Home పుస్త‌క స‌మీక్ష‌ ధార్మిక జీవనులు శ్రీమాన్ పాములపర్తి వేంకట మనోహరరావుగారి రచనల సమాహారం ” సాహితీ మనోహరం” పై ఒక సమీక్ష.

ధార్మిక జీవనులు శ్రీమాన్ పాములపర్తి వేంకట మనోహరరావుగారి రచనల సమాహారం ” సాహితీ మనోహరం” పై ఒక సమీక్ష.

by Aruna Dhulipala

పీ.వీ. మనోహర రావు గారు…సాహితీ గగనతలంలో
ఏమాత్రం పరిచయం అక్కరలేని పేరు. తళుకులీనే తార. నిరాడంబరుడు, నిగర్వి, నిష్కామకర్ముడు, నిష్పక్షపాతి, నిష్కపటి, నిరంతర ఆధ్యాత్మికతా లోలుడు అనే ఆభరణాలతో స్వయం ప్రకాశకులు.
స్వాతంత్ర్య సమరంలో, హైదరాబాద్ విమోచనోద్యమంలో పాల్గొన్న అపర దేశభక్తులు.అపర చాణుక్యునిగా భారతదేశానికి విశిష్ట సేవలందించి, వినమ్రుడిగా ఎదిగిన ప్రధాని పీవీ నరసింహారావు గారికి స్వయంగా సోదరులైనా తనకంటూ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న మహనీయులు పాములపర్తి వేంకటమనోహర రావు గారు.
‘సాహితీ మనోహరం’ మరుమాముల దత్తాత్రేయ గారి ప్రధాన సంపాదకత్వంలో ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా, అద్భుతమైన భావజలధిలో పురుడు పోసుకున్న తరగ. ఆయనకు మనోహర రావు గారి మీద ఉన్న అవ్యాజమైన అనురాగంతో వారి రచనల గురించి ఏదైనా చేయాలనే సత్సంకల్పం, ఆశయాలతో
ముందుకు నడిచి, మహామహుల విశ్లేషణలను క్రోడీకరించి ఒక సమగ్ర కూర్పుతో వ్యాస సంకలనంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్ది తన విధేయతను ప్రకటించుకున్నారు దత్తాత్రేయ గారు. పెద్ద కొండను చిన్ని అద్దంలో చూపినట్లు మనోహరరావు గారి అద్భుతమైన పాండిత్యాన్ని సుమనోహరంగా,
సులభ గ్రాహ్యంగా మనకు అందించడంలో కృతకృత్యులయ్యారు.
దీంట్లో మనోహరరావు గారు రచించిన కైలాస దర్శనం, రుద్రాభిషేకం, సర్వార్థ సంక్షేమ సమితి, సమర్పణం, సద్విద్య – సత్పథం అనే ఐదు పుస్తకాలకు రాయబడిన సమగ్ర వ్యాఖ్యానం పొందుపరచబడింది.

కైలాస దర్శనం – అన్వీక్షణం

పద్యకోకిల, అష్టావధాని -డా.బోచ్కర్ ఓంప్రకాశ్ గారు మనోహరరావు గారి యాత్రాగ్రంథమైన కైలాసదర్శనం గురించి, దాంట్లో వారు రాసుకున్న యాత్రా విశేషాలను ఆద్యంతం ఆసక్తికరంగా విపులీకరించారు. సుపథ గామిగా ఆయనను అభివర్ణించారు. పురాణ కాలంనుండీ మన భారతీయ సంస్కృతిలో యాత్రలు చేయడం ఒక గొప్ప లక్షణంగా చెప్పబడింది. అందువల్ల మనదేశంలో ప్రతి వ్యక్తికి ఆసేతు హిమాచలం వరకు పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ లోని విదేశాంగ శాఖ కార్యాలయం నుండి కైలాస, మానస సరోవర యాత్రకు నాల్గవబృందంలో ఎంపికైన పీ. వీ. మనోహరరావు గారు 19-7-1983 న తమ బ్రహ్మ మానస సరోవర యాత్ర ప్రారంభించారు. ఆ విశేషాలను మొత్తంగా ‘కైలాసదర్శనం’ అనే పేరుతో పుస్తకంగా రాసుకున్నారు. 45అధ్యాయాలలో తమ అనుభవాలు, అనుభూతులు చేర్చి తెలుగు యాత్రా చరిత్రలలోనే దీనికి ఒక విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. దాదాపు మండల కాలంలో ఈ యాత్రను పూర్తి చేసారు. ఎన్నెన్నో పుణ్య క్షేత్రాలు, ఆశ్రమాలు, తీర్థాలు, జలపాతాలు, నదులు, సంగమస్థలాలు, పర్వతాలు, మంచుశిఖరాలను దర్శించి తాదాత్మ్యం చెందారు. ఆ అనుభూతులతో మనకు ప్రత్యక్ష దర్శనం చేయించారు. ప్రతీ అధ్యాయానికి ఒక రమణీయమైన పేరు పెట్టడం, ప్రతి అధ్యాయం కూడా ఏదో ఒక దైవ శ్లోకంతోనో, పద్యం తోనో ప్రారంభించడం ఆయన దైవభక్తికి తార్కాణం.

” యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః “అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఉత్తముల కర్మలు

సదాచారాలుగా ఆదర్శప్రాయమవుతాయి. భారతీయ సంస్కృతిలో పురాణాలు, ఇతిహాసాలు సదాచారాలకు నిధులు. మనోహరరావు గారు అలాంటి ఎన్నో సదాచారాలను అయా అధ్యాయాల్లో పేర్కొన్నారు. ఉ:- సాలగ్రామ విశిష్టత, వాటిలోని వివిధ రకాలు, సాలగ్రామ అర్చనలో తులసీదళంతో పూజించడం గురించి చెబుతూ శంఖోదకాన్ని తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. భస్మ, రుద్రాక్ష ధారణల గురించి వివరించారు. వాచిక, మానసిక, కాయిక, తపస్సులను గురించి తెలిపారు. సత్యము యొక్క విశిష్టత, స్వార్థ, అసత్య, మాయ, మోహ, మోస, దుష్టచింతనల వల్ల సమాజానికి జరిగే అనర్థాలను హెచ్చరించారు.
ఇంతే కాక కైలాస, మానససరోవర ప్రాంతాలకు చెందిన ఆయా సాంఘిక ఆచారాలను కూడా దీంట్లో పొందుపరచడం విశేషం. టిబెట్ లోని బౌద్ధమత సంస్కృతిని, భారతీయ సంస్కృతికి గల సాన్నిహిత్యాన్ని ప్రస్తావించడం వారి జ్ఞాన విస్తృతిని తెలియజేస్తుంది. టిబెట్ లోని ప్రజల వాయిద్యాలు, దైవ నివేదనకు ఉపయోగించే ఆహారాలు.. ఇలా ఎన్నో విశేషాలను విడమరిచారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే మరో వైపు సందర్భానుసారంగా వేద, పురాణ, కావ్య, శాస్త్రముల నుండి పద్య, శ్లోకాలను ఉదాహరించి, అందరికీ అర్ధమయ్యే రీతిలో రాయడం ఈ యాత్రకు శోభను సంతరించుకుంది. కాళీమాతను దర్శించుకున్న సందర్భంలో,
“అంబ నవాంబుజోజ్జ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా”
“అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ” అంటూ దేవీ భాగవతంలోని స్తుతులతో అమ్మవారిని దర్శించి పునీతులయ్యారు.
“పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం” అని మంచిని బోధించారు.
సత్యం నిష్ఠ, సదాచారాల గురించి తెలుపుతూ భారతంలోని ” భూత హితంబుగా బలుకు బొంకును సత్య ఫలంబు నిచ్చు” నని వాటిపట్ల తన శ్రద్ధను వ్యక్తం చేసారు. ఒక సందర్భంలో తన వెన్ను నొప్పి కారణంగా ఇక యాత్ర చేయలేనేమో అనుకున్నప్పుడు,
“క్లైబ్యం మా స్మగ మః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే” ఒక కార్యాన్ని చేపట్టినప్పుడు పతనానికి కారణమయ్యే నపుంసకత్వాన్ని,హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టాలని అర్జునునికి కృష్ణుడు బోధించిన భగవద్గీత శ్లోకాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని కార్యోన్ముఖులైనారు.
హిమాలయాల ఎత్తును చూసి కాళిదాస విరచిత కుమారసంభవ కావ్యంలోని “అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా, హిమాలయో నామ నగాధిరాజః” అనే శ్లోకాన్ని అలాగే అల్లసాని వారి మనుచరిత్ర లోని ప్రవరుని హిమాలయ యాత్రకు సంబంధించిన “అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర
ఝరీ పటల ” అనే పద్యాన్ని ఉదాహరించడం ఆయన జ్ఞాన సంపదను తెలుపుతుంది. పీవీ నరసింహారావు గారికి మానస సరోవర ఉదకమును తీర్థంగా ఇచ్చిన సమయంలో వారి మాతృమూర్తిని స్మరిస్తూ చాందోగ్యోపనిషత్తును అనుసరించి భావానుసరణ చేసిన పద్యం…

” తల్లి అధికురాలయ్యె ధరణికంటె
తండ్రి యధికుండు విష్ణు పదంబుకంటె” అని తెలపడం
తల్లిదండ్రుల విశిష్టతను తెలియచేస్తుంది. ఇక్కడ ఆయన ఒలికించిన కరుణ రసం అద్భుతం.
జరిగిన కొన్ని చేదు అనుభవాల దృష్ట్యా ” యద్ధాత్రా నిజ ఫాలపట్ట లిఖితం ” అనే శ్లోకం ద్వారా ధనధాన్య సంపదలు, సుఖ దుఃఖాలు మనుషులు ఎక్కడికి వెళ్లినా వెంటే వస్తాయని తెలిపారు. వీటన్నింటిని బట్టి అనేకానేక అంశాలలో వారికున్న విజ్ఞానము, వివేకము మనకు ద్యోతకమవుతాయి.
ఈ పుస్తకాన్ని మండల కాలంలో పూర్తి చేసి, తమ మాతృమూర్తి రుక్మిణీదేవిగారికి అంకితం ఇవ్వడం పుణ్యకార్యంగా చెప్పవచ్చు. ఆమె పదాలకు సభక్తికంగా
ఎన్ని జన్మల పున్నెమో ఈ తనువున
తల్లి ! నీ యనురాగ సంతర్పితుడగు
చిన్ని కొడుకీయనున్న ఈ చిన్ని యుపద
నీ పదాబ్జములందున నిలుచుగాక !
అంటూ శిరసు వంచి ఆమెకు సమర్పించుకున్నారు.
45 అధ్యాయాలుగా విభజించబడిన ఈ గ్రంథంలో 58 పద్యాలు, 304 శ్లోకాలు విశేషంగా ఒక దండకం ఉదాహరించబడ్డాయి. ఈ యాత్రా విశేషాలను ఒక మణిహారంగా మనకు అందించారు ఓం ప్రకాశ్ గారు.

షోడశోపచార పూజ – రుద్రాభిషేకము

అవధాని -అప్పాల శ్యాంప్రణీత్ శర్మ గారు

పీవీ. మనోహరరావు గారు రచించిన ‘రుద్రాభిషేకము’ గ్రంథం గురించి అత్యంత సులభంగా చదువరులకు అర్థం అగు రీతిలో ఈశ్వరార్చన చేయు విధానాన్ని
విశ్లేషించారు. “అభిషేక ప్రియశ్శివః ” అన్న ఆర్యోక్తిని అనుసరించి అభిషేకప్రియుడు, సులభవశుడు ఆయిన శివుని అనుగ్రహాన్ని పొందడానికి రుద్రాభిషేకాలు చేసే పూజా క్రమణికను రూపొందించారు.
‘రుద్రాభిషేకము’ పుస్తకము 478 పేజీలు ఉన్నప్పటికీ చేతిలో ఇమిడిపోయేంత ఆకారంలో తయారుచేయబడింది. పుస్తకంపై ఆధారపడి అభిషేకాదులు చేసుకునే వారు ప్రయాణాల్లో సైతం వెంట తీసుకొని వెళ్లేందుకు వీలుగా అనువైన కాగితంతో రూపొందించడం దీని ప్రత్యేకత. ఈ పుస్తకం ముఖ చిత్రంపై పైన సగభాగం కైలాసశిఖరం కాగా క్రింది సగ భాగం మనోహరరావు వారి స్వస్థలం వంగర గ్రామం ఉండడం విలక్షణంగా ఉంటుంది. కైలాసానికి వేసిన నిచ్చెన కైలాస శిఖరం అయితే ఆ పరమశివుని పాదారవిందాలకు త్రోవ చూపే గ్రంథంగా దీనిని భావించవచ్చు. తమ గ్రామంలో స్వయంగా నిర్మించి, కైలాస కల్యాణి క్షేత్రంగా నామకరణం జరిపి ప్రతిష్టించిన ఆ వూరి దైవంపట్ల ఆయనకున్న భక్తి ప్రపత్తులను ఈ ముఖచిత్రం చాటుతోంది.
ఉత్సాహవంతులైన పాఠకుల అవగాహన కోసం మనోహరరావు గారు ఇందులో మంత్రాలకు, శ్లోకాలకు భావతాత్పర్యాన్ని రాశారు. దీనికొరకు
సాంప్రదాయ భాష్యాలను ఆధారం చేసుకున్నారు.
” జ్ఞాత్వా కర్మాణి కుర్వీత ” అని గీతలో చెప్పబడింది.
శివుని అభిషేక సమయంలో చేయవలసిన, చేయకూడని విషయాల కనీస జ్ఞానం అవసరం. దానికి ఈ గ్రంథం కల్పవృక్షం వంటిది.
యజ్ఞోపవీత ధారణ ఎంత పవిత్రమో ఇందులో చెప్పబడింది. తొమ్మిది తంతువులతో అనగా దారపు పోగులతో తయారుచేసే దీనిలో ఒక్కో తంతువుకు ఒక్కో దేవత అధిష్ఠాతగా వుంటారు. ఇది కేవలం తంతువుల సముదాయం మాత్రమే కాదని, తొంభై ఆరు విషయాలకు ప్రతీకయని విడమరిచారు.
” సమ్యక్కల్పతే అనేనేతి సంకల్పః ” అని అమరకోశ వ్యాఖ్య. ఏ పని గురించి అయినా మనసులో చక్కగా కల్పించబడేది సంకల్పం. దానికి దైవం తోడయితే అది సఫలీకృతం అవుతుంది. అదే సంకల్పం యొక్క విశిష్టత. ఇంట్లో చేసుకునే పూజ మొదలుకొని యజ్ఞయాగాదుల వరకు ఆరంభంలో చేసే
క్రియ ఇది. తిథి, వార, నక్షత్రాదులు, మనం ఉన్న ప్రదేశం , ఏ రెండు నదుల మధ్య ఆప్రాంతం ఉందో వాటిపేర్లు, కాల వివరణ ఆ తర్వాత చేయబోయే పని ఇవన్నీ సంకల్పంలో చెప్పబడతాయి.
“ఆదౌ పూజ్యో గణాధిపః” ఏ పూజ చేసినా ప్రథమంగా గణపతిని పూజించడం మనకు ఆనవాయితీ. గణపతికి షోడశోపచారాలతో పూజించే విధానాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు. గణనాథుని అభిషేకానికి వీలుగా గణపత్యుపనిషత్తును కూడా దీంట్లో జతచేశారు. ఈ పారాయణ చేసే విధానాలను, వాటి ఫలశ్రుతులను కూడా చక్కగా వివరించారు.
ఇక రుద్రాభిషేకంలో, రుద్రుడు సర్వ మంగళ స్వరూపుడు. అభిషేక ప్రియుడు. ఆ అభిషేకానికి ఉపయోగపడే మంత్రాలే నమక చమకాలు.ఇవి కృష్ణ యజుర్వేదంలో చెప్పబడ్డాయి. దీనికే శతరుద్రమని వ్యవహారం. ‘నమశ్శివాయ’ అన్న శివపంచాక్షరీ మంత్రం దీనినుండి గ్రహించినదే. ఇలా ఏ సేవల ద్వారా స్వామి అనుగ్రహం పొందుతామో విపులంగా తెలుపబడింది.
ప్రకృతిని, జీవరాశులను గౌరవించాలి, ప్రేమించాలి. ఇదే రుద్రాధ్యాయంలోని అర్థం. పరమశివుని అభిషేకం తర్వాత పురుషసూక్త, శ్రీసూక్తాలతో అభిషేకాన్ని ముగించడం అనాదిగా ఆచరణ యోగ్యమైన పద్ధతి. అందుకే ఇవి కూడా ఇందులో చేర్చబడ్డాయి.
వీటన్నింటినీ విశదపరచి చివరగా నామార్చనలు తప్పక చేయాలని మనోహరరావుగారు సూచించారు. ఇంతటి సులువైన మార్గాన్ని మనకు అందించిన వారికి శతధా వందనాలు.శ్యాంప్రణీత్ శర్మగారు ఈరుద్రపూజా క్రమణికను సవిస్తరంగా తెలియచేశారు. ప్రతీ ఇంట్లో ఉండవలసిన పుస్తకమిది. దేవాలయ అర్చకులకు కూడా ఇది మార్గదర్శనం చేస్తుంది.

సర్వ జనోపయోగి ‘సద్విద్య – సత్పథం’

డా. బ్రాహ్మణపల్లి జయరాములు గారు మనోహరరావు గారి రచన ‘సద్విద్య – సత్పథం’ అనే దానిని విస్తారంగా విశ్లేషించారు. ఇది కేవలం విద్యార్థులే కాక అందరూ చదవదగిన పుస్తకం. ప్రస్తుత విద్య,దాని విధానం గురించి మనోహరరావు గారికి పూర్తి అవగాహన ఉందని ఈ పుస్తకం మనకు తెలుపుతుంది. నైతిక, సాంస్కృతిక , ఆధ్యాత్మిక విలువలకు, మానవ సంబంధాలకు ఇది ఉపయోగపడడం లేదని ఆయన ఆవేదన. కేవలం స్వార్థమయమై, ఆర్థిక ఒప్పందాల బంధాలతో, సుఖ భోగాల లాలసతో బానిసగా జీవించడానికే ఇది పనికివస్తుందని వారి భావన. అందుకే ‘సత్ ‘ అంటే శాశ్వతము, సత్యము అయిన జ్ఞానాన్ని సంపాదించాలని, దీని ద్వారా మనిషి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతాడని ఇందులో చెప్పబడింది.
సత్పథం అంటే మంచి మార్గం. లోకంలో మంచి, చెడూ ఉంటాయి. చెడుని విడిచి ధర్మమార్గంలో నడిచినప్పుడే మానవుడు ఉత్తముడవుతాడు. అలా చేయలేనప్పుడు మనిషికి, జంతువుకు తేడా ఉండదు. జాతి గౌరవం దేశ ప్రజల నైతిక ప్రవర్తనపై, పాలకుల నీతి నిజాయితీపై ఆధారపడి ఉంటుందని రావుగారి
నిశ్చితమైన అభిప్రాయం. విద్య వల్ల వినయం, సంస్కారం, క్రమశిక్షణ, తల్లిదండ్రుల, గురువుల పట్ల గౌరవం కలుగుతుందనే భావన లేకపోవడం వల్ల నైతిక విలువలు పతనమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. శీలం విలువను వివరిస్తూ ఈ గ్రంథంలో ప్రహ్లాదుడు శీలం దానం చేసిన కథను వివరించారు.
గురువుల గొప్పతనాన్ని గుర్తుచేశారు. ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ మతాలు పుట్టాయో వాటిని గూర్చి తెలిపారు. మనకు సహజంగా కలిగే ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయి. మాటల కాఠిన్యాన్ని మానుకోవాలని హితబోధ చేశారు. దీనికి భారతంలోని ” తనువున విరిగిన యలుగుల”-మనసులో విరిగే మాటల ముల్లులను తీయడం కష్టం. అనేఅర్థాన్నిచ్చే పద్యాన్ని ఉదాహరించారు. మన సంస్కృతి యొక్క విస్తృతిని అయిదు అంశాలుగా విభజించి, ఎన్నో విషయాల్లో అవగాహన కల్పించారు. “ధర్మ మూలం ఇదం జగత్” అని నొక్కి వక్కాణించారు. లోకంలో చాలామంది అష్టకష్టాలు పడుతున్నామంటుంటారు. కానీ అవేవో తెలియవు. పరదేశయాత్ర, సొంతంగా వండుకోవడం, భార్యలేకుండా ఉండడం,యాచక వృత్తి, సరివారి పంచన ఉండడం,తెలియని ప్రభుసేవ, చదువులేక పెద్దలనెదిరించడం, దారిద్ర్యం….ఇవి అష్టకష్టాలని తెల్పారు.ఇవేకాక ఎన్నో శ్లోకాలు, తాత్పర్యాలతో పొందుపరిచారు.
కేవలం రాయడమే కాక 70 పేజీల ఈ పుస్తకాన్ని కొన్ని పాఠశాలలకు స్వయంగా వెళ్లి, పుస్తకాలని పంచి, దానిపై పరీక్షల నిర్వహణ, నగదు బహుమతులు ఇచ్చే దిశగా ప్రోత్సహించారు. ఫోను ద్వారా నిర్వహించిన పరీక్షల్లో జయరాములు గారిని కూడా భాగస్వాములను చేశారు. ఈ పుస్తకాన్ని చదివిన విద్యార్థుల్లో ఒక్కరైనా ఆచరిస్తే చాలని ఆయన ఆశ. దీనిని చదివిన వారికి మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా జీవించాలో తెలుస్తుంది. భావితరాలవారికి హైందవ సంస్కృతిని అందించాలన్న రావుగారి ఆశను, ఆశయాన్ని మనలను ఆలోచింప జేసే దిశగా, సమగ్రంగా అందించారు జయరాములు గారు.

సర్వార్థ సంక్షేమ సమితి – అనుశీలన

విదుషీమణి శ్రీమతి మంచినీళ్ళ సరస్వతీ రామశర్మ గారు మనోహర రావు గారి ‘సర్వార్థ సంక్షేమ సమితి’ సంస్థ, దానికి సంబంధించిన వివరాలతో ఆయన రాసిన గ్రంథం గురించి అద్భుతమైన విశ్లేషణను అందించారు.”సర్వేజనా సుఖినోభవంతు – సత్కార్యాలకు సహృదయుల సహకారం సదా సంభవం” అనే నినాదంతో పురుషార్థాల సమభావానికి, సనాతన ధర్మ రక్షణ, సర్వజనుల శాంతం, సమైక్యత అనే ఆశయాలతో ఆధ్యాత్మిక ప్రచారం కోసమే మనోహరరావు గారు ‘సర్వార్థ సంక్షేమ సమితి’ సంస్థను 3-6-1992లో స్థాపించారు.
ఒక సంస్థను స్థాపించడం చెప్పుకున్నంత సులభమైన అంశం కాదు. ఆశయం, దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, శాంతం, నిస్వార్ధం, నిరంతర కృషి ఇలాంటి ఎన్నో లక్షణాలు ఉండాలి. ఇవన్నీ తనలోన నిలుపు కున్నటువంటి మనోహరరావు గారు అనేకమైన ఆధ్యాత్మిక, సాహితీ కార్యక్రమాలకు మార్గదర్శకుడై ఈ సంస్థను ముందుకు నడిపించారు. ఎన్నో లక్ష్యాల ఆచరణగా విశ్వకిరణం, విశ్వప్రకాశం అనే మాసపత్రికల ద్వారా 5 సంవత్సరాలు విశేషపురస్కారాలతో సాగింది.
మనోహర రావు గారు ఈ సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు అన్నీఇన్నీకావు. లోకకల్యాణం కోసం వివిధ ప్రాంతాల్లో ఎన్నో యజ్ఞయాగాదులు దాదాపు 100కు పైగా నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆధ్యాత్మిక వేత్తలకు బిరుదులు,స్వర్ణ పతకాలు, సన్మాన పత్రాలు, శాలువలతో గౌరవ సత్కారాలు చేశారు. ఇవి సుమారు 1000 కి పైబడి చేయగలిగారంటే ఇది ఆయనలోని నిస్వార్థత, ధర్మ పరిరక్షణ జిజ్ఞాస అనడం అతిశయోక్తి కాదు. ఇవి కాక
అనేక సాహిత్య, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహించింది. ఉచిత హోమియో, ఉచిత మందులతో దవాఖాన నడపడం, తుఫాను, భూకంప
బాధితులకు సహాయం చేయడం, అన్నదానాలకు, వృద్ధాశ్రమాలకు, వికలాంగులకు, కరోనా బాధితులకు, గోశాలలకు సహాయం చేస్తున్నది.
30 సంవత్సరాలకు పైబడి ఎన్నో ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇప్పటికీ కొనసాగుతున్న “సర్వార్థ సంక్షేమ సమితి” మనోహర రావుగారి ఆకాంక్షలకు దర్పణం. ఆశయాలకు నిలువెత్తు రూపం.
దానిపై వారు రాసిన ఈ గ్రంథంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని తేదీలు, సంవత్సరాల వారీగా రికార్డ్ చేసి పెట్టడం వారి దూరదృష్టికి నిదర్శనం. చేసే పనులన్నింటిలో చిత్తశుద్ధి, శ్రధ్ధ, పట్టుదల, దేనినీ ఆపేక్షించకుండా నిర్వహించడం ఇవన్నీ వారి విశిష్ట లక్షణాలు. ధర్మం కోసం చేసే పని కాబట్టి యథాశక్తి ఈ
సమీక్షను సమర్పిస్తున్నానని వినయంగా చెప్పుకుంటూ ఈ గ్రంథాన్ని విపులీకరించారు శ్రీమతి సరస్వతీ రామకృష్ణ గారు.
‘సమర్పణం’ శ్రీ పి. వి. మనోహరరావుగారి జీవనయానం.

సాహితీ చక్రవర్తి, పద్య శిరోమణి తూపురాణి వేంకట కృష్ణమాచార్యులు గారు, మనోహర రావు గారు తమ జీవిత విశేషాలతో రాసుకున్న ‘సమర్పణం’ అనే గ్రంథాన్ని’సాహితీ మనోహరం’ పుస్తకంలో అసామాన్యంగా విపులీకరించారు. శ్రీమాన్ పాములపర్తి వేంకట మనోహర రావు గారు మన భారత ప్రధానులలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న బహుభాషా పండితులు, గొప్ప రాజనీతిజ్ఞులు అయిన పీవీ నర్సింహారావు గారి సోదరులు. రుక్మాబాయమ్మ, సీతారామరావు పుణ్య దంపతుల ప్రియపుత్రులు. వీరి సతీమణి శ్రీమతి సరస్వతి గారు వీరికి అత్యంత అనుకూలంగా మసలుకునే గుణవతి.
రావు గారు సర్పంచ్ గా తమ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరచారు. ఆదర్శ వ్యవసాయదారుడే కాక వివిధ పదవులను అలంకరించి నిబద్ధతతో వాటిని నిర్వహించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆధ్యాత్మిక చింతనులై ఎన్నెన్నో యాత్రలు చేసి, పుష్కర నదీస్నానాలు, దానధర్మాలు చేసి, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించి, తమ స్వగ్రామమైన వంగర గ్రామంలో ఉన్న శిథిలావస్థలో నున్న ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి, కైలాస వాసునిపై భక్తితో శ్రీ కైలాస కల్యాణీ క్షేత్రంగా నామకరణం చేసి ధన్యులైనారు. విదేశీ యానాలు చేసి ఎంతో జ్ఞానాన్ని, అనేక విషయాల పట్ల అవగాహన, మరెన్నో అనుభవాలను ప్రోది చేసుకున్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఇప్పటివరకు కూడా అప్రతిహతంగా విజయాలు సాధిస్తూ, అహర్నిశలు తమ జీవితాన్ని పరోపకారానికై వినియోగిస్తూ, సంపదను, సంపాదనను మొత్తం సత్కార్యాలకు వెచ్చిస్తున్నారు.
ఒక వ్యక్తిగా ఏదేని ఒక రంగంలో కృషి,సేవ చేయడం గొప్ప విషయం కాదు. కానీ ఎన్నోరంగాలు, పదవులు, సంఘసేవ, ధార్మిక సేవ చేయడం అత్యంత కఠినమైనది. “లెక్కకు రానీయడు కార్య సాధకుడు దుఃఖంబున్, సుఖంబున్ మదిన్” అన్నట్లు దేనిని సంకల్పించినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తలవంచకుండా, వెనుకంజ వేయకుండా, సమర్థవంతంగా సాధించిన ధీశాలి, మనందరికీ ఆదర్శప్రాయుడు, మార్గదర్శి మనోహర రావుగారు. వారి జీవిత విశేషాలను తెలుసుకోవడం మన అదృష్టం.
ఈ ‘సాహితీ మనోహరం’ పుస్తకంలో పై విశ్లేషణలతో పాటు ప్రముఖుల ఆత్మీయ స్పందనలు, మనోహరరావు గారి ‘నా అభిమతం’ వ్యాసాలు చేర్చబడ్డాయి. ఇన్ని చేసి చివరగా ” శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కాబట్టి ఈ కార్యాలన్నీ ప్రతీచోట ఆ పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలతో చేస్తున్నానని”
వినయంగా చెప్పుకోవడం ఆయన ఉత్తమవ్యక్తిత్వానికి, సహృదయతకు నిదర్శనం. వారి రచనలు చదివి, వాటిని ఆచరించిన ప్రతీ వ్యక్తి ఉత్తమ జీవితాన్ని పొందుతాడు అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

You may also like

Leave a Comment