Home వ్యాసాలు సమాజదర్పణం భీమేశ్వరపురాణం

సమాజదర్పణం భీమేశ్వరపురాణం

తెలుగు వారి విస్తార చరిత్రలో రెడ్డిరాజుల యుగం (1324-1402  ) ఒకమహోజ్జ్వలఘట్టం. గీర్వాణాంధ్ర భాషా సారస్వతాలకు సువర్ణాధ్యాయం.  రాజులు, మంత్రులు స్వయంగా రసజ్ఞలైన కవి పండితులు కావడం; కృతికర్తలు. కృతిభర్తలు కావడం ఈ యుగవిశేషం. ప్రోలయవేమారెడ్డి(1324-53), అనపోతారెడ్డి(1353-64) అనవేమారెడ్డి (1364-1386)  కుమారగిరి రెడ్డి (1386-1402) లాంటి రెడ్డిరాజులు  షట్కాల శివపూజా పరాయణులై, దేవాలయ నిర్మాతలై, దాననిరతులై, ఉదారచింతనాపరులై విలసిల్లారు. ఆనాటి రాజులు మెచ్చిరా- రత్నాంబరాలు, కస్తూరిదానాలు, భూరి దినవెచ్చాలు, హేమపాత్రాన్న పంక్తి భోజనాలు… మెచ్చక పోయిరా- నిగళయుగళ సత్కారాలు, పురవీధి పొగడదండ పరిష్వంగాలు, వెదురు గొడియలతో వియ్యాలు, నగరి వాకిట నుండు నల్లగుండుకు  భూజాస్తంభ గౌరవాలు… ఈ యుగ సాహిత్య నాయకుడు శ్రీనాథకవిసార్వభౌముడు. అశేష మనీషిహృదయంగమంగ కావ్య సృజనం చేసిన ధీశాలి. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు. ఉరుప్రజ్ఞా విశేషోదయడు. సాహిత్య పదవీ మహారాజ్య భద్రాసనాసీనుడు(1-7). సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్యభాషాపరిజ్ఞానం. మహాభాష్య విద్యా సమభ్యాసబలం, శ్రుతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంతకబళన వ్యుత్పత్తి గౌరవం, పూర్వ కవి ముఖ్యవిరచితాపూర్వ కావ్య భావరస సుధా చర్వణ విస్తారంగా గలిగిన వాడు శ్రీనాథకవీంద్రుడు.

శ్రీనాథ కవిసార్వభౌముడు ప్రౌఢనిర్భర వయః పరిపాకాన భీమేశ్వరపురాణాన్ని రచించాడు. మూలం స్కాంద పురాణాంతర్గతమని శ్రీనాథుడే స్వయంగా చెప్పినా అది అవిశ్వసనీయం.

దక్షారామ భీమేశ్వర సంకీర్తనను సభక్తికంగా సాగిస్తూనే స్థానిక కథా విశేషాలను, సాంఘిక సామాజిక స్థితిగతులను తనివితీరా వర్ణించాడు. శ్రీనాథుని సమకాలీన సమాజస్వరూపాన్ని మిగిలిన కృతులకన్నా భీమేశ్వర పురాణమే అత్యధికంగా ప్రతిఫలించిం దన్న అతిశయోక్తి కాదు.

జీవన స్థాయి, భోజనప్రీతి, మర్యాదలు లాంటి భౌతికాంశాలు, విశ్వాసాలు, ఆచారవ్యవహారాలు. అర్చనాది  ఆధ్యాత్మికవిశేషాలు, అసూయలు, కోపతాపాలు మొదలైన మానసికాంశాలు  భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు ఔచితీమంతంగా నిక్షిప్తం చేశాడు. భీమేశ్వరపురాణం మొదటి సగంలో వున్న బిగి తరువాతి సగంలో చెడింది. సంకీర్తనకే పరిమితమై ఉదాత్త కావ్యనిర్మాణశోభాకరాలైన ఇతరేతరాంశాలను పక్కకు పెట్టాడనిపించింది. పునరుక్తులు పరిహరిస్తే సగానికి సగం కావ్యం తగ్గుతుంది. ప్రాచీనకావ్యాలలో సాంఘికాంశాలను అన్వేషించడం అనేది స్వాగతించదగిన ఉదాత్తయత్నమే. ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి చదువుతూ సాగించవలసిన సత్కాలక్షేపం.  

మానసికఅంశాలు

          బోద్ధారో మత్సరగ్రస్తాః. అసూయాగ్రస్తమైన మనస్సులకు, అపండితులకు కాల నియతి ఉండదు. పండితులకు పండితమ్మన్యులకు; కవులకు కవిబ్రువులకు నిత్యఘర్షణ ఎప్పుడు ఉండేదే. శ్రీనాథుని కాలం దీనికి మినహాయింపు కాదు. ఆంధ్రనైషధాజ్జ భవుని కీర్తి ధాళధళ్యం ముందు ఎందరో కవుల కనులు మూతబడివుండడం సామాన్యాంశం.

బోధ మల్పంబు గర్వమభ్యున్నతంబు,

శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము

కూప మండూకములుఁ బోలెఁ  గొంచె మెఱిఁగి,

పండితమ్మన్యులైన వైతండికులకు                             1-13

నికటమున నుండి శ్రుతిపుట నిష్ఠురముగ,

నడరి కాకులు బిట్టు పె ద్దఱచినప్పు

డుదధిరాయంచ యూరక యుంటలెన్స,

 సైఁపరాకున్న నెందేనిఁ జనుట యొప్పు.                     1-14

అని శ్రీనాథుడు విసిగి వేసారిపోయాడు.   గౌడడిండిమ భట్టు లాంటి మహావిద్వాంసునితో మొదలుకొని ఏస్థాయి, ఏ అర్హత లేని వాచాలుర దాక ఎదుర్కోవలసి వచ్చి వుంటుంది. తన జయకేతనాన్ని స్థిరంగా ఎగర వేసి ప్రౌఢ నిర్భర వయః పరిపాకంలోకి వచ్చాక కూడా మళ్ళీ మళ్ళీ అవే కాకులు ఊరకే అరుస్తుంటే రాజహంస మౌనంగా ఉండడమే మంచిది. లేక వివాదాలు నుండి తప్పుకోవడమే ఔచిత్యమన్న ధోరణికి రాక తప్పలేదు. మునపటిలా వాదించే ఓపిక కానీ, అవసరం కానీ ఆయనకు లేవు. శ్రీనాథుని లాంటి పండిత కవులు ఒకరిద్దరయితే  కూపస్థ మండూకాల్లాంటి పండితమ్మన్యులు ప్రతి కాలంలోను అగణితమే.

తాము నివసించే ప్రాంతం, లేదా తాము విశ్వసించే దైవం అన్నింటి కన్నా గొప్పదని తలపోయడం సర్వ సామాన్యాంశం.  దక్షారామం కథాకేంద్రం కనుక  గొప్పదని శ్రీనాథుడు చెప్పారు. అన్ని తీర్థాల కన్నా కాశి గొప్పది. ఇది భారతీయులందరి సాధారణ విశ్వాసం. కాశి కన్న దక్షవాటి గొప్పది (2-8). కాశి కేవలం మోక్షదాయిని. కొన్ని నగరాలు భోగదాయినులు. మరికొన్ని మోక్షదాయినులు కాని దక్షారామం భోగమోక్షాలు రెండూ ప్రసాదిస్తుంది.(2-17). భీమేశ్వరుని కన్న పెద్ద వేల్పు, దక్ష వాటి కన్న గొప్ప ప్రాంతం,  సప్తగోదావరి కన్న తీర్థరాజం మరొకటి లేదు. (2-18) ఏటేట జాతరలు చేయడం (3-44), జపహోమదాన యజ్ఞము లుపవాస వ్రతాలు మోక్షదాయకాలు (3-12, 3-148) శ్రాద్ధతిల తర్పణాదులు (3-154 ) విధాయకాలుగా తలపోయడం కనిపిస్తుంది.

ఏమి శకునమున చొచ్చితిమో కాశికి (2-95) అని అనడం వల్ల శకునాలను నమ్మడం కూడ ఆ సమాజంలో వుందని తెలుస్తుంది. భారతీయ సమాజంలో ఇది సామాన్యాంశమే. ఏ పని చేసినా శుభముహర్తం చూసుకోవడం కాలశుద్ధి తెలుసుకోవడం అలవాటు. వ్యాసుడు అగస్త్యుడు దక్షారామానికి తిరిగి పోతున్నపుడు నగర ప్రవేశానికి శుభముహూర్తం (3-39) (3-56) చూశారు. ఏ ముహూర్తం సరిగా కుదరని పక్షంలో అభిజిన్ముహూర్తం మధ్యాహ్నం 11.45 నుండి 12.30 వరకు నిస్సంకోచంగా చేయవచ్చు. అది విజయముహూర్తం అన్న విశ్వాసం నాటికీ నేటికీ ప్రబలంగానే ఉంది.

అబద్ధాలాడే వాళ్ళ కళ్ళల్లో, ముఖంలో ఒక విధమైన సూచన కనిపిస్తుంది. దాన్ని పసిగట్టిన వారికి వారు అబద్ధలాడుతున్నారని తెలిసిపోతుంది మరి. చల్లని సౌమ్యదృష్టి, ప్రసాదము, మాధురియు, వివేకం, వెల్లదనం, మౌగ్థ్యం, నిర్మలినత్వం అబద్ధమాడే వాళ్ళల్లో ఉండక సత్యంపలికేవారిలో ఉంటుందని శ్రీనాథుడు రాశాడు. (2-134)

కార్తికీవేళభీమశంకరని నగరఁ

దూఱునెవ్వాడు చిచ్చఱతోరణంబు

వాడు దూఱడు ప్రాణనిర్యాణవేళ

ఘోరయమపట్టణద్వారతోరణంబు  3-25

దక్షారామ భీమేశ్వరునికి కార్తీక పౌర్ణమి నాడు రాత్రి జ్వాలాతోరణం ఏర్పరుస్తారట.  దాని గుండా దూరి పోతే భక్తుడు యమలోకంలోకి పోడు.  అంటే పుణ్యం వస్తుందని విశ్వాసం. దీన్ని శ్రీనాథుడు కాశీఖండంలో కూడ ప్రస్తావించాడు. తారకాసురుడు రెల్లుగడ్డిలో కుమారస్వామి జన్మించాడని చెప్పి రెల్లుగడ్డి నంతా కాల్పించాడట. ఆ కథకు ప్రతీకగా వచ్చిన ఆచార మిది అని అంటారు.

ఆకలి గొన్న వ్యాసుని, అతని శిష్యులు మూడువందలమందినీ కాశీ అన్నపూర్ణ ఆహ్వానించి చతుశ్శాలా భోజన మందిరంబున వృద్ధానుపూర్వకముగా ఉచితాసనంబుల కూర్చుండ నియమించినదట. (2-127). ఉచితాసనాలనగా తగిన పీటలు. పీటల మీద కూర్చొని, ఆపోసన చేసి, శాంతి మాత్రం చదివాక భోజనం చేయడం ఆచారం. చాల మంది కలిసి భోజనం చేసే అప్పుడు వారి వయస్సుల క్రమంగా కూర్చునే తినడం  ఆనాటి సాంఘిక ఆచారం తెలుస్తుంది.

అతిథి అభ్యాగతులకు   భక్తి శ్రద్ధా తాత్పర్య విశ్వాస పూర్వకంగా భోజనం పెట్టినపుడే అది ఫలితాన్నిస్తుంది (2-132). – అని ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా భావించడం గమనించవచ్చు.

తిట్లు , సామెతలు, ఎప్పుడూ వుంటాయి. కాని ఛందస్సు కనుగుణంగా కొంత మారవచ్చు. సభ్యత వల్ల రూపాంతరం చెందివుండవచ్చు.

ముండదైవం (3-6). కాశిని ఎడబాసిన వ్యాసుడు తన మనోవ్యథను అగస్త్యున కెరుక పరచు సందర్భంలో మనస్సును తేలిక పరచుకోవడానికి అన్నమాట. ఆకలికి తట్టుకోలేక వ్యాసుడు  కాశిని శపించబూనాడు.

మా భూ త్త్రైపూరుషీ విద్యా,   మా భూ త్త్రైపూరుషం ధనం,

మా భూ త్త్రైపూరుషీ భక్తిః,     కాశ్యాం నివసతాం సదా 2-108

కాశీనగరంలో మూడుతరాలపాటు విద్య, ధనం, భక్తి ఉండొద్దుగాక అని- అంటే మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధులకు ఇది గొడ్డలిపెట్టేకాక తరువాతి తరాలు కూడదీని ప్రభావానికి లోనవుతాయి.  అలా కాశిని శపించ బూనుకున్న వ్యాసుని కాశీ విశ్వేశ్వరుడు తీవ్రంగా దూషిస్తాడు.

ఓరి దురాత్మ! నీవారముష్టింపచా

భాస! యోజనగంధి ప్రథమపుత్ర!

దేవరన్యాయదుర్భావనాపరతంత్ర!

                        బహుసంహితావృథా పాఠపఠన!

భారతగ్రంథ గుంభన పండితంమన్య!

                        నీవా మదీయపత్నికి నశేష

కైవల్య కళ్యాణ ఘంటాపథమునకుఁ

గాశికాపురికి ని ష్కారణంబ

శాపమిచ్చెదనని యనాచారసరణి

నడుగు వెట్టినవాడవహంకరించి

పొమ్ము నిర్భాగ్య ! మాయూరి పొలము విడిచి

యెచటికేన్ శిష్యులును నీవు నీక్షణంబ                      2-153

ఓ దుష్టుడా!  సామాన్య గృహస్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కేవలం పిడికిట్లో పట్టేడన్ని బియ్యం దాన మివ్వడం సంప్రదాయమైంది. అది గొప్ప. కానీ గతిలేక ముష్టి అడుక్కుంటున్న వాడా అని ఇక్కడ  తిట్టు. యోజనగంథి ప్రథమ పుత్ర అనడంలోని ఆంతర్యం సామాజిక సంప్రదాయం తెలియనివాని కర్థం కాదు. సత్యవతికి పెళ్ళి కాకముందే పుట్టిన వాడా అని తిట్టడం. మరి పుట్టిన వాడిది తప్పా పుట్టించిన వారిది తప్పా అని చర్చించడం అప్రస్తతం. పెళ్ళి కాకుండా తల్లి కావడం నిషిద్ధమైన సమాజంలోనే ఇది తిట్టు కాగలదు. లేని చోట కాదు. వ్యాసుడు వరుసకు మరదళ్ళైన, భర్తృహీనలైన అంబిక అంబాలికలకు సంతానాన్ని కంటాడు. ఇది అక్కడ విధి లేని పరిస్థితి కావచ్చు.  కాని ఇక్కడ మాత్రం దూషణ. వ్యాసుడు ఏడురోజులు తిండికి ఓర్వలేక నగరాన్ని శపించబూనుకున్నాడు. అలాంటి వ్యాసుని వేద పురాణవిజ్ఞానం అంతా వృథానే కదా. భారతం లాంటి పంచమవేదాన్ని సృష్టించిన పండితుడయ్యు కాశికి శాపం ఇవ్వపూనుకొని పండితమ్మన్యుడయ్యాడు.  పండితంమన్యుడు అంటే తననుతాను పండితుడనుకొనేవాడు. నిజానికి కాడని భావం. చదువు కొన్న మూర్ఖుడయ్యాడు. నిర్భాగ్యనీచ చరిత్ర లాంటి వన్ని తిట్లు.  కాశినుండి వెళ్ళిపోకపోతే వ్యాసుని రాతిమీద రాకిస్తానన్నాడు శివుడు. రాతిమీద రాకించడం ఆ కాలంలో  శిక్షించే ఒక పద్ధతి కావచ్చు.   శ్రీనాథుడు వీరశైవుడు కూడ. వైదికుడైన వ్యాసుని తిట్టడానికి అందివచ్చిన సందర్భాన్ని చక్కగా వినియోగించుకున్నాడు.   

రాచమర్యాదలు

కృతిస్వీకర్త బెండపూడన్నయ మంత్రి కీర్తి ఏడుసంధ్రాల అవతలి చీకటిని పోగొట్టిందనడం, ఆయన కీర్తి కర్ణాట లాట వంగ కుంతల అవంతి ఘర్జర రాజుల సభాస్థానాల్లోని బుధులు కీర్తిస్తారనడం లాంటి వాటిని అతిశయోక్తులని చిన్న చూపు చూడకుండా సాహిత్య సంప్రదాయమని మిన్నకుండడం సముచితం. అలాంటి మంత్రి గారి పేరోలగంలో ఉద్దండ పండితులు, వ్యాకర్తలు, వేదాంతులు, ఉపనిషత్ తత్వ్తజ్ఞులు, లాక్షణికులు, సంస్కృతాంధ్ర కవులు వీరితో పాటు వేశ్యలు, వీరభటులు  ఉండే వారు. ఇది సమకాలీన మర్యాద. కవులను సన్మానించడం, కావ్యం రాయించి అంకితం తీసుకోవడం పాలకుల కర్తవ్యాలలో ఒకటిగా తలపోసేవారు.

బెండపూడన్న మంత్రి కీర్తికారకాలైన సప్తసంతానాలలో “ఒక్క ప్రబంధస్వీకరణం తప్ప అన్నీ నాకు లభించాయి” ఆ ఒక్క వెలితి తీర్చలసిందని శ్రీనాథుని అర్థించి భీమేశ్వరపురాణరచనకు పురికొల్పాడు. ఇది అబద్ధంగానో, కవిత్వమనో భావించాల్సిన పని లేదు. రాచరిక వ్యవస్థలో రాజులు మంత్రులు అందరూ చేసేదే. సప్తసంతానాలంటే ఇవి.

  1. కూపం – మంచినీళ్ళ బావులు తవ్వించి దాహం తీర్చాలి.
  2. తటాకం – చెరువులు నిర్మించి పంటలకు దోహదం చేయాలి.
  3. ఉద్యానవనాలు – తోటలు నిర్మించి ఆహ్లాదకరవాతావరణానికి ఏర్పరచాలి.
  4. దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మిక చింతనను  పెంచాలి.
  5. పుత్రులను కని వంశాన్ని నిలబెట్టాలి.
  6. ధర్మబద్ధంగా జీవించాలి..
  7.  కవులను ప్రోత్సహించి కావ్యాలు రచింపచేయాలి.

సప్త సంతానములలోన భిలము గాకుండు నది ధాత్రి కృతియె గాన అని అల్లసాని పెద్దన అన్నాడు.

గుడి కూలును, నుయి పూడును

వడి నీళ్ళను చెరువు తెగును, వనమును ఖిలమౌ

చెడనిది పద్యం బొకటియె

కుడి యెడమల కీర్తిగన్న గువ్వల చెన్నా.

అని గువ్వల చెన్నడు అన్నట్లే మిగిలిన ఆరింటి కన్నా కావ్యాన్ని అంకితం తీసుకోవడం శాశ్వత కీర్తికారకమని ప్రాచీనులు భావించారు. అలానే వ్యవహరించారు.   రాజరాజనరేంద్రుడు ఈ రోజు చిరస్మరణీయుడయ్యాడంటే ఆయన పాలనవైభవం వల్ల కాక కేవలం నన్నయ చేత భారతం రాయించడం వల్లనే అన్నది నిర్వివాదాంశం. బెండపూడన్నయ మంత్రి కూడా అంతే. దక్షారామంలో భీమేశ్వరునకు మొగలివాకిటధామం, తూర్పు దిక్కున మరొక మంటపం  నిర్మించాడు (1-74). బహుశా ఆ సందర్బంలో ఓ వారం పదిరోజులు ఇదే విషయంపై పురాణ కాలక్షేపం జరిపి వుంటారు. ఆ ప్రేరణతో  కనీసం వచ్చే సంవత్సరం వార్షికోత్సవాల (బ్రహ్మోత్సవాల) నాటికి దక్షారామ భీమేశ్వరునీ, సప్తగోదావరి తీర్థాలను కీర్తిస్తూ కావ్యరచన చేయవలసిందని  సబహుమానంబుగా కర్పూరతాంబూల జాంబూనద ఆభరణాలతో ఘనంగా సత్కరించి  అర్థించి వుంటాడు. భీమేశ్వరపురాణంలో వున్నవి రెండే పాత్రలు.  వక్త, శ్రోత. వక్తవ్యాంశం భీమేశ్వరసంకీర్తనం. ఇది కృతికర్త, కృతిభర్తలకు అభీష్టాంశం. కాశికన్నా గొప్పది దక్షవాటి అని అనుకోవడంలో, స్వస్థాన వేషభాషాభివ్యక్తీకరణంలో  ఒక నిర్వచనీయమైన ఆనందం దాగుండడం సహజం.  వింధ్యగర్వాన్ని అణచడంకోసం ఉత్తరాదినుండి వచ్చి దక్షిణాదిలో స్థిరపడ్డ అగస్త్యమహర్షి నివాసమే దక్షారామంగా చిత్రించాడు. కాశీపట్టణ మెంత గొప్పదైనా, ప్రీతి పాత్రమైనదైనా అగస్త్యుడు ఉత్తరాదికి పోలేని దుస్థితి.

దురదృష్టం వల్ల వ్యాసమహర్షి కాశీనుండి బహిష్కృతుడై కొత్తగా తనకు అంతగా తెలియని దక్షారామానికి రావలసి వచ్చినవాడు. 

వ్యాసాగస్త్యు లిరువురికీ కాశీకి విశ్వనాథుని సేవించలేమన్న ఆవేదన సమానధర్మం. అందువల్లనే దక్షారామప్రాశస్త్యాన్ని తెలిపే వక్తగా అగస్త్యుని , విని ఊరడిల్లే శ్రోతగా వ్యాసుని పాత్రలుగా శ్రీనాథుడు మలచడంలోని హేతువు ఈ సమానధర్మమే. నిజానికి ఇక్కడ వ్యాస అగస్త్యులు నిమిత్తమాత్రులే. శ్రీనాథుడే అసలు వక్త. అసలు శ్రోత బెండపూడన్నయమంత్రి. అంతే.   

   ప్రజానీకం

పద్మనాయకులు, వెలమలు, కమ్మలు, సరిసర్లు, పంటర్లు(1-32) ను మొదటిసారిగా కావ్యంలో నమోదు చేసిన ఘనత శ్రీనాథునిదేనేమో! పరిశీలించాలి.  బ్రాహ్మణులు, క్షత్రియులు, చతుర్థకులాలు, పంచజనులు, వైశ్యులు, వేశ్యలు,(3-63)  ఇంకా ఏకవింశతి కులాలవారు(3-153) ఆకాలంలో వున్నట్లు తెలుస్తుంది.   వర్ణసాంకర్యం లేకుండా చాతుర్వర్ణ్యస్థితి వుందని చెప్పడం గొప్పగా తలపోసేవారు. (1-110)  ఆనాటి వారికి బ్రాహ్మణ భక్తి మిక్కుటం. సాధారణంగా వేదపఠనం చేసే విప్రులు పేదలే. బెండపూడి అన్నయ మంత్రి లాంటి ఉన్నతాధికారుల ప్రాపు లభించిన వైదికులు ఉన్నత స్థాయి కెదుగుతారు. తక్కినవారు సాధారణులు గానే మిగిలి పోతారు.

   ధరియింప నేర్చిరి దర్భ పెట్టెడు వ్రేళ్ళ

            లీల మాణిక్యాంగుళీయకములు

    కల్సింపనేర్చిరి గంగమట్టియ మీఁదఁ

            గస్తూరికా పుండ్రకములు నొసలు.

    సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోలఁ

            దారహారములు ముత్యాల సరులు

   చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల

            గమ్మని క్రొత్త చెంగల్వ విరులు

ధామముల వెండియును బైఁడి దడఁబడంగ

బ్రాహ్మణోత్తము లగ్రహారములలోన

వేమ భూపాలుడనుజన్ము వీరభద్రు

ధాత్రి యేలింప గౌతమీతటమునందు.            1-41

కాశీఖండంలో సైతం శ్రీనాథుడు ఈ పద్యాన్ని ప్రీతితో వాడుకొన్నాడు.   విప్రుడు గాన నేరము వెదక దగదు అనుకోవడం(2-118). కనిపిస్తుంది. ప్రతి నెల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం సాధారణాచారం. వైకుంఠ ఏకాదశి నాడు మరీ ముఖ్యం. ద్వాదశి నాడు పారణచేసి భోజనం చేయడం విధాయకం. అందువల్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులకు సంతర్పణలు చేయడం పుణ్యకార్యంగా తలపోసేవారు, అది ఆ కాలంలో ఆచారంగా మారింది కూడా. ), అశ్వగోమహిషరూప్య సువర్ణ వస్త్రంబులు దానం చేయుట (4-32) పుణ్యమనుకొన్నారు.

భోజన రసికత

ఆనాటి వారి భోజన రసికతను శ్రీనాథుడు తనవితీరా వర్ణించాడు.  ఆనాటివారు తిన్నది అరిగించుకోగలగిన వారు. అది తింటే షుగర్ వస్తుంది ఇది తింటే ఇంకేదో వస్తుంది అని నాలుక చంపుకొని జీవించిన వారు కాదు. పంచభక్ష్యపరమాన్నాలను నిండార తిని పరవశించారు. త్రేంచారు. భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పేయం- ఇవి పంచభక్ష్యాలు. దోసెలు, వడలు, సేమ్యాపాయసం, కమ్మగా కాచిన నెయ్యి, శాకం, పాకం, పెసరుపప్పు, తేనె, పానకం, ఉప్పు, తెల్లని పెరుగు, పచ్చకప్పురం, సొజ్జెపిండి, పిండివంటలు, బెల్లం, ద్రాక్షాపానం ఖండశర్కర, అరటి పండ్లు. ఆవుపాలు, వరి అన్నం మొదలగు వాటిని నిశ్శంకతో అంటే ఎలాంటి సంశయం లేకుండా కుక్షుల్ నిండగ ఆరగించారు. అన్నీ అయ్యాక మందార తరుపుష్ప మధుపానగోష్టి (2-28) కొందరికైనా ఉండకపోతే ఎలా?

                పప్పును, బిండి వంటలును, బాయసముల్, ఘృతముల్, గుడంబులుం

                  గుప్పలు గాఁగఁ జుట్టునను గుర్పఁగఁ గూడిన యేరుఁబ్రాల తె

                  ల్గప్పురభోగి వంటకము గమ్మని తాలిపు సొజ్జ పిండితో       

                  నొప్పులుగా భుజించిరి బుధోత్తము లాఁకటి చిచ్చు పెచ్చునన్. 2-140

      ద్రాక్షపానక ఖండశర్కరలతో, రంభాఫలశ్రేణితో

       గోక్షీరంబుల తోడ, మండెఁగలతో, గ్రొన్నేతితోఁ , బప్పుతో

       నక్షయ్యంబగు నేరుఁబ్రాల కలమాహారంబు నిశ్శంకతం

                   గుక్షుల్ నిండఁగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్.    2-142

మోదకాపూప పాయస ఘృత మధుక్షీర శర్కకాపూపాలతో భోజనం( 4-91)          ఇలా భీమేశ్వరపురాణంలో రెండుమూడు చోట్ల ఆహార ప్రస్తావనలు వస్తాయి. ఆకాలంలో  అవన్నీ అందరూ తినేవేనని గుర్తించవచ్చు.

దేవదాసి సంప్రదాయం

      దక్షారామంలో దేవదాసి సంప్రదాయ ముంది. దేవదాసీలు భగవంతుని కంకితమైన పవిత్రమూర్తులు. భగవంతుని ఎదుట నాట్యం చేసే తరించేవారు. భగవంతునికి చేసే షోడషోపచారపూజల్లో నాట్యం కూడ ఒకటి. విశ్వనాథసత్యనారాయణ వేయిపడగలులో ముఖ్యంగా గిరిక ఘట్టం చదివితే దేవదాసీ సంపంప్రదాయ ఔన్నత్యం తెలిసి వస్తుంది. వారిని పోషించడం పురప్రముఖుల విధి. కాలక్రమంలో వేశ్యల స్థాయికి దిగజారడం వేరే అంశం.  

దక్షపురిసాని కూతుల దవిలి నాడు

విశ్వలోక కుటుంబి భీమేశ్వరుడు – 1-110

అనీ  పదునాల్గు మహాయుగాల ముదుసలి భీమేశ్వరునికి సానితో పెండ్లి (1-112) అని కూడ చమత్కరించాడు.  వికటశృంగారము నొప్పు భీమేశ్వరుడని కూడ(1-80) అన్నారు. ఇలా అనడంలో ఆంతర్యం అక్కడి సంప్రదాయ విశేషమే తప్ప అన్యంకాదు. దక్షారామంలో వెలసిన మాణిక్యాంబ ఒక దేవదాసి అని ఐతిహ్యం.

వస్తసంస్కృతి      

ముత్యాల గొడుగు (2-43), రత్న దర్పణం (2-49) పసిడి కమ్ముల పట్టు పచ్చడం,  తారహారాలు, కల్హారదామాలు, కట్టాణి ముత్యాల కంఠమాల మాణిక్యఖచిత కేయూరము. వజ్రపుటుంగరం, పగడాల ఒడ్డాణం. (1-115 &116) హేమ మణిభూషణాలు. ముత్యాలపేరు (2-52) . గోమేదికం = మణులు, బంగారం, రత్నాలు ( 3-61) రత్నకంకణాలు. ముత్యాల రంగవల్లలు (3-63)  కంకణాలు, అందియలు, మట్టియలు (2-110)  ఇవన్నీ భీమేశ్వరుడు ధరించినవి మాత్రమే కాదు సమకాలీన సంపన్న గృహస్థులందరూ దాల్చినవేనని భావించడంలో విప్రతిపత్తి లేదు.

కురంగనాభిసౌరభాలు, సంకుమద పరిమళాలు, కర్పూర వాసము, కాలాగురు కర్దమాలు సర్వులకూ ప్రీతి పాత్రాలే (1- 117) గొజ్జంగి నీటి నెత్తావి, దాన్ని మించిన గంధపుపొడి పొలుపు, దాన్ని మించిన ధమ్మిల్ల మల్లికాహల్ల వకుళవాసంతికా జాతి కేతకీకుంద కుసుమ గంధబులు (1- 117) వ్యాపించేవి. ఒకదాని మించి ఒకటి అని శ్రీనాథుడు వర్ణించడం వల్ల ఏ స్థాయి వారు ఆ స్థాయిలో వాటిని వినియోగించేవారని తలపోయవచ్చు. చెంగల్వ దండలు (2-51), (2-67) ధరించేవారు

 చతుశ్శాలా, భవంతులు, జోడరుగులు, అంతర్గేహాలు, బహిర్గేహాలు, సౌధమధ్యంలో వేదికాస్థలం.(2-146).  గోపురాలు, మేడలమీద పసిడి కలశాలు మొదలైనవి గృహ వైవిధ్యాలు. 

చామరము, తోమరము, ఛత్రము, ధనుస్సు, ఖడ్గాదులు ఆనాటి ఆయుధాలు. (1-31).

శంఖ భేరీ మృదంగ నిస్సాణ పటహ

ఝల్లరీ వేణు వీణాది వాయిద్యాలు

            శంఖం, భేరి, మద్దెల, విస్సాణ=చర్మ వాద్యం, పటహ= తప్పెట ఝల్లరి=డక్కి, పెద్దడోలు వేణు-పిల్లనగ్రోవి, వీణ =వీణ భీమేశ్వరుని మ్రోల మోగిస్తారు. దాని వల్ల పాపాలు తొలుగుతాయి. తొలుగుతాయో లేదో కాని ఆనాడు ఈ వాయిద్యాలున్నాయన్న సంగతి స్పష్టం.

ఉపసంహారం

ఇంకా నిశితంగా ఓపిగ్గా పరిశీలిస్తూపోతే మరెన్నో విశేషాలు దొరకగలవు. భీమేశ్వరపురాణం ఒక్కదానికే పరిమితం కాకుండా శ్రీనాథునికృతులన్నింటినీ పరిశీలించాలి. ఆపైన సమకాలిక కవులకృతులను పరిగణనలోకి తీసుకొని సేకరిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. అలా సేకరించినవాటిని తక్కినకాలాల కవుల రచనలతో తులనాత్మకంగా విశ్లేషిస్తే వాటి పరిణామాలు తెలియవస్తాయి. అలాంటి ఉత్తమ ప్రయత్నానికి ఈ సదస్సు దోహదం చేయగలదని విశ్వసిస్తు నిర్వాహకుల ఉత్తమాభిరుచిని, ఉదాత్తసంకల్పాన్నీ  మనఃపూర్వకంగా అభినందిస్తు ముగిస్తున్నాను.    

You may also like

Leave a Comment