అలసిన మనసుకు, బద్ధకించిన శరీరానికి ఔషథం యోగా. ఇది అందరూ అభ్యసించవలసిన ప్ర్రకియ.
శరరాన్ని, మనసును ఏకంచేసి అనేక రకాల శారీరక, మానసిక సమస్యలకు పరిష్కారం చూపే యోగా “ఇహం నుండి పరం”కు తీసుకెళ్తుంది.
యోగా అంటే జ్ఞానం, మార్గం, చైతన్యం, గమ్యం. శాస్త్రబద్ధమైన జీవన విధానం. స్వీయ జ్ఞాన సాధన. సృష్టి రహస్యాలను ఛేదించే పరిణామంలో పొందిన ఆత్మజ్ఞానమే యోగా.
దుఃఖాన్ని అధిగమించి సత్యమైన జ్ఞానంతో పరమానందం పొందటమే మానవ జీవిత లక్ష్యం. వత్తిడి నుండి విముక్తి, శారీరక దృఢత్వమే కాకుండా “ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి”కి తీసుకెళ్ళే బంగారు బాట యోగా.
ఆలోచనలను, జీవనశైలిని ప్రభావితం చేయటానికి యోగాలో అనేక రకాల ప్ర్రకియలు కలవు. అందులో కొన్ని
- రాజయోగము, 2. హఠయోగము, 3. జ్ఞానయోగము, 4. కర్మయోగము, 5. భక్తియోగము, 6. మంత్రయోగము, 7. కుండలినీ యోగము, 8. లయయోగము.
- రాజయోగము : యోగములన్నిటిలో ఉత్తమమైనది ఏదంటే ఖచ్చితంగా రాజయోగమనే చెప్పవచ్చు. బుద్ధిని సంస్కరించుట, మానసిక సంస్కరణ, ఉన్నత జ్ఞానం అనుభవపూర్వంకంగా తెలియచేసేది రాజయోగము. ఇది పతంజలి యోగ సూత్రములపై ఆధారపడి ఉన్నది.
- హఠయోగము : ప్రస్థుత యోగా ప్ర్రకియలకు ఆధారము హఠయోగము. ఇందులో ఆసనాలు, ప్రాణాయామాలు ఉంటాయి. ఇది శ్రమతో కూడుకున్నది. దీని ద్వారా బుద్ధిని బాహ్య విషయాల నుంచి దూరంగా ఉంచవచ్చు. ‘హ’ సూర్యుడు, ‘ఠ’ అంటే చంద్రుడు. అనగా సూర్యచంద్రుల సాంగత్యాన్ని తెలుపుతుంది. హఠయోగంలో అష్టాంగ యోగం మరియు యోగ ముద్రలు అనుసరిస్తారు. దీనినే ప్రస్థుతం విస్తృతమైన అర్థంతో యోగా అని పిలువబడుతుంది. ఆలోచనలలో స్పష్టత, చక్కటి శరీర ఆకృతి. దీని ద్వారా సాధించవచ్చు.
- జ్ఞానయోగము: మనిషి వివేకవంతుడు కావాలంటే తత్వము తెలుసుకోవాలి. అప్పుడే ఏది సత్యము, ఏది అసత్యము సూక్ష్మబుద్ధితో తెలుసుకోగలుగుతారు. గత జన్మల ద్వారా, శ్రవణం, పఠనం మరియు సద్గురువుల ద్వారానే కాకుండా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఉత్తమ జ్ఞాని మాత్రమే ఆనందాన్ని పొందగలుగుతాడు.
- కర్మయోగము : కర్మ అనగా పని. కర్మ చేయకుండా ఏ జీవికి మనుగడలేదు. ఎవరి ధర్మము ననుసరించి వారు కర్మలనాచరించాలి. కర్మ చేయటమే మన కర్తవ్యము. కర్మ ఫలాన్ని ఆశించే అధికారం ఎవరికీ లేదు. ఇంద్రియ నిగ్రహంతో ప్రతిఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాలను నిర్వర్తించేవారే యోగి. జ్ఞానులు లోకకల్యాణం కోసం నిష్కామ కర్మలు ఆచరిస్తారు.
ఇంద్రియాల కన్నా మనసు, మనసుకన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ ఉన్నత స్థితిలో ఉంటుంది. కర్మలు చేయకుండా ఏ వ్యక్తి ముక్తి పొందలేడు. చర్యకు ప్రతి చర్యా ఉన్నట్టే కర్మలనుబట్టి ప్రతిఫలం ఉంది. జన్మరాహిత్యము కొరకు కర్మను నేర్పుతో చేస్తూ ముక్తి పొందటమే జీవన పరమార్థం.
- భక్తియోగము : ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానించుచూ ఉద్వేగాలను నియంత్రించుకోగలగటమే భక్తి యోగము. ఉద్వేగాల వలన కలిగే రుగ్మత తొలగించుకోవటానికి భక్తి యోగము ఒక వరము.
- మంత్రయోగము: మానవుడిని రక్షించేది మంత్రమని ఉపనిషత్తులు తెలియచేయుచున్నవి.
అష్టాక్షణ మంత్రము : “ఓం నమో నారాయణాయ”
పంచాక్షరీ మంత్రము : “ఓం నమశ్శివాయ”
గాయత్రీ మంత్రము – ఓఁ భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోయదయాత్
మృత్యుంజయ మంత్రము : ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
మంత్రాలను జపించటం ద్వారా శరీర శుద్ధి అనగా నాడీ వ్యవస్థ పని తీరు సక్రమంగా పనిచేస్తుంది. ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి.
- కుండలినీ యోగము : మన వెన్నెముకలో అనిర్వచనీయమైన శక్తి ఉంటుంది. సుషుమ్మ నాడి నుండి సహస్రారం వరకు తీసుకెళ్ళే పద్ధతిని వివరించేది కుండలినీ యోగం. మనలో కుండలినిని జాగృతం చేయటానికి ముఖ్య మార్గము ప్రాణాయామ అపారమైన శక్తిని జాగృతం చేయటమే కుండలినీ యోగము. ముఖ్యంగా షట్చక్రాలలోని ఒక్కో చక్రాన్ని యోగక్రియల ద్వారా ఊర్థ్వముఖంగా దాటుతూ తలపై భాగంలో ఉన్న సహస్రార చక్రాన్ని చేరుతుంది. దీనినే సమాధి స్థితి అంటారు.
- లయ యోగము: లయము అంటే కలయిక. అందుకు నాదానుసంధానము జరగాలి. నాడీ శుద్ధి జరిగినప్పుడు ఇది సాధ్యం. ఇందుకు నిరంతరం ప్రాణాయామం చేయాలి. ఓంకారాన్ని శ్రద్ధతో జపించాలి. ఇలా నాదముపై మనసును లయం చేయటాన్ని నాదానుసంధానము అంటారు. అప్పుడే సమాధి స్థితిని పొందగలుగుతారు. అనిర్వచనీయమైన, అలౌకికమైన అనుభూతిని పొందటమే సమాధి స్థితి.
జీవన విధానంలో గొప్ప మార్పులు తెచ్చే యోగ ప్ర్రకియలు ఎన్ని రకాలయినా అవి అన్నీ పతంజలి క్రమపద్ధతిలో సూత్రబద్ధం చేసినే. తను రచించిన యోగదర్శనము నాలుగు పాదాలుగా విభజించి అన్ని సూత్రాలను వివరించం జరిగింది.
మానవుడిని అజ్ఞానం నుండి అనంతమైన జ్ఞానమార్గంకు నడిపించే పతంజలి అష్టాంగ యోగం గురించి మనమందరమూ తెలుసుకొని ఆచరిస్తేనే కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుంది.