Home ఇంట‌ర్వ్యూలు శాంతి ఎందుకు అవసరం?

శాంతి ఎందుకు అవసరం?

బహుముఖ ప్రజ్జాశాలులు శాంతి కాముకులు శ్రీ సిరాజుద్దీన్ గారితో మూఖాముఖీ

ఓం ద్యౌః శాన్తిరన్తరిక్షమ్
శాన్తి పృథివీశాన్తి రాపః
శాన్తి రోషధయః శాన్తి ౹
వనస్పతయః శాన్తిర్విశ్వేదేవాః
శాన్తి బ్రహ్మ శాన్తి సర్వం శాన్తిః
శాన్తి రేవ శాన్తిః
సామా శాన్తిరేధి ౹ ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

ఈ శాంతి మంత్రం భావంఏమిటంటే?
ఓ ప్రణవ స్వరూపా! ఊర్ద్వలోకంలో శాంతి నెలకొను గాక! అంతరిక్షంలో శాంతి నెలకొనుగాక!
మరియు జలములందు శాంతి నెలకొనుగాక! ఓషధులలో, అడవులలో,శాంతి నెలకొనుగాక! విశ్వమును పరిపాలించే దేవతలు శాన్తితో ఉందురుగాక! బ్రహ్మ శాంతి వహించుగాక! ప్రపంచమంతా శాంతి నెలకొనుగాక! విశ్వమంతటా శాంతి నెలకొను గాక!
అని వేదసూక్తం మనకేనాడో శాంతి యొక్క ఆవశ్యకతను చెప్పింది. శాంతి ప్రాధాన్యతను బృహదారణ్యక, ఈశావాస్య, తైత్తిరీయ మొదలైన అన్ని ఉపనిషత్తులలోనూ శాంతి మంత్రాలను పఠిస్తూ చివరిగా… ఓం శాంతిః శాంతిః శాంతిః అని ఈ పదాన్ని మూడుసార్లు ఎందుకు పలుకుతాం? అంటే
మూడుసార్లు ఎందుకు పలుకుతామని అంటే మొదటి శాంతి మనమూ, పరిసరాలు బాగుండాలనీ, అంటే అందరి శారీరక- మానసిక ఆరోగ్యాలు బాగుండాలని ప్రార్థిస్తాం!

రెండవ శాంతి పదం జీవకోటి సమస్తం ఏ ఆపదలూ? ముప్పు రాకుండా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తాం!
మూడవ శాంతి పదం ప్రకృతి నుండి కలిగే ముప్పులు.. ఉదాహరణకు భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ అపాయం కలగ కూడదని ప్రార్థిస్తాం !
మన ప్రార్థనలు విశ్వంలోకి వెళ్తాయనీ, మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే తప్పకుండా విశ్వశాంతి చేకూరుతుందని మన సనాతన ధర్మం చెప్తుంది.
శాంతి ఎందుకు అవసరం?
ఈ నేలమీద మన మనుగడ చక్కగా సాగాలంటే శాంతి కావాలి. ఈ శాంతిని మనం ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత, కాలుష్యంతో కొంత పోగొట్టుకుంటున్నామంటే… మరికొంత వైషమ్యాల వల్ల పోగొట్టుకుంటున్నాము.
అధికార ప్రదర్శనలో బలవంతులు బలహీనులపై చేసే యుద్ధాల వల్ల కూడా శాంతి కరువౌవుతున్నది. సమాజంలో శాంతి ఉన్నప్పుడు మాత్రమే మన మంతా సామరస్యంగా… అన్ని పనులు చేసుకోగలుగుతాం!
మరి సామరస్యం ఎందుకు లేదని అంటే???
ఒక పరిశీలన చేస్తే ఇద్దరి మధ్య విభేదాలు చర్చించి పరిష్కరించుకోకపోవడం, ఒకరికి ధన బలము, అధికార దర్పము ఉండి, ఇద్దరి మధ్య అవి అడ్డు రావడం ఒకటైతే… కాల ప్రభావంతో మానవ విలువలను మింగేయటమే ముఖ్యం. అయితే దేశాల మధ్య కానీ మానవజాతుల మధ్య కానీ ఆ తేడాలు ఉండడం సహజమే! కానీ శాంతి కావాలనుకున్నప్పుడు ఆ తేడాలను అంతగా పట్టించుకోకుండా
అందరమూ బాగుండాలి అందులో మనముండిలి అనే సిద్ధాంతం పాటిస్తే కొంతలో కొంత శాంతి మన సొంతమవుతుంది. అహాన్ని కొంత వదిలించుకుంటే అంతా శాంతే మరి!
మరి బతుకులోనూ మొండిగా నేను ఇలాగే ఉంటాను.. అంటే శాంతి లోపించి భయంకర పరిణామాలు ఎదురవుతాయి! అంటే అరాచకం చెలరేగుతుంది. మతం ఏదైనా సరే! జాతేదైనా సరే ! వర్ణమేదైనాసరే ? ఎవరైనా అందరూ శాంతి మంత్రాలు పాటించవలసిందే! ఇందులో భాగంగానే అటువంటి శాంతి స్థాపన కోసం మన వరంగల్ నివాసులు గౌరవనీయులు మహమ్మద్ సిరాజుద్దీన్ సోదరులు గొప్ప
ప్రపంచ శాంతి పండుగను కనుక్కొని, సమాజానికి పరిచయం చేసి, తాను పాటిస్తూ అందరూ పాటించడానికి గత కొంతకాలంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు.. ప్రయాస పడుతున్నారు.
ఆ శాంతి పండగ నేపథ్యంలో ఎందుకు ఆ వారికి ఆలోచన వచ్చిందీ? దానిని వారు ఎలా రూపకల్పన చేశారు? దాని కోసం వారు చేస్తున్న కృషి ఏమిటీ? అసలు శాంతి పండగ అంటే ఏమిటి? ఇలా వారి మనసులోని వసుధైక కుటుంబం అనే విశాల భావనలో నుండి ఏర్పడిన ప్రపంచ శాంతి పండగ ఆశయాన్ని చేరుకోవాలని శాంతి మన సమాజ సొంతం అవ్వాలని, మనః పూర్వకమైన శుభాకాంక్షలతో వారిని పరిచయం చేసుకుందాం… అందరమూ మనం శాంతి పండగను ఆచరించుకుందాం! సంతోషంగా ఉందాం!
శాంతి పండగ వ్యవస్థాపకులు గౌరవనీయులు మహమ్మద్ సిరాజుద్దీన్ గారికి స్వాగతం చెప్పుదామా? రస హృదయులైన సహృదయ పాఠకులకు నమస్కరిస్తూ…మీ రంగరాజు పద్మజ.

1 పద్మజ:- శ్రీ సిరాజుద్ధీన్ గారు నమస్కారాలండి.

Md సిరాజ్ :- నమస్కారాలండి పద్మజగారు.

  1. పద్మజ:- మీ కుటుంబ నేపథ్యం గురించి చెబుతారా?
    Md సిరాజ్:- మా కుటుంబ నేపథ్యం ఏమిటంటే…
    మా అమ్మ శ్రీమతి మెహెరున్నీసా బేగం.
    నాన్న శ్రీ ఖాజా మొయినుద్దీన్.
    స్వస్థలం: మా స్వస్థలం రంగాపూర్, నల్లబెల్లి మండలం. రెండు గ్రామాలను మా ముత్తాతలు నిర్మించారు. ఇది పాత నర్సంపేట తాలూక, వరంగల్ జిల్లాలో ఉండేది. నేను ప్రస్తుతం హనుమకొండలో నివసిస్తున్నాను.
    మాది రైతుకుటుంబం.
  2. పద్మజ:- మీరు ప్రధానంగా ఏ ఏ రంగాల్లో కృషి చేశారు?

Md సిరాజ్ :– ప్రధానంగా అంటే సామాజికమే. శాంతి స్థాపన నా ధ్యేయం. మళ్లీ అందులో ప్రపంచ శాంతి. ఇవికాక, సాహిత్యం: ప్రధానంగా తెలుగు సాహిత్యం. ఇందులో కవిత, కథ, తదితరాలు. కొంతమేరకు హిందీ, ఉర్దూలలో కూడా.
ఇంకా ఆటా- పాటా రాజకీయాలు, చిత్రలేఖనం, క్రీడలు. నేను స్థాపించుకున్న మూడు సంస్థలు (ఉజ్వల సాహితీ, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ, మరియు తెలంగాణ రాష్ట్ర కవుల సంక్షేమ సమాఖ్య) ద్వారా సంగీత- సాహిత్య మరియు సంస్కృతుల సేవ.

  1. పద్మజ:- మీరు స్థాపించిన తెలంగాణా రాష్ట్ర కవుల సంక్షేమ సమాఖ్య గురించి వివరించండి.

Md సిరాజ్ :— ఈ సంస్థను ఓ ఏడు నెలలు ముందు స్థాపించాను. ఆ మధ్య ఇక్కడ ఇద్దరు కవులు చనిపోయారు. పేదరికం వల్ల కర్మకాండలు కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే మేము కొందరం కావులము చందాలు వేసుకుని వారిని ఆదుకునే ప్రయత్నాలు చేసాము. ఆ సందర్భాలు నన్ను కలచి వేసాయి. తెలంగాణాలో CM గారు ఆ మధ్య రైతులకు, యాదవులు, గౌడులు, తదితరులకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినాడు, అలాగే రైతులు తదితరుల జీవితాలకు ఉచిత భీమా కూడా చేసినారు. రైతు మరణిస్తే అతడి ఇంటికి 5 లక్షల భీమా డబ్బులు వచ్చేవి. అలాంటి పథకాలు, భీమా, తదితర పథకాలను నిస్వార్థంగా బ్రతుకంతా సమాజ సేవ చేసే కవులకు కూడా కల్పించండని KCR గారిని రాష్ట్ర కవుల తరపున మనవి చేసు కోవాలనే లక్ష్యంతో ఈ సమాఖ్యను స్థాపించాను. మరియు KCR గారికి పలు మార్గాల్లో విన్నవించుకోవటం కూడా జరిగింది. అయితే ఇంతలో ఎన్నికలు రావటం KCR పదవి నుండి దిగిపోవటం జరిగింది. అయినా ఈ ప్రభుత్వానికి కూడా విన్నవించుకోనున్నాము. ప్రస్తుతం ఈ సంస్థను రిజిస్టర్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాము.
కాగా పాటలను (కరోకే విధానంలో పాడే విధానం) పాడే ఏకశిలా కరోకే క్లబ్ తో కలసి నెలనెలా సాహిత్య, సంగీత సమావేశాలను వరుసగా నిర్వహిస్తూ వస్తున్నాము.
ఈ సందర్భంగా ఓ నెల ఒక కవినీ ఇంకో నెల ఈ సంగీత కారుణ్ణీ, సన్మానించుకుంటూ గంగా జమ్నీ తహెజీబ్ (మాట సామరస్యం) కు అనుగుణంగా ముషాయిరా మరియు కవిసమ్మేళనాలను నిర్వహిస్తూ వస్తున్నాం.

  1. పద్మజ:- శాంతి పండుగ, ప్రపంచ శాంతి గురించి వివరించగలరా?

Md సిరాజ్ :- 1995 లో ప్రపంచానికి నేను బహుకరించిన శాంతి పండుగను ఏదో ఆషామాషీగా కాదు, పండుగ ద్వారా నిజంగా ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, గ్రామానికీ, పట్టణం, జిల్లా, రాష్ట్రం, దేశం మరియు అలా సమస్త ప్రపంచానికీ అన్ని రకాల అభివృద్ధులతో పాటు అంతిమంగా శాంతి లభించాల్సిందే అనే అత్యంత పటిష్టమైన పండుగను రచించాను.
వేయి కాళ్ళ జెర్రిలా ప్రపంచాన్ని చుట్టుకుని ఉన్న అశాంతిని నేనొక్కణ్ణి, అందునా కేవలం పండుగ అనే ఒకే ఒక ఆయుధంతో ఎలా నిర్మూలించగలను అనే విషయాలు తెలవని మనిషినేమీ కాను. ఇన్ని తేలిసే నేనీ అశాంతిని నిర్మూలించి, ప్రపంచంలో శాంతిని సాధించే పండుగను సృష్టించే ప్రయత్నం చేసాను.
పండుగను 1995 లో ప్రతిపాదించి, దానిని 1996 లో అప్పటి UNO సెక్రెటరీ జనరల్ గారి దృష్టికి తీసుకు పోయాను. వారు 1996లోనే అభినందించారు. అలా నా ద్వారా జీవం పోసుకున్న ఈ పండుగను ప్రపంచం నిండా వ్యాపింప చేయడం కోసమని World Peace Festival Society పేర ఓ అంతర్జాతీయ శాంతి సంస్థను స్థాపించి రిజిస్టర్ చేయడం జరిగింది.
దీని జీవిత కాల సభ్యుల్లో శ్రీ కాళోజీ, శ్రీ జయశంకర్ తదితరులు ఉన్నారు. కొత్త పండుగను ప్రపంచం నిండా వ్యాపింప చేసేందుకు ఈ సంస్థ చేపట్టే కార్యక్రమాల్లో శాంతి పండుగల నిర్వహణ, భారత్ శాంతిదూత్ అవార్డుల బహూకరణ, ఉగాది మిలన్, ఈద్ మిలాప్, మన పండుగలు, శాంతి ర్యాలీలు వంటి పలు కార్యక్రమాలు ఉన్నాయి.
భారత్ శాంతిదూత్ అవార్డులు ప్రదానం చేయబడిన వారిలో పద్మవిభూషణ్ Prof MS స్వామినాథన్ గారు, శ్రీ పాలెం కళ్యాణ సుందరం (తమిళనాడు), పద్మభూషణ్ Dr K I వరప్రసాద్ రెడ్డి గారు (శాంతా బయోటెక్), పద్మశ్రీ Dr K విశ్వనాథ్ గారు (సినిమాలు), పద్మశ్రీ నెరేళ్ల వేణుమాధవ్ గారు, శ్రీ PV నరసింహా రావ్ గారి (మరణాంతర), శ్రీ తక్కెళ్లపల్లి పురుషోత్తమ రావ్ గారు, (గాంధేయవాది), Prof B సురేష్ లాల్, లాంటి ముప్పై మందికి కు పైగా ప్రముఖులు ఉన్నారు.
మా సంస్థకు UNO వారు Affiliation ఇచ్చినారు. ఈ సంస్థను స్థాపించుకున్నప్పటికీ అధ్యక్షులుగా ఇతరులనే నియమించుకుంటూ వస్తున్నాను. ఈ అసాధారణమైన ప్రయత్నం వెనుకాల నిస్వార్థంగా నేరుగా ఇరవై ఏడు సంవత్సారాలుగా జీవితాన్ని పణంగా పెట్టి మరీ ఇదే ధ్యాసాగా, శ్వాసగా జీవిస్తూ వస్తున్నాను.

  1. పద్మజ:-మీరు సాహిత్యం వైపు అడుగులు వేయడానికి కారణాలేవి?

Md.సిరాజుద్దీన్:- ఏమో నాకే తెలవదు. ప్రపంచ శాంతి పండుగ పుస్తకాన్ని తీసుకుని క్రొత్త పండుగకు కాళోజీ గారి సహకారాన్ని తీసుకోవటం కోసం వారిని 1996 లో అనుకుంటా కలిశాను. వారు కొందరు కవులను పరిచయం చేసారు. పండుగకు కవుల సహకారం తీసుకోవడం కోసం అపుడప్పుడు కవితలను రాసుకునే నేను కవితా రచనాసక్తి పెంచుకున్నాను. ఊహించని రీతిలో ప్రోత్సాహం లభించ సాగింది. అలా కవిగా కూడా నిలిచి పోయాను. అయితే ఇవన్నీ నాకున్న కొన్ని అభిరుచులే అని తలుస్తాను. వాస్తవానికి నా జీవిత లక్ష్యం గమ్యం ప్రపంచ శాంతి పండుగే.

  1. పద్మజ:- మీ పుస్తకాన్ని శ్రీ కాళోజి గారితో
    ఆవిష్కరించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అప్పటి అనుభవాలు చెప్పండి. 1997 నుండి శాంతి పండగ ఇప్పటివరకు జరగడం ఆశ్చర్యం కాదా! దీని మీద ప్రముఖుల స్పందన ఏమిటి?

7.Md సిరాజ్ :- శ్రీ కాళోజీ గారు ప్రపంచ శాంతి పండుగ పుస్తకాన్ని చూసి పరమానందం పొందారు. ఈ పుస్తకం ఆవిష్కరించ బడిందా? అని అడిగారు.
ఆవిష్కరించబడలేదని అన్నాను.
నేను ఆవిష్కరిస్తా అన్నారు. సంతోషం అన్నాను. మిత్రమండలి నేతృత్వంలో మరికొన్ని సాహితీ సంస్థలను కలుపుకుని కాళోజీ గారు 27.01.1997 న నా పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ వారు,” ఈ పుస్తకం ప్రపంచ భాషలన్నింటిలో రావాలి, ప్రపంచ ప్రజలందరూ దీనిని చదవాలి, అపుడే ఈ పండుగను ప్రపంచమంతా జరుపుకో గలుగుతుంది”. అన్నారు.
Prof K జయశంకర్ గారు, ” ఆనాడు Newton కు వచ్చినటువంటి ఆలోచనే నేడు సిరాజోద్దీన్ కు వచ్చింది. Newton ఆలోచనా ఫలాలను నేటి ప్రజలు అనుభవిస్తున్నారు. సిరాజుద్దీన్ ఆలోచనా ఫలాలను రేపటి ప్రపంచం అనుభవించనుంది”. అన్నారు.
Prof S లక్షణమూర్తి గారు, ” నేనో ప్రతిపాదన చేస్తున్నాను. ఈ పుస్తకాన్ని ఉర్దూలో తర్జుమా చేసి జుమ్మా (శుక్రవారం) లలో మస్జీద్ ల వద్ద, తెలుగులో ఇంకిన్ని ప్రతులు వేసి శనివారాలలో దేవాలయాల వద్ద, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి ఆదివారాలలో చర్చ్ లవద్ద ప్రభుత్వమే ఉచితంగా పంచి పెట్టాలి అన్నారు.
శ్రీ నమిలిగొండ బాల్ కిషన్ రావ్ గారు వ్యక్తిగతంగా ప్రశంసిస్తూ, ” ఓ అయిదు వందల సంవత్సారాల తరువాత ప్రపంచం నిండా సిరాజోద్దీన్ విగ్రహాలే ఉంటాయి, ఇదే కోవలో శ్రీ గౌస్ మోహిఉద్దీన్ గారు ప్రశంసిస్తూ, ” నోబెల్ తో పాటు ప్రపంచంలోని అవార్డులు రివార్డులన్నింటితో సిరాజోద్దీన్ కు సన్మానం జరగాలి. సిరాజోద్దీన్ ను UNO ఆజన్మ ప్రపంచ శాంతిదూత గా ప్రకటించాలి”, ఇలాంటి ప్రశంసలు లభించాయి, లభిస్తున్నాయి కూడా….

  1. పద్మజ:- శ్రీ కాళోజీగారితో మీ స్నేహాన్ని వివరించగలరా?

Md సిరాజ్ :- కాగా కాళోజీ గారు నను కవిగా ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ, కవితా సంపుటి యుద్ధం ను వేసుకునే నాటికి (2005) వారు లేరు.
అయితే కాళోజీ గారితో నా అనుబంధం ఆరు సంవత్సారాల పాటు సాగింది. ప్రధానంగా ప్రపంచ శాంతి పండుగకు వెన్నుదన్నుగా వారే నిలిచారు. KCR గారి కాలంలో కాళోజీ గారన్నా జయశంకర్ గారన్నా ఉండి ఉంటే ఈ పండుగ కనీసం దేశం దాటేదేమో….
కవిగా కూడా కాళోజీ గారితో నా స్నేహం సంతృప్తిగానే సాగిందనేదానికి వారి మరణానంతరం వారిపై నేను రాసుకున్న శ్రద్ధాంజలి కవితా గేయమే సాక్ష్యం.

ఇక్కడ కాళోజీ కవిత పెట్టాలి.

  1. పద్మజ:- మీరు రచించిన పుస్తకాలు పేర్లు చెప్పగలరా? Md సిరాజ్:-ముద్రించుకున్నవి ప్రధానంగా రెండే. మొదటిది 1995 లో ప్రపంచ శాంతి పండుగ. (అది ఓ సామాజిక ప్రయోగంగా నేను తలుస్తాను).
    యుద్ధం….శాంతి అశాంతుల మధ్య
    అనేది రెండోది కవితా సంపుటి.
  2. పద్మజ:- మీకిష్టమైన పుస్తకం చెప్పండి.

Md సిరాజ్ -:నాకు నచ్చిన పుసఏడు తరాలు అనే అనువాద నవల. (Roots అనే ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఇది).

  1. పద్మజ:- మీరు రాసిన కవితలు మీకు బాగా నచ్చిన కవితను మా పాఠకుల కోసం వివరించగలరా?

Md సిరాజ్
కవత 2 పోస్ట్ చేయాలి.

13.పద్మజ:- మీ రచనలో ప్రధానంగా ఏ యే అంశాలు కనిపిస్తాయి?

Md సిరాజ్:- నా కవితలల్లోశాంతీ సామరస్యాలు, మంచీ మానవత్వం, కవితల్లో మెచ్యూరిటీ నిండుగా ఉండాలనుకుని కోరుకుంటాను. కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండి తీరాల్సిందే, అంటాను. కవితల్లో ప్రజా సమస్యలు ఉండాలంటాను. కవితలను వీలైనంతవరకు మధురంగా పాడి వినిపిస్తాను. కవితను ఇష్టంగా కష్టపడి రాస్తాను. నా కవితను ఒక మారు విన్నవారు దాదాపుగా నన్ను మరచిపోరని ప్రతీతి. ఇలాంటి ప్రత్యేకతలతో నా కవితలు కూడుకుని ఉంటాయి. కాబట్టి కవితలంటే పారిపోయే ప్రజలు కూడా నాకవితలను శ్రద్ధగా వింటారు. అలాంటి అభిమానులు నాకు ఉండటం నా అదృష్టం.

  1. పద్మజ:- మీరు ఏ వయసు నుండి సాహిత్యం మీద కృషి చేస్తున్నారు?

Md సిరాజ్:-చిన్నప్పటి నుండే. బహుశా నా16వ ఏటనుండి అనుకుంటున్నా.

  1. పద్మజ:- మీరు ఏ ఏ పత్రికలో వ్యాసాలు రాశారు? వాటి వివరాలు చెబుతారా?

Md సిరాజ్ :-మొదట్లో దాదాపు అన్ని పత్రికల్లో వచ్చాయి. పత్రికల్లో వేసుకోవాలనే కోరిక ఇపుడు లేదు. అట్లాగని కవితలను రాయటం ఆపుకోలేదు. రికార్డు చేసుకుని Youtube లో భద్రపరచుకోవాలని ఉంటుంది. కాని సమయం లభించదు.

  1. పద్మజ:- మీరు మా పాఠకుల కోసం ఇచ్చే సందేశం ఏమిటి?

Md సిరాజ్:- సాహిత్యంలో మిగతా ప్రక్రియలు అంటే కథలూ, నవలలూ, వ్యాసాలూ, సమీక్షలు లాంటివి రాయాలనుకున్నా విలువలు ప్రధానం. కాబట్టి రాయాలనుకునే వారందరూ ముందుగా విలువలను పాటించటం నేర్చుకోవాలి.
అరవై నాలుగు కళల్లో అన్నీ నేర్చుకుంటే వచ్చేవే అనే అభిప్రాయం ఉంది నాకు. ఒక్క కవిత్వాన్ని మినహాయించి , కవిత్వం నేర్చుకుంటే రాదు. అది వ్యక్తితో పాటు పుట్టి వ్యక్తితో పాటు పెరిగి వస్తుంది. అలాంటివారే అసలు సిసలైన కవులు. అలాంటి వారే కాలచక్రం పై నిలుస్తారు. కవి అలా ఉండాలనుకుంటాను.

కవులు తమ కవితలను ఇష్టపడి రాయాలి. కష్టపడి రాయాలి. కవితలు రాసే వారు నూటికి నూరుశాతం పరమ పవిత్రంగా ఉంటేనే అసాధారణ కవితలు వస్తాయి. అల్లాంటి కవులు యుగాల్లో ఒకరిద్దరు ఉండటం కూడా కష్టమే. వారు కాలం పై నిలుస్తారు. మిగతా వారు కూడా నీతి నిజాయితీలతోనే ఉండాలి. కవి లోపల ఏ భావముంటే అదే కవితా రూపంలో బయటకు వస్తుంది. కవి వ్యక్తిత్వమే కవి యొక్క కవితలు.

  1. పద్మజ:- మయూఖ పత్రిక మీద మీ అభిప్రాయం తెలుపండి

Md సిరాజ్:-
నిహారిణిగారు నా కవితను ఇదివరలో మయూఖలో ప్రచురించారు. వారిని రెండు మూడు సందర్భాల్లో కలిసి కూడా ఉన్నారు. విలువలతో కూడిన సాహితీ శ్రమ వారిది అనే అభిప్రాయం ఏర్పడింది. నిహారిణి గారిపవిత్ర ప్రయత్నాలు ఇలాగే ఫలిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

శ్రీ సిరాజుద్దీన్ గారు తలపెట్టిన లక్ష్యం నెరవేరాలనీ, వారు కోరుకునే విలువలు రేపటి తరానికీ అలాగే నిలిచి, వాటిని పాటిస్తూ… బతుకును శాంతిమయం చేసుకొని, వారితో పాటూ ప్రపంచం యావత్తూ శాంతి పండగను దసరా- దీపావళులవలె ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ…
ఈ సందర్భంగా సిరాజుద్దీన్ గారిని అభినందిస్తూ… అడిగిన వెంటనే ముఖాముఖీ జరిపేఅవకాశమిచ్చినందుకు మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక తరపున అభినందనలుచెప్తూ… పాఠకులకు శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నది. రంగరాజు పద్మజ, అందరికీ నమస్కారములు.

You may also like

Leave a Comment