Home వ్యాసాలు భారతదేశం మనకు ఏం నేర్పిస్తుంది

భారతదేశం మనకు ఏం నేర్పిస్తుంది

by Devanapalli Veenavani

(What can India Teach us – Max Muller)

గొప్పమాట !భారతదేశం ప్రపంచానికి  ఏం  నేర్పుతుంది? భారతీయులకు ఏం నేర్పుతుంది?ఎక్కడైనా  సగటు పౌరునికి దేశంనుంచి నేర్చుకొనే అవసరం ఏముంది?  దేశం నుంచి నేర్చుకోవడం అంటే  చరిత్రనా, మనుషులా, పాలకుల ప్రస్థానమా?అసలు నీగురించి నీవు ఏమిచెప్పగలవు? నీదేశం గురించి ఏమి తెలుసుకున్నావు? నిన్ను,నీ  స్వభావాన్ని దేశానికి జతచేసే ప్రభావితాంశాలు ఏవై  ఉండవచ్చు? ఇలా  ప్రశ్నించుకున్న సంధర్భాలలో అంతిమంగా, ప్రతి జాతిలోనూ “ విశ్వాసం” అనే మూలమొకటి ఏర్పడి,సంఘీభావంతో స్థిరపడి, ఆచార వ్యవహారమై మనగలిగి, సంస్కృతిగా పరిణమించి దేశఅస్థిత్వమై నిలబడి ఒక ప్రవహంగా కొనసాగడం కనిపిస్తుంది. ఇక్కడ విశ్వాసమే మూలం. విశ్వాసం ఏర్పడడానికి తత్వం ఎరిగి ఉండడం ప్రధానం,ఈ ఎరుకను అనేక కోణాల్లో  పరిశీలించి పరికల్పన చేయడానికి  దోహదపడే వారే తాత్వికులు. అంటే ప్రతిజాతి,దేశం మూలాల వెనుక బలమైన తాత్విక భూమిక ఉండే తీరాలి. అదే ఆ జాతి చోదక శక్తి.అది తెలుసుకున్నప్పుడే ఆ జాతిని  అర్థం చేసుకోగలం, సంబందబాంధవ్యాలను నెరపగలం. భారతదేశంమాటకువస్తే ఆ  చోదక శక్తి నిన్ను నీవు తెలుసుకో ( Know thy self ) మూలంగా అన్ని వాదభేధాలను గౌరవిస్తూ  ఏకం సత్ బహుధా వదంతి గా కర్మానుసారంగా జీవించడమే కనిపిస్తుంది.  ఇది మన గురించి మనం అర్థంచేసుకున్నది,మరి విదేశీయులు మనల్ని ఎలా అర్థం చేసుకున్నారు,ఎలా అన్వయించుకున్నారు, మనగురించి ఏం మాట్లాడుకున్నారు అని తెలుసుకోవాలనుకున్నపుడు  ఈ దేశాన్ని సందర్శించి  ఇక్కడి విషయాలను తమ దేశానికి పరిచయం చేస్తూ ఎంతో విలువైన చారిత్రకసేవచేసిన  హుయాన్త్సంగ్, మార్క్ పోలో వంటి ఎంతోమంది   విదేశీ యాత్రీకులు కనిపిస్తారు. వారెవరూ ఇక్కడ పరిపాలనా లక్ష్యాలతో రాలేదు, కేవలం పరిశీలనకోసం  మాత్రమే వచ్చారు.అయితే మరికొంతమంది విదేశీయులు పరిపాలనకోసమే ఈదేశానికి వచ్చారు, వారికి పరిశీలనతోపాటు పాలనకు అనువైన వాతావరణం సృష్టించడం,తమతరఫున పాలకులను తయారు చేయాల్సిన అవసరం రెండూ ఏర్పడ్డాయి.అలాటి పరిస్థితుల్లో  మనదేశ చారిత్రక, పరిపాలక  అంశాలతో వెలువడిన అనేక గ్రంథాలలో జర్మనీ దేశస్థుడు, ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ రాసిన భారతదేశం మనకు ఏం నేర్పుతుంది (What can India Teach us) ఒకటి.

ముల్లర్ (1823-1900) జర్మనీకి చెందిన భాషాశాస్త్రవేత్త, భాషల అధ్యయనాన్ని ఫిలాలజీ అంటారు కనుక ఫిలాలజిస్టు అని పిలవబడ్డాడు. ముల్లర్ తండ్రి విల్హెల్మ్ ముల్లర్ ఒక కవి.ముల్లర్ నాలుగేళ్ల చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు.ముల్లర్ తన దేశభాష జర్మనీలోనూ,మనదేశపు అనాదిభాష సంస్కృతంలోనూ ఇంగ్లీష్లోనూ ప్రావీణ్యం సంపాదించాడు.నారాయణ పండితుడు రాసిన గ్రంథం హితోపదేశని ముల్లర్ 1844లోఅనువదించి ప్రచురించాడు. 1845లో పారిస్ వెళ్ళి అక్కడ యూజిన్ బరనోఫ్(Eugeneburnouf)  యొక్క ప్రభావంతో అప్పటికే ఫ్రెంచ్ భాషలో వెలువడిన ఋగ్వేదభాష్యం edito princepsని సేకరించడం మొదలు పెట్టాడు. మనగ్రంథాలు పారిస్ ఎలా చేరాయంటే అప్పటి ఈస్ట్  ఇండియా కంపనీ  సంస్కృత భాషలో ప్రావీణ్యం ఉన్న వారిని ప్రోత్సహించిన కారణం చేత అనేక  మూల గ్రంథాలను సేకరించి సంస్కృత భాష పరిశోధకులకు పంపించేది.అలాగా పారిస్లోఉన్న యూజిన్ బరనోఫ్కు అందినవి. ముల్లర్ పారిస్నుంచి 1846లో  ఆక్సఫోర్డ్ యూనివర్సిటీ గడపలో కాలుమోపి  రెండేళ్లలో ఆధునిక యూరోపియన్ భాషావిభాగంలో డిప్యూటీ ప్రొఫెసర్ అయ్యాడు. అక్కడ 1868 నుంచి కంపారిటివ్ ఫిలాలోజీ ఆచార్యులుగా పనిచేసి 1875 లో పదవీవిరమణ చేశాడు.  ముల్లర్ ఇంగ్లాండ్ వచ్చిన సమయంలో ఈస్ట్ ఇండియా కంపనీ తన  ఖర్చుతో సాయణాచార్యుల ఋగ్వేదభాష్యాన్ని పూర్తిగా ఇంగ్లీష్లో తేవాలని పురమాయించారు. 1859 లో అప్పటికి అందుబాటులో ఉన్న  మానుస్క్రిప్ట్స్ ఆధారంగాHistory of ancient Sanskrit Literatureఅనే పుస్తకాన్ని రాశాడు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషాచార్యులు హెచ్ హెచ్ విల్సన్ మరణించినప్పుడు సంస్కృత భాషా ఆచార్యులు కావాలని  ఆశపడి లండన్కు  విదేశీయుడైనందువల్ల  భంగపడ్డాడు.అయితే   అతని సేవలు విశ్వ విద్యాలయనికి , ఈస్ట్ ఇండియా కంపనీకి  మరోరకంగా వినియోగించబడ్డాయి.   ముల్లర్   సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ థాట్  పేరుతో ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు. ముల్లర్ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న పుస్తకం What can India Teach us కాకుండా Chips from German Workshop, జర్మనీ భాషలో Auld Lang Syne,Deutsche Liebe అనే పుస్తకాలను రాశాడు. పదవీ విరమణ చెందాక అప్పటికి తానెంతో గ్రహించినహిందూ,బౌద్ద,జైనతత్వ సాహిత్యాన్ని,చైనీయులతావో, కన్ఫ్యూసియస్  తత్వాల్ని,జొరాస్ట్రీయానిన్ తత్వాన్నిSacred Books of Eastగా తేవాలని సంకల్పించి ఆ బృహత్తర కార్యక్రమానికి సంపాదకునిగా ఉన్నాడు.ఈ  Sacred బుక్స్ ఆఫ్ ఈస్ట్ అనేది  చాలా విలువైన కృషి. మొత్తం 51 విలువైన గ్రంథాలు ఈ సిరీస్ పేరుతో వెలువడ్డాయి. ఇందులో భాగంగా ముల్లర్ హిందూగ్రంథాలు ఖండోద్యోగ ఉపనిషద్, కేనోపనిషద్,ఐతరేయ అరణ్యక,కౌశితకి బ్రహ్మణ,వాజసనేయిసంహిత ఇంకా ముండక,కఠ,తైత్తరీయ,బృహదారణ్యక, శ్వేతాస్వాతార,ప్రశ్న , మైత్రేయని ఉపనిషత్తులు ,అలాగే  బౌద్దానికి చెందిన దమ్మపాద, సుత్తనిపాతలు   ఉన్నాయి. ఇవేకాక  వాయు,రుద్ర,మారుత శ్లోకాలు,ఋగ్వేద సమాచారంవంటివి ఈయన అనువదించినవాటిలో ఉన్నాయి. ముల్లర్ ఇంగ్లీష్లో కూడా  అనేక పుస్తకాలు రాశారు.అందులో Six Systems of Phylosophy,Ramakrishna:His life and sayings, The Vedanth Phylosophy వంటివి ప్రాచుర్యం పొందాయి.

ప్రస్తుత పుస్తకంభారతదేశం మనకు ఏం నేర్పుతుంది  విషయానికివస్తే 1882లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చేత  ప్రచురించబడిన ఈ పుస్తకం ముల్లర్ భారతదేశంలో నియమించబడిన ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారుల అవగాహనకోసం కేంబ్రిడ్జ్  విశ్వ విద్యాలయంలో  వెలువరించినఏడు ఉపన్యాసాల సమాహారం.భారతదేశంలో 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం తర్వాత పరిపాలన అంతా ఈస్ట్ ఇండియా కంపనీనుంచి ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలనకు వెళ్ళిన తరుణంలో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పనిచేయడానికి నియమించబడిన అధికారులను ఇంపీరియల్ సివిల్ సర్వీస్ అధికారులుగా ఎంపిక చేసేవారు. 1886నుంచి  ఈ  సర్వీస్లోకి భారతీయులను అనుమతించారు. అయితే అప్పట్లో లండన్ వెళ్ళి పరీక్షలు వ్రాసే పరిస్థితి ఉండేది. 1922 నుంచి మాత్రమే  ఢిల్లీలో పరీక్షకు అనుమతించడం జరిగింది. మొదట లండన్లో ఎంపికైన ఇంపీరియల్ సర్విస్ అధికారులకు కావలసిన శిక్షణనిచ్చేక్రమంలో ముల్లర్ భారతదేశంగురించి ఇచ్చిన ఉపన్యాసాలు ఇవి. స్వతంత్రానంతరంఇంపీరియల్ సివిల్ సర్వీస్ని ఇండియన్ సివిల్ సర్వీస్గా మార్చి ప్రస్తుతం  ఉత్తరాఖండ్ ముసొరిలో  శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ముల్లర్ ఈ ఉపన్యాసాలు వెలువరించే కాలానికి సంస్కృతంనుంచి అప్పటికే ఎన్నో మూలగ్రంథాలను  ఇంగ్లీష్లోకి అనువదించి ఉన్నాడు.మరెన్నో గ్రంధాలను అధ్యయనం చేశాడు.సంస్కృతంతోపాటు గ్రీకు,లాటిన్ భాషలలోని తాత్విక గ్రంథాలను తులనాత్మకంగా అధ్యయనం చేశాడు,విశ్లేషించాడు,అర్థం చేసుకునేందుకు  ప్రయత్నంచేశాడు.కేంబ్రిడ్జ్  విశ్వవిధ్యాలయంలో సంస్కృత ఆచార్యులుగాఉన్న  Edward Byles Cowellకి అంకితం ఇస్తూ ఇప్పటివరకు సంస్కృత భాషలో చేసిన పరిశోధనలు తురుపుముక్కఅనీ ఇంకా చేయవల్సింది ఎంతో ఉందని చెప్పాడు.ముల్లర్ తన ముందుమాటలో  ప్రతీ యేటా  ఎంతోమంది యువ అధికారులు  భారతదేశానికి  వెళ్తున్నారని,వారు మరెంతో కృషిచేయాల్సి ఉందని,ఉపన్యాసం ఇవ్వడం తనకు ఇష్టమని,ఉపన్యాసంలో ఎంతో విషయాన్ని క్లుప్తంగా అవసరానికి అనుగుణంగా చెప్పేవీలుంటుందని  చెప్తూ ఋగ్వేదాన్ని,దాని  భాష్యాన్ని రాయడం  తన జీవిత కాలస్వప్నమని అందుకు సహకరించిన  నా దత్తదేశానికి (భారతదేశం), అక్కడి గొప్ప  రాజనీతిజ్ఞులకు ఋణపడి ఉంటానని రాశాడు.

ఆక్స్ఫర్డ్  విశ్వవిద్యాలయం ముల్లర్ ఉపన్యాసాలను 1882లో  సంకలనంగా తెచ్చినప్పుడు 442 పేజీల గ్రంథంగా ఉంది. ప్రతి ఉపన్యాసానికి తగిన పాద సూచికలు,అర్థవివరణలు చేరుస్తూ పోవడంవల్ల గ్రంధవిస్తారం జరిగింది.ప్రతీవ్యాసం లోలోపలికి వెళ్ళినప్పుడు ఆ వివరణలు ఎంతో ముఖ్యమయినవిగానూ, అర్థవంతమైనవిగానూ ఉన్నాయి.ప్రస్తుతం అందుబాటులోఉన్న ఆంగ్లపుస్తకం ఈవివరణలను పరిహరించి రెండువందల పేజీలకు కుదించి కేవలం ఉపన్యాసానికి పరిమితంఅవడం  ఒకరకంగా మనఓపికలేనితనానికి నిదర్శనం. అయినప్పటికీ ప్రతీభారతీయుడు తప్పనిసరిగా చదువుకోవాల్సిన పుస్తకం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పుస్తకం వచ్చిన నూటానలభై ఏళ్ళకు కూడా ఇది తెలుగు భాషలోకి అందుబాటులో లేకపోవడం, రాకపోవడం. అయితే.ప్రస్తుతం కొన్ని విశ్వవిధ్యాలయల్లో మొదటి ఉపన్యాసాన్ని చరిత్ర  పాఠ్యాంశంగా చేర్చారు.

            ముల్లర్ వెలువరించిన ఈ ఉపన్యాసాలలో మొదటిది   భారతదేశం మనకు ఏం నేర్పుతుంది, తదుపరి హిందువుల స్వభావం,సంస్కృత సాహిత్యంపై మానవాభిలాష ,వేదసంస్కృతి ప్రత్యేకమైనదా,వేద మతం, వేద ఆరాధన, వేదము మరియు వేదాంతంశీర్షికలుగా వేద కాలమూ,సంస్కృత సాహిత్యం నిబిడీకృతం చేసుకున్న చరిత్ర చుట్టూతా కొనసాగుతాయి. ముల్లర్ ఉపన్యాసాలు చదివేటప్పుడు  అతని లోతైన పరిశీలన దృష్టి ,తనదికాని  దేశంయొక్క సంస్కృతిలోని పలుకుబడులను కూడా పట్టుకొనేంత సహనం, తానెనుకున్న భాషా విశేషాలను ప్రపంచ సమకాలీన భాషాసాహిత్యాలతో  పోల్చి విశ్లేషించగల నేర్పు  చదువరిని ఒప్పించగల సామర్థ్యం ఉన్నట్లు తెలుసుకుంటాం. ముల్లర్ తన ఉపన్యాసాలలో వేదకాలాన్ని ఆదిమమైందని, పురాతనమైనదనీ  అయినా మానవ మేధాశక్తిని అపూర్వంగా ప్రదర్శించిందని చెప్తూ తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 

          ముల్లర్ , యువ అధికారులను  ఉద్ధేశించి మాట్లాడుతూ భారతీయులకు మానవస్వభావంపట్ల లోతైన అవగాహన ఉన్నదని యూదుల జడ్జిమెంట్ ఆఫ్ సోలోమన్ కథను ఉదాహరించిచెప్తాడు. మనం చిన్నప్పుడు బాగా విన్న కథనే అది. ఇద్దరు తల్లులు ఒక పసిపిల్లవాన్ని తన కొడుకంటే తన కొడుకని పోట్లాడుతూ న్యాయంకోసం వచ్చినప్పుడు  పసిపిల్లవాన్ని రెండు ముక్కలు చేసిచెరో ముక్క ఇవ్వాలని తీర్పు చెప్తాడు సోలోమన్. అయితే పిల్లవాన్ని ముక్కలు చేయడం ఇష్టం లేని ఆమెనే తల్లి అని గుర్తించడం ఆ కథలో ఉంటుంది.  అదే కథ బౌద్ధుల త్రి పీటకాల్లోనూ ఉంటుంది.  ఇక్కడి కథలో రాజు, తనవద్దకి తీర్పు కోసం వచ్చిన ఇద్దరు స్త్రీలకు ఎలాగా ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచించి దానిని ఆ ఇద్దరు తల్లులకే వదిలేస్తాడు.  ఆ ఇద్దరు తల్లులు ఆ పిల్లవాడిని చెరోవైపు లాగడంతో పిల్లవాని శరీరానికి గాయాలై ఏడుస్తుంటాడు. ఒక స్త్రీ  దాన్ని చూసి తట్టుకోలేక రెండో స్త్రీకే ఆ పిల్లవాణ్ణిఇచ్చిచేయమని కోరుతుంది ఎందుకంటే తల్లి గనుక పిల్లవాడి శరీరం యొక్క గాయాలని, దానివల్ల వస్తున్న దుఃఖాన్ని ఓర్వలేదు కనుక. ఆమెనే అసలు తల్లని ఆ స్త్రీకే  పిల్లవాణ్ణి ఇవ్వాలని తీర్పు చెప్తాడు. ఇలామానవ సహజస్వభావం పట్లభారతీయులకు   జ్ఞానం ఉందనిఅలాగే భారతదేశంలో ఉన్న న్యాయ సూత్రాల చరిత్ర గ్రీకు,రోమన్, జర్మనీతో  పోలిస్తే భిన్నంగా ఉన్నా ప్రతి ఏటా కొత్త న్యాయసూత్రాలు బయటికి వస్తున్నాయని,  మను స్మృతి కనీసం క్రీస్తుపూర్వం ఐదువందలసంవత్సరాలనుంచి ఉండవచ్చునని మీరు భారతదేశంలోపనిచేసే అవకాశం వచ్చినప్పుడు వీటి గురించి తెలుసుకుంటారని,సంస్కృతం మీకు మొదట చాలా కష్టంగానూ ఇబ్బందిగాను అనిపించవచ్చు కానీ సంస్కృతం ఎన్నో లోతైన అంశాలని కలిగి ఉందనీ,  మీకు తీరిక  దొరికినప్పుడల్లా మీరు పనిచేయడానికి కావలసినంత విషయం అక్కడ ఉందని అంటాడు.

ప్రపంచంలోని  ఏ సమస్యతీసుకున్నా,  అది ఉన్నతవిద్యైనా,,ప్రజాస్వామ్యవ్యవస్థైనా,, న్యాయసూత్రాలైనా,ఆర్థికశాస్త్రమైనాఇలా ఏ అంశాన్ని తీసుకున్నా  ఎక్కడా లేనివిధంగా భారతదేశం మీకు ఒక ప్రయోగశాలకు కావాల్సిన అన్ని అంశాలని సరఫరా చేస్తుంది. బయటప్రపంచం వివిధ సాంకేతికఅంశాలమీద పనిచేస్తూ ఉన్నప్పుడు మానవమేధయొక్క చరిత్ర, తనగురించి తాను అధ్యయనం చేసుకోవడం విషయాల్లో భారతదేశం ముందుంది. మానవమేధకు సంబంధించినటువంటి అంశాల్లో మీరు ఏ కోణంనుంచైనాఅంటే అది భాషకావచ్చు,మతంకావచ్చు,పురాణాలుకావచ్చు,తత్వంకావచ్చు,న్యాయసూత్రాలుకావచ్చు,ఆచారాలువ్యవహారాలుకావచ్చు, కళాకౌశlలాలు కావచ్చు,శాస్త్రీయమైన అంశాలు కావచ్చు వాటినితెలుసుకోవాలనుకుంటే  మీరు భారతదేశానికి  వెళ్ళండి,  మీకు అక్కడ చాలా ముఖ్యమైన అంశాలు, అవీ  కేవలం భారతదేశంలోమాత్రమే  లభిస్తాయని సూచిస్తాడు.అలాగే గ్రీకు, లాటిన్,జర్మన్,సంస్కృతంనుంచి అనేక ఉదాహరణలు చూపిస్తూ  భాషలన్నిటికీ ఒకే మూలంఉండే అవకాశం ఉందని ప్రోటో లాంగ్వేజ్ ఒకటి ఉండి ఉండవచ్చని, అది తన మూలంనుంచి వివిధ భాషలుగా రూపాంతరం చెందిందని నమ్మకంతో ఉంటాడు.భారతీయూలలో ఆర్యులు వేరుఅనే సిద్ధాంతాన్ని నమ్మినవాడు కనక భారతదేశంలోని సంస్కృతంకూడా అలాగా ప్రోటో ఆర్యన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందని ఊహ చేస్తాడు. గ్రీక్ శిల్పాన్ని,ఈజిప్షియన్  స్పింక్స్ని,బాబిలోనియన్ ఎద్దులవంటి వాటిని ప్రతీదేశం పురాజ్ఞాపకాలుగా చూపిస్తారుగానీ అంతకన్నా ముఖ్యమైనది మనభాష, మిగిలిన వాటికన్నా ఎన్నో అద్భుతమైనవిలువైన విషయాలను భాష నుంచి గ్రహించే అవకాశం ఉందని , భాషల యొక్క శాస్త్రీయతనిఅర్థం చేసుకోవడం  సంస్కృతం లేకుండా  చేయలేమని అంటాడు.

రెండవ ఉపన్యాసంలో  హిందువుల స్వభావం గురించి  విశ్లేషణ  చేస్తాడు. ముల్లర్ దృష్టిలో హిందువులు అంటే భారతదేశంలోనివసించే  అందరూ.ముల్లర్ ఉపన్యాసకాలంనాటికి స్వతంత్ర భారతావనిస్పూర్తి మొదలై విస్తరిస్తున్నది.  క్రిమినల్ ట్రైబ్స్ చట్టం -1871 అమలులోకి వచ్చింది. విలియంజోన్స్  స్థాపించిన ఆసియాటిక్ సొసైటి వివిధ అంశాలమీద శాస్త్రీయ అధ్యయనం మొదలుపెట్టింది. జేమ్స్ మిల్ రాసిన హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా విస్తృతంగా ప్రచారంలో ఉంది.అంతేకాక భారతీయులు అందరూ ఒకే మూలనికి చెందిన వారు కాదని, ఆర్యుల జాతి ఏనాటి కాలంలోనో ఇక్కడకి వచ్చి స్థానీయులను జయించి స్థిరపడ్డారనే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంవల్ల భారతీయల స్వభావంపట్ల యురోపియన్లలో అనుమానం ఉందనీ మనం అర్థం చేసుకోవచ్చు. ముల్లర్ తనరెండవ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ భారతీయుల స్వభావం పట్ల  సంశయం అవరసం లేదనీ హిందువులు ముక్కుసూటి స్వభావులని  ప్రొఫెసర్ విల్సన్ చెప్పిన మాటల్ని ఉటంకిస్తాడు. అలాగే ఇండియన్ సివిల్ సర్వెంట్స్ కి చదవమని చెప్పే జేమ్స్ మిల్స్ రాసిన హిస్టీరి ఆఫ్ బ్రిటిష్ ఇండియా పుస్తకం  అనేక విధాలుగా వినాశకరంగా ఉందనీ,జేమ్స్ మిల్  అది హిందువుల స్వభావాన్ని ఫ్రెంచ్ మిషనరీల భావనతో కూర్చాడు తప్ప నిజంగా హిందువుల స్వభావాన్ని అంచనా వేయలేకపోయాడని చెప్తూ ఆ పుస్తకంలోని  అభ్యంతరకరమైన అంశాలను ప్రస్తావిస్తాడు.   జేమ్స్ మిల్ చేసిన కొన్ని వాఖ్యలు ఉదాహరణకు  బ్రాహ్మణుడు అబద్ధాల చీమలపుట్ట అని పేర్కొనడం. ఇంకా భారతీయులు తగువులమారులని (Litigant) పేర్కొనడం సరికాదని చెప్తూ  ముల్లర్  అప్పటి మద్రాస్ గవర్నర్ గా ఉండి రైత్వారీ విధానం ప్రవేశపెట్టి  ఎన్నో ఏళ్లు  భారతదేశంలో ఉన్న థామస్ మన్రో, హిందువులు వ్యాజ్యస్వభావులుకారని వెలిబుచ్చిన మాటల్నిగుర్తుచేస్తాడు. జేమ్స్ మిల్ చేసిన మరో ఆరోపణ  బ్రాహ్మణుడు  తలుచుకుంటే తాను  అనుకున్న వారిని చచ్చేదాకా వదిలిపెట్టడు అని.దాని గురించి మాట్లాడుతూ గడిచిన కాలంలో ఇంగ్లాండులో పదివేల ఉరిశిక్షలు విధిస్తే బెంగాల్లో కేవలం ఒకే ఒక ఉరిశిక్ష విధించబడిందని గుర్తు చేసి ఆ ఆరోపణ సత్యదూరమైందని తెలియజేస్తాడు.

          భారతీయులనిజమైన  స్వభావం ప్రతిఫలించేది గ్రామాలలోని ఒక సాధారణ పౌరుడు. అతని గ్రామమే అతని ప్రపంచం,ఎంతో అరుదుగా అతను ఇతరులతో సంబంధాలు కలిగి ఉంటాడని చెప్తూ , పురుషుడు తన భార్య బిడ్డలతో తన గ్రామాన్ని ప్రపంచంగా భావిస్తూ ఉంటాడు,  ఒకే గ్రామంలో ఉన్న వారి మధ్య అసత్యం అనేది అసలు లేదు, రచ్చబండవద్ద రావి చెట్టువద్దనో, గంగాజలం మీదనో  ప్రమాణం చేయడం వాళ్లకిఅలవాటు. భారతీయుల ముక్కుసూటితనం,  నిజాయితీగా  ఎదగడంకోసం న్యాయసమ్మతం కాని సంపాదనను తిరస్కరించడం, న్యాయంకోసం పాకులాడ్డం అనేది ముఖ్యంగా కనిపిస్తాయి. మార్కుపోలోఅన్నట్లు భారతీయులు దేనికోసమైనా సరే అసత్యం చెప్పరని, అనేకమందివిదేశీయాత్రికులు, పాలకులు, సందర్శకులు భారతీయుల సత్యవాదత్వం గురించి చేసినటువంటి వివరాల్ని ముల్లర్ వివరిస్తాడు.సత్యనిరూపణకు నాటి కాలంలో పాటించిన అంశాలను, రామాయణంలో రాముడు తన తండ్రికి  ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పధ్నాలుగేళ్లు ఏళ్ళు వనవాసం చేయడం,రాముడు,జాబాలీకి మధ్య జరిగిన సంభాషణ, కఠోపనిషదులోని యమ నచీకేతుల  సంభాషణలను వివరిస్తూ  ఇవన్నీ భారతీయులకు  సత్యంమీద ఉన్నటువంటి పట్టుదల తెలియజేస్తుందంటాడు.అలాగే సత్యం  పలకడంలోని  ఔచిత్యాన్ని మహాభారతంలోని కౌశిక కథని ఉదహిరిస్తూ  వేయి అశ్వమేధయా యాగాలుచేసినా  సత్యమే వాటన్నిటి పైన నిలబడుతుందిఅని భారతం  చెప్పిన మాట,  ఏదైతే నిన్ను బాధిస్తుందో అది నువ్వు ఇతరులకు ఎప్పుడూ చేయకు అని  యాజ్ఞవల్క్యుడుచెప్పిన మాట, ప్రతి మనిషిలోనే అంతరాత్మ అంటూ ఉంటుందని అంతరాత్మనేఆ మనిషి యొక్క మంచి చెడుల్ని గమనిస్తూ సాక్షిగా ఉంటుందన్నభారతీయుల నమ్మకాన్ని తెలియజేస్తాడు. సత్యం పట్ల భారతీయులకు ఉన్న భావనల్ని జేమ్స్  మిల్ పుస్తకంలో అభ్యంతరకరంగా పేర్కొన్నదనీ అటువంటి అభిప్రాయాలతో  మీరు అక్కడ ఉన్నప్పుడు పని చేయలేరని భోధిస్తాడు. ఇలాహిందువుల స్వభావం, నైతికత గురించి చెప్పే క్రమంలో ముల్లర్ సునిశితమైన అధ్యయనాన్ని చూపించే ఒక వాక్యాన్ని వాడడం ఆశ్చర్యం అనిపించింది,అన్నం  ఉడికినదని చెప్పడానికి కొన్ని మెతుకుల్ని పరీక్షిస్తే సరిపోతుంది అనిమనం  అంటాం కదా ఆ మాటనే వాడుతాడుముల్లర్. 

మూడవ ఉపన్యాసం సంస్కృతభాష,సాహిత్యంపట్ల మానవాభిలాష. కేవలం సామాన్యజనులతో వ్యవహార నడపడానికి హిందుస్తానీ,తమిళ్లాంటి భాషలు నేర్చుకుంటే సరిపోతుంది కానీ భారతీయుల మతము,పురాణాలు,తత్వం అర్థం చేసుకోవడానికి సంస్కృత భాషనేర్చవకోవడం అవసరం అనీ,  ప్రతి సివిల్ సర్వెంట్ సంస్కృత భాష నేర్చుకోవడంనే నేను ప్రోత్సహిస్తానని చెప్పుకున్నాడు.సంస్కృతం నేర్చుకుంటే ఏమొస్తుంది, భారతీయులే తమ పురాతన భాష,సాహిత్యాల నేర్చుకోవడానికి సిగ్గుపడుతుంటే మనమెందుకు నేర్చుకోవాలి అని అనుమానం మీకు వస్తుంది. సంస్కృతం మృత భాషగా ఉన్నది నిజమే,బౌద్ధం విస్తరించిన  అశోకుని కాలంలో అనేక శాసనాలు,  ఆ తదనంతరం అన్ని ప్రాంతీయ రాజ్యాలు స్థానిక భాషలో తమ పరిపాలన కొనసాగించాయనేది నిజం.కనుక బౌద్ధ కాలం నుంచే సంస్కృతంప్రభావం తగ్గిందని  చెప్పవచ్చు.  అయితే గ్రీకు,లాటిన్ భాషలను  వారి వారి దేశాల్లో అర్థం చేసుకోవడంకన్నా భారతీయులు సంస్కృతాన్నిబాగా  అర్థం చేసుకోగలుగుతారు. కలకత్తాలో విద్యోదయ, బాంబే నుంచి షడ్ దర్శన చింతనిక వంటివి సంస్కృత భాషలో వెలువడే మ్యాగజైన్స్, ప్రయాగ నుంచి దయానంద సరస్వతి సంస్కృత  పుస్తకాలను హిందీలోకి అనువదించే ప్రయత్నం చేశారు.  భారతదేశంలో బెంగాలీ, మరాఠీ, హిందీవంటి భాషలలో వెలువడే వివిధ మాగజైన్స్లో సంస్కృత వ్యాసాలూ  వెలువడుతున్నాయి. బుద్ధుని కాలంలో ప్రజల భాషలో వ్యవహారాలు కొనసాగించినప్పటికీ అధికారిక పత్రాలు, శాసనాలు సంస్కృతంలోనే వెలువడ్డాయి. ఈ అంశాలను మీరు గమనించాలని యువ అధికారులకు ఉద్భోద చేస్తాడు.

నాటి ఈస్ట్ఇండియా కంపెనీ, బ్రిటీష్ భారతప్రభుత్వం, భారతదేశంలో కొంతమంది స్థానిక మరియు ఇతర యూరోపియన్కుచెందిన సంస్కృత పరిశోధకులను, సంస్కృత మూలగ్రంథలను సేకరించి వాటిని పరిష్కరించాలని కోరినప్పుడుఅవి దాదాపు పదివేలవరకు దొరికాయి. యూరోప్లో సాంస్కృతిక పునరుజ్జీవనకాలంలో చర్చించబడిన భారతీయ సంస్కృత గ్రంథాలు, నాటకాలు,  చరిత్రలవంటివి  సంస్కృతం అందించే జ్ఞానంఎంత గొప్పదో గుర్తించాయనీ చెప్తూ జనసామాన్యంలోసంస్కృతానికి  సంబంధించిన కొన్ని ముఖ్యమైన పలుకుబడులనుపరిచయం చేస్తాడు.అవి,  అందరూ ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే ఎందుకు మూర్ఖులు ఒకరు ఒకరు గాయపరచుకుంటారు, బీదవాడే ఆకలి రుచి ఎరిగిన వాడు,  మన శరీరము సముద్రం మీద నురగ వంటిది మన జీవితం పక్షి,  మనం ఎవరినైతే ప్రేమించామో  వారు ఎప్పుడు శాశ్వతంగా ఉండరు, ఇల్లు భార్య పిల్లలు సంపద ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది , అవి మనకు చెందినవి కావు,  మనకు చెందినవి  మనం చేసుకున్న పాపపుణ్యాలే, మనిషి పాతవస్రం విడిచి కొత్త వస్త్రం వేసుకున్నట్టు మన ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరానికి వెళ్తుంది, ఆత్మను నిప్పు కాల్చలేదు నీరు ముంచలేదు గాలి ఆర్పలేదు, తన గురించి తాను తెలుసుకోవడం కన్నా గొప్ప జ్ఞానం ఏదీ లేదు, జ్ఞాని అంటే తన గురించి తాను తెలుసుకునే వాడే వంటి  ఎన్నో పలుకుబడులని పేర్కొంటాడు.మానవ వికాసం భాషలో ప్రతిఫలిస్తుందని ముల్లర్ భావన. 

నాలుగవ  ఉపన్యాసం వేద సంస్కృతి ప్రత్యేకమైనదాఅనే ప్రశ్నతో మొదలౌతుంది. కవితాత్మకంగావెల్లడించబడిన వేదం, వేదసంస్కృతి కేవలం పరిశోధకుల కోసమే కాకుండా అందరికోసం  పరిరక్షించవలసినటువంటి గొప్పవిషయమని,  ఒకవైపుఆదిమంగానూ, సహజంగానూ, సాధారణంగానే ఉన్నట్టు అనిపించినా ఎంతో ఆధునికమైనసమస్యలని కూడా వేదం  చర్చిస్తుందనీ, వేదాలను కనుగొనకముందు మానవభావనకు  చరిత్రలేదని చెప్పడం అతిశయోక్తి కాదనీ, గ్రీకు,  ఇటలీ పర్షియా, బాబిలోనియావంటి సంస్కృతులను  వేదసంస్కృతితో  పోల్చి వేదసంస్కృతిప్రత్యేకతలను తెలియజేస్తాడు.

ఐదవఉపన్యాసం వేదంలో పేర్కొన్న ఆరాధనలగురించి ఉంటుంది. భారతీయుల బహుదేవతారాధన ఏ విధంగా ఇతర సంస్కృతుల బహుదేవతారాధన విధానాలకు భిన్నమైనదో అర్థమయ్యేలాగా వివరిస్తాడు.ముల్లర్ దృష్టిలో భారతీయులు నిజమైన బహుదేవతారాధకులు కాదు, ఒకే శక్తిని  అనేక రూపాలలో కొలిచేవారు. ప్రకృతిలో కనిపించిన ఒక్కో శక్తికి ఒక్కో పేరు పెడుతూ వెళ్లారుతప్పఅదినిజమైన బహుదేవతారాధన కాదు.ముల్లర్ ఇక్కడ హేనోథీసం అనే  సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వివరిస్తాడు.  ముల్లర్ మాటల్లో చెప్పాలంటే “monotheism in principle and polytheism in fact”,అంటే మూలంలో ఒకే ఈశ్వరుడే  ఉన్నా పరిస్థితులకు,ఆకాంక్షలకు తగిన రూపంలో ఆరాధించడం. ఈవివరణ ఎంతో సహేతుకంగా ఉంటుంది. వేదాలలో క్రమంగా భౌతికంనించి ఆధ్యాత్మికానికి,మానవుడినుంచి దివ్యత్వానికి చేసే ప్రయాణం ఉంటుంది. ముల్లర్ దృష్టిలో వేద కాలం యొక్క మతముప్రకృతి ఆరాధననే. వేదం పేర్కొన్న నదుల ప్రస్తావననుబట్టి వేదకాలంనాటికి భారతదేశం భౌగోళికంగా ఎంత విశాలమైందో తెలియజేయబడుతుంది.

ఆరో ఉపన్యాసంలో వేదకాలంనాటి దేవతమూర్తులకు సంబంధించి వివరాలను వివరిస్తాడు.వేద దేవతలను భూమికి, ఆకాశానికి, స్వర్గానికి చెందిన  మూడుస్తరాల్లో విభజిస్తాడు. అగ్ని,వాయు,వరుణ ఎందుకు పూజించబడినాయొ , అవి ఏవిధంగా భూమిమీద జీవించడానికి కారణం అవుతాయో చెప్తాడు. ముల్లర్ ఇంద్ర పేరుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ  ఇంద్ర అనేపేరు గ్రీకులోగాని, లాటిన్లోగాని,జర్మన్లోగానీ మరిఇంకెక్కడా కానీ కనిపించదనీ, అది కేవలం వేదంలో మాత్రమే కనిపిస్తుందని బహుశా అది ఆర్యన్ కుటుంబంనుంచి పూర్తిగా విడిపోయిన తర్వాత ఏర్పడి ఉండొచ్చును అనే భావన చెప్తాడు. ఇంద్ర ఆకాశానికి దేవుడు అలాగే పిడుగుకి పర్జన్య అన్న పేరు గురించి విస్తారంగా చర్చిస్తాడు. భూమికి ఆకాశానికి చెందిన దేవతలు కాకుండా స్వర్గ దేవతల గురించి మాట్లాడుతాడు. పర్జన్యం, వరుణ శబ్ధాలమీద ముల్లర్ చేసిన వివరణలు ఆయన  అవగాహనను, అందుకోసం చేసిన ప్రయత్నాన్ని పట్టిస్తాయి.

          ఏడవది మరియు చివరి ఉపన్యాసంలో వేదము- వేదాంతం గురించి ఉంటుంది. భాష గురించిన చర్చ వచ్చినప్పుడు భారతీయులు లిపిని ఎప్పటినుంచి వాడడం అలవాటుగా చేసుకున్నారు,  ఒకవేళ చేసుకుంటేకాలనిర్ధారణ ఏది, ఎందుకోసం  చేశారు, అసలు ఏవిధంగా ఈసంస్కృతం  ఒక పరిపూర్ణమైన భాషగా రూపొందింది తేల్చడం క్లిష్టమైన పని అని, ఇప్పటివరకుసంస్కృత భాషకు సంబంధించినటువంటి వివరాలు ఏవి దొరకలేదనీ,  క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దానికి భారతీయులకి లిపిలేదనీ మెగాస్తనిస్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావన చేస్తాడు.  అయితే భారతీయులు ప్రత్తిమీద వాణిజ్య ఒప్పందాలను రాసినవిషయాన్ని గుర్తుచేస్తాడు.అత్యధికంగా జ్ఞాపకశక్తి ఆధారంగానేవేదకాలం భాషాసాహిత్యాలు  కూర్చబడ్డాయని,  పరిరక్షించబడ్డాయని,  ఋగ్వేదం ఒక్కదాంట్లోనే దాదాపు లక్ష యాభై మూడు వేలు ఎనిమిది వందల ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయని పదివేల ఐదు వందల శ్లోకాలున్నాయని, అయితే  దీనికి ముందు యే విధంగా భాషాపరిజ్ఞానం అభివృద్ధి చెందిందని తెలుసుకోవడం చాలాకష్టమైన పని చెప్తాడు. భారతీయులువేదపరిజ్ఞానాన్ని ఏ విధంగా నేర్చుకుంటారు అన్న దానిమీద ఐ – త్సింగ్  అనే చైనా యాత్రికుడురాసి పెట్టినవివరణ ప్రకారం భారతీయులు  వ్యాకరణాన్ని ఇతర అంశాలను నేర్చుకోవడానికి చాలా పరిశ్రమ చేస్తారన్నమాట ఉటంకిస్తాడు.ఐ – త్సింగ్  చైనా నుంచి నలందాకువచ్చి ఇక్కడ మూడు ఏళ్లు ఉండి తన అనుభవాలను రాసి పెట్టాడు. విధ్యార్థులు గురువు ముఖతా నేర్చుకోవడం, అర్థాలను, వ్యాకరణాన్ని నేర్చుకోవడం వంటివి ముఖ్యమయిన అంశాలనీ, పరిపూర్ణ వేదవిద్యకు యేళ్ళ తరబడి అధ్యయనంచేయాల్సి ఉంటుందనీ ప్రతీ దశకూ  వెచ్చించే కాలాన్ని సూచిస్తూ వివరిస్తాడు.ముల్లర్ ప్రకారం వేదంలోని శ్లోకాలను గమనిస్తే అది  వారిని కవులుగాను, ఆరాధకులుగాను తత్వవేత్తలుగాను విడగొడుతుంది. ఇవన్నీ ఎంతో క్షుణ్ణంగా పరిశీలన చేస్తేగానీ భోదపడని విషయాలు. ముల్లర్ వాటిని కాబోయే అధికారులకు సహేతుకంగా వివరించే ప్రయత్నం చేస్తాడు.

ముల్లర్ ఇలా తన ఉపన్యాసాలలో నాటి భారతదేశపు పరిస్థితులలో అందుబాటులో ఉన్నమూలగ్రంథాలు  సేకరించి వాటినితాను అర్థంచేసుకున్నవిధంగా వెలువరించాడు. ఆనాటికి  భారతపరిపాలకులుగాఉన్న విదేశీయులఅపోహలను దూరంచేసి సానుకూలమైన అవగాహనను పెంపొందించి తగిన కృషి చేసేందుకు తగిన ప్రేరణను కలిగిస్తాడు. అన్నిఉపన్యాసాలలోభారతీయులసంస్కృతిపట్ల గౌరవంతోనూ,వివేచనతోనూ వివరణలు ఇస్తాడు. ఇవ్వన్నీ  తెలుసుకున్నప్పుడు ఇదివరకు తెలిసినవే అనిపించిన విషయాలు కూడా  మరింతగా స్పష్టంగా అర్థమైనట్టు  అనిపిస్తుంది.

 ముల్లర్ వేదఅనువాదాలమీద  అభిప్రాయాలమీద ఎన్నో విమర్శలుకూడా ఉన్నాయి.దానికిగల కారణాలు చూస్తే మొదటిది ఆయన ఎన్నడూ భారతదేశంలో అడుగుపెట్టలేదు, యే వేద అధ్యయన సంస్థతో సంబంధం  కలిగిలేడు.  రెండవది ముల్లర్ తన ఉపన్యాసంలోనే భారతీయులు  వేదాన్ని అభ్యసించడానికి ఎంతో కష్ట పడతారని పేర్కొన్నప్పటికీ తాను అలాటి అభ్యసన ఏదీ లేకపోయినా వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించే సాహసం చేయడం , దానిలోని వక్రీకరణ దోషాలకు వెరవకపోవడం , మూడవది అప్పటికి సరైనా చారిత్రక ఆధారాలు లేకుండా  విలియంజోన్స్ వంటివారు ప్రతిపాదించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంత  ప్రతిపాదికగా సంస్కృతభాషా సాహిత్యాలను వినియోగించుకోవడం, ఆ భావజాలన్ని వ్యాప్తి చేయడం , నాలుగవది మూలగ్రంథాలకన్నాఅదివరకే ఇతర భాషలలొ వెలువడిన సాహిత్యాలను ఆధారంగా చేసుకొని వాటిద్వారా అనువాదం చేయడం, అయిదవది తాను వెలువరించిన గ్రంథాల అర్థతాత్పర్యాలను కనీసంగానైనా యే పండితునితోనూ     సమీక్షించుకోకపోవడం వంటివి ఆయన చేసిన విలువైన కృషికి మాయని మచ్చలుగా మిగిలిపోయాయి.

ముల్లర్  వేదానువాదాలను అధ్యయనం చేశాక  ఆయా శ్లోకాలకు సరైన న్యాయం జరగలేదు అన్న విషయాన్ని పండితులు గుర్తించారు.  ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం విస్తృతంగా తన రచనల్లో వాడడం వల్ల భారతీయులను భిన్నజాతులుగా  విడగొడుతూ జాతిబేధాలకు మూలకంగా వాడుకున్నారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం నిజానికి ముల్లర్తో మొదలవలేదు ఇంతకుముందే జేమ్స్ మిల్  రాసిన హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, అలాగే నాటి న్యాయపాలన అధికారి విలియంజోన్స్, పాశ్చాత్యభాషలకి సంస్కృతానికి ఉన్న సారూప్యతలనుపోల్చి  భారతీయుల సంస్కృతానికి పాశ్చాత్యమూలాలు ఉన్నట్టు ప్రకటించడం జరిగింది.  దానిని  ముల్లరు విస్తృతంగా ప్రచారం చేశాడు అనడానికి ఆయన రచనల్లో పేర్కొన్న అంశాలే కారణం.ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పుస్తకంలోకూడా అనేకచోట్ల ఆర్యులప్రస్థావన వస్తుంది.అదికూడా ఆర్యులు అనేవారు ఒకజాతిగా వేరేచోటనుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడున్న స్థానికుల మీద దాడి చేసి వారిని జయించి స్థిరపడ్డారని అందుచేత పాశ్చాత్యభాషలకి ఇక్కడ ఉన్న సంస్కృతానికి సంబంధం ఉందని చెప్పడం..అయితే ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం మహంజదారో హరప్పాలాంటి ప్రాంతాల్లో దొరికిన చారిత్రక విశేషాలను బట్టి ఇది దండయాత్ర అయ్యే అవకాశం  లేదని తేలింది కనుక ముల్లర్ కాలంలోనే ఈ సిద్ధాంతంకాస్తా ఆర్యుల వలస సిద్ధాంతంగా మార్చబడింది. ప్రస్తుతం దాదాపు వందేళ్ళ తర్వాత  అనేక రకాలుగా ఆర్యులదండయాత్ర, ఆర్యులవలస సిద్ధాంతాలను పరిశోధించిన మీదటఆర్యులు ఎక్కడి నుంచో రాలేదనిఆర్యులమూలవాసులసిద్ధాంతం ప్రతిపాదించబడుతున్నది.

ముల్లర్ వల్ల విస్తృతంగా ప్రచారమైన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం భారతీయ సమాజంమీద ఎంతో ప్రభావం చూపించింది.  ఇది పాశ్చాత్య పాలకుల దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని నాటి భారతీయులు గుర్తించలేకపోయారు. ప్రసిద్ధ జాతీయవాది బాలగంగాధర్ తిలక్ ఆర్యుల యురేషియా సిద్ధాంతాన్ని సమర్థించాడు,  అలాగే భారతీయ మూలాల పట్ల విశ్వాసం ఉన్న ప్రజల్ని అనుమానం కలిగే విధంగా రాహుల్ సాంకృతాయన్ ఓల్గా  టు గంగ పుస్తకాన్ని వేశాడు.  ఒక వారే కాదు ఎంతోమంది ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని అస్థిత్వవాద ఉద్యమాలకు  ప్రధానభూమికగా మలుచుకున్నారు. అయితే అంబేద్కర్ ఈ ఆర్యులదండయాత్ర సిద్ధాంతాన్ని అంగీకరించలేదు,ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చే అవకాశం లేదని ఇది తప్పని ఆయన ఆనాడే ప్రగాడంగా  విశ్వసించారు అంతే కాదు క్రైస్తవ మిషనరీల దురుద్దేశ స్వభావాన్ని కనిపెట్టినట్టుగా తన శవం కూడా క్రైస్తవంలో చేరదని ప్రకటించాడు. నాటి అంబేద్కర్ అంచనా వేసినట్లుగానేప్రస్తుతం  జరిపిన అన్వేషణలు పురాతత్వ పరిశోధనలు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి తగిన ఆధారాలు లేవని ఇది కట్టుకథని భారతీయులనుపరిపాలించడంకోసం చేసిన ప్రయత్నం అని తేల్చాయి. ఈ అంశాలను బలపరచిన ఆధారాల్లో  ముల్లర్  స్నేహితులకు, భార్యకు రాసిన లేఖల్లో ఆయన పేర్కొన్న అంశాలే. ఇక్కడ మరొక అంశంవిదేశీయుల్లో  సంస్కృతం భాషను ఎక్కువగా నేర్చుకున్నది జర్మన్లు మాత్రమే ఇతర దేశాలతో పోలిస్తే జర్మన్లు, బ్రిటిష్ వారు దీని కోసం ఎక్కువ పని చేశారు. జర్మన్ యొక్క అస్థిత్వ మూలాలను స్థిరపరచడానికే బ్రిటిష్వారు  జర్మన్లనుసంస్కృత అధ్యయనానికి ప్రోత్సహించారనితెలుస్తుంది. అదెలా ఉన్నా ఈ సిద్ధాంతం మిగిల్చిన  భారతీయ జన విభజన అవశేషాలు ఇంకా యుద్దం చేస్తూనే ఉన్నాయి.

వేదాన్ని అభ్యసించడానికి నాటికాలంలో ఉన్న పరిమితుల దృష్ట్యా అది కొంతమందివద్దనే ఉండిపోయిందనేది సత్యం. కాలక్రమేణావచ్చిన మార్పులవల్ల చాలావరకు వేదసాహిత్యం అందుబాటులో లేకుండా పోయింది. భారతదేశంలో విదేశీపాలన తెచ్చిన మత సంకటాలు మన అస్తిత్వాన్ని మేల్కొలిపినప్పుడు మాత్రమే వేదం, వేద సంస్కృతిఅంశాలు జనసామాన్యంలోకి వచ్చాయి. వేదం నాటి నుంచి నేటివరకు సంస్కృతంలోనే ఉంది, దాన్ని స్థానికభాషలలోకి తెచ్చి అందరికీ అర్థం అయ్యేలా చేయడంలో మన ప్రయత్నం  ఇప్పటికీ అంతంత మాత్రమే. వేదాన్ని అలా ఉంచడం  వేదానికి ఇచ్చిన  గౌరవం అయి ఉండవచ్చును కానీ ఈ రోజున యే శ్లోకంలోని యే పదానికి యే అర్థం స్పురిస్తుందో చెప్పలేని పరిస్థితి రావడం వెనుక కేవలం మన పరిమిత ప్రయత్నమే చేశామన్న విషయమూ గుర్తుంచుకోవాలి. మరొక విషయం ఏమిటంటే జీవనం, వృత్తుల ఆధారంగా విభజించి  ఉన్న మనసమాజంలో యే వృత్తికి  కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం ఆయా కుటుంబాల ద్వారానే  వచ్చింది గానీ నేటిలాగా అందరూ ఒకే తరహా విధ్యాభ్యాసం చేయడమన్నది లేదు కనుక  వేద జ్ఞానం పొందడంలో ఈ సామాజిక పరిమితి ఉండడం వల్లకూడా వేదానురక్తి పరిధి కుదించుకుపోయింది.తెలుగుభాష విషయానికివస్తే నన్నయ్యకాలానికి మహాభారతం తెలుగుచేయడం మొదలయింది కానీ నిన్నమొన్నటి దాశరథి రంగాచార్యుల  వేదాల సరళఅనువాదంవరకు యే ప్రయత్నం జరగలేదన్నది వాస్తవం. హిందీలో ఈ ప్రయత్నం స్వామీ దయానంద సరస్వతి చేశారు. ఈ మధ్య కాలంలో వివిధ భాష్యకారుల సాహిత్యాన్ని వేదపరిరక్షణ సంఘాలు, గీతాప్రెస్ వంటి ధర్మప్రచారకసంస్థలు ప్రచురించడం వినా వేదం మన పురాసాహిత్యమని దాన్ని కాపాడుకోవడం మన విధ్యుక్త ధర్మం అని  జనసామాన్యం భావించలేదు, విశ్వ విద్యాలయాలు పూనుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలావరకు మూలగ్రంథాలను సేకరించినదుకు, దాన్ని పరిరక్షించినందుకు  తమ జీవితాలను ధారపోసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేయవల్సిందే. లేకపోతే నలందా గ్రంథభాండాగారం భస్మమైనట్లు ఇవన్నీ చెల్లాచెదురయ్యే ప్రమాదమూలేకపోలేదు. ముల్లర్ ద్వారా  ఇంగ్లీష్ భాషలోకి అనువాదం పొందిన వేదాలు ప్రపంచవ్యాప్తంగా తాత్వికులకు కొత్త భావనలిచ్చాయనడంలో సందేహం లేదు. మొన్నటికిమొన్న యునెస్కో ఋగ్వేదాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇలాటి సందర్భంలో పాశ్చాత్యుల అనువాదంలోని తప్పుడు అర్థాలను సవరించి సరైన భాష్యాన్ని నిర్వచించి అందరికీ మన పురావారసత్వ సంపదను అందించవల్సిన బాధ్యత మనమీద ఉంది. 

   ప్రజలున్న చోట ప్రభుత్వం ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం ఉన్నచోట దానికో తత్వమూ ఉండాల్సి  ఉంటుంది. ప్రజలూ ప్రభుత్వం ఒకే మూలానికి చెందిన వారైతే శ్రమ  విభజన (division of labour) ఒక అవసరం, ప్రజలూ ప్రభుత్వం  వేరు వేరు మూలాలకు చెందిన వారైతే విభజించి పాలించు (divideandrule)ఒక ఎత్తుగడ.మొదటి వాక్యం అనాదిగా మన  గ్రామవ్యవస్థ పునాది, రెండో వాక్యం గత మూడు  వందల ఏళ్ల  దేశచరిత్ర నేర్పిన  గుణపాఠం.  విభజించి పాలించడానికి హేతువు కావాలి.  అటువంటి  హేతువుల అన్వేషణలో జీవితాల్ని ధారపోసిన  ఎంతోమంది  విదేశీయుల్లో ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ ఒకరు.  ముల్లర్ చరిత్రను ఎందుకు అధ్యయనం చేయాలో చెప్తూ ప్రతితరము తన ప్రయాణాన్ని ఒకే బిందువు దగ్గర మొదలు పెట్టకూడదని ఒకే చోటతవ్వుతూ ఉండకుండా ముందున్న తరాలనుంచిప్రయోజనం  పొందుతూ ఇంకా ముందు బిందువులనికలుపుతూ సామూహికలక్ష్యాలనిచేరుకోవడానికి చరిత్రచదవాలని సూచిస్తాడు. ముల్లర్చెప్పినట్లుగా మన ముందుతరాలుమన చరిత్రను  మొదలుపెట్టినచోటనుంచే  మొదలుపెట్టకుండాసహేతుక అధ్యయనంతో అవసరమున్న చోట సరిచేసుకొని మన అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలసిన చారిత్రక సందర్భం ఇది. అది గుర్తుచేయడమే ఈ దర్శనోధ్యేశ్యం.

You may also like

1 comment

యరకల యాదయ్య July 25, 2024 - 3:41 pm

దేవనపల్లి వీణావాణి గారు . ముల్లర్ గారి 1882ఉపన్యాసల ,(కేంబ్రిడ్జి లో) చరిత్రను ,జిజ్ఞాసతొ,సహనంతో అధ్యయనం చేసి “మయూఖ అంతర్జాలం” ద్వార ఆంగ్లభాష నుండి తెలుగులోకి అనువదించి చదువరులకు ఎంతో విజ్ఞానాన్ని పంచిన మీకు,మయూఖ, వారికి ,సదా కృతజ్ఞతలు.

యరకల యాదయ్య

Reply

Leave a Comment