నిర్వహణ:
– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి
ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు
పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.
ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి
ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.
ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.
మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .
వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్దమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.
పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.
కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.
ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .
కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .
తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.
ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471
రచయిత పరిచయముడా॥ సంగనభట్ల నరసయ్యగారు ఆధునిక తెలుగు ప్రముఖ సాహితీ వేత్తలలో డా॥ సంగనభట్ల నరసయ్య గారు ఒకరు.సంస్కృతాంధ్ర భాషా పండితులు.శాసన పరిశోధకులు.స్థల– వ్యక్తి — సాహిత్య చారిత్రక రచయితలు. శాసన పాఠములను సులువుగా అర్థం చేసికొని అందులోని విశేషాంశాలను చరిత్రకు అన్వయించి, ప్రశస్తమైన వ్యాసాలను అందించినారు. వీరి పరిశోధనా ప్రవణతకు” తెలుగులో దేశిచ్ఛందస్సులు” గ్రంథమే ప్రబల సాక్ష్యము. తెలివాహ గోదావరి – వీరి కలమునుండి వెలువడిన విలువైన సమాచార కరదీపిక.సమకాలిక పండితులందరి మెప్పును పొందిన ప్రామాణిక వ్యాస సంపుటి. ధర్మపురి క్షేత్ర మహాత్మ్యము, భోగినీ దండకము సవ్యాఖ్యానము, కాకతీయ ప్రతాపరుద్ర చరిత్ర సంబంధమైన నాటకము మరియు ప్రతాపరుద్రీయము : కవిపండిత సభాగోష్ఠి ప్రదర్శనలు , తెలంగాణ మహానగరాల చరిత్ర మొదలైనవి వీరి బహుముఖ సృజన-పాండిత్య ప్రతిభావ్యుత్పన్నతలకు నిదర్శనములు. వీరు తమ విపులమైన పీఠికను చేర్చి తె.వి.వి.వారి “రంగనాథ రామాయణం”గ్రంథ పరిష్కర్తగా విశేష ఖ్యాతిని పొందినారు. అట్లే “చిత్రభారతం” పరిష్కరించినారు. ఈ గ్రంథ పీఠికలో ” చిత్రభారతం : తెలంగాణ నుండి వెలువడిన తొలి తెలుగు ప్రబంధం” అనే ప్రాముఖ్యాంశాన్ని శాసనపాఠ–చారిత్రక సందర్భ సూచనలతో పాటు కా వ్యాంతర్గతమైన పారిజాతాపహరణాది అంశముల అంతస్సాక్ష్యములతో నిరూపించినారు. సంగనభట్ల నరసయ్య గారి ప్రతిపాదన — సమర్థనాంశ క్రోడీకరణ — సిద్ధాంత ఉపపత్తి నైపుణ్య క్రమవిధానము తిరుగులేనివని,అప్రవితర్క్యములని చెప్పకతప్పదు.
ఇక ప్రస్తుత వ్యాసమైన ‘చిత్రభారతము -తొలి ప్రబంధము’ ఈ విశేషములను ప్రస్తావించిన విషయ విస్తృతిగల వ్యాసము. ఇటువంటి సాహిత్య అంశములతో పాటు నాటకరంగానికి చెందిన రచయితగా, నటునిగా,ప్రయోక్తగా కూడా వివిధ భూమికలను పోషించే సంగనభట్ల నరసయ్యగారు నా దృష్టిలో ప్రధానంగా లోతైన విమర్శకులు. గాఢమైన రస భావుకులు.సాహితీమిత్రులకు విమర్శనమిత్ర౼హ్లాదైక సంభాషణ చంద్ర శబ్దవాచ్యులు. తెలంగాణము నుండి మారిషస్ ,సింగపూర్ దేశాలను సందర్శించిన సాహిత్యవేత్త. భారత దేశములోని పలురాష్ట్రాలలోని చారిత్రక , సాహిత్య , విశ్వవిద్యాలయ తదితర ప్రశస్త వేదికల పై నుండి అసాధారణ విషయ పరిశోధనాంశాలను ధారాళముగా ప్రకటించిన వాగ్మి. నా కోరికపై ఈ ప్రస్తుత వ్యాసమును తదితర కార్యవ్యగ్రులై ఉండినను : అత్యల్పవ్యవధిలో అందజేసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదములు.
— గురిజాల రామశేషయ్య
రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు.
+91-7032679471
తొలిప్రబంధ కర్త చరిగొండ ధర్మన
చిత్రభారత ప్రబంధ కవితా కళా వైశిష్ట్యం
– డా॥ సంగనభట్ల నరసయ్య
వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం లోని పద్య కృతులలో ప్రబంధమన్న శాఖ అతి విశిష్టమైనది. ఈ శాఖలోని కావ్యాలు కవి ప్రతిభా దీధితులచేత కల్పనలతో, పద్య రచనా శిల్పంతో, కథా వైచిత్రులతో అలరారి, పురాణ కావ్యములను తోసిరాజన్నది. ఈ శాఖ పురాణ కావ్యములనుండి ప్రబంధ శాఖకు మారుటకు 4 దశాబ్దులు పట్టినవని, 16 వ శకం నుండి అనగా శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి విస్తరించినవని, తత్పూర్వం కొంత కొంత లక్షణాలతో క్రమ పరిణామం పొందినాయని సాహిత్య విమర్శకులు అనుశీలించినారు. కాని, ఈ లక్షణాలు తత్పూర్వం లేకున్నా తొలిసారిగా ప్రవేశపెట్టి, ఉదాత్త ప్రబంధరాజంగా తొలికావ్యంగానే మలచి, తరువాతి ప్రబంధ కవులకు మార్గదర్శయైన ఒక కవి మూర్థన్యుడు తెలంగాణములో వెలసినాడు. ఆయన చరిగొండ ధర్మన, శ్రీకృష్ణదేవరాయల కాలానికి మూడు దశాబ్దులు ముందువాడు. 15 వ శతాబ్ది మధ్యకాలం వాడైన చరిగొండ ధర్మన కవితా ధర్మం, అలంకార శాస్త్ర సమ్మతమైన వైచిత్రి ప్రాణంగా కావ్యరచన చేసినాడు. అప్పటికే విశ్వేశ్వరకవి తెలుగునాట ‘చమత్కార చంద్రిక ‘ అనే సంస్కృతాలంకార గ్రంథం రాసి, చమత్కారం కావ్యప్రాణంగా స్థిరపరచినాడు. ఆతనికి అర శతాబ్ధి తరువాత ధర్మన ‘చిత్రభారతమ’నే చమత్కార కథా కావ్యం తొలి ప్రబంధంగా రాసినాడు. ఈతడు కవిమాత్రమే కాదు, శతావధాని! నాటి శతావధానులలో సుల్తాన్నని “శతలేఖిన్యవధాన సంధి సంధాసురత్రాగాచిహ్నిత నాముడ“నని పేర్కొన్నాడు.
చరిగొండ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా లోనిది. ఒక గ్రామానికి చెందినవారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు, వారిని గుర్తించడానికి ఆ గ్రామం వారని చెబుతూండడంతో ప్రజల వాడుకలో ఆ గ్రామ నామం గృహ నామంగా ఏర్పడుతుంది. ధర్మన పూర్వీకులు చరిగొండ వారై ఉంటారు. ఈయన కుటుంబం ఈ కావ్యం రాసేనాటికి ముందే కరీంనగర్ జిల్లాలోని గోదావరి తీరాన ఉన్న ధర్మపురి గ్రామంలో స్థిరపడి ఉండి ఉంటారు. ధర్మన ధర్మపురి వాడు. ఆయన పేరులో కూడా గ్రామ నామం ఉంది. ఆయన పితరులు ధర్మపురి గ్రామనామం ఆయనకు పెట్టినారు. యాదగిరి, ధర్మపురి, తిరుపతి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వ్యక్తినామాలుగా నిలుస్తాయి. మాచర్ల ధర్మపురి తన ఇనుగుర్తి శాసనంలో (క్రీ.శ.13వ శతాబ్దిలో) ఈ ధర్మపురిని వ్యక్తిగత నామంగా రికార్డు చేసికొన్నాడు. ఈ గ్రామ నామం ఇంటిపేరుగలవారు, వ్యక్తి నామంగా గలవారు సమీప జిల్లాల్లో ఉన్నారు.
ధర్మనకు తన పుట్టిన గ్రామం ధర్మపురి గూర్చి అభిమానం మెండు. ఆ విషయం కూడా చిత్రభారతంలో కనబడుతుంది. తన ఇలవేల్పు ధర్మపురి నరసింహస్వామిని కావ్య కృత్యాది పద్యంలో ప్రార్థనాపూర్వకంగా పేర్కొన్నాడు.
శ్రీలక్ష్మీ కుచ పారిజాత కవికాశ్లిష్టోరుదక్షుడు, డే
వాళీమౌళి మణి ప్రభారుచిర పాదాంభోజుడుద్యర్దయా
వీలన్ ధర్మపురీశ్వరుండు గుణశాలిన్ నూతనాంబోనిధి
ప్రాలేయద్యుతి పెద్దన ప్రభు సమగ్ర శ్రీయుతుంజేయుతన్
( చి. భా. 11) అంతేకాదు తరువాతి కొద్ది ఆశ్వాసాల తొలి పద్యాలు ధర్మపురి నారసింహునివే (ఆశ్వాసాదిపద్యాలలో కృతిభర్తవి ఉండాలి, కాని కృతిభర్త నారసింహుడు కాడు)(చూ. ద్వితీయ, చతుర్ధాశ్వాసాది పద్యాలు).
ధర్మన తన కథలో, పాతళం లోని ఓ నదికి భోగవతి అని పేరు పెట్టినాడు. ధర్మపురిలోని గోదావరి లోని ఓ మడుగుకు సత్యవతి గుండమని పేరు. ఈమెకు మరో పేరు భోగావతి. ఆమె ఈ మడుగు దేవత.
సత్యవతమ్మా ! భోగావతమ్మా!
సత్యమును నమ్మి స్నానమాడితిమి
కన్నులతో కన్నవి , చెవులతో విన్నవి,
ఎరిగిచేసినవి, ఎరుగక చేసినవి
సర్వ పాపములు తొలగించుమమ్మా!
అంటూ స్నానం చేస్తారు భక్తులు. ఈ సత్యవతికి దేవాలయం ఉంది ధర్మపురి లో! ఈమె బతుకమ్మ! ఈమె మహాత్మ్యాన్ని ‘పాము పాట’ పేరుతో చాత్తాడ జగ్గయ్య, కూర నారాయణ రాజు, మల్లంపల్ల మల్లికారాధ్యులు, విశ్వనాథ సత్యనారాయణ మొదలగువారు రాసినారు.
పాతాళ నది పురాణ ప్రసిద్ధ భోగావతిని స్థానికతతో సార్థకం చేసినాడు.
కృతిభర్త ఎనుమలపల్లి పెద్దనామాత్యుడూ ధర్మపురి వాడే. అంతేకాదు వీరిద్దరు సమవయస్కులు. పెద్దన కుటుంబమంతా ధర్మనకు తెలుసు. ధర్మన వారి వంశ ప్రతిష్టను అతి విస్తృతంగా వర్ణించినాడు. పెద్దన వంశంలోనివారు స్థానిక దైవం నరసింహుని పేర్లతో నరహరి, సింగన్న, సింగమ్మ, లక్కాయి, నారాయణ, నరసింహ, సింగసాని అనే పేర్లు కలిగి ఉన్నారు. పెద్దన భార్యపేరు సింగసాని. పెద్దనామాత్యుని తండ్రి మాదన్న కందాళప్ప గురును శిష్యుడు. ఈ కందాళప్ప వంశం ధర్మపురి గ్రామం లోనిదే. వీరి వంశం నేటికీ ధర్మపురి నారసింహుకునికి పురోహితులు, యాజ్ఞికులు. ఈ కందాళప్ప వంశీకులకు ఇతర ప్రాంతాలలో దానాల శాసనాలున్నాయి. శ్రీ ధర్మపురి కందాళై నరసింహ అయ్యవార్లకు వెల్దిపాడు సర్వాగ్రహారాన్ని ఫసలీ 1111, అనగా క్రీ.శ. 1702 లో శ్రీ రాజా నరసింహ అప్పారావు, నూజివీడు సంస్థానాధీశుడు దానం చేసాడు. అప్ప శబ్దం ధర్మపురిలో కొత్తేమీ కాదు. కన్నడ ప్రభావం. శేషప్ప (నరసింహ శతక కర్త) ధర్మపురి వాడే! ఈ ధర్మపురి క్రీ.శ. 936 ప్రాంతంలో వేములవాడ చాళుక్య ప్రభువు అరికేసరి (రెండవ) ద్వారా కన్నడ ఆదికవి పంప మహాకవికి ధారాదత్తమైన గ్రామం. కన్నడ ప్రభావం అందుకే అధికం!
పెద్దనకు అడుగడుగునా ధర్మపురి నారసింహుని ఆశీస్సులు వర్ణింపబడ్జాయి. పెద్దతాత నరహరి భార్య లక్కాయి ‘ఆయి’ పదం మరాఠీది. ధర్మపురిపై మరాఠి ప్రభావం ఉంది. పెద్దతల్లిని పెద్దాయి అనీ, పినతల్లిని చిన్నాయి అని ధర్మపురిలో(రచయిత కూడా) ఇప్పటికీ పిలుస్తారు.
ధర్మపురి గ్రామంలో హరిహరులకు పశ్చిమ చాళుక్యులు నరసింహ శివాలయాలు నిర్మంచారు. క్రీ.శ. 1018 లో నిర్మించిన నరసింహాలయాన్ని బహుమనీ సుల్తాన్ అహ్మద్ షా సేనాని అజింఖాన్ దోచుకొని, క్రీ.శ. 1425 దాడిలో ధ్వంసం చేసాడు. ఈ ఆలయం నేడు మసీదుగా ఉంది. ధ్వంసం నాటికి యువకుడైన పెద్దన ఖడ్గం పట్టిన యోధుడు గనుక ప్రతీకారంతో అతణ్ణి(అజీంఖాన్ ను) చంపివేసాడు. ఈ విషయం చరిగొండ ధర్మన చిత్రభారతం కావ్యంలో రికార్డు చేసినాడు.
కం॥ బాహాని తీష్ణధారా
రాహుముఖగ్రస్త విమలరాజి “మహాల
క్ష్మీ హరి మందిర“ స్వామి
ద్రోహర గండాంక !
అని చిత్రభారతం 3 వ ఆశ్వాసంలో 170 వ పద్యంలో రాసాడు. నరసింహుని మందిరానికి ద్రోహం చేసిన వాణ్ణి గండరించిన వాడు (తల నరికిన వాడు) అని ప్రతిష్టాత్మకంగా పేర్కొన్నాడు. ఎన్నో ఆలయాలు మసీదులుగా మార్చిన చరిత్ర మనకు ఉంది. ఆలయ ఘాతకుడైన ఒక ముస్లీం సర్దార్ ను ఒక హిందువు తిరిగి ప్రతీకారంతో చంపడం అరుదే!
ధర్మన భాషలో “నేటికీ నిలిచిన “ ధర్మపురి భాష ఉంది. పాతులాడు,ఇవం(ఇగం),అప్పసం, కుసుల్లోకి విరగదన్ను, కోరు వెట్టు(కౌలు) వంటివి పేర్కొనవచ్చు. పై సాక్ష్యాలతో చరిగొండ ధర్మనను (కృతి కర్తను), ఎనుములపల్లి పెద్దనామాత్యుని (కృతి భర్తను) ధర్మపురి వారిగా గుర్తించవచ్చు.
(సశేషం)
-డా॥ సంగనభట్ల నరసయ్య
రిటైర్డ్ ప్రిన్సిపాల్.
+91-9440073124