కన్నడ మూలం : మధురా కర్ణమ్ తెలుగు అనువాదం : డా. నలిమెల భాస్కర్
మేఘాలు లేని నిర్మలమైన ఆకాశాన్ని మెత్తగా పత్తిలాంటి ఓ తెల్లని మబ్బు ఆక్రమించికొని వుంది. మొదట అత్యంత సుందరంగా కన్పించిన ఆ మబ్బు తునక కాస్త దగ్గరికొస్తూ కిందికి దిగుతుంటే నలుపు పెరిగి నైరూప్యమై పోయి చుట్టుపక్కల చీకట్లు ఆవరించినట్లు ఓ అనుభూతి. ఎక్కడ వర్షం వస్తుందో అనుకుంటూ పెరట్లోని నిమ్మపళ్ళు పట్టుకొని వేగంగా లోనికొచ్చాడు శేషాద్రి. ప్రశ్నార్థక దృష్టితో తనను చూసిన రమతో “మనకు సర్దుబాటు అవుతుందా బెంగుళూరు. ఇక్కడ సొంత ఇంట్లో హాయిగా వున్నాం” అని మెల్లగా అన్నాడు. రమ రెచ్చిపోయి “సర్దుబాటు కాదు అంటే ఎలా? సర్దుబాటు చేసుకోవాలి. మొదట్లో
కొన్నాడు. ‘ఇక్కడికే రండి‘ అని ఎన్నిసార్లో పిలిచాడు. మీరే అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఈసారి కోపంతో వెళ్ళిపోయాడు. అవునూ, మనమూ పిల్లలతో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండటం ఎప్పుడింక? సుఖపడటమూ, ఎంజాయ్ చేయటమూ ఎప్పుడు? ఓ అమ్మాయిని చూడాలి. వాళ్ళ పెళ్ళి గురించి ఆలోచించాలి. ఈ ఇల్లు అద్దెకు ఇచ్చి వెళదాం పదండి” అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడింది. పొయ్యి మీది వంట చిటపట చప్పుడు చేసింది. బయట మిడ్తూ చిలుక “అప్ప, అప్ప, అప్పు” అంది. ఈ నెపంతో శేషాద్రి బయటికి నడిచాడు.
తన ముద్దుల చిలక మిఠూకి పచ్చిమిరపకాయ తినిపిస్తూ శేషాద్రి ఆలోచించసాగాడు. రమ చెప్పినదాంట్లో తప్పేమీ లేదు.
పిల్లలు ‘మాతో రండి’ అని పిలవడమూ, చాలా బలవంతపెట్టడమూ నిజమే! కానీ, ఇక్కడ సర్దుకున్నట్లు అక్కడ సాధ్యమా? ఈ హళియాళ అనేది చిన్న ఊరైనా సొంతిల్లు ఉంది. ధార్వాడకు దగ్గర, ఉపాధ్యాయ వృత్తిలోంచి పదవీ విరమణ పొందినా ట్యూషన్లు చెబుతున్నాడు. ఐతే బెంగుళూరు, ముంబైల్లో ఉండే మజా మాత్రం ఇక్కడ లేదు. ఇదొక ప్రశాంతమైన నిర్మలమైన కొలను. అక్కడి దుమ్మూ, ట్రాఫిక్, కాలుష్యం, హడావుడి.. కష్టం కదా! ఇంతకుముందు అంటే వాళ్ళున్నది ఇరవై ఐదు ఏళ్ళ కిందట. యశ్వంతపురం సర్కారీ పాఠశాలలో పనిచేస్తున్న కాలం. అప్పుడప్పుడే కంప్యూటర్ కళ్ళు తెరుస్తున్న వేళ, రమ కూడా బేసిక్ కోర్సు నేర్చుకొని ఓ సంవత్సరం పాటు ఉద్యోగం కూడా చేసింది. తర్వాత మళ్ళీ ఉత్తర కర్ణాటక వైపు రావడం జరిగింది.
రమ, శేషాద్రుల చిన్న కుటుంబం గురించి తప్పక చెప్పాలి. రమ గృహిణి. శేషాద్రి ప్రారంభంలో ఎంత ఎగిరినా చివరికి భార్య చెప్పినట్లు వినే ‘జీ హుజూర్‘ భర్త. ఇద్దరు పిల్లలు… అతుల్, అమిత్. అతుల్ చక్కటి మార్కులతో ఇంజినీరింగ్ లో చేరాడు. అమిత్ కూడా మంచి మార్కుల్ని పొందినా పోటీ పరీక్షల గొడవే వద్దు అనుకుని కామర్సులో చేరాడు. ఇద్దరూ ఒకేసారి డిగ్రీ ముగించి బెంగుళూర్లో ఉద్యోగాలు దొరికించుకున్నారు.
అతుల్ పదో తరగతిలో ఉండగా థాండేలికి ఎక కర్షన్కు వెళ్ళినపుడు తెచ్చిన చిలుకే మిర్టూ.
తండ్రికి ఇష్టం లేకున్నా గొడవపడుతూ సాకాడు దాన్ని. అది కూడా “అన్న, అన్న” అంటూ అతని వెంటే తిరుగుతుంది. అతడు లేనప్పుడు మాత్రం అమిత్ వైపు చూస్తుంది. కానీ, దాని ముద్దు పలుకులకు శేషాద్రి ఇష్టపడి దాని ఆలనాపాలనా తనే చూస్తున్నాడు. ఆకలైనపుడు “అమ్మ, అమ్మ” అంటున్న చిలుక, దాని మలం బయట పారవేయాల్సి వచ్చినపుడు మాత్రం “అప్ప, అప్పు” అని పలుకుతున్నది. ఇంటి వాళ్ళకే కాదు, ఇరుగు పొరుగులకూ అది ఇష్టమై పోయి “మిడ్తూ మియా” అయ్యింది.
చివరికి రమ మాటే నెగ్గింది. ఇల్లు అద్దెకిచ్చి అవసరమైన సామాగ్రితో మిఠూ మియా పంజరాన్నీ తీసుకుని బెంగుళూర్లో దిగింది. అతుల్ రాజాజి నగరం భాష్యం సర్కిల్ దగ్గరనే ఇల్లు తీసుకున్నాడు. రెండు బెడ్రూములు, హాలు, కిచెన్లు ఉన్న చిన్న ఇంటికి పదిహేను వేల అద్దె, ఓ లక్ష డిపాజిట్ కట్టాడు. అరవై ఎనిమిదో క్రాసు మార్కెట్టుకు దగ్గరే! ఇరుగు పొరుగు పిల్లల్ని తప్పించడానికి మిఠూ పంజరాన్ని వెనకాల వేలాడదీసింది. అతుల్ పొద్దుట ఏడున్నరకు ఇల్లు వదిలితే తొమ్మిదింటికి తన కంపెనీలో ఉండేవాడు. అతనికన్నా ఓ సంవత్సరం చిన్నవాడైన అమిత్ ఎనిమిది గంటలకు బయలుదేరితే తొమ్మిదికి హ్యారిక్స్ కంపెనీకి చేరేవాడు. ఆ తర్వాత సాయంకాలం, రాత్రి దాకా ఆలుమగలదే సామ్రాజ్యం. ‘సాఫ్ట్ వేర్ ఇంజనియర్‘ అనే కారణం చేత అతుల్ మీద ప్రత్యేకమైన ప్రేమ, గర్వం రమకు. రోజూ తప్పకుండా “ఎన్ని గంటలకు వస్తావ్?” అనే అనే ప్రశ్న అతుల్ ని అడుగటమే ! “అమ్మా! సాఫ్ట్వేర్ వాళ్ళకు ఇంటినించి బయలుదేరే టైమే తెలుసు కరెక్టుగా. తిరిగి ఇంటికొచ్చే టైమ్ తెలీదు” అనేవాడు. ఆ జవాబుతో రమ నిరుత్తురురాలైంది.
కొత్త ఇంటితో సర్దుబాటు చేసుకునే ఆదుర్దాలో రోజులు గడిచిపోవడం తెలియనే లేదు. వారాంతాల్లో చుట్టుపక్కల ఉన్న విశేష స్థలాలు గొరవనపల్లి, మేలుకోటె, మేకదాటు మొదలైనవి చూడటమైంది. హోటల్ తిళ్ళు, సినిమా, షాపింగ్తో రమ ఉబ్బితబ్బిబ్బు అయ్యింది. కొత్తరకపు జీవిత పరిచయాన్ని కల్గించాయి రమకు. ఉత్తర కర్ణాటక వాళ్ళే ఎక్కువగా ఉంటున్న కాలనీలో చక్కగా ఈ ఆలుమగలిద్దరూ ఇరుగుపొరుగుతో కలిసిపోయారు. అన్నగారి సహవాసం రోజూ లభించడంతో మిడ్తూ మియా కూడా ఖుషీ ఖుషీగా ఉన్నాడు. దాన్ని మాట్లాడించనిదే అతుల్ కి ఏ రోజూ ప్రారంభం కాదు. మొబైల్ లో ఫోటో తీసి, వీడియో చేసి స్నేహితులకు చూపిస్తున్నాడు. అంతా బాగానే వున్నా విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ రమకు గాబరా కల్గిస్తున్నది. రోడ్డు దాటాలంటేనే భయంగా వుంది. చుట్టుపక్కల ఎక్కడెక్కణ్ణించో వలస వచ్చిన వివిధ భాషలు మాట్లాడే జనం. మార్వాడీల సంఖ్య ఎక్కువ. దేశంలోని అన్ని ప్రాంతాల నించి ఇతర భాషీయులు వచ్చి ఇక్కడే తిష్ఠ వేసుకొని ఇదే సొంతం అనుకునేంతవరకూ పాతుకుపోయారు. అచ్చమైన కన్నడం విన్పించడం చాలా అరుదు.
రమకు కాస్త తీరిక దొరికాక చిన్ననాటి స్నేహితురాలు సులక్షణకు ఫోన్ చేసింది. ఇద్దరూ తాము అనుకున్న దినం కలుసుకుని కౌగలించుకుని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. సులక్షణ అప్పటికే సాహిత్య రంగంలో పేరు తెచ్చుకుంది. అనేక కథాసంపుటులూ, కవిత్వం సంపుటులూ, నవలలూ ప్రచురించింది. నాలుగు అవార్డులు వచ్చాయి. తన భర్తగారి అకాల మరణంతో కల్గిన దుఃఖాన్ని కథల్లో మరచిపోవడం అబద్ధం కాదు. రమ కూడా సాహిత్య విద్యార్థినే! ఇప్పుడు తన ఫ్రెండుతో సాహిత్య వ్యవసాయం సాగించాలనే ఆశతో ఉంది. రమ ఆలోచన విన్న సులక్షణ చిన్నగా నవ్వి “ఆనాటి రోజులు కావు రమా! ఇప్పుడెక్కడ చూసినా సాఫ్ట్ వేర్ చూడు. బెంగళూరు అంటేనే సైబర్ ఊరు అన్నట్లు తయారైంది. దాంతో మంచే జరిగిందా? కులమతాల గొడవలేక మెరిట్ మీద నౌకరీ దొరికిన మధ్యతరగతి జనాలు బాగుపడ్డారు. విదేశాలు చూసారు.
డబ్బులు గడించారు. మన ఊరి పేరు ప్రపంచంలో ఫేమస్ అయ్యింది.
కానీ సాఫ్ట్ వేర్ల కథ ఎంతమందికి తెలుసు? ప్రెషర్ కుక్కర్ల గతి వాళ్ళది. పని ఒత్తిడి,
టార్గెట్ అనే వేలాడే కత్తి కిందనే బతుకులు. బయటికి హాయిగా ఉంటుంది. లోన… పొట్టవిప్పి చూస్తే అన్నీ పురుగులే! సాహిత్యంలోనూ సాఫ్ట్ వేర్ గురించి కథ రాస్తే చాలు, గరం గరం దోసెల్లా ఖర్చవుతాయి. సాఫ్ట్ వేర్ లో పనిచేసే వాళ్ళు అంటే చేతిలో ఓ బాటిల్, ఒకటి
రెండు బలహీనతలు, కొందరు అమ్మాయిలు, వాళ్ళతో అఫెయిర్సు సెటప్సు, విదేశీ ప్రయాణం… ఇవి ఉంటే చాలు… కథలూ, నవలలూ అన్నీ సక్సెస్. ఈ మధ్య మన బెంగుళూరంతా సైబర్ సాహిత్యమే ఆవరించుకుంది” అని నిట్టూర్చింది. రమ తలలో అనేకానేకమైన ఆలోచనలు. కర్ణాటకలోని మారుమూల పల్లెటూళ్ళలోనూ, పట్టణాలల్లోనూ పిల్లలు పెరిగి పెద్దవుతున్నారంటే ఇంజనీరింగ్ చదివే తమకం. డిగ్రీ రాగానే బెంగుళూరుకు వచ్చి సాఫ్ట్ వేర్ లో చేరే పరుగు. చేరగానే విదేశాలకు వెళ్ళాలనే కలలు. మిగిలిన మామూలు డిగ్రీలకు విలువే లేని పరిస్థితి. పెళ్ళి మార్కెట్టులోనూ ఈ డిగ్రీధారులను పట్టించుకోవడం తక్కువ. రమ మనస్సులో తాను ఇంతకుముందు చూసిన బెంగుళూరు బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా, బంగరు కలలాగా కనిపిస్తూ ఐస్ క్రీములా కరిగిపోతున్నది.
మూడోరోజు సీతా, ఆమె కూతురు విభా వీళ్ళకు కాస్త దగ్గరయ్యారు. వాళ్ళూ ధార్వాడ వాళ్లే!
చాలా ఇష్టమైంది. దినానికోమారు క్యారెట్టు,
జామ పండ్లు తెచ్చి దాన్ని మాట్లాడిస్తూ ఆనందిస్తున్నది. అయితే అమిత్ మాత్రం “అమ్మా! నీకు తెలీదు. ఆమె మిడ్తూ కొరకు కాదు, మిర్టూని సాకినవాడికోసం వస్తున్నది. అతుల్ ఉండే టైమ్ చూసే వస్తున్నది. కావాలంటే చూడు” అన్నాడు. రమ కూడా గమనించింది. అమిత్ చెప్పింది నిజమే! మళ్ళీ అలా రావడంలో తప్పు లేదు అనుకుంది. విభా అందగత్తె బి.కాం. చివరి సంవత్సరంలో ఉంది. మంచివాళ్ళే! కానీ అతుల్ “అమ్మా! నాకు బి.ఇ. చేసినావిడే కావాలి. ఎమ్.ఎన్.సి.లో నౌకరి చేయాలి, బెంగుళూరు ఎంత కాస్ట్లీ తెలుసు నీకు. ఆలుమగలిద్దరూ నౌకరి చేస్తేనే ఇల్లూ ముంగిలీ నడవటం సాధ్యం” అన్నాడు. ఇంతలోనే అతని ఉద్యోగం కథ చాలినంత చూసిన రమ గమ్మున తల పంకించింది. మనసులోనే “వీకెండ్ లోనే వీళ్ళ హుషారు. మిగిలిన రోజుల్లో ఒంటిమీద స్పృహ ఉండదు” అనుకుంది. ఐనా “ఇవాల్టి పిల్లలు తమకి పనికొచ్చే అమ్మాయిలనే ఎంచుకుంటున్నారు. కానివ్వండి… ఆ తర్వాత ఇబ్బందులు కావద్దు కదా” అంది. విభా సంబంధాన్ని ఇష్టపడిన శేషాద్రి “అలా మన ప్రమేయమూ, పాత్రా ఏవీ ఉండవు. మనం కేవలం నామ్ కే వాస్తే” అన్నాడు. కొడుకు పక్షం వహించిన రమ “అలా ఎందుకంటారు? ఈనాటి పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళ ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. మున్ముందు జీవితం గడపాల్సింది వాళ్ళే కదా! వాళ్ళే…..” అని వాదించింది కూడా. కానీ మనసులోని ఏదో మూలన కొడుకు తమ ఆశల్ని నేరుగా నిరాకరించినందుకు బాధా ఉంది.
సులక్షణ ఓరోజు భోజనానికి వచ్చింది. స్నేహితురాండ్రను మాట్లాడుకోవడానికి వదలి శేషాద్రి వెళ్ళి లైబ్రరీలో కూచున్నాడు. భోజనం చేసాక సులక్షణ “రమా! ఓ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఇవాళ పిలిచారు. నా నవల సీరియల్ గా తీయడం గురించి మాట్లాడుతారట! నువ్వు రా!! కలిసొద్దాం” అనడంతో రమ ఆనందాన్ని పట్ట పగ్గాల్లేవు. భర్తకు వడ్డించి బయల్దేరింది. ఇద్దరూ మల్లేశ్వరంలో ఉన్న ఆఫీసు చేరి హంసల చెక్కడపు పనితో ఉన్న తలుపులు తట్టి లోనికి వెళ్ళారు.