చివరి భాగం
‘‘మనం ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలి. వీరేంద్రుని కుట్రని బహిర్గతం చేయాలి’’ నవవధువు మంజరి దేశక్షేమం కోసం ఆరాటపడుతున్నది.
‘‘మనమేం చేయగలం మంజూ! అంతటి తిమ్మరుసులవారే నేరాన్ని నెత్తిన వేసుకుని తలవంచుకుంటే’’ చంద్రప్ప ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని మనసులోని భారం మంజరికే తెలుసు.
‘‘వారు నేరాన్ని అంగీకరించి కాదు తలదించుకుంది. తనపట్ల రాయలవారి నమ్మకం సడలటం చూసిన వేదనతోనే!’’ మంజరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
వాళ్ళిద్దరూ ప్రజల్లో చైతన్యం కలిగించి ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. నగర ప్రజలంతా మంజరినే సమర్థించారు.
‘‘ఇది అన్యాయం. తిమ్మరుసులవారికీ శిక్ష విధించటాన్ని మేం సహించం’’ ఒక పౌరుడన్నాడు.
‘‘మహామంత్రే లేకపోతే రాయలకి విలువేముంటుంది? ఈ దురన్యాయాన్ని ఆపాలి. పదండి అందరం వెళ్ళి ప్రభువుతో మొరపెట్టుకుందాం’’ మరొకడన్నాడు.
‘‘ఆయన మన మొర ఆలకిస్తారా! అలా అయితే ఇంతదూరం వస్తుందా?’’ మొదటివ్యక్తి అన్నాడు.
‘‘ఇందులో ఏదో కుట్ర ఉంది. వేరెవరో ఈ నేరం చేసి తిమ్మరుసుల వారిని బలిపశువును చేశారు. ప్రభువు తొందరపడి పుత్రశోకంతో అమాత్యులను శిక్షిస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఆపాలి. ఆ కుట్రని ఛేదించాలి. దీనికి మనమంతా పోరాడాలి’’ చంద్రప్ప ఆవేశంగా అన్నాడు.
‘‘అవును. మీరు చెప్పేదే సరిjైున మాట. పదండి. రాజ భవనానికి వెళదాం. శ్రీకృష్ణదేవరాయల వంటి న్యాయపాలకుడు తప్పక మరోసారి ఆలోచిస్తాడు.’’
‘‘అవును పదండి’’ అంతా సమూహంగా బయలుదేరి రాజమందిరం చేరారు.
‘‘ప్రభూ! మాకు న్యాయం చేయండి’’ గగ్గోలు పెట్టారు.
మంజరి, చంద్రప్ప ప్రజలకి నాయకత్వం వహించడం చూసి రామలింగ నాయకుడు ఖిన్నుడయ్యాడు.
విజయనగర సామ్రాజ్యంలో కనీవినీ ఎరుగని సంక్షోభం మొదలయింది. తిమ్మరుసు మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఇలా తిరగబడటం ఊహకందని విషయం. ఎంతలో ఎంత మార్పు!
‘‘ఏమిటా గోల’’ ప్రభువు చిరాగ్గా రామలింగ నాయకుడ్ని ప్రశ్నించాడు.
‘‘ప్రజల తిరుగుబాటు ప్రభూ! తిమ్మరుసు మంత్రిని శిక్షించటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. తిమ్మరుసులవారీ హత్య చేశారంటే ప్రజలెవ్వరూ విశ్వసించటం లేదు ప్రభూ! అందుకే అంతా తిరుగుబాటు చేస్తున్నారు.’’
‘‘హూ….’’ హూంకరించాడు రాయలు కోపంగా. అది తన నిర్ణయాన్ని తప్పుపట్టినందుకు ఎగసిన ఆగ్రహావేశం.
‘‘ఉద్యమాన్ని అణచేయండి రామలింగనాయకా! న్యాయాన్యాయ విచక్షణ ప్రభువునైన మాకు తెలుసుననీ, సాక్ష్యాధారాలతోనే ఈ శిక్షను నిర్ణయించటం జరిగిందనీ మా ప్రజలకు తెలియజెప్పండి’’ రాయలు సంక్షుభిత హృదయంతో పెడమోమయ్యారు.
‘‘మరోమాట. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నవారిని నిర్ధాక్షిణ్యంగా బందీలు చేసి కారాగారంలో వేయండి’’ ఆజ్ఞాపించారు రాయలు.
‘‘చిత్తం ప్రభూ!’’ రామలింగనాయకుడు కర్తవ్య నిర్వహణకు బయలుదేరాడు. రాయల కన్నుల్లో అశ్రువుల్ని చూసే అవకాశం అతనికి లేదు. జాతకయోగమో మరేమో గానీ చంద్రప్ప, మంజరిలకు పెళ్ళి అయిన కొద్దిరోజులకే కారాగారయోగం పట్టింది.
ప్రజలు నిజంగా అదృష్టవంతులు! తాము నమ్మినదానిని ధైర్యంగా చెప్పగల శక్తిమంతులు. కాని రాజుకా అదృష్టం లేదు. న్యాయానికి, సాక్ష్యానికి కట్టుబడి పూజ్యులైన అప్పాజీకి ఇంతటి ఘోరశిక్షను విధించాల్సి వచ్చింది. తాను తప్పు చేస్తున్నాడా! రాచరిక బాధ్యతలు ఇంత నిష్ఠూరంగా ఉంటాయా? ఇంతకాలం అప్పాజీయే ఎటువంటి జటిల సమస్యనైనా పరిష్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనే సమస్యకు బలి అవుతున్నారు. రాయల హృదయం కల్లోల సముద్రంలా ఉంది.
చిన్నారి తిరుమలరాయల ముద్దుమోము గుర్తొచ్చినకొద్దీ రాయల పరితాపం పెరుగుతోంది. యువరాజు మృతికి కారణమైనవారెవరైనా, ఎంతటివారైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే! పట్టుదల పెరిగి మమకారం మరుగునపడిరది.
బయట కోలాహలం విన్పిస్తున్నది. ప్రజలేం చేయగలరు? బలప్రయోగానికి వారెప్పుడూ బానిసలే! తామెంతో ప్రేమించిన పాలకుని గురించి స్వరమెత్తి మాట్లాడగలరే గానీ నిరాయుధులు గదా! అన్యాయాన్ని ఎలుగెత్తి ఖండిరచగలరే గానీ నిరాయుధులు గదా! అనాదిగా ధర్మాన్ని అణచేసినట్లే ఈ రోజూ జరుగుతున్నది. చంద్రప్ప మంజరిలను కారాగృహంలో బంధించారు భటులు.
* * *
తెల్లవారితే విజయనగర సామ్రాజ్యానికే చూపునిచ్చిన తిమ్మరుసు మహామంత్రి అంధుడైపోతాడు. సామ్రాజ్యమే అంధకారంలో మునిగిపోతుంది. రామలింగ నాయకునికి నిద్రపట్టటం లేదు. అటు శ్రీకృష్ణదేవరాయలకు కూడా కంటిమీద కునుకు లేదు. దేవేరుల వేడికోలు కూడా రాయలు వినదలుచుకోలేదు. ఎవ్వరినీ కలవటం లేదు. ఒంటరిగా ఏకాంత వేదనా మందిరంలో కుమిలిపోతున్నాడు. తెలతెలవారుతోంది.
రామలింగనాయకునికి దూరంగా వసంత మండపంలో ఎవరో నక్కి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. రామలింగ నాయకుడు అనుయాయులతో పొదమాటున దాగి పరికిస్తూ వింటున్నాడు.
వీరేంద్రుడు రాజవైద్యులతో మంతనాలాడుతున్నాడు.
‘‘బాగా అభినయించారు. మీరు చేసిన ఉపకారానికి ప్రతిఫలం ఇది’’ అంటూ రెండు ధనపు మూటలను చెరొకటి ఇచ్చాడు వీరేంద్రుడు.
‘‘ఉపకారం అంటే అంతా ఇంతానా! విజయనగర సామ్రాజ్య లక్ష్మినే మీ చేతుల్లో పెట్టాం. అయినా యీ…’’ నసిగాడు ఓ వైద్యుడు.
వాళ్ళమాట పూర్తి కాకుండానే వీరేంద్రుడు మరి రెండు బరువైన డబ్బు సంచుల్ని వాళ్ళ చేతుల్లో ఉంచాడు. వాళ్ళ మొహాలు వికసించాయి.
‘‘వీరేంద్రులవారిది బహు పెద్ద మనసు. మేమిక వెళ్ళివస్తాం’’ రాజవైద్యులు బయలుదేరారు.
రామలింగనాయకుడు ఇంక ఒక్క క్షణమాలస్యం చేయలేదు. తన భటులతో వాళ్ళమీద పడి ముగ్గుర్ని బందీలు చేశాడు. అనుకోని ఈ సంఘటనకు వీరేంద్రుడు స్థాణువయ్యాడు.
‘‘ఏమిటీ దౌర్జన్యం?’’ అహంకరించాడు.
‘‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రేపు సభలో చెప్పుకో’’ వీరేంద్రుని రాజవైద్యులతో సహా కారాగారబద్ధుల్ని చేశాడు రామలింగనాయకుడు.
* * *
‘‘ఏమిటిది గోవిందా! ఈ తిమ్మరుసు బతికిఉండగానే విజయనగర ప్రజలు క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారా? రాజ్యమంతా విప్లవిస్తోందా? ఇది నాకు ఆనందాన్ని కల్గిస్తుందనుకుంటున్నావా?’’ తండ్రిని కలవటానికి వచ్చిన గోవిందరాయలతో తిమ్మరుసు ఆవేదనను పంచుకొన్నారు.
‘‘వద్దు గోవిందా! నా మాటగా ప్రజలకు చెప్పు. రాయలకు అండదండగా నీవు నిలునాయనా! తిరుగుబాటును అణచివేయవల్సిందిగా సేనాధిపతులకు చెప్పు. తక్షణం చర్యలు చేపట్టండి. నేను ప్రాణాలతో ఉండాలంటే నా రాయలకు మీరంతా జీవితకాలం విశ్వాసపాత్రులుగా మసలాలి’’ మళ్ళీ వేదనగా అన్నాడు.
‘‘తండ్రీ! ఇదెక్కడి న్యాయం? చేయనితప్పుకు శిక్షననుభవిస్తూ ఇంకా ఆ రాయలపై ప్రేమ కురిపిస్తున్నారు’’ గోవిందరాయలు వాపోయాడు.
శిక్షాదినం ఉదయించింది. తిమ్మరుసును శిక్షించడానికి అంతా సిద్ధమైంది.
ప్రజలంతా కారాగారంలోకి చొచ్చుకువచ్చారు. ఎవరాపినా ఆగటం లేదు. వారందరినీ ఉద్దేశించి తిమ్మరుసు వేడికోలు వాక్యాలు పలికారు.
‘‘మహాజనులారా! మీరు విజయనగర ప్రజలు. ఇలా ఇతరులలా ప్రవర్తించటం తగదు. నా మాటమీద గౌరవముంటే తక్షణం అంతా వెళ్ళిపోండి. నామీద ప్రేమాభిమానాలుంటే మన ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు వారిని ఇంతకుముందు వలెనే సేవించండి’’
తిమ్మరుసు ప్రార్థన విని ప్రజలంతా ఆ మహనీయుని అపూర్వ రాజభక్తికి కరిగినీరై చేతులెత్తి నమస్కరించి కన్నీటితో వెళ్ళిపోయారు.
‘‘అప్పాజీ! నన్ను క్షమించండి అప్పాజీ’’ కారాగారంలో కాపలాదారునిగా మారువేషంలో నిలబడిన కృష్ణరాయలు అప్పాజీ కాళ్ళపై బడ్డారు.
‘‘ఎవరు? రాయా! మీరా! ఏమిటీ పని? విజయనగర ప్రభువులకిది తగని పని’’ వారించారు తిమ్మరుసు.
‘‘అప్పాజీ! మీరీ హత్య చేయలేదని నా మనసు చెప్తోంది. అసలు దోషులెవరో మీకూ తెల్సు. వారి పేర్లు బయటపెట్టండి అప్పాజీ. నాకు మనశ్శాంతి ప్రసాదిం చండి’‘ తిమ్మరుసు పాదాలవద్ద మోకాళ్ళపై కూలబడి రాయలు ఆక్రోశించారు.
‘‘ఏమిటీ బేలతనం రాయా! కర్తవ్య పాలనలో స్వపర భేదాలుండవు. మీ ధర్మపాలనకు నేను చాలా గర్వపడుతున్నాను. ధర్మపరిషత్తు తీర్పుకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రభువైన మీరు ఇలా ప్రవర్తిస్తే లోకం హర్షిస్తుందా! మీరు విధించిన శిక్షను నేను అమలుచేసుకుంటున్నాను’’ అంటూ ఎర్రగా కాల్చి శిక్ష అమలుకు సిద్ధంగా ఉన్న ఇనుపకడ్డీలతో తన కళ్ళను తానే పొడుచుకున్నాడు తిమ్మరుసు.
‘‘అప్పాజీ! ఎంత పనిచేశారు! జీవితాంతం నాకు శిక్ష వేశారు. నేనెంత పాపిష్టివాడిని’’ రాయలు రోదిస్తుండగా రామలింగనాయకుడు ప్రవేశించాడు.
‘‘ప్రభూ! యువరాజువారిని విషప్రయోగంతో హత్య చేయటానికి రాజ వైద్యులను ధనంతో ప్రలోభపెట్టి అకృత్యం చేసిన వీరేంద్రునీ, రాజవైద్యులనూ బంధించాను. వారు నేరాన్ని అంగీకరించారు ప్రభూ!’’
‘‘అయ్యో! ఒక్క ఘడియముందీ విషయం ఎందుకు తెలియలేదు? భగవంతుడా! ఎంతటి అరిష్టం జరిగిపోయింది! అప్పాజీ! మీరెంతటి దయాహృదయులు! ఇంత జరిగినా ఇంకా ఈ దురదృష్టవంతుడిపై దయచూపిస్తున్నారా!’’ రాయల వేదనకు అంతులేదు.
‘‘ప్రభూ! జాతస్య ధ్రువోమృత్యుః ఈ విజయనగర సామ్రాజ్యలక్ష్మిని పరిరక్షించే బాధ్యత పూర్తిగా ఇక మీదే!’’ కళ్ళు అగ్నిగోళాలుగా మండుతున్నా వినయంగా చెప్పారు తిమ్మరుసు.
‘‘అప్పాజీ! ‘రాయా’ అనే మీ పిలుపుకు దూరమైన నా జీవితం, ఈ సామ్రాజ్యమెందుకు?’’ రాయల శోకం అందరినీ కంటతడి పెట్టిస్తున్నది.
‘‘రామలింగనాయకా! ఇంతటి ఘోరకలికి బాధ్యులైన ఆ ముగ్గుర్నీ న్యాయపరిషత్తు ముందు నిరూపించి వారికి మరణశిక్ష అమలుచేయండి. అప్పాజీ! మీరు నాకెప్పుడూ పూజ్యులే! నా వెంట మీరు లేకపోతే నేను ప్రాణంలేని శిలనే! రండి అప్పాజీ! నన్ను క్షమించగలరా అప్పాజీ’’ రాయలు అప్పాజీ కాళ్ళు పట్టుకొన్నారు. అప్పాజీని స్వహస్తాలతో నడిపించుకుంటూ కారాగారం లోంచి బయటికి తీసుకువస్తున్న కృష్ణరాయలు పశ్చాత్తాపంతో కుమిలి పోతున్నారు. అక్కడున్నవారందరికీ రాయల్ని చూస్తుంటే సానుభూతితో పాటు గౌరవమూ పెరిగింది.
‘‘జై శ్రీకృష్ణదేవరాయలకూ! జై మహామంత్రి తిమ్మరుసులవారికీ!’’ జయజయధ్వానాలు మిన్నుముట్టాయి.
* * *
తిమ్మరుసు మహామంత్రి ఇప్పుడు మునుపటిలా రాచకార్యాల్లో ఎక్కువగా నిమగ్నం కావటం లేదు. కారాగారం నుంచి విముక్తులైన మంజరీ, చంద్రప్పలు కళాకారులుగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విఠలదేవాలయ పరిసరాల్లో ఆ ప్రశాంత వాతావరణంలో ఇరువురు తలపులు కలబోసుకుంటున్నారు.
‘‘చంద్రా! మన కారాగారవాసం మంచికే జరిగింది. విరహంలో ప్రేమ మరింత పెరుగుతుంది కదూ’’ నిండు మనసుతో అంది.
‘‘నాకైతే దినమొక యుగంగా గడిచింది. రాజ్యంకోసం కాకపోతే బతికి ప్రయోజనమేముంది? నువ్వు కూడా నాకు ఎంతో సహకారమందించావు సుమా!’’ ప్రశంసించాడు.
‘‘చంద్రా! ఈ చల్లని వెన్నెలరేయి నా మనసుకి శాంతినిచ్చేలా ఓ పాట పాడవూ…’’ అతని కన్నుల్లోకి చూస్తూ గోముగా అడిగింది.
‘‘దేవిగారి కోరిక కాదనగలనా’’ చంద్రప్ప మధురస్వరంతో గానం చేశాడు.
వెన్నెలా వెండివెన్నెలా
చల్లచల్లని వెన్నెలా
జల్లుజల్లుల వెన్నెలా
పాలనురుగుల వెన్నెలా
పండుపున్నమి వెన్నెలా
మెల్లమెల్లగ మలయానిలము
మోసుకొచ్చే వెన్నెల
నీలిమబ్బుల దారిలోన
నాట్యమాడే వెన్నెల ॥వెన్నెల॥
పూల వెన్నెల తావులందు
ఊగితూగే వెన్నెల
మనసుమనసున పరవశాన
మత్తు గొలిపే వెన్నెల ॥ వెన్నెల॥
‘‘ఎంత బాగా పాడావు! నీ గొంతులోనే వెన్నెల జాలువారుతోంది సుమా!’’
మంజరి మాటలకి చంద్రప్ప ప్రేమగా ఆమె ఒడిలోకి చేరాడు.
‘‘మంజూ! మనకింక ఎడబాటు ఉండదు. మధురమైన జీవితంలో కష్టసుఖాలు కలిసి అనుభవించటం మధురంగానే ఉంటుంది సుమా!’’
‘‘చంద్రా! నీ కోసం నేను, నా కోసం నువ్వు’’
‘‘అంతేకాదు మంజూ! నా గానం నీకోసం, నీ నాట్యం…’’
‘‘నీకోసం…’’ గలగలా నవ్వింది మంజరి. ప్రవహిస్తున్న సెలయేరు ఒకసారి ఆగి ఆమె నవ్వుల్ని విని పరవశించి మళ్ళీ ముందుకు సాగిపోయింది.
* * *
అన్నపూర్ణాదేవి చిక్కి శల్యగతమై కనిపిస్తున్నది.
తిరుమలదేవి కూడా అదే మందిరంలో అస్వస్థుడుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలకు సపర్యలు స్వయంగా చేస్తున్నది.
‘‘ప్రభూ! ఈ ఔషధం సేవించండి’’ తిరుమలదేవి ఔషధపాత్ర అందించింది.
‘‘దేవీ! ఔషధ సేవనంతో నా వ్యాధి తీరేది కాదు. మనోవ్యాధిని ఏ రాజవైద్యులు తీర్చగలరు’’ కృష్ణరాయలులో మునుపటి ఠీవికి బదులు నైరాశ్యం కన్పిస్తున్నది.
అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చి రాయలవారి చేయి పట్టుకుంది.
‘‘ప్రభూ! నావల్లనే మీకీ స్థితి కలిగింది. ఆనాడు నన్ను వివాహమాడకుంటే ఇలా….’’ కన్నీరు మున్నీరయింది.
‘‘అలా అనకు దేవీ! ఇది పూర్వజన్మ ప్రారబ్దం! లేకుంటే ముద్దులు మూటగట్టే చిన్నారి రాకుమారుడు మేము అతి సురక్షితమని నమ్మిన అంతఃపురంలోనే విషప్రయోగంతో మరణించటమేమిటి? జీవితాంతం మేము తండ్రిలా గౌరవించిన అప్పాజీకి మేమే కళ్ళు పొడిపించటమేమిటి? హా విరూపాక్షా! నేటితో కృష్ణరాయల ప్రభ అంతరిస్తున్నది గాబోలు’’ దుఃఖించారు రాయలు.
‘‘ప్రభూ! చింతించకండి. అన్నిటికీ ఆ వేంకటేశుడే ఉన్నాడు. మీరు త్వరగా కోలుకుని ప్రజల బాగోగులు చూడాలి. మీకోసం అన్ని ఆలయాల్లో వ్యాసరాయల వారు పూజాదికాలు జరిపిస్తున్నారు’’ తిరుమలదేవి ప్రభువుకు ఉత్తేజాన్నిచ్చే ప్రయత్నం చేసింది.
‘‘అప్పాజీవారు కూడా మీ ఆరోగ్యపరిస్థితి గురించి కబురుచేశారు ప్రభూ’’ అన్నపూర్ణాదేవి ఊరటగా చెప్పింది. అప్పాజీ పేరు వింటూనే రాయల ఆవేదన మరింత పెరిగింది.
‘‘అయ్యో అప్పాజీ! ఇంకా ఈ విశ్వాసఘాతకునిపై కనికరం చూపిస్తున్నారా!’’
ఆంధ్రసమ్రాట్టు నన్నయ్యా యనిననాడు
నీ రూపు లోన వర్ణించుకొంటి
ఆంధ్రక్షమారిపు లవఘళించిన నాడు
నీ శంఖరవము ధ్వనించుచుంటి
ఆంధ్రసత్కవిబృంద మగ్గించి పొగడిన
నీ పొగడ్తల రీతి నేర్చుకొంటి
ఆంధ్రమహాజను లతడె తిమ్మరుసన
నీవంక చూపుల నిలుపుకొంటి
అడుగడుగునందు నీయాశ లల్లుకొంటి
నైన పూర్వార్జితంబె నన్ననుసరించె
నీమహాలీలలో మాయనేర్వలేని
బుద్ధిహీనుడనై దేవ, పొగులుచుంటి
అప్పాజీ! మీకు అన్నం, నీళ్ళు లేకుండా చేసి కనుచూపు రూపుమాపిన దురాత్ముడ్ని. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. రాబోవు తరాల ప్రజలు కృష్ణరాయలింతటి కృతఘ్నుడని చరిత్రలో లిఖిస్తారు కాబోలు.
రాయా! అని మమ్మెవరు ఆదరంగా పిలుస్తారు? ప్రజల యోగక్షేమాల గురించి మమ్మెవరు హెచ్చరిస్తారు? జయభేరి నినాదాలకు సంతోషించి ఆశీస్సులందించే వారెవరు? రాయచూరు గెలిపించి, గజపతులనోడిరచి, కొండవీడును అల్లాడిరచి, మ్లేచ్ఛుల సంపదల్ని విద్యానగరానికి బండ్లకెత్తించిన సామదాన భేద దండోపాయ ప్రవీణుడైన అప్పాజీ మా పుత్రుని హత్య చేశారంటే మేం ఎలా నమ్మగలిగాం? ఏ శని మా నెత్తిన నాట్యమాడిరదారోజు!
దేవీ! చూశావా!ఈ శరీరంలో ప్రతి రక్తపుబొట్టు అప్పాజీ పెంచి పోషించిందే! మా తండ్రిగారు చనిపోవునప్పుడు మమ్మల్ని అప్పగించింది మమతామూర్తి అప్పాజీకే! నేడీ విజయనగర మహాసామ్రాజ్య స్థాపనకు మూలస్తంభం అప్పాజీయే! మేము అన్నపూర్ణాదేవిని పరిణయమాడటానికి కారకులు అప్పాజీయే! రాత్రింబవళ్ళు సంగీత సాహితీలోకంలో మేము విహరించగలిగా మంటే రాజ్యభారాన్నంతా అప్పాజీవారే మోశారు గదా!
అయ్యో! ఎంత పని జరిగింది! చేతులారా తొందరపాటుతో నా తండ్రినిట్లా చేశాను. దేవీ! ఇంక నేనెట్లా జీవించాలి?’’
కృష్ణరాయల దుఃఖానికి అంతులేదు.
నిరంతరం తిమ్మరుసుపట్ల తానుచేసిన అపకారాన్ని తల్చుకొని మరీమరీ కుంగి కృశించిపోతున్నారు. రాయల దేవేరులిద్దరూ రాయలను సమాధాన పరచలేని నిస్సహాయులయ్యారు. వ్యాసరాయలవారు చేసిన బోధ కూడా రాయలను సాంత్వనపరచలేకపోతున్నది. రోజురోజుకు కృష్ణరాయలు నీరసించి పోతూ శయ్య కంటుకొనిపోయాడు. రాచకార్యాలన్నీ మూలపడ్డాయి. రాజ్యంలో సంక్షోభపరిస్థితి అలుముకుంది.
* * *
‘‘మహారాణీ! అతిముఖ్యమైన సమాచారం ప్రభువులవారికి తెలియజేయాలి’’ రామలింగనాయకుడు, గండమనాయకుడు కలిసి రావటంతో తిరుమలదేవి ఆందోళన చెందింది.
‘‘ప్రభువులవారి ఆరోగ్యం అంత బాగాలేదు. ఈ సమయంలో వారి మనసు నొప్పించే విషయమైతే చెప్పకపోవటమే మంచిది. ఏమి వార్త రామలింగనాయకా?’’ మహారాణి అడిగింది.
‘‘మహారాణీ! రాయలవారి అనారోగ్య విషయం శత్రువులకి పాకింది. అదిల్షా మనం జయించుకున్న భూభాగాల కోసం యుద్ధానికి సిద్ధమౌతున్నాడు. మనం కూడా పోర్చుగీసు వారినుంచి కొన్న ఆరువందల గుర్రాలతో పెద్దసైన్యంతో షా ఆధీనంలోని బెల్గాం మీద దాడికి సిద్ధమౌతున్నాం. ఈ విషయంలో గోవాలోని పోర్చుగీసువారి సాయాన్ని కూడా అడిగాం. ఇంకా రాయబారి వెనక్కి రాలేదు. ప్రభువులవారి అనుమతి కోసం….’’
‘‘మీరు చెప్పిన అంశాలు సబబుగానే ఉన్నాయి. ఆ రాయబారి వెనక్కువచ్చాక పూర్తివివరాలతో ప్రభువుకు విన్నవిద్దాం’’ వారిని నిరోధించింది తిరుమలదేవి.
అప్పాజీని అంధుడ్ని చేశాక ఈ అయిదేళ్ళలో రాయల పరిస్థితి మరింత విషమంగా మారిందని వాళ్ళు అర్థం చేసుకున్నారు.
‘‘మహారాణీ! అప్పాజీవారి కుమారుడు గోవిందరాయలు కొందరు దుర్గాధిపతులను కూడగట్టి తిరుగుబాటు చేశాడు. దానిని అణచేసి గోవిందరాయలను కారాగారంలో బంధించాము.’’
సేనానాయకుని మాటలకు మహారాణి మొహం వివర్ణమైంది.
‘‘రామలింగనాయకా! ప్రభువుకీ వివరాలు తెలిపే సమయం ఇదికాదు. మంత్రిగారితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. మీరిక వెళ్ళవచ్చు’’ మహారాణి ఆజ్ఞను అనుసరించి వాళ్ళు తిరుగుమొహం అయ్యారు. రాజదర్శనం కాకపోవటం వల్ల నిరుత్సాహంగా ఉంది. సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకున్నాడు అలసటగా.
* * *
చంద్రప్ప దుఃఖంతో నిలువెల్లా తడిసిపోయాడు. విజయనగర ప్రభువు అస్తమించాడన్న వార్తకు రాజ్యమంతా కన్నీటిలో మునిగిపోయింది. తెలుగుతేజం అస్తమించింది.
ప్రధానమంత్రి పరిషత్తులో ఆంధ్రభోజుని మరణశాసనం తెలియజేయటం జరిగింది. చంద్రగిరి కోటలో బందీగా ఉన్న సదాశివరాయలను రాజును చేయమని కృష్ణరాయని కోరిక. అతనికి తగిన వయసులేనందున రాజ్యభారాన్ని అల్లుడు రామరాయలు, తమ్ముడు అచ్యుతరాయలు నిర్వహించాలనీ రాయలు రాశాడు.
రాయచూర్‌ను జయించటం చాలా అవసరమని కూడా రాయలు మరణశాసనంలో పేర్కొన్నాడు. విధిచూపు మరోరకంగా ఉంది. తండ్రి మరణంతో సదాశివరాయలు తాతగారి ఇంటికి వెళ్ళిపోయాడు. అధికారం కోసం తపిస్తున్న కృష్ణరాయల తమ్ముడు అచ్యుతరాయలు సింహాసనమెక్కాడు. కానీ పెత్తనం మాత్రం రామరాయలదే!
అచ్యుతరాయలు మదిరాపానంతో వళ్ళు తెలీకుండా పడి ఉంటున్నాడు. చుట్టూ మదవతులున్నారు. రామరాయలు అచ్యుతరాయలికి చాలాసార్లు నచ్చచెప్పాడు.
‘‘ప్రభూ! విజయనగర సామ్రాజ్యం కృష్ణరాయల కీర్తికిరీటంగా వెలుగొందింది. దీనిని కళంకితం చేయకూడదు. మీరు రాజ్యశ్రేయస్సు కోరి పరిపాలనా విషయాలు పట్టించుకోవాలి.’’
అచ్యుతరాయలు తల కొంచెం పైకెత్తి ఎరుపెక్కిన కళ్ళతో రామరాయల్ని చూశాడు.
‘‘మాకు అవన్నీ అవసరం లేదు. అవన్నీ చూసేపని మీకే అప్పగించాం కదా’’ అచ్యుతరాయల మాటలు తడబడుతున్నాయి.
‘‘నిజమే! మేం దేశాన్ని రెండువందల విభాగాలుగా ఏర్పాటుచేసి సామంతులకు కప్పం వసూలుచేసే బాధ్యతనిచ్చాం. సైన్యాన్ని బలోపేతం చేశాం. తలెత్తిన శత్రువుల్ని అణిచేశాం. కానీ మీ సరదాలకు ఖజానా వ్యయం….’’
‘‘ష్… ఇది మా స్వంత విషయం. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరాదు’’ అచ్యుతరాయలు మత్తులో మునిగిపోయాడు.
చేసేదేమి లేక రామరాయలు వెనుదిరిగాడు. తన మందిరానికి వచ్చి వాణిజ్యమంత్రిని పిలిపించాడు.
‘‘మంత్రివర్యా! మనం వసూలుచేసే ధనం నిల్వచేయడానికి వేరే ప్రత్యేక ఖజానా ఏర్పాటుచేయండి.’’
‘‘చిత్తం ప్రభూ! మరో ముఖ్యవిషయం మీతో మనవి చేయాలి. అచ్యుతరాయలవారి బావమరిది, వరదాంబికాదేవి సోదరులు సకలం తిమ్మయ్యగారిని విజయనగర ప్రధానామాత్యులుగా అచ్యుతరాయలువారు నియమించారట ప్రభూ!’’
‘‘సరే మీరిక వెళ్ళవచ్చు’’ అతనిని పంపేసి రామరాయలు తనలో తాను వితర్కించుకున్నాడు.
ఇలా ఎందుకు జరుగుతున్నది? మాకు మాటమాత్రం చెప్పకుండా అచ్యుతరాయలు తన బావమరిది తిమ్మయ్యకు అధిóకారం కట్టబెట్టటం మాకు అవమానం కాదా! అచ్యుతరాయలతో తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం పరస్పర చర్యలు సంప్రదింపులతోనే అన్నీ జరగాల్సి ఉంది. కానీ అలా జరగటం లేదు. అచ్యుతరాయలను ఎదుటపడి ప్రశ్నింపలేడు. తిమ్మయ్యను కట్టడిచేయలేడు. ఇప్పటికే దండనాధులు దుర్గాధిపత్యాల ఆశతో తిమ్మయ్యకు లోబడ్డారు.
కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండడమే మేలు.
ఇలా ఆలోచించిన రామరాయలు కొంతకాలం రాజ్యం గురించి పట్టించుకోవటం మానేశాడు. తిమ్మయ్యను అందలం ఎక్కించిన అచ్యుతరాయలు వినోద కాలక్షేపాలలో మునిగిపోయాడు. రామరాయలను తిమ్మయ్య చులకన చేయటం మొదలైంది. అంటే తిమ్మయ్య అసలు స్వరూపం బయటపడుతోంది. సైన్యం పట్ల దురుసుగా ప్రవర్తించటం, వారికి తగిన వేతనాలు చెల్లించక పోవటంతో ప్రజలకు రాజుపైన, పరిపాలన పైన వ్యతిరేకత మొదలైంది. చేసేదిలేక రామరాయలు అచ్యుతరాయ మందిరానికి మళ్ళీ వెళ్ళాడు.
వ్యసనాలతో దుర్భలుడై రోగగ్రస్తుడై ఉన్న అచ్యుతరాయలు రామరాయలను గౌరవింపలేదు.
‘‘విజయనగర రక్షకులా! ఏం ఇలా వేంచేశారు?’’ వ్యంగ్యంగా నవ్వాడు అచ్యుతరాయలు.
‘‘అర్హతలేనివారికి అధికారాలీయటం వల్ల విజయనగర సామ్రాజ్యం పతనదిశకు ప్రయాణిస్తోంది. తిమ్మయ్య ప్రవర్తన పలువురికి అభ్యంతరకరంగా ఉంది’’ అంటూ రాయరాయలు తిమ్మయ్య ఆగడాల గురించి తెలియజేశాడు. అచ్యుతరాయలు బలహీనంగా నవ్వాడు.
‘‘తిమ్మయ్య మా దేవేరి వరదాంబిక సోదరుడు. ఆయన్ని ప్రధానమంత్రిని చేయటం అనుచితం కాదు. పైగా తిమ్మయ్య మాకు ఎప్పుడైనా ఎంత కావలిసివస్తే అంత ధనం ఇస్తున్నాడు. మీరు కూడా అలా ఇవ్వగలిగితే మునుపటి మీ అధికారాలు మళ్ళీ మీకు అందుతాయని గ్రహించండి.’’
‘‘ప్రజాధనాన్ని వ్యసనాలకు దుర్వినియోగం చేసే మీలాంటి రాజుకు నేను సహాయపడలేను’’ రామరాయలు ఖచ్చితంగా చెప్పేశాడు.
‘‘అయితే మీరిక నాతో మాట్లాడేదేం లేదు’’ అచ్యుతరాయలు రామరాయలు మొహంమీదే అనేశాడు.
రామరాయలు తీవ్రంగా ఆలోచిస్తూ వెనుదిరిగాడు. హఠాత్తుగా అతనికి శ్రీకృష్ణదేవరాయల మరణశాసనం గుర్తొచ్చింది.
‘‘అవును. అలాచేస్తేనే ఈ విజయనగర సామ్రాజ్యం మరికొన్నాళ్ళు నిలుస్తుంది… రేపే తాత ఇంట పెరుగుతున్న అసలు వారసుడు సదాశివరాయలకు కబురుచేస్తాను.’’
రామరాయలు మనస్సు తేలికపడిరది. విజయనగర సామ్రాజ్యపూర్వ వైభవానికి రామరాయలు కంకణం కట్టుకున్నాడు. కానీ అప్పటికే ఆ సంగతి గ్రహించిన తిమ్మయ్య దారిమధ్యలోనే సదాశివరాయలను నిర్భంధించటంతో రామరాయలు ఖిన్నుడయ్యాడు. ఎన్నాళ్ళనుంచో కాచుకుని ఉన్న గజపతుల సైన్యం విజయనగరం మీద దండు వెడలింది. అన్నపూర్ణాదేవి తమ పుట్టింటివారి అకృత్యానికి చాలా చింతిల్లుతూ పెద్దనామాత్యునికి తెలియజేసింది. రాచకార్యాలలో సాయపడే కవులు పుట్టిన గడ్డకదా విజయనగరం! పెద్దన గజపతులనిద్దేశిస్తూ ఇలా రాసి పంపాడు.
రాయరా హుతమిండ రాచయేనుగు వచ్చి
యూరట్లకోట గోరాడునాడు
సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి
సింహాద్రి జయశిల జేర్చునాడు
సెలగోలు సింహంబు చేరి ధిక్కృతి గంచు
తల్పుల గిరుల డీకొల్పునాడు
ఘనతర నిర్భర గండపెండేర మిచ్చి
కూతు రాయల కొనగూర్పునాడు
ఒడలెరుంగవో చచ్చితో యుర్విలేవో
చేరజాలక తలచెడి జీర్ణమైతొ
కన్నడం బెట్లుసొచ్చెదు గజపతీంద్ర
తెరచినిలు కుక్క సొచ్చిన తెరగు దోప ॥
అన్నపూర్ణాదేవి ఆ పద్యాన్ని గజపతులకు చేర్చింది. వారది చదివి సిగ్గుపడి తమ దండయాత్రను విరమించుకున్నారు.
‘‘కవివర్యా! మీరు చేసిన మేలు మరువరానిది. కృతజ్ఞులము’’ అన్నపూర్ణాదేవి పెద్దనకు చేతులు జోడిరచింది.
‘‘అమ్మా! రాయలవారి ఉప్పుతిని పెరిగిన శరీరమిది. అంతటి ప్రభువును మళ్ళీ వినగలమా! కనగలమా!
ఎదురైనచో దన మదకరీంద్రము నిల్పి
కేలూత ఒసగి ఎక్కించుకొనియె
మనుచరిత్రం బందుకొను వేళ బురమేగ
బల్లకి తన కేల బట్టి యెత్తె
గోకట గ్రామాద్య నేకాగ్రహారంబు
లడిగిన సీమలయందు నిచ్చె
బిరుదైన కవిగండపెండేరమున కీవ
తగుదని తానె పాదము దొడిగె
ఆంధ్రకవితాపితామహా అల్లసాని
పెద్దన కవీంద్ర! యని తన్ను పిల్చునట్టి
కృష్ణరాయలతో దివి కేగ లేక
బ్రతికియున్నాడ జీవచ్ఛవంబనగుచు ॥।
పెద్దన కవీంద్రుని కన్నీరు చూసి అన్నపూర్ణాదేవి కూడా శోకించింది.
‘‘అమ్మా! మిమ్ముల నేను ఇంక బాధింపలేను. మనకు ఋణం తీరింది తల్లీ! వెళ్ళివస్తాను’’
పెద్దనకవి భారంగా వెళ్ళిపోయాడు.
ఇదంతా స్వయంకృతమని అన్నపూర్ణాదేవి చాలా దుఃఖించింది.
* * *
వృద్ధుడు, అంధుడైన తిమ్మరుసు ఇప్పుడు అతి దీనావస్థలో ఉన్నాడు. బాల్యంలో దుర్భర దరిద్రం అనుభవించిన, మధూకరం ఎత్తుకొని సత్రాల్లో భోజనం చేసి సకలశాస్త్రాలు అభ్యసించిన విద్యావేత్త తిమ్మరుసు ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించగలిగిన మహాప్రజ్ఞను స్వహస్తాలతో సానపెట్టుకున్నాడు.
శ్రీకృష్ణదేవరాయల పేరు ప్రస్తావిస్తే తిమ్మరుసును విస్మరించలేం. విజయనగర చరిత్రకు పరిపూర్ణత తిమ్మరుసే! కటిక బీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బాల్యమంతా గంజినీళ్ళతో బతికాడు. ఒకనాడు అడవిలో సొమ్మసిల్లి పడిపోతే నాగుపాము పడగతో అతనికి నీడనిచ్చిందట. ఒక సాధువీసంగతి గ్రహించి అతను చరిత్రపురుషుడు కాగలడని నమ్మి ఇంటికి తీసుకెళ్ళి పరిచర్యలు చేసి ఒక సామంతరాజు వద్ద లేఖకుడిగా నియమింపజేశాడట. అక్కడినుంచి తిమ్మరుసు జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఎంతోమంది రాజులవద్ద తిమ్మరుసు తన మేధాసంపత్తితో రాణించాడు. కొన్నాళ్ళకు తిమ్మరుసు తుళువ నరసరాయల వద్ద మంత్రిగా చేరాడు. రాజు అభిమానం పొందాడు.
అలా ప్రారంభమైన తిమ్మరుసు రాజకీయ ప్రయాణం విజయనగర చరిత్రలో సుస్థిరంగా వెలిగిపోయింది. నిలిచిపోయింది. కృష్ణదేవరాయల జీవితంలో, విజయనగర సామ్రాజ్య విస్తరణలో ప్రముఖపాత్ర వహించిన తిమ్మరుసు కేవలం మహామాత్ముడే కాదు అంతకుమించి దైవతుల్యుడు. ఆయుధ ప్రయోగం లేకుండా తన మేధాసంపదతో శత్రువులని మట్టి కరిపించిన ధీశాలి.
అటువంటి తిమ్మరుసు మహామంత్రి తాను పెంచి పెద్దచేసి రాజును చేసిన పుత్రతుల్యుడైన రాయల విరోధానికి గురై అంధుడై అతి దీనావస్థలో ఉండటం అందరినీ బాధిస్తున్నది. చంద్రప్ప తిమ్మరుసుకు సహాయం చేయబోయాడు. అభిమానధనుడైన ఆ వృద్ధమంత్రి ఎవరి సహాయాన్ని అంగీకరించలేదు.
అనేకులకు స్వయంగా దానధర్మాలు చేసిన తిమ్మరుసుకు తిరుపతి దేవాలయంవారు ప్రసాదం పంపేవారు. ఆ ప్రసాదాన్ని అమ్ముకుని బతికే దుస్థితి తిమ్మరుసుకు కలగటం ఏనాటి పాపమో అని అంతా దుఃఖిస్తున్నారు. రాయలు మరణించిన దాదాపు ఆరేళ్ళకు ఈ భూమిమీదే నరకాన్ని చూసిన తిమ్మరుసు మహామంత్రి స్వర్గవాసుడయ్యారు. విజయనగర స్వర్ణయుగ చరిత్ర పుటల్లో తనదైన విలక్షణ స్థానాన్ని నిలుపుకున్న మహనీయుడయ్యారు.
* * *
తిమ్మరుసు మరణం తిరుమలదేవిని, అన్నపూర్ణాదేవిని మరింత కుంగదీస్తున్నది. సకలం తిమ్మయ్య దురాగతాలు అచ్యుతరాయల సాయంతో మితిమీరాయి. అచ్యుతరాయల రాణి వరదాంబిక ఇతని ఆగడాలకు వత్తాసు పలికింది. రాజ్యమంతటా అవినీతి తాండవిస్తున్నది.
విజయనగర సామ్రాజ్యం అల్లకల్లోలంగా అవినీతి అంధకారంలో మునిగిపోవడంతో చిరకాల శత్రువు బీజాపూర్ ఆదిల్‌ఖాన్ విజయనగరంపై దాడిచేశాడు. మద్యం, మగువ తప్ప ఎరుగని అచ్యుతరాయలు తిమ్మయ్యపై బాధ్యతవేసి విందువినోదాల్లో మునిగిపోయాడు. యుద్ధంకంటే సంధి మేలనుకున్న తిమ్మయ్య ఆ నిర్ణయాన్ని సేనాపతులకు తెలిపాడు. వారిటువంటి పిరికి నిర్ణయాన్ని అసహ్యించుకుని రామరాయలకు విన్నవించారు. రామరాయలు కోరినా యుద్ధం చేయటానికి అచ్యుతరాయలు అంగీకరించలేదు. శత్రువుల ఎదుట తలదించటం తెలియని ఆంధ్రసైనికులు నిర్జీవంగా మారారు. దేశభక్తులు కుమిలిపోయారు.
అపారసంపదతో వెళ్ళిన తిమ్మయ్య శత్రువులకు ఆ సంపదలతోబాటు రాయచూర్, ముద్గల్లు, దుర్గాల తాళంచెవులు ఇచ్చి వచ్చాడు. ఈ సంఘటనలో విజయనగర పౌరులు, సైన్యం, మానసికంగా కుంగిపోయారు. ఇన్నాళ్ళు విజయనగరంతో మిత్రుత్వం నటించే పోర్చుగీస్వాళ్ళు పశ్చిమతీరం నుండి తూర్పు తీరంచేరి శాంథోమ్ దాటి తిరుపతి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఎందరినో క్రైస్తవులుగా మార్చారు. రామరాయలు చేసేదిలేక కందవోలుకు వెళ్ళిపోయాడు.
* * *
తిమ్మయ్య పిలుపుమేరకు అతని సమావేశ మందిరానికి చంద్రప్ప వచ్చాడు.
‘‘నీవేనా తిమ్మరుసుకు వేగుసాయం చేసిన పాటగాడివి?’’ వ్యంగ్యంగా అడిగాడు.
‘‘వారికి నాలాంటివారిది ఉడతసాయమే!’’ వినయంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘ఓహో! మాకు పాఠాలు నేర్పుతున్నావే! అన్నట్లు నీవు మహాగాయకుడివి కదా! నేడు మా గురించి నీ పాట వినాలని కుతూహలంగా ఉంది.’’
చంద్రప్ప మాట్లాడలేదు. అతని మౌనం తిమ్మయ్య అహాన్ని మరింత రెచ్చగొట్టింది.
‘‘తిరస్కారమా’’ హూంకరించాడు.
‘‘లేదు అమాత్యా! కృష్ణరాయల ఆస్థానంలో స్వేచ్ఛగా చేసిన గానాన్ని పంజరంలో బంధించకండి. కళాకారులను నిర్బంధిస్తే కళలు వికసించవు ప్రభూ’’ విన్నవించాడు చంద్రప్ప.
‘‘ఎంత పొగరు! నువ్వు పాడకపోతే నీ ఇల్లాలు…’’ అర్థవంతంగా వికటంగా నవ్వాడు తిమ్మయ్య.
చంద్రప్ప విచలితుడయ్యాడు. పాట పాడటానికి ఆలాపన మొదలుపెట్టాడో లేదో… ఎవరూ ఊహించని రీతిలో తటాలున ఛురిక తీసి నాలుక తెగ్గోసుకున్నాడు చంద్రప్ప. రక్తం కారుతూ పడిపోయాడు. కళాకారునికి ఇష్టం లేకుండా కళని దోచుకోవటం ఎంతటి రాజులకైనా సాధ్యం కాదని నిరూపించాడు.
సభ నివ్వెరపోయింది. తిమ్మయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు.
అంతకుముందే ఆప్తులవల్ల సభా సమాచారం తెలిసిన మంజరి పరుగుపరుగున చంద్రప్పను చేరింది. అప్పటికే అవసాన ఘడియల్లో ఉన్న చంద్రప్ప చేతిలోని కైజారుతో తానూ పొడుచుకొని అతని వక్షస్థలం మీద వాలిపోయింది ఆ కళామూర్తి ప్రేమమయి.
అమరులైన ఆ కళాకారుల కోసం, దేశభక్తుల కోసం కన్నీరు పెట్టేవారు కూడా ఆ సభలో కరువైపోయారు. కళలకు కాణాచి అయిన విజయనగర సామ్రాజ్యం ఇద్దరు గొప్ప కళారాధకులను బలిగొన్న దుర్దినం అది.
* * *
రామరాయలు శయ్యాగృహానికి వచ్చాడు. తిరుమలాంబిక ఆప్యాయంగా ఎదురేగి కౌగలించుకుంది. ఆపైన ఆయనకేసి చూస్తూ నిట్టూర్చింది.
‘‘దేవీ! ఎందుకీ నిట్టూర్పు’’ రామరాయలు కనిపెట్టి అడిగాడు.
‘‘నాకెందుకో భయంగానే ఉంది ప్రభూ! మా తండ్రిగారు శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి రాకముందు ఎన్నో కుట్రలు జరిగాయని మాతల్లి చెప్పింది. ఇప్పుడు ఈ విజయనగర అంతఃపురంలో అటువంటి కుట్రలేవో జరుగుతున్నాయని పిస్తుంది. మిమ్మల్ని…’’
‘‘నా ప్రాణానికి ఏ అపాయంరాదు దేవీ! ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ రామరాయలనేం చేయలేరు’’ మీసము దువ్వాడా వీరుడు.
‘‘అయినా ఎవరిని నమ్మగలం? అంతా విషవలయంలో ఉన్నట్లుంది. మనం మళ్ళీ వెళ్ళిపోదాం’’ ఆవేదన వెలిబుచ్చింది తిరుమలాంబిక.
‘‘దేవీ! రాజప్రాసాదంలో కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఎవరి మాటలు రూఢ కావు. జాగ్రత్తగా మెలగాలి. అందర్నీ నమ్మకూడదు’’ హితబోధ చేశాడు రామరాయలు.
‘‘అచ్యుతరాయలవారి ఆరోగ్యం సరిగా లేదటగదా’’ తిరుమలాంబిక ఆరాతీసింది.
‘‘అవును. వారి భోగలాలసత్వం మితిమీరింది. రాజ్యంలో దొంగల బాధ అధికమయింది. వర్తకం, పరిశ్రమలు వెనుదిరిగాయి. యాత్రికుల కష్టాలకు లెక్కలేదు. పన్నులు పెంచటం వల్ల ప్రజలకు కోపంగా ఉంది. రాజ్యపరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి.’’
తిరుమలాంబిక కనుల నీరు నిండిరది.
‘‘మా తండ్రిగారు ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యాన్ని స్వర్ణమయం చేశాడు. ఈనాడిలా…’’
రామరాయలామె కనుల నీరు తుడిచాడు.
‘‘ఇదంతా అచ్యుతరాయల వైఫల్యం. తిమ్మయ్య చేతుల్లో కీలుబొమ్మయినాడు. బీజాపూర్వారికి బానిసయ్యాడు. నేడోరేపో అతని చివరిదశ ముగుస్తుంది.’’
‘‘హతవిధీ! మరి విజయనగర సింహాసనానికి వారసులు?’’
‘‘వెంకటరాయలు కుమారుడే’’
‘‘ఆ పసివాడా’’ నిరుత్సాహపడిరది తిరుమలాంబిక.
‘‘రాజెవరైనా అన్నిటికీ తిమ్మయ్యే కదా’’ రామరాయలు అసంతృప్తిగా అన్నాడు.
* * *
‘‘సేనాపతిగారూ! వెంకటరాయల మరణాన్నీ, మా రాజపట్టాభిషేకాన్నీ వెంటనే చాటింపు వేయండి’’ తిమ్మయ్య ఆజ్ఞాపించాడు.
‘‘వెంకటరాయల మరణమా’’ సేనాధిపతి కలవరపడ్డాడు.
‘‘అంతేగాదు. కాదన్నవారిని ఊచకోత కోయండి’’ తిమ్మయ్య క్రూర శాసనం చేశాడు.
సేనాపతి మొహం వెలవెలబోయింది. గత్యంతరం లేదు. తిమ్మయ్య రాజయ్యాడు. సైనికులకు జీతాలు లేవు. ప్రజల అవసరాలు పట్టవు. తిమ్మయ్య బీజాపూర్ సుల్తాన్‌కు విపరీతంగా కానుకలు పంపి తనవాడిగా చేసుకున్నాడు. అతని చిత్రవిచిత్ర ప్రవర్తనకు ప్రజల రక్తం మరుగుతోంది. సామ్రాజ్యం కోసం ప్రాణాలు త్యాగం చేయగల సైనికులు చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తున్నది. వాళ్ళు అసహనం ప్రకటిస్తున్నారు. తిరగబడుతున్నారు. తిమ్మయ్య స్వీయ ప్రాణరక్షణకు దక్షిణాన ఉన్న బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షాకు లేఖ పంపాడు. సైన్యసమేతంగా వచ్చి తనకి మద్దతు ఇవ్వమని.
శ్రీకృష్ణదేవరాయలు బతికి ఉన్నప్పుడు విజయనగర సామ్రాజ్యం పేరు వింటేనే గజగజలాడే ఆదిల్షా దర్జాగా మందిమార్బలంతో, సైన్యంతో తరలివచ్చాడు. తిమ్మయ్య ఇచ్చిన అపూర్వ స్వాగతం అందుకున్నాడు. సభామండపానికి ఆదిల్షాను తీసుకెళ్ళాడు తిమ్మయ్య. విజయనగర సింహాసనం చూడగానే ఆదిల్షాకు కోరిక పెరిగింది.
‘‘నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆ సింహాసనాన్ని అధిష్టిస్తాను. నీవు మునుపటిలాగా ముఖ్యమంత్రి ఆసనాన్ని అలంకరించు’’ అన్నాడు.
అదిల్షా కోరికను తిమ్మయ్య తిరస్కరించలేడు. అలాచేస్తే అధోగతే! స్వయంగా అతడిని తీసుకువెళ్ళి విజయనగర సింహాసనంపై కూర్చోబెట్టాడు తిమ్మయ్య.
చరిత్రలో అది మహాదుర్దినం. పౌరుష శౌర్య ప్రతాపాల తెలుగు బిడ్డలు, స్వంత దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసి ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన హిందూరాజులు అధిష్టించిన సింహాసనం మీద, మూరురాయరగండ, ఆంధ్రభోజుడధిష్టించిన సింహాసనం మీద ఒక ముసల్మాను కూర్చోవటం విజయనగర వినాశనానికి నాంది అయింది.
ఇక ప్రజలు మౌనం వహించలేకపోయారు. రామరాయలను సామ్రాజ్యాన్ని కాపాడమని ఆహ్వానించారు. ఈలోగా ఆదిల్షా ప్రతాపం, ప్రజలపై అణచివేత ఎక్కువైంది. తురకసేనలు ప్రజాజీవితాన్ని దుర్భరం చేశాయి. రామరాయలు సైన్యంతో కోట వెలుపల విడిదిచేశాడు. ఆదిల్షా తోక ముడిచాడు. మూర్తీభవించిన విజయనగర పౌరుషానికి తలొంచి దోచిన సంపదంతా తిరిగి ఇచ్చేశాడు.
తిమ్మయ్య శిరస్సు ఖండిరచి విజయనగరాన్ని పట్టుకున్న పిశాచాన్ని వదిలించాడు రామరాయలు. సదాశివరాయలను విడుదల చేసి చక్రవర్తిగా చేశాడు. పేరుకే సదాశివరాయలు రాజు. పెత్తనం మాత్రంమళ్ళీ రామరాయలదే!
రామరాయలు పరిపాలనా యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో బంధించు కోవటానికి అవసరమైన భారీ మార్పులన్నీ చేశాడు. బహ్మనీ సుల్తానులతో విజయనగరంవారికి నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. రామరాయలు రకరకాల వ్యూహాలతో విజయనగరానికి విశేష ధనాన్ని సంపాదించిపెట్టాడు. బహ్మనీలతో, పోర్చుగీసువారితో తెలివిగా ప్రవర్తించి కోల్పోయిన కోటలు తిరిగి సాధించాడు.
శ్రీకృష్ణదేవరాయ నిర్మితమైన భువనవిజయంలో విజయదశమి రోజున కవిపండిత గోష్టి నిర్వహించాడు రామరాజు. ఆనాటి చర్చ ‘కవిత్వ విమర్శ’ అనే అంశం మీద కొనసాగుతున్నది.
రామరాయలు సభనుద్దేశించి ప్రశ్నించాడు.
‘‘కవిత్వానికి మూలం ఏది?’’ ఎవరూ బదులీయలేదు.
‘‘రామయామాత్యా! మీ అభిప్రాయం’’ అడిగాడు రామరాయలు.
‘‘భావనాశక్తి’’
‘‘రాజనాథ డిరడిమా! మీ ఆలోచన?’’
‘‘శ్రేష్టమైన ప్రసిద్ధమైన వస్తువు’’
రామరాయలకా జవాబు తృప్తినివ్వలేదు. అంతఃపుర కక్ష్యనుండి తిరుమలాంబ ‘‘వివేచనాశక్తి, లోకజ్ఞానం’’ అన్నది.
అండుగుల వెంకయమాత్యుడు ‘‘భగవత్కటాక్షం’’ అన్నాడు.
రంగవరాజు ‘‘పాండిత్యం’’ అన్నాడు.
అందరూ తలోరీతి చెప్పారు. రామరాయలు చివరకి భట్టునుద్దేశించాడు. భట్టు లేచాడు.
‘‘ప్రభూ! కవిత్వానికి మూలం ప్రతిభ! మిగిలినవన్నీ దాని పోషకాలు. ప్రతిభ లేనివాడు కవి కాలేడు. కళాకారుడు కూడా కాలేడు. గ్రంథాలు చదివితే పాండిత్యం, జ్ఞానం వస్తాయి. ప్రతిభ రాదు. అది పుట్టుకతో రావాల్సిందే’’ అన్న భట్టు అభిప్రాయం మీద వాదప్రతివాదాలు జరిగాయి. రామరాయలకు భట్టు అంటే గౌరవం హెచ్చు. భట్టు సంగీత సాహిత్య నిధి. వేదవేదాంగ తర్క మీమాంసాది సకలశాస్త్ర పారంగతుడు. సంస్కృతాంధ్ర సాహిత్య సర్వస్వాన్ని, సామవేదాన్ని సంపూర్ణంగా అభ్యసించినవాడు.
కవులంతా తమతమ కావ్యాల నుంచి కొన్ని ఘట్టాలు చదివి విన్పించారు. భట్టు తాను రచిస్తున్న కావ్యంలోంచి కొన్ని ఘట్టాలు వీణా మృదంగ తాళలయతో చదివాడు. నాటిసభలో తిమ్మోజు కొండోజు క్షౌరకళ ఉత్కృష్టత ప్రకటితమైంది. తనకు నిద్రాభంగం కాకుండా క్షౌరము చేసిన కొండోజీకి రామరాయలు మల్లాపురం అగ్రహాన్నిచ్చి గౌరవించాడు. కృష్ణరాయల కాలం నాటి రాజకళాపోషణను అంతా గుర్తుచేసుకున్నారు.
* * *
విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని ఉన్నా పైకి మిత్రత్వం నటించే బీజాపూర్ సుల్తాన్ ఆలీ ఆదిల్షాకు పఠాన్ అనే అంగరక్షక దళాధిపతిని రామరాయలు ఏర్పాటు చేయటంపట్ల విముఖత్వం వహించి రాజగురువు హెచ్చరించారు. రామరాయలు వినలేదు. అంతిమంగా తనవల్ల సహాయం పొందిన బహ్మనీవారే తనకి ద్రోహం తలపెట్టటం రామరాయలను కలవరపరిచింది. బహ్మనీ సుల్తానులంతా ఏకమై విజయనగరంపై దండెత్తారు.
రామరాయలు మండిపడ్డాడు. సేనల్ని ఆయత్తపరిచాడు. తిరుమలరాయలు, వెంకటాద్రిని సరిహద్దుల కాపలాకు నియోగించాడు. శక్తివంతుడైన రామరాయలు కులదైవమైన ఆదివరాహమూర్తిని పూజించాడు.
కరుణాసాగరా
వరాహ మహేశ్వరా
కావగ రావయ్యా మా కులదైవం నీవయ్యా ॥ పగలతో రగిలే నేలను పచ్చదనం నింపుమయా శాంతికాముకులం మేము శుభములు దీవింపుమయా ॥ పాములాంటి వైరిమూక పైబడ వచ్చేరయా
మా
విజయనగర శ్రీని నిలిపి
కంటిపాపగ కావుమయా ॥
అప్పటికి తొంభై ఏళ్ళు పైబడ్డ వృద్ధుడు రామరాయలు. అంత వయస్సున్నట్లు కన్పించడు. ధృడమైన శరీరాకృతి, చైతన్యవంతమైన మేధస్సు, వ్యూహ నిర్మాణంలో దిట్ట అయిన రామరాయలు అంతవరకు పరస్పర కలహ సమయాల్లో బహమనీ సుల్తానులకు సాయం చేసినా స్వమత కారణంగా ఏకమై వారంతా నేడీ యుద్ధం తనపైనే తలపెట్టటాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు.
రామరాయలు నిరంతరం ముసల్మాను ప్రాంతాలనదుముకుంటూ ఉండటంతో బీజాపూర్ ఆదిల్షా అతనికి వ్యతిరేకంగా ఓ కూటమి తయారుచేసి రామరాయల అహంకారాన్ని అణచివేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న యుద్ధం ఇది.
రాజగురువు సుదర్శనులవారు అఖండజ్యోతిని వెలిగించారు. విద్యారణ్య స్వామి విజయనగర స్థాపకులకు ప్రసాదించిన ఖడ్గాన్ని రామరాయలకు అందజేశారు.
‘‘ఈ జ్యోతి వెలుగుతున్నంతకాలం ఈ ఖడ్గాన్ని యవనులు తాకనంతకాలం మీకు అపజయం ఉండదు. విజయుడవై రమ్మని’’ ఆశీర్వదించి పంపారు.
తొంభై ఆరు సంవత్సరాల వయసులో రామరాయలు యుద్ధానికి బయలుదేరాడు. నగరప్రవేశం చేసిన అహమద్ఖాన్ పఠాన్ వేషంలో సదాశివరాయల కుమారుడైన శ్రీరంగరాయల్ని అపహరించుకుపోయాడు. అసలు పఠాన్ వచ్చాక విషయం తెలిసింది. సరిహద్దులు కట్టుదిట్టమైనాయి. అసలు పఠాన్ రామరాయల అంగరక్షకుడిగా ఉన్నాడు.
రాక్షసి తంగడి లేక తళ్ళికోట యుద్ధం తెలుగుదేశ చరిత్రలోనే కాదు, యావద్భారత ఉపఖండ చరిత్రలోనే కొత్త మలుపుకు దారితీసింది.
రెండువైపులా లక్షల సైన్యం సముద్రంలా ఘోషిస్తోంది. రామరాయలు సైన్యాన్ని మూడుభాగాలు చేశాడు. ఒక భాగం తిరుమలరాయల కింద, మరొకటి వెంకటాద్రి కింద, మూడవది తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మొదట వెయ్యి ఏనుగులు, ఇరవై వేల అశ్వదళం, లక్షమంది కాల్బలంతో తిరుమల రాయలు శత్రువులపై బడ్డాడు. ఇరుపక్షాలు తీవ్రంగా ఢీకొన్నాయి. ఇదిలా ఉండగా వెంకటాద్రి ఐదుమైళ్ళ వెనుక దారితప్పించి తూర్పువైపునించి హఠాత్తుగా శత్రుసైన్యం మీదపడ్డాడు. బహ్మనీ సైన్యాలు ఆందోళన చెందాయి. మర్నాటికే రామరాయలు అనంత సైన్యంతో పడమటివైపు నించి దాడిచేశాడు. ఎటుచూసినా విజయనగర సైన్యమే! ఆంధ్ర సైన్యం బహ్మనీల తలలు తరుగుతుంటే వాళ్ళకి దిక్కు తోచలేదు. బహ్మనీలు సంధిóకి ప్రయత్నించారు. రామరాయలు అంగీకరించలేదు. భయంకర మారణహోమం జరిగింది.
రామరాయలు కొత్త వ్యూహం పన్నాడు. మొదట అశ్వదళం, వెనుక అక్కడక్కడ మరఫిరంగులు, ఆ వెనుక పదాతులు.
బహ్మనీలు కూడా తమ సైన్యాన్ని మూడు విధాలు చేశారు. అనేక ఏనుగులు, గుర్రాలు ఆ యుద్ధంలో మరణించాయి. రామరాయలు సైన్యం మధ్యలో నిలిచి సింహనాదం గావించి ఉగ్రరూపంతో వైరివీరులపై విరుచుకుపడ్డాడు. సుల్తానుల సైన్యము చెల్లాచెదురైంది. మర్నాడు ముందుగా మిత్రపక్షాల బలగాలు మధ్యభాగంలో ఫిరంగి దళంతో నిలిచారు. ఈ ఏర్పాటు కన్పించకుండా రెండువేల మంది విదేశీ విల్లువీరులు అందరికన్నా ముందువరుసలో నిలబడ్డారు.
శత్రుసైన్యాలు ముందుకు దూకగానే, పన్నిన వ్యూహం ప్రకారం విల్లువీరులు బాణాలు వేయటం కొనసాగించారు. రామరాయల హిందూసైన్యం దగ్గరికి రాగానే విల్లువీరులు పక్కకి తప్పుకున్నారు. ఆ వెనుక ఉన్న ఫిరంగులన్నీ ఒక్కసారిగా పేలాయి. రామరాయల సైన్యం చాలావరకు హతమైంది. మిగిలిన కొందరు వెనుదిరిగారు.
వృద్ధుడైన రామరాయలు ఏనుగు అంబారీ మీద నించి దిగాడు. తన మంత్రుల మాటకూడా వినకుండా స్వయంగా శిబికలో యుద్ధభూమిలో తిరుగుతూ పర్యవేక్షించాడు.
విజయంపట్ల ఆయనకి చాలా నమ్మకం ఉంది. యుద్ధభూమిలో హిందువుల శతఘ్నుల నుంచి, బురుజులపై అమర్చిన లోహపు గొట్టాల ఫిరంగుల నుంచి, మహావినాశనం కల్గించే అగ్నిగోళాలు పేల్చుతున్నారు. రెండువైపులా చాలామంది మరణించారు.
ఆ సమయంలో శిబిక నుండి దిగిన రామారాయలు మణిమాణిక్య ఖచితమైన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. తన కోశాధికారి ద్వారా తన చుట్టూ ధనరాసులు, బంగారు అభరణాలు, మణిమాణిక్యాల కుప్పలు ఏర్పాటు చేయించాడు. ఆ ధనాన్ని అతని దృష్టిని ఆకర్షించిన అనుచరుల కివ్వాలని రామరాయల ఆలోచన. సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ రామరాయలు యుద్ధరంగంలో వీరోచితంగా మాట్లాడాడు.
‘‘ఓ విజయనగర యోధులారా! మనకిది పరీక్షా సమయం. ఈనాడు జయిస్తే ఆంధ్రసామ్రాజ్యం గోదావరి వరకు విస్తరిస్తుంది. కఠినాత్ములు బహమనీల వల్ల మన హిందూమతానికి ముప్పు వస్తున్నది. మీరంతా ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన వీరులు. ఈ మహమ్మదీయ సైన్యాన్ని ఎన్నిసార్లో తరిమికొట్టినవాళ్ళు. విజయనగర రాజ్య ప్రతిష్ట కోసం మీ తాత తండ్రులెన్నో త్యాగాలు చేశారు. మీలో నిజంగా వీరరక్తం ప్రవహిస్తుంటే ఈ తురకసైన్యాన్ని తరిమికొట్టండి. ప్రాణమున్నంతవరకు మర్యాదకోసం పోరాడుదాం’’ అని రెచ్చగొట్టే ఉపన్యాసమిచ్చాడు.
మహమ్మదీయ బలగాలు గతితప్పే స్థితిలో అకస్మాత్తుగా మహమ్మదీయ అగ్రభాగ ఫిరంగిని రాగి నాణాల సంచులతో దట్టించి పేల్చటంతో ఐదువేలమంది హిందువులు ఒక్కసారిగా నిహతులయ్యారు. రామరాయల సైన్యం అయోమయంలో పడిరది. ఈలోపు బహ్మనీల అశ్వదళం రాయలున్నచోటికి దూకింది.
రామరాయలు తనచోటు మార్చి మళ్ళీ శిబికను అధిరోహించాడు. నిజాంషాకు చెందిన కల్లు తాగించబడిన మదపుటేనుగొకటి యుద్ధక్షేత్రంలో రామరాయలు శిబికవైపు దూసుకుపోయింది. భయపడిన శిబిక వాహకులు భారాన్ని నేలపై పడేసి పారిపోయారు. రామరాయలు తేరుకొని గుర్రాన్ని అధిరోహించేలోపు మిత్రపక్షాల సైనికదళం అతన్ని చుట్టుముట్టి బందీని చేశాయి.
కృష్ణవేణీ తరంగిణి స్తబ్ధమైపోయి
కదలమానినజాడ గాంచలేదు
ఎపు డెరుంగని యంకుశపుపోటునకు నొచ్చి
వెనుకాడి గజరాజు వెంటరాడు
ఖతనుద్రొక్కుచు పంచకళ్యాణిగుర్రము
సకిలించి మోర నెత్తి కనలేదు
సముదశాత్రవకంఠ సవన కర్తృత్వము
భరియించు అసి చేత బట్టలేదు
శకునములొ, విధివశంమున సలిపినట్టి
తప్పిదంబులొ తెలియ డిరతయునుగూడ
రామరాయలు, నైజపరాక్రమంబు
ముసలి మేధస్సులోపల ముడుతలుపడ
దీనితో విజయనగర సైన్యం భయపడి లొంగిపోసాగింది. రామరాయలను సుల్తాను ఎదుట ప్రవేశపెట్టారు. వారి పగ అంతటితో చల్లారలేదు. పటపట పళ్ళు కొరుకుతూ హుస్సేన్ నిజాం షా రామరాయల దగ్గరిగా వచ్చాడు.
‘‘కాఫిర్! ఇరవై ఏళ్ళుగా ఈ తలే మమ్మల్ని వేధించింది. నేనిప్పుడు పగ సాధిస్తున్నాను. ఇంక దేవుడు నన్నేంచేసినా చెయ్యనివ్వు’’ అంటూ నిస్సహాయస్థితిలో ఉన్న అసహాయశూరుడు, తొంభైఆరేళ్ళ వృద్ధుడు తండ్రిలాంటివాడైన రామరాయల తలను నరికేశాడు.
రామరాయల తెల్లని పండిన తల పట్టుకొని దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని తల తరిగి తృప్తి పొందినట్లే సుల్తాన్ కూడా నరికిన ఆ తలను ఒక బల్లెంపై ఎత్తుగా హిందూ బలగాలకు కనిపించేవిధంగా ప్రదర్శించి వికట్టాటహాసం చేశాడు.
నలభై సంవత్సరాలకు పైగా ఘోరాతిఘోర సంగ్రామాల్లో పోరి, హిందూ సామ్రాజ్య రక్షకుడిగా రాజనీతి చతురుడిగా నిలిచిన అళియ రామరాయలు విజయనగర భానునిలా అస్తమించాడు.
రాక్షసి తంగడి యుద్ధంలో రామరాయని మరణంతో విజయానికి చేరువగా
ఉన్న ఆంధ్రసైన్యం బెదిరిపోయి చెల్లాచెదురైంది. రాయల సోదరులు, నమ్మకస్తులైన దండనాధులు ప్రాణాలు కోల్పోయారు.
తళ్ళికోటలో చచ్చె భూధవు డటంచు
వినినమాత్రనె శత్రువుల గనినతోనె
పిరికితనమేల నీసేన బిలుకుమార్చు
గొందెలో మ్లేచ్ఛవీరులు ఘోషవెట్ట
అలా పారిపోయే సైనికులను బహ్మనీ సైన్యం వెంటాడి వేటాడి ఊచకోత కోసింది. యుద్ధరంగానికి పక్కనే ప్రవహించే నది అరుణ వర్ణాన్ని పులుముకుంది. దాదాపు ఒక లక్షమంది హిందూ సైనికుల తలలు ఎగిరిపడ్డాయి.
విజయనగర సైనికులు రాజధానివైపు పారిపోయారు. వాళ్ళెంత దిగ్భ్రమ చెందారంటే నగరాన్ని చుట్టుముట్టి ఉన్న పర్వాతాల మధ్య రక్షక వ్యూహాలు చేపట్టే ప్రయత్నాన్ని గానీ, నగర కుడ్యాలనుగానీ, ప్రవేశమార్గాలనుగానీ రక్షించుకునే ప్రయత్నం చేయక సంపూర్ణ ఓటమిపాలయ్యారు.
తురక సైనికుల్లోని ప్రతివ్యక్తీ బంగారం, నగలు, ఆయుధాలు, గుర్రాలు, బానిసలు ఎవరికేవి చిక్కితే అవి దక్కించుకుని ధనవంతులైపోయారు. విజయనగరవాసులకు ప్రమాద స్పృహే లేదు. రామరాయలు అపార సైన్యాన్ని వెంటబెట్టుకు వెళ్ళటం వల్ల వారికి విజయం గురించి సంపూర్ణ విశ్వాసముంది. కానీ పలాయనం చిత్తగించిన సైన్యం, చనిపోయిన నాయకుడు, అపార సంపదలతో భవనాలను వదిలివెళ్ళిన రాకుమారులను చూసినప్పుడు ప్రజలు భయభ్రాంతులయ్యారు.
రాజభక్తులైన సైనికులతో లెక్కలేనంత బంగారం, వజ్రాలు, వందమిలియన్ స్టెర్లింగుల విలువ చేసే విలువైన రాళ్ళను, రాజచిహ్నం, రత్నఖచిత సింహాసనాన్ని ఐదువందల ఏనుగులపై వేసుకుని సదాశివునితో సహా తిరుమల రాయలు, రాచకుటుంబాలు, వారి అనుచరులు పెనుగొండకు పారిపోయారు.
విజయనగరంలో మహావిపత్తు వాస్తవంగా కన్పించింది. నగరవాసుల్ని రక్షించేవాళ్ళు లేరు. దొంగల గుంపులు, అటవికులు నగరాన్ని అన్నివిధాలా ఆరుసార్లు ప్రణాళికాబద్ధంగా దోచి విపరీతమైన సంపదను మోసుకెళ్ళారు.
యుద్ధం ముగిసిన మూడోరోజున విజేతలైన బహమనీలు నగరానికి వచ్చారు. అప్పట్నుంచి ఐదునెలలపాటు వారికి విశ్రాంతే లేదు. విధ్వంసమే లక్ష్యంగా దయలేకుండా ప్రజల్ని వధించారు. దేవాలయాలు, రాజభవనాలు పడగొట్టారు. శిలానిర్మిత దేవాలయాలు తప్ప మిగతావన్నీ శిథిలాలుగా మారిపోయాయి. విగ్రహాలు విరగ్గొట్టారు. ఉగ్రనరసింహుని చేతులు ఖండిరచారు. దసరా దిబ్బ మండపాన్ని ధ్వంసం చేశారు. భవనాలు తగలపెట్టారు. నిప్పు, కత్తులతో విలయం సృష్టించారు.
ప్రపంచంలో మరెక్కడా జరగని ఇటువంటి విధ్వంసం వల్ల సంపన్నవంతమైన విజయనగరం భీభత్స దృశ్యంగా మిగిలింది. అలా దోచిన సంపదలో కోడిగుడ్డంత పెద్ద వజ్రాన్ని ఆదిల్షా స్వాధీనపర్చుకున్నాడు. తర్వాతి కాలంలో ఆ వజ్రాన్ని తన గుర్రపు శిరస్త్రాణపు తురాయి కింద అమరింపజేసుకుని ఆనందించాడని కథనం. ఓ మహాసామ్రాజ్యం నేలకూలింది. విజయనగరం మరెప్పటికీ తన పూర్వవైభవాన్ని పొందనంతగా నిర్జన శిథిలదృశ్యంగా, వల్లకాడుగా మిగిలిపోయింది.
శ్రీకృష్ణదేవరాయల శౌర్యప్రతాపాలు, కళాపోషకత్వం, విజయనగర సామ్రాజ్య వైభవం మాత్రం తరతరాలుగా అభిమానుల గుండెల్లో మరపురాని మధురకావ్యంలా మిగిలాయి.
ముగింపు
అభిషేక్, అమృతల కళ్ళనిండా నీళ్ళు. ఆవేదనతో ప్రతి భగ్నశిల్పాన్నీ చూస్తూ అలనాటి సౌందర్య జ్ఞాపకాలను వెదుక్కుంటున్నారు.
ఏదేవి చిలికెనో ఈ పాలమీగడ
విట్ఠలాలయ శిలా వేదులందు
ఏజోదుచిందెనో ఈ రక్తగంధము
నరసింహదేవు పేరురముమీద
ఏశిల్పిదిద్దెనో ఈ కారుమబ్బులు
ద్వారపాలకరాము తేరుమీద
ఏరాజు తూగెనో ఈ తులాడోలలో
తులసిబంగారు మొక్కలకు మ్రొగ్గి
ఏ మహాభక్తు డిట జపించినాడొ
దివ్య కోదండరామ పథిశ్రమాప
నయన శబరీఫలాపేక్ష నియతుడగుచు
కాలపుం దాటులందు సంకరములన్ని!
‘‘చూశావా అభీ! అంతటి అద్భుత నగరానికి విధి వేసిన శిక్ష! ఈ నిర్జన శిథిల దృశ్యాలను చూడటానికేనా మనం వచ్చాం! రాకముందుకన్నా ఇక్కడికొచ్చాక నా మనసు మరింత తీవ్రంగా కలవరపడుతోంది.’’
‘‘అమ్మూ! ఇది చరిత్ర. గతాన్ని మార్చలేం. గతంలోంచి పాఠాలు నేర్చుకొని వర్తమానాన్ని తీర్చిదిద్దుకొని భావితరాలకు బంగారు భవిష్యత్ అందించాలి’’ అభిషేక్ ఉద్వేగంగా అన్నాడు.
‘‘ఈ చిన్న గ్రామాల మధ్య, మిగిలిన మట్టిగోడల మధ్య, పాత నీటికాలవల మధ్య మన నగరాన్ని వెదుక్కుంటున్నాను అభీ!’’ కన్నీటితో అంది అమృత.
‘‘బాధపడకు అమ్మూ! మనం ఇక్కడికి వచ్చి ఈ శిల్పారామంలో తిరిగాక మన బంధం జన్మజన్మల బంధంగా మరింత పెనవేసుకుంది. ఇలా చూడు… ఈ ‘నవమోహిని’ శిల్పం ఈనాటికీ ఈ విఠల మందిరంలో చరిత్రకు సాక్ష్యంగా చెక్కుచెదరకుండా ఉంది.’’
అమృత ఆ శిల్పాన్ని ఆపాదమస్తకం ప్రేమగా స్పృశించింది. మనసులో శాస్త్రి మెదిలాడు.
‘‘ఈ సంగీతకారుడు నీవే కదూ’’ వేణువూదుతున్న శిల్పాన్ని అభిషేక్‌కి చూపించింది. ఆమె మనసు కొంత తేలికపడిరది.
‘‘అవును అమ్మూ! ఆనాడు మనం నిజమైన కళాకారులంగా మరణించాం. జన్మజన్మలకు కళాకారులుగానే పుడుతున్నాం. ఎవరెంత నాశనం చేసినా రూపుమాసిపోని ఈ శిల్పాలు మన ప్రతిరూపాలు. కళకు మరణముండదు అమ్మూ.’’
అభిషేక్, అమృతల స్పర్శ సోకిన ఆ శిలలు మరింత సజీవకళను సంతరించుకున్నాయి.
ఆ కళాకారుల తలపుల్లో విజయనగర సామ్రాజ్య శోభ ఒక అందమైన బంగారుకలలా నిలిచిపోయింది. ఈ స్వప్నం కరిగిపోయేది కాదు. తరతరాల కళాప్రియులను గతంలోకి నడిపించి మురిపించే మధుర భావనాలోకం! మరపురాని మహనీయ దృశ్యకావ్యం!
ఇది ఆంధ్రభోజుడిలాతలంపై
నిర్మించుకున్న దివ్యస్వర్గధామం
ఇది లక్ష్మీ సరస్వతుల అపూర్వమైత్రికి
రాయలు రచించిన రమణీయ శిల్పాలయంసమాప్తం