Home ఇంద్రధనుస్సు విద్యను ఎలా సాధించాలి?

విద్యను ఎలా సాధించాలి?

ఎంతో విశిష్టతను కలిగిన విద్యను ఎలా సాధించాలో చాణక్య నీతి తెలుపుతుంది
శ్లో|| క్షణశః కణశ్చైవ, విద్మయర్థం చ సాధయేత్
క్షణత్యాగేకుతో విద్య, కణత్యాగే కుతోధనమ్
ప్రతిక్షణమును సద్వినియోగం చేసుకుంటూ విద్యను ఆర్జించాలి. రూపాయి, రూపాయిని కూడ చెడితేనే ధనము పోగవుతుంది. క్షణాన్ని వ్యర్థం చేస్తే విద్య ఎలా వస్తుంది. రూపాయిని పొదుపు చేయకపోతే ధనము ఎలా పోగవుతుంది? అందుకే దేనిని అల్పంగా చూడకుండా, క్షణాన్ని, కణాన్ని కాపాడుకోవాలి. డబ్బు పట్ల ఆసక్తితో ఎలా దాచుకుంటామో, విద్య పట్ల ఆసక్తితో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యను ఆర్జించాలి అని పై శ్లోకం తెలుపుతుంది.
(సూక్తి ముక్తావళి, మహీవర జగనో్మహనరావు, పేజి. 42, జనవరి 2015)
‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు. నిద్రపోనివ్వకుండా చేసేది.’
అని అబ్దుల్ కలాం అంటారు. మన లక్ష్యంవైపు – విద్యను పొందాలి అన్న ఆలోచనవైపు విశ్రమించకుండా పరిశ్రమించడమే; అని కలాం అంటారు. ఆ దిశగా మన పయనం సాగితే దేనికీ లోటు ఉండదు.

పై శ్లోకానికి ధీటుగా, పంచతంత్రం లోని మిత్రభేదం వాక్యాలు మనకు కనిపిస్తాయి.వర్ధమానుని ఇతివృత్తం లో చిన్నయసూరి గారు,’దక్షిణాపథమందు రక్షావతి యను పట్టణము గలదు.అందు వర్ధమానుడను సార్థవాహుడు వాసము చేయుచుండును.అతడు తనకంటె సంపన్నులైన తన బంధువులను జూచి వారికంటె మిక్కిలిగా ధనము సంపాదింప వలెనని యెంచి యిట్లు చింతించెను.
“అర్థము పురుషార్థముల లోపల నుత్తమము.అర్థవంతున కసాధ్యము లోకమందేదియు గానము.కాబట్టి పురుషుడు న్యాయము దప్పక యే యుపాయము చేతనయినను ద్రవ్యము సంపాదింపవలెను.ఇంత సంపాదించితి నింకేలయని తనియరాదు.బుద్ధిమంతుడు జరామరణములు లేని వాని వలె విద్యాధనములు గడియింపవలెనని పెద్దలు చెప్పుదురు”.

ఈ వాక్యాలు విద్యను, ధనాన్ని ఎలా సంపాదించాలో తెలియజేస్తున్నాయి.విద్యాసముపార్జనలోనూ,ధనసంపాదనలోనూ తృప్తి ఉండరాదని తెలుపుతున్నాయి.

ఇక్కడ మనకొక ప్రశ్నరావొచ్చు.పైవాక్యాలకనుగుణంగా బ్రతికితే,అది తృప్తి లేని జీవితం అవుతుంది కదా ! అనే భావన కలగవచ్చు. అందులో ఉన్న లోతైన ఆలోచన మనం గుర్తించాలి.

మన విద్యాసముపార్జన ఎందరికో జ్ఞానజ్యోతి కావాలి.మన ధన సముపార్జన ఎందరికో జీవితాలను ఇవ్వాలి.అందుకోసం మనం అహరహము కృషి చేయాలి.

ఇక్కడ కూడా మనకు ఒక ప్రశ్న ఉదయించవచ్చు.ఎవరికి కావలసింది వారు సముపార్జించుకుంటే సరిపోతుంది కదా ! అని.ఈ సృష్టి లో ప్రతి జీవికి అన్నీ సాధ్యం కావు.ఉదాహరణకు పండించడం రైతుకు మాత్రమే సాధ్యం అవుతుంది.అతడు తన వరకు మాత్రమే పండించడు.మన అందరి కోసం పండిస్తాడు. అలాగే మన విద్యా ధనములు తోటివారికి ఉపయోగపడాలి.అందుకు శక్తి ఉన్నంతవరకు కృషి చేయాలి.

మానవుడు,జీవితం తన కోసమే కాదు.తోటివారందరికోసం అనే సత్యాన్ని గుర్తించాలి.వారి సంక్షేమం అనే సుందర స్వప్నానికి సాకారం కల్పించాలి.

You may also like

1 comment

కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 5:07 am

నమస్కారపూర్వక అభినందనలు. ప్రముఖులు తెలిపిన విషయాలను ఉటంకిస్తూ చక్కగా ధనం మరియు విద్యలను ఎలా ఎందుకు సంపాదించాలో సులభశైలి తో తెలిపారు. మీ వ్యాసం బాగుందండీ. శుభమస్తు.

Reply

Leave a Comment