భారతీయ రాజముద్ర సత్యమేవజయతే అనే ముండకోపనిషత్ వాక్యంతో అలకరించబడి సమస్త భారతీయుల జీవనతత్వపు అంతఃసూత్రాన్ని విరాజమానం చేస్తుంది. ఏకంసత్ బహుధావదంతి అన్నదీ భారతీయుల అదే జీవనతత్వపు కొనసాగింపు. ఈరెండూ అనాదిగా ఇక్కడి తాత్విక అస్తిత్వభూమికలు, వీటిని అల్లుకొని విస్తరించిన అనేకానేక జీవనపంథాలు మతాలుగా, భావజలాలుగా స్వేచ్ఛగా వికసించి,విస్తరించి తమదైన కళలు,సాహిత్యం,ఆచారం సృష్టించుకొని,పరిఢవిల్లి సుసంపన్న లౌకికజీవనానికి ప్రతీకలయ్యాయి.
ఈ లౌకిక జీవన ప్రయాణంలో ఎక్కడ భావనాత్మక చైత్యనానికి వూనిక దొరికిందో అక్కడనుంచి కొత్తమలువు, కొత్తదారి,కొత్తనడవడి మొదలై కొంతకాలంవిలసిల్లి,అప్పటికే స్థిరపడిన దారులతోతలపడ్డాయి,అనునాయిల ఘర్షణ,రాజాశ్రయం,పోషితవర్గంగా మారినప్పుడు హింసను ఎదుర్కొన్నాయి. సామాజికుల ఆదరణ,నమ్మిక ఉన్నంత కాలం ఉండి కనుమరుగైనవీ ఉన్నాయి.కొత్తగా ఉద్భవించేవీ ఉన్నాయి ఒకసారి ఒక ఆధ్యాత్మిక జీవనమార్గాన్ని ఎంచుకొని మొదలయ్యాక మరొక భిన్నమైనమార్గం వైపు మరలాలనే తలంపు ఎలా కలిగినవీ అంటే అప్పటికే ఉన్నదాంట్లో ఉన్నఎంతో కొంత అసంతృప్తత ,ప్రాతిపదిత అంశాలతో ఏకీభవించలేకపోవడం,ఆచరించడం గహనమవడం, వ్యవహారాలతో సమాధానపడకపోవడంవంటివి నిరంతర తాత్వికఅన్వేషణకు హేతువులయ్యాయి, మరో జీవన ఆచరణకు మార్గాలయ్యాయి.అది రామాయణ కాలంలో జాబాలి నుంచి , జైన , బౌద్ధులు, చార్వాకులు , అజీవకుల నుంచి, శివ , వైష్ణవ, శక్తేయుల భక్తితత్వ మార్గదర్శకులైన మధ్యయుగ మహానుభావులనుంచి నిన్నమొన్నటి సంస్థాగత ఆధ్యాత్మిక అభివృద్ధి కారకుల వరకూ ఇప్పటికీ ప్రపంచం నలుమూలలనుంచీ ఎదిగిన ఎదుగుతున్న విభిన్న భక్తిభావనలవరకు సామాన్య మానవుని భక్తి విశ్వాసాలను అగ్నిపరీక్షకు గురిచేసేదే.అందునా భారత దేశం ఆరవ శతాబ్దం నుంచి గీత గీసినట్టు భక్తి భావాల విభేధానికి గురై భిన్నమార్గాలను ఎంచుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూసి మళ్ళా దారులను సవరించుకొని మళ్ళీ మళ్ళీ అదే విభేధాల్లో కొట్టుమిట్టాడినప్పుడల్లా నిట్టాడెత్తి ఒక గూటికి తెచ్చిన దార్శనీకులు హేతువుతో ఎదురువచ్చి పాతమార్గాల ముళ్ళకంచెలను సంస్కరించపూనుకున్నారు. ఈ హేతువు మానవతావాదం వైపు నిలబడడం అన్న గొప్ప సందేశమే ఇస్తుంది తప్ప వ్యక్తిని విమర్శించదు.వారు హేతువును కోల్పోయిన వ్యవస్థను చీల్చి చెండాడి కూలదోయడానికీ వెనుదీయలేదు.ఇంకా ఏది ఒక సామాన్యుని మనస్సును నిర్మాలంగానూ జీవితాన్నిశాంతి సౌభ్రాతృత్వాలతోనూ నింపగలదో ఆవెలుగును చూడగలిగే దుర్భిణిని చేతికిచ్చారు. అలాంటి మహానుభావుల్లో సత్యంయొక్క అర్థాన్ని వెతుకుతూ తాను తన జీవితం మొత్తం ఖర్చుచేసి కనుగొన్న సత్యాన్ని ప్రకాశింపజేస్తూ సత్యార్థప్రకాశికను వెలువరించిన స్వామి దయానందసరస్వతి ముందుంటారు.సంస్కరణవాదిగా, ఐక్యతామూర్తిగా, మానవతావాదిగా భారత యవనిక మీద చిరకాలం నిలిచి ఉండే హేతువును ప్రతిష్టించారు. అది నిక్షిప్తం చేసన గ్రంథమే సత్యార్ధ ప్రకాశిక,అది ఋషభనాథుడికి, బుద్ధుడికి భిన్నమైన సామాజిక రాజకీయ నేపథ్యం ఉన్న వైయుక్తిక భారత సంక్లిష్టకాలంలో దీపశిఖ.
దయానందుడు కథియావార్, నేటి గుజరాత్లో 1824లో జన్మించారు. అది అప్పటి బ్రిటిష్ ఇండియాలో బాంబే ప్రెసిడెన్సీ లో ఉండేది. కథియావార్‌లో వల్లభాచార్యులపంథా, వైష్ణవులపంథాలో ఆధ్యాత్మకజీవనం కొనసాగుతున్న కాలం.బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో భారతదేశం అంతా కుదుపులకు లోనవుతున్న కాలం. భారతదేశం నుంచి ఏమి పొందగలం అనుకున్న బ్రిటిష్ వారికి విస్తారమైన సహాజవనరులు, సంపద కళ్లముందు ఉండగా భారతీయులనుంచి ఏమి పొందగలం అనుకుంటే క్రమశిక్షణగల శ్రామికత్వం ఒక్కటే బలంగా కనిపించిన అంశం. భారతీయుల శరీరాలతో ఇంగ్లండు మేధస్సుతో తమ అధికార విస్తరణకు అనుగుణంగా మార్చబడిన ఆధునికులు, ఉదారవాదులు,లౌకికవాదులను సృష్టించడం, అవసరమైతే మొత్తంగా మతంతో సహా బ్రిటిష్ విధేయులుగా మార్చివేయడం లక్ష్యంగా ఒకవైపు జర్మనుల ద్వారా సిద్ధాంతీకరణలు మరోవైపు మిషన రీల ద్వారా మతాంతీకరణలు కొనసాగించడం. ఇందుకు సన్నద్ధంగా స్వతహాగా లౌకికభావజాలం కలిగిన ప్రజలను న్యూనతకు గురయ్యే విధంగా ఆచారవ్యవహారాలలోని అభ్యంతరాలను లేవనెత్తి బహిరంగంగా తనను తాను వ్యక్తపరచుకోలేని స్థితిని కల్పించడం విరివిగా జరిగింది. బాల్యవివాహాలు,సతీ,కన్యాశుల్కం అట్లా విసృతంగా ప్రచారానికి వచ్చాయి.అప్పటికే విదేశాల్లో విద్యనభ్యసించిన ఆధునికులు కొత్త సమాజాలను ప్రారంభించి వాటిని అధిగమించే ప్రయత్నం చేశారు. ఆది బ్రహ్మ సమాజం, బ్రహ్మసమాజం, ప్రార్థనాసమాజంవంటివి అలా వచ్చినవే. ఇంకా సామాజిక అభ్యున్నతికాంక్షిస్తూ వచ్చిన ఉద్యమాలూ మొదలవుతున్నకాలం.
దయానందుడు జన్మించినకాలానికే 1857 స్వాతంత్ర సంగ్రామానికి డ్రస్ రెహార్సల్ అని పిలవబడ్డ తిరుగుబాటు అప్పటి తూర్పుభారతంలో మొదలైంది.దయానందుడు యువకునిగా ఉన్నప్పుడు ప్రథమస్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యాలు,పర్యవసానాలు గమనించగలిగారు. సమాజం ఒకవైపు బ్రిటిష్ విధేయత మరోవైపు వ్యతిరేకతను ఏకకాలంలో ప్రతిబింబించి సంధిగ్ధంలో ఉంది. ఇన్ని కోణాల్లో సంక్లిష్టమైన సంధర్భంలో మూలశంకర్ అన్న పేరుగల జమీందారీ బ్రాహ్మణుడు తన ఇరవైయొక్క యేట నాటి గౌతమ బుద్దునిలాగా సత్యాన్వేషణకి బయలుదేరి తన జ్ఞానతృష్ణకు తగిన గురువును అన్వేషిస్తూ దయానందగా మారి దేశవ్యాప్తంగా పర్యటించి గ్రహించిన అన్ని మతాలలోని అనాచారాలను,అసంబద్ధాలన ఖండిస్తూ అఖండ మానవాళికి వేదమే మార్గదర్శియని నిర్ధధ్వంధంగా ప్రకటించిన పుస్తకమే సత్యార్ధ ప్రకాశిక.
దయానందుడు సత్యార్ధ ప్రకాశికను 1875లో హిందీలో వెలువరించారు.తదుపరి 1882లో ద్వితీయ ముద్రణచేశారు. ఈరెండు ముద్రణలమధ్య వారే అంగీకరించిన భాషా,వ్యాకరణ వ్యత్యాసాలను సవరిస్తూ మొదట పన్నెండు అధ్యాయాలుగాఉన్న గ్రంథాన్ని పదునాలుగు అధ్యాయాలకు పెంచారు. ఆరేళ్ళ వ్యవధిలో విస్తరించిన వారి భావన గ్రంథపరిధిని పెంచింది. అధ్యాయానికి వారిచ్చిన పేరు సముల్లాసం. మొదటి పది పూర్వార్ధంగా, మిగిలిన నాలుగు ఉత్తరార్థంగా ఇచ్చి పదమూడు, పదునాలుగు సముల్లాసాలను కొత్తగా చేర్చారు. వీరి గ్రంథ రచన అంతా ఉదయపూర్ నవలాఖ మహల్లో జరిగింది. ఇప్పుడది సత్యార్ద ప్రకాష్ న్యాస్ గా ఉంది. ఆనాటి ఉదయ్ పూర్ మహారాజు మహారాణా సజ్జన్ సింగ్ దయానందులపట్ల ఆదరణ చూపి వారికి ఆశ్రయం ఇచ్చారు. నాటికి ఎంతో విమర్శను ఎదుర్కొన్న సత్యార్ద ప్రకాశిక ను తెలుగులో 1906లో మొదటిసారి శ్రీ పండిత ఆదిపూడి సోమనాథ రావు, 1912లో 11 వ సముల్లాసాన్ని శ్రీ పండిత ఆదిపూడి గోపాలరావు , 1932లో 12,13,14 సముల్లాసాలను శ్రీ పండిత ధూళిపేట రాజారత్నమాఛార్యులు, 1940లో పూర్తిగా అనువదించిన శ్రీ పండిత మదన మోహన విధ్యాసాగర్ గారు అనువదించారు.అయితే ఇలా ఒక్కో సముల్లాసం అనువదింపబడడానికి ఆయా సముల్లాసాలలో పేర్కొన్న హేతుబద్ద విశ్లేషణ చాలా సున్నితమైనది కావడమే కారణం. అందునా 19వ శతాబ్దపు తెలుగుభాషా స్వభావం గ్రాంథికం కనుక అనుకున్నంతగా ప్రజాలలోకి వెళ్లలేకపోయింది. మరలా ఈ గ్రంథం తొలి ముద్రణ పొందిన 142 ఏళ్ళకు వాచస్పతి డా. శ్రీ మర్రి కృష్ణారెడ్డిగారి చేత సరళ తెలుగు భాషలోకి రాగా వేద ధర్మ ప్రచార సంస్థ ద్వారా ప్రచురించబడింది.
దయానందులు ఈ గ్రంథంలో భారతీయులను ఉద్దేశించి చూపిన మార్గదర్శనాల్లో ఈశ్వరుడి ఓం కారాది నామాల వ్యాఖ్య , సంతాన శిక్షణ, బ్రహ్మచర్యం, పటన వ్యవస్థ , వివాహం , గృహస్థాశ్రమ వ్యవహారాలు, వాన ప్రస్థం , సన్యాసాశ్రమ విధులు,రాజా ధర్మం , వేదం ,పరమేశ్వర విషయాలు , జగత్తుకు సంబంధించిన ఉత్పత్తి , స్థితి, ప్రళయాలు , విద్య ,అవిద్య, బంధ మోక్షాల వ్యాఖ్యానం, ఆచార అనాచారాలు , భక్ష్య , అభక్ష్యాలు , ఆర్యావర్తంలో మత మతాంతరాల ఖండన మండనలు, చార్వాక , బౌద్ద , జైన మత విషయాలు , క్రైస్తవ మత విషయాలు , మహమ్మదీయుల మత విషయాలు ఈ పద్నాలుగు అధ్యాయాల్లో వివరించబడినాయి.దయానందుల “స్వమంత వ్యామంతవ్య ప్రకాశం”, సర్వతంత్ర సిద్ధాంతంగా అంటే ఏదైతే ఎటువంటి విరోధం లేకుండా త్రి కాలాలాయందు ఆచరించడానికి అనువైనదో, సత్యమైనదాన్ని అంగీకరిస్తూ, అసత్యమైన దాన్ని విడిచి పెడుతూ ఏది సనాతన ధర్మమో దానిని గ్రహించి జీవించమని చెప్తూ యాభై ఒక్క సూత్రాలను వారు అంగీకరించిన సత్యాలుగా ఈ గ్రంథం చివరలో పదునాలుగు అధ్యాయాల తర్వాత వివరించారు. దీనికి వేదాలలో చెప్పిన అంశాలను ప్రమాణీకంగా తీసుకొని సర్వమతాంగీకృత సిద్ధాంతమై భూగోళమంతా వ్యాపించి లోకులు అనాయాసంగా ధర్మార్థ మోక్ష కామాలను సిద్ధింపజేసుకోవాలని ఆశించారు. సత్యములైన అర్థాలను తెలియజేయడానికే ఈ గ్రంథాన్ని రాశానని చెప్పుకున్నారు. సర్వదా సత్యానికి జయం , అసత్యానికి పరాజయం కలుగుతుందన్న ముండకోపనిషద్ వాక్యం మూల స్తంభంగా ఆప్త పురుషులు సదా సత్యం యొక్క అర్థాన్ని పరోపకార నిమిత్తం తటస్థ మనసకులై ప్రకటించాలని చెప్పి అదే విషయాన్ని ఈ గ్రంథంలో రాశారు.
ప్రతి సముల్లాసంలో కొంత విషయం వివరించబడి తదుపరి ప్రశ్నోత్తరాల రూపంలో ఉండడం వల్ల సూటిగా చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పే వీలుగా వివరణలు కొనసాగుతాయి. దయానందులు ఈశ్వరున్ని నమ్ముతారు. కానీ ఈశ్వరునికి చెందిన ప్రయాణంలో అడ్డుగా ఉన్న అసంబద్ద వ్యవహారాలను ఖండిస్తారు. వేదం ఒక్కటే ప్రమాణంగా స్వీకరిస్తారు. దయానందులు మొట్టమొదటి సారి ఇల్లు విడిచి సత్యాన్వేషణకు బయలుదేరి ఎంతోమంది గురువుల వద్ద గడిపి అనేక విషయాలు తెలుసకునే క్రమంలో వారికి మథురలో స్వామి విరజానంద అను సంస్కృత వ్యాకరణ విద్వాంసుడు గురువుగా లభిస్తారు. దయానందుడు అప్పటికి పొందిన భాషా పరిజ్ఞానం వృధా అని తెలుసుకొని స్వామి విరజానంద పర్యవేక్షణలో మళ్ళా నేర్చుకుంటారు. గురువు గారు అంధుడు, అయినా విద్వాంసుడు. శిష్యునికి వ్యాకరణంతో పాటు భారతీయ సనాతన జ్ఞానాన్ని వెల్లడి చేసి ఋషి ప్రోక్త జ్ఞానాన్ని పరిరక్షించాలని కోరతాడు. ఋషి ప్రోక్త జ్ఞానమే ఆర్ష విద్య. గురువు చేత మార్గ నిర్ధేశం పొందిన దయానందులు దానిని అన్వేషిస్తూ దయానందులు వేదాన్ని అన్నింటికీ మూలంగా గుర్తిస్తారు. వేదం అపురుషేయం , అదిగాక విశ్లేషణలు అందించిన వేదాంతాన్ని అంటే మనుషుల చేత చెప్పబడిన దేనిని అంగీకరించలేదు. వేదాన్ని పక్కకు జరిపి వచ్చిన పురాణాలు, అవతార చరిత్రలు ఇవి ఏవి కూడా సత్యం కాదని మనుషులచేత వ్రాయబడిన కల్పితాలని వాటిని అనుసరించడం సరికాదని అంటారు. ఈశ్వరుడు అందరి యందు ప్రకటింప బడే వాడు అయితే ఎవరో ఒకరిని మట్టుబెట్టడానికి అవతరించవలసిన అవసరం లేదని అంటారు. వీటికి బదులుగా తల్లిదండ్రులను పూజించాలని,గురువులను,సచ్చీలురులను గౌరవిస్తూ మానవత్వంతో మెలగాలని కోరతారు.ఎవరో ఒకరి సూచించిన మార్గాలు కాకుండా ఏది మూలమో దాన్ని పాటించాలని విలువైన జీవితాన్ని అర్థం పర్థంలేని అపరిశుబ్రం అనాచారం హింస అమానవీయతతో నిండిన అలవాట్లతో గుడ్డిగా అనుసరించకూడదని భోధిస్తారు. అది స్వేచ్ఛగా భావాలను ప్రకటించ గలిగె నేటి కాలం కాదు, బ్రిటిష్ ఆధీనంలో న్యూనతతో , పరాయి పాలనలో పీడనను ఎదుర్కొంటున్న కాలం, సామాజికంగా వివిధ వర్గాల మధ్య ఉన్న అంతరాలు అస్తిత్వకోసం తలపడుతున్న కాలం. నాటికి ఇంత బలంగా స్వమతంలోనూ పర మతాల్లోనూ ఊడలు దిగిన సంప్రదాయాలకు వ్యతిరేకమైన అంశాలను ప్రస్తావించడం, స్వేచ్ఛగా ప్రచురించడం అన్ని మతాలకు కంటగింపుగా మారింది. స్త్రీ విద్య, వివాహం,సహపంక్తి భోజనం, కులమతాలను అధిగమిస్తూ మానవత్వంతో జీవించమనడం సాంఘికంగా అంగీకరించబడలేదు. వారణాశి పండిత పరిషద్, క్రైస్తవ మిషనరీలు , ఇస్లాం సంస్థలు అన్నీ దయనందుని పట్ల ఆందోళనకు గురయ్యాయి. కొన్ని సత్యార్ద ప్రకాశికను ప్రాంతాల్లో నిషేదించారు. వేదాలకు మరళండి అనే నినాదం బ్రిటిష్ పాలకులను ముఖ్యంగా మిషనరీలను వణికించింది. దయానందుల ప్రభావంతో ఎంతో అప్పటికే మతం మారిన ఎంతో మంది తిరిగి హిందూ మతంలోకి మారారు. కొత్తగా మార్చబడే వారు ఆలోచనలో పడ్డారు. మిషనరీలు విద్యాలయాలు స్థాపించి అటుపై విద్యార్థులను క్రై స్థవ దీక్షను ఇచ్చే పరిస్థితి నుంచి ప్రత్యక హిందూ విద్యార్థుల సమూహాలు ఏర్పడినాయి. బెంగాల్లోనూ, వారణాశిలోనూ , పంజాబ్‌లోనూ వారికి తిరుగులేని విధంగా ప్రజాభిమానం లభించింది. వారణాశి పండిత పరిషద్ సమావేశాల్లో దయానందుల సిద్ధాంతం పెద్ద చర్చలే జరిగాయి. రామాయణ , భారత భాగవతాల పట్ల దయానందుని అభిప్రాయం తుఫాను అనే చెప్పవచ్చు.
సత్యార్ద పకాశీక తొలిసారి వెలువడిన 1875లోనే బొంబే లో ఆర్యసమాజ్ ను ఏర్పాటుచేసి వేద ప్రచారం చేశారు. అది ప్రజలకు దగ్గరగా వెళ్లడంలో విజయం సాధించింది. తమ స్వాభిమానంతో జీవించే పరిస్థితిని పునరుద్దరిచుకోవాలనే ఆలోచనను వ్యాప్తి చేసింది. స్వతంత్ర ఉద్యమంలో చెప్పుకోదగిన రీతిలో ప్రభావితం చేసింది. దయానందుడు ఆర్య సమాజం స్థాపించే నాటికే 1828 లోనే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం స్థాపించి ఉన్నారు. దయానందుడు ఆశించిన సామాజిక మార్పులు అప్పటికే సూచించారు, అయితే హిందువులను ఆకట్టుకోలేక పోవడానికి కారణం అది భారతీయుల మూలాలని గుర్తించకపోగా క్రైస్థావ ఆచారాలను, ప్రార్థనలను ప్రతీ సమావేశంలో చేర్చడమేకాక స్వీయ మత సంస్కరణలకన్నా వ్యతిరేకతనే ప్రకటించింది. అందువల్ల బెంగాల్‌తో సహా మిగిలినచోట్లలోనూ ప్రజలను క్రైస్థావ మతఅనునాయులుగా మార్చడానికి భూమికగా మార్చడం తప్ప బ్రహ్మ సమాజం ఏమీ చేయలేదనే అపవాదు మూటగట్టుకుంది. ఆర్య సమాజం స్థాపించబడినప్పుడు కూడా అప్పటికే హిందూ సమాజంలొ అనేక పంథాలో ఇదీ ఒకటిగా మిగిలిపోతుందని హిందూ ఆరాధ్య దేవీ దేవతల పట్ల వెలుబుచ్చిన అభిప్రాయాలు ప్రజలను సంధిగ్దంలో ఉంచుతాయని , బ్రహ్మ సమాజం ఏ విధంగా దాని అనుచరులను క్రైస్తవంలోకి మరల్చిందో ఇదీ అలాగే జరుగుతుందని సంప్రదాయవాదులు అనుమానించారు. అయితే అప్పటికే వివిధ కారణాలతో మతం మార్చబడిన వారు ఎంతో బలంగా ఆర్య సమాజ్ ద్వారా తిరిగి సులువుగా స్వమతంలోకి రావడం బ్రహ్మ సమాజానికి భిన్నంగా ఆర్య సమాజాన్ని నిలబెట్టింది. ఇది దయానందుల శుద్ధి ఉద్యమంగా విస్తృత ప్రచారం పొందింది. దేశవ్యాప్తంగా కుల మతాలను అధిగమించి ఆర్యసమాజ శాఖలు నెలకొలపబడినాయి. స్వాభిమానంతో బతకడం పట్ల ఉన్ముఖులయ్యాయి.
వర్ణాశ్రమ ధర్మాల పట్ల బ్రహ్మాణ ఆధిపత్యం పట్ల కూడా దయానందులు పురుష సూక్తంలోని శ్లోకాల వ్యాఖ్యానాన్ని పునర్ నిర్వచిస్తారు.పురుష సూక్తంలో(12 -13 శ్లోకాలు) చెప్పినట్లు బ్రాహ్మణులు విశ్వపురుషుని ముఖం నుంచి రాలేదని , శ్లోకాల వ్యాఖ్యానంలోని తప్పుల వల్ల అటువంటిభావన కలిగిందని, పరమాత్మకు రూపమే లేదని భావించే మతంలో ముఖ్ం నుంచి బ్రాహ్మణులు , పాదాలనుంచి శూద్రులు వెలువడడం ఉండదని, అది సమాజ రూపానికి బ్రాహ్మణులు ముఖ్యం వంటి వారనే అర్థం అని వివరిస్తారు. తదనంతర కాలంలో అంబేద్కర్ కోరిన మతమార్పులన్నీ దయానందులు అప్పటికే సూచించారు. అయితే అంబేద్కర్‌కు తన అభిప్రాయలు తనకు ఉన్నాయి.హిందువులకు ఒక్క ప్రామాణిక పుస్తకం అంటూ ఉండాలని భావించిన అంబేద్కర్ దయానందుల వేద ప్రమాణికాన్ని స్వీకరించలేదు.ఇంతటి హేతువాద దృక్పథాన్ని హర్షించలేకపోవడానికి అంబేడ్కర్ వ్యక్తిగత అభిప్రాయాలు కారణం కావచ్చు. అంబేద్కర్ నాస్తికుడుగా లేడు. బౌద్దం స్వీకరించాడు. దయానందులూ నాస్తికులు కారు, అయితే కనిపించే సత్యం అంగీకరించాలని, అనాచార వ్యవహార సంకెళ్లను తెంచి మానవత్వంతో మెలిగి పరమాత్మను పొందాలని సూచించారు.
నూటయాభైయేళ్ళ క్రితం ఇంత బలంగా సామాజిక సంస్కరణవాదం ప్రతిపాదించబడ్డం దానికి విస్తృత ప్రజామోదం లభించడం సాధారణ విషయం కాదు. అది వారి మీద విషప్రయోగం చేత హతమార్చాలనే స్థితికి వెళ్ళింది. వారి యోగ విద్య తో పలుమార్లు మృత్యువునుంచి తప్పించుకోగలిగినా చివరికి విషప్రయోగం ద్వారానే మరణించారు. విషం వల్ల శరీరం అంతా పుండ్లు పడి యే వైద్యానికి లొంగక తీవ్ర శరీర వేదనకు గురయ్యారు. తనకు విషమిచ్చిన వంటవాడిని తప్పుఒప్పుకున్న కారణానికి క్షమించి డబ్బిచ్చి నేపాల్ పంపించి వేశారు.దయానందులు తన 59 వ ఏట1883 లో అజమీర్లో మరనించే నాటికి వేద ఋగ్వేద భాష్యం పూర్తయ్యే దశలో ఉంది. మిగిలిన అన్నీ వేదాలకూ విఖ్యానం రచించాలని లక్ష్యం పెట్టుకున్నా అది వారి మరణంతో అర్థాంతరంగా ముగిసింది. దయానందుని జీవితం సత్యాన్ని వెతుకుతూ మొదలై వేదం వద్ద నిలిచిపోయింది. ఇది 16 వ శతాబ్దపు జర్మనీకి చెందిన క్రైస్థావ మత సంస్కార్త మార్టిన్ లూథర్ తో పోల్చబడింది. మార్టిన్ కూడా భగవంతునికి భిన్నంగా చర్చి వ్యవహారాల పట్ల నిరసన చూపియి ప్రొటెస్టెంట్ వర్గాల సంస్కరణకు పూనుకున్నారు. ఆనాటి కాలానికి వారిదీ సాహసమే. వీరి సంస్కరణవాదాల సాహసాలస్వామ్యాన్ని పోల్చి దయానందులను ఇండియన్ మార్టిన్ లూథర్ అని అన్నారు. ఏదేమైనా దయానందుల సత్యార్ద ప్రకాశిక గత నూటయాభై ఏళ్లుగా తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో నాలుగవ భాషగా ఉన్న తెలుగులో పూర్తి అనువాదం చేయడానికి , సరళీకరణ చేయడానికి వందేళ్లకు పైగా సమయం తీసుకుంటే మన ఆధునిక భారతంలో హిందూ మత సంస్కరణలకు తావిచ్చిన దయా నందుల నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని సునిశితంగా పరిశీలించి ఇతర సంస్క్రణవాదాలతో సరిపోల్చి గొప్ప విశ్లేషణ చేసిన వారిలో విదేశీయులలో జె. టి .ఎఫ్ జోర్డెన్స్ ముందుంటారు. వీరు మొట్ట మొదటి సారి ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ మెల్బోర్న్ విశ్వ విద్యాలయంలో 1961లోనే భారతీయ అధ్యయన శాఖను ఏర్పరచి అనేక అంతర్జాతీయ వేదికల మీద మన దేశంలో వచ్చిన సంస్కరణ వాదాలమీద ప్రసంగించారు.1978 లోనే దయానంద సరస్వతి : హిస్ లైఫ్ అండ్ ఐడియాస్ అనే వ్యాస సంపుటిని వెలువరించారు. ఆర్య సమాజ్ వారసత్వాన్ని గాంధీ , అంబేద్కర్ ల సంస్కరణలతో పోల్చి వ్రాసిన వ్యాసాలు మన దేశ ప్రజల సంస్కరణ అభిలాషను అనుసరణను తెలియజేస్తాయి. వాటి లోతుని బహిర్గతం చేస్తాయి. శీలా బాలాజీ రాసిన స్వామి దయానంద సరస్వతి కాంట్రిబ్యూషన్స్ అండ్ రైటింగ్స్ వంటి కొన్ని తప్ప తెలుగులో వచ్చిన పుస్తకాలు లేవు. తెలుగు గడ్డ మీద ఆర్యసమాజ్ సాధించిన విజయాల మీద, దయనందుని మీద రావాల్సినంత విమర్షనో , సమర్థనలో, విశ్లేషణలో రాలేదు. విదేశీయులు విశ్లేషించిన రీతి ప్రామాణిక వ్యాసాలు రాలేదు. కారణాలు ఏవైనా వారి సిద్ధాంతం ఎటువంటిదైనా మనల్ని మనం మానవత్వం దిశగా మరాల్చుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ సంస్కరణలకు సిద్ధంగా ఉండాలి , దానిని ఏ ఒత్తిడీ లేకుండా చర్చించగలగాలి. ఏది విస్తృత మానవ ప్రయోజనాన్ని ఇవ్వగలదో దానిని ప్రోత్సహించాలి. ఆ పరిస్థితి మన సనాతన భారతీయ సంప్రదాయంలో ముందునుంచీ ఉంది. దయానందులు మనముందు వారి గ్రంథం ద్వారా మన ఆచరణను, హేతువాద దృక్పథంతో నిర్వచించుకునే స్వేచ్ఛను మనకే వదిలి వెళ్లారు. మతాలకు భిన్నంగా ప్రతీ మానవుడు చదవవలసిన గ్రంథంగా అందులో పేర్కొన్న అంశాలు మన ఆచారణలకు తప్పక మార్గదర్శకాలవుతాయని అన్ని మతాలకు సూచించడం ఈ గ్రంథం గొప్పదనం. మానవత్వం తప్ప మరొకటి లేదని , భక్తి విశ్వాసాలు హింసకు కారణం కాకూడదని భోదంచే ఈ గ్రంథం గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవలసి ఉంది.
1 comment
భారతీయ తాత్విక చింతనామృతం గొప్పతనం వర్ణించలేము. వైవిధ్యం ఉంది కానీ వైరుధ్యం కనపడదు. సమన్వయం, సహ జీవన భావాలే ఇక్కడి మట్టిలో ఉంది. అర్థం కాని సెమిటిక్ విదేశీ మతాలు ఇక్కడ సంఘర్షణ నీ ప్రారంభించాయి. సమాధానం భారతీయ తత్వ సనాతన ధర్మ ప్రబోధం మాత్రమే. ఆ ఋషి పరంపరలో నిల్చిన వారే స్వామి దయానంద.