Home ఇంద్రధనుస్సు తీపికలలు…

ఆచార్య ఆత్రేయ (కిళాంబి వేంకట నరసింహాచార్యులు)గారి ఈ గీతానికి ఎ.ఎం.రాజా మధురంగా బాణీ కూర్చితే జిక్కి మృదు మధురంగా గానం చేశారు.

పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు ||పులకించు||

సంగీతం, సాహిత్యం రెండు కూడా గానంతో మేళవిస్తే ఇక మానవ జీవితానికి కావలసింది ఏముంది? ఆ మూడు కళలకు మన మనసు పులకించి పోతుంది. మన మనసులో వుండే తీరని వ్యథలను, దుఃఖాలను మరపింప చేస్తాయి.

రాగ మందను రాగ మొలికి, రక్తి నొసగును గానం,

రేపు రేపను తీపి కలలకు, రూపమిచ్చును గానం,

చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం,

జీవమొసగును గానం, మది చింత బావును గానం    ||పులకించని||

గానంలోని రాగంలో అనురాగం నిండితే మానవ మనుగడలో రక్తి కలుగుతుంది. సంగీతం రాగాన్ని కూడా అనురాగమయం చేస్తుంది. జీవితంలో ఆసక్తిని, రక్తిని నింపుతుంది. మనకు గానం రాగాలాపనతో ఎంతో దూరాన వున్న కలలను, ఆశలను మన హృదయానికి చేరుస్తుంది. మన భావాలు చెల్లా చెదురుగ పడి వుంటే వాటినన్నింటినీ పూలను దండిగా మార్చే విధంగా ఒక దగ్గరికి చేర్చి అస్తిత్వాన్ని కలుగజేస్తుంది. మన మనసులో వుండే బాధలను తొలగించి, హాయిని కలుగజేస్తుంది.

వాడిపోయిన పైరులైనా, నీరుగని నర్తించును,

కూలిపోయిన తీగలైనా, కొమ్మనల మీ ప్రాకును,

కన్నెమనసు ఎన్నుకున్న తోడు దొరికిన మరియు

దోరవలపే మరియు, మది దోచుకొమ్మని పిలుచు ||పులకించని||

వర్షాలు లేకపోతే పైర్లు ఎండిపోతాయి. కాని వర్షం కురిసి నీరు వాటికి అందినచో, మానవ హృదయం గానానికి పరవశించినట్లు, పైర్లు కూడ, నాట్యం చేస్తాయని కవి భావన. ఆధారం లేకపోతే తీగ ప్రాకజాలదు. అలా కూలిపోయిన తీగలు కూడా వాటి ప్రక్కన గల కొమ్మలను ఆసరా చేసికొని వాటిలో పునరుజ్జీవం కలిగి మళ్ళీ ప్రాకుతాయి. అదేవిధంగా కన్నెమనసులో ఎన్నో ఆశలుంటాయి. కాని, తాను మనసులో కోరుకున్న తోడు (జీవిత భాగస్వామి) దొరకాలన్నదే ఆమె జీవితంలో పెద్ద ఆశ. ఆ తోడు దొరికిందంటే ఆమె మనసు మురుస్తుంది. ఆ తోడు దొరికిన వెంటనే ఆమె పులకించి, తన హృదయాన్ని, జీవితాన్ని ఆ భాగస్వామికి సమర్పించి, తన మనసును కూడా. దోచుకొమ్మని ఆహ్వానిస్తుంది. గానం అనే కళ మానవ జీవితాల్లో వుండే జఢత్వాన్ని తొలగింపచేసే ఒక ఔషధం లాంటిది. “శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గాన రసం ఫణిః” అని ఆర్యోక్తి. పశువులను, శిశువులోనే కాకుండా, పాములను కూడా పరవశింపచేసేది గాన రసం.

పెళ్లి కానుక సినిమా 1960 సంవత్సరంలో విడుదలైనది. ఈ పాట నటి కృష్ణకుమారి పై చిత్రీకరించబడింది. 60 సం గడిచినప్పికి ఇప్పటికి మన తెలుగు నాట అందరి హృదయాలను కొల్లగొడుతూనే వుంది.

  • ఏలూరు అశోకుకుమార్ రావు

You may also like

Leave a Comment