కాబట్టి క్లిష్టంగా వుంటాయి. నేను భరద్వాజ విమాన శాస్త్రం చదివాను. ఇలా ఇంకా ఎన్నో శాస్త్రాలు వున్నాయి. మైసూరు విశ్వవిద్యాలయం వారు “శివతత్త్వ రత్నాకరం” అనే గొప్ప గ్రంథం ప్రచురించారు. అందులో నగరం ఎలా కట్టాలి? ఏ భవన ఎలా నిర్మించాలి? తోటలు ఎలా, ఎక్కడ వుండాలి? తోటల్లో ఎలాంటి చెట్లు పెంచాలి? ఊళ్ళో ఎలాంటి చెట్లు పెంచాలి? వాటికి ఎలాంటి ఎరువులు వేయాలి? ఇత్యాదులు అన్నీ చెప్పారు. మేఘాల గురించీ చెప్పారు. అవి ఎన్ని రకాలు, ఎలాంటి మేఘం వర్షిస్తుంది లాంటి వెన్నో వున్నాయి. అలాగే – ‘రత్నశాస్త్రం’, ‘లోహశాస్త్రం’, ‘జలార్గళ శాస్త్రం’ వుంది. ఇందులో విమానశాస్త్రం హిందీలోకి వచ్చింది. మిగతావి అన్నీ సంస్కృతంలో మాత్రమే వున్నాయి. వాటిని ప్రస్తుతం ఇతర భాషలలోకి పారిభాషిక పదాలు వెదికి అనువదించడం చాలా కష్టం. శ్రమపడి ఒకవేళ ఎవరైనా అనువదించినా ఆ పారిభాషిక పదావళి ఎవరికీ అర్థం కాదు. భూకంపాలు ఎప్పడు వస్తాయి? అనే అంశంపై ఈ మద్య తిరుపతిలో కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వారు ఇప్పటి శాస్త్రంతో పోల్చుతూ, వరాహమిహిరుడు ప్రభృతులు ఏమి చెప్పారో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే మహాభారతంలోని వాస్తు విజ్ఞానాన్ని గురించి వివరిస్తూ ఆ మధ్య తెలుగులో ఒక గొప్ప సిద్ధాంత గ్రంథం వచ్చింది.
సంస్కృతంలో విజ్ఞానం ఇంత వుండగా, ఆ భాష గురించిన దురభిప్రాయం కేవలం మన దేశంలోనే వుంది. అన్ని విదేశాలలోనూ సంస్కృతం పట్ల గౌరవభావమే ఈనాటికీ నెలకొని వుంది. నిజానికి హేతువు లేని వాదాన్ని మన దేశంలో హేతువాదులే చేస్తున్నారు. ‘ధ్వన్యాలోకం’, ‘రసగంగాధరం’ లాంటి గ్రంథాలు ఇంకెక్కడా, ఏ భారతీయ భాషలోనూ లభించవు. భరతుని నాట్యశాస్త్రమంత గొప్ప గ్రంథం ఏమొచ్చింది? వాత్స్యాయనుడి కామసూత్రమంత గొప్ప కామశాస్ర్త
గ్రంథం ఏమొచ్చింది? అలాగే పాణిని ‘అష్టాధ్యాయి’ అంత గొప్ప వ్యాకరణం ఇంతవరకు రాలేదు. కార్డొనా పాణినిని క్షుణ్ణంగా పఠించాడు. చెప్పగలడు. మనవాళ్ళు కొంత చాదస్తం చేశారు. అయితే దాన్ని మనం పక్కనపెట్టి భాషను చదవాలి. అందులోని శాస్త్రాలు తెలుసుకోవాలి.
ఆంగ్లం ఇత్యాది ఆధునిక భాషలపై మోజు చూపుతున్న ఈ తరుణంలో మీరు సంస్కృత భాషా రంగంలోకి ఎలా ప్రవేశించారు?
అది విచిత్రంగా జరిగింది. నేను నాల్గవ తరగతిదాకా మా ఊళ్ళో చదివాను. ఐదవ తరగతి భువనగిరికి వెళ్ళి చదివాను. ఆ వేసవిలోనే మా అమ్మగారు పోయారు. అంతటితో నా చదువు కూడా ఆపేయ్యమన్నారు. భువనగిరిలో చదివితే డబ్బు కావాలి. నెలకు పదిహేను సేర్ల దాకా బియ్యం, ఖర్చులకు ఐదు రూపాయలు కావాలి. ఆ డబ్బు వీలు కాదు పంపన్నన్నారు మా నాయనగారు. ఆ సమయంలో యాదగిరి గుట్ట దేవస్థానంలో సంస్కృత విద్యాపీఠం పెడుతున్నట్టు, అక్కడ ఉచితంగా విద్య చెప్పడమే కాకుండా భోజన వసతి కల్పిస్తున్నట్టు పత్రికలో వార్త వచ్చింది. అది చూసి నేను, నా తోటి మరో నలుగురు స్నేహితులు కలిసి యాదగిరిగుట్ట వెళ్ళాం. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు, సురవరం ప్రతాపరెడ్డిగారు, మందుముల నరసింగరావుగారు అక్కడ కమిటీలో వున్నారు. వారి సహృదయతవల్ల నేను 1953లో అందులో చేరాను. అప్పుడు నాకు పది సంవత్సరాలు. నిజానికి మాకు అప్పుడు సంస్కృతం అంటే ఏమిటో తెలియదు. ఉచితంగా విద్య నేర్పుతారు, భోజనం పెడతారనీ, ఇంటి నుంచీ బయటపడవచ్చునని బయలుదేరాం.
అయితే ఒక షరతు పెట్టి లక్ష్మణశాస్త్రిగారు మమ్ములను తీసుకున్నారు. మూడు మాసాల పరీక్షలో ఉత్తీర్ణులయితే చదువు కొనసాగిస్తాననీ, తప్పితే తప్పించివేస్తానని చెప్పారు. దానికి కట్టుబడి చేరాం. చివరికి నేనొక్కణ్ణే ఆ పరీక్షలో ఉత్తీర్ణుడిని అయ్యాను. మిగతా నా స్నేహితులను ఇంటికి పంపారు. అమరకోశం, శబ్దమంజరి ఇత్యాదులు సంప్రదాయబద్ధంగా చెప్పారు. అక్కడ ఐదు సంవత్సరాలు చదివితే ‘ఎంట్సన్స్ కు’ పంపుతారు. నేను ‘ఎంట్రన్స్’ ఆ తర్వాత డి.ఒ.ఎల్., బి.ఒ.ఎల్. – అన్నింట్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. బి.ఒ.ఎల్.లో ప్రథమ శ్రేణిలో మొదటిర్యాంకు. వ్యాకరణం ప్రత్యేకంగా చదివాను. నేను పద్దెనిమిదిన్నర సంవత్సరాలకే బి.ఒ.ఎల్ పూర్తి చేశాను. దాన్ని ‘శిరోమణి’ అని మద్రాసులో, ‘విద్వాన్’ అని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంటారు. మొత్తం తొమ్మిది సంవత్సరాలు సంస్కృతం చదివాను. అందులో ఐదేండ్లు యాదగిరిగుట్టలో, నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ లోని సీతారాంబాగ్ లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో శఠగోప రామానుజాచార్యుల అధ్యాపకత్వంలో ఎంతో నేర్చుకున్నాను. బి.ఒ.ఎల్. కాగానే వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో (1962)లో అధ్యాపకుడిగా చేరాను. అంతకుముందు ప్రైవేట్ గా మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను. పండిట్ శిక్షణ పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను. ఇక్కడ ఐదు సంవత్సరాల అధ్యాపక వృత్తిలో వుండి ఎం.ఏ సంస్కృతం ప్రథమ శ్రేణిలో ప్రథమ ర్యాంకుతో 1967లో ఉత్తీర్ణుడనయ్యాను. బంగారు పతకం పొందాను. వెంటనే ఆంధ్ర సారస్వత పరిషత్తువారి కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరాను. ఇక్కడ చేరాక తెలుగులో ఎం.ఏ. చేసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. అంతకముందే బి.ఒ.ఎల్. కూడా తెలుగులో పూర్తి చేశాను. ఇక్కడ ఐదున్నర సంవత్సరాలు పనిచేశాక ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఉపన్యాసకుడిగా చేరాను. అక్కడే ‘భాస్కర రామాయణంపై’ పరిశోధన డాక్టర్ బి.రామరాజుగారి పర్యవేక్షణలో చేశాను. అలాగే భాషా శాస్త్రంలో పి.జి.డిప్లొమా కూడా ప్రథమ్రశేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. రీడర్ అయ్యాను. ఐదు సంవత్సరాలు పనిచేశాక ప్రొఫెసర్ అయి, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధిపతిగా తొమ్మిదేండ్లు పనిచేశాను. ఆ తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా 3 ½ సంవత్సరాలుగా చేశాను.
పరిశోధన రంగంలో మీరు అనుసరించిన పద్ధతులు వివరించండి?
ప్రధానంగా నా పరిశోధన సాహిత్యానికి, భాషకు సంబంధించినది. సాహిత్యంలో ప్రధానంగా ప్రాచీన సాహిత్యం పైనే కృషి చేయడం జరిగింది. భాస్కర రామాయణంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రచించినాను. ఇంతకుపూర్వం సాహిత్యం రంగంలో నిష్ణాతులయిన వేటూరి ప్రభాకర శాస్త్రి, మానపల్లి రామకృష్ణకవి, నిడదవోలు వెంకట్రావు, ఆచార్య బిరుదురాజు రామరాజు మొదలైన పరిశోధకులు అనుసరించిన పద్ధతినే నేను అనుసరించడం జరిగింది. భాషా రంగంలో కూడా కొంత పరిశోధన చేయడం జరిగింది. ఇందులో ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావు నాకు మార్గదర్శకులు.
ఉపన్యాసకులుగా మీ అనుభవాలు తెలియజేయండి?
ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా 6 సంవత్సరాలు పని చేసిన తర్వాత 1967లో ఆంధ్రసారస్వత పరిషత్ వారు నిర్వహిస్తున్న ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరినాను. ఆ రోజుల్లో ప్రాచ్య కళాశాలలో తెలుగు సంస్కృతాలలో మంచి ప్రవేశం ఉన్న ఆసక్తి ఉన్న విద్యార్థులు చేరేవారు. పాఠ్యప్రణాళికలో కూడా మంచి స్థాయి గల గ్రంథాలు పాఠ్యగ్రంథాలుగా ఉండేవి. వయస్సులో నాకంటే పెద్దవాళ్ళు కూడా విద్యార్థులుగా ఉండేవారు. అందువల్ల పాఠ్యాంశాలను బాగా చదువుకొని పాఠాలు చెప్పవలసి ఉండేది. ఆ కళాశాల సాయం కళాశాల కనుక నేను ఉదయమంతా కూడా ఈ పాఠ్యాంశాలను బాగా చదువుకని పాఠం సిద్ధం చేసుకుని వెళ్ళడంవల్ల నా విజ్ఞానం బాగా పెరగడానికి అవకాశం కలిగింది. మౌలికంగా నేను చదువుకున్నది సంస్కృతమే అయినా తెలుగు సాహిత్యం, తెలుగు వ్యాకరణాలు ఇవన్నీ నేను స్వయంగా చదువుకుని అధ్యాపనం చేసే అవకాశం లభించింది. ఈ కళాశాలలోని బోధన, తెలుగులో మంచి పాండిత్యం సంపాదించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను, కేంద్రీయ విశ్వవిద్యాలయంలోను తెలుగుశాఖలో అధ్యాపకుడిగా పనిచేసే అవకాశం కలిగింది. ఈ విశ్వవిద్యాలయాలలో ప్రధానంగా నేను వ్యాకరణం, సంస్కృతం, భాషా శాస్త్రం ఈ విషయాలను బోధించేవాణ్ణి. విద్యార్థులకు ఈ విషయాలు బోధించేటప్పుడు పరిశోధనాత్మక దృష్టిని, తులనాత్మక పరిశీలనా దృష్టిని అలవరచుకోవడం జరిగింది. వ్యాకరణం, సంస్కృతం ఇవి కొంత కఠినమైన అంశాలయినా విద్యార్థులు చాలా శ్రద్దగా వినేవారు. పరీక్షలలో కూడా బాగా వ్రాసి మంచి మార్కులు తెచ్చుకునేవారు. విద్యార్థులకు వ్యాకరణం, సంస్కృతం, భాషా శాస్త్రం చెప్పేటప్పుడు చాలా ఆనందంగా ఉండేది. వ్యాకరణం చెప్పేటప్పుడు ప్రధానంగా ఆయా వ్యాకరణ గ్రంథాలలోని ఉదాహరణలే కాక తక్కిన సాహిత్యంలోని ఉదాహరణలు కూడా చెప్పడంవల్ల విద్యార్థులకు ఆయా గ్రంథాల పరిచయం కూడా కలిగేది. నిజంగా ఉపన్యాసకుడిగా ఉంటూ విద్యార్థులకు పాఠాలు బోధించడం భగవంతుడిచ్చిన ఒక వరంగా భావించినాను.
తెలుగుశాఖ అధ్యక్షులుగా మీ అనుభవాలు వివరించండి?
కేంద్ర విశ్వవిద్యాలయం (హైదరాబాద్)లో నేను తెలుగుశాఖకు సుమారు 8,9 సంవత్సరాలు అధ్యక్షునిగా ఉన్నాను. అధ్యక్షునిగా ఉన్న కాలంలో నాకు నా సహాధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సహకరించినారు. అందువల్ల నాకు ఏ విధమైన ఇబ్బంది కలుగలేదు. విద్యార్థులంతా కేవలం చదువుమీదనే శ్రద్ధ కలవారు కావడం చేత అధ్యాపకులు బోధన, పరిశోధన రంగాలలో నిమగ్నులై ఉండడంవల్ల మా తెలుగు శాఖలోని కార్యక్రమాలన్నీ సజావుగా సాగేవి. విద్యార్థులంతా క్రమశిక్షణతో ఉండటంవల్ల పరిపాలనలో నాకేవిధమైన ఇబ్బంది కలుగలేదు. నేను అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఎంతోమంది విద్యార్థులు యుజిసివారి జె.ఆర్.ఎఫ్.స్కాలర్ షిపంలను పొందినారు. ప్రతి సంవత్సరము ఒకటి, రెండు సెమినార్లు నిర్వహిస్తుండడంవల్ల విద్యార్థులలో పరిశోధనాసక్తి బాగా వృద్ధి చెందింది. పాఠ్యంశాలు నిర్ణయించడంలో మా శాఖకు స్వాతంత్ర్యం ఉండడంవల్ల ఎప్పటికప్పుడు సమయానుకూలంగా విద్యార్థులకనుగుణమైన క్రొత్త పాఠ్యంశాలను నిర్ణయించే అవకాశం ఉండేది.
విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా మీ అనుభవాలు తెలుపండి?
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఉండగా నాకు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్ష పదవి లభించింది. ఇది ద్రావిడ భాషల యొక్క తులనాత్మక అధ్యయనానికి, ద్రావిడ సంస్కృతి అధ్యయనానికి ఏర్పడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయానికి నేను రెండో ఉపాధ్యక్షుణ్ణి. విశ్వవిద్యాలయం స్థాపించిన నాలుగవ ఏట (సంవత్సరం) నేను ఉపాధ్యక్ష పదవి చేపట్టినాను. అప్పటికి ఆ విశ్వవిద్యాలయానికి కొన్ని భవనాల నిర్మాణం జరిగినా విద్యాత్మకంగా మంచి పునాదులు వేయడం జరుగలేదు. రెండు, మూడు శాఖలు మాత్రమే అప్పటికి ఉండేవి. అధ్యాపకులు కూడా ఆరేడుగురు మాత్రమే ఉండేవారు. నేను ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత క్రొత్త శాఖలను ఏర్పాటు చేయడమే కాక ఆ శాఖల్లో అధ్యాపకుల నియామకాన్ని కూడా చేపట్టడం చేత దానికొక స్వరూపం ఏర్పడింది. విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో చేరడం జరిగింది. భవనాల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మొత్తంమీద నేను ఉపాధ్యక్షుడుగా ఉన్న మూడున్నర (3 ½) సంవత్సరాలలో ఆ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం కృషిచేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అధ్యాపకులు విద్యార్థులు, అధికారులు అందరూ సహకరించడంవల్ల ఈ విశ్వవిద్యాలయాన్ని నా పరిపాలనా కాలంలో నా శక్తి మేరకు అభివృద్ధి పథంలో నడిపింపగలిగాను.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల ముఖ్య సంపాదకులుగా మీ పరిశ్రమ, ప్రయోజనాలు వివరించండి?
అధ్యాత్మిక ప్రచారం కోసం గ్రంథ ప్రచురణను ఒక ప్రధాన సాధనంగా చేసుకున్న దేవస్థానాలలో ఏకైక దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. దేవస్థానంలో జరుగుతున్న గ్రంథ ప్రచురణల కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రత్యేక అధికారి అవసరమని భావించి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఐ.ఎ.ఎస్ గారు తృప్తినిచ్చినటువంటి వృత్తి అధ్యాపక వృత్తి. అధ్యాపనంవల్ల కలిగే ఆనందం ఎంతో గొప్పది. ఒక్కొక్కసారి ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకొని దానిని విద్యార్థులకు చెప్పినపుడు కలిగే ఆనందమే వేరు. పరిపాలనలో కొన్ని మంచి పనులు చేయవచ్చు. కాని పరిపాలనలో అందరి మన్నన పొందడం కష్టమే. దానివల్ల కలిగే తృప్తి తాత్కాలికమే అని భావిస్తాను. అధ్యాపక వృత్తిలో ఎంతో మందికి జ్ఞానభిక్షపెట్టి వారిని సమున్నత స్థాయికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ నాకు అధ్యాపనమంటే ఎంతో ఇష్టం. కుప్పంలో ఉపాధ్యక్షుడుగా ఉన్న కాలంలో కూడా ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు వ్యాకరణాన్ని బోధించేవాడిని.
అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన వంటి వాటిలో మీకు ఇష్టమైన అంశం ఏది? ఎందుకు?
అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన వంటి వీటిలో అన్నీ నాకు ఇష్టమైన అంశాలే. ఈ అంశాలన్నింటిలో ఇంతో అంతో నేను కృషి చేయడం జరిగింది. కొన్ని గ్రంథాలు కూడా రచించినాను. వాఙ్మయానికి సంబంధించినటువంటి ప్రతి ప్రక్రియ విశిష్టమైనదే. ఈ ప్రక్రియలన్నీ సాహిత్యానికి అవసరమైన అంశాలే.
మీ మాండలిక భాషా సంబంధ కృషి గురించి తెలుపండి?
చిన్ననాటి నుండి నాకు మాండలికాలంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా మా నల్లగొండ జిల్లా మాండలిక పదాలంటే ఎంతో ప్రాణం. చిన్నతనంలో ఇంట్లో మా అమ్మమ్మ వాడే ‘కొర్కాసు’, ‘సోయి’ వంటి మాండలిక పదాలు నాకిప్పటికీ జ్ఞాపకమున్నాయి. నేను ఉపన్యాసకుడిగా పనిచేస్తున్నప్పుడు మా నల్లగొండ జిల్లా మాండలిక పదాలను అధ్యయనం చేస్తూ “నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం” అనే గ్రంథాన్ని సమకూర్చినాను. అలాగే మాండలిక పదకోశం” అనే గ్రంథాన్ని సమకూర్చినాను. అలాగే మాండలిక పదాలకెన్నింటికో కావ్య ప్రయోగాలను గుర్తించి వాటికి కూడా ‘తెలంగాణా మాండలికాలు – కావ్య ప్రయోగాలు’ అని ఒక నిఘంటువును కూర్చినాను. ఈ రెండు నిఘంటువలేకాక అనేక మాండలిక పదాలను – వివిధ జిల్లాలకు సంబంధించిన వాటిని నా ‘శ్రీహరి నిఘంటువు’ కూడా చేర్చినాను.
ఈ రెండు నిఘంటువులకు కూడా విపులమైన పీఠికలను కూడా సంతరించినాను. నల్లగొండ జిల్లా మాండలిక పదకోశానికి వ్రాసిన పీఠికనే నల్లగొండ జిల్లా ప్రజల భాష అనే పేరుతో ముద్రించాను.
వీటితోపాటు మాండలికాలకు సంబంధించిన ఎన్నో వ్యాసాలను కూడా రచించడం జరిగింది. ఇటీవలే ప్రచురించిన అన్నమయ్య పదకోశంలోను, ‘అన్నమయ్య’ పదకోశంలోను, ‘అన్నమయ్య అచ్చ తెలుగు’ అన్న గ్రంథాలలో రాయలసీమ మాండలిక పదాలను, ఇతర మాండలిక పదాలను కూడా పేర్కొని అన్నమయ్యకు మాండలిక ప్రయోగాలపై ఉన్న అభిమానాన్ని వివరించడం జరిగింది.
ఆంధ్రసారస్వత పరిషత్తు మరియు వివిధ సాహిత్య, విద్యా విషయిక సంస్థలతో మీకు గల సంబంధం తెలుపండి?
నాకు మొట్టమొదటగా సంస్కృత భాషపై ప్రజలకు ఆసక్తిని పెంపొందించటానికి, సంస్కృత భాషా వ్యాప్తికీ ఏర్పడిన ‘సురభారతీ’ సమితితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. జస్టిస్ అల్లాడి కుప్పుస్వామిగారు, శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు, ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడుగారు మొదలైన ప్రముఖులెందరో ఈ సమితిలో ఉండేవారు. ఈ సంస్థకు నేను కొంతకాలం సంయుక్త కార్యదర్శిగా ఉండినాను. తర్వాత తెలుగుభాషా సాహిత్యాలకు తెలంగాణాలో ఎనలేని సేవచేస్తున్నఆంధ్రసారస్వత పరిషత్తులో సభ్యుడిగా, పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా ఉండి యథాశక్తి సేవలను అందించడం జరిగింది. ఆంధ్రసారస్వత పరిషత్తు ట్రస్టులో కూడా ఇప్పటివరకు నేను సభ్యునిగా ఉన్నాను. ఇవికాక సంస్కృత భాషా ప్రచారసమితి (హైదరాబాద్)కి కులపతిగాను, సరస్వతీ విద్యాపీఠానికి (ఆంధ్రప్రదేశ్) అధ్యక్షునిగాను ఉండి నా సేవలను అందించడం జరిగింది.
సాహిత్య సంస్థలతోనే కాక అనేక విద్యా సంస్థలతోను నాకు సంబంధం ఉంది. హైదరాబాద్ లోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలకు ఉపాధ్యక్షునిగాను, త్రిలింగ విద్యాసమితికి అధ్యక్షునిగాను, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పాలకమండలి సభ్యునిగాను, తెలుగు అకాడమి పాలకమండలి సభ్యునిగాను, ఇంటర్ మీడియట్ బోర్డు పాలకమండలి సభ్యునిగాను, ఎపి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ సొసైటీ పాలకమండలి సభ్యునిగాను ఇలా ఎన్నెన్నో సంస్థలతో సంబంధం ఉంది. అన్నమయ్య పదకోశ నిర్మాణానికి పూనుకున్నాను. అనేక పండితులను సంప్రదించి వివిధ ఆకారాలను పరిశీలించి, కొన్ని మారుమూల నిఘంటువులను పరిశీలించి నా శక్తి మేరకు నిఘంటువును సిద్ధం చేయడం జరిగింది. ఇది సమగ్రమైన నిఘంటువని భావించడం లేదు. నిజంగా ఏ నిఘంటువూ సమగ్రం కాదు. పండితుల సూచనతో ఈ నిఘంటువును సమగ్రం చేయడానికి ప్రయత్నించాను.
అన్నమయ్య భాషా వైభవంపై మీ కృషిని తెలియజేయండి?
అన్నమయ్య సంకీర్తనల్లో కనిపించే భాషా వైభవం ఎంతో గొప్పది. తెలుగు భాష యొక్క సహజమైన విరాట్ స్వరూపం ఆ సంకీర్తనల్లో గోచరిస్తుంది. అచ్చమైన తెలుగు పదాలు, మాండలికపదాలు, లోకోక్తులు, పదబంధాలు మొదలైన వాటివల్ల అన్నమయ్యకు తెలుగుభాషపై ఉన్న ప్రేమతోపాటు ఆయనకున్న సర్వతోముఖమైన పాండిత్యం వ్యక్తమవుతుంది. సంస్కృత దీర్ఘ సమాసాలతో రచనలు చేసే కాలంలో అలతి అలతి అచ్చ తెలుగు పదాలతో వ్యావహారిక భాషలో గొప్ప గొప్ప భావాలను అతి హృద్యంగా వర్ణించడం ఆయనకే చెల్లు. ఒక విధంగా వ్యావహారిక భాషకు, వ్యావహారిక భాష ఉద్యమానికి అతడే ఆద్యుడని చెప్పవచ్చు. అన్నమయ్య ప్రదర్శించిన ‘తెలుగు భాషా వైభవం’ నన్నెంతో ఆకర్షించింది. భాషా విశేషాలకు అన్నమయ్య సంకీర్తనలు పెన్నిధులని చెప్పవచ్చు. అందుకే అన్నమయ్య భాషపై నేను ‘అన్నమయ్య భాషవైభవం’, ‘అన్నమయ్య – అచ్చ తెలుగు, అన్నమయ్య నవ్వులు’ అన్న గ్రంథాలను ప్రచురించడం జరిగింది.
ఆధునిక కాలంలో తెలుగు పరిశోధకులకు అలబ్ధవాఙ్మయం గురించి మీ సలహాలు?
ప్రాచీన కాలంలో వివిధ కవులు రచించిన కావ్యాలన్నీ మనకిప్పుడు లభించడం లేదు. మన అలసత, అజ్ఞానం వల్ల పూర్వకవులు రచించిన ఎన్నెన్నో గ్రంథాలను ఎర్రన రామాయణం వంటి అమూల్యమైన గ్రంథాలను పోగొట్టుకున్నాం. ప్రస్తుతం మనకు లభ్యంకాని గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. సంకలన గ్రంథాలు, కావ్యపీఠికలు మొదలైన ఆధారాల ద్వారా ఈ గ్రంథాల ఆచుకీ తెలియవస్తుంది. ఈ అలబ్ధ వాఙ్మయంపై మానవలి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటి మహామహులు కృషిచేసిన విషయం తెలిసిందే. వారి ఆదర్శంతో ఈ విషయంలో నేను కొంత కృషిచేసి తెలుగులో అలబ్ధ వాఙ్మయం, అలబ్ధ కావ్య పద్యముక్తావళి అని రెండు గ్రంథాలను రచించడం జరిగింది. ప్రాచీన సాహిత్యంపై అభిమానం కలిగిన పరిశోధక విద్యార్థులు ఈ రంగంలో కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనివలన ప్రాచీనులు వివిధ ప్రక్రియలతో ఎంతో శ్రమించి రచించిన అమూల్య గ్రంథాలను గురించి తెలియవస్తుంది. అంతేకాక ఆయా గ్రంథాలు ఎవరి దగ్గరనైనా ఉంటేవాటిని సంపాదించి లోకానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ కృషి తెలుగు సాహిత్య చరిత్ర సమగ్ర రచనకు కూడా దోహదకారి అవుతుంది.
తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి మీ సూచనలు?
పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రాంత సాహిత్యానికి, తెలంగాణా ప్రాంత కవులకు, తెలంగాణ భాషకు ఏ కారణం చేతనో ప్రాధాన్యం దక్కలేదు. తెలంగాణాలో గొప్ప గొప్ప కావ్యాలు రచించిన కవులు ఎంతోమంది ఉన్నావారిని గురించిన అధ్యయనానికి ప్రాధాన్యం లభించలేదు. తెలంగాణాలో మరింగంటి కవులు మొదలయిన కవి కుటుంబాలు ఎన్నో ఉండినట్లుగా, ఆయా కుటుంబాలలోని కవులు తరతరాల సాహిత్యాన్ని పండించినట్లుగా మనకు తెలుస్తుంది. కనుమరుగై వెలుగులోకి రాని తెలుగు కవిపండితులను గురించి ఆచార్య బిరుదురాజు రామరాజుగారు ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. కనుక ఇక్కడి కవి పండితులు తెలంగాణా ప్రాచీన కవులను, పండితులను గూర్చి పరిశోధనలు చేసి వారి వైశిష్ట్యాన్ని వెలుగులోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక తెలంగాణా భాషను గురించి – పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా భాష ఎంతో ఈసడింపుకు గురైంది. తెలంగాణా మాండలికాలకు, విశిష్ట ప్రయోగాలకు రచనలో ఏ మాత్రం స్థానం లేకుండా ఉండేది. ఎక్కడైనా తెలంగాణా రచయితలు తమ మాండలిక పదాలను రచనలలో వాడినా పరిహాసానికి గురయ్యేవారు. తెలంగాణా భాషలో ప్రాచీనమైన పలుకుబడులు ఎన్నో కనిపిస్తాయి. ఉదాహరణకు కోలెన్, తల (సమయం), సంచకారి మొదలైనవి. తెలంగాణా భాషలో పదబంధాలు, సామెతలు ఎన్నో విశిష్టమైనవి ఉన్నాయి. అవన్నీ తెలుగుభాషకు అమూల్యమైన అలంకారాలు. వాటినన్నింటినీ ప్రస్తత రచయితలు తమ భాషలో వాడుకుంటూ తెలంగాణా భాష యొక్క వైశిష్ట్యాన్ని ప్రయోగ విశేషాలను అందరికీ తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తెలంగాణాలో ప్రత్యేకంగా వాడబడే మాండలిక పదాలకు, పదబంధాలకు, సామెతలకు ప్రత్యేకంగా నిఘంటువులు రావలసిన అవసరం ఉంది. తెలంగాణా భాషాభిమానులు ఇందుకు పూనుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాకరణ అధ్యాపకులకు మీ సూచనలు?
భాష అనేది వ్యాకరణ యుక్తంగానే వ్యవహరింపబడుతుంది. అయితే ప్రతి వ్యవహర్త తాను వ్యాకరణ యుక్తంగానే మాట్లాడినా, తాను మాట్లాడుతున్న భాషలోని నియమాలను వివరించలేదు. వ్యాకర్త మాత్రమే మనం మాట్లాడుతున్న భాషలోని భాషా నియమాలను గ్రహించగలడు. ఆ భాషా నియమాలే ఒక విధంగా వ్యాకరణం.
వ్యాకరణాన్ని బోధించే అధ్యాపకులు ప్రధానంగా వ్యాకరణ గ్రంథాలలో ఉన్న ఉదాహరణలను మాత్రమే విద్యార్థులకు బోధిస్తారు. అలా కాకుండా ఆయా కావ్యాలలోని ప్రయోగాలను కూడా విద్యార్థులకు తెలియచేయాలి. ఉదాహరణకు “ఉపయోగంబునందు ఆఖ్యాతకు తోడ వర్ణకంబగు” అనే బాల వ్యాకరణ సూత్రానికి బాల వ్యాకరణంలోని ఉదాహరణ మాత్రమే చెబుతారు. కాని మహాభారతం మొదలైన గ్రంథాలలోని ప్రయోగాలను వెదకి వాటిని కూడా విద్యార్థులకు చెప్పవలసిన అవసరం ఉంది. విద్యార్థులే స్యయంగా ఆ ప్రయోగ విశేషాలను గమనించే విధంగా ఉపాధ్యాయుడు శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. వ్యాకరణాన్ని కేవలం ఉపాధ్యాయుడు బోధించడం కాకుండా విద్యార్థులచే భాషా ప్రయోగాలలోని విశేషాలను గమనింపచేసే విధంగా ప్రయత్నం చేస్తే విద్యార్థికి వ్యాకరణం అంట ఆసక్తి కలుగుతుంది. వ్యాకరణమంటే అదొక కొరకరాని కొయ్య అనే భావం తొలగిపోతుంది.
మీరు అభిమానించే ప్రాచీన కవులు వారి ప్రత్యేకతను తెలుపండి ?
ప్రాచీన కవుల్లో నాకు బాగా నచ్చిన కవులు నన్నయ్య, తిక్కనలు. నన్నయ కాలానికి తెలుగులో కావ్య రచన అంతగా సాగలేదు. కావ్యాలు రాలేదు. కనుక తెలుగు సమగ్ర కావ్య రచనకు అనుగుణంగా పూర్తిగా రూపుదిద్దుకోలేదు.
