.ఐదు దశాబ్దాల సాహితీ శిఖరం … కవి న్యాయవాది నమిలికొండ బాలకిషన్ రావు (జననం 6-9-50చివరి శ్వాస 30-3-2023) మధ్యాహ్నం హనుమకొండ రోహిణి హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికి పరిమితమయ్యారు
హనుమకొండలో నమలికొండ సాహితీపరుల కొండంత అండదండగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం.చైతన్య సాహితి ,సాంస్కృతిక సమాఖ్య,సాహితీ సమితి, పోతన విజ్ఞాన పీఠం,కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులుగా,రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం క్రియాశీల సభ్యుడిగా విశేష సేవలు అందించారు.ప్రసారిక మాసపత్రిక ద్వారా నూతనతరానికి వేదిక కల్పించాడు.
06 సెప్టెంబరు కరీంనగర్ జిల్లా పూడూరులో నమలికొండ నారాయణరావు రత్నబాయి దంపతులకు జన్మించారు,
ఎం. ఏ, ఎల్ .ఎల్. బి, పట్టభద్రుడైన బాలకిషన్ హనుమకొండ లో న్యాయవాద వృత్తి చేపట్టారు, వర్ధమాన రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1982లో ప్రసారిక అనే మాసపత్రికను స్థాపించారు,
నమలికొండ బాలకిషన్ ప్రసారిక పత్రికతో పాటు తన స్వీయ రచనలైన యువస్వరం (1981) అక్షర చిత్రాలు (1986) శాంతి సమత (1989) అక్షరాల్లో అనంతం (1990) అక్షర ప్రతిబింబం (2006) ప్రసారకీయ కుసుమాలు(2010), మొదలైనవి వెలువరించారు,
షష్టిపూర్తి సందర్భంగా
శ్రీరంగస్వామి సంపాదకత్వంలో “బాల గోకులం అక్షర వసంతం” అనే ప్రత్యేక సంచిక వెలువడింది… మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్బం లో సుక్కపొడుపు సంకలనం సాహితిసమితి ద్వారా ప్రకటించారు.
బహుశా మలిదశ ఉద్యమానికి ఇదే తొలి సంకలనం అనుకుంటాను.
సాహితీ సమితి వేదిక ద్వారా నమలికొండ అధ్యక్షులుగా నేను (పొట్లపల్లిశ్రీనివాసరావు) కార్యదర్శిగా మరికొందరం కలిసిఅనేక సభలు సమావేశాలు కవి సమ్మేళనాలు నిర్వహించి పుస్తక ప్రచురణలు కావించాము.రాష్ర్ట వ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాహితీ ప్రయాణం చేసాము.
ప్రముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన ఇక్కడి కవులకు చాలామందికి సాహితీ సమితి ఒక వేదికగా నిలిచింది.ఇందుకు బాలకిషన్ రావు గారి కృషి, ప్రోత్సాహము ,ప్రేరణ,వితరణ మాటలతో చెప్పలేనిది.
దేవులపల్లి రామానుజ రావు,చేతన వార్త కవులు,కాళోజి సోదరులతో,ప్రత్యక్ష పరిచయం ,విడదీయరాని అనుబంధం నమలికొండ గారిది.సాహితీ సభలకు నభారా ఒక ఎస్సెట్ గా ఉండేవాడు.వివాదరహితుడు సాహితీపోషకుడు నమిలికొండ ఇక లేరు అన్న వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.నమిలికొండ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ…ఇలాంటి విపత్కర పరిస్థితి నుండి త్వరగా వారంతా కోలుకోవాలనికోరుకుంటూ…నభారాకు నివాళి.