Home పుస్త‌క స‌మీక్ష‌ వైద్య పరిజ్ఞానం- ఇంట్లో ఆరోగ్యం

వైద్య పరిజ్ఞానం- ఇంట్లో ఆరోగ్యం

డా॥ పెళ్ళకూరి జయప్రద సోమిరెడ్డి.

ప్రతి జీవి తన ఉనికి, బతుకు కోసం పోరాడుతూనే ఉంటుంది. శరీరంలోని ప్రతి జీవకణం ప్రోగ్రాం చేయబడి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే అయినా… మనుగడకోసం యుద్ధం తప్పదు!

   ఈనాటి పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువగా దీర్ఘ రోగాలతో బాధపడుతున్నారు. రకరకాల వ్యాధుల గురించీ, ఆ బాధల నుంచి ఎలా తట్టుకొని నిలబడాలో * వైద్య పరిజ్ఞానం -ఇంట్లో ఆరోగ్యం* అనే పుస్తకం ద్వారా  శాస్త్రీయ పరిజ్ఞాన వ్యాస పరంపరను మనకు డాక్టర్ పెళ్ళకూరు జయప్రదా సోమిరెడ్డి గారు అందించారు. వీరు వృత్తిరీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి రీత్యా చక్కని రచయిత్రికి.  నవల, కథలు, కవితలు ఇలా ఎన్నో ప్రక్రియలలో  రచనలు వెలువడ్డాయి.

   ఈ పుస్తకం చదివినప్పుడు నేను గమనించినదేమంటే? అటు ప్రజలకు వైద్య సేవలు అందిస్తూనే… రచయిత్రిగా సామాన్య శాస్త్ర వ్యాసాలు రాసి  ప్రజలలో వైద్యం, ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.

  రోజులు మారినా, మానవత్వ విలువలు మారినా, చదువుతున్న వారి సంఖ్య పెరిగినా, నాగరికత ఎంత పెరిగినా, మూఢనమ్మకాలతో బలైపోయే రోగులు ఎందరో???

ఇలా మూఢనమ్మకమున్న రోగులు ఆరోగ్యానికి ఆమడ దూరంగా ఉండడం… రక్తదానం చేస్తే తాము బలహీనులవుతామని అపోహలో దగ్గర వారిని కోల్పోవడం ఇలాంటి సంఘటనలు తమ వృత్తిరీత్యా ఎదుర్కొని, ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరుగకూడదని ఒక ప్రేరణ ప్రజల్లో కల్పించి, వారి అజ్ఞానం తొలగించాలని సైన్స్ ఆధారిత వ్యాసాలు రాశారు.

    వ్యాసాలు పాఠకులపై ఎక్కువ ప్రభావం చూపెట్టలేవని, కథలుగా మలచానని స్వయంగా రచయిత్రి తమ ముందుమాటలో రాశారు.

         ఆడపిల్లనే చిన్న చూపుతో కడుపులో ఉన్న బిడ్డను ఆపరేషన్ చేసి తీయాలంటే, వద్దన్న తల్లి-అత్తల అమానుషానికి బలైన శిశువు మృతిని మరో కథగా మలిచారు.

   ఎయిడ్స్ వంటి రోగాల పట్ల సరైనా అవగాహన లేక ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని వదిలేయడం, డిప్రెషన్ అనే జబ్బును దయ్యం పట్టిందని, నాటు వైద్యాలు చేయించి నిండు జీవితాలు నాశనం చేసుకున్నటువంటి ఎన్నో ఘటనలు రచయిత్రి చేత కథలుగా మలచబడ్డాయి.

   రక్త సంబంధీకుల మధ్య వివాహాలు అంగవైకల్యంతో పుట్టిన పిల్లల గురించి చక్కటి  అవగాహన కలిగేలా కీబోర్డ్ అనే కథను రాశారు.

  ఈ వీణకు శృతి అనే నవల అవయవ మార్పిడి పట్ల అవగాహన కల్పించే రచన!

   అలాగే వైద్యపరమైన ఎన్నో విషయాలపై వ్యాసాలు , కవితలు రాసి, రోగుల బంధువులు వాళ్ళ నిర్లక్ష్యంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని వాటి గురించి తెలిపారు!

   ఈ పుస్తకానికి ముఖచిత్రం రచయిత్రి- డాక్టర్ పెళ్ళకూరి జయప్రద రెడ్డిగారి చిత్రమే అందంగా వేశారు.

   ఈ పుస్తకానికి ముందు మాట శ్రీ గుమ్మా సాంబశివరావు గారు విశ్రాంత ప్రిన్సిపల్ రాస్తూ రచయిత్రిగా, డాక్టర్ గాతన అనుభవాలను రంగరించి వైద్య విజ్ఞానాన్ని- సాహిత్య సంస్కారాన్ని జోడించి రాసిన ఈ పుస్తకం అమృత గుళికని ప్రశంసించారు.

   ఎంత అభివృద్ధి చెందామని అనుకుంటున్నా ఇంకా మనకు ఆరోగ్యం పట్ల సరైన అవగాహన ఏర్పడలేదని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పుస్తకం ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఈ ఆరోగ్య అవగాహన కల్పించే వైద్య పరిజ్ఞానం పుస్తకంలో… మహిళలకు సంబంధించిన వ్యాధుల గురించిన ఎన్నోఅధ్యాయాలు ఉన్నాయి.

1. పిల్లలు కలగక పోవడానికి కారణం

2.తల్లి కావాలనుకుంటే…

3. గర్భం ధరించాక,

4. అబార్షన్ పర్వం,

5. ముత్యాల గర్భం,

6. ఎదురు కాళ్ళు,

7. ఎక్టోపిక్ ప్గ్రెన్సీ ( పక్కపేగులో గర్భంరావడం),

8.  ప్రసవంలో ప్రమాదం,

9.  బ్లడ్ బ్యాంకు లేని రోజుల్లో,

10. నాలుగు దశాబ్దాల సిజేరియన్ చరిత్ర.

       ఈ అంశాలపై చక్కని వ్యాసాలు అందించారు డాక్టర్ జయప్రదగారు.

  తల్లి కావాలనే కోరికను ఎండమావి చేయకూడదని, తపనతో పిల్లలు కలగక పోవడానికి కారణాలు, వైజ్ఞానిక కారణాలతో పాటు డాక్టర్లు ఏం చేయగలరు? అని విశ్లేషించిన వైనం చాలా బాగుంది. అలాగే సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.

   తల్లి కావాలనుకునేవారు పాటించాల్సిన మూడు సూత్రాలను పాటించే విషయ వివరణ చాలా బాగుంది.

   అలాగే గర్భం రాకముందు వారి మానసిక పరిస్థితి- ఒత్తిడికి లోనుకావద్దనే సలహా పాటిస్తే ఆ సమస్య నుండి బయటపడే విధానం చక్కగా వివరించారు.

   గర్భిణీ స్త్రీలలో వచ్చే మార్పులని మొదటి మూడు నెలలు గుండెల్లో మంట మలబద్ధకం మొదలైన శీర్షికలు పెట్టి చాలా చక్కగా వివరించారు. గర్భిణీ స్త్రీల నిద్రలేమి ఎందుకు వస్తుందని చెప్పారు.

   ఇక గర్భస్రావాలు ఎన్నిరకాలు? వాటిని ఎలా కనుక్కోవాలి? వాటి నిర్ధారణ !వాటికి వైద్యం? పూర్తిగా గర్భస్రావం , మరియు పూర్తిగాని గర్భస్రావాలు ఎలా ఉంటాయి? వాటి లక్షణాలు.. వాటి నివారణకు ఏం చేయాలని వీటికి కారణాలు, వైద్యం, ఇవన్నీ గర్భం దాల్చే యువతులకే కాదు కుటుంబ సభ్యులు కూడా తెలుసుకొని ఉంటే… గర్భం దాల్చే స్త్రీలకే కాకుండా, ఆ యువతులకు ఒత్తిడికి లోనుకాకుండా చేయగలరు. అంత విషయ పరిజ్ఞానం ఉందీ పుస్తకంలో…

  ముత్యాల గర్భం అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది?  వాటి లక్షణాలు- వైద్యంతో పాటు, గర్భిణీ స్త్రీకి కడుపునొప్పి రావడానికి కారణాలు, ఎదురు కాళ్లతో ప్రసవంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపరేషన్ కు సంబంధించిన విషయాలు కూలంకషంగా చర్చించారు స్వతహాగా రచయిత్రి అయిన డాక్టర్ జయప్రద గారు.

   గర్భం పక్క పేగుల్లో రావడానికి కారణాలు, ఇన్ఫెక్షన్లు, వైద్యం కూడా వివరించారు.

      ప్రసవంలో ప్రమాదాలు గురించి ఎంతచక్కగా వివరించారంటే ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన విషయమిది.

  సరే ఇక రక్తం గురించి ఇప్పుడు సామాన్యులకు కూడా తెలుస్తుంది , బంధువులు ఇవ్వకపోయినా, బ్లడ్ బ్యాంకులలో దొరుకుతున్నది లేదా రక్తదాతలు ఇస్తారని …ఈ అధ్యాయం ఎందుకు అనుకోవద్దు! ఒక వైద్యురాలి ద్వారా తెలిసిన విషయం అరాకొరగా ఉండకుండా… పూర్తి అవగాహనతో చదువుకున్న వైద్యశాస్త్రంతో వివరించారు కాబట్టి ఈ నా ఆలోచనల్లో- ఆమె అధ్యాయంకూడా ముఖ్యమే! ఎందుకంటే? రక్తం కావాల్సిన వారికే  కాకుండా రక్తదాతలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి ఈ సలహాలతో అపోహలు తొలగిపోతాయి.

  40 సంవత్సరాలుగా ఆపరేషన్ల గురించి, వాటి మీద అపోహల గురించి చెప్పి, అటు పేషెంట్లూ నష్టపోకుండా, ఇటు డాక్టర్లు కూడా వివాదాస్పదంలో పడకుండా ఉపయోగపడే అధ్యాయమే ఈ నాలుగు దశాబ్దాల చరిత్ర ! అందుకు గల కారణాలు మనమూ తెలుసుకోవాలి…

   “గర్భసంచి సంబంధిత జబ్బుల విభాగంలో” ఎన్ని విభాగాలున్నాయో? వాటి పనితీరులు చక్కగా వర్ణించారు రచయిత్రి.

   మోనోపాజ్ (ఋతువిరతి ) ఎదుర్కొనే మహిళల అవస్థలు- అనారోగ్యాలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూనే.. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని హెచ్చరిక చేశారు. గర్భసంచి జారడం గురించి చక్కని వివరణ ఇచ్చారు.

    ఇలా మహిళలకు గర్భసంచి సంబంధిత రోగాలు, వాటి లక్షణాలు ,ఆరోగ్యం గురించి అవగాహన లేకపోయినా, సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోయిన ఆ వ్యాధి క్యాన్సర్ గా ఎలా మారుతుందని? అప్పుడిక చేసేది ఏమీ లేక క్యాన్సర్ హాస్పిటల్కు పంపడమేనని బాధగా అనడం.. స్త్రీ సహజమైన జాలిగుణం కనపడుతున్నది డాక్టర్ గారిలో…

   మూఢ నమ్మకాలగురించి చెప్తూ డాక్టర్ కూ పేషెంట్ కు మధ్య స్నేహభావం, నమ్మకం ఉండాలని చెప్పడం బాగుంది.

  అప్పుడే పేషెంట్ తన మనసులోని బాధని చెప్పుకుంటుంది కదా!

   ముఖ్యంగా డాక్టర్ గానూ రచయిత్రిగాను చెప్పేది ఏమిటంటే యువత  వ్యాధి సోకిన తరువాత మూఢనమ్మకాలతో  కాలం వెళ్ళబుచ్చకుండా ఆరోగ్యంపట్ల జాగ్రత్త, సైన్స్ విజ్ఞానాన్ని కలిగి ఉండాలనీ, డాక్టర్లు పేషెంట్లకు ఏం వైద్యం చేస్తున్నారో తెలుసుకొని ఉండాలని , వితండ వాదంతో పూర్తి అవగాహన ఏర్పరుచుకోకుండా డాక్టర్ల పై నిందలు మోపడం సరికాదనీ సూచించారు.

       కొన్ని చిట్కాలు ఇంట్లో దొరికే పదార్థాలలో ఏ ఏ మంచి గుణాలుంటాయో? వాటి వాడకంవల్ల ఎటువంటి ఫలితాలను పొందుతామో  ఒక అమ్మమ్మ వలెనో, ఒక బామ్మ వలెనో చక్కగా విడమర్చి చెప్పారు రచయిత్రి .

అలానే జీవన విధానాన్ని మార్చుకోమని సున్నితంగా హెచ్చరిక చేశారు. మంచి ఆహారాలు తీసుకుంటే వాటిలో ఉండే సుగుణాలు అవి ఎలా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని వివరించారు. నమ్మకూడని నమ్మకాలు నమ్మవద్దని చెప్పారు.

    ఈ విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మన ఆరోగ్యం పట్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, వైద్యం మొదలైన ఎన్నో విషయాలు తెలుసుకొని, వాటిని ఆచరించి ,మన జీవితాలను బాగు చేసుకుందాం! నలుగురికీ చెప్పి డాక్టర్ గారి వలె సమాజంలో ఆరోగ్యపరమైన సేవచేద్దాం!

  అందరూ జబ్బుల పట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల , డాక్టర్లు చెప్పిన సలహాలు పాటించి, ప్రాణాలు కాపాడుకొని, హాయిగా జీవించాలనే సదుద్దేశంతో చేసిన రచన ఈ పుస్తకం వైద్య పరిజ్ఞానం-ఇంట్లో ఆరోగ్యం. ఈ రచన చదివి….

శతంజీవ – శతదో వర్ధమానః

శతం వసంతాన్- శతం హేమంతాన్ ॥

వంద వసంతాలు , వంద హేమంతాలు వర్ధిల్లుతూ జీవించండి॥

You may also like

Leave a Comment