Home ఇంద్రధనుస్సు శ్రీయాదాద్రీశవైభవమ్-17

కైవల్య శ్రీ దపాదం కలికలుష మహత్వ చ్ఛిదారూఢ పాదం సత్పూజాపాదపాదం సకల రుగపహరామూల్య సంపాదపాదం శాపాస్తామోద పాదం సురవరసరి దుద్భూత ఫూతాబ్ద పాదం వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ || తాత్పర్యం: మోక్షలక్ష్మిని ఇచ్చే పాదము; కలిపురుషుడు మానవుల చేత చేయించే సమస్త పాప భారాన్నీ ఛేదించడం కోసం పైకెత్తబడిన పాదము; చక్కని పూజలు అందుకోవటానికి ఆశ్రయమైన పాదము; సకల విధ రోగాలను – జాడ్యాలను హరించివేసే – అమూల్యమైన వరాలను అనుగ్రహించే – పాదము; మునివరులు, మహర్షులు ఇచ్చిన అస్త్రాల వంటి శాపాలను సంతోషంతో అంగీకరించిన పాదము; దేవనదియైన గంగ పుట్టుకకు మూలమై పవిత్రమైన పాదపద్మము కలవాడు శ్రీహరి. అట్టి యాదాద్రిపై వెలసి తన బలిష్ఠములైన భుజబలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లోకులు తమకోసం, తమ కుటుంబం కోసం ఎన్నో చిన్న-సన్న కోరికలతో ఎందరో దేవతల్ని పూజిస్తూ ఉంటారు. వారిచ్చే అల్పమైన వరాలు భక్తుల తాత్కాలిక సుఖాలను, భోగవాంఛల్ని కొంతవరకే తీర్చగలుగుతాయి. కాని శాశ్వతానందాన్ని మాత్రం అందించలేవు. మోక్షప్రాప్తితో మాత్రమే నిజమైన, నిత్యానందం లభిస్తుంది. “మోక్షమిచ్చే జనార్ధనాత్” అని ఋషివచనం. (కైవల్య+శ్రీ +ద+పాదం=) అటువంటి మోక్షసంపదను అనుగ్రహించేవాడు విష్ణువు మాత్రమే! హరిపాదాలను ఆశ్రయించటమే మోక్షసంపత్పాప్తికి ఉన్న ఏకైక మార్గం!

కలియుగంలో ధర్మం ఒక్క పాదంతో మాత్రమే నడుస్తుందని సమస్త పురాణాలూ వక్కాణిస్తున్నాయి. సుఖలాలసభోగవాంఛ మితిమీరి, ద్రవ్య సంపాదన మాత్రమే ఏకైక మార్గంగా బతికేస్తున్న నేటి కలియుగంలోని మానవుడు చేయని పాపాలు లేవు. (కలి+కలుష మహత్వ +ఛిద్+ఆరూఢ+పాదం=) కలిపురుష ప్రభావితులై మానవులు చేస్తున్న ఘోరమైన పాపాల మోపుల్ని ఛేదించి వేయడం కోసం హరి తన పాదాలను సంసిద్ధంగా ఉంచుతాడు. అంటే విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించిన వారికి పాపవిముక్తి చాలా తేలిక!

(సత్పూజా+ఆపాద+పాదం=) పూజ అంటే అర్చనాదులు. పెద్ద వాళ్ళను గౌరవించడానికి చేసేవే పూజలు మొదలైనవి! అటువంటి సత్పూజల్ని అందుకునేవి శ్రీహరి పాదాలు. అంతమాత్రమే కాదు. హరిపాదాలను ఆశ్రయించినవాళ్ళు గొప్ప పూజాదికాల్ని అందుకోవటానికి అర్హులౌతారు కూడ!

భోగాభిలాష శరీరాన్నే కాదు – మనస్సుని, ఇంద్రియాలను కూడ గాడి తప్పిస్తుంది. దాంతో ఎన్నో విధాల మానసిక – శారీరక బాధలు, రోగాలు మనిషిని క్రమంగా ఆక్రమిస్తాయి. (సకల+రుక్+అపహర+అమూల్య+సంపాద+ పాదం=) అటువంటి సమస్త రోగాలను క్షణాలలో తొలగించి, నయం చేసే – గొప్పదనాన్ని సంపాదించి పెట్టే – విలువ కట్టలేనివి శ్రీహరిపాదాలు!

మహర్షులు మహనీయులు. తపస్సంపన్నులు! వారికి ఆగ్రహం వచ్చినా-అనుగ్రహం కలిగినా క్షణాలలో స్పందిస్తారు. భవిష్యత్ దర్శనం చేయగల మహర్షులు శ్రీహరిని కూడ అనేక సందర్భాలలో శపించారు! విష్ణువు అనేకములైన – మత్స్య, కూర్మ, వరాహ, నారసింహాది రూపాలలో – జన్మలెత్తటం, రామకృష్ణాది అవతారాలలో ఎన్నో కష్టాలు అనుభవించటం,

కలియుగంలో ఆపద్బాంధవుడై వరదుడైన శ్రీనివాసుడు లక్ష్మీదేవితో ఎడబాటు పొందటం మొదలైనవన్నీ మహర్షులిచ్చిన శాపఫలాలే కదా! అటువంటి (శాప+అస్త్ర+ఆమోద+పాదం=) మహర్షుల శాపాలనే అస్త్రాలను సంతోషంతో ఆమోదించి, భూమిపై వివిధ రూపాలలో జన్మించి, నేటికీ భక్తుల పూజలందుకుంటున్నాడు శ్రీహరి!

సమస్త పాపాలను హరించివేసేది గంగానది! (సురవర+సరిత్ + ఉద్భూత +పూత +అబ్జ+పాదం=) బ్రహ్మసృష్టికి ఉపయోగపడుతూ ఆయన కమండలంలో అడిగి ఉందట ఆకాశగంగ! ఆయన విష్ణుమూర్తి పాదాలను కడిగితే – అక్కడ నుండి ప్రవహించిన గంగ విష్ణుపాదోద్భవి అని పేరు పొందింది. సురవర సరిత్ అంటే ఆకాశ గంగ! గంగ పుట్టుకకు ఆధారమైన పవిత్ర పాదం, తామర పూవులాంటి పాదం, కలిగినవాడు విష్ణుమూర్తి! శ్రీయాదగిరిపై వెలసి, తన పటుతర భుజబలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీనరసింహుణ్ణి కవి తన పద్య రక్తారవిందాలచే పూజించి, నమస్కరిస్తున్నాడు.

You may also like

Leave a Comment