సాహిత్యం ఎన్నో రూపాలలో మనకు తెలివిని , ప్రతిభనూ ఇస్తుంది. అందులో పాట అనేది హృదయాలను తొందరగా ఆకట్టుకుంటుంది . ఈ “ దాక్కో దాక్కో… “ పాట లో దాగి ఉన్న భావాన్ని వెతికి పట్టుకోవాలంటే ఇట్లా విమర్శ చేసుకుందాం.
చిత్రం : పుష్ప ( The Rise)
రచన : చంద్రబోస్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
దర్శకత్వం : సుకుమార్
నటీనటులు: అల్లు అర్జున్ – రష్మీక మందన్న
జీవితం అదొక వేట..
మనుగడకోసం పోరాటమే
సృష్టి జీవిత రహస్యం..!
ఆహారపు గొలుసు..
అది జీవశాస్త్ర రూపు..!!
ఆ రూపానికి సాహిత్యం సమకూర్చితే..
“పుష్ప” సినిమాలో
“దాక్కో దాక్కో మేక..” పాటగా
సంచలనం సృష్టిస్తుంది.
*వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక..*
*మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి..*
*అ.. అ.. అ.. అఅఅ..*
*పులినే తింటది చావు.. చావును తింటది కాలం..*
*కాలాన్ని తింటది కాళీ.. ఇది మహా ఆకలి..*
*అ.. అ.. అ.. అఅఅ..*
వెలుతురును సంగ్రహించుకుని
కిరణ జన్య సంయోగక్రియ ద్వారా
ఆహారం తయారు చేసుకుంటుంది ఆకు..
అంటే…
ఆకు వెలుతురును తింటది..
ఆకును మేక తింటది..
మేకను పులి తింటది.. ఇది కదా ఆకలి..
ఈ ఆకలికి అంతం ఉందా..?
లేదు..!
అంతటి పులినే చంపుకు తింటది చావు..
చావును కూడా తింటది కాలం..
ఎంతటి చావు ఐనా కాల ప్రవాహంలో
కనుమరుగు అవ్వాల్సిందే..
కానీ..
ఆ కాలాన్ని కూడా తింటది కాళీ
ఇది అసలు ఆకలి.. మహా ఆకలి.
ఆకు.. మేక.. పులి.. ఆహారపు గొలుసులో
ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి.
ఒక దగ్గర వినియోగదారుడుగా ఉన్న ప్రాణి..
స్థానం మారగానే ఆహారంగా మారుతుంది.
భక్షకాలు.. భక్షితంగా మారుతున్నాయి.
“ఆకలి – చావు – కాలం ” ఇవి మూడు బలమైనవి.. బలీయమైనవి. ఇవి బ్రతకడం నేర్పిస్తాయి. బలిఅవకుండా ఉండటం నేర్పిస్తాయి.
*వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి..*
*దొరికిందా ఇది సస్తాది..* *దొరక్కపోతే అది సస్తాది..*
*ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే..*
*హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..*
ఈ సృష్టిలో వేటాడేది ఒకటి..
పరిగెత్తేది ఇంకొకటి..
వేటాడేది తినడానికి..
పరిగిత్తేది ప్రాణ రక్షణకి..
రెండిటికీ ప్రాణమే ప్రథమ ప్రాధాన్యత.
వేటను మానేస్తే ఆకలితో అలమటించి కనుమూస్తది ఒక జీవి..
పరిగెత్తడం మానేస్తే ఆకలిగా ఉన్న జీవికి ఆహారంగా మారి మరణిస్తది మరో ప్రాణి..
అంటే..
ఒక ప్రాణికి ఆకలేస్తే ఇంకో ప్రాణి అంతమవ్వాల్సిందే..
అందుకే..
మరణం రణం.. ప్రాణం ఉండాలా..?
దాక్కో దాక్కో మేకలాగా..
లేదంటే పులొచ్చి కొరుకుద్ది పీక..!!
*చాపకు పురుగు ఎరా.. పిట్టకు నూకలు ఎరా..*
*కుక్కకు మాంసం ముక్క ఎరా.. మనుషులందరికీ బతుకే ఎరా..*
ప్రతిదీ ఎర నే…
చేపను చంపాలంటే పురుగును ఎర వేయాలి.
పిట్టను పట్టాలంటే నూకలు ఎర వేయాలి.
కుక్కకి మాసం ముక్క ఎరా..
మనుషులందరికీ బతుకే ఎరా.
బతకాలి అనే ఆశే లేకుంటే.. మనిషే ఉండడు.
ఆ మనిషి ఉండాలి అంటే బతకాలి అనేది ఎరా..!
*గంగమ్మ తల్లి జాతర.. కోళ్లు పొట్టేల్ల కోతరా..*
*కత్తికి నెత్తుటి పూతర.. దేవతకైనా తప్పదు ఎరా..*
*ఇది లోకం తలరాతరా..*
*అ.. అ.. అ.. అఅఅ..*
గంగమ్మ తల్లి జాతర చేస్తే.. కోళ్లు పొట్టేలు బలి ఇస్తారు. ఆ తల్లికి అవి ఎర..
అంటే.. దేవతకైనా ఎర వేయాల్సిందే..
ఈ చరాచర జగత్తులో ప్రతిప్రాణి ఒక ఎర..
ఇది లోకం తల రాత.
*ఏమరపాటుగా ఉన్నావా ఎరకే చిక్కేస్తావు..*
*ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు..*
*కాలే కడుపు సూడదురో నీతి న్యాయం..*
*బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం..*
*హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..*
ఏమౌతుంది అని ఏమరపాటుగా ఉన్నావా..?
ఎరకే చిక్కేస్తావు.. చిక్కకుండా ఉండాలి అంటే
ఆ ఎరనే మింగే ఆకలి ఉండాలి.
అలా ఉంటేనే ఈ భూమిపై బతికేస్తావు.
ఆకలితో ఉన్న వాడికి నీతి, న్యాయం అవసరం లేదు.
బలం ఉన్నోడిదే రాజ్యం.. అది అంతే.
*అడిగితే పుట్టదు అరువు..* *బతిమాలితే బతుకే బరువు..*
*కొట్టర ఉండదు కరువు..* *దేవుడికైనా దెబ్బే గురువు..*
*తన్నుడు సేసే మేలు.. తమ్ముడు కూడా సెయ్యడు..*
*గుద్దుడు సేప్పే పాఠం.. బుద్దుడు కూడా సెప్పడహే..*
*హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..*
అడిగితే పెట్టేవాడు ఎవరూ ఉండరు.
బతిమాలితే చిన్నచూపు చూస్తారు..
ఛీదరించుకుంటారు.
నిలబడు.. కలబడు.. అన్నీ నీ దాసోహం అవుతాయి. అపుడు దేనికి కొదవలేదు.. దేబిరించాల్సిన అవసరం అసలే లేదు. దేవుడికి ఎందుకు భయపడుతున్నారు. దండిస్తాడని. అంటే దేవుడికి కూడా దెబ్బే గురువు.!
నాలుగు తన్నిచూడు సక్కరకొస్తాడు ఎవడైనా..
అందుకే తన్నులు చేసే మేలు తమ్ముడు కూడా చేయడు.
రెండు గుద్దులు పడితే.. మళ్ళీ నీ జోలికి రాడు ఎవడూ.. ఇవి జీవిత పాఠాలు..
ఏ బుద్దుడు కూడా చెప్పడు..
అంటూ..
బలవంతుడి ముందు బతకాలి అంటే
అంతకన్నా బలవంతుడిగా నువ్వు ఉండాలి.
నిన్ను నువ్వు రక్షించుకోవాలి.. అంటూ జీవశాస్త్ర సూత్రాలను జీవత సత్యాలుగా మలిచి సాహిత్యం అందించారు గీత రచయిత చంద్రబోస్.
పాటలో ఒక చురుకు ఉంది..
ఒక ఉద్భోద ఉంది..
న్యాయం కానీ న్యాయం ఉంది.
అంతర్గత సందేశం ఉంది..