Home ధారావాహిక నవల బంగారు కల

బంగారు కల

by Chillara Bhavanidevi

ధారావాహికం – 11వ భాగం

అన్నపూర్ణాదేవి మందిరం సుందర మనోహరంగా ఉంది. అత్తరు గుబాళింపులు, పూలగుచ్ఛాల స్వాగతాలు రాయల మనసుకు మరింత ఆహ్లాదాన్ని సమకూరుస్తున్నాయి.
ఎక్కడనుంచో శ్రావ్యమైన వీణావాదన విన్పిస్తున్నది. సర్వాంగ సుందరంగా శయ్యామందిరం అలంకరించి ఉంది. రాయల మనసు అన్నపుర్ణాదేవి పట్ల విరహంతో వేగిపోతున్నది. ఆమె సౌందర్యంలోని రాజసానికి రాయలు ఏనాడో ఆకర్షితులయ్యారు. గజపతులతో రాయల వైరాన్ని అన్నపూర్ణాదేవి ప్రేమానురాగాలతో మరపించింది.
రాయలు శయ్యామందిరం చేరేసమయానికి అన్నపూర్ణాదేవి సౌందర్య దేవతలా అలంకరించుకుని ఉంది. ప్రియ సమాగమానికి ఎదురుచూస్తున్నది. రాయలామె వెనుకగా వచ్చి నిలిచారు. పరిచితమైన గాఢస్పర్శ… ఆపై ఆమె నడుము చుట్టూ ప్రభువు చేతులు. ఆమె వెనుదిరిగేలోపు రెండు అరచేతులతో వెనుకనుంచి ఆమె కన్నులు సుకుమారంగా మూసేశారు. ఆమె పరవశించి పోయింది.
‘‘ప్రభూ!’’ అనగలిగింది.
‘‘ఉహూ. పేరు చెప్పాలి’’ శృంగార రాయలు కవ్వించారు. ఆమె సిగ్గుపడిరది. రాయల హృదయంలో మొహం దాచుకుంది. ఆమె శరీరం అణువణువు ప్రభువు కోసం నిరీక్షిస్తున్నదని అర్థమయింది.
రాయలు ఆమె చుబుకాన్ని పట్టి కళ్ళల్లోకి చూశారు. ఆమె కళ్ళలో తన ప్రతిబింబం మరింత అందంగా కన్పిస్తోంది. ఆమె కళ్ళు వాల్చేసింది. దూరంగా జరిగింది.
‘‘దేవిగార్కి కోపమా’’ చమత్కరించారు.
‘‘లేదు ప్రభూ! కృష్ణచంద్రుని కోసం చకోరంలా ఎదురుచూపులు’’
‘‘మాటలు నేర్చారు దేవిగారు’’
‘‘మీ చేతల ముందు మా మాటలేం పనిచెయ్యవులెండి’’ అలుక నటించింది.
‘‘మా చేతలు మీకంగీకారమైనవే కదా’’
‘‘మా అంగీకారాలతో ప్రభువులకు నిమిత్తమేముంటుంది’’ నిష్ఠూరం ధ్వనించింది.
‘‘ఇన్నాళ్ళూ రాలేదని అలుకా! ఏవేవో అవాంతరాలు… ఓప్‌ా… ఇంకా ఎడబాటా దేవీ!’’ ఆమెను బలవంతంగా తనవైపు తిప్పుకున్నారు రాయలు. ఆమె మొహం ముడుచుకున్న పద్మంలా ఉంది.
‘‘మీ మనసులోని మాట సెలవీయండి దేవీ! మేము దాసులం’’ చేతులు కట్టుకొని వినయం నటించారు.
‘‘మాట తప్పరుగా’’ ఆమె ఆ అవకాశం కోసమే వేచి ఉంది.
‘‘ఉహు..’’ చేతిలో చేయివేసి దగ్గరికి లాక్కున్నారు.
ప్రభువు కౌగిలి నుండి విడివడుతూ…
‘‘తీరా కోరాక కాదనకూడదు మరి’’ మరింతగా నొక్కి చెప్పింది ఆమె.
‘‘అంత అనుమానమా దేవీ! మన కులదైవం విరూపాక్షస్వామి పాదాల మీద ఆన. సరేనా!’’ ఆమెను దగ్గరికి తీసుకున్నారు.
‘‘మన కుమారుడు తిరుమల రాయలు’’ సంకోచంతో ఆగింది.
‘‘ఊఁ! తిరుమల రాయలు’’ రెట్టించారు మురిపెంగా.
‘‘తిరుమల రాయలకు పట్టాభిషేకం చేయండి ప్రభూ! ఇదే నా విన్నపం’’ తీరా చెప్పేశాక రాయలేమంటాడోననే భయాందోనలు ఆమెను చుట్టుముట్టినై.
రాయలు మందహాసం చేశారు. ఆమె హృదయం తేలికపడి వికసించిన పద్మమయింది.
‘‘ఇంతేనా! దీనికా ఇంత గుబులు! తిరుమలరాయలు గాక మరెవరికి పట్టాభిషేకం చేస్తాం? యువరాజు మాకు వారసుడని మీరెరుగరా!’’ ఆదరంగా ఆమెను సందిట చేర్చుకున్నారు.
‘‘అదికాదు ప్రభూ! కొన్నాళ్ళుగా నాకెందుకో కొన్ని ఉత్పాతాలు గోచరిస్తున్నాయి. పీడకలలొస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యానికి భావి సామ్రాట్‌ మన చిరంజీవి కావాలనే నా కోరిక ప్రభూ!’’ అభ్యర్థించింది. ఆమె మీద వీరేంద్రుని నీడ పూర్తిగా కమ్ముకొంది.
‘‘కాదనం. తొందర ఎందుకు? యువరాజుకింకా ఆ వయస్సు రాలేదుగా!’’ అనునయించాడు.
‘‘తొందరపడక తప్పదు ప్రభూ!మీరు విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన విధానాన్ని గుర్తుచేయక తప్పటం లేదు. మన్నించండి ప్రభూ! తరతాలుగా ఈ సింహాసనం తండ్రి బిడ్డల వారసత్వంగా రావటం లేదు. అదే నా బాధ. మన యువరాజు తండ్రికి వారసుడిగా రాజు కావాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత త్వరగా తిరుమలరాయలకు పట్టాభిషేకం చేస్తే నా మనసు అంత కుదుటపడుతుంది ప్రభూ!’’ అన్నపూర్ణాదేవి తల్లిమనసు ఆర్థ్రమైంది.
‘‘సరే దేవీ! రేపే అప్పాజీవారితో సంప్రదించి నిర్ణయిస్తాం’’ అన్నాడు మెత్తగా.
‘‘అప్పాజీవారిని అడిగితే ఈ పని జరుగుతుందనే ఆశ నాకు లేదు ప్రభూ!’’ మెల్లగా అంది.
రాయలు ఉలిక్కిపడ్డారు. వినకూడనిదేదో విన్నట్లు దిగ్గున లేచారు.
‘‘ఏమిటిది దేవీ! అప్పాజీవారినే అనుమానిస్తున్నారా! వారు మీకు పితృసమానులు’’ కఠినంగా అన్నారు.
‘‘పితృసమానులే గానీ పితృదేవులు కారుగా! వారు ఈ పట్టాభిషేకాన్ని అంగీకరిస్తారని నేననుకోను. వారి ఆలోచన వేరువిధంగా ఉంది ప్రభూ!’’ అన్నపూర్ణాదేవి కంఠం మృదువుగా ఉన్నా స్పష్టంగా ఉంది.
‘‘ఏమిటది?’’
‘‘తమ కుమారుడు గోవిందరాయలను విజయనగర సింహాసనంపై…’’
ఆమె మాట పూర్తికాకముందే రాయలు అసహనంగా కదిలాడు. రెండు చేతులతో చెవులు మూసుకుంటూ ‘‘ఆపు అన్నపూర్ణాదేవీ! మీ అభియోగానికి ఋజువులున్నాయా?’’ ప్రశ్నించాడు.
ఆమె మాట్లాడలేదు.
‘‘సరే! ఈ పట్టాభిషేకానికి అప్పాజీవారు అంగీకరిస్తారనే నమ్మకం నాకుంది. ఇలాగైనా వారిమీద మీకున్న అనుమానం తొలగిపోతుంది’’ అంటూ వేగంగా వెళ్ళిపోతున్న రాయలను వెనుకనుంచి చూస్తూండిపోయింది అన్నపూర్ణాదేవి. ఆమె కనుకొలకుల్లోంచి అశ్రుబిందువులు ధారగా చెక్కిళ్ళను తడుపుతున్నాయి.
తనకేమైంది?తనేం చేసింది?ఏంమాట్లాడిరది?ప్రేమమూర్తిని నొప్పించింది. ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత ప్రణయ సంగమాన్ని నిరాకరించి కైకలా వరం కోరింది. కైకలాగానా? అంటే వంశనాశనం కోరిందా? అలా జరగటానికి వీల్లేదు. పితృసమానులైన అప్పాజీవారు ప్రోద్భలం చేయనిదే రాయలతో తన వివాహం జరిగేదేనా? ఆయనకే అలాంటి దురాలోచన ఉంటే రాయలను ఏనాడో మట్టుబెట్టగల శక్తిమంతుడు గదా! తననెంత ఆదరంగా చూస్తాడు! తను ఎందుకింత కఠినంగా మారిపోయింది? ఎన్నడూ లేనిది రాయల మనసునెంత నొప్పించింది! తీవ్రంగా పరితాపం చెందింది అన్నపూర్ణాదేవి.
‘‘జగన్నాథ! జగన్నాథ! మంచిపని చేశావు. నీ కుమారుని భవిష్యత్‌ నీకు ముఖ్యంకదా! అదే నిరూపించి వీరమాతవనిపించుకుంటున్నావు’’ అంతదాకా చాటున ఉండి అన్నీ విన్న వీరేంద్రుడు కపట ప్రశంస చేశాడు.
‘‘ఛీ! ఆలుమగల మాటలు కూడా చాటుగా వింటున్న నీదేం సంస్కారం’’ ఆమె వ్యథగా ఛీత్కరించింది.
‘‘నాకు ఆ తేడాలేం లేవులేమ్మా! నేననుకుంటున్నట్లు జరిగితే అది చాలు. రాయల మాటలను ఆ కుటిల తిమ్మరుసు అంగీకరిస్తాడన్న నమ్మకం మాత్రం నాకు లేదు’’ వ్యంగ్యబాణం విసిరి వెళ్ళిపోయాడు వీరేంద్రుడు.
అన్నపూర్ణాదేవి ఆవేదనగా శయ్యాగతురాలై రోదిస్తున్నది. మంజరి కొంత సంకోచిస్తూనే ఆమె దగ్గరికి వెళ్ళింది.
‘‘దేవిగార్కి ఉపచారాలేమైనా చేయమంటారా’’ మెత్తగా అడిగింది.
‘‘వద్దు మంజరీ! నా మనసేం బాగాలేదు’’ బేలగా అంది.
‘‘పానీయం ఇవ్వమంటారా దేవీ’’ అనునయంగా అడిగింది మంజరి.
‘‘వద్దు. ప్రభువు మనసు నొప్పించాను. వీరేంద్రుని మాటకి లోనయ్యాను’’ రోదించింది రాణి.
‘‘వారి మాటలకేముంది దేవీ! ఏది యుక్తమో మహారాజుగారికి తెలుసు. తిమ్మరుసులవారున్నారుగా! మీరు కలతపడకండి’’ ఆమెను ఓదార్చుతున్నదే గానీ మంజరి మనసు మనసులో లేదు. అన్నపూర్ణాదేవి కోరిక ఎటువంటి దుష్ఫలితాల్ని కల్గిస్తుందోనని ఆమెకూ భయంగా ఉంది. వీరేంద్రుని నీడ ఇంతింతై అన్నపూర్ణాదేవి మందిరంమీదే కాదు యావత్‌ విజయనగర సామ్రాజ్యమంతటా పరుచుకుంటున్నట్లనిపిస్తున్నది.
* * *
చంద్రప్ప తెచ్చిన సమాచారం విని తిమ్మరుసు ఆశ్చర్యపోయారు. బాధపడ్డారు. రాయలు మంత్రిమండలి సమావేశం ఏర్పాటుచేశారనీ, తిరుమల రాయల పట్టాభిషేకం గురించి ప్రకటించారనీ,తనతో మాటమాత్రం సంప్రదించ కుండా రాయలీ నిర్ణయం తీసుకోవటం తిమ్మరుసు మంత్రిని కలవరపెడుతోంది.
రాయలు తనను శంకిస్తున్నారా? రాయలలో ఎందుకీ మార్పు? ఇది దేనికి నాంది?
ఆలోచిస్తుండగానే రాయలు తిమ్మరుసు మందిరంలోకి ప్రవేశించారు.
సాధారణంగా మహారాజు దగ్గరికి మంత్రి వెళ్ళటం ఉంటుంది గానీ మంత్రి దగ్గరికి రాజు వెళ్ళటం ఉండదు. రాయలు, తిమ్మరుసుల బంధం ఇటువంటి సూత్రాలకు అతీతమైంది. రాయల్ని చూస్తూనే తిమ్మరుసు మనసులోని ఆలోచనలు, అనుమానాలన్నీ మాయమైనాయి.
‘‘రాయా! రండి. ప్రభువులవారి రాకకు కారణం’’ ఆదరించారు.
తిమ్మరుసును చూస్తూనే రాయలు తాను వచ్చిన పని ఎలా చెప్పాలా అని కొంచెం సందిగ్ధపడ్డారు.
‘‘అప్పాజీ! మిమ్మల్ని సంప్రదించకుండానే ఒక నిర్ణయం తీసుకున్నాం. అది చెప్పాలని ఇలా వచ్చాం.’’
‘‘ఏమిటది రాయా! నా దగ్గర దాపరికం దేనికి’’ తిమ్మరుసు ప్రోత్సాహంగా మాట్లాడారు.
‘‘మా కుమారుడు తిరుమలరాయలకు పట్టాభిషేకం చేస్తామని అన్నపూర్ణాదేవికి వాగ్ధానం చేశాం. ఆ ప్రకారం యువరాజు పట్టాభిషేకానికి నిర్ణయించాం. ఏర్పాట్లు మొదలయ్యాయి.’’
తిమ్మరుసు ఊహించిందే గదా! ఆయన కళ్ళల్లో రాయలపట్ల పితృప్రేమ తొణికిసలాడుతోంది.
‘‘చాలా సంతోషం రాయా! కానీ యువరాజు ఇంకా పసివారు గదా! అయినా మీరు దక్షిణ జైత్రయాత్రకు వెళ్ళేముందు ఈ పట్టాభిషేకం శుభంగా అన్పించదు.’’
తిమ్మరుసు మాటలకు రాయల మొహంలో రంగులు మారినై.
‘‘శుభంగా ఉన్నా లేకున్నా మేమిచ్చిన మాట అమలు జరిగి తీరాల్సిందే’’ పట్టుదలగా అంటూ వెళ్ళిపోతున్న రాయలకేసి నిస్సహాయంగా చూశారు తిమ్మరుసు. ఆ మేధోనాయకునికేదో స్ఫురించింది. వెంటనే రామలింగ నాయకునికి కబురు చేశారు.
* * *
‘‘అంతా మనం అనుకున్నట్లుగానే జరుగుతున్నది’’ వీరేంద్రుడు
ఉద్యానవనంలో కంటకుడితో ఆనందం పంచుకున్నాడు.
‘‘తిమ్మరుసు ఈ పట్టాభిషేకానికి ఒప్పుకోడనే అనుకున్నాను. ఆశ్చర్యంగా
ఉందే’’ కంటకుడు ఆశ్చర్యపోయాడు.
‘‘అదే తిమ్మరుసు తెలివి. ఒప్పుకోకపోతే రాయలకు అనుమానం రాదూ! తిమ్మరుసు ఒప్పుకోకపోతే మన పని మరింత సులువయ్యేది’’ వీరేంద్రుడి గొంతులో కోపం ధ్వనిస్తున్నది.
‘‘ఎలా?’’ కంటకుడు అడిగాడు.
‘‘ఎలాగంటే తిమ్మరుసు తిరుమలరాయల పట్టాభిషేకాన్ని తిరస్కరిస్తే రాయలకి తిమ్మరుసుకు మధ్య వైరం పెరిగేది. ఇప్పుడలా కాదే! ఇద్దరూ ఒకటిగా ఉన్నంతకాలం మనకి అగచాట్లే’’ వీరేంద్రుడు చేతులు నులుముకుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
హఠాత్తుగా కంటకుడు హుషారుగా చిటికేశాడు.
‘‘ఆఁ! నాకో ఉపాయం తట్టింది.’’
వీరేంద్రుడు కంటకుడి దగ్గర ఆతృతగా చేరాడు.
‘‘ఏమిటది చెప్పు’’
‘‘తిమ్మరుసు అయిష్టంగా ఒప్పుకున్నట్లు రాజుకు తెలుసు. తిమ్మరుసు ఒప్పుకున్నట్లే నటించి కుతంత్రంతో పట్టాభిషేకాన్ని ఆపేసినట్లు సృష్టిస్తే!’’
‘‘అవును. ఆ ముసలి మంత్రి అలాంటివాడే! జనం నమ్ముతారు కూడా! కానీ ఎలా? ఆ! యువరాజుని హత్యచేసి ఆ నేరం తిమ్మరుసు మీద వేస్తే ఒక దెబ్బకి రెండు పిట్టలు’’ వీరేంద్రుడు ఉత్సాహంగా చెప్పాడు. కంటకుడు నివ్వెరపోయాడు. అతనెంత దుర్మార్గుడైనా హత్యచేసే ఆలోచన లేదు. అందునా యువరాజుని.
‘‘అలా వద్దు. ఏదో ఒకటి చేసి పట్టాభిషేకం ఆపేద్దాం’’ కంటకుడు వారించాడు.
‘‘అవును. ఏదో ఒకటి చేయాలి. అవును…’’ అంటూ దగ్గరిగా వస్తూనే ఛురికతో కంటకుడ్ని ఓ పోటు పొడిచాడు.
‘‘ఇదే చేసేది. నాకే సలహాలు చెప్పేవాళ్ళు నాకెందుకు జగన్నాథ!’’ పెద్దగా నవ్వి, వీరేంద్రుడు భృత్యుల్ని పిలిచాడు.
‘‘ఈ శవాన్ని తుంగభద్రలోకి విసిరేయండి’’ హూంకరించాడు.
* * *
పుత్రశోకాన్ని తప్పించటమెవ్వరితరం! గండమనాయకుడు విషణ్ణ వదనంతో తిమ్మరుసు ఎదురుగా ఆసీనుడై ఉన్నాడు.
‘‘విచారించకండి గండమనాయకా! మీ కుమారుడు కంటకుడు మాయం కావటం గురించి నాకు వీరేంద్రుని మీద అనుమానంగా ఉంది’’ తిమ్మరుసు గండమనాయకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
‘‘ఆ వీరేంద్రుని సాంగత్యం వద్దని ఎన్నోమార్లు చెప్పి చూశాను మహామంత్రీ! అతను ఎప్పుడూ పగబట్టిన తాచులా కన్పిస్తాడు. చివరకు నా కుమారుడినే బలితీసుకున్నాడు’’ గండమనాయకుని కంఠం రుద్దమైంది.
‘‘మీ శోకానికి కొంతవరకూ మేమూ బాధ్యులమే!వీరేంద్రుని ఆనాడే పంపేసి ఉంటే ఈనాడు విజయనగరానికీ కలత వచ్చేదికాదు’’పశ్చాత్తాపపడ్డారు తిమ్మరుసు.
‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ దుర్మార్గుడ్ని కత్తికో కండగా…’’ గండమనాయకుడి ఆవేశాన్ని వారించారు మంత్రి.
‘‘అందుకు తగినవాడే! ఇప్పుడు మన కర్తవ్యం యువరాజుని రక్షించుకోవటం’’ ఉపదేశించారు.
‘‘యువరాజునా?’’ ఆశ్చర్యపోయాడు గండమనాయకుడు.
‘‘యువరాజుకు పట్టాభిషేకం అంటే మేము కాదంటామనీ, తద్వారా మాకూ, రాయలవారికీ మధ్య చిచ్చుపెట్టాలనీ వీరేంద్రుని పన్నాగం. పట్టాభిషేకానికి మేము సమ్మతి తెలపటంతో ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు వీరేంద్రుడు మమ్ములను రాయలవారి దృష్టిలో ఎలా నీచునిగా చూపించాలా అని ఆలోచిస్తాడు. అది నెరవేరటానికి వాడికున్న ఆయుధం యువరాజు. ఆ పసివాడి ప్రాణానికి వీరేంద్రుడు ముప్పు తలపెడతాడని నాకు తోస్తున్నది. మీరు కాపలా కట్టుదిట్టం చేయండి. అహర్నిశలు యువరాజు భద్రత మీద దృష్టి పెట్టండి. వీరేంద్రుని సంగతి ఇంక అటో ఇటో తేల్చేసే సమయం వచ్చేసింది. శత్రుశేషం ఉంచటమే మేము చేసిన పొరపాటు’’ తిమ్మరుసు మాటలతో గండమనాయకుడు కార్యోన్ముఖుడయ్యాడు.
* * *
అన్నపూర్ణాదేవి చాలా ఆందోళన పడుతోంది. మూడురోజులుగా తిరుమలరాయలు మూసినకన్ను తెరవటం లేదు. రాజవైద్యులు వైద్యం చేస్తున్నారు. రోగనిర్థారణ కాలేదు. మందులు పనిచేస్తున్నట్లు కన్పించవు.
‘‘జగన్నాథ స్వామీ! నా బిడ్డని కాపాడు. నీ దర్శనం చేసుకుంటాను.’’ ఆమె ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంది.
‘‘జగన్నాథ! జగన్నాథ!జగన్నాథుడేం చేస్తాడమ్మా!అసలువారు వేరే ఉన్నారు.’’
‘‘వీరేంద్రా! ఆపు నీ వాచాలత. నీ మాటలే నాకు చేటుతెచ్చాయి.’’ ఆవేదనతో అంది రాణి.
‘‘ఉన్నమాటంటే ఎందుకమ్మా అంత కోపం? ఇది మామూలు జ్వరం కాదు. విషజ్వరం. ఎవరో కావాలని తెప్పించింది.’’
‘‘ఎవరికా అవసరం ఉంది? నాలుగునాళ్ళలో పట్టాభిషేకం చేసుకుంటున్న నా చిట్టితండ్రికి కీడు చేయతలపెట్టిన కఠినచిత్తులెవరుంటారు’’ ఆమె కంఠం రుద్దమైంది.
‘‘ఇంకెవరు ఆ…తి… జగన్నాథ!’’ ఇంతలో శ్రీకృష్ణదేవరాయలవారు వేం చేస్తున్నారనే వార్త రావటంతో వీరేంద్రుడు తప్పుకున్నాడు.
అతనేం చెప్పదలిచాడో ఆమెకు అవగతమయింది.
కళ్ళనీళ్ళతో మ్రాన్పడి యువరాజు దగ్గర కూర్చుండిపోయింది. కృష్ణదేవరాయలు విచ్చేశారు. కుమారుని అపస్మారక స్థితి ఆయన మనసును కలచివేస్తుంది.
‘‘ఇదేమి విధిలీల దేవీ! కుమారునికి పట్టాభిషేకమని అనుకున్నామో లేదో! ఇటువంటి అనారోగ్యం. రాజవైద్యులకు అంతుబట్టని వింతరోగం’’ రాయలు వ్యాకులపడ్డాడు.
‘‘నాకు అంతా అగమ్యంగా ఉంది ప్రభూ! మన నీడను కూడా మనం నమ్మలేని పరిస్థితి. మా మందిరంలో మాకు తెలీకుండా ఏదో కుట్ర రాజవైద్యులను మార్పు చేస్తే మంచిదేమో’’ తల్లి హృదయంతో అన్నది.
‘‘మీ అనుమానం ఎవరిమీద?’’ రాయలు కుమారుని శయ్యచెంత చేరాడు.
‘‘లేదు… లేదు…’’ తడబడిరది.
‘‘నాయనా తిరుమలరాయా! మాకేసి ఓసారి చూడు తండ్రీ’’ కృష్ణదేవరాయలు కుమారుని స్పృశిస్తూ పదేపదే పిలిచారు. కుమారుడు
కళ్ళు తెరువనే లేదు. అన్నపూర్ణాదేవి రోదిస్తున్నది.
‘‘ఎవరక్కడ? రాజవైద్యుల్ని వెంటనే రమ్మనండి’’ బిగ్గరగా ఆదేశించిన రాయలు తలపట్టుకొని అక్కడే కూలబడిపోయారు. కుమారుని చల్లబడ్డ శరీరం ఆయన గుండెల్ని బద్దలుచేసింది. భావి విజయనగర సామ్రాట్టు మరణంతో కృష్ణరాయల తేజం మందగిస్తున్నట్లు మందిరంలో దీపాలు మలుగుతున్నాయి.
* * *
తిరుమలరాయల మరణవార్తతో విజయనగర సామ్రాజ్యం శోకసంద్రంలో మునిగిపోయింది. కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకున్నప్పటికీ, చికిత్స జరుగుతుండగానే యువరాజు రాజమందిరంలోనే జబ్బుపడి మరణించటం కృష్ణరాయల్ని అమితంగా కుంగదీసింది. తిమ్మరుసు మొదలునరికిన అరటిచెట్టులా కూలబడిపోయాడు. అన్నపూర్ణాదేవి దుఃఖానికి అంతేలేదు.
‘‘నేను మొదట్నుంచీ అనుమానిస్తూనే ఉన్నా’’ వీరేంద్రుడు సమయం చూసి మరో పాచిక విసిరాడు.
శోకసముద్రంలో మునిగిఉన్న కృష్ణదేవరాయ దంపతులు ఏమిటన్నట్లు తలెత్తిచూశారు.
‘‘జగన్నాథ! ఇదంతా ఆ తిమ్మరుసు మంత్రి కుట్రే. అవును!మన యువరాజుకు పట్టాభిషేకం చేయటం ఆయనకు సుతరామూ ఇష్టంలేదు. కానీ మెప్పుకోసం పైకి ఒప్పుకున్నట్లు నటించాడు. ఆపై ఆటంకం తొలగించుకోవటానికి ఇలా పసివాడని కూడా చూడకుండా రాజవైద్యులని లోబరుచుకుని విషప్రయోగం చేయించాడు’’ తీవ్రంగా ఆరోపించాడు వీరేంద్రుడు.
‘‘ఎవరక్కడ?’’ కృష్ణరాయని కళ్ళు అగ్నికణికల్లా ఉన్నాయి.
‘‘రాజవైద్యుల్ని తక్షణం ప్రవేశపెట్టండి’’ నిప్పు కురుస్తున్నదా స్వరంలో.
రాజాజ్ఞ ప్రకారం రాజవైద్యులు వచ్చారు. వారు నివేదించిన ప్రకారం యువరాజు మరణం విషప్రయోగం వల్లనే జరిగిందని నిర్థారణ అయింది.
కృష్ణరాయని కోపానికి అంతులేదు. కోపంలో మనిషికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం నశిస్తుంది. అదే జరిగింది.
‘‘సాళ్వ తిమ్మరుసు మంత్రిని బంధించండి’’ కృష్ణరాయని శోకతప్త హృదయం చీకట్లో కూరుకుపోయింది. విజయనగర జ్యోతిని చెరసాలలో బంధించి ఆర్పేసే ప్రయత్నం బలంగా ప్రారంభమయింది.
అన్నపూర్ణాదేవికేం పాలుపోవటం లేదు. వీరేంద్రుడెన్ని విధాల చెప్పినా తమ కుమారుని మరణానికి తిమ్మరుసు కారకుడంటే ఆమె అంగీకరించలేక పోతుంది. తిరుమలాంబతో మొరపెట్టుకుంది. పట్టపురాణి కూడా రాయలవారికి ఎంతో చెప్పిచూసింది. కాల్చి ఎర్రబడిన ఇనుము మీద సమ్మెట దెబ్బల్లా పుత్రశోకంతో అడలుతున్న రాయల హృదయంపై వీరేంద్రుని మాటల ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. ఎవరేం చెప్పినా వినేస్థితిలో రాయలు లేరు. పుత్రశోకంతో బాటు విజయనగర సామ్రాజ్య రక్షకుడు తిమ్మరుసుకు వాటిల్లిన ఆపద గురించి అన్నపూర్ణాదేవి పలువిధాల విలపించింది. ఆమేకాదు, యావత్‌ సామ్రాజ్య ప్రజలు కంటతడి పెట్టారు. రాజరికంలో అనుగ్రహ ఆగ్రహాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అనుభవంలో చూస్తున్నారంతా. మంజరి, చంద్రప్పలతో సహా, రాజప్రముఖులంతా తిమ్మరుసును రక్షించే మార్గాల కోసం అన్వేసిస్తున్నారు.
* * *
శ్రీకృష్ణదేవరాయలు కొలువుతీరారు. కానీ అది మునుపటిలా రసవంతంగా లేదు. విషాద నిర్వేదంగా కఠిన శిలలు ఆసీనులైన వంచనా వేదికగా ఉంది. రాయలకత్యంత సమీపంలో ఆసీనుడైన వీరేంద్రుని చూసి అంతా కోపంతో ఊగిపోతున్నారు. పైకి ఏమీ అనలేకున్నా అందరికీ తెలుసు ఈ కుట్రలో ప్రధాన పాత్రధారి వీరేంద్రుడేనని.
తిమ్మరుసు మంత్రి ఇప్పుడు మంత్రి కాదు. ఆయన్ని బందీగా సభకు తీసుకొచ్చారు. సభ యావత్తూ తిమ్మరుసునా స్థితిలో చూసి విచారంతో తల దించుకుంది. తిమ్మరుసు రాయలు తనను శంకిస్తున్నాడన్న నిజాన్ని జీర్ణించుకోలేని వేదనతో కుంగిపోతూ కన్పిస్తున్నారు. కృష్ణరాయలు తిమ్మరుసు నేరాన్ని విచారించమని న్యాయపరిషత్తును ఆదేశించారు.
ప్రధాన న్యాయాధికారి రాజాజ్ఞను శిరసావహిస్తూ తిమ్మరుసు మంత్రి పట్ల గౌరవాభిమానాలను బయటికి కనపరచకుండా కఠినత్వాన్ని కప్పుకుంటూ విచారణ చేశాడు.
‘‘మీ పేరు’’
‘‘సాళ్వ తిమ్మరుసు’’
‘‘శ్రీశ్రీశ్రీ మహారాజుగారి కుమారుడు తిరుమలరాయలకు విషప్రయోగం చేయించి చంపించారని మీమీద అభియోగం. దీనికి మీ సమాధానం?’’
తిమ్మరుసు నిర్వేదం నిండిన కళ్ళతో కృష్ణరాయలకేసి ఓసారి చూశారు. శ్రీకృష్ణదేవరాయలు అధోవదనుడై ఉన్నారు. దేవేరులంతా ఖిన్నులై ఉన్నారు. తాను జీవితమంతా శ్రమించి నిర్మించిన విజయనగర మహాసామ్రాజ్య సభాపరిషత్తును పరికించారు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. తిమ్మరుసులవారేం చెప్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు.
‘‘నాపై మోపబడిన అభియోగాన్ని ప్రభువువిశ్వసిస్తే నేను చెప్పవలసినదేమీ లేదు.’’
తిమ్మరుసు గొంతులో రాయలపైన ప్రేమాభిమానాలు చెక్కుచెదరలేదు. రాయలు తలెత్తి తిమ్మరుకేసి ఓసారి చూసిఉంటే విజయనగర సామ్రాజ్య భవిష్యత్తు మరోలా ఉండేది.
‘‘రాజవైద్యులను ప్రవేశపెట్టండి’’ న్యాయాధికారి ఆజ్ఞతో రాజవైద్యులు వచ్చారు. గడగడ వణుకుతున్నారు. వీరేంద్రుని వైపు చూశారు. అతని బెదిరింపు కనుసైగతోనే!
‘‘ఏమీ భయం లేదు.జరిగింది చెప్పండి. ఈ సాళువ తిమ్మరుసు రాకుమారునికి విషప్రయోగం చేయమని మీకు చెప్పాడా?’’ ప్రధాన న్యాయాధికారి ప్రశ్న.
‘‘అవును. వైద్యం పేరిట రాకుమారునికి విషప్రయోగాన్ని చేయమన్నారు.’’
‘‘ఎవరు?’’ గద్దించాడు న్యాయాధికారి.
‘‘మ…మ… మహామంత్రిగారే!’’ తిమ్మరుసు వైపు చూపించారు.
సభయావత్తూ శిలలా అయిపోయింది. తిమ్మరుసు మ్రాన్పడిపోయాడు. వీరేంద్రుడు పైకి ఆశ్చర్యం నటిస్తున్నా లోలోపల ఎంతో సంతోషిస్తున్నాడు.
అన్నపూర్ణాదేవి స్పృహ తప్పి పడిపోయింది. తిమ్మరుసు చూపు రాజవైద్యుల నుంచి వీరేంద్రుని మీదికి మరలి ఆగిపోయిందో క్షణం. ఆ తర్వాత ఆయన చూపు శ్రీకృష్ణ దేవరాయల మీద నిలిచింది.
ఈ చక్రవర్తి తన రాయలేనా? విధి ఎంత విచిత్రమైనది! ఆనాడు ఈ రాయలను మహారాజు చంపమంటే చంపలేదు. రక్షించి సింహాసనమెక్కించి విశాల సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. రాజ్యమే కావాలనుకుంటే ఆనాడు తనను అడ్డుకునేవారెవరు? ఆరేళ్ళ పసివాడిని బలిగొనేంత కసాయివాడా తిమ్మరుసు? ఈ నింద పడటంకన్నా దీనిని రాయలు అంగీకరించటమే నరకంగా ఉంది. వీరేంద్రా! నీ పన్నాగం సఫలమయిందని సంతోషిస్తున్నావా! విజయనగర సామ్రాజ్యలక్ష్మి వైభవం మసకబారుతోందా! ఇంతకాలం తాను వేయికళ్ళతో కాపాడుకుంటూ వస్తున్న తన రాయల చుట్టూ ఏదైనా ముళ్ళకంచె పడిరదా!
ఆవేదన, ఆందోళనలతో ఆ వృద్ధమంత్రి పరితపిస్తున్నాడు. తనమీద మోపబడిన నిందకన్నా సామ్రాజ్య రక్షణకు సంబంధించిన ఆవేదనే ఆయనలో ఎక్కువగా ఉప్పొంగుతున్నది.
ప్రధాన న్యాయమూర్తి తిమ్మరుసు మంత్రికి ఇలా వివరించాడు`
‘‘విజయనగర సామ్రాజ్య నిర్మాతగా ఈ రాజ్యం మిమ్ములను ఆప్తుడిగా భావించింది. ప్రభువులు తండ్రిసమంగా ఆదరించారు. నలభై ఏళ్ళు ఈ రాజ్యానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. అయినా ప్రభువులు ఈ సందర్భంలో మీకు కృతజ్ఞత చూపించనవసరం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యంలో గతంలో మీరు మీ బాధ్యతను పూర్తిగా నెరవేర్చలేదు. ఆనాడు మహారాజుగా
ఉన్న ప్రభువు సోదరుడు మహారాజుగారి కళ్ళు పీకించమని మీకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను మీరు నెరవేర్చక వారిని మోసగించి మేక కన్నులు చూపి ద్రోహం చేశారు. ఇప్పుడు రాకుమారుని విషప్రయోగం చేసి చంపించటం వల్ల మళ్ళా రాజద్రోహిగా నిలిచారు.’’
మళ్ళీ సభనుద్దేశించి ‘‘ఈ సాళువ తిమ్మరుసు బ్రాహ్మణుడు కాబట్టి మరణశిక్ష విధించలేము. ఈ నేరానికి శిక్ష వీరి రెండు కళ్ళు పొడిచేయటమే!’’ తీర్పు ముగించి ప్రధాన న్యాయమూర్తి మహారాజుకేసి నిస్సహాయంగా చూశాడు.
శ్రీకృష్ణదేవరాయలు తలదించుకుని కనుకొలకుల్లో ఊరుతున్న చెమ్మని కొనగోటితో విదిలించారు. తన కళ్ళు పీకకుండా కాపాడి చక్రవర్తిని చేసిన అప్పాజీకి తానిచ్చే బహుమానం ఆయన కళ్ళు పొడిపించటమా! హా దైవమా! నాకెందుకీ శిక్ష విధించావు?
రాయలు మూగవ్యధతో తీర్పును ఆమోదిస్తున్న సూచన ఇచ్చారు.
‘‘మరో రెండునాళ్ళకు సూర్యోదయానికి ఈ సాళువ తిమ్మరుసు కళ్ళు పొడిచే శిక్ష అమలు చేయమని ప్రభువుల ఆజ్ఞ’’ ప్రధాన న్యాయాధికారి చివరిగా వినిపించాడు.
తిమ్మరుసు హతాశుడైపోయారు. గోవిందరాయల కళ్ళు ఎరుపెక్కినై అతనేనాడో తిరుగుబాటు ప్రకటించేవాడు. కానీ తిమ్మరుసు వల్లే ఆగిపోయాడు.
శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం మీద అద్భుత వైభవంగా విరాజిల్లుతున్న ఆ దృశ్యాన్ని, ఆపాదమస్తకం రాయలమూర్తిని కళ్ళారా, మనసారా నిండుగా చూసుకున్నారు అప్పాజీ. కన్నీటి తెర కమ్ముకుంది. రాయల రూపం మసకబారింది. ఇంతలో రాజభటులు వచ్చి తిమ్మరుసును కారాగారానికి తీసుకెళ్తుండగా ప్రభువు పరితాపంతో దిగ్గున లేచి సౌధాంతరాళంలోకి నిష్క్రమించారు.
సభ అంతటా కలకలం.
‘‘ద్రోహం…అన్యాయం’’అరిచారెవరో! అంతటాఅదే నినాదాలు. వెళ్తున్న తిమ్మరుసు ఆగి వెనుదిరిగాడు. చేతులు జోడిరచి సభకు వందనం చేసి ఇలా అన్నారు.
‘‘అయ్యా! మీ అందరికీ శతాధిóక వందనాలు. విధి బలీయం. విజయనగర సామ్రాజ్య పరిరక్షణకు ఇంతకాలం మీరందించిన సేవలు, త్యాగాలు అనుపమానాలు. దయచేసి ఇకమీదట కూడా ఇదేవిధంగా మహాసామ్రాజ్య భారాన్ని వహించండి. ఇదే నా కడసారి ప్రార్థన’’ తిమ్మరుసు భటుల వెంట వెళ్ళిపోతుంటే సభ యావత్తూ కన్నీరు మున్నీరుగా అయింది.
రాజరికం ఇచ్చిన ఫలం ఇదా! అంతటి మహామంత్రికే ఈ గతిపడితే తమలాంటివారి గతి ఏమిటి? ఏ విషకీటకం ప్రభువు మెదడులో జొరబడిరది? తమలో తాము గుసగుసలాడుకుంటున్న ఆ సభలో వీరేంద్రుడు మీసం మెలేయటం చంద్రప్పకు అసహనీయంగా ఉంది.

You may also like

Leave a Comment