భగవంతుని దృష్టిలో, సృష్టిలో మానవులంతా ఒక జాతి. సంఘంలో స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్వాములు. సంసారపు బండికి రెండు చక్రాలు. సంమాజంలో సగం సగం. ఒక జాతి జీవన విధానం ఆ జాతి తమ స్త్రీలకిచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది. అన్నాడొక ఫ్రెంచి దేశీయుడు. మానవ జాతిని సృష్టించే ముందు సృష్టికర్త తననుతాను రెండు భాగాలుగా విభజించుకున్నట్టు చెప్పే అర్ధనారీశ్వర సిద్ధాంతం ఒక భారతీయ సంస్కృతిలోనే ఉంది. ధర్మాచరణలోను, కుటుంబ విధుల నిర్వహణలోను భారతీయ స్త్రీలకున్న విశిష్ట స్థానం మరే ఇతర దేశాల ప్రాచీన సాహిత్యంలో, పురాణ గ్రంథాల్లోను కనిపించదు. ”యత్ర నార్యన్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” అంటే స్త్రీలు గౌరవించ బడిన ఇల్లల్లో దేవతలు విహరిస్తారు అన్న సూక్తులను బట్టి మన ప్రాచీనులు స్త్రీకి సమాజంలో ఎలాంటి మహోన్నత స్థానాన్ని ఇచ్చారో గ్రహించవచ్చు. ”మాతృదేవోభవ” అని ముందు తల్లికి, ”పితృదేవోభవ” అని తండ్రికి, ఆ పిదప = ”ఆచార్యదేవోభవ” అని గురువులకు నమస్కరించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఇంకా సరస్వతీదేవి మనకు చదువుల తల్లి. లక్ష్మీదేవి సంపదలను, భోగభాగ్యాలను ఇచ్చే తల్లి, పార్వతీదేవి శక్తి స్వరూపిణి, అందరినీ రక్షించే అమ్మ. ఈ ముగ్గురు మనకు ”మూలదైవాలు”. దీన్ని బట్టి మనదేశంలో, మన సమాజంలో స్త్రీలంటే ఎంతటి గౌరవ ప్రతిపత్తులు, భక్తి భావాలున్నాయో తెలుస్తుంది.
మన ప్రాచీనులు తాము అనుభవించే అన్ని కష్టసుఖాలు స్త్రీల పైనే ఆధారపడి ఉంటాయని భావించారు. ధర్మార్థ, కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలను సాధించడానికి తోడు స్త్రీ కావాలన్నారు. అందుచేత పురుషుడు స్త్రీలను అనుసరించి వారి ఇష్టాలకు అనుగుణంగా తమ అభిమతాలను మార్చుకోవాలని నిర్దేశించారు. ధర్మసంస్థాపన, తద్వారా సంఘ సంక్షేమంలో స్త్రీలకు సమానమైన ప్రాధాన్యత ఉందని భావించారు. స్త్రీ పురుషులలో ఒకరు అధికులు, మరొకరు తక్కువ అనే భావన వారి దృక్పథంలో లేనేలేదు. ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగల ‘నేర్పరి’ స్త్రీయని భావించి ‘గృహలక్ష్మి’గా ఆమెకు మహోన్నత స్థానాన్ని కల్పించారు. విశ్వమంతా స్త్రీమూర్తిగా భావించారు. ఇదే ఒరవడిలో డాక్టర్ సి.నారాయణ రెడ్డిగారు తమ ‘ప్రపంచ పదులు’ అనే కవితలో ”ఆకసమే బీజ ప్రదాతగ, అవనియే ఒక ఆదిమాతగ, కాంచగలిగిన మానవునకు జగజ్జనావళి ఒకే కుటుంబం” అని నొక్కి వక్కాణించారు. మన పూర్వీకులు నారీరహితుడైన పురుషుడు పరిమళం లేని పుష్పమని భావించారు. గృహస్థాశ్రమం ఎరుగని పురుషుడు మోక్షానికి అనర్హుడని చెప్పారు. స్త్రీల శ్రేయస్సును కోరుకునే ప్రతి తండ్రి, భర్త, సోదరుడు స్త్రీని గౌరవించాలన్నారు ‘మనువు’. అదే సందర్భంలో ”పితారక్షేతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, రక్షాన్తి వార్ధక్యే పుత్ర, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అనే ద్వంద్వభావాన్ని వెలిబుచ్చారు. ఇది స్త్రీలపై ఉండే ప్రేమ, గౌరవం, కారుణ్యమో తెలియదు. ఏది ఏమైనా ఆధునిక మహిళలకిది చర్చనీయాంశమే. వివక్షా పూరితమైన మహిళల జీవన విధానానికి, కొడుకులు కోడండ్ర నిరాదరణకు గురై వృద్ధాశ్రమాల్లో మగ్గే స్త్రీలకు, సాంఘిక దురన్యాయాలకు బలయిన వితంతువులకిది చుక్కెదురే. ఈరోజు మనం సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక, విద్యా వైద్య రంగాలలో, క్రీడా ప్రపంచంలో ప్రగతిని సాధించాం అనుకుంటే అది కూడా పురుషుల కంటె తక్కువే. నేటికీ సమాజంలో స్త్రీ స్థాయి, హోదా ద్వితీయ శ్రేణికి చెందినదే అంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా వేదకాలం నుంచి నేటివరకు స్త్రీ స్థాయి హోదా ఎలా ఉందో పరిశీలిద్దాం.
– వేదకాలంలో పురుషునితో సమానంగా స్త్రీకి స్థానం ఈయబడింది. ఆనాడు స్త్రీలు యజ్ఞ యాగాదుల్లో పాల్గొనేవారు. ధర్మవిధులను పాటించేవారు. యుద్ధ రంగాలకు పోయి పురుషులతో ధీటుగా యుద్ధాలలో పాల్గొనేది. నాటి స్త్రీలు ఆయుధవిద్యను అభ్యసించేది. ఉదా: సత్యభామ, కైకేయి, ఖేలుని భార్య ‘విస్ఫల’ యుద్ధంలో కాలు పోగొట్టుకుంది. ముద్గలుని భార్య ‘ముద్గలాని’ శత్రువులను తరిమి కొట్టింది.
– ఆనాడు స్త్రీలు కవులుగా, ఋషులుగా పేరు పొందారు. భాష, సాహిత్యం, లలిత కళలు అన్నీ స్త్రీలకు అందుబాటులో ఉండేవి. ఘోష, లోపాముద్ర, అపాల, రోమష, సూర్య మొదలైన వారు వివిధ రంగాలలో గణనీయులు.
– పండుగలు, పబ్బాలు, తాత్త్వికమైన చర్చలల్లో వాటి స్త్రీలు పాల్గొనేవారు. ఉపనిషత్తుల కాలంలో ‘బ్రహ్మజ్ఞాన’ సముపార్జన విషయంలో పురుషులతో ‘నమనీయ’గా ఉన్న స్త్రీలు గార్గి, మైత్రేయి, పదవ ప్రాథితేయి. నాటి విద్యార్థినులు రెండు రకాలు. జీవితాంతం మతశాస్గ్రాన్ని అధ్యయనం చేసేవారు బ్రహ్మవాదినులు, వివాహమయ్యేవరకు విద్యనభ్యసించువారు సద్యోద్వాహులు.
– రుగ్వేదంలో కొన్ని రుక్కులు స్త్రీలు రాశారని చెప్పబడుతుంది. అపాల ఇంద్రున్ని కొనియాడుతూ రుక్కు చెప్పింది. విశ్వావర అగ్నిని స్తోత్రం చేసింది.
– కాశకృత్సవ మీమాంసపై ఉద్గ్రంథం రాసింది.
– ఆత్రేయ వేదాంతాన్ని అధ్యయనం చేసింది. ఆమె గొప్ప పండితురాలు. వాల్మీకి, అగస్త్యుని వద్ద ఆమె విద్యనార్జించింది.
– ఆ కాలంలో స్త్రీలకు ఉపనయనం ఉండేది. ఆ కర్మలలో ఆమె నడుముకు పలుపు కట్టేవారు. కర్మలలో పాల్గొనటానికి ఆమెకు ప్రవేశం కల్పించటానికి అది చిహ్నమట.
– బౌద్ధంలో అనేకమంది స్త్రీలు సంఘంలో చేరి సన్యాస జీవితాన్ని గడిపారు. ”తేరీగాథ” అనే గ్రంథాన్ని అలాంటి స్త్రీలు రచించారు.
– గాథా సప్తశతిలో అనేకమంది కవయిత్రుల పేర్లు కనబడతాయి. రేవ, రోహ, మాధవి, అమలక్ష్మీ.
– సంస్కృత కవుల చరిత్రలో పెక్కుమంది స్త్రీల పేర్లు ఉటంకించబడ్డాయి. ఉదా: మారులా, మోరికా, సుభద్రా, ప్రియదర్శిని, శకుంతల, కాదంబరి లాంటి కావ్యాలలో నాయికలు లలిత కళలలో ప్రవీణులు.
– శాతవాహనుల కాలపు నాయనికా క్రీ.పూ. 2 శతాబ్దం
– వాకాటక వంశపు ప్రభావతిగుప్త క్రీ.త. 4వ శతాబ్దం
– చాణక్య వంశపు విజయ భట్టారిక క్రీ.త. 7వ శతాబ్దం
– కాశ్మీరుకు చెందిన సుగంధ దిద్దా క్రీ.త. 10వ శతాబ్దం పరిపాలనాదకక్షులు.
– వయసు వచ్చిన ఆడపిల్లలు గృహనిర్వహణలో ఎక్కువ బాధ్యత తీసుకునేవారు. శకుంతల, కుంతి విధి నిర్వహణ చేసి అతిథి అభ్యాగతులను ఆదరించారు.
– వేద కాలంలో పురాణ కాలంలో స్త్రీలు ‘కందువ’ క్రీడల్లో పాల్గొనేవారు. బంతి ఆట ద్వారా తగినంత శరీర వ్యాయామాన్ని పొందేవారు.
– సర్వ సామాన్యంగా వేదకాలంలో ఆడపిల్లలు ఇంట్లో పెద్దల వద్ద విద్యను అభ్యసించేవారు. స్త్రీలు ఎక్కువ దూరం వెళ్లి విద్యాభ్యాసం చేయలేదని జాతక కథలను బట్టి తెలుస్తుంది.
– వేదకాలంలో కన్య సామాజిక ఉత్సవాలన్నింటిలో పాల్గొనేది. భర్తను వెతుక్కోవటానికి ‘సమనకు’ వెళ్ళేది. తల్లులు కుమార్తెలను అలంకరించి పంపేవారు. వరులు అచట తమకు కాబోయే భార్యల అభిమానాన్ని చూరగొనటానికి ప్రయత్నించేవారు. ‘సమనలు’ సాధారణంగా వసంత ఋతువులో ఏర్పాటయ్యేవి. యువతీ యువకులు చెట్టాపట్టాలేసుకొని నృత్యం చేసేవారు.
– భారతకాలం నాటికి స్త్రీలు, పురుషులు కలిసి ఆడటం ఆగిపోయింది.
– ధర్మశాస్త్ర యుగం – పురాణకాలం స్త్రీకి అంధకార యుగాలని చెప్పవచ్చు. స్త్రీని చూస్తే భయం, స్త్రీని నిరసించడం, ఆమె స్వేచ్ఛను అరికట్టడం, ఆమెను విద్యా విజ్ఞానాలకు దూరంగా ఉంచడం, ఆమె పురుషుని అంటిపెట్టుకొని బతికేలా చేయడం ఆనాటి పురుషుల చర్యలు.
– ముస్లిం యుగంలో పర్దా అవతరించింది. భార్యలను రక్షించుకోవడమే పురుషుల కర్తవ్యంగా పరిణమించింది. విందులు వినోదాలకు స్త్రీ దూరమయింది.
– వాత్సాయనుని కాలానికి వేశ్యాసంగమం ప్రతిష్టాకరమయింది. 10,12 శతాబ్దాలలో నిర్మితమైన దేవాలయాలలో స్త్రీ పురుష శృంగార ఘట్టాలు చిత్రితమైనాయి.
– రజస్వల అయిన స్త్రీ నాలుగు మూరల దూరంలోను, ప్రసవించిన స్త్రీ ఎనిమిది మూరల దూరంలోను ఉండవలెనని బృహస్పతి నిర్దేశించాడు.
– ఋగ్వేదకాలంలో స్త్రీ బలహీనురాలు కాదు. సాహసి, స్వేచ్ఛాజీవి. ఆమెకు వ్యక్తిత్వం ఉండేది. స్త్రీ శిశు జననాన్ని దురదృష్టంగా భావించిన దాఖలాలు లేవు. కాని పురుష సంతానం కావాలని అనేక రుక్కులున్నాయి. పలుసార్లు పురుష సంతానం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేయబడింది.
– బాలిక హోదా మరీ హీనమైనది కాదు. కాని బాలుని హోదాతో మాత్రం సమానమైనది కాదు (అశ్వలాయన గృహ్యసూత్రం)
– అధర్వవేదంలో గొడ్రాలితనం రాకుండా తాయత్తు, పురుష సంతానం కలగటానికి ప్రార్థన, ఆడపిల్ల వద్దని అభ్యర్థనలున్నాయి.
– బ్రాహ్మణాల కాలం సుమారు క్రీ.పూ. 600 వరకు సాగింది. కుమారునికి విలువ పెరిగింది. కుమారుడు మోక్ష సాధనం. కుమార్తెలు బరువుగా ఎంచబడి బాలిక జననం అక్కరలేదని క్రతువులు చేయసాగారు. ఈ క్రతువులను తైత్తరీయ సంహిత నిర్దేశించింది.
– భార్య సహచరి, కుమార్తె దుఃఖభాడనురాలు, కుమారుడు ఉన్నతోన్నత స్వర్గంలో దీపం. (ఐతరేయ బ్రాహ్మణం).
– పురుష ప్రాధాన్యత గల సమాజాన్ని హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు, హిందూ సంస్కృతి ఊహించాయి, పోషిస్తున్నాయి.
– ”విశీలః కామవృత్తోవా – గుణైవ పరివర్జితః ఉపచర్యః స్త్రీయా స్వాధ్యా సతతం దేవత్పతి” (మనుధర్మశాస్త్రం) అనగా భర్త శీలరహితుడైనను, కామ ప్రవృత్తి కలవాడైనను, ఏ సద్గుణములు లేని వాడైనను, భార్య అతనిని దేవునిగా భావించి పూజించవలెనని భావం.
ఈ విధంగా ఒకప్పుడు స్త్రీ జీవితం ఔన్నత్యంతో ప్రకాశించినప్పటికీ, రానురాను ఆమె జీవితంలో అపశ్రుతులు వెల్లివిరిశాయి. ఆమె హోదా, స్థాయిలలో విపరీతమైన పరిణామాలు కలిగాయి. స్త్రీకి ద్వితీయశ్రేణి పౌరసత్వం అంటకట్టబడింది. ఈ సందర్భంగా భర్త మరణానంతరం వితంతువైన ఒక స్త్రీ జీవితాన్ని ఊహించదు. చాలా కష్టసాధ్యమైన పని. అందుకే ఎంతోమంది సంఘ సంస్కర్తలు అప్పట్లో హిందూ సంప్రదాయంలో అమల్లో ఉన్న ”సతీ సహగమనాన్ని” రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. లార్డు విలియం బెంటింగ్, లార్డు కానింగ్ మొదలైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాలంలో ఎంతో ప్రయత్నం జరిగింది. తుదకు 1856లో లార్డు డల్ హౌసీ కాలంలో ”సతీ సహగమన నిర్మూలన” చట్టరూపకంగా వెలువడింది. భర్త చనిపోయిన స్త్రీ వితంతువులకు ఎన్నో విధాలైన నిబంధనలను, ఆంక్షలకు మన పెద్దలు, పండితోత్తములు, సమాజం, సనాతన ధర్మాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు విధించి అమానవీయ దృక్పథాన్ని చాటడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. సాధారణ సమయంలో కూడా స్త్రీలను గురించిన కొన్ని భావనలు చదువుతుంటే, వింటుంటే సభ్యసమాజానికి తలవంపులుగానే ఉంటాయి. ప్రత్యేకించి స్త్రీల గురించి ఇలాంటి ”వివక్ష వైఖరి” ఎందుకుంది? అనేది సమాధానం లేని ప్రశ్న.
స్త్రీని గురించిన కొన్ని భావనలు :
– ‘అస్వతంత్రా ధర్మే స్త్రీ’ ధర్మంలో స్త్రీకి స్వాతంత్య్రమే లేదు.
– భర్త అనుజ్ఞ లేకుండా చేయబడు వ్రతములు రాక్షసులకు చేరునని స్మృతులు చెప్పుచున్నవి. (హిందూ మతం పుట 143)
– ”స్త్రీలు చంచల చిత్తులు” రుగ్వేదం
– ”స్త్రీ అసత్యానికి మారుపేరు” మైత్రాయణ సంహిత
– ”స్త్రీలు అసత్యం అవతారమూర్తి” రామాయణం
– స్త్రీలు క్రూరులు, స్వార్థపరులు – రామాయణం
– స్త్రీలలో మెరుపు యొక్క చంచలత్వం, ఆయుధం యొక్క పదును, డేగ యొక్క వేగం అన్నీ కలిసి ఉన్నాయి. (రామాయణంలో ‘అగస్త్యుని’ పలుకులు)
– స్త్రీలు మనసును అదుపులో పెట్టుకోలేరు (రుగ్వేదం)
– స్త్రీల దుర్గుణాలను లోపాలను వర్ణించాలంటే నూరు నాలుకలు కల మనిషికయినా నూరే&ండ్ల కాలం చాలదు (మహాభారతం)
– స్త్రీలలో చెలిమి అనేది లేదు. వారి హృదయాలు క్రూరమైనవి. (శతపథ బ్రాహ్మణం)
– ”స్త్రీ, శూద్రుడు, శునకం, కాకి అసత్యానికి, పాపానికి, అంధకారానికి మారుపేరు” (శతపథ బ్రాహ్మణం)
– స్త్రీ పాపానికి మూలం (మహాభారతం అనుశాసన పర్వం)
– స్త్రీ చేత పరిపాలింపబడేదే దేశానికి అపకీర్తి సంభవిస్తుంది. స్త్రీ ఆధిపత్యానికి లొంగే పురుషులు అప్రతిష్ఠ పాలవుతారు (అశోకరుద్ర వ్యాసం).
– మనువు, శుక్రుడు – చాణక్యుడు – యాజ్ఞవల్కు ్యడు స్త్రీని తక్కువ చూపు చూశారు.
– ధర్మశాస్త్రాలు, పురాణాలు స్త్రీలకు ద్వితీయ స్థానం ఇచ్చాయి. భర్త నీడలో బతికే మనిషిగా భార్యను మలిచాయి.
– ఋగ్వేదం, అధర్మవేదం, శ్రౌత సూత్రాలు, గృహ్యసూత్రాలు, ధర్మసూత్రాలు, స్మృతులు, ధర్మశాస్త్రాలు వాటి వివరణలో భాష్యాలు మరియు ఇతర గ్రంథాలు, ఇండో ఇరానియనుల వలస – హూణుల శకుల దండయాత్రలు, ముసల్మానుల దాడులు, ముసల్మానుల రాజ్యస్థాపన, పాశ్చాత్యుల దేశప్రవేశం, ఇవన్నీ కూడా హిందూ సమాజంపై ప్రభావం చూపాయి. అంతేకాకుండా, జైన, బౌద్ధ మతాలు కూడా కొంతలోకొంత హిందూ సమాజాన్ని మలిచాయి. స్త్రీల హోదాలో, స్థాయిలో అనేక మార్పుల్ని కలుగజేశాయి. వితంతు వ్యవస్థలో పెనుమార్పులు సృష్టించాయి.
– వేదకాలంలో స్వయంవరాలు ఉండేవి.
– వైదిక వాఙ్మయంలో వర్ణాంతర వివాహాలు కనబడతాయి.
– ఆడపిల్లను అమ్మినవారి సంరక్షకులు ఘోరమైన నరకానికి పోతారని బౌద్ధాయనుడు ప్రకటించారు. ఆడపిల్లను విక్రయించిన వాని ముఖం చూడరాదని పద్మపురాణం శాసించింది.
– భ్రూణ హత్య మహాపాతకమని చెప్పబడింది.
– సుమంగళీ, కళ్యాణీ, గృహలక్ష్మీ, వీరాంగన, సతి, సాధ్వి అని స్త్రీలు పొగడ్తలనందారు. భర్తను కోల్పోయిన స్త్రీని విధవ, వితంతువు అంటూ నీచంగా, హీనంగా చూడడం ఆనవాయితీగా మారింది. బయటి ప్రపంచానికి వారి ముఖం కనిపించగూడదనే ఆంక్షలు మొదలయ్యాయి. వితంతు స్త్రీలు అపశకునంగా పరిగణించబడ్డారు.
– ఏక భార్యాత్వం, ఏక భర్తృత్వం ఋగ్వేద కాలంలో ఉన్న నియమం. వేద కాలం చివరి రోజుల్లో బహుభార్యాత్వం కనబడుతుంది.
– భర్త భుజించిన తరువాత భార్య భోజనం చేయాలని ‘శతపథ బ్రాహ్మణం’లో చెప్పబడింది.
– భార్య భర్త ఆజ్ఞలను శిరసా వహించాలని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.
– రాజులు యోచించు చోట స్త్రీలు ఉండరాదు. పండితుల సమావేశాలల్లో పాలు పంచుకోరాదు.
– గృహ్యసూత్రాల్లో ఒక్క పారాస్కర గృహ్యసూత్రం మాత్రమే బహు భార్యాత్వాన్ని సమర్థించింది.
– బౌద్ధంలో ‘సతీ సహగమనం’ లేదు. పునర్వివాహం ఉంది.
– జైనులలో కొందరు సతీసహగమనాన్ని ఆమోదించారు.
– కాదంబరి రచయిత బాణుడు సతీసహగమనాన్ని నిరసించాడు.
– విధవ నూనె అంటుకొని తలస్నానం చేయరాదని సన్యాసి కారాదని ప్రాచేతనుడు స్కాంద పురాణం (కాశీఖండం)లో విధవ విధులను విశదీకరించాడు.
– భర్త చనిపోయిన స్త్రీ ‘శిరోముండనం’ చేయించుకోవాలనే ఆచారం అమల్లో ఉండేది.
– వేదకాలంలో నాట్యకత్తెలు ఉండేవారు. రాజాస్థానాల్లో నృత్యం చేసేవారు.
– ఆడపిల్లను దేవదాసీలుగా ఇస్తే సూర్యలోక ప్రాప్తి జరుగుతుందని భవిష్యత్ పురాణం చెప్తుంది.
ఆడపిల్లను తక్కువగా చూడడానికి కారణాలు :
– మగపిల్లవాడు వంశాంకురం, వంశోద్ధారకుడు – ఆడపిల్ల పరాయిది.
– కర్మకాండ చేస్తాడు, పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు.
– వంశం నిలుస్తుంది – మోక్ష ప్రాప్తి కలుగుతుంది.
– తల్లిదండ్రులకు సంరక్షకుడు – పోషణభారం వహించేవాడు.
– ఇంటా బయట సహాయం చేస్తాడు. కుటుంబ స్థాయి, శక్తి వారిమీదనే ఆధారపడి ఉంటాయి.
– కుటుంబ ఆర్థికాభివృద్ధికి, కష్టకాలంలో ఆదుకోవడానికి, కుటుంబ నిర్వహణకు తోడ్పడతాడు అనే ఎన్నో ఇతర భావనలు వివక్షతకు కారణాలు.
– భార్య చనిపోయిన పురుషున్ని గుర్తించడానికి సమాజం అతనికి ఎలాంటి నిబంధనలను అంటగట్టడం లేదు. ఆడవాళ్లకు మాత్రమే ఎన్నో ఆంక్షలు. మగవాళ్లు పెండ్లిల్లు, పేరంటాలలో (నిక్షేపంగా) కుంకుమ బొట్టు ధరించవచ్చు, ఉంపుడుకత్తెల్ని పెట్టుకొని, ద్వితీయ వివాహం చేసుకొని, నిక్షేపంగా లైంగిక కోర్కెలను తీర్చుకోవచ్చు. వీలైతే చిన్న ఇల్లు, పెద్ద ఇల్లును నిర్వహించుకోవచ్చు. కొందరు పురుషులు మాత్రం నూలు మొలతాడు తీసివేస్తారట. వెండి మొలతాడును ధరించవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు లేవు. భర్త చనిపోయిన స్త్రీలను మాత్రం విధవ, వితంతువు, ముండతనం అనే భాషా పదాలను అంటగట్టి అనాదిగా అదీ ఒక సాంఘిక ఆచారంగా, కట్టుబాటుగా తయారుచేసి స్త్రీ శక్తి కుంచించుకుపోవడానికి ఎవరు కారణభూతులు?
– నేటి సమాజంలో మగబిడ్డలను కన్నతల్లి హోదా పెద్దది. మగపిల్లవాడు కుటుంబానికి ఒక పెట్టుబడి. పూర్వీకుల ఆస్తికి వారసుడు.
– ఆడపిల్ల ఆర్థిక భారం, ఆమె పుట్టుక, పోషణ, చదువు, వివాహం, ఉద్యోగం, సంపాదన, కుటుంబ నిర్వహణ అన్నీ సమస్యలే. అందుకే భ్రూణహత్యలు, చెత్త కుండీలల్లో పారేయడం, రైల్వే ట్రాకులల్లో, పొదలల్లో పారేయడం, బతికి బట్టకట్టిన వారిని అమ్మేయడం. ఈనాడు సాధారణ స్త్రీలనే ఎన్నో రకాలైన కష్టాలు, కడగండ్లు చుట్టుముడుతున్నాయి. ఇంకా విధవలు – వితంతువుల అగచాట్లు చెప్పనవసరం లేదు.
– అనాదిగా స్త్రీ శృంగారవస్తువు, విలాసవస్తువు, పడకటింటికి పరిమితం, వంటింటి కుందేలు, శక్తీహీనురాలు, బలహీనురాలు, అబల, సుకుమారీ, ఆటబొమ్మ, చెల్లింపు లేని పనిమనిషిగా భావించ బడుతుంది.
– శారీరక నిర్మాణంలో తేడాలున్నాయనే సాకుతో సామాజిక అసమానత్వాన్ని సమర్థించే వాదన.
– స్త్రీ ఇష్టపూర్వకంగా తన వ్యక్తిత్వాన్ని నశింపజేసుకోవడం, పురుషాధిపత్యానికి లొంగి ఉండడం, శ్రమశక్తి దోపిడీకి గురికావడం, సామాజికంగా హక్కులు లేకపోవడం, ఉన్నా అవగాహన చేసుకోక పోవడం, తమ ఇంటిలోనే తాము బానిసలుగా బతుకుతూ బానిసత్వానికి లోను కావడం, ఉంపుడు కత్తెలుగా బతకడం ఇవన్నీ వ్యక్తిత్వ వినాశ లక్షణాలు.
– ఆడపిల్లలు మగపిల్లలు తల్లిదండ్రులకు రెండు కళ్లు. ఈ సృష్టి ప్రకృతి పురుషుల కలయిక. సృష్టిలో పరాత్పరుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానులు. ఆకాశంలో సగం – ఆకాశంలో విభజన రేఖలు లేవు. అఖిలాండ కోటి బ్రహ్మాండానికి ఆదిశక్తి, పరాశక్తి, అపారశక్తి స్త్రీ. సంతాన ప్రాప్తిలో మానవ జీవిత పరిణామ గతిలో ఇద్దరూ సమానులు. పురుషుడు బీజప్రదాత, అవనీతల్లి మాత. ఇద్దరూ సగం – సగం – కాని సగాలు సమానం కాని విడ్డూరమైన గణితశాస్త్రం చిక్కుముడుల లెక్కల్లో చిక్కుకుపోయిందీ సమాజం. ”అంతరించిపోతున్న వింతజాతి ఆడజాతి”. పురుషాధిపత్యానికి, శరీర, ధన, మాన, ప్రాణాలను అర్పించిన వ్యక్తిత్వం లేని ఆటబొమ్మగా జీవిస్తుంది. ‘అబల’ అనే సామాజిక ముద్ర వేయించుకుంది. అలాంటప్పుడు వేరుగా విధవలు – వింతతువుల జీవన పరిధులను, పరిణామాలను గురించి ఆలోచించడం, అంచనా వేయడం విడ్డూరం. సమాజంలో ఒక స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం, మర్యాద, విలువ, స్థాయి, హోదాతోనే అని ముడివడి ఉంటాయి. ఈ తారతమ్యానికి కారణాలు: 1. మత సంస్కృతి, 2. సనాతన సంప్రదాయాలు, 3. ఆచారాలు, నమ్మకాలు, కట్టుబాట్లు, 4.హక్కులు విధులు, బాధ్యతలు, కర్తవ్యాలు, ధర్మాలను తెలుసుకోకపోవడం, 5.అసమానత, అవిద్య, అజ్ఞానంలో కొట్టుమిట్టాడడం.
తరాలు మారినా తల్లిదండ్రులకు, సమాజానికి ఇష్టంలేని ఉపేక్షిత శిశువుగా, చెల్లింపులేని పనిమనిషిగా స్త్రీ జీవితం అన్ని థలల్లో నేటికీ అభాసుపాలవుతూనే ఉంది. అవివాహిత, గొడ్రాలు, విధవ, అభాగిని, కులట అని స్త్రీలను ఎన్నో విధాలుగా ఈనాటి సమాజం అవహేళ చేస్తూనే ఉంది. మనం మన సమాజం మారేదెప్పుడో?