శ్రుతి, లయ, రాగ, భావయుక్తంగా సామాన్య శ్రోతలకు సైతం అర్థమయ్యే విధంగా వినిపించే మధుర మనోజ్ఞ గీతమే లలిత సంగీతం. లలిత సంగీతం శాస్త్రీయ – జానపద సంగీత స్రవంతికి వారధి వంటిది.
లలిత గీతం మాత్రా ఛందస్సులో ఉంటుంది. సరళమైన అలతి అలతి తెలుగు నుడులకు గుడి వంటిది. పల్లవి రెండు లేక నాలుగు పంక్తులతో మొదలై 3,4 చరణాలతో సమాప్తమవుతుంది. పంక్తుల మాత్రలన్నీ సమసంఖ్యలో ఉంటాయి. 4,6,8,10,12,16 ఇలా మాత్రల సంఖ్య ఉంటుంది. లలిత గీతం గాన యోగ్యత గలిగి ఉండటం ప్రధాన లక్షణం. గాన యోగ్యమైతేనే గేయం.
లలిత గీతానికి యతి నియమం, అంత్యప్రాస నియమం కూడా ఉంటుంది. కొందరు యతినే పాటిస్తారు. కొందరు కవులు అంత్యప్రాసను పాటిస్తారు. రెండూ పాటిస్తే గీతం చాలా అందంగా ఉంటుంది. వినసొంపుగా ఉంటుంది.
హ్రస్వాలన్నీ ఏకమాత్రికలు. దీర్ఘాక్షరాలన్నీ ద్విమాత్రికలు. ఒక మాత్రను లఘువు అనీ, రెండు మాత్రలను గురువు అని కూడా అంటారు. లఘువు గుర్తు =I గురువు గుర్తు U. లయను సామాన్యార్థంతో వాడతారు. లయ విభిన్నగతులలో కనపడినప్పుడు తాళం అంటారు. ఉదా|| చతురస్రగతి, మిశ్రగతి, త్రిశ్రగతి. ఇవన్నీ తాళాల పేర్లు.
తాళం లేకుండా గేయమే ఉండదు. లలిత గీతానికి 5 ప్రధాన లక్షణాలు. 1. పల్లవి, 2. గతి లాలిత్యం, 3. ఏకకర్మత్వం, 4. తాళం, 5. పరమార్థ లక్ష్యం: భావోన్మీలత.
జానపద గీతాలు ఆశువుగా వచ్చేవి. పల్లెవాసులు వాళ్ళకొచ్చిన భాషలో యాసలో పాడుకున్నవి. వాటిలో ప్రామాణిక భాష దృష్ట్యా ఎన్నో భాషాదోషాలు, వ్యాకరణ దోషాలు ఉండవచ్చు. జానపద గీతానికి పరిణామదశ లలిత గీతం అనవచ్చును. ఇందులో పరిశుద్ధమైన భాషతో, వ్యాకరణయుక్త పదబంధాలు ఉంటాయి. శిష్ట వ్యావహారిక భాష, సరళశైలిలో కనిపిస్తాయి.
లలితగీతాలు మొదట ప్రేమ, విరహం, ప్రకృతి, మానవత్వం భావుకతతోనే వెలువడ్తాయి. తరువాత దేశభక్తి, దైవభక్తి, సామాజిక చైతన్యం, సామయిక సమస్యలు – ఇలా ఎన్నో అంశాలు లలిత సంగీతంలో ఆవిష్కృతమవుతాయి.
ఎందరో కవులు, పండితులు, వర్ధమాన, వర్తమాన రచయితలు లలిత గీత రచన పట్ల ఆకర్షితులవుతున్నారు. దేశ స్వాతంత్ర్య సమర సందర్భాలలోనే లలిత గీతాల రచన ఆరంభమైంది. సుప్రసిద్ధ తెలుగు లలిత గీత గాయకులు చిత్తరంజనంగారు లలిత సంగీతంపైన పాఠ్యప్రణాళికా రచన చేశారు.
గురజాడ, చిలకమర్తి, రాయప్రోలు, అబ్బూరి, విశ్వనాథ, నండూరి, బాపిరాజు, బసవరాజు, దేవులపల్లి, దువ్వూరి, కవికొండల, తల్లావజ్ఝల, బసవరాజు, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, చావలి బంగారమ్మ బసవరాజు రాజ్యలక్ష్మమ్మ, మల్లవరపు విశ్వేశ్వరరావు, బాలాంత్రపు రజనీకాంతరావు, శ్రీశ్రీ, కొనకళ్ళ వెంకటరత్నం, వింజమూరి శివరామారావు, ఇంద్రగంటి, పైడిపాల, బోయిభీమన్న, పుట్టపర్తి, దాశరథి, సి.నారాయణరెడ్డి, కందుకూరి రామభ్రదరావు, శశాంక, బాపురెడ్డి, సుశీలాదేవి, ఆచార్య తిరుమల, ఆరుద్ర, తిరుమల శ్రీనివాసాచార్య, గిడుగు రాజేశ్వరరావు ఊటుకూరి సత్యనారాయణ, పిలకాగణపతి శాస్త్రి మొదలైన కవిశేఖరులెందరో గత శతాబ్దంలో లలితగీతాలు రాసి ప్రసిద్ధులైనారు. డా||వడ్డేపల్లి కృష్ణ లలిత గీతాలపైన సిద్ధాంత గ్రంథం రాసి ph.d తీసుకున్నారు.
ఆకాశవాణి కేంద్రంవారు ఈ లలిత గీతాలకు స్వయంగా బాణీలు కట్టి, తాము పాడి, ఎందరో గాయనీ గాయకుల చేత పాడించి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. వారిలో వింజమూరి అనసూయాదేవి, సీత, రజని, బి.వి.నరసింహారావు సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల, బాలమురళీకృష్ణ, పాలగుమ్మి విశ్వనాథం, బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, భానుమతి, యస్. వరలక్ష్మి, రాజరత్నం, సుందరమ్మ, మల్లిక్, జగన్నాథరావు, చిత్తరంజన్, లబ్ధప్రతిష్ఠులు.
తరువాతి తరం గేయ కవులలో వడ్డేపల్లి కృష్ణ, బలభద్ర పాత్రుని రమి మధు, కోపల్లె శివరాం, తిరునగరి, ఎం.కె.రాము, జైహింద్ రెడ్డి, మృణాళిని, చిల్లర భవానీదేవి, సుధామ, కృష్ణమోహన్, శర్మ, సుద్దాల అశోక్ తేజ నాగపద్మినీదేవి, ఓలేటి పార్వతీశం, వి.ఎస్.నారాయణమూర్తి, చిమ్మపూడి శ్రీరామమూర్తి, వై.రామకృష్ణారావు, మొదలైనవారు పేర్కొనదగినవారు.
లలిత సంగీత గాయనీ గాయకులలో శశి కళాస్వామి, స్నేహలత, సురేఖామూర్తి, మితిల, చంద్రతేజ, మూర్తి విశ్వనాథ్, రామాచారి, ప్రభాకర్, చంద్రకాంత, కన్నరావు, సాయిబాబా, విన్నకోట మురళీకృష్ణ, ఎమ్.ఆర్.కె.ప్రభాకర్, వేదవతి, ఛాయాదేవి, రమణ, సురేశ్, శారదారెడ్డి, నిత్యసంతోషిణి, పద్మావతి, గోపికాపూర్ణిమ, సునీత, విజయలక్ష్మి, గాయత్రి, గీతామాధురి, మాళవిక, కౌశిక్, కల్యాణ్, హేమచంద్ర, చిమ్మపూడి, బాంధవి, రమణకుమారి, జ్యోత్స్న, వెంకట్రావు, మొదలైనవారు పేరు గడించారు.
లలిత సంగీత దర్శకులలో బొబ్బిలి భాస్కర్ రెడ్డి, వల్లూరి సుధీర్ కుమార్, గోపాలకృష్ణ, విన్నకోట, బంటి, స్నేహలతా మురళి, విశ్వనాథ్, ప్రభాకర్, సాయిబాబా, కలగా కృష్ణమోహన్ మొదలైనవారు ప్రముఖులు.
ఆధునిక కాలంలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులు ఇంకా ఎంతోమంది తమ ప్రతిభాపాటవాలు చూపుతున్నారు.
ఇవాళ పాట అనగానే చాలామంది సినిమాపాట అనే అనుకుంటారు. సినీ గీతానికి లలిత గీతమే బీజం. లలిత సంగీతానికి సంబంధించిన సేవ ఆకాశవాణి, దూరదర్శన్లు మాత్రమే చేస్తున్నాయి. ఈ దిశగా ఇంకా ముందుకు పోవాల్సి వుంది. ప్రసిద్ధ గీత రచయితలు, సంగీత దర్శకులు గాయనీ గాయకుల్ని ఇతోధికంగా ప్రోత్సహించి, వారి ప్రతిభకు పట్టం కట్టవలసి ఉంది. లలిత గీతం నవ సుప్రభాతాన్ని మళ్ళీ చూడగలదని ఆశిద్దాం! లలిత గీతం ఇటు శ్రవణపేమతను; అటు భావగమ్యతను సంపుటీకరించే మధుర సంగీత స్రవంతి.
ఆకాశవాణి – లలిత సంగీతం
లలితగీతాలు మొదట పత్రికాముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. ప్రప్రథమంగా 16.6.1938లో మద్రాసులో ఆకాశవాణి ప్రారంభమైంది. అప్పటి బ్రిటిష్ గవర్నర్ ‘లార్డ్ ఎర్స్ కిన్’ ప్రారంభోత్సవ సందేశాన్ని ప్రసారం చేశారు. ఓ వారం తర్వాత అనార్కలి నాటకం తెలుగులో ప్రసారమైంది. అందులో ఆచంట జానకిరాం, దేవులపల్లి, విశ్వనాథ, ఊటుకూరి సత్యనారాయణ, వింజమూరి లక్ష్మీనరసింహారావు, పిలకాగణపతిశాస్త్రి ముద్దుకృష్ణ లలిత గీతాలు ఆ నాటకంలో వచ్చాయి. వీటినప్పుడు నాటక గీతాలన్నారు. 1939లో మల్లవరపు విశ్వేశ్వరరావుగారి బిల్హణీయం నాటకం ప్రసారమైంది. తర్వాత మోహినీ రుక్మాంగద, చండీదాసు, అతిథి శాల నాటకాలలో కూడా లలిత గీతాలు వచ్చాయి. 1941-42 నుంచి ‘గీతావళి’ కార్యక్రమాల ద్వారా లలిత గీతాలు ప్రసారమయ్యాయి. 1954 నుంచి లలిత సంగీతం పేరుతో గీతాలు ప్రసారమై క్రమంగా విశేషంగా ప్రాచుర్యం పొందాయి.
మద్రాసుతోపాటు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో రజని, బాలమురళీకృష్ణ, పాలగుమ్మి విశ్వనాథం లలిత సంగీత ప్రయోక్తలుగా వ్యవహరించారు.
లలిత సంగీతం కర్ణాటక సంగీత చ్ఛాయలతోను, అన్యప్రాంతీయ సంగీతపు చాయలతోను ప్రసారం కాసాగాయి. సాహిత్య ప్రధానంగా సరళంగా తేలికైన గమకాలతో పాడేది లలిత సంగీతం – అన్నారు సుప్రసిద్ధ సంగీత శాస్త్రవేత్త రజని. 1940లోనే బసవరాజు అప్పారావుగారి రచన బాలసరస్వతిగారు మద్రాసులోనే గానం చేశారు.
1, దినదినమూ పాపణ్ని దీవించి పొండి
- కావ్యపానము చేసి కైపెక్కినానే
మొదలైన పాటలకు సాలూరి రాజేశ్వరరావు బాణీలు కూర్చారు.
- తలుపు తీయునంతలోనె తత్తరమది ఏలనోయి (బసవరాజు)
- కోయంచుకూయకే – కూయకే కోయిలా
- రెల్లు పూల పానుపుపైన – దేవులపల్లి
- కన్నారనిన్ను చూడనా
- వినవే చెలీ పిలుపు అల్లదిగో
- నల్లనివాడా నే గొల్ల కన్నెనోయి – వింజమూరి
- పాడకోమామా! నా గుండె కుదిపే పాడకు పాడకు – శ్రీ శ్రీ
- సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ (ఇంద్రగంటి)
- ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు (ఆరుద్ర)
- నిండు పున్నమి పండు వెన్నెలలో (దాశరథి)
- ముసురేసిందటే (కొనకళ్ళ)
- మ్రోయింపుము జయభేరి (రజని)
- ప్రాభాత ప్రాంగణమున (దేవులపల్లి)
- మాదీ స్వతంత్ర దేశం (రజని రచన – గానం టంగుటూరి సూర్యకుమారి)
- యాత్రికుడా? గానం సాలూరి, రచన – మల్లవరపు
- పసిడి మెరుంగుల తళతళలు రజని రచన – గానం భానుమతి (1.10.53)
- అన్నాడే వస్తానన్నాడే (రచన, గానం వల్లూరి జగన్నాథరావు)
- పూలదోసిళ్ళెత్తరా (ఇంద్రగంటి)
- పూలదీపమెత్తరావే (గానం చిత్తరంజన్) దాశరథి రచన.
- . ఏలా ఈ మధుమాసము? సినారె రచన.
తొలి నాళ్ళలో దేవులపల్లి గేయాలే అధికంగా ప్రసారమైనవి.
- జయజయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి….
- రామచరణం రామచరణం
- నారాయణ అల్లా అల్లా!
- ఉప్పొంగి పోయింది గోదావరి (అడివిబాపిరాజు)
- తెప్పవోలిక చంద్రబింబం (మల్లవరపు)
- దేశమును ప్రేమించుమన్నా (గురజాడ)
- ఏ దేశమేగినా (రాయప్రోలు)
- త్రిలింగ దేశం మనదేనోయం (పైడిపాటి)
- తలనిండ పూదండ దాల్చిన దానా…. (దాశరథి)
- ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట (కందుకూరి రామభద్రరావు)
- చెయ్యెత్తి జైకొట్టు (వేముల పల్లి శ్రీకృష్ణ)
ఇంకా వక్కలంకల లక్ష్మీపతిరావు, నెల్లుట్ల వెంకటేశ్వరరావు, మధురాంతకం రాజారాం, జైహింద్ రెడ్డి, విద్యాసాగర్, పులికంటి, ఆనందమూర్తి, జొన్నవాడ రాఘవమ్మ, గంగరాజు సుశీలాదేవి, దుర్గానాగరాజు, శారదా అశోకవర్ధన్, యం.పద్మినీదేవి, పాపారావు, రాఘవరావు, అర్జునగౌడ్, శంకరకవి, శ్రీనివాసబాబు, అందెశ్రీ, నండూరి విఠల్, చైతన్య ప్రసాద్ మొదలైన వారెందరో గీత రచయితలుగా ప్రసిద్ధులు.
ఆధునిక గీత రచయితలు ఇప్పటికీ లలిత గీతాలు రాస్తున్నవారు – కలగా కృష్ణమోహన్, వడ్డేపల్లి కృష్ణ బలభద్ర పాత్రుని రమణి, రాము, ఓలేటి చిమ్మపూడి, మధు, నాగలక్ష్మి, ఎస్.వి.ఎల్.ఎన్ శర్మ, మిక్కిలినేని భగవంతరావు తదితరులు.
ఆధునిక గాయనీ గాయకులలో శశికళాస్వామి, సురేఖామూర్తి, ప్రసన్న లక్ష్మి, అవంతి, ఆమని, రమణమూర్తి జయలక్ష్మి, చంద్రతేజ, బాంధవి, కనకదుర్గ, అరుణసుబ్బారావు, నిత్య సంతోషిణి, హిమబిందు, రమణ, సురేష్, మూర్తి, రుక్మిణి, శైలజ, జ్యోత్స్న, పద్మశ్రీ నరసింహా, శంకర్రావు ఇలియాస్, శిరీష, నిష్మా మొదలైనవారు ఎందరో గాయనీ గాయకులు లలిత సంగీతం మెట్టు ఎక్కి చిత్రసీమలో స్థానం సాధించుకుంటున్నారు.