మన చుట్టూ ఉన్న సమాజంలో అనేకమైన సంఘటనలు మనలో ఎన్నో అలజడులను సృష్టించి మనసును కకావికలం చేస్తాయి. కవులు, రచయితలు ఆ భావోద్వేగాలను తమ రచనల ద్వారా బహిర్గతం చేస్తారు. ఆ విధంగా వెలువడినదే ధూళిపాళ అరుణ రచించిన “మిగిలేవి గురుతులే” కథా సంపుటి. ఇందులోని కథలన్నీ వాస్తవ జీవన చిత్రణలే. తనకళ్ళ ముందు కుటుంబాలలో జరిగిన అనేక వెతలను ఆమె కథలుగా మలచింది. అవన్నీ యథార్థ గాథలే. స్వతహాగా కవయిత్రి కూడా కావడం వల్ల కొంత కవితా శైలి కూడా కనిపించి పాఠకుల హృదయాలను హత్తుకుంటుంది.
పుస్తకం పైన కవర్ పేజీ ఎంతో రంధితో కూడుకున్నదిగా కనిపించి చివర పేజీలో ‘హమ్మయ్య! పుస్తకం పూర్తయింది’ అన్నట్టు నవ్వు ముఖం కనిపిస్తుంది. ఇందులోని 15 కథలూ వాస్తవాన్నిచూపిస్తూ ఆసక్తికరంగా ఉండి పాఠకులను చదివింప జేస్తాయి. కథల్లో అక్కడక్కడా కొన్ని వాక్యాలు తెలుగు భాషలో చెక్కబడినవా? అన్నట్టు తోస్తాయి. నేను కథల విశ్లేషణ జోలికి వెళ్లకుండా నాకు నచ్చిన అలాంటి కొన్ని వాక్యాలను ఉదాహరిస్తాను.
“మునుముందుకు నడవడమే మనిషి కర్తవ్యం”
మనిషి జీవితానికి ఎన్నో సవాళ్లు, ఎదురీతలు ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగుతూనే ఉండాలన్న కర్తవ్యబోధ ఇక్కడ కనిపిస్తుంది.
“బలహీనంగా ఉన్నంతవరకు సమాజం అణచి వేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది”
ప్రస్తుత కాలంలో బలమున్న వాడిదే పైచేయిగా ఉండడం మనం గమనిస్తున్నాం. అదే బలహీనుడైతే సమాజం అణచివేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇది సమాజస్వరూపం.
“రక్షించవలసిన తండ్రే కాటేస్తే సమాజం ఏం చేస్తుంది? నీడనివ్వని చెట్టువల్ల ప్రయోజనం ఏమిటి?”
వీరేశ్ కూతురు మీద చేసిన అఘాయిత్యాన్ని వివరిస్తూ రచయిత్రి చెప్పిన పాఠకులను ఆలోచింపజేస్తాయి.
కనుల నీరు పెట్టిస్తాయి.
“కంటిలో నుండి ఊట బావి లాగా నీరు ఊరుతూనే ఉంది”
“కళ్ళు నిండు తటాకాలయ్యాయి”
“నిద్ర ఎక్కడో ముఖం చాటేసింది”
“కన్నీటికి కన్ను నిరంతర ఆవాసమైంది”
ఇలాంటి కవితాత్మక వాక్యాలు అరుణలోని కవయిత్రిని మనముందు నిలబెడతాయి.
“నాపై వేలాడదీసిన కాలసూచి రాత్రి రెండుగంటలు దాటినట్టు చూపిస్తోంది”
గోడమీద గడియారాన్ని గురించి అన్యాపదేశంగా రాసిన ఈవాక్యం రచయిత్రి రచనా ప్రతిభను తెలియజేస్తుంది.
“కొన్ని తొందరపాటు నిర్ణయాలు, కొన్ని ఆలస్యపు నిర్ణయాలు జీవితాంతం శిక్షను విధిస్తాయి”
జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి తొందరపడటం, మరొక్కసారి సమయానికి సరైన విధంగా తీసుకోకపోవడం. ఈ రెండూ ప్రమాదమే. వాటివల్ల జరిగే అనర్థం ఒక్కోసారి యావజ్జీవితం అనుభవించాల్సి ఉంటుంది. ఎంతో
అనుభవం గడిస్తేనే ఇలాంటి వాక్యాలు రాయడం సాధ్యమవుతుంది.
మరో కథలో….
“ఏ శిల్పానికైనా ప్రాణం కళ్ళే కదా! గీయడంలో కొద్ది తేడా అయినా అందమంతా చెడిపోతుంది”
వినాయక విగ్రహాలను చేసే కుటుంబాన్ని గురించిన ఈ కథలో విగ్రహాన్ని ఎంత బాగా తయారుచేసినా కళ్ళను చిత్రించడంలో ఏమాత్రం తేడా వచ్చినా బొమ్మ అందం చెడిపోతుందని చెప్పడం ఆమెకున్న అవగాహనను తెలియజేస్తుంది.
అదే కథలో….
“హృదయపు త్రాసు కూతురి వైపు మొగ్గింది”
“తనకన్నా బిడ్డ జీవితమే ముఖ్యమనుకున్న తల్లి గుండె బలహీనమై కొట్టుకోవడం చేతగాక ఆగిపోయింది”
అనే వాక్యాలు మాతృత్వపు త్యాగానికి అద్దం పడతాయి.
ఇంకో కథలో….
“జీవితమంతా పోరాడిన ఆమె మరణం కోసం పోరాడలేదు”
ఒక స్త్రీ జీవితమంతా కష్టాలలో మునిగి,
అకాల మరణంతో హఠాత్తుగా చనిపోవడాన్ని గురించి చెప్పిన వాక్యమిది. ఏ అనారోగ్యం, వార్ధక్యం మీద పడకుండానే ఆమె సునాయాసంగా మరణించడం ఒక విధంగా ఆమె పాలిట వరమే. కనీసం మరణ సమయంలోనైనా ఎలాంటి బాధ ఆమె పొందకపోవడం
ఒక రకంగా అదృష్టమే.
“లోకంలో ప్రతి మనిషికి సలహా చెప్పడమంత సులువు మరేదీ ఉండదేమో?”
ఇది అందరికీ అనుభవమే. చాలామంది వాళ్ళు ఆచరించని ఎన్నో విషయాలను ఇతరులకు సలహాలుగా ఇస్తుంటారు. లోకం పోకడ ఇది.
ఈ విధంగా ఈ కథా సంపుటిలో సమాజానికి, వ్యక్తులకు అన్వయించగలిగే ఎన్నో వాక్యాలను ధూళిపాళ అరుణ గారి కలం నుండి చూడగలం. ఇలాంటి రచనలు ఆమె ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.