Home ఇంద్రధనుస్సు శ్రీ యాదాద్రీశ వైభవమ్

శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్తలయిన డా|| ఎస్. లక్ష్మణ మూర్తి

డా|| శ్రీ రంగాచార్య సోదరులయొక్క తండ్రిగారు.

ధన్యం మాన్యం వదాన్యం విఫలిత రిపురాజన్య మూర్థన్య జన్యం

మాద్య ద్విత్సుత్సముద్య ద్విమల తనురుచి వ్యాప్తరో ధంతరాళం

దౌష్ట్యేష్టాభీష్ట నష్టం గణితరణ రమత్సింహ నా దానుమోదం

వందే యాదక్షమాభ్పతటక పటు భుజారంహ లక్ష్మీనృసింహమ్

తాత్పర్యము :  ధన్యుడు, మన్నింప దగినాడు, ఆహ్లాదకరముగా మాట్లాడువాడు, దానశీలి, తమ ప్రయత్నములన్నీ విఫలములై, విపరీతములైన ఫలితములు కలిగినవేళ శ్రతు (రాక్షస) రాజ్రశేష్ఠులతో జయశీలియై యుద్ధమొనర్చినవాడు; మదించిన శ్రతువుల (దానవుల) వలన ఉత్పన్నములైన ఆపదలను తన పరాక్రముచేత అణచుటవలన కలిగిన విజయముచేత తన ప్రకాశిస్తున్న తన నిర్మలమైన శరీర కాంతిచేత వ్యాపించిన భూమ్యంతరిక్షముల మధ్య భాగము కలవాడు; దుష్టతనమునందే తమకు కల ఇష్టములన సూరలు, మునులు మొదలైనవారికి హాని కలిగించటమే తమ లక్ష్యము (అభీష్టము)గా పెట్టుకున్న దానవులకు నష్టం కలిగించినవాడు, తనను స్తుతించే భక్త జనులకు తన రణరణ ధ్వని పూర్వకమైన సింహనాదములచే తన సంతోషమును, సమ్మతిని తెలుపుచున్నవాడు అయిన యాదాద్రిపై నెలకొని తన భుజబలమును ప్రదర్శిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు : శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి ధన్యుడు. ధనం అంటే పుణ్యం. అది కలిగినవాడు ఆర్తత్రాణ పరాయణమనే పుణ్య కార్యమునే తన ప్రవృత్తిగా పెట్టుకున్నవాడు. సర్వ లోకాలచేత మన్నింప (పూజింప)బడేవాడు, మాన్యుడు. ఆపన్నులకు – భక్తజనులకు – వారి సమస్తములైన కోర్కెలను తీర్చే వదాన్యుడు – దానశీలి! శ్రీ లక్ష్మీదేవి తన భార్యగా కల శ్రీ మన్నారాయణ మూర్తికి భక్త జనుల కోసం ఇవ్వలేని దంటూ ఏముంటుంది?

ఎందరో రాక్షసులు, దానవ రాజులు ఘోర తపస్సులు చేసి, బ్రహ్మను మెప్పించి, ఎన్నో అసాధ్యములైన వరాలను పొందారు. లోకాలన్నింటినీ గడగడలాడించారు. కాని చివరికి వారు సంపాదించిన వరబలం విపరీత ఫలితాలను ఇచ్చింది. వారి ప్రయత్నాలు నిష్ఫలాలైనాయి. అటువంటి దానవ రాజాధిరాజుల్ని కూడా ఎన్నో అవతారాలెత్తి శ్రీహరి యుద్ధం చేసి సంహరించాడు. “ధర్మో రక్షతి రక్షితః” అన్న వేదాను వచనానికి ఇంతకంటే ఇంకేం ప్రమాణం కావాలి?

(మాద్యత్ +ద్విట్ + సుత్ + సముద్యత్ =)వర బలంవలన మదించిన శత్రు (దాన)వులచేత దేవతలకు, మునులకు, మానవులకు ఎన్నో ఆపదలు కలుగుతుంటాయి. వారిని నివారించటం కోసం వివిధ అవతారాలెత్తి, దుర్మార్గులను తన (సముద్యత్ =) పరాక్రమంచేత నిర్మూలించినవాడు విష్ణుమూర్తి! అటువంటి శ్రీహరి యొక్క నిర్మలమైన (విమల + తను +  రుచి + వ్యాప్త + రోధస్ + అంతరాళం రోధస్ + అంతరాళం ఉంది. ఇక్కడ “రోదంతరాళం” అన్నది ముద్రణా దోషం (అచ్చు తప్పు) కావచ్చు)=) శరీరకాంతులు భూమ్యాంతరిక్షాల మధ్య భాగమందంతటా వ్యాపించి ఉన్నదట! కీర్తిని తెల్లగా ఉందని వర్ణించటం కవి సమయం. శ్రీహరి దుష్టసంహారం కోసం ఎత్తిన నృసింహావతారం యొక్క దివ్యశరీరకాంతులు దశదిశలా, సర్వలోకాలలో వ్యాపించినవని కవి దర్శించాడు.

(దౌష్ట్య + ఇష్టా + అభీష్ట + నష్టం = ) దానవులు ధర్మేతరాలైన దుష్ట కార్యాలు చేయటంలో ఇష్టం కలిగి ఉంటారు. అడేవాళ్ల అభీష్టం కూడా. అటువంటివాళ్ళ అభీష్టానికి (లక్ష్యానికి) నష్టం కలిగించేవాడు శ్రీహరి. (గణి + తరణ + రణత్ + సింహనాద + అనుమోదం =) గణించట అంటే భగవంతుణ్ణి స్తుతించటం అని అర్థం. ‘గణి’ అంటే స్తుతించేవాడు, భక్తుడు అని అర్థం! భక్తుల్ని వారికి కలిగిన ఆపదల నుండి తరింపజేయటం, రక్షించటం శ్రీహరి అపారకరుణకు ఉదాహరణ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులను ఆపదలనుండి ఉద్ధరించిన తరువాత సింహనాదం చేశాడట! ఆ శబ్దం భక్త జనులు చేస్తున్న స్త్రోత్రపాఠాలకు తన అనుమోదం (సమ్మతి) తెలిపినట్లుగా ఉందట!

యాదాద్రిపై నెలకొని తన పటుతరమైన భుజబలాన్ని చూపిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమస్కరిస్తున్నాను అని కవి వినమ్రుడై పలుకుచున్నాడు!

You may also like

Leave a Comment