Home వ్యాసాలు మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర

మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర

ఆదికవి నన్నయ్య వేదిక ఉ//9గం.లు
విజయవాడ లో 5వ ప్రపంచ తెలుగు మహాసభల్లో నా ప్రసంగం:


19 వ శతాబ్దపు చివరి దశాబ్దాల నుండి ప్రస్తుత పరిస్థితి వరకు ఆధునిక కాలంగా భావించవచ్చు. ఈ కాలంలో వచ్చిన ప్రధాన మార్పులు జాతీయ వాదం , దేశభక్తి, ప్రగతిశీల అభ్యుదయ భావాలు, స్త్రీ విద్య,బాల్య వివాహాల రద్దు ,వితంతు వివాహాలు, సామ్యవాద దృక్పథం తో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, కార్మిక కర్షక వర్గాల శ్రేయస్సు, ఆధునిక వైజ్ఞానిక అవగాహనా దిశగా హేతువాద దృక్పథం పెంపొందించడం యిత్యాదులు ‌.వీటన్నిటి నేపథ్యంలో కూడా ఆథ్యాత్మిక చింతన కూడా మనిషి వైఖరిలో మార్పుకు , మంచి వైపుమరలడానికి దోహదం చేసింది.
ఈ పై భావజాలాల దృష్ట్యా రచయితలు, కవులు తమ తమ రచనల ద్వారా మంచి మంచి ఫలితాలు సాధించారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు రామమూర్తి పంతులు, వంటి వారు ఏర్పరచిన దారిలో గాడిచర్ల, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, త్రిపురనేని, తాపీ వంటి వారలు చాలా వరకు లక్ష్యాలు సాధించారు.
అందు వల్లనే కుల ,మత బేధాలు తగ్గి సమైక్యంగా అందరూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనగలిగారు. సురవరం ప్రతాప రెడ్డి, సరోజినీ నాయుడు, దాశరథి సోదరులు, కాళోజీ సోదరులు, ముఖ్దూం మొయినుద్దీన్, షోయబుల్లాఖాన్, అడవి బాపిరాజు వంటి వారలు ప్రత్యేక ముద్ర వేశారు.దేవులపల్లి రామానుజరావు వంటి వారలు ఆసులో దారంలా యీఅన్ని భావాల వైఖరులు ఉద్యమాల సంధానకర్తలుగా దీప్తి నందించారు.
గరిమెళ్ళ సత్యనారాయణ వంటి కవి గాయకులు గాంధీ శకానికి/ యుగానికి ప్రతినిధులు. వారి పాటల ద్వారా ప్రజలలో మంచి భావావేశాన్ని కలిగించారు. వామపక్ష సోషలిస్టు దృక్పథాలు ఫలితాలు సాధించి ఆధునిక ప్రజాస్వామ్య ప్రయాణాన్ని బలోపేతం చేశాయి.
ప్రజాస్వామ్య యుతంగా , రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వాల్ని ఏర్పరచుకోవడం , ప్రభుత్వాల్ని మార్చడం అనేది అతిపెద్ద సామాజిక మార్పు . దీనికి రచయితలు కవులు ఎంతో దోహదం చేశారు. నిరక్షరాస్యులైనా , గ్రామీణులైనా దళిత గిరిజనులైనా తమ తమ విచక్షణ జ్ఞానం ద్వారా ప్రభుత్వాల్ని మార్చడమనేది ఒక గొప్ప శుభ పరిమాణం, పరిణామం. దీనికి రచయితలు కవితలు , నాటకాలు, పాటలు , బుర్రకథలు యిత్యాదుల ద్వారా ప్రజల అవగాహనకు తోడ్పడ్డారు.
కుల మతాల సాంప్రదాయ భావజాలాలు పునర్వికాసం చెందుతున్నాయి. ఒకప్పుడు ఉద్యమ రూపంలో కలిసి పనిచేసినవారు ,పోరాడినవారు కొంత కాలానికి కుల మత భావజాలాలకు లోనవుతున్నారు.
ఛందో రూపమైన ప్రాచీన సాహిత్యం కన్నా వచన కవిత్వం విశేష ప్రాచుర్యం లోనికి వచ్చింది.ఐనా మంచి పద్యాలు, సమస్యొ పూరణలు వస్తున్నాయి. తిరుపతి వేంకట కవులు, కొప్పురపు కవులు , జాషువా, విశ్వనాథ, శ్రీశ్రీ, నండూరి రామకృష్ణమాచార్య , ఆశావాది ప్రకాశరావులు మంచి పద్య శిల్పాన్ని నిర్మించారు.
శ్రీ గరికిపాటి నరసింహారావు మహా సహస్రావధాని. శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆథ్యాత్మిక ప్రవచన కర్త. ఆధునికత వెర్రి తలలు వేసి సమాజం అడ్డదారులు తొక్కుతున్న తరుణంలో ఈ యిద్దరు ప్రవచనకర్తలు మంచి మార్పుకై దోహదం చేస్తున్నారు.
ఏ సమాజంలో నైనా మంచి ని ప్రోత్సహించడం , చెడును విమర్శించడం , త్యాగమయ దేశభక్తి జాతీయతా దీప్తిని ప్రోత్సహించడం, ధర్మనిరతిని కాపాడటం రచయితల పాత్ర.
ఈ విధంగా ప్రధానంగా అరసం విరసం వంటి సంఘాలు గద్దరు / వంగపండు వంటి కవి గాయకులు చాలా సామాజిక మార్పు సాధించారు. కేవలం రాజకీయ పార్టీల వల్ల 150-200 సంవత్సరాలు పట్టగల మార్పును , వీరు 40 సంవత్సరాల్లో సాధించారు. ఈ యీ సామాజిక ఉద్యమాల / రచయితల రచనల ద్వారానే సామాన్య ప్రజానీకానికి మార్పు తేగలం అనే నమ్మకాన్ని కలిగించారు .
ప్రస్తుత తరుణంలో నేరమయ జీవిత నేపథ్యం గల రాజకీయ రంగమును క్షాళన చేయడానికై రచయితలు/ కవులు ప్రజల అవగాహనను ఈ ప్రధాన సమస్యపై కేంద్రీకరించడానికి కృషి చేయవలసిందిగా ఆయత్త పరచాలి.

You may also like

Leave a Comment