నిరంతర విశ్వకల్యాణ యజ్ఞభూమి అయిన మన భారతదేశఁలోకి ఇంగ్లీషువారే కాదు, వారికంటె ముందుగానే ప్రవేశించిన పోర్చుగీసు, ఫ్రెంచి, ఆఫ్ఘనిస్తాన్ దేశాలవారు కూడా మన దేశ సంస్కృతిని సాధ్యమైనంత ఎక్కువగా విచ్ఛిన్నం చేశారని చెప్పవచ్చు. దాని ఫలితంగా మన దేశ రాజకీయ రంగంలో విపరీత పరిణామాలు చోటు చేసుకొని సామాజిక వ్యవస్థపై దుష్ర్పభావాన్ని చూపడం మనకు తెలుసు. ఆ ప్రభావాన్ని తొలగించి, తిరిగి మన సంస్కృతి విలువల్ని పరిరక్షించడానికి జన్మించినవారిలో కవులు, కళాకారులు ఉన్నారు. ఎంతో బాధ్యతగా వ్యవహరించి పరోపకారం, త్యాగం వంటి లక్షణాలతో మానవత్వపు విలువలకు తిరిగి ఊపిరి పోశారు. అటువంటివారిలో ‘తెలంగాణ మునీశ్వరుడు’ అనదగిన శ్రీ చందాల కేశవదాసు చాలా ప్రముఖులు. ఆ మహనీయుడు తన నిర్మోహత్వంతో, కళావైదుష్యంతో, సేవా పరాయణతతో, తాత్త్విక చింతనతో తెలుగువారిని మేలుకొలిపి సత్యపరిశోధనా కరదీపికలను ముందుతరాలవారికి అందించారు.
Chandala Keshava Dasu
కేశవదాసు 1876 జూన్ 20న ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామంలో పాపమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు చిన్న కుమారునిగా జన్మించారు. తండ్రి మరణించాక అన్నగారైన వెంకట్రామయ్య అన్నీ తానై తమ్ముడిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఉపాసనా విద్యను, రామమంత్రాన్ని ఉపదేశించాడు. తనవలె బ్రహ్మచర్యాన్ని పాటించవద్దని, చక్కని గృహస్థజీవితం గడుపుతూ ధార్మకి ప్రవర్తనను అలవరచుకొమ్మని బోధించి తపస్సుకు వెళ్ళిపోయాడు. కేశవదాసు అన్నగారి ఉపదేశాన్ని ఆదేశంగా స్వీకరించారు. సిరిపురం జమీందారు పిల్లలకు చదువు చెబుతూనే వారిని పృచ్ఛకులుగా చేసి అష్టావధానవిద్యను సాధన చేశారు. తిరువూరు ‘కాబోలు రామయ్య’ కూతురు చిట్టెమ్మను వివాహం చేసుకుని జక్కేపల్లిలో పొలాలు చూసుకుంటూ స్థిరపడ్డారు. కృష్ణాజిల్లా వత్సవాయి దగ్గరున్న దబ్బాకు పల్లిలోని సందడి నాగదాసు దగ్గర ఆధ్యాత్మిక విద్యను అభ్యసించారు. 1899లో నాగదాసు చేసిన భాగవత సప్తాహ స్ఫూర్తితో తాను కూడా భాగవత సప్తాహాన్ని 1907లో తమ్మరలో ప్రారంభించారు. కోదాడుకు దగ్గరగా ఉన్న తమ్మర గ్రామానికి వెళ్ళి నరహరి నరసింహాచార్యులుగారిని కలిసి ఆయన సహకారంతో సప్తాహం, అన్నదానం కార్యక్రమాలను విరివిగా చేపట్టారు. కేశవదాసులోని పాండితీప్రకర్షను, వాక్శుద్ధిని, భక్తి ప్రపత్తులను గమనించిన ఆచార్యులవారు కేశవదాసును కవిగా తీర్చిదిద్దారు. “సప్తమాలిక” అనే రచనలో కేశవదాసు కవితారంగంలోకి ప్రవేశించారు. ఆచార్యులవారి నుండి కేశవదాసు శ్రీ వైష్ణవ తత్త్వ రహస్యాలను, కవితా నిర్మాణ విశేషాలను, పౌరాణికరచనా లక్షణాలను క్షుణ్ణంగా అభ్యసించారు. దాసుగారు తన జీవితకాలంలో తమ్మరలోనే కాక దబ్బాకుపల్లి, తిరువూరు, భ్రదాచలం, బూర్గంపాడు, జగ్గయ్యపేట మొదలైన ప్రాంతాలలో మొత్తం 108 భాగవత సప్తాహాలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని జరిపి ప్రజలలో భక్తితత్త్వాన్ని, ధార్మిక గుణాన్ని, పరోపకారాభావాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. అందుకు తనలోని కళాప్రావీణ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించారు.
తమ్మరలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శిథిలమవుతున్న విషయాన్ని గమనించి దాని ఉద్ధరణకు కేశవదాసు నడుము బిగించారు. రాజగోపుర నిర్మాణం, రథశాల, వాహనాలు, నిత్యార్చనాసామగ్రి మొదలైనవాటి కోసం ఆయన నిరంతరం శ్రమించారు. “లవకుశ” హరికథాగానం కోసం కేశవదాసు జగ్గయ్యపేట వెళ్లినపుడు అప్పటి ప్రముఖ సంగీత విద్వాంసులు పాపట్ల లక్ష్మీకాంతయ్యగారితో పరిచయం ఏర్పడింది. దాసుగారు ఆయన్ని తన సంగీత గురువుగా ఎంచుకుని ఎన్నో సంగీతపు మెలకువలను నేర్చుకున్నారు. 1910లో ఇద్దరు కలిసి యాదగిరి గుట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు వెళ్ళి ధార్మిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలకు పునాది వేశారు. అక్కడే పాపట్లవారి సలహాతో కేశవదాసు ‘పరబ్రహ్మ పరమేశ్వర’ గీతాన్ని వ్రాయగా పాపట్లవారు దానికి కల్యాణి రాగంలో, రూపకతాళంలో బాణీ వేశారు. పాపట్లవారు ఆ గీతాన్ని నాటక సంస్థల ప్రార్థనాగీతంగా మలచారు.
ధర్మప్రతిష్ఠాపనా మార్గ నిర్దేశం కేశవదాసు 1911లో నెల్లుట్ల జమీందారు రామనరసింహారావు సహకారంతో ‘కనక్తార” నాటకం రచించి వేలాది ప్రదర్శనలతో సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చారు. మైలవరం బాలభారతి నాటక సమాజంలో ‘ప్రాంపర్టు’గా చేరి రచయితగా ఎదిగి ప్రజాదరణ పొందారు. తన ఆధ్యాత్మిక గురువైన సందడి నాగదాసు జీవిత చరిత్రను హరికథగా వ్రాసి ఎన్నోసార్లు కథాగానం చేసి వచ్చిన ఆదాయాన్ని నాగదాసు కుటుంబానికే సమర్పించారు. ఒకవైపు హరికథలు, నాటక ప్రదర్శనలు సాగుతూండగానే ఆయన సూర్యాపేట, హుజూర్ నగర్, బేతవోలు, కందిబండ, జగ్గయ్యపేట మొదలైన చోట్లలో అవధానాలు చేయడం ప్రారంభించారు. నాటక ప్రదర్శనలు, కథాగానాలు, అవధానాలు, రచనల ముద్రణలు మొదలైన అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా లభించిన సొమ్మును అన్నదానాలకు, తమ్మర ఆలయ జీర్ణోద్ధరణ పనులకు వినియోగించారే కాని తన కోసం పైసా కూడా మిగుల్చుకోలేదు. బొంబాయి, మద్రాసు, కలకతా్త, బర్మా, రంగూను మొదలైన చోట్ల కనక్తార నాటక ప్రదర్శనలకు వెళ్ళి సమయోచితంగా ధార్మిక ఉపన్యాసాలు కూడా చేసేవారు. ఆయన చేస్తున్న కృషిని గమనించిన తమ్మర గ్రామవాసులు ఆయనను ‘తమ్మర రామదాసు’ అని సగౌరవంగా పిలిచారు.
1931లో కేశవదాసు జగ్గయ్యపేటలో ‘విరాటపర్వం” హరికథాగానం చేశారు. అప్పుడాయనకు శ్రీ ఎం.సీతారామానుజాచార్యులు వయొలిన్ తోను, శ్రీ అన్నావజ్జల రామమోహనశర్మ తబలాతోను సహకరించారు. కథాగానాన్ని శ్రద్ధగా విన్న సుప్రసిద్ధ కథారచయిత శ్రీ పాదకృష్ణమూర్తిగారు లేచి ఇప్పటికప్పుడే ‘అభినవ సూత’ అనే బిరుదును దాసుగారికి ప్రదానం చేశారు. ఆ సందర్భంలో నిర్వాహకులు దాసుగారికి అమూల్యమైన వజ్రపుటుంగరాన్ని తొడిగారు. ఆ ఉంగరంతో సహా డబ్బును, వెండి, వస్తువులను, విలువైన బట్టలను అమ్మి తమ్మర దేవాలయానికి పంపించారు. మరునాడు ఇంటికి వెళ్ళిన దాసుగారితో ఆయన భార్య ఎంతో ముచ్చటపడి రాత్రి ఇచ్చిన ఉంగరాన్ని చూస్తానన్నది. దాసుగారు విషయం చెప్పారు. ఆమె నిరాశపడి ‘అయ్యో! ఒక్కసారి కళ్ళారా చూసుకోనైతి గదా’ అనే బాధపడింది. అప్పుడు కేశవదాసు ‘పిచ్చిదానా! చూస్తే ఇంకా వ్యామోహం పెరుగుతుంది. ఎవరి సొమ్మో వారికే చేరింది. చూడకపోతేనే నిశ్చింత’ అన్నారు. ఎంతటి నిర్మోహం!
అప్పుడే సినిమా రంగంలోని చిత్రదర్శకులు హెచ్.ఎం.రెడ్డిగారి నుండి కేశవదాసుకు పిలుపు రాగా మద్రాసు వెళ్ళి ‘భక్తప్రహ్లాద’కు మూడు పాటలు రచించారు. ఇది విన్న దాసరి కోటి రత్నం అనే నటవిదుషీమణి 1935లో కేశవదాసును కలకత్తాకు పిలిపించుకుని తాను తీసే ‘సతీ అనసూయ’ సినిమాకు ఆయన చేత మాటలు, పాటలు రాయించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆయన అందుకున్న ఆరువందల రూపాయలను వెచ్చించి తమ్మర స్వామివారి కోసం రెండు చామరాలు, ఒక భూచక్ర గొడుకు కొని తెచ్చి స్వామివారికి సమర్పించారు.
దబ్బాకు పల్లి సమీపంలో ఉన్న‘పోలంపల్లి’కి కేశవదాసు వెళ్లి కళాభిమానులను కూడగట్టి ఒక నాటక సమాజాన్ని తయారుచేశారు. 1941లో అక్కడే ఆరునెలలపాటు ఉండి ‘కనక్తార’ నాటకాన్ని శిక్షణ యిచ్చి మూడుసార్లు టిక్కెట్లు పెట్టి ప్రదర్శింపజేసి వచ్చిన డబ్బును అక్కడి గ్రంథాలయానికి సమర్పించారు.
క్రమక్రమంగా కేశవదాసుగారికి కుటుంబ భారం పెరగసాగింది. సమస్యలు చుట్టుముట్టాయి. ఆదాయం సన్నగిల్లింది. ఇంతలో రజాకార్ల ఆగడాలు మితిమీరిపోయాయి. ఎవరి ఆస్తులకూ భద్రత లేకపోయింది. జక్కేపల్లిలోని దాసుగారి ఇంటివి, వస్తువులను, పుస్తకాలను దుండగులు దగ్ధం చేశారు. అయినా ధైర్యం వహించిన కేశవదాసు సకుటుంబంగా ఖమ్మం చేరుకున్నారు. పెద్ద కొడుకు కృష్ణమూర్తి సలహాతో ఆయన కుటుంబాన్ని తీసుకుని నాయకుల గూడెంలో స్థిరపడ్డారు. అప్పటి నుంచి కేశవదాసు పర్యటనలను తగ్గించినా ధ్యానం, వైద్యం, కథాగానం మానలేదు. కృష్ణమూర్తి అల్లోపతి వైద్యునిగా పనిచేయసాగాడు.
తిరువూరులో ఉన్నప్పుడు భద్రాచలం వెళ్ళే భక్తులు నీటికోసం పడుతున్న ఇబ్బందులను గమనించి ఆ ఊరిలో ప్రత్యేకంగా ఒక బావి త్రవ్వించి, అక్కడే పందిళ్ళు వేయించి, నీళ్ళే కాకుండా భోజనవసతి కూడా ఏర్పాటుచేసిన కేశవదాసు ఔదార్యాన్ని ఇప్పటికీ అక్కడివారు గుర్తు చేసుకుంటారు. ఆయన త్రవ్వించిన బావిని ‘కేశవదాసుబావి’ అని పిలిచేవారు. ఇప్పుడది చారిత్రక చిహ్నంగా తిరువూరు బస్టాండు దగ్గర ఉన్నది. తిరువూరులో కేశవదాసు ఎంతోమందికి వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఆ సఁదర్భంగా ‘సర్వరోగ నివారిణి’ పేరుతో ఒక ఆయుర్వేదపు ఔషధాన్ని తయారుచేసి రోగులందరికీ ఉచితంగా ఇచ్చేవారు. అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఔషధాన్ని సామ్రాజ్యం అనే నర్సుకు అప్పజెప్పి వచ్చారు. అయితే ఆమె దాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టింది. ఈ సంగతి తెలిసి కేశవదాసు అక్కడికి వెళ్ళి ఆమెను ఏమీ కోప్పడకుండా పేదల బాధలను వివరించి చెప్పగా ఆమె పశ్చాత్తాపపడి తన వైఖరిని మార్చుకుని ఉచిత వైద్యంతో సాగిపోయింది. ఆయనలో అంతటి క్షమాగుణం, పేదలపై ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి.
ఒకసారి కేశవదాసు బేతవోలు సంస్థానానికి వెళ్ళి ‘లవకుశ’ హరికథాగానం చేస్తూండగా ముడుంబై వేంకటాచార్యులు అనే వారితో పరిచయమైంది. కేశవదాసుగారి పెద్ద కొడుకైన కృష్ణమూర్తి దగ్గర కాంపౌండర్గా తాను చేరాలనుకుంటున్నట్లు ఆ ఆచార్యులు దాసుగారితో అన్నాడు. దాసుగారు ఆనందించి అతన్ని నాయకన్ గూడెంకు తీసుకువచ్చారు. ఆ విధంగా వేంకటాచార్యలు కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. ఒకసారి వేంకటాచార్యులు పొరపాటున ద్రాక్షారసం అనుకుని ‘హైడ్రోక్లోరైడ్’ త్రాగారు. అది విషద్రవం కనుక వెంటనే వికటించింది. తక్షణమే కేశవదాసు ఆయన్ని తీసుకుని సూర్యాపేటకు బయలుదేరారు. సూర్యపేట నుంచి ఖమ్మానికి వెళుతున్న చిట్టచివరి బస్సును ఆపి వెనక్కు మళ్ళించారు దాసుగారు. సూర్యాపేటలో తాను స్వయంగా దగ్గరుండి డా|| శర్మగారి చేత వైద్యం చేయించారు. ప్రత్యేకంగా ‘ప్రోసట్’ అనే ఇంజక్షన్ ను మద్రాసు నుంచి తెప్పించి చికిత్స చేసి ఆచార్యులవారికి ప్రాణదానం చేశారు. అదీ ఆయనలోని మానవత్వ లక్షణం.
సాధారణంగా కళాకారులు తాము సంపాదించే డబ్బుతో సంసార యాత్ర సాగించాలనుకుంటారు. కొంతమంది ఆస్తులు కూడబెట్టి మనవల కోసం దాచిపెతారు. క్రమక్రమంగా సంపాదించడం కోసమే కళాప్రదర్శనకు అలవాటుపడతారు. కాని ఇవేవీ కేశవదాసులో కనిపించవు. ఆదిశంకరాచార్యులు చెప్పినట్లుగా “దేయమ్ దీనజనాయ చ విత్తమ్’ వాక్యాన్ని చక్కగా సార్థకం చేసినవారు కేశవదాసుగారు. జక్కేపల్లిలో సొంత యింటి కోసం తెచ్చుకున్న కలపను, ఇతర సామగ్రిని సైతం దేవాలయానికి వినియోగించిన సుకృతి ఆయన. దేవాలయ రాజగోపురం పనులు డబ్బు లేక ఆగిపోతే తన భార్య చిట్టెమ్మగారి బంగారు గాజులను అమ్మించడానికి కూడా వెనుకాడలేదు. ఎలాంటి గడ్డు పరిస్థితులలో కూడా ఆయన ఎవరినీ చేయిచాచి యాచించలేదు. కళాప్రదర్సనతో మాత్రమే సంపాదించి దాన్ని సద్వనియోగం చేశారు. ఆయనలోని ఔదార్యానికి నిరాడంబరత తోడై ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ప్రకాశింపజేసింది. అందుకే ఆయన ద్రవ్యాభిలాషి, భోగాభిలాషీ కాలేదు.
కేశవదాసు దరహాసప్రియులు, సరస సంభాషణాచతురులు, చతురోక్తిలంపటులు. ఆయనకు కులమత విచక్షణ ఏ మాత్రమూ లేదు. హెచ్చుతగ్గులనేవి చిత్తసంస్కారాన్నిబట్టి ఏర్పడినవే కాని, కులాన్ని బట్టి, వృత్తినిబట్టి కాదని ఆయన భావన. అందుకే ఎప్పుడూ ఎక్కడా వివాదాలతో ఘర్షణ పడేవారు కాదు. జక్కేపల్లి దగ్గరున్న రాజుపేటకు చెందిన వెంకయ్య అనే హరిజనుడి బీదరికాన్ని చూసి ఆయన అతన్ని తన యింటికి తీసుకువచ్చి భోజనం పెట్టి సేవలు చేశారు. అష్టావధానాలలో అసూయాపరుల అలజడిని తన శాఁతవచనాలతో తొలగించగలిగే యుక్తిని పాటించేవారు. ఆయన మృదుభాషణతో ఎంతోమఁదిని ఆకర్షించేవారు. ఆయన మాట్లాడే విధానంలో తెలంగాణ పలుకుబడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి కనుక కళాసాహిత్యరంగాల కృషిలో భాగంగా సామాజిక సేవాసక్తితో అన్నిప్రాంతాలను పర్యటించి వివిధ ప్రాంత భాషా సంప్రదాయాలను ఆకళింపు చేసుకుని సందర్భోచితంగా తన రచనల్లో వినియోగించేవారు. ఆయన సామాజిక కళారంగాలలో ఎంత చొరవగా, స్మితంగా వ్యవహరిస్తారో సభా కార్యక్రమాల్లో, పండిత సభల్లో అంత గంభీరముద్రను వహించేవారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎన్ని కష్టాలు పడినా ఎన్నడూ, ఎవరితోనూ చెప్పుకోలేదు. వాటి ఛాయను తన పిల్లలమీద పడనివ్వలేదు. అంతేకాదు, ఆయన ఏ సంస్థానాధీశుడినీ ఆ్రశయించలేదు. ప్రజలతోనే సాన్నిహిత్యాన్ని ఎక్కువగా ఏర్పరచుకున్నారు.
కవిత్వం, అష్టావధానం, హరికథాగానం, నాటక రచన, భక్తి కార్యక్రమ నిర్వహణ, వైద్యం, అన్నదానం, బీదలకు ఉపకారం, ఇవన్నీ ఆయన ఎంచుకున్న ఆదర్శమార్గాలు. ఏ ప్రక్రియయైనా పరుల కోసమే తప్ప స్వముఖాన్ని ఆశించి చేయలేదు. సృజనాత్మకత ప్రధాన లక్షణంగా కలిగిన సంగీత సాహిత్యాలను ఆయన ధన సంపాదన కోసం, వినోద కాలక్షేపాల కోసం వినియోగిఁచుకోలేదు. ప్రజాచైతన్య లక్షణానికి ప్రాధాన్యతనిస్తూ నూతన ప్రయోగాలు చేసి వాటికి నిండుదనం సమకూర్చారు. ధ్యానం, ఉపాసన, తపస్సులకు సేవాగుణాన్ని జోడించి జాతీయతాభావ పరిపుష్టికి అద్భుతమైన కృషిచేశారు. సప్తాహ నిర్వహణతో సమాజంని అన్ని వర్గాలవారిని ఒక్కచోటికి చేర్చగలిగారు. భక్తితత్త్వాన్ని, ధర్మప్రచారాన్ని ప్రస్థావించడానికి కవిత్వం ఒక బలమైన సాధనమని భావించి ఎన్నో భక్తి రచనలు చేశారు. ఆయనలోని భక్తితత్త్వానికి, తాత్త్విక చింతనకు బలమైన ఉదాహరణ ‘శ్రీకృష్ణతులాభారం’ నాటకం కోసం ఆయన వ్రాసిన ‘బలేమంచి చౌకబేరము’ పాట ఒక్కటి చాలు. ఈ పాట నాటకంలోనే కాక సినిమాల్లోనూ ప్రసిద్ధిని పొందింది. ఆయన రచనల్లో ఈ పాట ఒక్కటే ‘ఘంటసాల మాస్టారు’ పాడి దాన్ని అజరామరం చేశారు. కవి, గాయకులు పునీతులయ్యారు.
కేశవదాసుగారు ప్రతిదినం నిద్రలేచాక ధ్యానం, పూజాదికాలు అయ్యాకనే ఆహారాన్ని స్వీకరించేవారు. అన్ని కాలాలలోనూ చన్నీటితోనే స్నానం చేసేవారు. త్రికాలాలలో ధ్యానం, సంధ్య ఆరించేవారు. నియమనిష్ఠలతో పూజను జరిపేవారు. మధుమాంసాలను దరిజేరనీయలేదు. నశ్యం, ధూమపానం లాంటి ఏ అలవాట్లనూ దగ్గరికి రానివ్వలేదు. ‘పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః’ వలెనే ఆయన జీవితమంతా పరోపకారంలోనే గడిచిపోయింది. సంపూర్ణధన్యజీవితాన్ని అనుభవించి 14.05.1956 నాడు ఆయన తన ఇష్టదైవమైన సీతారామచంద్రస్వామివారిలో లీనమైనారు.
(20.6.2021 నాడు శ్రీ చందాల కేశవదాసుగారి 145వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం ఇది.)
రచన
డా. ఎం. పురుషోత్తమాచార్య