Home ఇంట‌ర్వ్యూలు మంచి సాహిత్యం రావాలి

మంచి సాహిత్యం రావాలి

by Aruna Dhulipala

– గన్నమరాజు గిరిజా మనోహర బాబు

సాహితీ విరించి బిరుదాంకితులు సుప్రసిద్ధ కవి, రచయిత, వ్యాఖ్యాత గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారితో మయూఖ ముఖాముఖి……. అరుణ ధూళిపాళ

నమస్కారం సార్ 🙏కవిగా, రచయితగా సాహిత్య రంగంలో మీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాక రంగస్థల నటులుగా అలరిస్తూ మీ ఆధ్యాత్మిక ప్రసంగాలతో భక్తి తత్పరతను చాటుతున్న మిమ్మల్ని కలుసుకొని మా పాఠకులకు పరిచయం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
  నమస్కారమమ్మా ! మన ప్రశ్నోత్తరాల కార్యక్రమం కంటే ముందుగా మయూఖ పత్రిక గురించి నా అభిప్రాయాన్ని చెబుతాను.
అలాగే సార్..అంతకంటేనా..చెప్పండి.

         మయూఖ ద్వైమాసిక పత్రికను డా. కొండపల్లి నీహారిణి గారు ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అంతర్జాలంలో ఉపయోగించుకునే కొద్దీ, కొత్త కొత్త విజ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ మార్గంలో రెండునెలల కొక్కసారైనా తెలుగు సాహిత్యాన్ని గురించి, తెలుగు సాహిత్యంలో చాలా పరిశోధన చేసిన ఎంతో మందిని గురించి వాళ్ళ సృజనాత్మక దృష్టిని గురించి చెప్పేటటువంటి గొప్ప పత్రికను స్థాపించారు. పైగా ఆమె ఒద్దిరాజు సోదరుల పైన పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టాను పొందారు. అసాధారణ మేధాసంపన్నులై, ఆనాటికే సాంకేతిక విజ్ఞానాన్ని కూడా వాళ్ళు అద్భుతంగా లోకానికి అందించిన వాళ్ళు. ఒద్దిరాజు సోదరుల గురించి మేము వరంగల్లులో చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. వారి యొక్క మేధకు వారసురాలిగా నీహారిణి గారు ఈ పత్రికను నిర్వహిస్తున్నారేమో అనిపిస్తుంది.

మా పత్రిక నిర్వహణ పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు సార్.

1. మీ జననం, బాల్యానికి సంబంధించిన వివరాలు చెప్పండి. జ : అప్పటి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన ఆలంపూర్ లో గన్నమరాజు రామేశ్వర రావు, శకుంతలమ్మ దంపతులకు నేను మూడవ కుమారునిగా జన్మించాను. చిన్నతనం నుండే మా నాన్నగారు నాకు వందల శ్లోకాలను, పద్యాలను నేర్పించారు. వాటి గురించి నిత్యం ఆలోచింపజేస్తూ నన్ను ఒక విధంగా సాహిత్య రంగంలోకి మొదటి అడుగు వేయించిన గురువు. అదే సమయంలో ఆలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో సంస్కృత పాఠశాలను పెట్టడం జరిగింది. పంతంగి వెంకటేశ్వర శాస్త్రి గారు, నరసింహ ఘనాపాఠి అవధాని గారు, మామిడాల సీతారామ శాస్త్రిగారు మొదలైన పెద్దలు పాఠ్యాంశాలు బోధించేవారు. దాంట్లో నన్ను ప్రవేశ పెట్టారు. అక్కడ మేము అమరకోశము, శబ్దమంజరి, పంచకావ్యాలు, అష్టాధ్యాయి, కొంతవరకు వేద పాఠాలు చదువుకున్నాం. నాలుగు సంవత్సరాలు నిరాఘాటంగా సాగిపోయింది. అప్పటికే 90 మందిమి ఉన్నాము. ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు అక్కడికి వచ్చేవారు. ఒకవిధంగా అది గురుకుల పాఠశాల. అక్కడే నాకు గట్టి పునాది పడింది. కారణాంతరాల వల్ల అది మూతపడింది.

2. మరి మీ సాధారణ విద్యాభ్యాసం ఎలా కొనసాగించ గలిగారు?
జ : ఆ పాఠశాల మూతబడిన తరువాత సాధారణ విద్యలోకి వచ్చి 6, 7 తరగతులు, హెచ్ ఎస్ సి పూర్తి చేశాను. క్రమంగా నేను పి యు సి లో చేరకుండా అదే మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో ఉన్నటువంటి శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అడుగు పెట్టాను. అక్కడ చాలా అద్భుతమైనటువంటి విద్యా విధానం ఉండేది. ప్రిన్సిపాల్ తెలకపల్లి విశ్వనాథం గారు, డా. శ్రీ రంగాచార్యగారు, వింజమూరి శేషఫణి శర్మగారు, ములుకుట్ల రామకృష్ణ శాస్త్రి గారు, మాకు చిన్నప్పుడు అష్టాధ్యాయి బోధించిన సీతారామ శర్మ గారు వీళ్లంతా లెక్చరర్లుగా ఉండడం వల్ల అక్కడి విద్యావిధానంతో సాహిత్యరంగంలో పురోగమనం వైపు నేను ముందడుగు వేయడం జరిగింది. అంతేకాదు నేను మరిచిపోయాననుకున్న సంస్కృత పరిజ్ఞానం కొంతవరకు అక్కడ బాగా ఉపయోగపడింది. అదొక భూమికగా నేను మర్చిపోలేనటువంటి జీవితాన్ని ఇచ్చింది. నేను మధ్యలో ఐదేళ్లు చదవకపోయినా దాంట్లో ఉన్న అనేక విషయాల నిరంతర మననం వల్ల నేను ప్రవేశించిన సాహిత్యరంగంలో బాగా తోడ్పడ్డాయి. గురువుల వాత్సల్యం, బోధన వల్ల విశ్వవిద్యాలయంలో ప్రథమునిగా రావడం ఒక గొప్ప విజయంగా భావించాను

3. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీ గురువుల గురించి చెప్పండి.
జ :  పాలెంలో డిగ్రీ వరకు చదివాక నాకంటే ముందు కసిరెడ్డి వెంకటరెడ్డిగారు మొదలైన సీనియర్లు ఉండడం, వారిని ఆదర్శంగా తీసుకోవడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించడానికి అవకాశం ఏర్పడింది. ఇక్కడికి వచ్చిన తరువాత దివాకర్ల వేంకటావధాని గారు బాల, ప్రౌఢ వ్యాకరణాలు, అప్ప కవీయం వంటి వ్యాకరణ గ్రంథాలు బోధించారు. అసలు  మేము బాల వ్యాకరణం చదివామన్న భావన లేదు. వ్యాకరణాన్ని కూడా కావ్యంగా చెప్పిన గొప్ప మేధావి ఆయన. ఒక ప్రయోగం వస్తే అవధానిగారు దాన్ని ఏఏ కవులు ఎట్లా ప్రయోగించారో ఆ పద్యాలు చెప్పేవారు. దానివల్ల సమగ్ర విషయాలను తెలుసుకున్నాం. ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ప్రత్యేకంగా పద్యభాగం బోధించేవారు. ముఖ్యంగా శ్రీనాథుని శృంగార నైషథం, చేమకూర వేంకట కవి విజయ విలాసం గొప్పగా బోధించి పద్యాన్ని ఏ విధంగా మనం అవగాహన చేసుకోవాలో ఒక సమగ్రమైన దృష్టిని నాకు ప్రసాదించారు. “ప్రతి పద్య రచనా   చమత్కృతి కలుగంగ చెప్పనేర్తు” అని విజయ విలాస కర్త చెప్పుకున్నాడు. ఆయన గురించి చెప్పినపుడు ప్రతి పద్యంలో ఎలాంటి చమత్కృతి ఉందో చెప్పేవారు. అక్కడే మాకు యశోదారెడ్డి గారు, ఆచార్య నాయని కృష్ణకుమారి గారు, డా. పల్లా దుర్గయ్య గారు వీళ్ళు మాకు బోధకులుగా ఉండి సరియైన మార్గాన్ని చూపించారు. మేము రెండవ సంవత్సరం ఎమ్ ఏ చేసేసరికి అవధానిగారు పదవీ విరమణ చేయడం వల్ల ఆచార్య రామరాజు గారు వచ్చారు. వారు మమ్మల్ని కొన్ని ప్రాంతాలకు  తీసుకొనిపోయి ప్రసంగాలు ఇప్పించి ప్రసంగాలలో ఒక విధమైన శిక్షణ ఇచ్చారు. దీంట్లో ఒక చిన్న నేపథ్యం ఉంది. పాలెం కళాశాలలో ఉన్నప్పుడు “తెలుగులో నాకు నచ్చిన కావ్యం” అనే టాపిక్ లో ప్రతీ శనివారం ప్రతీ విద్యార్థి వక్తగా మాట్లాడే నియమం ఉండేది. నాలుగు సంవత్సరాలు అట్లా మాట్లాడేసరికి సభల్లో మాట్లాడడం, ఒక విషయాన్ని ఏ విధంగా విశ్లేషించాలి? శ్రోతల కెట్లా అర్థం కావాలి? ఈ విషయాల్లో మాకు తెలియకుండానే అవగాహన వచ్చింది. ఇక్కడ రామరాజు గారు ప్రత్యేకంగా నన్ను కామారెడ్డి మొదలగు చోట్లకు తీసుకు వెళ్లారు. వారితో పాటు కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మొదట సభల్లో పాల్గొనే మంచి సంప్రదాయంగా, తరువాత మాట్లాడే శక్తి మొదలగు విషయాలను నాకు బోధించినట్లయింది.

4. ఇంతటి సాహితీవేత్త అయిన మీరు పి హెచ్ డి ఎందుకు చేయలేదు?
జ: ముందుగా నేను సంస్కృతం చేశానమ్మా. తర్వాత ఎమర్జెన్సీ రావడం వల్ల దాదాపు 5, 6 నెలలు ప్రభుత్వం నిర్బంధించడం జైలు నుండి వచ్చాక ఉద్యోగంలో చేరడం వీటివల్ల ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. ఉస్మానియాలో ఉన్నప్పుడు వివిధ ప్రాంతాలకు వెళుతుండే వాళ్ళం అని చెప్పాను కదా! అందువల్ల నా పరిధి పెరిగింది. ప్రసంగించే అవకాశాలు ఎక్కువగా రావడం, దానిమీద ఆసక్తి మరింత పెరగడంతో పరిశోధన పక్కకు పోయింది. ప్రతిరోజూ ఏదో ఒక ఊరికి వెళ్లడం, ఎక్కడో ఒకచోట ప్రసంగాలకు పిలవడం, ప్రసంగాలు చేయడం పరిపాటి అయింది. ఇప్పటిదాకా పదిహేను వందల ప్రసంగాలు చేసి ఉంటాను. అప్పటికీ రామరాజు గారు మందలిస్తూనే ఉన్నారు. కానీ దాని మీద దృష్టి పోలేదు. అది అక్కడికే ఆగిపోయింది (నవ్వుతూ).

5. మీరు కారాగార శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయి?
జ : దేశమంతటా ఎమర్జెన్సీ విధింపబడిన రోజులవి. అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉద్యమం మొదలైంది. మేము విద్యార్థులం ఆ ఉద్యమానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహించాం. అరెస్ట్ వారెంట్ జారీ చేసి ముషీరాబాద్ జైలులో పెట్టారు. కొన్నాళ్ళు గడిచింది. మామీద ఏవో కేసులు పెట్టారు. ఆ కేసులు నిలబడలేదు. కాబట్టి మేమంతా బయటకు వచ్చాం. అయితే విశేషమేమిటంటే దాదాపు ఐదారు వందల మందిమి ఇవే భావాలున్నవాళ్ళం ఉన్నాం. అప్పటికే చాలా మందిని జైళ్లల్లో పెట్టారు. కొంతమందిని ‘MISA’ (Maintenance of Internal Security Act)  కింద అరెస్ట్ చేశారు. మరి కొంతమందిని ‘DIR’ (Defence of India Rules act) కింద అరెస్ట్ చేశారు. మేము డి ఐ ఆర్ కింద అరెస్ట్ అయినవాళ్ళం. మీసా కింద అరెస్ట్ అయిన వాళ్లకు సౌకర్యాలు ఎక్కువుంటాయి. కేసులు ఉండవు. మేమేవో పాంప్లెట్లు పంచి పెడుతున్నామని కేసు పెట్టారు. అయితే అది ప్రూవ్ కాలేదు. దాదాపు 5 నెలలు జైలులో ఉండి బయటకు వచ్చేసాం. ఆగస్ట్ 15 నుండి జనవరి 26 వరకు రోజూ సత్యాగ్రహాలు జరగాలని కమిటీ వాళ్ళు ప్రణాళిక వేశారు. జయప్రకాష్ నారాయణ ఉద్యమంతో పాటు ఆర్ ఎస్ ఎస్, విశ్వ హిందూ పరిషత్, విద్యార్థి పరిషత్ అందరమూ ఉన్నాం దాంట్లో. రోజుకు పదిమంది ఎక్కడో ఒకచోట సత్యాగ్రహం చేయాలి. అందులో ఒక్కరికి తప్ప మిగిలిన వారికి కూడా ఎక్కడ జరుగుతుందో తెలియకూడదు. ఏదో విధంగా సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవారు. అయితే నాకు కూడా మీరు ఫలానా చోట సత్యాగ్రహంలో పాల్గొనాలని సూచన వచ్చింది. కాకపోతే అంతకుముందే వేరే కేసులో నన్ను అరెస్ట్ చేశారు. ఎమర్జెన్సీ కావడం వలన ప్రశ్నించడానికి వీలు లేదు. కానీ ఎవరి మీదా కేసులు ప్రూవ్ కాలేదు. తర్వాత ఎలక్షన్స్ వచ్చి ప్రభుత్వం ఏర్పడింది. ఒక్కో బ్యాచ్ లో 120 మందిమి ఉండేవాళ్ళం. పెద్ద కాంపౌండ్ ఉండేది. అందరం అక్కడే కలిసి ఉండేవాళ్ళం. రాత్రి 7 గంటల తర్వాత లోపలికి వెళ్లేవాళ్ళం. మొదట రెండు, మూడు రోజులు భోజనానికి ఇబ్బందులు పడ్డాం.  తర్వాత అలవాటు పడ్డాం. అంతే తప్ప అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.

6. మీ ఉద్యోగ ప్రస్థానాన్ని తెలపండి.
జ :  జైలు నుండి వచ్చాక 1978 జనవరిలో సత్తుపల్లి జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో మొట్టమొదటి సారి ఉద్యోగంలో చేరాను. అక్కడ రాళ్లబండి కవితా ప్రసాద్ నా స్టూడెంట్. అక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఆ కళాశాలలో దూర దూరప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పించేవారు. ఆ రోజుల్లో ప్రయివేటుగా బి.ఏ చేసే అవకాశం ఏ యూనివర్సిటీలోనూ లేదు. ఒక్క ఉపాధ్యాయ అభ్యర్థులకు మాత్రమే దాన్ని పరిమితం చేశారు. అందువల్ల చదువు మానేసిన చాలామంది ఒంగోలు, మార్కాపురం, కంభం, ఖమ్మం, విజయవాడ, ఏలూరు మొదలగు ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చేవారు. ఆ మొదటి బ్యాచ్ లో నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం బాగా ఉండేవి. నేనూ యువకుడినే కాబట్టి వయసు తారతమ్యం పెద్దగా లేకపోవడం వలన వారితో కలిసిపోయేవాడిని. వాళ్ళు చదువులో, నాటకాల్లో ముందుండి నడిచేవాళ్ళు. తర్వాత నాకు ఖమ్మం ట్రాన్స్ ఫర్ అయింది. అక్కడ ఆరు సంవత్సరాలు పనిచేసి, నేనే ప్రత్యేకంగా కోరుకొని వరంగల్ కు రావడం, అక్కడ మూడేళ్ళు పనిచేసి, చివరి అయిదేళ్ళు హనుమకొండకు వచ్చి అక్కడే కాకతీయ ప్రభుత్వ డిగ్రీ, పి.జి కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా 2009 లో పదవీ విరమణ చేయడం జరిగింది. ముప్ఫై మూడేళ్ళ ఉద్యోగ జీవితం నాది.

7. నాటకరంగంలో మీకు ఆసక్తి ఎలా కలిగింది?
జ : నాకు చిన్నతనం నుండే నాటకాల పట్ల అభిరుచి ఉండేది. హైస్కూలులో ఉన్నప్పుడు చిన్న చిన్న పాత్రలు వేయడం, ఏకపాత్రాభినయం చేయడం అలవాటు. పాలెం వచ్చాక నాటకరంగంలో మేము ప్రతీ సంవత్సరం జాతీయ జ్యోతి, వీరపాండ్య కట్ట బ్రహ్మన, అల్లూరి సీతారామరాజు, మహానటుడు మొదలైన అనేక నాటకాలు వేశాం. దీనిపట్ల అభిరుచి కలిగిన అధ్యాపకులు ఉన్నారక్కడ. రామకృష్ణ శాస్త్రిగారు, వింజమూరి శేషఫణి శర్మగారు దర్శకత్వం వహించి పెద్ద స్టేజీల మీద మాకు నాటకాలు ఎట్లా వేయాలో నేర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తరువాత ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. అవధాని మొదలైన వారు సాహిత్య రూపకాలు వేసేవారు. అవధాని గారు అల్లసాని పెద్దనగా, ఉత్పల సత్యనారాయణాచార్య గారు పింగళి సూరనగా, జి.వి. సుబ్రహ్మణ్యం గారు తెనాలి రామకృష్ణునిగా ఇట్లా ఉండేవారు. అది చూశాక ఇట్లాంటి రూపకం ఒకటి వేయాలనిపించింది. మా స్వగ్రామమైన ఆలంపురంలో ఇదే నాటకం వేశాము. మాకు ఆలంపురంలో గొప్ప అవకాశం గడియారం రామకృష్ణ శర్మగారు. మా ఇంటి పక్కనే మూడో ఇల్లు వారిది. మా ఊళ్ళో సంస్కృత పాఠశాల పెట్టడానికి వారే కారకులు. అప్పటికే వారు ఆంధ్ర సారస్వత పరిషత్తు హైదరాబాద్ దానికి కార్యదర్శిగా ఉన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్నవారు. ‘భాగ్యనగర్ రేడియో’ అని అప్పట్లో నిజాం ప్రభుత్వ వ్యతిరేకంగా రేడియో స్టేషన్ నడిపారు. సామాజిక , సాంస్కృతిక సంస్కరణలు చేస్తున్న వ్యక్తి. ఆయనతో ఈ నాటక విషయం ప్రస్తావనకు వచ్చింది. మన ఊళ్ళోనే చేద్దాం అన్నారు ఆయన. ఆయన అల్లసాని పెద్దనగా, నేను తెనాలి రామకృష్ణుడుగా ఇంకా కొంతమంది మిత్రులతో కలిసి వేశాము. దానికి చాలా పెద్ద పేరు వచ్చింది. హైదరాబాద్ లో కూడా నాటకాల విషయంలో కొంత కృషి చేశాను. నేను సత్తుపల్లిలో పనిచేసినప్పుడు మా విద్యార్థుల్లో మంచి మంచి నటులు ఉండేవారు. వెంకటేశ్వర రావు అని ఇప్పుడు జడ్జీగా ఉన్నాడు. హనుమంతరావు అని ఖమ్మంలో ఉంటాడు. తరువాత కవితా ప్రసాద్. వీళ్ళతో రెగ్యులర్ గా నాటకాలు వేయించేవాడిని. నేను వరంగల్ కు వచ్చిన తర్వాత నాటకసంస్థను స్థాపించడం, ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయిలో నాటకాలు వేయడం, నాటకోత్సవాలు జరిపించడం చేస్తున్నాము. ఇప్పటికి 25 ఏళ్లుగా నడుపుతున్నాము. అట్లా సాహిత్య రంగంతో పాటు నాటకరంగం కూడా నా జీవితంలో భాగమయ్యాయి.

8. నాటకాల్లో మీకు నచ్చిన పాత్ర ఏది?
జ :  నాకు బాగా నచ్చిన పాత్ర అల్లూరి సీతారామరాజు. దాదాపు 40, 50 సార్లు వేసి ఉంటాను. దుర్యోధనుడు, రావణాసురుడి పాత్రలు వేయాలంటే నా రూపం సరిపోదు (గట్టిగా నవ్వుతూనే). కాకపోతే నేర్పించాను. బళ్ళారిలో “రాఘవ నాటక కళారంగం” అని ఉంది. అక్కడ ఇమ్మప్ప అని ఒక మంచి నటుడు ఉండేవాడు. ఆయన శారీరకంగా దృఢంగా ఉండడం వల్ల వీరపాండ్య కట్ట బ్రహ్మన, రావణాసురుడి పాత్రలకు చక్కగా సరిపోయేవాడు. రాయలసీమలో కోయిలకుంట్ల, సంజామల ఇట్లా ఎక్కడెక్కడో తిరిగి నాటకాలు వేశాం. అప్పుడు శరబండరాజు అని ఒకాయన మాయల ఫకీరు అద్భుతంగా వేసేవాడు. పాలెంలో నా క్లాస్ మేట్. వాళ్ళను నేను తయారుచేశాను. ఇప్పటికి కూడా ఆ అభిరుచి వేరే రకంగా కొనసాగుతోంది. సాహిత్య రూపకాల్లో అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, పోతన, భావకవి, ఒద్దిరాజు సీతారామారావు వంటి పాత్రలను ధరించాను. దాశరథి పాత్రను దాదాపు 60 సార్లు వేసి ఉంటాను. దాశరథి గారి పాత్రకు నేను చక్కగా సరిపోతానని గొల్లపూడి మారుతీరావు గారు ప్రశంసించేవారు.

9. సాహిత్యపు లోతుల్లోకి ఎలా ప్రవేశించగలిగారు?
జ : నా సాహితీ ప్రస్థానం ఆలంపూర్ పాఠశాల నుండి మొదలయిందని చెప్పాను కదా!  అప్పటివరకు సాహిత్యం అంటే ఊరకే చదివాను తప్ప పాలెంకు వచ్చేవరకు దాని విశ్వరూపం తెలియదు. పాలెంలో మా గురువు శ్రీరంగాచార్య గారింట్లో పెద్ద లైబ్రరీ ఉండేది. వందలాది పుస్తకాలు ఉండేవి.  నాకు సీనియర్ విద్యార్ధులు కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, రుక్నొద్దీన్ గారు, మహమ్మద్ హుస్సేన్ గారు, నాగరాజు గారు, యాదగిరి గారు నిరంతరం ఆయన లైబ్రరీని చదివేవారు. వాళ్ళ స్ఫూర్తితో నేను కూడా సాహిత్యాన్ని చదవాలనే కోరికను పెంచుకున్నాను. అధ్యయనం అక్కడే జరిగింది. లోతుల్లోకి ప్రవేశించడం అక్కడే జరిగింది. కసిరెడ్డి గారి లాంటి సీనియర్లు వెళ్లిపోయిన తరువాత నేనింకా రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాను కాబట్టి ఎన్నో విషయాలను మా గురువు గారి నుండి నేర్చుకున్నాను. వాళ్ళింటికి ఎన్నో పత్రికలు వచ్చేవి. వాటిని పఠించడం ద్వారా సాహిత్యంలోకి ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం కలిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి రాకముందే దాదాపుగా ప్రసిద్ధమైన వ్యక్తులను గురించి కానీ, ప్రసిద్ధమైన కావ్యాలను గురించి కానీ తెలుసుకున్నాను. గురువు గారికి ఎంతో మంది సాహితీవేత్తలతో పరిచయం ఉండడం వల్ల నిడదవోలు వెంకటరావుగారు ఖండవల్లి లక్ష్మీరంజనం గారు లాంటి పెద్దలను గురించి వినే అవకాశం కలిగింది. వాళ్ళ పరోక్ష పరిచయం కలిగింది.

గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారితో అరుణ ధూళిపాళ

10. పాలెం ప్రాచ్య కళాశాలలో ఇంతటి సాహిత్యాన్ని అధ్యయనం చేసిన ఆ కళాశాలలో మిమ్మల్ని మీరు గర్వపడేలా చేసిన మరచిపోలేని అనుభవాన్ని తెలపండి.
జ : ఎంతోమంది సాహితీమూర్తుల పాండిత్యాన్ని ఆ కళాశాలలో తెలుసుకున్నానని ఇంతకు ముందే చెప్పాను కదా! అక్కడ ప్రతీ సంవత్సరం ఒక వక్తృత్వ పోటీ ఉండేది. దాని పేరు చాలా పెద్దదిగా ఉండేది. “వాద రంజిత వాగ్దేవతా వాగ్ధాటి నైపుణ్యాభివర్ధక సభలు” అనే పేరుతో పోటీలు నిర్వహించేవారు. అంటే ఏమిటంటే ఇరవై కిలోల ఒక సరస్వతీ విగ్రహం ఉండేది. రోలింగ్ షీల్డ్ అది. దానికి ‘సంచార వైజయంతికా’ అని మా ప్రిన్సిపాల్ తెలకపల్లి విశ్వనాథ శర్మగారు పేరు పెట్టారు. వివిధ కాలేజీల నుండి విద్యార్థులు పాల్గొనేవారు. ఎవరు మాట్లాడి పోటీలో నెగ్గుతారో వారి కాలేజీకి దాన్ని ఇస్తారు. శలాక రఘునాథ శర్మగారు దానికి ప్రథమ విజేత. రెండవ సంవత్సరం గౌతమీ విద్యాపీఠానికి అది దక్కింది. మూడవ సంవత్సరం నల్లగొండ గీతా విజ్ఞానాంధ్ర కళాశాలకు, నాల్గవ సంవత్సరం నల్లకుంట ఓరియెంటల్ కాలేజీకి వచ్చింది. ఇక ఐదవ సంవత్సరం నేను విజేతగా నిలిచి మా కళాశాలకు వచ్చింది. “మనం పెట్టిన తర్వాత ఇప్పుడే మనకు వచ్చిందిరా!” అంటూ మా ప్రిన్సిపాల్ గారు చాలా సంతోషపడ్డారు. అదెప్పటికీ మర్చిపోలేను. అప్పుడు జడ్జెస్ గా కోరా శాస్త్రిగారు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిగారు, దివాకర్ల వేంకటావధాని గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు లాంటి మహామహులున్నారు. వాళ్ళ ముందు విజేతగా నిలవడం గొప్ప విషయమే కదా! విశ్వనాథ సత్యనారాయణ గారిని, మాధవరామ శర్మ గారిని అక్కడే చూశాను. దాదాపు పండితులందరినీ ఆ కళాశాలలో చూశాను. వాళ్లంతా మా గురువు గారింట్లో ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్లకు సేవలు చేసే బాధ్యత నాకుండేది. అందువల్ల నాకు తెలియకుండానే వాళ్ళందరి నుండి ఒక స్ఫూర్తిని పొందాను.

11. ముత్యాల వంటి అందమైన మీ లేఖన నైపుణ్యాన్ని గురించి విన్నాం. ఆ అనుభూతులు కొన్ని చెప్పండి.
జ :  నేను రాసే అక్షరాలు అందంగా ఉంటాయని మా గురువులందరూ మెచ్చుకునేవారు. మా గురువు గారు శ్రీ రంగాచార్య గారు ఆయన వ్యాసాలన్నీ నా చేత శుద్ధ ప్రతి రాయించేవారు. వారప్పటిలోనే తెలుగులో ప్రసిద్ధ పత్రిక అయినటువంటి భారతిలోను, కాకినాడ నుండి  ఆంధ్ర సాహిత్య పరిషత్తు వాళ్ళ పత్రిక చాలా ప్రతిష్టాత్మకమైనది వస్తుండేది. జయంతి రామయ్య పంతులు లాంటి వాళ్ళు ఉన్న పత్రిక అది. అప్పుడు బండారు తమ్మయ్య గారు, కాకరపర్తి కృష్ణమూర్తి శాస్త్రిగారు వీళ్లంతా ఆ పత్రికను నడిపేవారు. వీటిలో మా గురువు గారు వ్యాసాలు రాసేవారు. ఆ వ్యాసాల శుద్ధ ప్రతులను నేను తయారుచేసేవాడిని. ఆ తరువాత గురువుగారు సాహిత్య అకాడెమీ గ్రంథాలను పరిష్కరించి దశరథ రాజనందన చరిత్ర, తాళంక నందినీ పరిణయం వీటిని ప్రకటించారు. వాటిని శుద్ధ ప్రతులు తయారుచేయడం, తాళపత్ర ప్రతులను చూసి రాయడం చేసేవాడిని. ఇది కూడా నా సాహితీ అధ్యయన లోతులకు ప్రేరణ అయింది.

12. మీరు చేసిన వివిధ సాహితీసేవల్లో ప్రధానమైన “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ” వ్యవస్థను  గురించి చెప్పండి.
జ :  నేను ఖమ్మంలో ఉన్నప్పుడు రెండు, మూడు సంస్థలతో అనుబంధం ఉండింది. సత్తుపల్లిలో ఒక సాహిత్య సంస్థ పెట్టి దానిని కొంతవరకు నిర్వహించాం. వరంగల్లుకు వచ్చిన తరువాత ఇక్కడ సాహిత్య, సాంస్కృతిక రంగాలను ఒక వేదిక మీద నుండి నడపడం బాగుంటుందని ఒక ఆలోచన కలిగింది. అప్పటికి రాళ్లబండి కవితాప్రసాద్ జాయింట్ డైరెక్టరుగా సాంఘిక సంక్షేమ శాఖలో పని చేస్తుండేవాడు. ఆయన వరంగల్లుకు వచ్చాడు. “మనం ఒక మంచి ఆర్గనైజేషన్ పెడదాం సార్” అన్నాడు.  వనం లక్ష్మీ కాంతరావు గారని మంచి నటులు. అప్పటికే  ఆయన రాష్ట్రస్థాయి నటులు. ఆయన, నేను, బి.వి. శేషాచార్య, ఎ.వి. నరసింహారావు గారు మేమంతా కలిసి కవితా ప్రసాద్ ఇంట్లో కూర్చొని ఈ సంస్థకు రూపకల్పన చేశాం. దీనికి “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ” అని కవితా ప్రసాదే పేరు పెట్టాడు. లోగో కూడా తానే తయారుచేశాడు. ఒక అవధానంలో రెండు, మూడు పద్యాలు చెప్పాడు. బాగున్నాయని శతకం వేయమన్నాను. వారం రోజుల్లో రాశాడు. అదే కాదంబిని పేరుతో వచ్చింది. మొట్టమొదట మా సంస్థ తరఫున కవితా ప్రసాద్ పుస్తకమే వేశాము. ఎ.వి. నరసింహారావుగారి వచన కవితా సంకలనం కూడా వేశాము. అప్పటికే వరంగల్లులో లబ్ధ ప్రతిష్ఠులైన ఇద్దరు సాహిత్య దిగ్గజాలు ఉన్నారు. ఒకరు కోవెల సంపత్కుమారాచార్య గారు, సుప్రసన్నాచార్య గారు. వాళ్ళిద్దరి మార్గ దర్శకత్వంలో ఈ సంస్థను ప్రారంభించాం. ఇప్పటికి 26 వసంతాలు గడిచినా దిగ్విజయంగా నడుస్తోంది. కార్యక్రమాల నిర్వహణ కూడా రెండు భాగాలుగా చేసుకొని ఎనిమిది మంది నాటక రంగానికి, ఎనిమిది మంది సాహిత్య రంగానికి ఉండేటట్లు (షోడశ కళలుగా) ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని నిర్మించుకొని నడిపిస్తున్నాం.

13. ఈ సంస్థ ద్వారా మీరు చేసిన ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు ఏవి?
జ :  మేము దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరినీ ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాము.  మహాభారతం మొత్తం పద్ధెనిమిది పర్వాలకు పద్ధెనిమిది మందితో ప్రసంగాలు ఇప్పించాం. ‘మహాభారత దర్శనం’ అని పేరు పెట్టాం. మైలవరపు శ్రీనివాసరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అనుమాండ్ల భూమయ్యగారు, ఇట్లా దాదాపుగా మా సంస్థకు రాని సాహిత్యవేత్త లేడు. అట్లానే భాగవతం తీసుకొని ‘భాగవత సుధ’ పేరుతో. పన్నెండు స్కంధాలను భారతానికి పిల్చిన వాళ్లనే పిలిచాము. అది ఎంత క్లిక్ అయిందంటే వినడానికి వచ్చిన వాళ్ళు కనీసం వెయ్యికి తక్కువ ఉండరు. మొదట్లో ఖర్చుకు భయపడ్డాం. కానీ “సార్ సభలు ఎప్పుడు పెడతారు? డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి?” అనే పరిస్థితులు వచ్చాయి (గట్టిగా నవ్వుతూ). ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి ‘రామాయణ కల్పవృక్షం’ ఆరు కాండలను పన్నెండు భాగాలుగా చేసి ‘రామకథా పరిమళం’ పేరుతో ప్రసంగాలు ఇప్పించాం. రాజమండ్రి నుండి కేశవప్రగడ సత్యనారాయణ గారు, విశాఖపట్నం నుండి బులుసు వెంకటేశ్వర్లు గారు, కాకినాడ నుండి గరికపాటి వారు మొదలైన వాళ్ళు ప్రసంగించారు. తర్వాత పది ఉపనిషత్తుల మీద పదిరోజులు ఉపన్యాసాలు పెట్టించాము. ‘ఉపనిషచ్చంద్రిక’ అనే పేరుతో నిర్వహించాము. భగవద్గీత పద్ధెనిమిది అధ్యాయాలను పద్ధెనిమిది మందితో మాట్లాడించాం. ఆచార్య లక్ష్మణమూర్తి గారు మొదలైన వాళ్ళు వచ్చారు. సుప్రసన్నాచార్య గారి దర్శకత్వంలో ఇవన్నీ జరిగాయి.
        పూర్వీకులు పృథ్వీ సూక్తం, అగ్నిసూక్తం మొదలైన అయిదు సూక్తాలతో పంచభూతాల ఆవశ్యకతను ఎట్లా గుర్తించారో ఆ కోణంలో ‘వేదసూక్త కౌముది’ అనే పేరుతో ప్రసంగాలు ఇప్పించాం. గరికపాటి వారు పురుషసూక్తం, దాని అంతరార్థం గురించి చెప్పారు. సాగి కమలాకార శర్మగారు శ్రీ సూక్తంలో ఉన్న వైజ్ఞానిక విషయాలను చెప్పారు. అంటే కేవలం ప్రవచనం లాగా కాకుండా సమాజానికి ఉపయోగపడే కొత్త ధర్మాల ద్వారా ఇవన్నీ కూడా ఉన్నాయని, వాటి ఔన్నత్యాన్ని చెప్పడం కోసం ఏర్పాటు చేశాం. పాలకుర్తి రామమూర్తి గారు మొదలైన వాళ్ళు ప్రసంగాలు ఇచ్చారు. కరోనా వల్ల ఆగిపోయింది. వేద సూక్తాలు ఇంకా మిగిలివున్నాయి. మళ్లీ వాటిని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం.

14. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు నిర్వహించిన పోటీల  వివరాలను చెప్పండి.
జ : వీలైనంతవరకు విద్యార్థులలో అధ్యయనం పెంచాలనే తాపత్రయంతో హైస్కూలు విద్యార్థులకు ఒక సంవత్సరం సాహిత్యం మీద క్విజ్ పెట్టాం. వందపద్యాలు తప్పనిసరి చేశాం. పిల్లలు చేతులు కట్టుకొని గడగడా చెప్పేస్తుంటే ఆశ్చర్యం కలిగింది. మారుమూల పల్లెల్లో ఉన్న అమ్మాయిలు కూడా మొదటిస్థానంలో ఉండడం ఆనందాన్ని కలిగించింది. ప్రశ్నలు వేయడం, విజేతలను నిర్ణయించడం కష్టమైపోయింది. తర్వాత సంస్కృతీ క్విజ్ అని పెట్టాము. కేవలం భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాలే. అది అత్యంత ఆశ్చర్యకరంగా సాగింది. తర్వాత నాటకాలకు సంబంధించిన అంశాలు, ‘మేరా భారత్ మహాన్’ అని భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలపై క్విజ్ పెట్టాము. ఎక్కడైనా, ఏ అంశాలకు సంబంధించి అయినా మేము వెనుకాడవలసి వచ్చిందే కానీ పిల్లలు వెనుకాడలేదు. స్కూళ్ళకు వెళ్లి (జిల్లా స్థాయిలో) అక్కడే పోటీలు నిర్వహించాం. ఆ తర్వాత అట్లా తిరగడానికి మాకు మ్యాన్ పవర్ తగ్గింది. ఒక గొప్ప విషయం భార్గవి అనే ఒక అమ్మాయి మేము పెటైన అయిదు క్విజ్ లలో టాప్ గా ఉండింది. ఆమె గ్రూప్స్ లో సెలెక్ట్ అయి ఎ. జి ఆఫీసులో ఆఫీసర్ అయింది. ఈ పోటీలు ఆమెకు ఉపయోగపడడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

15. మీ సంస్థ చేస్తున్న నాటకరంగ సేవ ఎటువంటిది?
జ :-  నాటకోత్సవాలలో భాగంగా ప్రతీ శివరాత్రికి మూడు రోజుల ముందు ప్రారంభించి శివరాత్రితో ముగిసేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అవి పర్మినెంట్ డేట్స్. మాలో ఎవరైనా ఒకరు ముందే అన్ని చోట్లకు వెళ్లి ఏ నాటకాలు వేయాలో సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా మేము ప్రదర్శించిన నాటకాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అటు సాహిత్యరంగాన్ని, ఇటు నాటకరంగాన్ని సమన్వయం చేసుకుంటున్నాం. దాదాపు వెయ్యి మంది సభ్యులున్నారమ్మా. మాకు ప్రతీ సంవత్సరం మూడు నుంచి ఆరు లక్షల ఖర్చు ఉంటుంది. వాటికోసం మేమేమీ కష్టపడకుండా ఎంతోమంది నుండి ఆర్థిక సహకారం లభిస్తూనే ఉంది. మాకు అర్థమైంది ఒక్కటే. పని చేసి ఫలితాన్ని చూపిస్తే సహకారం చేసేందుకు ముందుకు రావడానికి ఎవరూ వెనుకాడరని.

16. సహృదయ సంస్థ తరఫున మీరిచ్చే పురస్కారాలను గురించి చెప్పండి.
జ :-    మేము సంవత్సరానికి నాలుగు కార్యక్రమాలు తప్పనిసరి చేశాం. వార్షికోత్సవ సందర్భంగా ఒద్దిరాజు సోదరుల మీద ఒక పురస్కారాన్ని ఇస్తున్నాం. 25 ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. వారి కుటుంబీకులే దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇందులో అయిదు ప్రక్రియలు తీసుకున్నాం. మొదటి సంవత్సరం నవల, రెండవ సంవత్సరం కథ, మూడవ సంవత్సరం వచన కవిత, నాల్గవ సంవత్సరం పద్యకవిత, అయిదవ సంవత్సరం సాహిత్య విమర్శ. ఇట్లా అయిదు ఆవృతులైనాయి ఇప్పటికి. అంటే 25 మందికి ఇచ్చాం. గరికపాటి నర్సింహారావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు, అల్లం శేషగిరిరావు గారు, కేశవరెడ్డి గారు, నాళేశ్వరం శంకరం గారు, కాలువ మల్లయ్య గారు, డా. బన్న ఐలయ్య గారు, ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారు ఇట్లా ప్రముఖులకు ఇచ్చాం. జనవరి, ఫిబ్రవరిలో పేపర్ ప్రకటన ఇచ్చి వచ్చిన వాటిని స్క్రూటినీ చేస్తాం. ఇద్దరు న్యాయ నిర్ణేతలను ఎంచుకుంటాం. వారెవరన్నది వాళ్లిద్దరికి కూడా తెలియదు నాకు తప్ప. వార్షికోత్సవ సభకు ఆ న్యాయ నిర్ణేతలను కూడా పిలుస్తాం. ఒకసారి ఎల్లూరి శివారెడ్డి గారికి, ఎస్వీ రామారావు గారికి ఇచ్చాను. వాళ్ళు పక్క పక్కనే కూర్చుంటారు. కానీ వాళ్లకు తెలియదు. సభలో ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోయారు. మాకు చెప్పలేదు అన్నారు (నవ్వేస్తూ). ఇట్లా ఎందుకంటే అవార్డుల విషయంలో కొంత అనుమానం ఉంటుంది. పారదర్శకత కోసం నాకు మాత్రమే తెలిసేలా ఈ పద్ధతి పాటిస్తున్నాం. ఆంధ్రదేశం మూలమూలల నుండి ఎంతోమంది ప్రముఖులను జడ్జీలుగా పెట్టాము. 25 సంవత్సరాలుగా ఏ ఇబ్బందులు వచ్చినా ఆపలేదు. జి.వి. సుబ్రహ్మణ్యం గారు “మీ ప్రియారిటీస్ ఏముంటాయి?” అన్నారు. అదేమీ లేదు సార్. “మీరు ఏది చెబితే అదే మా ప్రియారిటీ” అన్నాను. ఆయన ఎంతో ఆనందించారు. “కవిత్వానికి ఇస్తారు. సాహిత్య విమర్శకు ఇచ్చేవాళ్లను నేను చూడలేదు” అని ప్రశంసించారు.

17. మీ సంపాదకత్వంలో వెలువడిన రచనలేవి?
జ : కరీంనగర్ లో శ్రీభాష్యం విజయసారథి గారు మహా సంస్కృత విద్వాంసులు. ప్రతి సంవత్సరం మేమక్కడ కార్యక్రమాలు చేస్తుంటాం. 25 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ‘విశ్వారణి’ అని ధర్మాన్ని గురించి, ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఒక సంచిక వేయలనుకున్నాము. పుల్లెల శ్రీరామచంద్రుడు మాకు గురువు. ఆయన, రఘునాథాచార్యులు గారితో వ్యాసాలు తెప్పించి నా సంపాదకత్వంలో అదొక పుస్తకం వేశాను. మా సహృదయ వార్షికోత్సవ సందర్భంగా ఒక పుస్తకం, రజతోత్సవంలో ‘రసహృదయ’ అనే పేరుతో ఒక పుస్తకం వేశాను. సుప్రసన్నాచార్య గారి 80 ఏళ్ల వయస్సులో అసీతి ఉత్సవ సందర్భంగా వారి రచనలను గురించి వేశాను. దహగం సాంబమూర్తి అనే పెద్దమనిషి 80 ఏళ్ల సందర్భంగా పుస్తకం వేద్దామంటే ఆయన వద్దని ‘భారతీయ చింతన’ గురించి వేద్దామన్నారు. అందరినీ ఆహ్వానించి రాయించాను. వేదాలంటే ఏమిటి ? ఉపనిషత్తులంటే ఏమిటి? ఇట్లాంటి వాటికి సంబంధించి 90 వ్యాసాలు వచ్చాయి. ఇటీవలే ‘భారతీయ చింతన’ పేరుతోనే మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ గారు, శ్రీరంగాచార్య గారు ఆవిష్కరించారు. వీలైనంత వరకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించాలనే నా తాపత్రయం. ఓరుగల్లు వైభవం, గడియారం రామకృష్ణ శర్మ గారి శతపత్రము ఇలాంటివన్నీ నా సంపాదకత్వంలో వెలువడ్డాయి.

18. శతక సాహిత్యంపై మీకు ఎక్కువ మక్కువ కలగడానికి కారణం ఏమిటి?
జ :-  నాకు తెలుగులో శతక సాహిత్యం మీద ముందు నుండే ఆసక్తి ఎక్కువ. ఏ పద్యానికి ఆ పద్యమే అయినప్పటికీ మానవ విలువలకు మొదటి మెట్టు శతకమే. మా నాయనగారు చిన్నప్పుడు అన్నీ శతక పద్యాలే నేర్పించారు. కాబట్టి శతకాల మీద ఆలోచన చేసే కొద్దీ ధర్మపురి శేషప్ప కవి 17వ శతాబ్దంలో రచించిన “అధిక విద్యావంతులప్రయోజకులైరి పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి” అన్నట్లు ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే కదా! ఎంత గొప్ప మాట అది. “ఎండిన ఊళ్ల గోడెరిగింపడెవ్వడు, పండిన ఊళ్లకే ప్రభువులంత” అన్న కాళోజీ మాటలకు ఆయన కవిత్వం గురించి ఎంత గొప్పదిగా ఉందని అంటే కాళోజీ గారు “ఇన్ని కాలాలైనా ఇప్పటికీ గొప్పదిగా ఉందంటే, నేనిక్కడ సంతోషపడాల్నో దుఃఖపడాల్నో తెలియదయ్యా! నేను రాసింది బాగుందని సంతోషపడాల్నో, ఇప్పటికీ ఏమీ మారలేదని దుఃఖ పడాల్నో” అన్నారట. శేషప్పకవి ఇప్పుడుంటే అలాగే అనేవాడేమో( పెద్దగా నవ్వుతూ). మానవులకు సరియైన మార్గ నిర్దేశం చేసేది శతకమని నా విశ్వాసం. ఆలిండియా రేడియో వాళ్ళు అప్పట్లో ఒక సిరీస్ గా 20 శతకాలను పరిచయం చేయుమని నన్నడిగారు. దాన్ని తర్వాత ‘శతక సమీరం’ అనే పుస్తకంగా వేశాను. నేను రిటైర్ అయ్యేముందు “తెలుగు శతకాలు – సామాజిక, నైతిక విలువలు” అనే అంశం తీసుకొని కన్నడ శతకాలు, సంస్కృత శతకాలు వీటి మీద మద్రాస్ మరియు ఇతర ప్రాంతాల నుండి పెద్దవాళ్లను పిలిపించి కాలేజీలో సెమినార్ పెట్టాను. ఉదాహరణకు ధూర్జటి “రాజుల్మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు” అంటూ పరిపాలకుల్లో ఉన్న దుర్మార్గాలను ఎండగట్టాడు. ఇట్లాంటివి ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యం. వేణుగోపాల స్వామి శతకం, ఆంధ్రనాయక శతకం, గోగుల పాటి కూర్మనాథకవి సింహాద్రి శతకం మొదలైన వాటిపైన ప్రసంగాలు పెట్టించాను. రాజమండ్రి మొదలైన ప్రాంతాల నుండి ఎంతోమంది వచ్చారు. అవన్నీ కలిపి పుస్తకం వేశాను.

19. మీ రచనా వ్యాసంగం, దృశ్య మాధ్యమాల్లో మీ వ్యాఖ్యానాలు, ప్రసంగాలను గురించి చెప్పండి.
జ : రచనా రంగంలో అనేక పత్రికలకు వ్యాసాలు రాశాను. ఆ కాలంలో భారతి పత్రికకు కూడా రాశాను. ఆంధ్రజ్యోతిలో ‘పరంజ్యోతి’ అనే ఒక శీర్షిక వచ్చేది. ఆధ్యాత్మికమైనది. కరోనాలో దాన్ని ఎత్తివేశారు. కరోనా కాలంలో కొన్ని పేజీలు కూడా తగ్గించారు. అందువల్ల కొన్ని శీర్షికలను తీసివేశారు. తీసివేయడానికి మొట్ట మొదట వారికి కనిపించింది ఆధ్యాత్మిక శీర్షిక. ఏం చేస్తాం? నమస్తే తెలంగాణలో ‘నమస్తే నమః’ అనే శీర్షికలో భగవద్గీత మీద నేను రాశాను. ఇక దృశ్య మాధ్యమాల్లో  వేంకటేశ్వర భక్తి ఛానెల్ కంటే ముందు తిరుపతి బ్రహ్మోత్సవాల్లో లైవ్ చెప్పేవాడిని. పద్ధెనిమిది సంవత్సరాలు వ్యాఖ్యానం చెప్పాను. ధర్మపురిలో కేసీఆర్ ప్రారంభించిన గోదావరి పుష్కరాలకు వ్యాఖ్యానం చెప్పాను. కర్నూలులో తుంగభద్ర పుష్కరాలకు చెప్పాను. మేమొక తొమ్మిది మందిమి ఉండేవాళ్ళం. రొటేషన్ లో మూడు నెలలకు ఒకసారి తిరుపతికి వెళ్లి రెండు రోజులు ఉండి స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలకు వ్యాఖ్యానం చెప్పేవాడిని. చేతకాక ఇప్పుడు వెళ్లడం లేదు. టివి లో CVR ఛానల్లో పద్యాలను పరిచయం చేస్తూ పద్య సౌరభం అనే పేరుతో దాదాపు నలభై ఎపిసోడ్లు చేశాను. TV9 లో అంపశయ్య నవీన్ గారిని, కోవెల సుప్రసన్నాచార్య గారిని ఇంటర్వ్యూ చేశాను. దూరదర్శన్ వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయల 500 పట్టాభిషేక సందర్భంగా కవిసమ్మేళనం లైవ్ పెట్టినపుడు పాల్గొన్న 25 మందిలో నేనూ ఒకడిని. “మహా కవులకు నీరాజనం” అనే కార్యక్రమంలో సుప్రసన్నాచార్య గారు నన్నెచోడుడుగా, గరికపాటి వారు తెనాలి రామకృష్ణుడుగా, నంది తిమ్మనగా నేను నీరాజన సమర్పణ చేశాం. అదంతా పుస్తకంగా వచ్చింది. సాహిత్య కార్యక్రమాల కోసం దేశమంతటా తిరుగుతూనే ఉంటాను. తీసుకుపోయే వాళ్ళుండాలి అంతే (పెద్దగా నవ్వుతూ). ఇదంతా ఒక రకంగా నా సాహితీ యాత్ర అనుకోండి.

20. ఆంధ్ర సారస్వత పరిషత్తుతో మీకున్న అనుబంధం ఎటువంటిది?
జ : చిన్నప్పటి నుండీ సారస్వత పరిషత్తు నాకు తెలియకుండానే పరిచయం అయింది. మా ఊళ్ళో 1953లో ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవాలు జరిగాయి. మా నాన్నగారు దానికి కార్యదర్శి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చారు. ఆంధ్రదేశంలో ఉన్న పండితుల్లో ఒక్క మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, వేలూరు శివరామ శాస్త్రిగారు ఆరోగ్యం బాగా లేక తప్ప అందరూ వచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ గారు స్నాతకోపన్యాసం. రాధాకృష్ణన్ గారు ప్రారంభకులు. రాని తెలుగువారు లేరట. వాటికి సంబంధించిన కరపత్రాలు అవన్నీ మాఇంట్లో ఉండడం, మా నాయనగారు, రామకృష్ణ శర్మగారు ఎప్పుడూ దాని గురించి చెబుతూ ఉండడం వల్ల సారస్వత పరిషత్తు మాదే అన్నట్టు ఉండేది. నేను హైదరాబాద్ కు వచ్చిన తరువాత రోజూ పరిషత్తుకు వెళ్ళేవాడిని. ఏవో మీటింగులు జరుగుతూనే ఉండేవి. ఒకసారి రామానుజరావుగారు “మీవాడు ఎమ్.ఏ. చేస్తున్నానంటున్నాడు కానీ ఎప్పుడూ ఇక్కడే కనిపిస్తున్నాడు” అని శర్మ గారితో అన్నారు (నవ్వుతూ). శర్మ గారి కుమారుడు శ్రీవత్స అని పరిషత్తులో లైబ్రేరియన్ గా చేస్తుండేవాడు. నేనెప్పుడూ వానితోనే ఉండేవాడిని. రామానుజరావు గారు ఎప్పుడు వచ్చినా అక్కణ్ణే కనిపించేవాడిని. ఆయన ఎంతో క్రమశిక్షణ కలవారు. ప్రతి నెలా మొదటి ఆదివారం ఒక విషయం మీద ప్రసంగం, చర్చ ఉండేవి. కె.కె. రంగనాథాచార్యులు గారని ఉండేవారు. ఆ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం నుండి అందరినీ తీసుకొచ్చే బాధ్యత నామీద పెట్టారు.
పన్నెండు పన్నెండు చొప్పున ఆ ప్రసంగాలను ఆరు సంవత్సరాలు ఆరు పుస్తకాలుగా వేశారు. ఎంతో విలువైన పుస్తకాలవి. అకాడెమీ మీటింగులు జరిగేవి. దాశరథి గారు వంటి ప్రముఖులు వచ్చేవారు. వాళ్ళందరినీ శర్మగారే నాకు పరిచయం చేశారు. దాన్ని ఎప్పుడూ మా ఇంటి సంస్థ గానే భావించాను.

21. పరిషత్తుతో అంతగా మమేకమైన మీకు దాని రథసారథి దేవులపల్లి రామానుజరావు గారి పురస్కారం పొందడం ఎటువంటి అనుభూతిని ఇచ్చింది?
జ : నేను అమెరికాలో ఉన్నప్పుడు శివారెడ్డి గారు ఫోన్ చేసి దేవులపల్లి రామానుజరావు గారి పురస్కారాన్ని ఈసారి నీకే ఇస్తున్నాం అన్నారు. ‘నాకెందుకు సార్?’ అన్నాను. “లేదు లేదు నీవు రావాల్సిందే!” అన్నారు. మిగతావి ఏవేవో పురస్కారాలు, యూనివర్సిటీ కీర్తి పురస్కారాలు ఏవో వచ్చాయి కానీ వాటి మీద ధ్యాస లేదు. చిన్నప్పటి నుండీ దాంట్లో మమేకమై ఉండడం వల్ల సారస్వత పరిషత్తు నుండి అవార్డు పొందడం గొప్ప అనుభూతి. ఆ సంస్థ 75 ఏళ్ల సంచికలో ‘అక్షరయానం – ఆత్మీయబంధం’ అని రాశాను. 1974 నుండే అది నాతో నడుస్తూనే ఉంది.

22. చివరగా సాహితీ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన మీరు ఇప్పటి రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.
జ : మీరడిగిన దానికి ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెబుతాను. సినారె గారు ప్రతి రోజూ క్లాస్ కు ప్రిపేర్ అయ్యేవారు. ఒకసారి “ఇన్నేళ్ళుగా చెబుతున్నారు కదా! ఇంకా ఎందుకు ప్రిపేర్ అవుతారు?” అని ఆయనను అడిగాను. “వీళ్ళు మహా కవులు. మన అనుభవం పెరిగే కొలది కొత్తగా దర్శనమిస్తారు” అన్నారాయన. గొప్ప సత్యమది. నిజానికి ఆయన చదవవలసిన పని లేదు. అది ఇప్పుడు నా అనుభవంలోకి వస్తోంది. నేనిప్పుడు చదువుతుంటే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సార్వకాలీనత అనేది ప్రాచీన కవుల్లో ఎందుకున్నదనడానికి ఒక రామాయణం, భారతం, ఇతర కావ్యాలు నిలబడ్డాయంటే దాంట్లో అన్ని కాలాలకు ఉపయోగపడే ధర్మాలున్నాయనే కదా! అంతే కాదు “ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం ఉండదయ్యా! కవిత్వం ఉంటుంది. పాతవాళ్ళు రాస్తే ప్రాచీనం, కొత్తవాళ్ళు రాస్తే ఆధునికం. మనం చేయవలసింది సమన్వయించుకోవడం, కవిత్వం ఏ స్థాయిలో ఉందో చూడగలగడం. ప్రాచీనమైనా, ఆధునికమైనా ఉత్తమ సాహిత్యం నిలబడుతుంది” అని సినారె గారు చెప్పిన మాటలు అందరికీ శిరోధార్యాలు. సాహిత్య విద్యార్థులు, సాహిత్యాభిమానులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రతీ ఒక్కడూ మహాకవి అయిపోయినాడు. అధ్యయనం పూర్తిగా తగ్గిపోయింది. వాళ్లకు వాళ్లే గొప్ప. ఎదుటివాళ్ళ గొప్పతనాన్ని గుర్తించే స్థాయి లేదు. ఈ దుస్థితి నుండి బయటపడి మంచి సాహిత్యం రావాలి.

        ధన్యవాదాలు సార్. మీ అత్యంత విలువైన సమయాన్ని మా ముఖాముఖి కార్యక్రమానికి వినియోగించి, మీ సాహితీ ప్రయాణాన్ని, ఆధ్యాత్మిక విశేషాలను వివరించినందుకు మా తరఫున మా మయూఖ పాఠకుల తరఫున అభివందనాలు.

       తమ జీవితాన్ని పూర్తిగా విశేషమైన సాహితీ సేవకు అంకితం చేసిన ధన్యజీవులు గిరిజా మనోహర్ బాబుగారు. వారు మునుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ సెలవు🙏🏼

You may also like

Leave a Comment