Home వ్యాసాలు శిష్ట సాహితీ శిఖ‌రం…

శిష్ట సాహితీ శిఖ‌రం…

( ప్ర‌ఖ్యాత సాహితీవేత్త డాక్ట‌ర్ గుమ్మ‌న్న‌గారి బాల‌శ్రీ‌నివాస‌మూర్తి సంస్మ‌ర‌ణ‌లో…)

బ‌హుముఖ కృషితో ప్రామాణిక‌మైన ర‌చ‌న‌ల‌ను తెలుగు సాహిత్యానికి అందించిన విద్వ‌న్మ‌ణి ఆచార్య గుమ్మ‌న్న‌గారి బాల‌శ్రీ‌నివాస‌మూర్తి. సాహితీవేత్త‌గా, ప‌రిశోధ‌కునిగా, ప‌త్రికా సంపాద‌కునిగా నిత్య‌కృషితో ఉజ్వ‌లంగా ప్ర‌కాశించిన ప్ర‌జ్ఞామూర్తి. ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టుగా వేలాది ర‌చ‌న‌ల‌ను పత్రిక‌ల‌లో ప్ర‌చురించి ప్రామాణిక పత్రికా ర‌చ‌న‌కు అర్థం చెప్పిన జ్ఞాన‌శీలి.
గుమ్మ‌న్న‌గారి బాల‌శ్రీ‌నివాసమూర్తి 5 సెప్టెంబ‌రు 1966న మెద‌క్ జిల్లా పోతారెడ్డిపేటలో ల‌క్ష్మీన‌రసింహశ‌ర్మ‌, ప‌ద్మావ‌తి దంప‌తుల‌కు జ‌న్మించారు. శ్రీ‌నివాసమూర్తి తండ్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌శ‌ర్మ క‌వి, అవ‌ధానిగా ప్రఖ్యాతి పొందారు. చిన్ననాడే ఇంటి నుండే బాల శ్రీ‌నివాసమూర్తికి సాహిత్యంపై యెన‌లేని మ‌క్కువ ఏర్ప‌డింది. పాఠ‌శాల‌, క‌ళాశాల స్థాయి విద్యాభ్యాసానంత‌రం హైద్రాబాదులో విశ్వ‌విద్యాల‌య స్థాయిలో విద్య‌ను అభ్య‌సించి ప‌రిశోధ‌న చేసి డాక్ట‌రేట్‌ను అందుకున్నారు. జ‌ర్న‌లిస్టుగా, ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టుగా సుదీర్ఘ కాలం వివిధ ప‌త్రిక‌ల‌కు విభిన్న‌మైన ర‌చ‌న‌లు అందించి తెలుగు పాఠ‌కుల‌కు సుప‌రిచితుల‌య్యారు.
తెలంగాణ విశ్వ‌విద్యాల‌యం ఏర్ప‌డిన త‌రువాత అక్క‌డ బోధ‌కులుగా చేరి క్ర‌మంగా అసోసియేట్ ప్రొఫెస‌ర్, ప్రొఫెస‌ర్‌గా ప‌దోన్న‌తులు పొందారు. ప‌రిపాల‌నాప‌ర‌మైన వివిధ ప‌ద‌వులను కూడా ఆయ‌న నిర్వ‌హించారు. ప‌లు విశ్వ‌విద్యాల‌యాలు, సంస్థ‌లు నిర్వ‌హించిన జాతీయ, అంత‌ర్జాతీయ స‌ద‌స్సుల‌లో పాల్గొని అనేక ప‌రిశోధ‌నాప‌త్రాలు స‌మ‌ర్పించారు. వివిధ కార్య‌క్ర‌మాల‌లో సాహిత్య ప్ర‌సంగాలెన్నో చేశారు. సాహిత్య‌, సాంస్కృతిక‌, చారిత్ర‌క అంశాల‌పై ప‌ది వ‌ర‌కు ప్రామాణిక‌మైన పుస్త‌కాల‌ను వెలువ‌రించారు. ఆత్మ‌క‌థ‌ల్లో ఆనాటి తెలంగాణ‌, స‌మ‌కాలీన వాదాలు – సాహిత్య విమ‌ర్శ‌, తెలంగాణం – తెలుగు మాగాణం, తుషార స‌మీరం, తెలంగాణ ప‌త్రిక‌లు, వెలుతురు కొల‌ను, మా ప్ర‌సిద్ధ‌పేట‌, విల‌క్షణ – పి.వి న‌ర‌సింహారావు జీవిత చ‌రిత్ర‌, దేవుల‌ప‌ల్లి రామానుజ‌రావు (మోనోగ్రాఫ్), జీవ‌నహిందోళం (గుమ్మ‌న్న‌గారి ల‌క్ష్మీన‌రసింహ‌శ‌ర్మ గారి జీవితం – అవ‌ధానం), తెలంగాణ వైతాళికులు సంపాద‌క‌త్వం (మూడు సంపుటాలు.. జ‌న‌నేత‌లు, అక్ష‌ర మూర్తులు, ప్ర‌తిభామూర్తులు), సాహితీ సుధ‌, తెలంగాణ చ‌రిత్ర సంస్కృతి వార‌స‌త్వం, తెలంగాణ సాహిత్య చ‌రిత్ర మొద‌లైన ఆయ‌న ర‌చ‌న‌లు ఎంతో పేరొందాయి. 56 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే వెల‌క‌ట్ట‌లేని సాహిత్య, సాంస్కృతిక, చారిత్ర‌క, సామాజిక‌ అంశాల‌ను శోధించి, ప‌రిశోధించి సాహిత్య‌లోకానికి అందించారు.
పండిత క‌వి, అవ‌ధాని ల‌క్ష్మీన‌ర‌సింహ‌శ‌ర్మ‌ కుమారుడైన బాల శ్రీ‌నివాస‌మూర్తి త‌న అద్వితీయ ర‌చ‌నా ప్ర‌తిభతో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా సాహిత్య‌రంగంలో ఎంతో పేరొందారు. తెలంగాణ‌, తెలుగు మాగాణం, వెలుతురు కొల‌ను, తుషార స‌మీరం అన్నవి శ్రీ‌నివాస‌మూర్తి విమ‌ర్శా ప్ర‌తిభ‌ను చాటిచెప్ప‌డ‌మే కాక ఎంద‌రో ప్ర‌సిద్ధ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందాయి. ఆత్మ‌క‌థ‌ల్లో ఆనాటి తెలంగాణ అన్న ర‌చ‌న‌లో మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మ కాలంలోని క‌థ‌లు పోషించిన కీల‌క పాత్ర‌ను రాజ‌కీయ నిబ‌ద్ధ‌త‌తో అత్యంత జాగ్ర‌త్త‌గా శ్రీ‌నివాస‌మూర్తి ర‌చించారు. ఆధ్యాత్మిక ర‌చ‌నా విశిష్ట‌త‌ను తెలుపుతూ ర‌చించిన తెలుగులో ఆధ్యాత్మిక వ‌చ‌న కావ్యాలు అన్న ప‌రిశోధ‌నాత్మ‌క గ్రంథం ఎంతో మంది పండితుల ప్ర‌శంస‌లందుకుంది. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైత‌న్యం – ప‌త్రిక‌ల పాత్ర అన్న ప‌రిశోధ‌నతో 1920 – 56 మ‌ధ్య కాలంలో తెలంగాణ‌లో ప‌త్రిక‌ల చైత‌న్య భూమిక‌ను, సామాజిక చారిత్ర‌క ఘ‌ట్టాల‌ను వివరించారు. విల‌క్షణ అన్న పేరుతో పీవీ శ‌త జ‌యంతి మోనోగ్రాఫ్‌ను నీల్‌క‌మ‌ల్ పుస్త‌క సంస్థ కోసం ఎంతో అద్భుతంగా శ్రీ‌నివాస‌మూర్తి రాశారు. పీవీ బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌కు ఈ గ్రంథం ప్ర‌త్య‌క్ష‌ నిద‌ర్శ‌నంగా నిలిచింది. తెలంగాణ గురించి మూడు ప్ర‌త్యేక సాహిత్య వ్యాస సంపుటాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించి ఎంద‌రో సాహితీవేత్త‌లను ప్రోత్స‌హిస్తూ విలువైన‌ వ్యాసాలను రాయించారు. ఎంతో గొప్ప సాహిత్య కృషిని ఈ సంపుటాల ద్వారా బాల‌శ్రీ‌నివాస‌మూర్తి అందించారు. సుల‌భ వ‌చ‌న ర‌చ‌నాశైలిలో ఏ స్థాయి పాఠ‌కుడినైనా వెంట‌నే ఆక‌ట్టుకునేలా ర‌చ‌న చేయ‌డం బాల‌శ్రీ‌నివాస‌మూర్తి ప్ర‌త్యేకత‌. చిన్న వాక్యాలు, సుల‌భ‌మైన ప‌దాల‌తో అర్థ‌వంతంగా అమూల్య గ్రంథాల‌ను అందించిన ఆయ‌న సాటిలేని మ‌హోన్న‌త సాహితీమూర్తి. విన‌మ్ర‌త‌తో, విజ్ఞానంతో అంద‌రికీ ఆత్మీయునిగా ఆయ‌న త‌న సాహిత్య ప్ర‌యాణాన్ని కొన‌సాగించారు.
తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవ‌లందించిన బాల‌శ్రీ‌నివాసమూర్తి 24 ఏప్రిల్ 2023న హైద్రాబాదు సుచిత్రలోని త‌మ ఇంటిలో గుండెపోటుకు గురై మ‌ర‌ణించారు. తెలుగు సాహిత్యంలో చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచిపోయే విశిష్ట కృషి చేసిన ప‌రిశోధ‌క‌మూర్తి, అరుదైన సాహితీవేత్త బాల‌శ్రీనివాసమూర్తికి క‌న్నీటి నివాళి.

You may also like

Leave a Comment