Home వ్యాసాలు బోయి భీమన్న

బోయి భీమన్న

by Dr. Kasarla Rangarao

బోయి భీమన్న (19 సెప్టెంబరు 1911-16 డిసెంబర్ 2005) మధ్య జీవించారు. సామాజిక మార్పు కు సామాజిక చైతన్యాన్నాశించి రచనలు చేశారు.అతిపేద దళిత కుటుంబంలో పుట్టి స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆశావహ దృక్పథంతో జీవించారు. వీరి “గుడిసెలు కాలిపోతున్నై” అనే రచన ఒక బలమైన సామాజిక సమస్యను చర్చకు పెట్టింది. వీరి సాహిత్యకృషికి ( “గుడిసెలు కాలిపోతున్నై” కి) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సామాజిక కృషికి ” పద్మభూషణ్” , రాజా లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు ,కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్ లు లభించాయి. “పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న” గ్రంథం హైమవతి గారు రచించారు. బోయి భీమన్న గారి బహుముఖీన సాహిత్య , సామాజిక దృక్పథానికి ఈ గ్రంథం చుక్కాని వంటిది. జాతీయతతో తాను పుట్టిపెరిగిన దేశీయ వాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే ఆత్మగౌరవం తో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది. ఈ అనుగుణంగా ఉండటమంటే అస్పృశ్యతకు వ్యతిరేకంగా ,కులాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడటమే. ఈ వాస్తవికాల ద్వారానే ఎదిగి కులనిర్మూలన పంథా రావాలని ,వేయేళ్ళ బానిసత్వానికి కారణమైన మన యీ అనైక్యత పోవాలని బోయి భీమన్న , అంబేద్కర్ ల ఆశయం, ఆకాంక్ష. సామాజిక న్యాయం లభించిన తర్వాత ప్రతిభ ,ప్రజ్ఞ , జిజ్ఞాస కలవారిని మాత్రమే ఎన్నిక చేయాలని కులప్రాతిపదికగా చేయరాదని వారి పోరాటం. ఇదే వారి కులనిర్మూలనోద్యమానికి ప్రాతిపదిక. దాదాపు 15 వరకు కవిత్వ సంపుటులు, 13 నాటకాలు , 8 వచన రచనా సంపుటుల ద్వారా తన అభ్యుదయ , ప్రగతిశీల భావాల్ను బోయి భీమన్న గారు ప్రకటించారు. బోయి భీమన్న సాహిత్య పీఠం ద్వారా ప్రముఖులకు అవార్డు ప్రధానం జరుగుతుంది. ఇది శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వారి ద్వారానే నిర్వహించబడుతుంది. మన బోయి భీమన్న వర్థంతి 16 డిసెంబర్ సందర్భంగా అన్ని రకాల హింసను వ్యతిరేకించి ,సమన్వయ దృక్పథాన్ని ఆచరించిన ఆయన పరిణితిని , పోరాట శీలాన్ని స్మరించుకుంటూ ఆచరిద్దాం.

You may also like

Leave a Comment