సినిమా పాటకు కమర్షియల్ హంగులు
ఉంటేనే రచయితకు మనుగడ..
పది కాలాల పాటు పాటకు ఆదరణ..
కమర్షియాలిటీ మిస్సవ్వకుండా
చక్కని సందేశంతో..
జనం నాలుకలపై నిలిచిన పాట..
జన హారతి పట్టిన పాట…
“జనతా గ్యారేజ్” సినిమా కోసం
” రామజోగయ్య శాస్త్రి” రాసి..
ప్రకృతికి అక్షరాభిషేకం చేసిన
ప్రణామం ప్రణామం ప్రణామం …పాట
తోం.. ధిరననన ధిర ధిర న…
తోం.. ధిరననన ధిర ధిర న…
ప్రణామం ప్రణామం ప్రణామం…
ప్రభాత సూర్యుడికి ప్రణామం…
ప్రణామం ప్రణామం ప్రణామం…
సమస్త ప్రకృతికి ప్రణామం…
ప్రమోదం ప్రమోదం ప్రమోదం…
ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం…
ప్రయాణం ప్రయాణం ప్రయాణం…
విశ్వంతో మమేకం ప్రయాణం..
మనిషి పంచ ప్రాణాలు
పంచ భూతాలతో ముడిపడి ఉన్నాయి
ఆ పంచ భూతాలకు రుణపడి ఉన్నాయి..
అందుకే
పంచభూతాలలో ఒకటైన
సూర్యుడి(నిప్పు)కి ప్రణామాలు అర్పిస్తూ
పల్లవిని ప్రారంభించారు రామజోగయ్య శాస్త్రి..
మనలో కొలువై ఉన్న సమస్త ప్రకృతికి ప్రణామాలు అర్పిస్తున్నారు..
ప్రకృతి ఎంతో సుందరం
దాన్ని సృష్టి మరెంతో ప్రమోదం
సౌందర్యాత్మక హృదయం ఉండీ
కళాత్మక దృష్టితో చూస్తే..
అందంగా పేర్చినట్టు
కుంచె నుంచి జాలువారినట్టు
కన్నుల ముందు కొలువుదీరిన
ప్రకృతిలోని ప్రతి దృశ్యం ఒక చిత్రమే..!
మనిషి పుట్టుక.. చర్య , ప్రతిచర్య
ఇలా కాలచక్రంలో.. జీవన గమనంలో
మనిషి సాగించే ప్రయాణం
ఊపిరి ఉన్నంత వరకూ
విశ్వంతో మమేకమైనదే..
చిన్న చిరునవ్వే.. వికసిత పద్మాలు
ఇక ఏ పద్మశ్రీలు.. పద్మ విభూషణ్ లు అవసరంలేదు.
అందుకే కవి అంటున్నారు
మన చిరునవ్వులే పూలు…
నిట్టూర్పులు తడి మేఘాలు…
హృదయమే గగనం రుధిరమె సంద్రం ఆశే పచ్చదనం…
బాగున్నారా..? అని అంటే..
ఏం బాగో.. ఏమోలెండి.
ఇలా ఉన్నాం అంటారు కొందరు..
ఆ నిట్టూర్పులే తడి మేఘాలు
ప్రతి నిత్యం చూసే సూర్యోదయం
ఏరోజుకారోజు ఎంతో అందంగా ఉంటుంది..
అందుకే కష్ట నష్టాలు ఎన్ని ఉన్నా
ఆశావాద దృక్పథం ఉండాలి..
అప్పుడే
మన జీవితం చిగురులు తొడుగుతుంది
సరికొత్తగా ఉంటుంది.
అందుకే
ఆశే పచ్చదనం.. అంటున్నారు కవి.
మనిషిని ప్రకృతిని కలిపి చూస్తే
ప్రకృతి మొత్తం మనలో ప్రతి బింబమే
దుఃఖం.. సంతోషం.. కోపం.. ప్రేమ..
ఇలా మనసులోని ప్రతి భావోద్వేగం
ప్రకృతిలో రిప్లెక్ట్ అవుతున్నదే..
ప్రతి ఋతువు మనకు ఒక బతుకు పాఠం చెబుతోంది..
ఆకులు రాలితేనే కదా
మరో ఆకు ఉద్భవించేది..
శిశిరం ఉంటేనే వసంతం వస్తుంది
వసంతం వస్తేనే ప్రకృతి కొత్త శోభను
సంతరించుకుంటుంది..
మారే ఋతువుల వర్ణం…
మన మనసుల భావోద్వేగం…
సరిగా చుస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతి బింబం
నువ్వెంత నేనెంత రవ్వంత…
ఎన్నో ఏళ్ళదీ సృష్టి చరిత…
అనుభవమే దాచింది కొండంత…
తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా…
తరాలు మారుతున్నాయి..
నీది నాది అనే అంతరాలు పెరుగుతున్నాయి .
అసలు ఈ సృష్టి ముందు మనమెంత
నిన్న వచ్చాము.. రేపు వెళ్తాము..
కొండంత అనుభవాన్ని దాచిన
సృష్టి నుండి నేర్చుకుందాం
అనుసరణీయమైన ఆ అడుగుల్లో అడుగేసి
ఈ జన్మంతా వెళదాం..
ప్రకృతిని పాటకు వస్తువుగా తీసుకుని
ఆ ప్రకృతి ఆంతర్యాన్ని విడమరుస్తూ..
ఆ ప్రకృతిని విస్మరించ వద్దని వివరిస్తూ..
ప్రభోదిస్తూ.. కలాన్ని ఉరకలెత్తించిన వైనం
రామజోగయ్య శాస్త్రీ పదును తెలియజేస్తుంది.
ప్రకృతికి భావోద్వేగాలను అన్వయించి సాగిన మొదటి చరణం
ఒక్కో అక్షరం.. ఒక్కోఆణిముత్యం…
ఇక
మానసిక దొంతరలోని మనిషి డొల్లతనాన్ని
ఎండగట్టి.. హెచ్చరిస్తున్న రెండవ చరణాన్ని
పరిశీలిద్దాం..!
మన చుట్టూ ఉంటూ
మనతో దోబూచులాడుతూ
చల్లని గాలిని హాయిని ఇచ్చే
చెట్లంటే మనకు చిన్న చూపు
ఎవడికి సొంతమిదంతా…
ఇది ఎవ్వడు నాటిన పంట…
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా…
తరములనాటి కధంతా…
మన తదుపరి మిగలాలంటా…
కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా..
తరతరాలుగా నాటిన చెట్లను
రేపటి తరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత
మనదే..
కానీ..
స్వార్థపూరిత ఆలోచనల కోసం
అమ్ముకుంటున్నాడు..అంతమొందిస్తున్నాడు..
అందుకే
ప్రాణ వాయువును ఇచ్చి
ప్రాణ ప్రతిష్ట చేసే చెట్లను రక్షించుకుందాం
అంటూ ఉద్భోద చేస్తున్నాడు.
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం…
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం…
కన్నెర్రయితే నీరై ఓ కొంచెం…
తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం…
ప్రకృతి వినాశనానికి పాదువేసే
పాడు ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలి.
ఈనేల తల్లి.. తల్లిడిల్లితే మహోగ్రరూపం దాల్చుతుంది..
ప్రకృతి ప్రకోపానికి విశ్వమంతా విస్ఫోటనం చెందుతుంది.
ప్రకృతిని ప్రేమిద్దాం..
ప్రకృతి పరిరక్షణకు పాటుపడుదాం..
అంటూ..
ఇష్టంగా గుండెకు హత్తుకునే పాటను విశ్వమానవాళికి అందించి..
ప్రబోధ గీతంగా పదికాలాల పాటు నిలిచే
అద్భుతమైన సాహిత్యాన్ని
శ్రోతల మస్తిష్కాలలో నాటి..
అజరామరం రామజోగయ్య శాస్త్రీ
అనిపించుకున్నారు.
అగ్ర కథానాయకుడి బరువైన సన్నివేశాన్ని
అంతే బాధ్యతగా పరిచయ గీతంగా మలిచి
సృజనాత్మకతను.. సామాజిక స్పృహను
మేళవించి అందించిన ఈ “ప్రణామం..ప్రణామం.. ప్రణామం..”
సినీ పాటల పూదోటకు ఒక గౌరవాన్ని అద్దింది.
(జూన్ 5.. పర్యావరణ దినోత్సవం సందర్బంగా)