సాహిత్యమే నా జీవన గమనమంటూ, సాహిత్య సేవా నిరతునిగా ఇప్పటికీ సాహిత్యం పట్ల ఎనలేని మమకారంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న డా. శ్రీరంగాచార్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పడమంటే మల్లెపువ్వుకు పరిమళాలు అద్దడమే. ఆయన రాసుకున్న ఆత్మకథ ” జీవనపర్వం ” వారి గురించిన ఎన్నో విషయాలను పాఠకులతో లోతైన అధ్యయనం చేయిస్తుంది.
మొట్టమొదటగా ప్రస్తావనలోనే ” సారం పర్వణి పర్వణి ” అనే శ్రీమహాభారత కథకు సంబంధించిన పర్వం అనేది మానవ జీవితానికి అన్వయించుకుంటే జీవితం కూడా పర్వ (సంతోషం) మయమే. బాధలు గుర్తున్నంత సంతోషాలు గుర్తుండవు. చీకటి వెలుగులు, ఎత్తుపల్లాలతో కూడినదే జీవితం. కాబట్టే ఇది జీవన పర్వంగా రాశానని అని ఆయన చెప్పుకున్నారు. ఆయన గురించి ఆత్మీయ మాటలు పంచుకున్న తోటపల్లి రామేశ్వర శర్మ గారు ” ఈ పుస్తకంలో పాలెంలో మీరు చేసిన ఎన్నో విషయాలను వివరించకపోవడం మీరు కర్తవ్యం అనుకున్నారే గాని – వేరు కాదు” అని ప్రస్తావించడం శ్రీరంగాచార్య గారి ఉదాత్త వ్యక్తిత్వానికి దర్పణం.
శ్రీరంగాచార్య గారి పూర్వీకులు శ్రీ పెరుంబూదూరు వాస్తవ్యులు. శిష్యసంచారం చేత మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నప్పుడు ‘పానుగంటి’ ఇంటిపేరు కల వెలమదొరలు వారి ప్రతిభా పాటవాలను గుర్తించి రమ్మని కోరిన ఆహ్వానం మేరకు కొంతమంది మారేపల్లి, సల్కునూరు ప్రాంతంలో స్థిరపడగా, ఇంకొంతమంది చందుపట్ల గ్రామంలో నివాసయోగ్యంగా మలచుకున్నారు. అక్కడ నృసింహాలయంలో అర్చకత్వం వహిస్తూ, పౌరోహిత్యం నెరపుతూ జీవితాన్ని గడిపారు. ఆ వారసులే శ్రీరంగాచార్య గారు. ఈ పుస్తకంలో ఆయన చందుపట్ల గ్రామంలోని ఆనాటి ప్రజల జీవన స్థితి గతులను విస్తారంగా వివరించారు. దేవాలయాల నిర్మాణం, ఆకృతులు, శిల్పాలు, ఉత్సవాలు, వ్యవసాయభూములు, సేద్యం చేసే విధానాలు, ధాన్యపు నిల్వలు, ఆహారపదార్థాలు, వేషధారణలు, ఆచార వ్యవహారాలు, అలవాట్లు,క్రయ విక్రయాలు, పాడిపంటలు, కులవృత్తులు, వృక్షజాతులు, జంతు వాహనాలు, విద్యా వైద్య సదుపాయాలు…సంతతాభివృద్ధి చెందుతున్న చందుపట్ల గ్రామంలోని ఎన్నో విషయాలను కూలంకషంగా వర్ణించారు. ప్రతీ చిన్న అంశాన్ని ఆయన వివరించిన తీరు ఆయన సునిశిత పరిశీలనకు, మేధాశక్తికి, అపారమైన జ్ఞాపకశక్తికి తార్కాణం. కానీ ఈనాడు అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో నిత్యార్చనలు లేని విధానానికి ” ఎండిన వూళ్ళ గోడెరిగింపడెవ్వడు పండిన వూళ్లకే ప్రభువులంత” అనే రీతి ప్రదర్శిస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఎంతో ఆవేదన చెందుతారు. పూర్వ వైభవం రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తారు.
వీరి తండ్రి శ్రీ రాఘవాచార్యులు గారు బాల్యం నుండి స్వయంకృషితో సంస్కృతాంధ్రాలను , వైద్య, జ్యోతిష, పాంచారాత్రాగమ విద్యలనభ్యసించి ఆయా విభాగాల్లో గ్రంథ రచన చేసిన విద్యాతపస్వి. ఈయన రచించిన పాంచరాత్ర విధాన ‘మహోత్సవ విధిః’, ‘భగవత్ ప్రతిష్ఠావిధానం’ అనే దేవయాజ్ఞీక విధాన రచనలు ఆయన శతజయంతి సందర్భంగా శ్రీరంగాచార్య గారి సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఈ రెండు పుస్తకాలు వైష్ణవ సాంప్రదాయ దేవకార్యాలన్నింటికీ, పాంచారాత్రాగమ పాఠశాలల్లో విద్యార్థుల బోధనకు ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయంటే వారి కృషి ఎంత గొప్పదో తెలుస్తుంది. శ్రీరంగాచార్యులు గారు, వారి సోదరులలో లక్ష్మణమూర్తి గారిని గూర్చి ఈ పుస్తకంలో ప్రస్తావిస్తూ “గొప్ప పండితులు. గోపికా వల్లభం, సమర్పణం పద్యకృతులు, మరియు ఇతర రచనలు చేసి, బహుభాషా పారంగతులైన మా అన్నగారు నిరాఘాట కవితా ధురీణులు, మహావక్త అని, ఇంకా అముద్రిత రచనలు కూడా ఉన్నాయని” పేర్కొంటారు. మరొక సోదరులు నరసింహాచార్యులు గారిని గురించి వివరిస్తూ “వారు కూడా చక్కని పద్యకవి అని” వారి అనుజుల పాండిత్యాన్ని అభివర్ణిస్తారు. అంతేకాక బాల్యం నుండీ తాత, తండ్రి దగ్గరుండి నేర్పించిన అధ్యయనం మాకు ఈ విధమైన జ్ఞానాన్ని నేర్పించిందని చెప్తారు. వీరి మేనత్త అయిన వెంకట నర్సమ్మగారు కూడా గొప్ప జ్ఞాపకశక్తి కలవారని, తిరుప్పావై, స్తోత్రాలు, మంగళహారతులను కంఠపాఠంగా, నిర్దోషంగా చదివేదని చెప్తారు. ఇలా పాండితీ ప్రతిభ గల వారి వారసత్వాన్ని పొందిన వీరు ధన్యులు.
కళాశాల విద్యాభ్యాసాన్ని వివరిస్తూ “నిరంతర పఠనం ఒక వ్యసనంగా మార్చుకున్నందున- గురువులు చెప్పిన శబ్దాలు, ధాతువులు, చంపూ రామాయణం, రఘువంశ కిరాతార్జునీయ కుమార సంభవాల్లో కొన్ని సర్గలు, తర్కసంగ్రహం, హితోపదేశం, విక్రమార్క చరిత్ర, వేదంలో పంచసూక్తాలు, ఉపనిషత్తులో కొన్ని కంఠపాఠంగా నిలిచి ఈనాటికీ జ్ఞాపకంలో ఉండడం ఆనాటి విద్యావిశేషంగా” చెప్తారు. అంతేకాక విద్యాబోధన సమయంలో గురువుల క్రమశిక్షణతో కూడిన నియమాలను చదువుతుంటే నేటి స్థితిని పోల్చుకుంటే విద్యావ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మనకు తేట తెల్లమవుతుంది. “మొదటినుండీ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెనుగుశాఖ ఆచార్య వర్గంతో ఉన్న పరిచయం లోకాన్ని చదివించింది” అంటారాయన. గురుశిష్యులకుండాల్సిన సత్సంబంధం అలాంటిది. తన మిత్రులు, కాలేజీ విద్యార్థులు కొంతమంది తెనుగుశాఖలో ఆచార్యులుగా, శాఖాధిపతులుగా ఉండడం ఆనందమని…
“విబుధలోకంబు కవితైవ విద్యయనుచు
చదువు వచనార్థమునను సంశయము గలదె
విద్యలకు నెల్ల నుత్తమ విద్యకవిత
దాని తెలియుట విశ్వమంతయునుగనుట”
ఇంకా అటువంటివాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటారు. తెలంగాణ ఉద్యమ పరిస్థితులు కూడా ఇందులో ప్రస్తావించబడ్డాయి.
‘జీవనపర్వం’ ఆయన ఉద్యోగ జీవనాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ఎందుకంటే పాలెం కళాశాలలో 1966 లో ఆయన ఉద్యోగంలో చేరిన మొదటిరోజు నుండీ 2002 లో రిటైర్మెంట్ అయ్యేవరకు అక్కడే పనిచేయడం. ఇక్కడ ఆయన పొందిన అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. గురుశిష్యులు స్నేహితులవలె మెలిగేవారని ” వృద్ధాః శిష్యాః గురోర్యువా” అన్నట్టు ఉండేదని, ప్రతి విద్యార్థి ” స్పర్థయా వర్థతే విద్యా” సూక్తిని సార్థకం చేసినారని ఆనాటి సంగతులను గుర్తుతెచ్చుకుంటారు. ఇక ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తోటపల్లి సుబ్రహ్మణ్యం గారు ( సుబ్బయ్య గారు ). ఎన్నో విద్యాసంస్థలను, మరి కొన్ని ఇతర సంస్థలను స్థాపించి, దీపం, నీరు, బాట లేని గుడిశెల గ్రామాన్ని సమైక్య రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా నిల్పిన మహనీయులు. ఈయనను ప్రస్తావిస్తూ ” పాలెం గ్రామాభివృద్ధికి మానవ రూప అవతార వైభవ మూర్తి” అని శ్లాఘిస్తారు. అంతటి గొప్ప వ్యక్తి ఆర్థిక బాధలను అనుభవించడాన్ని “కమలములు నీట బాసిన’… ‘ఎప్పుడు సంపద కల్గిన’…లాంటి పద్యాలకు ప్రత్యక్షసాక్ష్యంగా పేర్కొంటారు. రజ్జువే సర్పంగా మారిన సన్నివేశాలు ఏర్పడ్డాయని వాపోతారు. పాలెంలో శ్రీరంగాచార్యుల వారు కూడా నిస్వార్థంగా కళాశాల అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు.
1980 ఫిబ్రవరి 16 వ తేదీన సంభవించిన ప్రపంచ ప్రసిద్ధ సూర్యగ్రహణానికి పాలెం చరిత్రకెక్కింది. 40 దేశాల శాస్త్రవేత్తలు (అందులో 5 గురు నోబెల్ బహుమతి గ్రహీతలు) 40 రోజుల ముందే పాలెం చేరి ప్రయోగశాల ఏర్పాటు చేయడం, ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించడం లాంటి గ్రహణ సమయంలో జరిగిన విశేషాలన్నింటినీ మన కళ్ళకు కట్టినట్లుగా ఈ పుస్తకంలో రంగాచార్య గారు చూపుతారు. “చందుపట్ల నా జన్మభూమి. పాలెం ఉద్యోగ కీర్తిభూమి “అని గర్వంగా చెప్పుకుంటారు.
తమ సాహితీరంగ ప్రస్థానంలో “మావూరు చందుపట్ల” అనే పుస్తకాన్ని గ్రామచరిత్రగా రాసిన తీరు, తాము రచించిన పీఠికలు, సంపాదకత్వం వహించిన పుస్తకాలు, పరిష్కార గ్రంథాలు, పత్రికల్లో వచ్చిన వ్యాసాలు మొదలగు విషయాలను సవివరంగా తెలిపారు.
చివరగా …ఉద్యోగ జీవితంలో రాజకీయాలు ఎన్ని జరిగినా వీలైనంతవరకు ‘పద్మపత్ర మివాంభసి’ లా ప్రవర్తించానంటారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే తెలుగు సాహిత్యానికి మేలు జరుగుతుందనుకున్నాం. కానీ ప్రాచ్య విద్యలనే కాక అన్నింటినీ అశ్రద్ధ చేస్తున్నదన్న ఆవేదన వ్యక్తం చేస్తారు. “యదార్థ వాది లోక విరోధి” అన్నట్టు ‘జీవనపర్వం’ గ్రంథాన్ని మొత్తం జీవితం కాక అనుభవాలు మాత్రమే రాశానని ఆయన చెప్పుకుంటారు. “ఎన్నో గ్రంథాలను ప్రచురించి, ఎన్నో వ్యాసాలు రచించి, ఎన్నో ప్రసంగాలు చేసిన నేను ఇప్పటికీ ఒక సాహిత్య యాత్రికుడనే కావడం పెద్దల ఆశీర్బలం, నా యొక్క పురాకృత జనుర్విశేషం” అని భావిస్తాననడం వారి వినమ్ర వ్యక్తిత్వ నిలువెత్తు రూపానికి సాక్ష్యం. నిరాడంబరులు, నిస్వార్థులు అయిన వారి జీవితం అందరికీ ఆదర్శప్రాయం.